top of page

డాక్టర్ అపూర్వ

'Doctor Apoorva' written by Korukonda Venkateswara Rao

రచన : కోరుకొండ వెంకటేశ్వర రావు

అది విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కరోనా వార్డ్ ... రాత్రి సుమారు రెండు గంటలు కావొస్తూంది. సమయం అర్ధ రాత్రి దాటినా, పట్ట పగలు లాగా, ఆసుపత్రి అంతా గందర గోళంగా ఉంది. ఇటు నుంచి అటు, అటునుంచి ఇటు పరుగులు తీస్తున్న డాక్టర్లు, నర్సులు ... ఆందోళనతో కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళని వేడుకుంటున్న రోగుల బంధువులు. ఒక వైపు శవాలుగా మారి తరలి పోతున్న రోగులు, మరో వైపు కొత్తగా అడ్మిషన్ కోసం కుప్పలు తెప్పలుగా వస్తున్న అనుమానితులు .. నిద్రాహారాలను మరచి, ఆస్పత్రినే ఇంటిగా మలచుకొని సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది... ఈ పరిస్థితి ఈ నాటిది కాదు .. అయిదు నెలలుగా దేశం లోని వేలాది ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితి. గడియారం మూడు కొట్టింది.

తుళ్ళిపడి లేచింది డాక్టర్ అపూర్వ ... వాష్ రూమ్ లోకి వెళ్లి మొహం కడుక్కొని మరలా కరోనా కిట్ అమర్చుకొని రౌండ్స్ కని బయలు దేరింది. సిస్టర్ ఆశాజ్యోతి ఆమెకు తోడుగా నడిచింది. వార్డ్ లోని రోగులని పరీక్షించి, వారికి అవసరమైన మందులను కేస్ షీట్ లో రాసి, హెడ్ నర్స్ కి జాగ్రత్తలు వివరించి తిరిగి తన రూమ్ కి వచ్చేసరికి సుమారు అయిదు కావొస్తూంది. వార్డ్ బాయ్ సర్వ్ చేసిన వేడి వేడి కాఫీ తాగి, మెల్లగా కుర్చీలోనే వాలి, కాస్త రిలాక్స్ అవుదామని టేబుల్ పై తల ఆనించిన కొద్ది నిమిషాల్లోనే, మగత నిద్ర లోకి జారుకొంది అపూర్వ.

ఏదో అలికిడి కావడంతో ఉలిక్కి పడి నిద్ర లేచింది అపూర్వ. ఎదురుగా డాక్టర్ ఆషిక్ !

“గుడ్ మార్నింగ్ డాక్టర్ !” అంటూ నవ్వుతూ గ్రీట్ చేసాడు. బదులుగా తను చిరు నవ్వు నవ్వగా,

” మై గాడ్, మీరు చాలా రెస్ట్ లెస్ గా కనిపిస్తున్నారు. నాకు తెలిసి, మీరు ఇంటికెళ్లి వారం రోజులు కావస్తోంది. నా మాట విని ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి .. ప్లీజ్ ! “ అన్నాడు. కాస్త ఆందోళన ఉట్టి పడింది అతని గొంతులో.

“ ఓకే డాక్టర్ “ అంది జవాబుగా.

“అది సరే గానీ, ఇంతకీ ... నేనడిగిన సంగతి ... ? ” కాస్త లోస్వరం లో అడిగాడు.

అపూర్వ మౌనంగా ఉండడంతో “ ఇట్స్ ఓకే .. టేక్ యువర్ టైమ్ .. సీ యూ డాక్టర్ !” అంటూ చక చకా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతనినే తదేకంగా చూస్తూ ఉంది పోయింది. డాక్టర్ ఆషిక్ తనతో ప్రస్తావించిన సంగతి మదిలో మెదలగా ఉన్నట్టుండి అపూర్వ మనసంతా ఆందోళనతో నిండి పోయింది. కాసేపయాక, తన హ్యాండ్ బ్యాగ్ సర్దుకొని ఉబెర్ లో సాగర్ నగర్ లోని తన ఇంటికి బయలుదేరింది డాక్టర్ అపూర్వ.

టాక్సీ వెనుక సీట్లో అలసటగా వెనక్కి వాలింది అపూర్వ. మనసు అనాలోచితంగా గతం వెంట

పరుగులు తీయ సాగింది. ... కష్టాలు, కన్నీళ్లు తప్ప వేరే ఎరుగని తన బాల్యం ... తనను ఓ

ప్రయోజకురాలిగా చెయ్యడానికి, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకొని

ప్రోత్సహించిన అమ్మా, నాన్నా.ఎలాంటి దుర్భరమైన రోజులవి ... ఒక అపార్ట్ మెంట్ వాచ్ మన్ గా నాన్న, వేన్నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టుగా నలుగురి ఇళ్లల్లో పాచి పని చేసి, తన వంతు కృషి చేసిన అమ్మ. తను పని చేసే ఇళ్లల్లో ఆఫీసర్ల పిల్లల లాగా, తన బిడ్డ కూడా అలాంటి పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ లోనే చదవాలి అని, ఆ దినాల్లో అమ్మ తీసుకున్న నిర్ణయం, అందుకు నాన్న సహకారం ... నా కళ్ళలో ఆనందం కోసం ఎన్ని సమస్యలనైనా చిరు నవ్వుతో ఎదుర్కున్న తీరు ... తనకి బాగా గుర్తు... ఆ రోజుల్లో అమ్మ నాన్నతో అన్న మాటలు ... “ చూడయ్యా .. మన బిడ్డ చాలా తెలివైనది.

ఇది పెద్ద చదువులు చదివి డాక్టర్ అవ్వాల.. ఆ చదువు లేకే కదా ఈ రోజు మనిద్దరం ఇలా లేబర్ పనులు చేస్తన్నాం.. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మన అపూర్వ మనలా కాకూడదు.. మనం డబ్బుని పొదుపుగా వాడుకొని దానికి మంచి చదువులు చదివించాలి.” అపార్ట్ మెంట్ లో ఉంటున్న అందరి బట్టలు నాన్న ఇస్త్రీ చేసి ఆ వచ్చిన డబ్బులన్నీ అమ్మ కిచ్చే వాడు. అమ్మ వాటిని బ్యాంకు లో డిపాజిట్ చేసేది. ఆ నాటి నుంచీ చదువే తన ధ్యేయం గా ఆటా, పాటలను పక్కకు పెట్టి చదువును కష్టంగా కాకుండా ఇష్టం గా మలచుకొని ఉత్తమమైన ర్యాంక్ లతో అంచెలంచెలుగా తను ఎదిగిన వైనం, ఎంసెట్ లో మెడిసిన్ లో ఫ్రీ సీట్ రావడం, అన్ని న్యూస్ పేపర్లలో తన ఫోటో ప్రింట్ కావడం , అది చూసిన అమ్మా, నాన్నల కళ్ళలో మెరిసిన ఆనంద బాష్పాలు ... తమ వంటి నిరు పేదలకు సేవ చేయడమే జీవితాశయంగా తను ఆ రోజు తీసుకున్న దృఢ సంకల్పం ...

తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా, నేడు ప్రజల పాలిట పెను శాపం గా మారిన కరోనా వ్యాధి పీడితుల వార్డునే తన ఛాయిస్ గా స్వీకరించడం .. ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదలాడాయి. “ ఐ ఫీల్ మైసెల్ఫ్ బ్లెస్స్ డ్ !” స్వగతంగా అనుకొంది. సడన్ కుదుపుతో ఇంటి దగ్గర టాక్సీ ఆగడంతో సన్నగా ఊపిరి పీల్చుకొని, ఫేర్ పే చేసి ఇంటి వైపుగా నడిచింది అపూర్వ.

“చూడు అపూర్వా ... ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు అనుకున్న జీవితాశయాన్ని సాధించావు. మేము కన్న కలలను పండించావు. డాక్టర్ ఆషిక్ గారు నీతో అన్న మాటలన్నీ నేను నాన్నతో చర్చించాను. నాకున్న నరాల బలహీనతతో నేను, అలాగే, కీళ్ల జబ్బుతో మీ నాన్న .. మా పనులను మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సంగతి నీకు తెలియనిదేమీ కాదు. డాక్టర్ ఆషిక్ వంటి సంపన్నుడైన వ్యక్తి నిన్ను ప్రేమించడం నిజంగా నీ అదృష్టమే. డబ్బుతో పాటు సంస్కారం, మంచి మనసు ఆయన సొంతం కావడం నువ్వు చేసుకున్న పుణ్యమే. నిన్ను రాణిలా చూసుకోవడమే కాక, సిటీ లో మంచి పేరు ప్రఖ్యాతులున్న అతని హాస్పిటల్ లో నీకో ఛాంబర్, ముఖ్యంగా, మీ పెళ్ళయాక నీకంటూ ఓ నర్సింగ్ హోమ్ కట్టించి ఇస్తాననడం, నాకు, నాన్నకీ పెద్ద ఏసీ బంగ్లా, మా ఇద్దరం కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలా నౌకర్ల ఏర్పాటు ...మన జీవితాలు మున్ముందు ఇక సాఫీగా సాగి పోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. నా మాట విని, దిన దిన గండం లాంటి ఆ కరోనా వార్డ్ లో నువ్వు చేస్తున్న ఆ పోస్ట్ కి రాజీనామా ఇచ్చేయ్. ఆయన చెప్పినట్లు హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటూ నీ జీవితాన్ని పూల బాటగా మలచుకో తల్లీ ... నీ తల్లిగా, నీ శ్రేయోభిలాషిగా నేను, మీ నాన్న ఇదే కోరుకుంటున్నాము. ఇంతకీ, నువ్వేమి ఆలోచించావు ? “ అన్నం వడ్డిస్తూ అమ్మ అడిగింది . సమాధానంగా మౌనం వహించింది అపూర్వ.

డిన్నర్ అయ్యాక తన స్టడీ రూమ్ లో కూర్చొని ఆలోచనలో పడింది అపూర్వ. అమ్మా, నాన్నా

చెప్పింది నిజమే కావచ్చు. కానీ, తన జీవితంలో ఏర్పరచుకున్న ఆశయాల సంగతి ఏమిటి?

ప్రజలకు చేసే సేవలోనే తన మనసుకు నిజమైన సంతృప్తి, ఆనందం కలుగుతుంది .... తను

అసలు ఈ మెడికల్ ఫీల్డ్ ఎంచుకోడానికి మూల కారణం కూడా అదే. .. డబ్బు సంపాదనే తన

ధ్యేయం అయితే ఇంత కష్టపడి ఈ రంగం లోకే ఎందుకు రావాలి .. అందరిలాగే, తనూ ఏ

ఎమ్మెస్సో చేసి అమెరికాలో డాలర్స్ సంపాదించ లేదూ ? “ తనలో మొదలైన అంతర్మధనం

చివరికి ఒక రూపు దిద్దుకొంది .. కృత నిశ్చయానికి వచ్చిన దానిలా సన్నగా తనలో తాను

నవ్వుకొంది. తన మొబైల్ చేతి లోనికి తీసుకొని డాక్టర్ ఆషిక్ కి డయల్ చేసింది.

“గుడ్ ఈవెనింగ్ డాక్టర్ ... నేను అపూర్వను ... సారీ సర్, ఈ టైములో మిమ్మల్ని డిస్టర్బ్

చేస్తున్నాను... బట్, సర్, ఇట్స్ ఏ బిట్ అర్జంట్ ... ముందుగా, మీ అభిమానానికి నేను చాలా

కృతజ్ఞురాలిని. సర్ ... మీరు కోరుకుంటే నాకన్నా క్వాలిఫైడ్ మరియు అందమైన అమ్మాయిలు మీ కోసం క్యూ కట్టి ఉన్నారు. నాకు ఆ అదృష్టం లేదనుకోండి సర్. ఎందుకంటే, నేను

నిర్దేశించుకున్న ఆశయాలకు బందీని. కొన్ని ఆశయాల సాధనయే లక్ష్యంగా నేను ఈ వృత్తిలోకి వచ్చాను సర్. నా మనసుకు వ్యతిరేకంగా ఈ రోజు ఓ నిర్ణయం తీసుకొని నన్ను నేను జీవితాంతం ఆత్మ వంచన చేసుకుంటూ బ్రతకలేను సర్ . మీ మనసు నొప్పిస్తే, నన్ను మన్నించండి సర్ ..ప్లీజ్ ! “ అంటూ ఊపిరి పీల్చుకొంది.

కాసేపు మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ ఆషిక్ ... వెంటనే తేరుకొని, “ ఇట్స్ ఓకే డాక్టర్ అపూర్వా

అయ్ రెస్పెక్ట్ యువర్ ఐడియాలజీ.. అండ్ అయామ్ ప్రౌడ్ అఫ్ యూ .. .. గుడ్ లక్ అండ్ గుడ్

నైట్. డాక్టర్ ఆషిక్ గారి విశాలమైన మనసుకు మనసులోనే జోహారు లర్పించించింది . తన

ప్రస్తుత సంపాదనతో ఏసీ బంగ్లాలు సమకూర్చ లేక పోయినా, అమ్మని, నాన్నని పువ్వుల్లో పెట్టి

చూసుకో గలదు. అందుకు ఎల్ల వేళలా వారి అవసరాలు తీర్చే హౌస్ మెయిడ్ ని ఏర్పాటు చెయ్య

గలదు. ఆ ఆలోచన రాగానే తన మనసు ఎంతో తేలిక పడింది. కాస్త ప్రశాంతత చిక్కడంతో వారం రోజులుగా నోచుకొని నిద్రాదేవి ఒడిలోకి మెలమెల్లగా జారుకొంది డాక్టర్ అపూర్వ.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

1. పేరు: కోరుకొండ వెంకటేశ్వర రావు

2. విద్యార్హతలు : B.Com , LL.B ( Academic ), M.B.A., CAIIB

3. వయసు : 64

4. పదవీ విరమణ :31 మార్చి 2016 బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి చీఫ్ మేనేజర్ గా .

5. నివాసం : విశాఖపట్నం

6. సాహితీ ప్రస్థానం :

సుమారు 40 పై చిలుకు కధలు పల్లకి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ , ఆంధ్ర భూమి ఆదివారం , మయూరి, నవ్య వంటి ప్రింటెడ్ పత్రికలలోనూ, ప్రతిలిపి వంటి ఆన్ లైన్ పత్రికలలోనూ వచ్చాయి. కవితలు సుమారు 35 వరకు ప్రతిలిపిలో వచ్చాయి.


87 views7 comments
bottom of page