top of page

దోషి ఎవరు పార్ట్ - 2


'Doshi Evaru Part 2/3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha

'దోషి ఎవరు పార్ట్ 2/3' తెలుగు పెద్ద కథ

రచన : పూడిపెద్ది ఉగాది వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

సుమ, సుధాకర్ భార్యాభర్తలు. ఇద్దరూ ఉద్యోగస్తులు.

కూతురు లాస్యని చూసుకోవడానికి పనిమనిషి కావాలని స్నేహితురాలు మాధవిని అడుగుతుంది.


అర్చన అనే అమ్మాయిని పనికి పంపిస్తుంది మాధవి.

కొద్ది రోజులకు సుమ ఇంట్లో దొంగతనం జరుగుతుంది.

పొలిసు విచారణ జరుగుతూ ఉంది.


ఇక దోషి ఎవరు పెద్దకథ రెండవ భాగం చదవండి..


కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే, వంట గదిలో ఉన్న మాధవి వచ్చి వ్యూ మిర్రర్ లోంచి చూసింది, అర్చన వాళ్ళ అమ్మ ఉంది.

తలుపు తీసీ తీయగానే, ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది, తన కూతుర్ని రక్షించమని అంటూ.

“అయ్యో లేమ్మా, కూర్చో ముందు. ఏమి జరిగింది చెప్పు” అంటూ పనిమనిషిని కేకేసింది నీళ్లు తెమ్మని.


“మా అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసేరమ్మా, మీరే ఎలాగైనా కాపాడాలి తల్లీ” అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తోంది.

గోపాల్ కూడా హాల్ లోకి వచ్చాడు, మాధవి ఆలోచిస్తోంది. వారం క్రితమే సుమ ఫోన్ లో మాట్లాడి, పోలీసులకి ఎలాంటి క్లూ దొరకలేదని చెప్పింది. ఇక ఆశ వదులుకోడమేనే అని దిగులుగా మాట్లాడింది. అయితే పోలీసు కుక్క, హాల్ కి అటాచ్ అయి ఉన్న బాల్కనీ వరకు వెళ్లి ఆగింది, అని పోలీసులు చెప్పేరని, వారికీ ఈ కేసు అంతు చిక్కడం లేదని అన్నారట. ఏసీ సర్వీస్ ఇంజనీర్ ని, వాళ్ళ వాచ్మాన్ ని, వాళ్ళింట్లో పాచి పని చేసే పనావిడని కూడా ప్రశ్నించేరుట.


మెయిన్ ఫోకస్ ఏసీ సర్వీస్ ఇంజనీర్ పైన పెట్టేరట. కానీ అతను చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది, పైగా అతని కి మంచి రికార్డు ఉంది అతని ఆఫీస్ లో అన్నారట. చూడ్డమే తప్ప ఏమి చేయలేక పోతున్నామే.. ఇదంతా మా ఖర్మ” అంది.


నైరాశ్యం శాశ్వత పీట వేసేసుకుంది సుమ మనసులో.

బెడ్రూ మ్ లోకి వెళ్లి, సుమ కి ఫోన్ చేసి అర్చన వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పి, “సడన్ గా ఏమైయింది, పోలీసులు అర్చనని ఎందుకు అరెస్ట్ చేసేరు?” అని అడిగింది మాధవి.

“ఏమోనే, అన్ని కోణాల్లో అనుమానితులందరిని విచారించడం అయిపోయిందిట, అయితే, వారి అనుమానం నివృత్తి అయిపోయిందిట. కేసు వివరాలు అన్ని క్షుణ్ణం గా పరిశీలించాక, అర్చన ని ప్రధాన దోషి గా పరిగణిస్తూ, ఫైనల్ రిపోర్ట్ తయారు చేయమని, సి ఐ గారుఆదేశించారట..” చెప్పడం అయిపోయిందో లేక అలిసిన గొంతు విశ్రాంతి కోరుకుందో?


“ఇప్పుడెలాగే, పాపం ఆ పిల్ల అసలే చాల సున్నిత మనస్కురాలు, పైగా భయస్తురాలు. నీకేమనిపిస్తోందే, అర్చన ఈ పని కి ఎవరికైనా సహకరించిందంటావా?..”


సుమ ఉద్దేశ్యం తెలుసుకుంటే, ఈ విషయం లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించొచ్చు.. మాధవి పరి పరి విధాలా ఆలోచిస్తోంది. సుమకి అర్చన మీద అనుమానం లేకపోతే, ఇంక పోయిన నగలు మనవి కావు అనుకుని గుండె రాయి చేసుకుంటుందనుకుంటే, అసలు తనే కంప్లైంట్ ఉపసంహరించుకుంటే, ఏ గొడవ ఉండదు కదా! ఇదీ మాధవి మనోగతం. మాధవికైతే, అర్చన నిర్దోషి అని అనిపిస్తోంది.


వాళ్ళొచ్చిన కుటుంబ నేపధ్యం అలాంటిది కాదు, అందరు కష్టపడి పని చేసి, నిజాయితీ గా జీవించాలనుకునే వారిలానే ఉన్నారు. అన్నమంతా పట్టి చూడాలా, ఒక మెతుకు చుస్తే చాలదా ?


“ఏమోనే! నేను ఎటూ తేల్చుకోలేని స్థితి లో ఉన్నానే, మా జీవితాల్లో ఆనందమనేది కాగడా పెట్టి వెతికినా, కనిపించడం లేదే. అయితే, అర్చన ని తీసేయాలనే ఆలోచన చాలా సార్లు వచ్చింది,> కానీ సి ఐ గారు చెప్పేరు, ఫైనల్ రిపోర్ట్ పంపేవరకు, తనని పంపేయకండి అని, అందుకే ఆగాము”.

“ఒకే నే, నేను అర్ధం చేసుకోగలను నీ మానసిక స్థితి. అంతా మన ప్రారబ్ధం కాకపోతే ఇదేంటి చెప్పు రా. ఓకే.. ముందయితే, నేను అర్చనని బెయిల్ ఇచ్చి మా ఇంటికి తెచ్చుకుంటాను, తర్వాతా ఏంటన్నది ఆలోచిద్దాము. నువ్వేమి వర్రీ అవకు”

********

అర్చన కి పూచీకత్తుగా సంతకం పెట్టి, బెయిల్ ఇచ్చి, విడిపించి, నేరుగా తన ఇంటికే తీసుకొచ్చింది మాధవి. గోపాల్ కూడా మాధవి నిర్ణయాలకి పూర్తిగా తన వంతు సహకారం అందిస్తున్నాడు, అతనికి మాధవి, మేధస్సు మీద అపారమైన నమ్మకం.


రాత్రి అందరు పడుకున్నాక, గోపాల్ తో చర్చించింది తన ప్లాన్ గురించి.


“గోపాల్, ఈ కేసు లో అర్చన దోషా కాదా అనేది పక్కన పెడదాం కాసేపు, కానీ, నిర్దోషికి శిక్ష పడకుండా చూడాలి. ఇదే నా కోరిక. నిజమైన దోషి ఎవరో తెలిస్తేనే కదా అది సాధ్యపడుతుంది. సో, రేపు ఉదయం మనం సుమ ఇంటికి వెళ్దాం. రేపు కొంచెం నువ్వు కూడా సెలవు పెట్టేయవా, ప్లీజ్, నేను ఓ పధకం ప్రకారం, పోలీసుల దృష్టి ని ఆకర్షించని కొన్ని వివరాల్లోకి లోతుగా వెళ్లి, దీని అంతు కనుక్కుంటాను.


ఎస్, నేను సక్సెస్ కాగలనని నా నమ్మకం! నారాయణ, వాళ్ళమ్మ ఎంత తల్లడిల్లి పోతున్నారో.. అసలే పెళ్లి పెడాకులైన పిల్ల, ఆపైన ఈ మచ్చ కూడా తోడైతే, దీని భవిష్యత్తేంటి అని! నిర్దోషి ని రక్షించాలి, అదే మన కర్తవ్యమ్”

“ఎస్ మాధవీ, యూ ఆర్ రైట్, డన్!! షేక్ హ్యాండ్ ఇచ్చాడు మాధవికి గోపాల్, అందులో మాధవి మీద భరోసా ఉంది. తన సహకారం ఉంటుందనే ప్రామిస్ ఉంది. అంతకు మించి ప్రేమ ఉంది.


********

“సుమకి చెప్పేవా రేపు మనం వాళ్ళింటికి వస్తున్నామని?”


ఆ మాటలో, గోపాల్ రేపు సెలవు పెడుతున్నాడని సందేశం ఉంది. అది గ్రహించి, చిన్నగా నవ్వుతూ, తల ఊపింది, చెప్పేనన్నట్టుగా.

“రేపు వాళ్ళ పనమ్మాయిని, ఏసీ సర్వీస్ ఇంజనీర్ రహీం ని, ఇంకా, సుమ వాళ్ళ వాచ్మాన్ ని, ఉదయం పదింటికల్లా వాళ్ళింట్లో ఉండేలా ఏర్పాటు చేయమని కూడా చెప్పేను గోపాల్! అయితే, ఏసీ మెకానిక్ మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావొచ్చు, రాకపోవచ్చు కదా.. అందుకే సుమ తో చెప్పా, వాళ్ళ కంపెనీ మేనేజర్ తో మాట్లాడి, మొన్న వచ్చి ఫలానా రహీం అనే అతను రిపేర్ చేసేడని, మళ్ళా ప్రాబ్లెమ్ కనపడుతోందని, రేపొద్దున్న 10 కే పంపమని, తాను పర్మిషన్ పెట్టుకుని వెయిట్ చేస్తుందని రిక్వెస్ట్ చేయమన్నాను.


ఇక వాచ్ మెన్ అండ్ పనమ్మాయి అక్కడే ఉంటారు కనక పరవాలేదు, వాళ్ళు సహకరిస్తారు కదా..”

గోపాల్ సపోర్ట్ వెయ్యేనుగులా బలాన్ని, దాంతో పాటే, తను గెలవగలననే పూర్తి నమ్మకాన్నీ ఇచ్చింది మాధవికి.


*******

ఉదయం వెళ్లేసరికి తొమ్మిదయింది, సుమ, సుధాకర్ అప్పటికే ఆఫీసులకి వెళ్ళిపోయేరు. డైనింగ్ టేబుల్ మీద, హాట్ బాక్సుల్లో ఇడ్లి, సాంబార్, ఆలు ఫ్రై, రసం, రైస్, పెరుగు, రెండు ప్లేట్ లు సర్ది ఉన్నాయి. అవి తనకి, గోపాల్ కి అని మెసేజ్ చేసింది సుమ. అని తిని వెళ్లాలని ఆర్డర్ పాస్ చేసింది.

వాళ్ళ బెడ్ రూమ్ లో తన పని చేసుకోమని, అన్ని అక్కడ ఏర్పాటు చేసెనని కూడా సుమ చెప్పడం తో, మాధవి ఆలస్యం చేయకుండా, తన పని స్టార్ట్ చేసింది.

ముందుగా, ఏసీ మెకానిక్ తో మాట్లాడింది. చూడండి రహీం భాయ్, మొన్న జరిగిన సంఘటన మీకు తెల్సు కదా.. పోలీసులు మిమ్మల్ని కూడా ప్రశ్నించి, మీ స్టేటుమెంట్ కూడా తీసుకున్నారు. అయితే, మా అందరికి తెల్సు, జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమి లేదని, మీరు నిరపరాధి అని. అందుకే, సుమ మేడం, మేము ఒకటే నిర్ణయించుకున్నాము, ఇందులో మీకు సంబంధం లేదు అనే విషయాన్నీ, సాక్ష్యాధారాలతో, పోలీసుల దృష్టికి తీసికెళ్ళి, మీకు ఏమి నష్టం వాటిల్లకుండా, మా వంతు సహాయం చేయాలని..


దానికి మీరు మాకు, కొంచెం సహకరించాలి. మాకు పరిచయం ఉన్న ఒక పోలీస్ అధికారి సహాయం తో, మీరు నిర్దోషి అని నిరూపించి, మిమ్మల్ని ఈ కేసు లోంచి బయట పడేయాలనుకున్నాము. ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెపితే చాలు. ఏమంటారు భాయ్?”

“సరే మేంసాబ్, మీరే నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి. ఆ దినం పోలీసులు పిలిచి మాట్లాడినప్పటి సంధి, ఖానా పోతలేదు, నిద్ర పడతలేదు” బాధతో మొహం దించుకున్నాడు.

పోలీసులకి ఏమేమి చెప్పేడో అవే కాపీ పేస్ట్ చేసాడు. అన్ని తను నిర్దేశించుకున్న గడుల్లో నింపుకుంది. తను చెప్పిందంతా ఓ పేపర్ మీద రాసింది, దానిమీద అతని సంతకాలు తీసుకుని మరీ అతన్ని హాల్ లో వేచి ఉండమని చెప్పి బయటికి పంపింది. ‘కొద్దిసేపట్లో వెళ్లిపోదురుగాని ప్లీజ్’ అని ప్రాధేయపూర్వకం గా చెప్పింది.


తర్వాత. వాచ్మాన్ ని పిలిచి తను తయారు చేసి పెట్టుకున్న ప్రశ్నలు అడిగి, వాటిని కూడా రాసుకుని, అతని సంతకాలు తీసుకుని మరీ అతన్ని హాల్ లోనే వేచి ఉండమని చెప్పి పంపింది.


తర్వాత వాళ్ళింటి పనిమనిషి, పార్వతి ని పిలిచింది. తన మీద మెయిన్ ఫోకస్ పెట్టాలని ముందే అనుకుంది. ఆ ప్రకారమే ప్రశ్నలు సంధించింది. ఎందుకంటే, పోలీసులు ఆమెని పెద్దగా ఏమి ప్రశ్నించకపోవడం గ్రహించింది కనక..


“నువ్వు ఎన్నాళ్లనించి ఇక్కడ పని చేస్తున్నావమ్మా?”


“మూడేళ్ళ కాన్నించండి”


“ఏవేమి పనులు చేస్తావు, ఎన్ని గంటలకొస్తావు, ఎన్ని గంటలకెళ్తావు?”


“అన్ని పనులు, అంట్లు తోమడం, బట్టలారేయడం, పొయ్యిగట్టు కడగడం, కసఊడ్చడం, కళ్ళాపి జల్లి ముగ్గేయడం, రోజు మర్చి రోజు తడి బట్టెట్టి ఛుబ్రంగా తుడవడం, ఒకపనన్న రూల్సేటివి నేవండి నాకు, అమ్మగారు ఏ పని సెప్పిన, సిటుక్కున, సేసేత్తానండి, మాయమ్మగారిది మా దొడ్డ మనసంటే నమ్మండి!


ఇంకదేటమ్మ అడిగీనారు అమ్మగారు ? ఆ!! ఉదయం టక్కున ఏడు కొట్టేసరికి ఎలిపోచెత్తనండి, అమ్మగారు, అయ్యగారు బయలెల్లినప్పుడే నానూ ఎల్లిపోతానండి.. మాపటేల, మూడున్నర అలాగోచెత్తానండి, అమ్మగారు ఒచ్చిసరికల్లా, నా పని మొత్తం అయిపోద్దండి.


అమ్మగారొచ్చాక కూసింత టీ నీళ్లు కాసిచ్చి, టిపినీ డబ్బాలు గట్ట తోమేసి, నానెళ్లిపోతానండి, అంతేనండి..”

“సరే పార్వతి, నువ్వు మా ఫ్రెండ్ కి చాలా నమ్మకంగా పనిచేస్తున్నందుకు సంతోషం. కిందటి నెల పదవ తారీఖున, అమ్మగారింట్లో దొంగతనం జరిగిన రోజు, అమ్మగారి ఏసీ పాడైపోయిందని, రిపేర్ చేసే ఆసామి ఒచ్చాడు కదా, ఆరోజు నువ్వు మూడున్నరకి పనికొచ్చేసరికి, అతను ఉన్నాడా? నువ్వు చూసావా?”


"ఓసోస్! నాను సూడకపోవడమేటి? అతను సాయిబుగారు కదా, నానే బకెట్, పాత బట్ట ఇమ్మంటే ఇచ్చినాను కదేటి? టీ నీళ్లు కూడా కాసిచ్చినాను, అమ్మగారు ఫోన్ లో అర్చనకి సెప్పినారంటే"


“అతనితో నువ్వు మాట్లాడేవా ? లేదా అతను నీతో ఏమైనా మాట్లాడేడ?”


"బలే టోరండీ తమరు, టీ ఇచ్చినాను కదా, అదేలాగుందని

అడిగినాను కదేటి? ఆ!! అవునట్టు, నానే ఆయన గోరెళ్లిపోతుంటే, అమ్మగారికి మా సెడ్డ ఇబ్బంది అయిపోనాది, ఏసీ పనిసేయక, ఇంక మరేటి ఇబ్బంది ఉండదు కదా సారూ అని అడిగీసినానండి, నాకేటండి భయ్యం"


“అప్పుడాయన ఏమన్నారు?”


“ఇక యేటి పరవనేదూ! అంతా బాగుసేసిసినాను, అయితే, సూబు లో నిలిసిపోయిన నీరు, సుక్క సుక్కా కారొచు, అందుకే, ఒక పెద్ద సూబెట్టి, ఆ సూబుని, ఇదిగిదిగో, ఈ కిటికీగుండా, వరండాలోకి నాగేసేట్టేరని, ఒక్క రోజు, వరండా తలుపు పూర్తిగా మూసుకోదు, తెరిచే ఉంచాలి అన్నారండి. అంతా సెప్పీసినానా? సిటుక్కున, ఇంకేదైనా మరిసిపోనేదు గందా?”

“ఈ విషయం నువ్వు పోలీసులకి గానీ, మీ అమ్మగారికి గానీ చెప్పలేదా?”


“ఆళ్ళడగనేదు, నాను సెప్పనేదు”.

“సరే అమ్మా, నీకు సంతకం పెట్టడం వచ్చా? ఎంతదాకా చదువుకున్నావు?”


“ఐదో క్లాస్ దాక సదివించేరండి, తెలుగులో సంతకం పెట్టడం నేర్చుకున్నానండి!” కళ్ళెగరేసి, అదేదో పెద్ద డిగ్రీ చదివించేరన్నంత గొప్పగా చెప్పింది.

పార్వతి చెప్పిందంతా ఓ పేపర్ మీద రాసుకుంటూనే, రికార్డర్ లో రికార్డు చేసింది మాధవి, పేపర్ మీద సంతకం తీసుకుంది.


“అమ్మగోరూ, ఓ మాట సెప్తాను ఏటీ అనుకోమాకండీ, మా అమ్మగారి నగలు దొరకాలని, ఎంకటేశుల సామి గొరికి ముడుపు కట్టుకున్నానండి, ఆ అమ్మ సంతోసంగా ఉండాలమ్మగోరూ” కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది!

మళ్ళా ఏసీ మెకానిక్ రహీం ని లోపలి పిలిచి, మళ్ళీ ప్రశ్నించింది.

“మీరు ఆరోజు రిపేర్ అంత పూర్తిగా చేసేసి, నీళ్లు కారడం ఆగిపోయేకనే వెళ్లేరుగా, ఇంకేమి ప్రాబ్లెమ్ మిగిలిపోలేదు కదా. ఓ సారి గుర్తు చేసుకుని చెప్పండి, తొందరేమీ లేదు!” మరో అవకాశం ఇచింది ఇంకేమైనా గుర్తు చేసుకుని చెపుతాడేమో అని, నెల పైనే అయ్యింది కదా రిపేర్ చేసి అని.

“లేదండీ. రిపేర్ మొత్తం ఖతం అయ్యేకే వెళ్ళాను మేంసాబ్”


పార్వతి చెప్పిన విషయం, పైప్ లోంచి నీరు కారడం దాని పరిణామక్రమం మొత్తం క్లారిటీ గా చెప్పాడు.


“అరె మేంసాబ్, మాది దిమాక్ షానా తేజ్ ఉంటాది!” చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేడు.


“సరే.. బయట ఉన్న వాళ్ళందర్నీ లోపలి రమ్మనండి” అని గోపాల్ కి ఫోన్ చేసి చెప్పింది లోపలికి రమ్మని.


“సరే.. మీ అందరికి చాల పెద్ద థాంక్స్, మీ పనులన్నీ వదులుకుని మాకు సహకరించినందుకు. ఇదంతా మామూలుగా అడిగిన ప్రశ్నలే.మళ్ళీ మీ సహాయం కావలిస్తే, దయచేసి, మేము రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. ఓకే. ఇక మీరు వెళ్లొచ్చు. మేము గానీ, పోలీసులు గానీ చెప్పేవరకు, ఎవరు, ఈ వూరు దాటి వెళ్ళకూడదు, సరేనా. ఇక మీరు వెళ్లొచ్చు..” తన ఆలోచనలు లోలోపల పరిగెడుతూనే ఉన్నాయి మాధవికి.


వాళ్లంతా వెళ్ళిపోయాక, లంచ్ చేస్తూ గోపాల్ తో తర్వాతి చర్య గురించి వివరంగా మాట్లాడింది మాధవి. దాని ప్రకారం, భోజనం అయ్యాక, ఇద్దరు మాస్టర్ బెడ్ రూమ్ కి ఆనుకుని వున్నబాల్కనీ లోకి వెళ్ళేరు, చుట్టూతా పరిశీలించారు. ఆ బాల్కనీ లోంచి బయటికి వెళ్లడం చాలా కష్టం. ఎందుకంటే, బాల్కనీ ని ఆనుకుని ఉన్న ప్రహరీ గోడ కాస్త ఎత్తుగా ఉంది. అయితే అసాధ్యం మాత్రం కాదు.


సన్నంగా ఉన్నవారైతే, ఆ చిన్న గ్యాప్ లోంచి అవతలి వైపుకి వెళ్లపోగలరు. కానీ వీధి ప్రధాన ద్వారం వేసి ఉండగా, దొంగ లోనికి ఎలా వచ్చాడు? లోపలి వారే చేసేరా అనుకోడానికి, పరాయి పిల్ల ఒక్క అర్చన తప్ప మరెవ్వరు లేరు. కాసేపు అర్చన గురించి దీర్ఘంగా ఆలోచించింది, అసలు అర్చన గురించి తనకేమాత్రం తెలుసునని, తాను అర్చన నిర్దోషి అని రూఢిగా అనుకుంటోంది? ఈ కోణం లోంచి చుస్తే క్లూ దొరకొచ్చేమో?


గోపాల్ కి ఆఫీస్ నించి ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు, తనని, సుమ వచ్చేదాకా ఉంది. తనని కలిసేక రమ్మని చెప్పి వెళ్ళాడు. పార్వతి తన పని అయిపోయిందని, టీ పెట్టనా అంటే, వద్దులే, నువ్వింటికి వెళ్ళిపో అని తనని పంపేసి, ఇంటి పరిసరాల్లో కాసేపు తిరిగింది. బాల్కనీ దిశగా వెళ్లి, కిందనించి టాప్ ఎంగల్ లోకి దృష్టి సారించింది. ఆలా పరికిస్తున్నప్పుడు, ఒక దగ్గర మాధవి కన్ను ఆగింది. ఎర్ర మట్టిలో తొక్కిన పాదం గుర్తు.. ఆ పాదం సన్నగా పీలగా ఉంది. పైనించి క్రిందికి దిగుతున్నప్పుడు, గోడకి ఆసరాకోసం, పాదాన్ని ఆనించి నట్టుగా ఉంది.


అది చూసాక మాధవి కి ఈ కేసు ని తను చేధించగలదు, అనే నమ్మకం దృఢమైంది. బుర్రలో ఎదో ఫ్లాష్ అయింది, సెల్ తీసి ఐదారు ఏంగెల్స్ లో ఫోటోలు తీసింది. ఎస్! ఎస్! ఐ గాట్ ఇట్ అని తలూపి, లోపలికెళ్ళి టీ వీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. సుమ వచ్చింది, లాస్య ని ఎత్తుకుని. బేబీ కేర్ సెంటర్ లో పెడుతున్నారు, అర్చనని అరెస్ట్ చేసినప్పటి నించి. వాళ్ళమ్మ వాళ్ళు తమతో వాళ్ళ వూరు పంపించేయ మన్నారు. కానీ పిల్లని వదిలి ఉండడం ఇష్టం లేక, ఏవో అవస్థలు పడుతున్నారు. చాలా డల్ గా ఉంది సుమ!


కన్నీరుబికింది మాధవికి సుమనలా చూస్తే..

పరుగున వెళ్లి, లాస్య ని అందుకుని, సుమని గట్టిగ కౌగలించుకుంది. ఇద్దరు కన్నీళ్లు కాసేపు పలకరించుకున్నాయి, పరామర్సించుకున్నాయి.

మాధవే ఇద్దరికీ టీ పెట్టి, బిస్కట్లు, కారప్పూస తో కలిపి తెచ్చింది. లాస్య కి, పాలు పట్టి, అది ఆడుకుంటుంటే, ఇద్దరు కాసేపు ఆ కేసు గురించే మాట్లాడుకున్నారు.


సుమని కూడా కొన్ని ప్రశ్నలు వేసింది మాధవి తన దర్యాప్తులో భాగంగానే.. మాధవి మనసులో దాదాపుగా దొంగెవరో రూఢి అయిపొయింది, అయితే చిన్న చిన్న విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.


కేసు గురించి తానేమి చేస్తుందో, దాని పూర్వ పరాలు, సుమకి చెప్పేముందు, ఇది గోప్యంగా ఉంచాల్సిన అగత్యం వివరించి, లాస్య మీద ప్రామిస్ తీసుకుంది.


“అయ్యో, ఇప్పటికే సర్వం కోల్పోయి ఉన్నానే, మళ్ళీ నా గొయ్యి నేను తవ్వుకుంటానా చెప్పు. నన్ను నమ్ము, ప్లీజ్.. అసలేం జరుగుతోందో నాకేమీ అర్ధం కావట్లేదు. కేసు ఎటు వెళ్తోంది, అసలు నా నగలు దొరుకుతాయా లేదా?..”

చలించిపోయింది సుమ.


సుమకి తన దర్యాప్తు తీరుతెన్నులు, పరిణామ క్రమం క్షుణ్ణంగా వివరించింది. ఎందుకంటే, ఇదంతా మాధవి చేస్తున్నది తన ఫ్రెండ్ కోసమూ మరియు నిర్దోషి కి శిక్ష పడకూడదనే గట్టి సంకల్పంతోనూ. అందుకే, సుమకి అప్పటివరకు జరిగింది చెప్పి, సాంత్వన, నమ్మకం కలిగించే ప్రయత్నం చేసింది. మాధవి ప్రయత్నం విఫలం కాలేదు, సుమ మొహం లో ఆశలు మేలుకొలుపులు పాడసాగాయి.


“సుమా! రేపు ఆ ఏసీ మెకానిక్ ని మా ఇంటికి పంపించు. ఉదయం ఏడు గంటలకల్లా, ప్లీజ్, నాకు ఈ కేసు ఎంత త్వరగా ఓ కొలిక్కి వస్తుందా అని ఉందిరా. నువ్వేమి వర్రీ అవ్వకు, మనం మాట్లాడిన విషయాలు ఇంకెవరితోను, దయచేసి చెప్పకు. ఓకే.. గుడ్ లక్.

అలాగే, రేపు కొంత ముఖ్యమైన సమాచారం రాబట్టడం అయ్యాక, గోపాల్ వాళ్ళ కొలీగ్ ఫాదర్, ఏ సి పీ, ట, అతని ద్వారా, కమీషనర్ గారిని కలిసి, నే సేకరించిన విషయాలు సాక్ష్యాధారాలతో సహా కమీషనర్ గారికి అందజేసి, నిర్దోషిని రక్షించమనీను, దోషి కి శిక్ష పడేలా చూడమని, మీ నగలు మీకు అందేలా చూడమని, ఆయనకి విన్నవించుకుంటానే”.

సుమ ఒక్కసారిగా లేచి, మాధవి ని గట్టిగా కౌగలించుకుని, “నువ్వు సామాన్యురాలివి కావే, నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండడం, నా అదృష్టమే..” కన్నీళ్లు కూడా, సుమ మాటలకి వత్తాసు పలికాయి.

=================================================================================

ఇంకా వుంది..

========================================================================

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత


44 views1 comment
bottom of page