విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
'Dorasani Part 2/2' - New Telugu Story Written By Surekha Puli
'దొరసాని పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం
రచన: సురేఖ పులి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
కుటుంబానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటాడు బట్టల మిల్లు యజమాని సక్సేనా.
వంట మనిషిగా డ్రైవర్ నర్సింగ్ భార్య చెన్నమ్మ చేరుతుంది.
ఆమె కొడుకు చదువుకు అన్ని విధాలా సహాయం చేస్తాడు సక్సేనా.
క్రమంగా ఆమె మీద అభిమానం పెరుగుతుంది.
తన ఇష్టాన్ని ఆమెతో చెబుతాడు.
మొదట సంకోచించినా తరువాత ఆమోదం తెలుపుతుంది చెన్నమ్మ.
ఇక దొరసాని పెద్దకథ చివరి భాగం చదవండి..
"మాకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ. నా భార్య, పిల్లలు వస్తున్నారు. కొంచెం పని ఎక్కువ ఉంటుందేమో.. సర్దుకుపోవాలి" సక్సేనా ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పాడు.
"అలాగే సార్, ఏమేమి వంటలు చేయాలో చెప్పండి" చెన్నమ్మ అడిగింది.
"మా వాళ్లకి హైదరాబాద్ చూపించాలి. ఎక్కువగా బయట హోటల్ భోజనమే చేస్తారు. కానీ వాళ్ళకి దోసా, ఇడ్లీ చేయడం రాదు. తినటం మాత్రం చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు వంటల విషయం నా భార్య చెప్తుందిలే".
ఇల్లంతా బాగా శుభ్రం చేయమన్నాడు, కొత్త పూల మొక్కలు నాటించాడు యజమాని.
భోగి పండుగ రోజున సక్సేనా భార్య ఇద్దరు కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు నలుగురు వచ్చారు. ఒకటే హడావిడి "నానాజీ" అంటూ పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు.
సక్సేనా భార్య సుప్రీత్ కోరిక మేరకు చెన్నమ్మ వంటలు చేసింది. పంజాబీ భాష అర్థం కాకపోయినా సైగలతో సర్దుకు పోయారు నర్సింగ్ చెన్నమ్మ లు.
పండగ రోజు చెన్నమ్మ తలంటు పోసుకుని వేలు ముడివేసుకున్న పొడుగాటి నల్లని జుట్టు చూసి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు.
గోరింటాకు పూసిన జుట్టేమో, పొట్టిగా మొక్కజొన్నకంకి పీచులా ఉన్నాయి వాళ్లందరి జుట్టు.
"నువ్వు ఏం షాంపూ వాడుతావు?" అని అడిగింది సుప్రీత్.
"నేను గోర్వెచ్చని గంజిలో కుంకుడు కాయలతో తలస్నానం చేస్తాను" చెప్పింది చెన్నమ్మ.
"సౌత్ ఇండియా మే లడికియోంకా బాల్ కాలే అవుర్ లంబే హోతే, వోతో ఇన్కే హెరిడిటి హై, బ్యూటీ అవుర్ మేకప్ కే బారే మే ఇన్లోగ్ క్యా జాన్తే? (దక్షిణ భారతదేశ అమ్మాయిలకు పొడుగాటి ఒత్తయిన నల్లని జుట్టు ఉంటుంది. అది వాళ్ళ వంశ పారంపర్యం, అందము మరియు అలంకరణ గురించి వీళ్ళకేం తెలుసు?") పెద్దల్లుడు చెప్పాడు.
సిటీ అంతా చూసి వచ్చాక సాయంత్రం దోశలు తిని ఎంతో తృప్తి చెందారు. ఇడ్లీలు, దోసెలు వాటి చెట్ని ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు ఆడవాళ్ళు.
"అప్నె పాస్ ఐసా ఫుడ్డ్ ఫైవ్ స్టార్ హోటల్మే మిల్తా హై. ఇస్ మే బడీ బాత్ క్యా హై? (మన వైపు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా దొరుకుతాయి అదేమైనా గొప్ప విషయమా?) చిన్నల్లుడు మధ్యలో కల్పించుకున్నాడు.
ఆ మర్నాడు కూడా మళ్లీ సిటీ చూడడానికి వెళ్లారు. చార్మినార్ వద్ద ముత్యాల సెట్టు, రంగుల పూసల దండలు కొనుక్కున్నారు.
సుప్రీత్ ప్రత్యేకంగా తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. "జాగ్రత్త సుమా, సార్ ఆరోగ్యం విషయంలో ఏదైనా అయితే నాకు తప్పకుండా ఫోన్ చేయాలి"
చెన్నమ్మా నర్సింలు సరేనన్నారు.
పెద్ద కూతురు చండీగఢ్ లో, చిన్న కూతురు అమృత్సర్ లో ఉంటారట. అందరివీ చాలా భారీ శరీరాలు, ఎరుపు మిళితమైన తెలుపు రంగు ఛాయ. నడుము వంచి కండలు కరిగించేలా పని చేసే అవసరమే రాలేదు వాళ్ళకి, బాగా డబ్బున్న గొప్పింటి బిడ్డలు. వీళ్లందరిలోకి సక్సేనా పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు
**
రాములు చదువు పూర్తయి పై చదువులకు విదేశాలకు వెళ్ళి, విదేశాల్లోనే ఉంటున్న హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని, రెండు చేతులా సంపాదించుకుంటూ ఫారెన్ లోనే సెటిల్ అయ్యాడు.
లివర్ క్యాన్సర్ తో నర్సింగ్ చనిపోయాడు. సక్సేనా ఉంటున్న పెద్ద భవంతి చెన్నమ్మ పేరిట గిఫ్ట్ డీడ్ గా రిజిస్టర్ అయ్యింది.
ఎంత పచ్చటి ఆకు అయినా ఒక రోజు నేల రాలి పోవలసిందే.
"చెన్నమ్మా! నా తర్వాత నువ్వు ఒంటరి జీవితాన్ని అనుభవించకు, రాము దగ్గరికి వెళ్లిపో, లేదంటే ఈ ఇంట్లో కొంతభాగం కిరాయికి ఇచ్చి జీవితం గడుపు" రోజురోజుకు శరీరం సహకరించకపోవడంతో సక్సేనా ఒక నిర్ణయానికి వచ్చాడు.
"సార్! మీరు అట్లా మాట్లాడొద్దు, నేను వినలేను, మీరు లేకుండా నా జీవితమే లేదు. మీకంటే ముందే నేను చచ్చిపోవాలి, పోతాను కూడా, నా సంతోషాన్ని కోరే మీరు నన్ను హింసించటం సరికాదు" అని దీనంగా చెప్పింది చెన్నమ్మ.
సక్సేనా మాట నిజమైంది.
చెన్నమ్మ హృదయం బద్దలైంది.
సుప్రీత్ మేడమ్ కు ఫోన్ చేసింది. అల్లుళ్లతో పాటు ఇంకొంత జనం వచ్చి సక్సేనా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు.
**
కర్మకార్యక్రమం ముగియగానే సక్సేనా తరుపు వారు వచ్చారు. సక్సేనా సమక్షంలో శాంతియుతంగా కాలం గడిపిన చెన్నమ్మను సుప్రీత్ బంధువర్గం మాటలతో చేతలతో హింసించారు. ఎంతో బ్రతిమిలాడింది, కాళ్ళా వేళ్ళా పడ్డది.
"ఛల్! భాహార్ నిఖల్, ఛుఢేల్, లౌంఢీయే" (బయటికి వెళ్ళు, ఉంచుకున్న దాన) అంటూ బూతులు తిడుతూ ఇంట్లో నుండి నెట్టేశారు.
శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న చెన్నమ్మ రాములుకు ఫోన్ చేసి విషయం వివరించింది.
"అమ్మా! నువ్వు సక్సేన దొరసానిగా ఉన్నావు. అంటే భార్య కాదు. ఆయన నా తండ్రి కూడా కాదు. దొర చనిపోయాడు. ఇక సాని మిగిలింది. ఏనాటికైనా భార్యకు ఉన్న విలువ ఒక కీప్ కు ఉండదు" పుల్ల విరిచినట్టు విషం చిందించాడు రాములు.
"నా మాట వినరా, సార్ ఈ ఇంటిని నా పేరున రిజిస్టర్ కూడా చేయించారు. ఇప్పుడు సార్ చుట్టాలు నన్ను రోడ్డున పడేస్తున్నారు. వాళ్ళ వద్ద కూడా రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి. వాటిలో ఏం రాసుందో నాకేమీ తెలియదు, చదువు రానిదాన్ని, నాకెవరూ లాయర్లు తెలియదు. దిక్కులేక ఒక్కదాన్నే అయ్యాను. నన్ను ఆదుకో రాములు" ఏడుస్తూ చెప్పింది చెన్నమ్మ.
"అమ్మా! నేను ఇప్పుడు రాలేను, ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్టు తీసుకున్నాను. పోతే పోనీ ఇల్లు. అనవసరంగా పోలీసులు, లాయర్లు, కోర్టుల ఇరకాటంలో పడొద్దు. అంతకంటే మంచి ఇల్లు నేను కొంటాను, సరేనా"?
"మరి నేను ఇక్కడ ఒక్క దాన్ని ఏంచేయాలి, నువ్వు పెద్ద బంగళా కొందువు గాని, రాములూ, ఈ ఇల్లు సార్ నాకు ఇచ్చిన కానుక, ఇది వదులుకోవాలని లేదురా" వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది చెన్నమ్మ.
"అమ్మా! అనవసరమైన సెంటిమెంటల్ ఫీలింగ్ పెట్టుకోవద్దు, సముద్రంలో నిలబడి దాహం అని నీళ్లు తాగితే ఉప్పుగానే ఉంటుంది, బలవంతంగా ఉప్పు నీరు తాగినా దాహం తీరదు. సమాజంలో తప్పు చేస్తే శిక్ష తప్పదు. నీ పెళ్లి నాన్నతో జరిగింది. సక్సేనాతో కాదు, అందుకే నువ్వు ఈరోజు ఇలా ఏడుస్తూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది" నీతి వాక్యాలు చెబుతున్నాడు.
"రాముడు! నీ డాక్టర్ చదువుకు కారణమే సార్, మర్చిపోయావా నువ్వు" నిలదీసింది.
"లేదమ్మా మర్చిపోలేదు. సక్సేనా సార్ మంచివాడే కానీ అతని ఆస్తి కావాలనుకోవటం నీ తప్పు".
"నేను ఆస్తి కావాలనుకోలేదురా, నా భవిష్యత్తు కోరి సారే నాకు ఇంటిని రాసి ఇచ్చారు. నువ్వు తొందరగా వచ్చి నాకు ధైర్యంగా నిలబడరా" తల్లి వేడుకుంటుంది.
"అంటే అతనికి నాపైన సదభిప్రాయం లేదన్నమాట. కొడుకుగా నిన్ను చూడనిని ముందే ఊహించుకుని, ఇల్లు నీ పేర రాశాడా? అయినా అమ్మా! ఆ ఇంటిని నీ పేరున రిజిస్టర్ చేసేప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అంటే నీకు కూడా నాపైన అపనమ్మకం ఉన్నదన్న మాట. నీ ఒంట్లో శక్తి ఉన్నంత కాలము సార్, సార్ అంటూ ఉండే దానివి, నీకు చుట్టాలు, బంధువులు అవసరం లేకుండా పోయారు, అందుకే ఈనాడు నీకు నా అన్నవారు ఎవరూ లేరు" బుసలు కొడుతున్నాడు కొడుకు.
"నా అన్నవాడివి నువ్వు ఒక్కడివే కదరా రాములు, నా కన్నబిడ్డవి, అందుకే నిన్ను అడుగుతున్నాను. నీ హోదాకు సారే మూలకారణం. ఆ మాట మర్చిపోకు రా".
"అంటే, నా తెలివితేటలు, నా శ్రమ, నా అదృష్టం ఏమీ లేవా"?
మౌనంగా వింటూ ఉన్నది చెన్నమ్మ కన్నీళ్లతో.
"నీ అక్రమ సంబంధ సంపాదన నాకు అవసరం లేదు. నువ్వు కూడా నీకు ఏదో అన్యాయం జరిగిందని అనుకోకు, సక్సేనా ఆస్తికి నువ్వు ఏ విధంగా అర్హురాలివమ్మా "?
చెన్నమ్మ ఫోన్ పెట్టేసింది.
సక్సేనా బంధువులు బట్టల మిల్లును, షాపును, ఇంటిని అమ్మేసి, స్వస్థలం వెళ్ళిపోయారు.
విశాలమైన స్థలములో వున్న ఇంటిని స్కూల్గా మార్చాడు కొత్తగా కొనుక్కున్న యజమాని. ఆ ఇంటి వాతావరణంతో ఏర్పడ్డ సున్నితమైన భావాలను మర్చిపోలేక చెన్నమ్మ స్కూల్ ఆయాగా నియమితురాలైంది.
ఆకలి రోజురోజుకు తగ్గిపో సాగింది. పిల్లలు మిగిల్చిన మధ్యాహ్న భోజనంతో కడుపు నిండిపోతుంది, వంట చేసుకునే అవసరమే రాలేదు ఆయమ్మకు.
రిటైర్మెంట్ వయసు వచ్చినా చెన్నమ్మ గత స్మృతులను మరువలేక, ఆ స్థలం వదిలి వేరే చోటికి పోలేక మొండిగా శరీరంలో అశక్తతో పోరాటం చేయసాగింది. కాలగమనంలో ఆ స్కూలు పెద్ద కార్పొరేట్ స్కూల్గా మార్పు చెందింది.
**
"మేడం నేను మీ స్కూల్కు ఐదు లక్షల విరాళం ఇవ్వాలనుకున్నాను, కనుక మీరు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ లో నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించ గలరు"
రాములు స్వదేశానికి వచ్చి స్కూల్ యాజమాన్యంతో తనను తాను పరిచయం చేసుకుని చెప్పాడు.
ఆపై ఆదివారమే స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టింది. విద్యార్థుల క్రమశిక్షణ గురించి కొంత సేపు మాట్లాడిన ప్రిన్సిపాల్ డాక్టర్ రాములను పరిచయం చేసి చెక్కు రూపేణ విరాళాన్ని తీసుకున్నది.
యాజమాన్యం ఐటెనరీ ప్రకారం డాక్టర్ రాములు మాట్లాడుతూ విద్యార్థుల, టీచర్ల ఆరోగ్యం గురించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి ఆ తర్వాత మెల్లగా అసలైన విషయాన్ని చెప్పాడు.
"ఈ స్కూల్లోనే పనిచేస్తున్న చెన్నమ్మ ఆయాకు ఒక కొడుకుగా నావెంట తీసుకొని వెళ్ళడానికి నిశ్చయించాను. చెన్నమ్మగారు ఒంటరిగా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆమె పోషణ బాధ్యత నేను వహిస్తాను. దయచేసి స్కూల్ యాజమాన్యం నాకు ఈ చిన్ని సహాయం చేసి చేసి పెట్టండి".
డాక్టర్ రాములు గారి ఔదార్యానికి ఎంతో మెచ్చుకొని అందరూ చప్పట్లు కొట్టగా స్కూల్ ప్రిన్సిపాల్ చెన్నమ్మను స్టేజి మీదికి పిలిచింది.
కన్నకొడుకు సూటిపోటి మాటల పదును మరచి పోలేని తల్లి స్టేజి ఎక్కింది.
"అందరికీ నమస్తే! డాక్టర్ సార్ గారు ఎదిగిన మనిషి. మన స్కూల్ క్రమశిక్షణపై నమ్మకం వున్న తల్లిదండ్రులు వారి పసి పిల్లలను ఈస్కూల్లో జాయిన్ చేశారు. చిన్నారులకు నాలాంటి వాళ్ళ అవసరం ఉంది. కనుక నేను ఈ స్కూలు వదిలి రాలేను. మీరిచ్చిన రుణ సహాయానికి చాలా సంతోషం" అని స్పీచ్ ముగించింది చెన్నమ్మ.
మీటింగ్లో పాల్గొన్న వారందరూ చెన్నమ్మ ఒక పిచ్చిదనుకున్నారు.
సొంత తల్లిని తల్లిగా చెప్పుకోలేని కొడుకు మాటలకు బాధ కలుగలేదు, చదువు వేరు సంస్కారం వేరు అని తెలుసుకున్న అమ్మ.
అప్పర్ సీనియర్ సిటిజన్ అయిన చెన్నమ్మ, ప్లేస్కూల్ చిన్నారుల బాగోగులు చూసుకుంటూనే కొత్తగా నియమితులైన ఆయాలకు కోఆర్డినేటర్ గా మిగిలిపోయింది ఒకప్పటి దొరసాని.
========================================================================
సమాప్తం
========================================================================
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు : సురేఖ పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
పిల్లలిద్దరికీ వివాహమైంది.
నేను ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్నగారే నాకు మార్గదర్శకులు.
స్కూల్ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం చాలాకాలం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, నెచ్చెలి లాంటి ఎన్నో పత్రికలలో నా కథలు ప్రచురితమయ్యాయి.
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
Thank you for your valuable comments
@surekhap4148 • 48 minutes ago
Thank you for your valuable comments
@mdsaberali4905 • 1 hour ago
Very Nice Script. Heart touching n Brokening socio n Economical stunt n one side liking n loving spirituality of "DORA".Son's Educational Ambition n dedication is a Commemorable thrust of "SANI".The writer's canclusion is justified a "cheek blow" to Dr. Ramulu is an heart broken end.Hat's off to the writer MRS. SUREKHA MADAM.
@swarnaputta5792 • 5 hours ago
The story has a perfect ending.
@deepika974 • 7 hours ago
Reality of life is amazingly showcased in this story…