దీపావళి అంటే వెలుగుల పండుగ… ప్రమాదాల పండుగ కాదు

Deepawali Ante Velugula Panduga... Pramadhala Panduga Kadhu - Telugu Social Article | Sanjeeva Kumar Y
దీపావళి అంటే వెలుగుల పండుగ… ప్రమాదాల పండుగ కాదు - తెలుగు సామాజిక వ్యాసం| వై. సంజీవ కుమార్
Published in manatelugukathalu.com on 04/11/2026
దీపావళి అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ఆనందాల పండుగ. అయితే బాణసంచా ప్రమాదాలు, వాయు కాలుష్యం నివారిస్తూ పిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
భద్రతా నియమాలు పాటిస్తూ కుటుంబంతో ఆనందంగా వేడుకలు నిర్వహించండి.
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగ దీపావళి. మన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధిక్యతకు, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటాం.
ఇంటిని శుభ్రం చేసుకోవడం, రంగురంగుల ముగ్గులు వేయడం, దీపాలు వెలిగించడం, కొత్త దుస్తులు ధరించడం, మిఠాయిలు పంచుకోవడం, బంధుమిత్రులతో ఆనందంగా గడపడం దీపావళి సంప్రదాయంలో భాగం.
అయితే కాలానుగుణంగా పండుగ సంబరాల్లో టపాసుల వినియోగం
పెరిగింది.
తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబులు... ఇలా ఎన్నో రకాల బాణసంచా వెలుగులు, శబ్దాలతో ఆనందాన్ని పంచుతున్నప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. నాణ్యత కలిగిన, అనుమతులు పొందిన బాణసంచాను మాత్రమే కొనుగోలు చేయాలి.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇరుకైన వీధులు, వాహనాలు నిలిపిన ప్రదేశాలు, పెట్రోల్ బంకులు, విద్యుత్ తీగలు, గ్యాస్ సిలిండర్లు ఉన్న ప్రాంతాల్లో టపాసులు కాల్చకూడదు. బహిరంగ ప్రదేశంలో, భవనాలు, చెట్లు, వాహనాలకు దూరంగా టపాసులు కాల్చాలి.
చేతిలో పట్టుకొని బాణసంచా కాల్చడం, వెలిగించిన టపాసులపై వంగి చూడడం, ఒకేసారి ఎక్కువ టపాసులు వెలిగించడం ప్రమాదకరం.
టపాసులు కాల్చే ప్రదేశంలో ఒక బకెట్ నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. వదులుగా ఉండే నైలాన్ దుస్తులకు బదులుగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పాదరక్షలు తప్పనిసరిగా వేసుకోవాలి.
వెలగని టపాసుల దగ్గరకు వెంటనే వెళ్లకుండా కొంత సమయం వేచి చూసి, నీటితో తడిపి సురక్షితంగా తొలగించాలి.
కాలిన గాయాలు ఏర్పడితే వెంటనే ప్రవహించే చల్లని నీటితో కొన్ని నిమిషాల పాటు గాయాన్ని చల్లబరచాలి. తీవ్రమైన గాయాలైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. కాలిన ప్రదేశానికి నూనెలు, టూత్‌పేస్ట్ వంటి పదార్థాలు రాయకూడదు.
పండుగ సమయంలో పిల్లల భద్రత పూర్తిగా పెద్దల బాధ్యత. పిల్లలకు టపాసులు కొనివ్వడం మాత్రమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలో వివరించాలి.
పిల్లలు ఒంటరిగా టపాసులు కాల్చకుండా పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలి. రాకెట్‌లు, ప్రమాదకరమైన శబ్ద బాణసంచా వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి.
పిల్లలు భయపడకుండా, తొందరపడకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. టపాసుల కోసం పోటీ పడటం, ఇతరులపైకి విసరడం, చేతిలో పట్టుకొని కాల్చడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు.
పండుగల సమయంలో టపాసులు కాల్చడం కొందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ వాటి భారీ శబ్దాలు, పొగ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తాయి.
ముఖ్యంగా బాలింతలు, నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఫొటోలు, వీడియోల కోసం చిన్నపిల్లలను టపాసులు కాల్చే ప్రదేశాలకు తీసుకెళ్లకూడదు.
భారీ శబ్దాలు వారి సున్నితమైన వినికిడి శక్తిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఆసుపత్రుల పరిసరాల్లో టపాసులు కాల్చకుండా ఉండటం మంచిది.
వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
వీలైనంత వరకు శబ్దం, పొగ తక్కువగా ఉండే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. మీ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదు; బాధ్యతగా పండుగ జరుపుకోవాలి. ఇతరుల ఆరోగ్యాన్ని, ప్రశాంతతను కాపాడాలి.
అలాగే దీపావళి అంటే కేవలం టపాసులు కాల్చడమే కాదని పిల్లలకు తెలియజేయాలి.
దీపాలు వెలిగించడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పేదలకు సహాయం చేయడం, మిఠాయిలు పంచుకోవడం కూడా పండుగలో భాగమని చెప్పాలి.
టపాసుల వల్ల కలిగే ప్రమాదాలు, కాలుష్యం గురించి వారికి అవగాహన కల్పించాలి. ఇతరుల ప్రాణాలకు, ఆస్తులకు ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవడమే నిజమైన ఆనందమని నేర్పించాలి.
బాణసంచా నుంచి వెలువడే పొగ వాయు కాలుష్యాన్ని పెంచుతుంది.
అధిక శబ్దం వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, పెంపుడు జంతువులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
పక్షులు, ఇతర జీవరాశులు కూడా భయాందోళనలకు గురవుతాయి. అందుకే వీలైనంత వరకు టపాసుల వినియోగాన్ని తగ్గించి, తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం కలిగించే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
దీపాలు, విద్యుత్ దీపాలంకరణతో పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలి. టపాసుల వ్యర్థాలను రోడ్లపై వదిలేయకుండా శుభ్రం చేయాలి. పండుగ అనేది మీ కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సంతోషాన్ని పంచే సందర్భం.
ఒకవైపు ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ, మరోవైపు అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదల జీవితాల్లోనూ వెలుగులు నింపే ప్రయత్నం చేయాలి.
అవసరంలో ఉన్నవారికి దుస్తులు, ఆహారం, మిఠాయిలు అందించడం, పండుగను వాళ్లతో కలిసి జరుపుకోవడం పండుగ ఆనందాన్ని మరింత పెంచుతుంది.
దీపావళి మీకు ఇచ్చే అసలైన సందేశం చీకటిని తొలగించి వెలుగును నింపడమే. ఆ వెలుగు మీ ఆలోచనల్లోనూ, మీ ప్రవర్తనలోనూ ప్రతిబింబించాలి.
అప్రమత్తతతో, బాధ్యతతో, పర్యావరణంపై ప్రేమతో పండుగను జరుపుకుందాం. ప్రమాదాలకు తావులేకుండా ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి.
సురక్షితమైన దీపావళి... పర్యావరణహిత దీపావళిగా మారి ప్రతి ఒక్కరికీ ఆనందమయ దీపావళిలా మారాలి!
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వై. సంజీవ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వై. సంజీవ కుమార్

నా పేరు వై. సంజీవ కుమార్. హైదరాబాద్‌లో చిన్న కన్సల్టెన్సీ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాను. సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను.
అలాగే సామాజిక కోణంలో ఉండే అనేక అంశాలపై వ్యాసాలు రాయడం నాకు అలవాటు. ఇప్పటివరకు ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాశాను. వాటిలో అనేక వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇటీవల మొదటిసారిగా తెలుగు కథల ప్రపంచాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. కథల ద్వారా భావాలను, జీవితంలోని అనుభవాలను, సామాజిక అంశాలను మరింత ఆసక్తికరంగా చెప్పవచ్చని అనిపించింది.










Comments