డిస్టింక్షన్
- Sammetla Venkata Ramana Murthy
- Aug 26, 2021
- 3 min read

'Distinction' written by Susmitha Ramana Murthy
రచన : సుస్మితా రమణ మూర్తి
“ విన్నవించుకోనా?... చిన్న కోరికా?...”
“అబ్బ!...ఎంత కాలానికోయ్!.. నీ కోకిల కంఠం!?...వీనుల
విందే సుమా!”
“అబ్బబ్బబ్బ!...ఆపుతారా మీ వెటకారం?”
“ వెటకారం కాదోయ్! మమకారం!..ఆనందామృతం!”
“నా విన్నపం సీరియస్గా వింటారా?”
“విన్నపమా !?...”
“అవును!. చాలా చిన్నకోరిక. “
“ఓకే!...ఓకే!...విన్నవించుకో”
“చాలా కాలం నుంచి నా మనసులో దాచుకున్న కోరిక.”
“కోరుకోవోయ్!. నలభై ఏళ్ళ మన వైవాహిక జీవితంలో మొదటిసారి నీవు కోరుతున్నకోరిక ఇది.
తప్పక తీరుస్తా.కావాలిస్తే ,మరోటి కూడా కోరుకో”.
“అలాగని ప్రామిస్ చేయండి.”
“అలాగే!.. ప్రామిస్!...నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తా.”
“థేంక్యూ!..థేంక్యూ!!..ఇంత కాలానికి నా కోరిక నెరవేర బోతోంది!.”
“చెప్పవోయ్!. నీ కోరిక వినాలని, తీర్చాలని ఆత్రంగా ఉంది. “
“మరేమో!...వచ్చే నెలలో నా పుట్టిన రోజు నాడు మీ చేతి వంట తినాలని ఉందండీ!“
“ఇదేం కోరికే!?...ఎవరైనా పుట్టిన రోజున, పట్టు చీరలో,నగలో కావాలంటారు గాని, ఇదేం పిచ్చి
కోరికే నీకు!?...నేనేమైనా వంట వచ్చిన మగాణ్ణా!?...”
“మనసుంటే మార్గం ఉంటుందండీ!.నేర్చుకోవాలన్న శ్రద్ధ ఉంటే, ఎంత సేపండీ?...మీలాంటి
తెలివైన వారు, నాల్రోజుల్లో నేర్చేసుకోరూ?...”
“స్సరే!...ఇంతలా ప్రాథేయ పడుతున్నావు కాబట్టి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. తథాస్తు!“
******
“ ఏమండోయ్!...శ్రీవారూ!.. టీ కమ్మని వాసన వేస్తోంది.సిమ్ లో పెట్టి ఇంకాస్త మరగ నీయండి.”
‘నీ పని బాగుందోయ్!...లాక్ డౌన్ కాదు గాని, నాకు వంట గది క్లాసులు పీకుతున్నావ్!’
“మీలో మీరే అలా గొణుక్కోవడం దేనికీ?...రెండు కప్పుల టీ, పట్రండి. టీవీలో వార్తలు చూస్తూ,
కబుర్లు చెప్పుకుంటూ తాగుదాం. ఆ చేత్తోనో బిస్కెట్లు కూడా. “
“అలాగే!.. అలాగే!!.....ఇదుగో వచ్చేసా. “
“అబ్బ!!...టీ...ఎంత బాగుందండీ !?”
“అవునవును. టీ, చాలా బాగుంది. ఈ రోజుతో నా క్లాసులు అయిపోయినట్టేనా?...ఇంకా ఏమైనా
ఉన్నాయా?”
“రిటైరయింతర్వాత ఏమీ తోచటం లేదని, ఎప్పుడూ అనేవారు కదా?..ఇప్పుడు చూడండి, ఈ
కరోనా లాక్ డౌన్ వలన అన్నం వండటం, నాలుగు రకాల కూరలు, చారు,పప్పు చారు,సాంబారు
చేయడం నేర్చేసుకున్నారు. బిజీ బిజీ అయిపోయారు “
“ఆ దండకం ఎందుకు గాని,ఇక వంట గదికి, మహారాణివి నీవే కదా?”
“ఆఫ్ కోర్స్!...ఎప్పటికైనా వంట గది నాదే!...ఇంత తొందరగా వంటలు నేర్చేసుకుని మీరు ఫస్ట్
క్లాసులో పాసై పోయారు.చాలా సంతోషం!. కంగ్రాట్స్!...ఈ కరోనా భూతం ఇప్పట్లో వదిలేట్టు
లేదు. బయట తిరగ కూడదు కాబట్టి...”.
“ఆగి పోయావేమి?...సంశయించక నీ మనసులో ఏముందో చెప్పు. “
“మీరు డిస్టింక్షన్లో పాసవాలండీ!... ...మరికొన్ని పాఠాలు నేర్చుకోవాలండీ. “
“ ఇంకానా!?...”
“అవునండీ! అలా విస్తుపోకండి. మీరు ఏక సంథాగ్రహులు.
ఒక్కసారి వింటే, చూస్తే, ఇట్టే నేర్చేసుకుంటారు కదా?...”
“ఆప్ కోర్స్...ఇన్నాళ్ళకు నా ప్రతిభను గుర్తించావ్. సంతోషం.
థేంక్యూ!. సరే! డిస్టింక్షన్ లో పాసవడానికి ఇంకేం నేర్చుకోవాలి శ్రీమతి గారూ?..”
“ఫండమెంటల్స్ అన్నీ వచ్చు కనుక, ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. శాకాహారపు వంటలు
చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు కాబట్టి , మీరు మాంసాహారపు వంటలు ఈజీగా నేర్చుకో
గలరు.”
“ ఎన్ని రోజులు పడుతుంది?”
“మీలాంటి తెలివైన వాళ్ళకు... వారం రోజులు చాలు. అదే వేరే వాళ్ళకు అయితే...పదహేను
రోజులు పడుతుంది. “
“నన్ను మరీ పొగిడేస్తున్నావ్ ,ఏదైనా ఇండెంట్ పెడ్తావా ఏమిటి!?...”
“ మీరేమీ, గాభరా పడకండి. అలాంటిదేమీ లేదు.”
“అయితే వెంటనే క్లాసులు ప్రారంభించు. “
“ అలాగే సార్!, అసలు విషయంలోకి వచ్చేస్తున్నా.... ఎగ్,చికెన్, మటన్,దమ్ బిరియానీలు, ఫ్రైడ్
రైస్ లాంటివి, మరికొన్ని స్పెషల్స్ నేర్చుకోవాలి. “
“ ఇప్పుడు నేర్చుకున్నవి చాలవా?...”
“ ఇంత వరకు నాన్ వెజ్ వంటలు నేర్పలేదు కదండీ?...?
“ అవునవును. “
“ఇప్పుడు నా మనసులో మాట చెబుతాను. జాగ్రత్తగా వినండి. మనింటికి, బంధువులు గాని
స్నేహితులు గాని, వచ్చినప్పుడు వంట గదిలో నాకు ఎంత శ్రమ అవుతుందో
మీకు తెలిసిన విషయమే కదా?...”
“అవునవును!. చాలా ఇబ్బంది పడుతున్నావు. అందుకేగా, ఒకోసారి మంచి హోటల్స్ నుంచి
స్పెషల్ అయిటమ్స్ రప్పిస్తున్నాను. “
“ అవును కదా?...అదెంత ఖర్చుతో కూడిన వ్యవహారమో మీకు తెలుసు కదా?...ఒకోసారి అలాంటి
అయిటమ్స్ లో ఉప్పు, కారం ఎక్కువ అవుతున్నాయి కదా?”
“ఎప్పుడో ఒకసారి అలా అవొచ్చు. ఎప్పుడూ అలా కాదు కదా?...అంతెందుకు, నీవు చేస్తున్న
వంటల్లో కూడా అప్పుడప్పుడు అలాంటి తేడాలు వస్తున్నాయి కదా?...”
“ విషయం అది కాదండీ. “
“మరేమిటో చెప్పు.”
“ అదేనండీ. ఇదివరకు వంట గదిలో నేనొక్కదాన్నే. ఇప్పుడైతే నాకు సాయంగా మీరు కూడాను.
అనుకోకుండా ఎవరు వచ్చినా, ఇద్దరం అన్ని పనులు హాయిగా మనకు నచ్చిన
విధంగా,అందరూ మెచ్చుకునేలా చేసుకోవచ్చు కదా?”
“ శ్రీమతి గారి బుర్ర పాదరసంలా పన్జేస్తోంది సుమా!”
“ మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు!.“
“ అప్పుడప్పుడు ఒకరినొకరం పొగుడు కోవాలోయ్!.
ఆ ఆనందం, సంతోషం మనం ఆస్వాదించాలోయ్!”
“ ఈ రోజు మీరు భలే హుషారుగా ఉన్నారు. మీ స్పెషల్ వంటల క్లాసులు రేపటి నుంచే
ప్రారంభం.”
“ చిత్తమండీ!.”
“గుడ్ స్టూడెంట్ అంటే మీలా ఉండాలి. “
****
“ ఏమండోయ్ శ్రీవారూ!...మీరు ప్రామిస్ చేసిన కోరికల విషయం గుర్తుందా?...”
“ గుర్తుంది. నీ కోరిక తీరిందిగా?...పుట్టిన రోజున నా స్వహస్తాలతో చేసిన వంటలు
తినిపించానుగా ?”
“ ఆ కోరిక నే కోరితి. మరోటి కూడా కోరుకో మంటిరిగా?. ముచ్చటగా మూడో కోరిక కూడా తీరిస్తే
బాగుంటుంది.”
“ ఇప్పుడు మరో కోరికా!?...”
“ అవునండీ. మీరు చాలా మంచి వారండీ!. మాటకు కట్టుబడే తత్వం మీది.”
“ ఓకే!...ఓకే!...ఇప్పటి కోరిక ఏమిటో చెప్పు. “
“ మా మహిళా మండలి సభ్యుల, ‘ గెట్ టుగెదర్ పార్టీ ‘ ఈనెల చివరలో మన ఇంట్లో
జరుగుతుందండీ.”
“ అలాగే కానియ్! “
“ అసలు విషయం...జాగ్రత్తగా వినండి. మా వాళ్ళంతా పార్టీలకు హోటల్స్ నుంచి, అయిటమ్స్
తీసుకుని వస్తున్నారు. మనం మాత్రం అలా చేయం.మనిద్దరం అన్ని వంటలు , హాయిగా
ఆడుతూ పాడుతూ చేసేద్దాం. రుచికరంగా ఉంటాయి. పైగా డబ్బు ఆదా కూడా.
మా మహిళా మణులకు మీ ‘ డిస్టింక్షన్ ‘ తఢాకా చూపిద్దాం.
ఇక మూడో కోరిక ఎప్పుడైనా అవసరమైతే కోరుకుంటాను.
సరేనా?... మా మంచి శ్రీవారూ!”
“ ఆఁ!!!...”
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి
Very good story
it also indicates how one can engage himself busy when his routine changes suddenly like after retirement