top of page

ఎదలోతున అలజడి రేపే ఆలాపనలు


'Edalothuna Alajadi Repe Alapanalu' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

రామరాజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైరయి రెండేళ్ళవుతూంది. మొదట మారుతీ నగర్- పిదప లీలానగరు ప్రాంతాలలో బాడుగింట్లో సర్దుకుని, యెట్టకేలకు సనత్ నగరులో స్వంత ఇల్లు కట్టుకుని స్థిరనివాసం యేర్పరచుకున్నాడు. భార్య సీతాదేవి విద్యావంతురాలు. తెలుగు లెక్చరర్ గా పని చేసి, భర్తకు తోడుగా ఉండటానికి సాహిత్య వ్యాసంగాన్ని సజావుగా సాగించడానికి అనువుగా ఉంటుందని స్వఛ్ఛంద ఉద్యోగ విరమణ చేసింది. భర్త ఒంటరితనం పోగొట్టే బాధ్యత జీవన సహచరికి ఉంటుంది కదా! ఇక విషయానికి వస్తే, ఆమెను కవయిత్రి అనవచ్చు- రచయిత్రి అని కూడా అనవచ్చు. లేదా విద్యారంగ సంస్కరణల పట్ల ఆసక్తి గల వ్యాసకర్త అని కూడా పిలవచ్చు. కళైన ముఖ వర్ఛుస్సుతో తెలుగుతనం ఉట్టిపడే కట్టూబొట్టుతో హుందాతనం తొణికిసలాడే రూపంతో- సదైవ దర్శన ప్రియం అన్న రీతిన ఆకట్టుకుంటుంది. బాహ్య రూపం సంగతి అటుంచి చూస్తే ఆమెది నిజంగానే ఆర్ద్రత గల మనసు. నెమ్మది చేకూర్చే చల్లని చూపు..

ఇక ఇతర కుటుంబ సభ్యుల గురించి చెప్పాలంటే ఇద్దరూ కొడుకులే. లేదు.. ఆడపిల్ల అలికిడి లేదు.. కొడుకులిద్దరూ మెట్టుమెట్టున సాంకేతిక నైపుణ్యం సముపార్జించుకుని పెళ్ళాం బిడ్డలతో విదేశాలకు వెళ్లిపోయారు. వాళ్ళలా ఉన్న ఊరు విడిచి విదేశాల వైపు మళ్ళడం రామరాజుకి ఇష్టం లేదు. అదే మాట పడక గదిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునేటప్పుడు భార్యతో చెప్పాడు. కాని సీతాదేవి అతడితో అంగీకరించలేదు. నవ్వుతూనే భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూనే నాజూకుగా విడమర్చి చెప్పింది- “మీకు చెప్పేంత విస్తృతి గల దానిని కాను. కాని చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి చెప్తున్నాను. మీకెలాగైతే కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసరుగా ఎదిగేందుకు యెలా భవిష్యత్తు పట్ల అక్కర ఉందో- అదే విధంగా ప్రైవేటు కార్పొరేట్ ఉద్యోగస్తులైన వాళ్ళకూ అటువంటి అక్కరే ఉంటుంది. మనకైతే వేన్నీళ్ళకు చన్నీళ్ళలా పెన్షన్ గట్రా ఉంటాయి,వాళ్ళకు అటువంటివి అంతగా ఉండవు కదా! అందులో కోడళ్లిద్దరూ నవనాగరికత పుణికి పుచ్చుకున్న అమ్మాయిలాయె! వాళ్ళ యాంబిషన్స్ వాళ్లకు ఉంటాయిగా! భార్యాభర్తల ఆలోచనలు కూడా వాళ్ళ వాళ్ల యాంబిషన్స్ తో పెనవేసుకుని జత చేరి ఉండవచ్చు కదా!”

ఆమాటతో రామరాజు మిన్నకుండి పోయాడు. ఏమో యెవరు చెప్పొచ్చారు! కోడళ్ళిద్దరూ కాబోయే భర్తలు ఫారిన్ వెళ్తారన్న యోచనతోనే పెళ్లి పీటలపైన కూర్చోవడానికి ఒప్పుకున్నారేమో! ఆమాటకు వస్తే డేషింగ్ గా సాగే ఈ రోజుల్లో అలా అనుకోవడంలో తప్పు కూడా లేదేమో! పెళ్లయిన తర్వాత అత్తామామలతోనే గూడుకట్టుకుని ఉండాలన్న నియమం యెక్కడుంది? అవసరం ఏముంది?

పెరిగిన కుటుంబ నేపధ్యమో మరే కారణమో చెప్పడం కష్టం గాని అతడికి ఆదినుంచీ ఆధ్యాత్మిక వాతావరణమంటే ఇనుమడించిన సుఖ భావం. సనత్ నగర్ నుండి కారేసుకుని వెళితే బల్కం పేట వచ్చేస్తుంది. అల్లంత దూరం నుంచే ఎల్లమ్మ పోచమ్మ ల గుడి గోపురం నిటారుగా దీవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆలయ దర్శనం పట్ల అతడికున్న ఆసక్తి వల్లనేమో, వాళ్లకు మూడవ వీధిలో ఉంటున్న విఘ్నేశ్వరుడి గుడికి అక్కడివాళ్లు ధర్మకర్తగా ఎంపిక చేసారు, మరో ఆరుగురి బృందంతో కలిపి! ఉదయం పూట ఓ చూపు చూసి వస్తాడు గాని, గుడి ఆవరణలో యెక్కువ సేపు గడపడు. పూజారి రావడం ఆలస్యమైతే దేవస్థానం ఆఫీసు నుండి తాళాలు తీసి గుడి తలుపులు తెరుస్తాడు. మరైతే సాయంత్రం పూట మాత్రమే అతడు ఆలయ ప్రాంగణంలో గుడి వ్యవహా రాలు ప్రత్యక్షంగా చూసుకుంటూ గంట సేపు గడుపుతాడు. దైవ ప్రార్థన చేసి పూజారికి ఓ మాట చెప్పి ప్రసాదం కళ్ళకద్దుకుని ఇల్లు చేరుకుంటాడు. ఇదీ అతడి దైనందిన విశ్రాంత జీవితం!

ఒక రోజు సీతాదేవి అడిగింది కూడాను— “ప్రతిరోజూ మీరే వెళ్ళి గుడి వ్యవహారం చూసుకోవాలా! తతిమ్మా ఆలయ పోషకులు యేం చేస్తున్నారట? బాధ్యతలు సమంగా కదూ పంచుకోవాలి?”

ఆమాట విని రామరాజు నవ్వేసాడు ”నిజమే! నువ్వన్నట్టు దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలన్నట్టు వాళ్ళు కూడా సమానంగానే బాధ్యతలు స్వీకరించాలి. కానీ ఏం చేస్తాం చెప్పు? వాళ్ళందరూ మధ్య యువకులు. ఉద్యోగాలు చేస్తున్నవారు. నేనైతే పనీపాటా లేని వాణ్ణి. మధ్యాహ్నం వరకూ బ్యాంకు పనులూ, పోస్టల్ పనులూ, మందులూ మాకులూ కొనడాలూ, ఆ తరవాత నేను తీరుబడిగానేగా ఉంటాను. ఇకపోతే నేను అలా తప్పిపోకుండా గుడికి వెళ్లి రావడానికి మరొక కారణం ఉంది. అది సెంటిమెంట్. చెప్పేదా?”

సీతాదేవి తలూపింది. అప్పుడతడు కొనసాగించాడు. “వినాయకుడు పైకి ప్రశాంతంగా వక్రతుండంతో కనిపిస్తాడు గానీ లోలోన ఆక్రోశపరుడు. ఒకసారి కుబేరుడు యేం చేసాడు? పార్వతీ పరమేశ్వరులను విందుకి ఆహ్వానించాడు. ఆది దంపతులిద్దరూ ఆ సమయాన వెళ్ళలేక, పెద్ద కొడుకు వినాయకుణ్ణి వెళ్లి రమ్మని పంపించారు. కుబేరుడు నోరు మూసుకుని తన పని తను చేసుకు పోవచ్చుగా! ఉన్నదంతా వినాయకుడి ముందు బోర్లించ వచ్చుగా! అలా చేయకుండా మనసులో హేళనగా అనుకున్నాడు ‘ఈ చిన్న పొట్ట వినాయకుడు నేనివ్వబోయే విందు పదార్థాలను ఆరగించగలడా! ఆరగించి హరించుకోగలడా?‘అని. అంతే! విఘ్నేశ్వ రుడికి ఉక్రోశం వచ్చేసింది. కుబేరుడు విందులో పెట్టిన పదార్థాలన్నింటినీ ఒక్కటి మిగల్చకుండా తినేయడమే కాక, తనకింకా ఆకలి తీరలేదని రంకెలు వేస్తూ కుబేరుణ్ణి సహితం తినేస్తానని వెంటబడ్డాడట! ఆ కోవన చూస్తే నేనెలాగూ సాయంత్రం పూట తీరుబడిగానే ఉంటానన్నది స్వామివారికి తెలుసు. నాకు నేనుగా యేదో అనుకుని అంచనాలు వేసుకుని వెళ్ళకుండా ఉంటే నా గతి యేమముతుందో ఆలోచించు”.

అది విని సీతాదేవి కడుపార నవ్వింది. నిజమే మరి! కడగండ్లు యెదురైనప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలపోస్తానంటే యెలా? అదొక అవకాశవాద భక్తిగా మారదూ!

***2***

ఆ రోజు ఉదయం స్నానం ముగించి ఓసారి గుడి ఆవరణంతా తిరిగొచ్చి పూజారిని పనిలోపనిగా పలకరించి, అయిపోవచ్చిన తైలం బాటిల్ ని ప్రక్కన పెట్టి కొత్తది కొని పెట్టి ఇల్లు చేరాడు రామరాజు. సీతాదేవి కూడా ఆ లోపల తలంటు స్నానం చేసి వచ్చి ఓసారి ఆమె వ్రాస్తూన్న కవితకు తుది మెరుగులు దిద్దుతున్నదల్లా, డోర్ బెల్ విన్నంతనే లేచి వెళ్ళి తలుపు తీసి, భర్త కోసం జీడి పప్పు దట్టించి వేసిన ఉప్మా బల్లపైనుంచి, ఫ్లాస్కులో చేసుంచిన ఫిల్టర్ కాఫీని కప్పునిండా పోసి తీసుకు వచ్చింది. అప్పుడు తింటున్నవాడల్లా తననే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్న భార్యను ఆశ్చర్యంగా చూశాడతను

”నీకివ్వకుండా, కనీసం కావాలా అని అడక్కుండా ఒక్కణ్ణీ స్వాహా చేస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా!”

ఆమె నవ్వటానికి ప్రయత్నిస్తూ “ఛీ! అవేం మాటలండీ! మీరెంత తింటే నాకంతటి తృప్తి. మరి జీడి పలుకుల్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. నేనెక్కువగా వేయలేదుగా?”

“నీకు తక్కువగానే అనిపిస్తుంది. జీడిపప్పు నేనెక్కువగా తినకూడదుగా! మనిద్దరమూ సగంలో సగమేగా.. అవన్నీ నీకు తెలియనివా?”

ఆమె చిరుహాసం చిందిస్తూ రామరాజు ప్లేటు ప్రక్కనుంచిన జీడి పలుకుల్ని నోట్లో వేసుకుంటూ అంది “మీతో ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడాలి. నిదానంగా తినండి. కుదురుగా మాట్లాడుకుందాం”.

అతడేమీ అనకుండా తినడం పూర్తి చేసి కాఫీ తాగడం పూర్తి చేసాడు. కొడుకులిద్దరూ అమెరికా రమ్మని మళ్లీ ఒత్తిడి పెడ్తున్నారేమో! అతడు ముందే తెగేసి చెప్పాడు, తన శరీర తత్వానికి అక్కడి చలి వాతావరణం-మంచు తుఫాను గాలి ఏమాత్రమూ సరిపడదని. ఫ్లూ జ్వరానికి తెరలేపినట్లవుతుందని. ఈసారి ఏమి చెప్పబోతుందో తన జీవన సహచరి! కానీ వృత్తాంతం మరో మలుపు తిప్పింది. “వ్యక్తిగతమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాని మీరు కోపగించుకోకపోతే చెప్తాను”

“ఈ వయసులో నాకింకా వ్యక్తిగతమనేది యేముంటుంది? నీ వ్యక్తిగత జీవితమే నాదవుతుంది. నైసిటీస్ కి పోకుండా ఇక ముందుకు సాగు”.

ఆమె అలాగే అన్నట్టు తలూపుతూ గొంతులోని గరగరను సరి చేసుకుంటూ చెప్పనారంభించింది “ఈరోజు నేననుకోకుండా మీ స్టడీ రూములోకి ప్రవేశించాను. అక్కడా ఇక్కడా పడున్న పేపర్లు సర్దుతుంటే మీ పాతకాలం నాటి పర్సనల్ ఫైల్ నా కంట పడింది. నిజానికది పర్సనల్ ఫైలని నాకు తెలియదు. కానీ అందులో నుంచి అప్పటి ఇన్ ల్యాండు కవరు రెపరెప లాడుతూ కనిపించింది. నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. అంచేత ఉత్కంఠత ఆపుకోలేక దానిని మాత్రం బైటకు తీసి చూసాను. ఎప్పుడో ఒక స్త్రీ మీకు వ్రాసిన ఉత్తరం అది. దానిని చదివిన తర్వాత నిశ్శబ్దంగా ఉండలేక పోయాను. నాలోని రచయిత్రి గగ్గోలు పెట్టనారంభించింది. కొంత దీనంగా అడుగుతున్నట్లుంది. మరి కొంత నిలదీసి అడుగుతున్నట్లుంది” ఆ మాటతో ఆమె చెప్పడం ఆపింది.

అతడు విసురుగా గాలివాటంగా రాలిపడ్డ చినుకులా అన్నాడు “ఉఁ ! పేరు కామిని. ఔనా?”

సీతమ్మ మళ్లీ నవ్వడానికి ప్రయత్నిస్తూ- “ఉఁ !” అంది.

“నిజంగా గుండె నిబ్బరం గల స్త్రీ. నేను కాకి నాడ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అదే ఆఫీసులో నాతో కలసి పని చేసిన అమ్మాయి. కలవారింటి అమ్మాయి. నాతో స్నేహ పూర్వకంగా మెసలేది. శుభకార్యాలప్పుడు ఇంట్లో యేదైనా ఫలహారాలు చేసుకున్నప్పుడు నాకు ఇస్తుండేది. ఒకసారి నేనుంటున్న లాడ్జీ రూమ్ బాగాలేదని నేను విడిగా సింగిల్ రూమ్ వెతుకుతున్నానని తెలుసుకుని వాళ్లింట్లో ఒక గది ఖాళీగా ఉందని కబురందించింది. నేను నిరాకరించాను. నిరాకరించడమే కాక ఇక లాభం లేదనుకుని వేరే సెక్షన్ కి మార్చుకుని వెళ్ళిపోయాను. నాకు తెలుసు ఆమె పరిచయం శృతి మించి రాగాన పడబోతున్నదని”.

అప్పుడు సీతాదేవి అడ్డు వచ్చి అడిగింది- “మరి అప్పుడు మీకింకా నాతో పెళ్ళి కాలేదుగా!”

ఆ వ్యాఖ్యానం విని రామరాజు భార్య ముఖంలోకి దీర్ఘంగా చూసాడు. “అందరికీ ఉన్నట్టే మా కుటుంబానికీ ఒక నేపథ్యం ఉంది. విందు భోజనం తేరగా వచ్చింది కదాని అంగలార్చం. తెలిసి గాని, తెలియక గాని నా వల్ల యెదుటి వారికి యిబ్బంది కలక్కూడదని జాగ్రత్తలు తీసుకుంటాం. అది సంస్కారం. అందులో ముఖ్యంగా నాకు అమ్మా నాన్నల పట్ల గౌరవం ఉంది. నాకూ ఒక చెల్లెలు ఉందన్న జ్ఞాపకం ఉంది. ఈజ్ దేర్ ఎనీ థింగ్ రాంగ్ ఆన్ మై పార్ట్?”

ఆమె లేదన్నట్టు తల అడ్డం గా తలూపింది.

“అందులో ఆమె మంచి యెత్తరి. మంచి అంగ సౌష్టవం. నిప్పూ, యెండు గడ్డీ ప్రక్క ప్రక్కనే ఉండటం యెప్పటికైనా ప్రమాదకరమే కదా! నాకు అంతలో రాజమహేంద్ర వరానికి బదిలీ అయింది. అప్పటికీ కామిని పట్టు వదలకుండా ఈ ఉత్తరం వ్రాసింది. ఇందులో ఆమె నన్ను దెప్పి పొడిచింది. సగం విలాప గీతాన్ని ఆలపించింది. రాజమహేంద్ర వరం వస్తానని ఫోను కూడా చేసింది. నేను మిన్నకుండిపోయాను”. సీతమ్మ మరొకసారి అడ్డు వచ్చి అడిగింది-

“ఆమె పైన కోపం కలగలేదూ?” .

అతడు చిన్నగా నవ్వి బదులిచ్చాడు- “ఎందుకు కలగాలి? అబ్బాయిలకు మాత్రమే అమ్మాయిల్ని ఇష్టపడే అధికారం ఉందా? అదే అధికారం అమ్మాయిలకు ఉండ కూడదా! ఇది సహజ ప్రకృతి పరిణామమని మేం గుర్తించ కూడాదా!”

సీతాదేవి రామరాజుని తదేకంగా చూస్తూ- “మరొక కప్పు కాఫీ తెస్తాను” అంటూ లేవబోయింది. అప్పుడతను చటుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపాడు. మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టాడు. ”ఇప్పుడు నా తరపున చెప్పాల్సిన సంగతులున్నాయి. సున్నిత హృదయం గల రచయిత్రివి కదా! నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో చెప్పబోతున్నాను. డు యు మైండ్?”

ఆమె నవ్వుతూ ముందుకు సాగమన్నట్టు తల ఊపింది.

“ఇటువంటివి ఒకటి కాదు. మూడు జరిగాయి. అంటే— నాపైనున్న సదభిప్రాయంతో నాకు చేరువ కావటానికి ప్రయత్నించిన అమ్మాయిల గురించి ప్రస్తావిస్తున్నాను. నన్ను నేనొక మునివర్యుడినని చెప్పుకోవడానికి ప్రయత్నించడం లేదు. జస్ట్ లైక్ దట్- మా కుటుంబ నేపథ్యం అటువంటిది మరి.. మా ఇంటి పెద్దలు,నాకు చదువులు నేర్పిన గురువుల ఆదేశాలు అటువంటివి. ఏ స్త్రీ నీ చులకనతో చూడకూడదన్న సత్సంకల్పం. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్. కాని నాకు తెలియకుండానే నేను అనుకోకుండానే నేనొక అమ్మాయి విషయంలో దాదాపు చతికిలబడ్డాననుకో! ఎందుకలా జరిగిందో నాకిప్పటికీ బోధపడటం లేదు. నాకప్పటికి నీతో పెళ్లయింది. ఒక కొడుక్కి తండ్రిని కూడా అయ్యాను. నేనప్పుడు సీనియర్ స్టాఫ్ గా ప్రమోట్ అయాను. అప్పుడా అమ్మాయి నా యెదుటి సీటుకి వచ్చింది. ఆమెది సహజంగానే చాలా ఫ్రెండ్లీ టైప్. నన్ను విష్ చేసి పలకరించింది. నేను కూడా హాయ్ అంటూ పలకరించి ఊరుకున్నాను. నా పనిలో నేను పడిపోయాను. ఆమె మెల్ల మెల్లగా మాటలు కలపడానికి ప్రయత్నించేది. ఎప్పుడూ మందస్మిద వదనంతో చూసేది. ఆమె నా గురించి యేదో అనుకుంటుందని తోచి నాకు పెళ్లయిన వైనం చూచాయిగా నీతో ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు నీ ఉనికి తెలియచేసాను. మరెందుకో మరి- ఆమె నా యందు ప్రసరించే చూపుల్లో మార్పు రాలేదు. అప్పుడు నేనొకసారి అనుకోకుండా ఆమెను తేరి చూసాను. మంచి పొడగరి. నేవళం చిందే వదనం. సూటైన ముక్కు. ఇంకా ఇంకా చూడాలనిపించే నిండుదనం. నేనలా చూడటం గమనించిన విమల చటుక్కున తలెత్తి నా ముఖంలోకి లోతుగా చూసి నవ్వింది. కళ్ళద్దాలు తీసి- ‘ఓపారి నాకళ్లు చూడండి’ అని అడిగింది. నేను లోతుగా చూసి – ‘మీవి విశాల నేత్రాలు’ అంటూ ముఖం తిప్పుకున్నాను. అప్పట్నించి నేను ఆమెతో మాట్లాడటం కాదు- ఆమె వైపు చూడటం కూడా మానుకున్నాను. ఇప్పుడు నీకు ఒక అనుమానం పొడసూపవచ్చు. కనీసం స్నేహభావం కూడా చూపించకుండా నేనెందుకలా నిర్లిప్తంగా ప్రవర్తించానని. కారణం ఉంది. నేనప్పుడు ముఖ్యమైన డిపార్టుమెంటల్ పరీక్షలకు చదువుతున్నాను. ప్రభుత్యోద్యోగిగా నా కెరియర్ కి మలుపునిచ్చే పరీక్షలు. అకౌంట్స్ సర్వీసు యెగ్జామ్ అనబడే వాటికి రెండు భాగాలు. మొదటి భాగం పూర్తి చేస్తే ఫీల్డ్ ఆపీసరుగా పోస్టు చేస్తారు. రెండవ భాగం గాని విజయవంతంగా పూర్తి చేస్తే గెజిటెడ్ ఆఫీసరుగా రీజనల్ ఆఫీసులోనే ప్రమోషన్ కమ్ ట్రాన్సఫర్ పైన వేస్తారు. నేనూ మా సహోద్యోగులూ హోరా హోరీగా చదువుతున్న రోజులు. పోటీపడి చదువుతున్న రోజులు. అప్పుడు మనసుకి డైవర్షన్ కలుగ చేయలేను. అప్పుడామె నా పరిస్థితి అర్థం చేసుకోకుండా అదేదో మంచి రోజని నన్ను టీ పుచ్చుకోవడానికి క్యాంటీనుకి పిలిచింది. నేను సుతారంగా సారీ చెప్తూ ఫైలు తీసుకుని బ్రాంచాఫీసరు చేంబర్ కి వెళ్లిపోయాను. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం యేమంటే— గ్రూప్ త్రీ సెక్షన్ లో పని చేస్తున్న నా మిత్రుడు గోపాలకృష్ణ ఆమెను చూపులతో గాలం వేయడానికి పని ఉన్నా లేకపోయినా మా సెక్షన్ కి రావనారంభించాడు. ఆ మాటకు వస్తే అతడు వికారి కూడా కాడు. విమలతో మాటలు కలపడానికి తెగ ప్రయత్నాలు చేయనారంభించాడు. నాతో మాటలు కలపుతూనే అటు చూపులు సారిస్తూ ఆమెను పలకరిస్తుండేవాడు. ఇంతకూ అతడు నాలా వివాహితుడు కాడు. బ్రహ్మచారి. కాని విమల అతణ్ణి తన మదిలోకి చొరబడ నీయలేదు. మాటలు కలపనీయలేదు. ఆమెకు నిజం గానే నాపట్ల యేదో ఎక్స్ట్రా ఫీలింగ్ ఉన్నట్టనిపించసాగింది. ఇక ప్రయోజనం లేదనుకుని సెక్షన్ మార్చుకుని వెళ్లిపోయాను. అక్కడ ఆమె గురించి వాళ్ళకు దూరపు బంధువైన ఒకామె ద్వారా తెలుసుకున్నాను. విమలది మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్. ఇద్దరు అక్కయ్యలూ రాజమండ్రి గవర్మమెంటు ఆస్పత్రిలో డాక్టర్లు. తండ్రేమో స్టేట్ సెక్రటేరియట్ లో సీనియర్ గ్రేడ్ ఆపీసరు. తల్లేమో కాలేజీలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. మరి ఇంతటి మంచి ఫ్యామి బ్యాక్ గ్రౌండుతో పుట్టి పెరిగినామె వివాహితుణ్ణయిన నన్నెందుకు ఫాలో చేస్తుంది? జుత్తు పీక్కోవాలనిపించేది”.

అప్పుడు సీతాదేవి అడ్డు వచ్చింది. “తోటి ఆడదానిగా నేను చెప్తాను. అన్ని విషయాలలో కాకపోయినా అందరి విషయంలో కాకపోయినా మనసు కొన్ని సార్లు మన మాట వినిపించుకోదండీ! రూపం తెలియని విమల గురించి తలచుకుంటుంటే యెవరో తోబుట్టువులా తోస్తుందండి. నా వరకూ ఆమెది గ్రేట్ ఎమోషనల్ పర్సనా లిటీ!”

ఆ మాట విని రామరాజు భార్య వైపు అదోలా భావ ప్రకటన చేస్తూ చూసి అన్నాడు- “నీ మనోభావాల గురించి తరువాత చెప్తువు గాని.. మొదట నన్ను ముగించనియ్యి. ఆ తరువాత ఆమె కూడా బ్యాంకు ప్రొబెషనరీ ఆఫీసరుగా సెలెక్టయి రిజైన్ చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ఆమె నాకు దూరం కాలేదు. పాత లేడీ ఫ్రెండ్సుని చూడటానికి వస్తూ నా వద్దకు వచ్చి పలకరించేది. నా పక్కన కూర్చుని మాటలు కలుపుతుండేది. అది చూసి గోపాలకృష్ణ కళ్లు మండిపోయేవి. కక్కనూ లేడు, మింగనూ లేడు. దానికి నేనేమి చేసేది?

ఆ లోపల నాకొక మంచి జరిగింది. సూపర్ వైజర్ గా ప్రమోషన్ ఇచ్చి నన్ను శ్రీకాకుళం వేశారు. అక్కడ నాకు పార్ట్ వన్ ఆకౌంట్స్ సర్వీసు ఫలితాలు వచ్చాయి. నన్ను ప్రమోషన్-కమ్-ట్రాన్స్ఫర్ పైన మంగళూరు వేసారు. ఆ తరవాత ఆమెను నేనెన్నడూ చూడలేదు. ఆమెకు వివాహం జరిగిందని యెవరో చెప్పగా విని నాకెంతటి రిలీఫ్ కలిగిందని! చెప్పలేనంత! ఇక చెప్పడానికేమీ లేదోయ్. నేను చిన్నపాటి కునుకు తీసి వస్తానోయి!” అంటూ లేవబోయాడతను.

కాని సీతమ్మ అతణ్ణి లేవనివ్వలేదు. “నావంతు నన్ను చెప్పనివ్వండి. ఆ తరవాత కదలండి”.

“చెప్పు!” అంటూ సర్దుకున్నాడతను.

“మన వీధి చివరన ఉన్న వినోదిని గారి గురించి తెలుసు కదూ!”

అతడు కాసేపు ఆలోచనలో పడి- “ఉఁ! మీరిద్దరు అప్పుడప్పుడూ మార్కెట్ లో కలుసుకుంటున్నప్పుడు మాట్లాడుకోవడం చూసాను. ఆమెగారే కదూ!”

”అరే— పర్వాలేదు. జ్ఞాపకశక్తి బాగానే ఉంది. అద్భుతం. ఆమెగారే.. రేపు మనల్ని భోజనానికి రమ్మనమని పిల్చింది”.

రామరాజు మరొకమారు భార్య వైపు అదోలా ముఖం పెట్టి చూసాడు. “భలేదానివే! వాళ్ళకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయీనూ— ఆమెగారి భర్త కూడా మామూలు ఉద్యోగస్తుడని విన్నాను. వాళ్ళకు ఇబ్బంది కలిగించడం దేనికి?”

“అబ్బే! నేనేమీ అనలేదండి. మాటల సందర్భంలో చెప్పాను- మన పెళ్లి రోజు గురించి. ఆమె ఉబ్బి తబ్బిబ్బయిపోయి, భోజనానికి రమ్మని పిలించింది”

“అంతా కన్ఫ్యూజ్ గా ఉంది. మన పెళ్లి రోజు విని ఆమెగారు ఉబ్బితబ్బిబవడం దేనికోయ్?”

“చెప్పేది పూర్తిగా వినండి. ఇది మన ముప్పై మూడవ పెళ్లిరోజు కదా! ఈరోజుల్లో మారుతున్న పరిస్థితుల్లో ఇన్నేళ్ళ పాటు కలిసి ఉండటం చూస్తుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది అక్కాయ్. మీరిద్దరూ భోజనానికి వచ్చి మా పెద్ద పిల్లను ఆశీర్వదించండి’ అని రెండు చేతులూ పట్టుకుంది”

అప్పుడు భార్య సంభ్రమం నుండి తనను తను దూరం చేసుకుంటూ అన్నాడతను- “కొంచెం ఎమోషనల్ లాగుంది వినోదిని గారు. మరి ముగ్గురుండగా పెద్దకూతుర్ని ఆశీర్వదించడానకి పిలవడం దేనికి?”

“కారణమేమిటో తెలియదు గాని, ఆ పిల్ల పెళ్లి చేసుకోనంటుందట! వస్తూన్న సంబంధాలన్నిటినీ వరసగా తిరస్కరిస్తుందట”

“ఇందులో పెద్ద మిస్టరీ యేముందని— ఆ పిల్ల మనసులో ఇష్టమైనవాడెవడో గూడు కట్టుకుని ఉంటాడు!“

“లేదు. విషయం అది కాదు. ఆమెది కొంచెం విచిత్రమైన మనస్తత్వం లాగుంది. తన పెళ్లి కోసం అప్పో సప్పో చేయనవసరం లేదంటుంది. ఏదో ఒక మార్గాన తన కాళ్ళపైన తను నిలబడగలనంటుంది. ముందు చెల్లినీ తమ్ముణ్ణీ బాగా చదివించమంటుంది. తను ఉద్యోగంలో కుదిరేంత వరకూ తల్లికి తోడుగా ఉంటానంటుంది”

“గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందా?”

ఆమె కాస్తంత ఆగి బదులిచ్చింది- “లేదు. పియుసీ వరకు చదివిందట--”

”నువ్వు చెప్తున్నమాటల్ని బట్టి చూస్తే మంచి పిల్లనే తోస్తుంది. రేపు యెలాగూ వెళ్లబోతున్నాంగా!” అంటూ లేచాడు రామరాజు.

***3***

అనుకున్న ప్రకారం ఉదయమే లేచి స్నానాలు కానిచ్చి భార్యాభర్తలిద్దరూ కారులో బల్కంపేట అమ్మవారి గుడి చేరుకున్నారు. ప్రధాన అర్చకునికి పూలూ, పళ్లూ, కొబ్బరికాయా సమర్పించి పిదవ కుంకుమార్చన జరిపించి గుడి ఆవరణలోకి వచ్చారిద్దరూ-- బయట గుడి ట్రస్ట్ వారు భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించిన చీరలు వరసలు పేర్చి అమ్మకానికి పెట్టారు. వాళ్లు అమ్మకం ద్వారా వచ్చిన నగదు గుడి నిర్వహణకు ఖర్చు పెడతారు, తమలాగే గుడి దర్శనానికి వచ్చిన స్త్రీలు కళ్ళ కద్దుకుని కొనుక్కుంటున్నారు. అది చూసి రామరాజు అన్నాడు- “వినోదిని గారి పెద్దమ్మాయికి ఒక చీర ఇద్దామా!

”భర్త ఆలోచనకు సీతాదేవి కళ్లు వికసించాయి. “మంచి ఐడియా!” అంటూ త్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్లి ఒక చీర యెంపిక చేసింది. రామ రాజు డబ్బులివ్వడానికి పర్సు తెరవబోయేంతలో సీతాదేవి అడ్డు వచ్చి తన వద్ద నగదు ఉందంటూ ఇచ్చి చీరను ప్యాక్ చేసుకుని వచ్చింది. దానితో బాటు మరవకుండా గుడి ట్రస్ట్ వారు పంపిణీ చేస్తూన్న ప్రసాదాన్ని కూడా అందుకుని గుడి ముఖద్వారం వద్ద వరుస కట్టి కూర్చున్న వృధ్ధ భిక్షువులకు చిల్లర డబ్బులు విదిలించి- “ఇక వెళ్దాం రండి” అంటూ కారు వైపు నడిచింది.

ఇల్లు చేరుకుని టీ కలుపుకుని తాగుతున్నప్పుడు ఫోన్ మ్రోగింది. ఇంగ్లాండ్ నుంచో అమెరికా నుంచో వచ్చుంటందనుకుంటూ ఫోను అందుకున్న రామరాజుకి ఆస్త్రేలియానుండి వచ్చిందది. అతడి చెల్లెలు భాగ్యవతి చేసింది. “నీ పెళ్లిరోజు శుభాకాంక్షలురా అన్నయ్యా! గుడికి వెళ్ళొచ్చావా? ఆరోగ్యం చూసుకుంటున్నవా?”

“థాంక్యూ వెరీ మచ్ రా అమ్మడూ! ఇప్పుడిప్పుడే గుడికి వెళ్ళొచ్చాం, నేనూ మీ వదినాను. మరి నువ్వెలాగున్నావు? ముఖ్యంగా బావగారెలా ఉన్నారు? అంతా సౌఖ్యమే కదా!”

“అదంతా తీరిగ్గా చెప్తాను గాని— ముందు నీ మేనల్లుళ్లిద్దర్నీ పలకరించు. నీకు విష్ చేస్తామంటున్నారు. ఆతరవాత మీ బావగారూను—“ అతడలాగే అంటూ మేనల్లుళ్ళ శుభాకాంక్షలు అందుకుని ఆ తర్వాత బావగారి నుండి కూడా శుభాకాంక్షలు అందుకుని చెల్లికి గుర్తు చేసాడు- “మరి మీ వదినకు బెస్ట్ విషెస్ చెప్పవా!”అని.

బాగ్యవతి అరనిమిషం ఆగి- “అలాగే! పిలు మరి--“ సీతాదేవి పరుగు వంటి నడకతో వెళ్లి ఫోన్ అందుకున్న వెంటనే అటునుంచి- “బెస్ట్ విషెస్ వదినా!” అంటూ ఫోను పెట్టిసింది భాగ్యవతి. భార్య ముఖాన చెరిగిపోయిన నవ్వు తెరను గమనించిన రామరాజు విప్పీవిప్పని పెదవులతో కదలి వెళ్లేంతలో కొడుకులిద్దరి నుండీ ఫోన్లు వచ్చాయి. ఈసారి సీతాదేవి మోము పౌర్ణమిలో విచ్చుకున్న కమలంలా విచ్చుకుంది. ఒకరి తరవాత ఒకరుగా కొడుకులూ, కోడళ్లతో తనివిదీరా మాట్లాడుతూ, భర్తను పిలిచి మాట్లాడమని సైగ చేసింది. ఇప్పుడు ఇల్లు ఒక్కసారిగా కళ కట్టింది. చైతన్యవంతమైన నింగిలా వెలుగు కట్టింది. ఆ మాటకొస్తే చెల్లి భార్యతో ముభావంగా ముక్తసరిగా ఉండటం కొత్తేమీ కాదుగా! చాలా చోట్ల తెలుగింటి ఆడపడుచుల వ్యవహారం అలానే ఉంటుంది మరి- కారణం ఉన్నా లేకపోయినా--

***4***

సరిగ్గా పన్నెండుకి దంపతులిద్దరూ వినోదిని వాళ్ళ ఇంటికి బయల్దేరారు. కారు తీసుకోకుండా నడకతోనే సాగి ఇల్లు చేరు కున్నారు. ఇంటిల్లిపాదీ వాళ్ళ రాక కోసమే యెదురు చూస్తున్నట్టున్నారు. వాళ్లను గుమ్మం వద్ద చూసిన వెంటనే కైమోడ్పులతో ఎదుర్కోలు పలికారు. ఆడవాళ్లకున్న సహజ ప్రవృత్తి ప్రకారం పెద్ద కుమార్తె శ్వేత అతణ్ణి పెదనాన్నంటూ ఆమెను పెద్దమ్మా అంటూ వరసలు కలిపేసింది. మొదట రవ్వంత విస్మయానికి లోనయినా రామరాజుకి ఆ పిల్ల కలివిడి చూసి ముచ్చటేసింది. హాలులోకి వెళ్లి కూర్చుంటూ శ్వేతను పరీక్షగా చూసాడు. శరీర సౌష్ఠవానికి తగ్గ పొడవు, కళైన ముఖాన కుంకుమ బొట్టూ, గంధపు రేఖా నిండుదనం చేకూరుస్తున్నాయి. కళ్లలో స్వఛ్ఛత తొణికిసలాడుతూంది.


మంచితనమూ మనసున స్వఛ్ఛతా ఉంటే అందం నేవళంతో తులతూగుతూ ఉదయకాలపు వికసిత పుష్పంలా ఉంటుంది. వినోదిని భర్త గోవిందు కూడా కూతురు తీర్చిన బాణీ అనుసరించి రామరాజుని అన్నగారూ అని పలకరించాడు. వినోదిని యేమో “పెదబావగారూ!”అని సంబోధించనారంభించింది. రామరాజుకి మనసు ఉన్నపాటున ఆర్ద్రత చెందింది; అదేదో స్వంత కుటుంబంలో ఉన్నట్టు పీలవుతూ -- కొడుకులిద్దరూ కోడళ్లతో ఉన్నప్పుడు తమ ఇల్లు కూడా ఇలానే కళకళగా ఉండేది. వెలుగు వెల్లువలా ప్రకాశించేది. జీవిత తత్వమే అంతే మరి— ఒకటి దొరికితే మరొకటి కళ్లముందే దాటిపోతుంటుంది. చేజారిపోతుంటుంది. మంచి స్థాయి, మంచి బ్రతుకులు వెతుక్కుంటూ కొడుకులిద్దరూ అమెరికా దరి చేరి పోయారు బార్యా బిడ్డలతో. వాళ్ల పోకతో పాటు కలివిడి తగ్గింది. వెలుగు కూడా తగ్గింది. కనీసం చెల్లీ, మేనల్లుళ్ళిద్దరూ తమతో ఉంటే బాగుణ్ణు. కానీ కుదరదుగా! వాళ్ళ వాళ్ల బ్రతుకులు వాళ్ళ వాళ్ల జీవన విధాలు వాళ్ళకుంటాయిగా! అలా ఆలోచిస్తున్నప్పుడు శ్వేత వచ్చి మర్యాదగా ప్లేటు చాచి నిమ్మరసం గ్లాసు అందించింది. గ్లాసుని అతడు అందుకున్న తర్వాత సీతాదేవి కూడా అందుకుని గుడి నుండి తెచ్చిన చీరను ప్యాకెట్లు నుంచి తీసి శ్వేతకు అందించింది. అది అమ్మవారికి కట్టబెట్టిన చీరని తెలుసుకున్న వెంటనే వినోదిని కూతురు వద్దనుండి లాక్కుని కళ్లకు హత్తుకుంది. అది చూసి శ్వేత కూడా కళ్లకు హత్తుకుంటూ అంది- “నేను పెద్దదాన్నయి ముసల్దానయేంతవరకూ ఈ చీరను ఇలానే భద్రంగా ఉంచుకుంటాను”

అప్పు డు అదును చూసి అందుకున్నాడు రామరాజు “అదెలా పెద్దదానివవుతావు? అదెలా ముసల్దానివవుతావు పెళ్లవకుండానే-- ?”

ఆ మాట విన్నంతనే శ్వేతకు దిగ్గుమంది. వీళ్లకెలా తెలుసు తను పెళ్లి చేసుకోనంటుందని! ఆమె బిత్తర చూపులు గమనించిన రామరాజు ఈసారి మరొక బాణం విసిరాడు. ”ఇంటికి పెద్ద పిల్లగా బాధ్యతల్ని స్వీకరిస్తాననడం సబబే! లౌకికం గల ఆలోచనే! చెల్లినీ తమ్ముణ్ణీ చదివిస్తానని ప్రతిన పూనడం కూడా సబబే-- కాని యేకంగా పెళ్ళే వద్దనడంలో యేం న్యాయం ఉంటుంది? అమ్మానాన్నలకు కడుపు కోతగా మారదా! నీకు పెళ్లి కాకుండానే రేపు నీ చెల్లికి పెళ్లయిందనుకో.. మీ అమ్మా నాన్నా యెంతటి క్షోభకు గురవుతారో ఆలోచించావా? అంతదూరం యెందుకు? నీ ఈడు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోతుంటే- కళ్ళముందు తల్లుల్లయి పోతుంటే వాళ్ళు యెంతటి బాధకు లోనవుతారో ఆలోచించావా?”

అది విని ఓసారి అమ్మానాన్నల ముఖాల వేపు చూసి యెట్టకేలకు శ్వేత బదులిచ్చింది- “నేను పెళ్లే చేసుకోననటం లేదు. ఉద్యోగంలో చేరుతాను. కాస్తంత సంపాదించిన తర్వాత పెళ్లి గురించి ఆలో చిస్తానంటున్నాను. చెల్లి తమ్ముళ్ళ చదవులు కుంటు పడకుండా సాగిపోయేలా చూడాలంటున్నాను, రెండు మూడేళ్ళలో రిటైర్ కాబోయే నాన్న గురించి కూడా ఆలోచించాలంటున్నాను. ఇది తప్పా పెదనాన్నగారూ?”

ఆమాట విన్నంతనే రామరాజు చెళ్ళున చేతి వ్రేళ్లు విరిచాడు- “హియర్ యూ గాట్ ఎ పాయింట్. అలాగన్నావూ, బాగుంది. ఇప్పుడు దీనికి బదులియ్యి. నువ్వు యేమైనా ప్రొఫెషనల్ కోర్సును చేసావా? షార్టు హ్యాండ్.. కంప్యూటర్ సిస్టమ్.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్- బ్యాంకింగ్ ఆపరేషన్స్- ఇటువంటివి యేవైనా నేర్చుకున్నావా?”

ఆమె తల అడ్డంగా ఆడిస్తూ అంది- “లేదు పెదనాన్నగారూ! నా చదువుకి తగ్గ ఉద్యోగంలో చేరి వీటిని నేర్చుకోవాలని— ఆ వచ్చే సంపాదన వల్ల ఈ కోర్సుల ఖర్చు భరించవచ్చుకదా-- అందుకని--“

“బ్రిలియంట్ ఐడియా! మంచి ఆలోచన. కాని పూర్వానుభవం లేకుండా నీకున్న చదువుకి ఉద్యోగం ఇప్పటికిప్పుడు దొరకడం కష్ఠమేనేమో! ఐనా మనసుంటే మార్గం ఉండకపోతుందా! ఇప్పుడు నువ్వొక పని చేయి. మొదటి దశలో నా వద్ద చేరు. నేను మ్యూచువల్ ఫండ్సు- బాండ్సు- ఫిక్సడ్ డిపాజిట్స్- కొద్దిపాటి షేర్లతో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాను. ఈ విషయమై బ్యాంక్సుకి, పోస్టల్ డిపార్టుమెంటుకీ వెళ్లాల్సి ఉంటుంది. నాతో బాటు కలసి పని చేయి. నేను నీకు ఇంగ్లీషు అనర్ఘళంగా వచ్చేటట్టు చూస్తాను. బ్యాంక్ మేనేజర్ల వద్దకు తీసుకెళ్లి యెలా మాట్లాడాలి, ఇష్యూస్ ని యెలా పరిష్కరించాలో చెప్పి చూపిస్తాను. అంతే కాదు. మరొకటి కూడా ఉంది. మీ పెద్దమ్మగారున్నారే తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేట్ . ఒక్కప్పుడు తెలుగు లెక్చరర్ కూడాను. ఇప్పుడు కథలూ కవితలూ వ్రాస్తుంటారు. సాహిత్య సభల్లో ప్రసంగాలు కూడా చేసి వస్తుంటారు. అప్పుడప్పుడు పారితోషికాలు, బహుమతులు కూడా అందుకుంటుంటారు. ఆమెనుండి కూడా కొన్ని ఉపయోగకరమైన అంశాలు నేర్చుకోవచ్చు, నేర్చుకున్నదేదీ ఊరకే పోదుగా! ఆలస్యం చేయకు. రేపే వచ్చి చేరు. ఏమంటావు?”

శ్వేత బదులివ్వలేదు. చేతిలోని చీరను తల్లికి అందించి మౌనంగా ప్రణమిల్లి రామరాజు పాదాలకు నమస్కరించింది. ఆ తర్వాత సీతాదేవికి కూడా నమస్కరించింది. శ్వేత తల నిమురుతూ సీతాదేవే అడిగింది- “మరి మీ చెల్లినీ తమ్ముణ్ణీ మీ పెదనాన్నగారికి చూపించవా!”

“సారీ! వాళ్ళను పిలవడం మర్చేపోయాను” అంటూ లోపలకెళ్ళి పెరట్లో ఉన్న వాళ్ళిద్దర్నీ తీసుకు వచ్చి- 'చెల్లి పేరు- కాంతిమతి, తమ్ముడి పేరు భవానీశంకర్' అని పరిచయం చేసింది. వాళ్ళ తల్లి కనుసైగ అందుకున్న పిల్లలిద్దరూ రామరాజు దంపతులిద్దరి కాళ్లకు నమస్కరించారు. రామరాజు కొన్ని క్షణాల వరకూ చెల్లీ తమ్ముళ్లిద్దర్నీ కన్నార్పకుండా చూసాడు. తెచ్చిపెట్టుకున్నతనం, భేషజం ఏమాత్రమూ లేని ఆ కుటుంబం అతడికి నచ్చింది. చిరు ప్రాయంలో చెంగు చెంగున లేచే కొడుకులిద్దరి హడావిడితో, ఓణీ దావిణీతో ఇల్లంతా కలయతిరిగే చెల్లి భాగ్యవతి కిలకిలలతో తమిల్లు కూడా అలానే ఎంత నిండుగా ఉండేదని.. ఇప్పుడున్నది పూదోటే— కాని పూలు లేని తోట పూదోట యెలా అవుతుంది? భోజనాలయి తాంబూలాలు తీసుకోవడం పూర్తయిన తర్వాత సీతాదేవి దంపతులిద్దరూ వినోదిని దంపతుల నుండి వీడ్కోలు పుచ్చుకుని రోడ్డుపైకి వచ్చారు. శ్వేతమాత్రం వాళ్ళతో కొద్ది దూరం నడిచి వచ్చింది. కొద్ది దూరం అలా నడుస్తూ వచ్చి అడిగిందామె- “మిమ్మల్ని పెదనాన్న, పెద్దమ్మ అని వరస కట్టి పిలిచినందుకు కోపం కలగలేదు కదా!”

భార్యాభర్తలిద్దరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసారు. ఈ అమ్మాయి ఇంత సెన్సిటివ్వా! ఈ అమ్మాయేంటి, ఇప్పటి అమ్మాయిలు చాలామంది ఇలానే ఉన్నట్టున్నారు మరి! చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఆక్రందనలతో అమితమైన అక్కర చూపిస్తారు.. వీళ్ళతో బహు నాజూకుగా మెసలాలి; కర్రా విరక్కూడదు, పామూ చావకూడదన్న రీతిన. సీతాదేవి, శ్వేత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. “కోపం యెందుకూ? ఇంకా చెప్పాలంటే సంతోషంగా ఉంది, మా ఇద్దరితోనూ పెదనాన్న, పెద్దమ్మ వరసలు కలిపి సత్కరించినందుకు!” అని శ్వేత నుదుట ముద్దు పెట్టుకుని ఇక ఇంటికి వెళ్ళమని సాగనంపింది.

ఇద్దరూ మరికాసేపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత సీతాదేవి భర్తను అడిగింది- “మీకెలా అనిపించింది?”

“నథింగ్ మోర్ నథింగ్ లెస్— నీకెలా అనిపించిందో నాకూ అలాగే అనిపించింది. థేంక్స్”

‘ ఎందుకూ?’ అన్నట్టు రామరాజు కళ్ళల్లోకి చూసిందామె.

“మన పెళ్లిరోజుని పసందైన రోజుగా మార్చినందుకు”

ఆమె నవ్వి అతడి చేతిని చేతిలోకి తీసుకుని నిమిరింది.

***5***

మరునాడు ఉదయం యెనిమిదింటికే శ్వేత, వాళ్ళ ఇంటి డోర్ బెల్ నొక్కి తన హాజరుని రూఢి చేసుకుంది. గుమ్మం వద్ద నిల్చున్న ఆ అమ్మాయిని చూసి దంపతులిద్దరూ నవ్వకుండా ఉండలేక పోయారు.

“కార్యాలయం వర్కింగ్ అవర్స్ లా ఇంత ఠంచనుగానా హాజరు పలకడం! పది ప్రాంతాన వస్తే చాలదూ?” అంటూ సీతాదేవి ఆమె భుజంపై చేయి వేసి లోపలికి తీసుకు వెళ్ళింది.

“సారీ పెద్దమ్మా! మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. నిజానికి నేను ఇక్కడకు తిన్నగా రాలేదు. మొదటి రోజు కదా! గుడికి వెళ్ళాను. అక్కణ్ణించి మీకు ప్రసాదం తీసుకు వచ్చాను. తీసుకోండి” అంటూ ప్రసాదం అందించింది.

“అమ్మవారి గుడికెళ్ళొచ్చావనుకుంటాను” అంటూ తను కొంచెం తీసుకుని మిగతాది భర్తకు అందించింది. అప్పుడు రవంత సేపు తరవాత శ్వేత అంది- “మీరిద్దరూ లోపలకు వెళ్ళి ఏవైనా పనులుంటే చూసుకుని రండి పెద్దమ్మా! నేనంత వరకూ హాల్ లో కూర్చుంటాను”

“లోపల మాకేమీ పనుల్లేవు. నువ్వు నాతో లోపలకురా! టిఫిన్ చేయడంలో చేయూతనివ్వు. వీలుంటే వంటలో నీ పనితనం చూపించు” అంటూ శ్వేతను చేయి పట్టుకుని లోపలకు లాక్కెళ్ళింది.

టిఫిన్- పెసరట్టు ఉప్మా.. అందరూ తినడం పూర్తి చేసిన తర్వాత సీతాదేవి శ్వేతను తన అధ్యయన అర లోకి తీసుకు వెళ్ళింది. గది నలువైపులా పుస్తకాల దొంతర్లే! అది చూసి కళ్లు పెద్దవి చేసుకుని అడిగింది “ఇవన్నీ మీరు చదవాలా పెద్దమ్మా?”

“ఇప్పటికి సగం పుస్తకాలు చదవడం పూర్తిచేసాను. మిగతావి పూర్తిచేయడానికి ఇంకెన్నాళ్లు పడతుందో! కానీ ఓపిక పట్టి చదివే తీరాలి. ఎందుకో తెలుసా?”

ఎందుకన్నట్టు కళ్ళెత్తి చూసింది శ్వేత.

“నాకోసం నేను చదవాలి. చదవకపోతే వ్రాయలేను. ఏమీ చదవకుండా వ్రాస్తూపోతే పస ఉండదు గనుక” అంటూ యెదుట కూర్చోమని చెప్పి, డి టీ పీ చేసిన ప్రింటెడ్ కాపీలను యెలా మడచి కవరులో పెట్టాలి, యెన్ని పేజీలకు యెంత బరువుంటుందో తెలుసుకుని దానికి తగ్గట్టు పోస్టల్ స్టాంపులు యెలా తగిలించాలో వివరించింది. సీతాదేవి మార్గదర్శకం చేసినట్టే కవర్లపైన పెద్దవిగా కనిపించేలా పత్రికల విలాసాలు వ్రాసి కథల కాపీలను వాటిలో ఉంచి ఆ తరువాత ఏమి చేయాలన్నట్టు సీతాదేవి వైపు చూసిందామె.

“పోస్టు చేయాలి. కాని ఈ చుట్టుప్రక్కల పోస్టు బాక్సు యెక్కడా లేదు. మనమే ఒక అర కిలోమీటరు వరకూ నడిచి వెళ్లి, సనత్ నగరు పోస్టాఫీసులో పోస్టు చేసి రావాలి”

“అలాగే పెద్దమ్మా! పోస్టాపీసు యెక్కడుందో చెప్పండి. నేను పోస్ట్ చేసి వస్తాను“

“అలాగే చేద్దువు గాని.. కానీ ఈ రోజు నుంచి కాదు. ఈరోజు మనిద్దరం కలిసే వెళ్దాం. నాకు ఓపిక చిక్కబెట్టుకోలేనప్పుడు నువ్వు వెళ్లి వద్దువు గాని! ఈలోపల నువ్వు మీ అంకుల్ గారి వద్దకు.. సారీ మీ పెదనాన్నగారి వద్దకు వెళ్లిరా! ఆయన తన మినీ ఆపీసు రూములోకి వెళ్లినట్టున్నారు”.

శ్వేత అలాగేనంటూ గది బైటకు వెళ్లి కంప్యూటర్ నొక్కుడు చప్పుడు వినవస్తూన్న గదిలోకి ప్రవేశించింది “గుడ్ మోర్నింగ్ పెద నాన్నాI”అంటూ.

రామరాజు కూడా శుభోదయం పలికి, తనకు సమీపంగా కూర్చోబెట్టుకొని ఆన్లైన్ ట్రాన్సేక్షన్ల గురించి వివరించాడు. పాస్ వర్డుకి ఉన్ని ప్రాముఖ్యత గురించి- దానిని అప్పుడప్పుడు మార్చవలసిన ఆవశ్యకత గురించి వివరించి ఆమె అప్ డేట్ చేయాల్సిన రిజష్టర్లను ఆమె ముందుంచాడు. మ్యూచువల్ ఫండ్స్- బాండ్సు-షేర్స్-ఫిక్సెడ్ డీపోజిట్స్- డిబేంజర్సు.. అలా అన్ని రిజష్టర్లూ ఆమెకు చూపించి వాటిని యెలా పూర్తి చేసి డేటాలో పెట్టాలో తరవాత చెప్తానని వివరించి, బ్యాంకుకి వెళ్ళే సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తూ లేచాడు రామరాజు. అప్పుడు సందేహిస్తూనే లేచి నిల్చుని అందామె- “నేను పెద్దమ్మతో పోస్టాఫీసుకి వెళ్ళి కవర్స్ పోస్ట్ చేయాలి పెదనాన్నా!”

”దానికేం? నేను వెళ్ళేది అటువేపేగా! అక్కడ ఉత్తరాలు పోస్టు చేసింతర్వాత మీరిద్దరూ నాతోబాటు బ్యాంకుకి వద్దురుగాని. గంటా- గంటన్నర లోపున పని పూర్తయి పోతుందిలే! దెన్ గెట్ రెడీ!”అంటూ లేచాడు.

రామరాజు సూచన ప్రకారం ముగ్గురూ మొదట సనత్ నగర్ పోస్తాపీసుకు వెళ్లి, పిదప తిన్నగా బ్యాంకు చేరుకున్నారు.

బ్యాంకులో రామరాజు ఆపరేషన్స్ మేనేజరుతో మాట్లాడుతున్నప్పుడు శ్వేత కళ్లప్పగించి కూర్చుంది. అతడు మొదట తెలుగులోనూ, తరవాత ఆంగ్లంలోనూ సంభాషణ కొనసాగించాడు. ఏ భాషలో మాట్లాడినా పట్టు సడలించకుండా మాట్డాడాడు. మిక్కిలి ఆత్మవిశ్వాసంతో మాటలు కలిపాడు. ఏ భాషలోనైతేమి, బిజినెస్ ప్రపంచంలో తడబాటుకి చోటివ్వకుండా ఆత్మవిశ్వా సంతో మట్లాడటమే ముఖ్యమని తోచిందామెకు. అంతటి ఆత్మవిశ్వాసం కలగాలంటే విషయ పరిజ్ఞానంతో బాటు భాషపై పట్టు కూడా సంపాదించాలి. ఇకపైన ఆమె తెలుగు పుస్తకాలు సమృద్ధిగా చదవాలి, పిమ్మట ఆంగ్ల పుస్తకాలు కూడాను. ఏది యేమైతేనేం? మొదట మాతృభాషలోనే కదా పట్టు సాధించాలి! అటు పిమ్మట తతిమ్మా భాషలు తమకు తాముగా వచ్చి పిలుపందుకున్న గువ్వల్లా ఇంటి ముంగిట వాలవూ! అటువంటి పట్టు సాధించడానికి సీతాదేవి పెద్దమ్మ, సరస్వతీదేవిలా వెతకబోయిన తీగలా తన యెట్టెదుట ఉండనే ఉందిగా!

అప్పుడు ఆమె లేత ఆలోచనలకు మెలి తిప్పుతూ యేదో అంతరార్ధం ఉన్నవాడిలా రామరాజు అన్నాడు- “ఎప్పుడైనా యెక్కడికైనా వెళ్ళేటప్పుడు మన చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. ఓపిక తెచ్చుకోవాలి. చర్చించబోయే మేటర్ పైన హోమ్ వర్కు చేయాలి. అప్పుడే మనం విషయంపైన నొక్కి ఒక్కాణించగలం. ఎదుటు వారికి మనపైన విశ్వాసం కలిగించగలం”

***6***

ఆరోజు శుక్రవారం. శ్వేత సీతమ్మకు తోడుగా ఆస్పత్రికి వెళ్లింది. లేబ్ టెస్టులు, బి.పి పరీక్షలు, షుగర్ లెవల్ టెస్టులూ ఐన తరవాత బయటికి వచ్చిందామె. శ్వేత యెదురు వెళ్ళి అడిగింది “పరీక్షలన్నీ ఐపోయాయా పెద్దమ్మా? మరిప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్దామా?”

ఆమె తల అడ్డంగా ఆడించి “లేదు. అన్ని టెస్టుల రిపోర్టులన్నీ ఇప్పటిప్పుడు దొరకవు. కొన్ని రేపు లభిస్తాయి. అప్పుడు డాక్టరుగారి వద్దకు వెళతాను. ఎంతోమంది పేషెంట్లు వచ్చి పోతుంటారు. వాళ్ళందరి రిపోర్టులూ తయారు చే సుకోవడానికి లేబ్ అసిస్టెంట్లకు కూడా వ్యవధి కావాలిగా! మరొక గంటన్నరా రెండు గంటల తరవాత మళ్లీ రావాలి పోస్ట్ లంచ్ బ్లడ్ ఇవ్వడానికి--” అంటూ డయోగ్నస్టిక్ సెంటరు నుండి బయటకు నడిచింది. శ్వేత ఆమెతో పాటు నడుస్తూనే ముఖంలోకి తేరిపార చూస్తూ అడిగింది “ఇన్నిసార్లు రక్తం ఇచ్చేటప్పుడు మీకు నొప్పి పెట్టదూ!”

దానికి సీతాదేవి నవ్వింది “ఈ ప్రపంచంలో నొప్పి లేనిదేముంది? సుఖమెలా ఉంటుందో నొప్పి కూడా ఒకింత అలాగే ఉంటుంది. ఇవి రెండూ విడదీయలేని కవల పిల్లలు”.

శ్వేత కాసేపు నిశ్శబ్దం గా నడచి చటుక్కున ఆగింది. “నేనొకటి అడగనా పెద్దమ్మా?”

నడుస్తూనే 'ఉఁ' అందామె.

“మీరు చూడటానికి నిండుగా ఉంటారు. అందులో ఈ వయసులో.. ఇకపోతే మంచి యాక్టివ్ గానూ ఉంటారు. మరి మీకు ఇన్ని రోగాలా?”

సీతాదేవి పంటి బిగువన నవ్వాపుకుంటూ అడిగింది “ఎవరు చెప్పారు నాకన్ని రోగాలున్నాయని? చాలా మంది లాగే కొంచెం గైనిక్ ప్రోబ్లమ్”

“మరిన్ని టెస్టులు తీసుకున్నారూ--” శ్వేతలో కనిపిస్తూన్న ఉత్కంఠ గమనించి సీతాదేవి మురిపెంగా నవ్వింది. తన కడుపున ఇద్దరూ మగ కుర్రాళ్ళే! ఆడపిల్ల గాని పుట్టి ఉంటే శ్వేతలాగే తనకు చేదోడుగా ఉంటూ తన పక్కన నడుస్తూ వస్తుందేమో! పెద్దమ్మా అనే బదులు తనను అమ్మా అని పిలిచేదేమో! “చెప్తాను. ఓపిగ్గా వింటావా!”

నవ్వుతూ బుర్రూపింది శ్వేత; ఎందుకు విననూ అన్న భావ వ్యక్తీకరణ ముఖాన చూపిస్తూ-.

“ఐతే విను. మొదటి కారణం ముందస్తు జాగ్రత్త. ఇక రెండవది- ఇదే అసలు కారణం. యోగ పురుషుడు పతంజలి చేసిన ఉద్బోధ. ఇది నేనెప్పటికీ మరచిపోలేను. ఇకపైన నువ్వు కూడా మర్చిపోకూడదు. ఆయనేమంటున్నారంటే, సూటిగా పదునుగా- ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా- చివరకు మనుష్యావతారం యెత్తిన మహాపురుషుడు అయినా సరే-- ఏదో ఒక దశలో దు:ఖాన్ని అనుభవించే తీరాలట. ఆ దు:ఖం నుండి తప్పుకునే ప్రసక్తే లేదట. కాని ఈ విషయంలో ఆయన చిన్నపాటి వెసులుబాటు ఇచ్చారు. అదేమంటే— ఏదో ఒక దశన యెదుర్కోబోయే దు:ఖాన్ని తగ్గించుకోవచ్చట. అలా దు:ఖాన్ని తగ్గించుకోవడానికి అడ్డదారి లేదు. జీవన మార్గాన్ని సరళీకృతం చేసుకుంటూ క్రమశిక్షణతో యోగాభ్యాసం చేస్తూ ముందుకు సాగాలట”

“మరి మీరు చేస్తున్నారా పెద్దమ్మా!”

“ఎందుకు చేయడం లేదూ! యోగంలో శారీరకమైన వ్యాయామం మాత్రమే కాదు— మానసికమైన ఆత్మ పూర్వకమైన ధ్యానం కూడా ఇమిడి ఉంటుందనేది విస్మరించకూడదు. ఈ రెండూ కలసి చేస్తేనే పతంజలి యోగ సూత్రం పాటించినట్లన్నమాట! ఉదాహరణకి- స్త్రీలకు అనుకూలమైన ఆకర్ణ ధనురాసనం- అర్థ మత్స్యేంద్రాసనం— వీటిని తాముగా అభ్యాసానికి ఉపక్ర మించకుండా గురువుగారి మార్గదర్శకంతో, లేదా ఒక అనుభవమున్న సీనియర్ సమక్షంలోనో చేయడం మంచిది. సరే ఇక చాలించి అదిగో అటు వెళ్తూన్న ఆటోరిక్షాను పిలు. ఇల్లు చేరాలి. ఫలహారం తినాలి. బ్లడ్ టెస్ట్ కోసం మళ్లీ రావద్దూ?”

“అలాగే పిలుస్తాను పెద్దమా! మరి దీనికి మాత్రం వివరణ ఇవ్వండి. మానసికమైన ధ్యానం కలబోసి యోగం చేయడమంటే?“

“మరేమీ లేదు. పుట్టుకతోనే మనిషికి కొన్ని అవలక్షణాలు దుంపల చుట్టూ మొలుచుకొచ్చే పిలకల్లా పుట్టుకు వస్తాయి. అవి మనకు తెలియకుండానే మనలో పుట్టుకు వస్తాయి. వాటిలో కొన్ని హింస- అసూయ- క్రోధం- అత్యాశ.. ఇటువంటి అవలక్షణాలను పూర్తిగా విసర్జించలేక పోయినా వాటిని కచ్చితంగా తగ్గించుకోవడం ముఖ్యం. కొన్ని మందులు తీసుకుంటే మనం పథ్యం పాటించమూ! అలాగే యోగాసనం చేయాలంటే మానసిక విశుధ్దత కూడా పాటించాలి. అప్పుడే మానసిక సన్నద్ధత కూడా లభిస్తుంది. నాకు తెలిసినవన్నీ నీకు నేర్పుతాను! ఇక ఆటో రిక్షాను పిలుస్తావా!”

శ్వేత ఇక మాట్లాడకుండా “సారీ పెద్దమ్మా! నువ్వు చెప్తున్నది ఇంకా ఇంకా వినాలిపిస్తేనూ..” అంటూ అటు పోతూన్న ఆటో రిక్షాను పిలిచింది.

***7***

అనుకున్న ప్రకారం సీతాదేవి రెండు గంటల యెడబాటు తర్వాత, శ్వేతను వెంటబెట్టుకుని ల్యాబ్ కి వెళ్లి పోస్ట్ లంచ్ బ్లడ్ టెస్టుకి రక్తం ఇచ్చి, వచ్చేటప్పడు దారి మధ్యలో ఉన్న సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుని బిల్ కౌంటరు వద్దకు వెళ్ళే ముందు శ్వేతను అడిగింది- “నీకేమైనా కావాలా? షాంపూ కావాలంటే తీసుకో” “ఇప్పటికది ఇంట్లో ఉంది పెద్దమ్మా!మరి మీరు తీసుకోలేదు—”

“ఔను తీసుకోలేదు. ఎందుకంటే నేను సాధారణంగా మార్కెట్ లో దొరికే కాస్మోటిక్స్ ఉపయోగించను. అలాగని వేటినీ ఉపయోగించ కూడదన్న వైరాగ్యంతో మాత్రం కాదు. టాల్కమ్ పౌడర్ తప్ప మిగతావన్నిటికీ సహజమైన దినుసులనే ఉపయోగిస్తాను. తలంటు స్నానానికి కుంకుడు కాయలు- ఒంటికి పసుపు- దీనిని యెక్కువగా వాడతాను. ఇందులోని సువాసన నాకిష్టం”.

బిల్లింగ్ చేసిన సామాను అందుకుంటూ శ్వేత అడిగింది- “మరి ఫేస్ తాజాతనానికి?”

ఆ ప్రశ్నకు సీతాదేవి నవ్వింది. “వాడతాను. సహజమైన దినుసులతోనే పేస్ ప్యాక్ చేసుకుంటాను. పెరుగు- పసుపు- పళ్ల రసం- తేనె- ఇంకా అప్పటికి అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగంలోకి తెచ్చుకుం టాను. అప్పుడప్పుడు కలబంద తేనె సమపాళ్ళలో కలుపుకుని ఆ మిశ్రమంలో మెత్తని దూది ముంచి ముఖానికి రాసుకుంటాను. తేనె కలబందలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. ఇలాగంటున్నానని నువ్వు మరీ అనుమానంగా చూడకు. మార్కెట్లులోని కాస్మోటిక్స్ మంచివి కావని చెప్పడం నా ఉద్దేశ్యం కానే కాదు. ఒక్కొక్కరికీ ఒక అనుభవం ఉంటుంది. అదే విధంగా ఒక ఉద్దేశ్యం కూడా ఉంటుంది. ఉదాహరణకి కెమికల్స్ తో తయారు చేసిన వస్తువుల్లో కొన్ని కెమికల్స్ ఉండవచ్చు. నా అభిప్రాయం యేమంటే— ఇవి అందరి స్కిన్ టోన్ కి నప్పకపోవచ్చు. అందరి విషయంలోనూ ఒకేలా పని చేయకపోవచ్చు. దీనికి మంచి టెస్ట్ కేస్- సబ్బులు. అందరికీ అన్ని సబ్బులూ ఒకేలా ఒకే స్థాయిలో పని చేయకపోవచ్చు. కొన్ని సమయాలు రియాక్షన్ ఎదురు కావచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత మేర ప్రకృతి పరమైన దినుసులనే వాడతాను. ఏది యేమైనా వ్యక్తి ఇష్టమే ఆఖరి మంత్రాంగం”.

అప్పుడు శ్వేత ఊరకుండి పోయింది. ఔను— పెద్దమ్మ చెప్పినట్టు యెన్నో గొప్పవి ఇంటా బైటా ఉండవచ్చు. విదేశాల వ్యాపార సంస్థల నుండి మార్కటింగ్ ప్రకటనలు ఇండ్ల చావడిలోకి దూకుడుగా చొరబడ వచ్చు. కాని చివరకు వాళ్ళకు వాళ్శుగా నిర్ణయించ వలసిందే-- సైన్స్ యెంతగానో ముందుకు దూసుకుపోతూన్న ఇప్పటి కాల గమనంలో కూడా ఆయుర్వేదం- హోమియో పతి- సిధ్ధ వైద్యం- యునానీ వైద్యాలకు ఉంటున్న ప్రాముఖ్యత వాటికి ఉంటూనే ఉందికదా! అమలులో ఉన్నవాటి వైద్యపధ్ధతి వాళ్ళవాళ్ల ఇష్టాఇష్టాల పైనే కదా ఆధారపడి ఉంది. అంతెందుకు- కొందరు విదేశీయులు సహితం భారతీయ వైద్యం స్వీకరించడం లేదూ! శ్వేత అంతటితో ఊరుకోలేదు. “ఇంకేదో చెప్పాలనుకుంటున్నారా పెద్దమ్మా!”

‘ఉఁ’ అంది సీతాదేవి. “స్నానానికి నేను ఉపయెగించే కొన్ని దినుసులు మీ పెదనాన్నగారికి యిష్టం” .

ఆ మాటకు శ్వేత అబ్బుర పడుతూ చూసి పంటి బిగువన హాస రేఖ ఆపుకుంది.

ఇద్దరూ ఇల్లు చేరుకునేటప్పటికి రామరాజు బయటి వ్యవహారాలు ముగించుకుని చేరాడు. అతణ్ణి చూసిన వెంటనే శ్వేత చిరునవ్వు చిందే మోముతో పలకరించింది. “ఎప్పుడొచ్చారు పెదనాన్నా? అలసటగా కనిపిస్తున్నారు. ఉండండి— మీకూ పెద్దమ్మకూ మంచి ఫిల్టర్ కాఫీ చేసి తీసుకు వస్తాను” అంటూ సామానున్న సంచీలను ఓరన ఉంచి లోపలకు వెళ్లబోయింది. అప్పుడు రామరాజు ఆమెను ఆపాడు- “ఇప్పుడొద్దమ్మా! ఇప్పుడిప్పుడే బత్తాయి రసం తాగి వస్తున్నాను. ఇదిగో—ఇది అందుకో!” అంటూ ఒక కవరుని ఆమె చేతిలో ఉంచాడు. కాస్తంత నివ్వె రపాటుకి లోనవుతూ- “ఇందులో యేముంది పెదనాన్నా!” అంటూ కవరు తెరచి చూసింది. చూసి మరింతటి నివ్వెరపాటుతో అడిగింది- “ఇందులో క్యాష్ ఉంది. ఎందుకు పెదనాన్నా?”

“మరేం లేదమ్మా! ఎవరికివ్వాల్సింది వాళ్లకు ఇవ్వాలి కదా-- అది నీకైనా మీ పెద్దమ్మగారికైనా. కవురులో మొత్తం పన్నెండు వేలుంది. తీసుకువెళ్లి ఇంటికి ఇచ్చి రామ్మా!”.

ఆమాటతో శ్వేత బిత్తర పోయినట్టు చూసింది. “మీరు నన్ను పరాయిదానిలా చూస్తు న్నారా పెదనాన్నా!” అంటూ గోడ వైపు ముఖం తిప్పుకుందామె.

“నోనో ! నువ్వు మాయింటి పిల్లవే— ఎవరు కాదన్నారు? నియమం అంటే- నియమమే కదా! ట్రైనింగ్ కమ్ స్టయిఫండన్నమాట-- ఓకే?”

బదులు రాలేదు. అప్పుడు సీతాదేవి కదలింది. శ్వేత

వద్దకు వెళ్లి ఆమె చేతి నుండి కవరు అందుకుని భర్తకు అందించింది. “ఆ పిల్ల కన్నీరు కార్చడం చూడలేదూ! మీ కచ్చితత్వం అందరి విషయంలో అన్ని విషయాలలోనూ చూపించకండి’

అప్పుడతడు లేచి వెళ్ళాడు. శ్వేతను హత్తుకున్నాడు “నా ఉ ద్దేశ్యం అది కాదమ్మా! ఈ డబ్బులు నీకు పర్సనల్ విషయాలకు పనికొస్తాయని. అందులో ఈ చిన్న మొత్తం నేనివ్వగలను కదా! అందులో నాకున్న పెన్షన్ ఫండ్ నుండో నా స్వంత బ్యాంకు అకౌంటు నుండో ఇవ్వడం లేదుగా! నేను చేసే కొద్దిపాటి బిజినెస్ ట్రాన్షేక్షన్ల నుండి వచ్చే రాబడి నుండేగా నేనిస్తున్నాను. అంతా నేనుంచేసుకుంటే అది అత్యాశ కాదూ? ఎనీ హౌ సారీ!”అంటూ ఆమెను నడిపించుకు వెళ్లి కుర్చీలో కూర్చుండ బెట్టాడు. ఆమె భవ్యంగా కూర్చుంటూ అంది. “మీరిన్ని చెప్పారు కాబట్టి నేను కూడా ఒకటి చెప్తాను. చెప్పేదా పెదనాన్నా!”

ఉఁ-అని తల ఆడించాడతను.

“నేను మీ అబ్బాయిలిద్దరి తర్వాత మీ కడుపున పుట్టి ఉంటే మీరిలాగే కవరులో డబ్బులుంచి ఇస్తారా పెదనాన్నా!

”రామరాజు యేమీ అనలేదు. నిశ్శబ్దంగా కదలి వెళ్ళి పోయాడు. అమ్మాయిలు స్వతహాగా ఎమోషనల్— శ్వేత మరింత ఎమోషనల్ టైప్ యేమో!

***8***

ఆకాశంలో చల్లదనం, తెల్లదనం గూడు కట్టుకుంటున్నాయి. రహదారులమ్మట చలి గాలులు ముమ్మరంగా వీచనారంభించాయి. చెట్ల రెమ్మల మధ్య ఆకుల కదలిక బాగా తగ్గింది. రోడ్ల ఓరమ్మట గిల్లీ దండాటలు- రబ్బరు బంతాటలు ఆడుకునే పిల్లలు ఫుల్ షర్టులూ హాఫ్ స్వేటర్లు వేసుకోనారంభించారు. అంటే త్రయోదశి- చతుర్ది సమీపించాయి. ఇక రెండు రోజుల్లోపల దీపావళి. దానిని వెన్నంటి కేదార గౌరీ వ్రతం. ఆరోజు ఆదివారం. రామరాజు సీతాదేవి ఇద్దరూ వినోదిని వాళ్లింటికి వచ్చారు. అప్పుడక్కడ ఇంటిల్లపాదీ కళకళగా గుమికూడి ఉన్నారు. సీతాదేవి వినోదినిని అక్కున చేర్చుకుని రెండు స్వీట్ బాక్సులు ఇచ్చింది, ఇస్తూ అంది- “దీపావళప్పుడు, ఆ తర్వాత శ్వేత అక్కడ మా ఇంట్లో ఉంటుంది. ముఖ్యంగా నాకు చేదోడు వాదోడు కావాలి, సరేనా!”

”ఎంతమాట! శ్వేత మీ పిల్లే— ఇప్పుడే తీసుకుపొండి. గౌరీ వ్రత పూజకు వస్తారు కదూ! మీరు రాకపోతే మేం పూజ ఆరంభించం అక్కయ్యా!”

అలాగే-అంటూ నవ్వుతూ శ్వేత చెల్లి అందించిన మంచి నీళ్లు తాగడం పూర్తి చేసి కదలబోయింది. అప్పుడు శ్వేత వచ్చి“పెదనాన్నా!”అని పిలిచింది. రామరాజు ఆగి తిరిగి చూసాడు- “ఇది మా చెల్లెలు- హరిప్రియ”.

అతడు కనుబొమలెగరేసాడు.“ఈ అమ్మాయి మీ చెల్లెలా! నేనిక్కడ యెప్పుడూ చూడలేదే!”

“ఔను మీరెప్పుడూ చూడలేదు, మా పిన్ని పెద్ద కూతురు. కాంతిమతికి పెద్దది. దీనితో మొత్తం ఇద్దరు తోబుట్టువులు, అందరూ చెల్లెళ్లే— నిజం చెప్తున్నాను పెదనాన్నా! చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే నాకంటే మంచిది”.

ఆ మాటకు అతడు నవ్వకుండా ఉండలేక పోయాడు. అతడితోబాటు సీతాదేవి కూడా నవ్వేసింది. నవ్వుతూ అడిగింది “ఇప్పుడు మీ చెల్లి మంచి పిల్ల కాదని యెవరన్నారు? నీలాగే కాంతిమతి లాగే అందంగా కళ కళగానే ఉంది, ఇంతకీ విషయం యేమిటంట?”

అప్పుడు దుపట్టా కొసను చేతి వేళ్ళతో నలుపుతూ దగ్గరకు వచ్చింది శ్వేత. “మరేం లేదు పెద్దమ్మా! నేనైతే పియుసీ వరకు చదువుకున్నానా- ఇదేమో పది వరకే చదివింది. ఎందుకలా చదువు ఆపేయాల్సి వచ్చిందంటే- ఆ మధ్య మా చిన్నాన్నకు పట్టున తెగిన గాలిపటంలా ఉద్యోగం ఊడింది. అందులో ఇది మితి మీరిన సిగ్గరి. ఇది కూడా నాతో కలిసి మీకు అసిస్ట్ చేస్తూ పని నేర్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకుంటానంటుంది. ఈ రోజుల్లో స్కిల్, కొంచెం అనుభవం కొంచెం లేక పోతే ఎవరూ చేర్చుకోరుగా--”

అప్పుడు రామరాజు కలుగ చేసుకున్నాడు. “అది సరేనమ్మా! నా వద్దన్నుదే సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. నేనేమో పా ర్ట్ టైమ్ బిజినెస్ మ్యాన్ ని. ఎప్పుడు మూడ్ చెడి, యెప్పుడు వీటన్నిటినీ అటకెక్కించేస్తానో నాకే తెలియదు, దీనికి బదులు మరెక్కడైనా ఏదైనా చిన్న షాపులోనో లేక బిజినెస్ కంపెనీ ఫ్రంట్ సపోర్టింగ్ వింగులోనో చేర్పిస్తే పనికి పని నేర్చుకుంటుంది. చేతికి వేడి నీళ్లకు చన్నీళ్ళలా యేదైనా అందుతుంది”

“వాస్తవం పెదనాన్నా! ఇప్పుడు మీరన్నారు చూడండీ- అదే విధంగా ఒక ఫైనాన్స్ కంపెనీలో చేరింది, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అక్కడ పని నేర్చుకునే లోపల ఇంకేదో జరిగింది. అక్కడి మేనేజర్, డిప్యుటీ మేనేజర్ హరి ప్రియను వాళ్ళతో బైటకు రమ్మని పిలవసాగారు. అడ్డదిడ్డమైన పనులు చెప్తూ వేధించనారంభించారు. అంతే కాకుండా ఆఫీసులో ఉన్నంత సేపూ ఇద్దరూ యేవేవో రిమార్కులు పాస్ చేస్తూ వికారంగా ప్రవర్తించ సాగారు. మొత్తానికి దానికి కళ్లు బైర్లు కమ్మేటట్టు చేసారు. కాస్తంత పని నే ర్చుకున్నతరవాత— అనర్గళంగా ఆంగ్లం మాట్లాడటం నేర్చుకున్నతరవాత నాతో బాటు దీనికి కూడా ఒక మంచి ఓపెనింగ్ వచ్చేలా చూడండి. ప్లీజ్ పెదనాన్నా! మరొకసారి మిమ్మల్ని యెప్పుడూ ఇబ్బంది పెట్టను”.

శ్వేత చెప్పిందంతా విన్న భార్యా భర్త లిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాసేపు ఆలోచించిన తరవాత రామరాజు అన్నాడు- “సరే! అలాగే! మా ఇంటి పిల్ల వు. నువ్వు చెపితే కాదనగలమా! విద్యార్హతల పత్రాలన్నీ ఓసారి చూపించమను, ఇంకేమైనా చెప్పుకోతగ్గ గుర్తింపు పత్రాలు న్నాయా? ఐ మీన్ కాస్ట్ ధృవీకరణ పత్రాలు గురించి కాదు. ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉందా?”

“ఒకటున్నట్టు గుర్తు పెదనాన్నా! తొమ్మిదవ తరగతిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వింగులో ఉండేది. అందులో హరిప్రియ వెండి గిన్నె అందుకుంది. మరొకసారేమో దేశభక్తి గీతాలు పాడి సెకండ్ ప్రైజ్ తీసుకుంది” .

అతడు తల ఊపుతూ ఉండిపోయి అన్నాడు- ”రేపు మంచి రోజులా ఉంది. మేమందరమూ గుడి శుధ్ది కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాం. మాతో బాటు మీ అక్కా చెల్లెళ్లిద్దరూ పాలు పంచుకోండి. సరేనా?”

ఆ మాట విని అక్కయ్య ఇచ్చిన సంకేతం అందుకుని హరిప్రియ చటుక్కున కదలి వెళ్లి దంపతులిద్దరి కాళ్ళకూ నమస్కరించింది. ఇద్దరూ నవ్వుతూ ఆశీర్వదించారు.

వాళ్ళిద్దరూ రోడ్డు పైకి వచ్చిన తరవాత రామరాజు మౌన ముద్రతో నడుస్తూనే ఉన్నపాటున పక్కున నవ్వేసాడు. సీతాదే వి ఆశ్చర్యంగా చూసి “ఎందుకు నవ్వుతున్నారు?” అని అడిగింది.

“నవ్వక ఇంకేమి చేయను? ఇన్నాళ్లూ ఇంట్లో ఆడపిల్ల అలికిడి లేదని వాపోతుండేవాణ్ణి. ఇప్పుడు చూడు- మనింటికి రావడానికి ఆడపిల్లలు వరుస కడ్తున్నారు-పెదనాన్నా పెదనాన్నా-పెద్ద మ్మా పెద్దమ్మా అని దగ్గరితనం పెంచుకుంటున్నారు. ఈజిట్ నాట్ రియల్లీ ఫన్నీ!”

సీతాదేవి మృదువుగా నవ్వి భర్త చేతిని అందిపుచ్చుకుంది. “నేనిప్పుడు మీ జీవన సహచరిగా చెప్పను. రచయిత్రిగా నన్ను నేను భావించుకుని చెప్తాను, పువ్వున్న చోటే వాసన ఉంటుంది. తడిగల గుండె నుండే కన్నీరు ఊరుతుంది. ధర్మగుణం శోభిల్లుతున్నప్పుడే ధర్మదేవత ప్రత్యక్షమవుతుంది; కురుక్షేత్ర యుధ్దంలో కర్ణుడు నేల కొరిగి పోతున్నప్పుడు ఆదుకోవడానికి వచ్చినట్టు— దీనిని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటారా! మీరిప్పుడు ఉద్యోగ విరమణ చేసి కుదురుగా సర్దుకున్న తరవాత కాదు- ఇక యేదీ చేయడానికి మిగల్లేదు కాబట్టి మంచి పనులు చేయనారంభించ లేదు. మీరెప్పుడూ ఉద్యోగంలో ఉన్నప్పట్నించీ చల్లగా పారే భూగర్భ జలంలా నిశ్సబ్దంగా వీలున్నంత మేర అడపా తడపా తోటివారికి చేయూత అందిస్తూనే ఉన్నారు . అందుకే అంటాను మీరన్నట్టు ఇది ఫన్నీ కాదు. వన్దర్ ఫుల్ అంటాను. ”

“మరి నా తరపున నేనొకటి చెప్పేదా!” ఆమె భర్త చేతిని విడవకుండానే నిదానంగా నడుస్తూనే తలూపింది. “నిజంగా నాకు తెలియదు నేనెంత వరకు మంచి కార్యాలు చేస్తున్నానో! అసలు నేను చేయగలిగినంత చేస్తున్నానో లేదో కూడా తెలియదు. చిట్ట చివరన వాటి లోతుపాతుల్ని బేరీజు వేసే తాహతు ఆ చిత్రగుప్తుడికే ఉంటుంది. కాదా మరి--” అంటూ సీతాదేవి ముఖం లోకి చూసాడు. ఆమె కళ్లతో నవ్వుతూ ఆకాశంలోకి తలెత్తి చూసింది. అప్పుడు అతడి అంతరంగాన చోటు చేసుకున్న కెరటాన్ని ఆమె చూడలేక పోయింది. తీరాన్ని సాకుతూన్న సముద్రంలా అతడిలోని ఆలోచనలు విరిగిన మబ్బుల్లా ఫెళ ఫెళ మన్నాయి. నిజంగానే తనలో అంతటి ధర్మ గుణం ఉంటే తనెందుకు సౌమ్య శుభ్ర తేజస్సు గల విమల వంటి స్త్రీని అంత కర్కశంగా ట్రీట్ చేసాడు!

***9***

మరునాడు అనుకున్న ప్రకారం అక్కాచెల్లెళ్ళిద్దరూ వచ్చి గుడి శుధ్ది కార్యంలో పాల్గొన్నారు. గుడి ధర్మకర్తలతో, ఇతర దైవభక్తులతో కలసి ప్రక్కన నున్న బోరు బావి నుంచి నీళ్లు తోడుకుని వచ్చి గుడి మెట్లు కడగడంతో బాటు- గుడి ప్రాంగణం చుట్టూ చెల్లా చెదురుగా పడి ఉన్న రాళ్ళను యేరి కుప్పగా పోసారు. ముళ్ల కంపల్ని తెంపి చదును చేసారు. నోట్లో కదిలే నాలికలా అన్ని పనులూ చేసి పెట్టారు. అప్పుడు అనుకున్న దానికన్నా ముందే గుడి శుభ్రత పూర్తయింది. అలా అంతా ఐపోయిన తరవాత అందరూ కుదురుగా కూర్చుని టీలు తాగుతున్న వేళ రిటైర్ట్ డిస్ట్రిక్టు జడ్జి దక్షిణామూర్తి గారు వచ్చి అడిగారు- “ఈ ఇద్దరమ్మాయిలు యెవరు మిస్టర్ రామరాజూ! మీ బంధువులమ్మాయిలా?”

“ఔను నాకు కూతుళ్లవుతారు. ఎందుకడుగుతున్నారు?”

“మరేమీ లేదు. అమ్మాయిలిద్దరూ చక్కగా ఉన్నారు. చురుగ్గానూ ఉన్నారు. గుడి శుధ్ధి కార్య క్రమంలో మనసార పాల్గొన్నారు. ఎందకడుగుతన్నానంటే అప్పుడప్పుడు సంబంధాలు చూడమని మా ఊరి నుంచి బంధువులు అడుగుతుంటారు. ఈ అమ్మా యిలిద్దరి బయోడెటా గాని ఇస్తే బాగుంటుందని—“

“ధేంక్స్ అలాగే ఇప్పిస్తాను, ఆ పిల్లల తల్లి దండ్రుల్ని అడిగి—“

“ఒక వారం రోజుల్లోపల ఇప్పించగలరా?”

రామరాజు కాసేపాగి బదులిచ్చాడు- “సారీ! అది నాచేతిలో లేదండి. ముందే చెప్పినట్టు వాళ్ల ఇంట్లోవాళ్ళను అడిగి చెప్తాను. అందిన వెంటనే మిమ్మల్ని కలుసుకుంటాను” దక్షిణామూర్తి తలూపాడు.

అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంట్లో అలా కలివిడిగా తచ్చాడనారంభించిన తరవాత రామరాజు ఇంటికి కళ కట్టింది. అటు సీతాదేవికి కూడా అనిపించింది అలా ఇద్దరు ఆడ కూతుళ్లు కలివిడిగా తిరుగుతుంటే యే ఇల్లు మాత్రం శోభాయమానంగా ఉండదు! ఇక దైనందిన కార్యకలాపాల విషయానికి వస్తే-- అక్కాచెల్లెళ్దిద్దరికీ పనులు ఇలా ఆరంభ మవుతాయి. ఉదయం వచ్చీ రావడంతోనే సీతాదేవి అధ్యయన అరలోకి వెళ్తారు. మొదటి కాఫీ కప్పు ఆమెకిచ్చి ఇద్దరూ చెరొక కప్పూ తీసుకుంటారు. ఆ తరవాత సీతాదేవి డి టీ పీ చేసిన కథల్ని ప్రింటవుట్ చేసి మరొకసారి ఆమె చేత దిద్దుబాటు చేయించి స్వదస్తూరీతో కథ ఇంతకుముందెక్కడా ప్రచురితం కాలేదని తెలియచేసే హామీ పత్రాలు వ్రాయించి కవరులో ఉంచి ప త్రికల విలాసాలు తాటికాయంత అక్షరాలతో వ్రాస్తా రు. పోస్టు చేయడానికి వాటిని బల్లపైన సిధ్దంగా ఉంచుతారు. పిమ్మట రామరాజు మినీ ఆఫీసు రూములో కూర్చుని అతడు చెప్పినవన్నీ గుర్తుంచుకుని మెయిల్స్ ఓపెన్ చేసి ఆన్ లైన్ ట్రాన్షాక్షన్ లు పూర్తి చేసి వాటితో బాటు డేటా ఎంట్రీలు కూడా ముగించి రామరాజూ సీతిదేవీ అందించిన కవర్లు బడ్వాడా చేయడానికి పోస్టాఫీసుకి కలసి వెళ్తారు. బ్యాంకులకీ తదితర పైనాన్స్ కంపెనీలకు వెళ్ళేటప్పడు మాత్రం తప్పని సరిగా రామరాజు వెంట వెళ్తారు. అతడి ఆధేశానుసారం చెలాన్స్ ఫిలప్ చేసి ఇస్తారు. బ్యాంకు ఆఫీసర్లతో పరిచయాలు పెంచుకుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకు సిబ్బందిని పనిగట్టుకుని వెళ్లి విష్ చేస్తారు. ముఖ్యంగా రామరాజు దేహ భాషను, సంభాషణా ప్రవాహాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. అడపా తడపా వాళ్ల చర్చల్లో పాలు పంచుకుంటారు. రామరాజుకి కావలసిన పాయింట్సు గుర్తు చేస్తారు. సంబంధిత పత్రాలను అందిస్తారు. మొత్తానికి అదొక సునిశితమైన వ్వాపార ప్రపంచ రంగ ప్రవేశం. సహజ సిధ్దమైన స్త్రీల మొహమాటాలను తొలగించి నిర్భయత్వాన్ని ఆపాందింపచేసే యం త్రాంగం. కొన్నాళ్ళకు అక్కాచెల్లెళ్లిద్దరికీ తమ పైన తమకే ఆశ్చర్యం కలిగించేంత మార్పు సంభవించింది. ఇప్పుడు వాళ్లిద్దరూ తెలుగులోనే కాదు, ఆంగ్లంలో సహితం ధారాళంగా మాట్లాడనారంభించారు. రామరాజు యేవైనా అవాంతరాల వల్ల ఇంట్లోంచి కదల్లేక పోతే ఇద్దరూ బ్యాంకు వ్యవహారాలు యితర పైనాన్స్ విషయాలు తమంతట తాము ముగించి వస్తున్నారు. అదీను పెర్ఫెక్షన్ తో ముగించి వస్తున్నారు. మురిపెంతో నేర్పించాలే గాని ముదితల్ నేర్వని విద్య గలదే! ఇక విషయానికి వస్తే అక్కాచెల్లె ళ్లిద్దరూ పెద్దగా వ్యాపార ప్రపంచపు డిగ్రీలు సముపార్జించకపోయినా చదువుకున్న ముదితలే కదా! ఇప్పుడేమో సానబట్టిన రంగురాళ్ళుగా క్రమ క్రమేపీ తమకు తాము మెరుగులు దిద్దుకుంటూ కమ్యునికేషన్ స్కిల్స్ ప్లస్ బేసిక్ స్కిల్స్ పెంపొందించు కుంటున్నారన్న మాట! విషయ పరిజ్ఞానం సముపార్జించుకుంటే ఆత్మవిశ్వాసం తానుగా రాదూ మరి--

***10***

ఆరోజు భార్యా భర్తలిద్దరి వద్దా చేయాల్సిన పనులు అంతగా లేకపోవటాన, చేయాల్సిన ఫోన్లు కూడా లేకపోవటాన ఆ పూట తెలుగు దిన పత్రికను చూస్తూ హాలులో కూర్చున్న సీతాదేవి పంచన చేరారు అక్కాచెల్లెళ్లిద్దరూ— చెరొక ప్రక్కా చేరిన తరవాత మొదట శ్వేత కదిపింది- “చాలా రోజుల్నించి గమనిస్తున్నాను కాబట్టి అడగాలనిపిస్తూంది. అడిగేదా పెద్దమ్మా!”

పత్రిక మడచి పత్రికతో బాటు అక్షరాల విన్యాసాన్ని కూడా మడచి తలెత్తి చూసిందామె; అడగమన్నట్టు కనుబొమలను ఆడిస్తూ-

“ఇదేమీ అంత సీరియస్ వ్యవహారమేమి కాదుగాని- నాకు పదే పదే అడగాలనిపించి అడుగుతున్నాను. ఆస్ట్రేలియా నుండి వచ్చే ఫోన్లు పెద నాన్నగారే అటెండవుతుంటారు. మీరు మీ ఆడపడుచుతో అంత కలివిడిగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకు పెద్దమ్మా?”

ఆమె వెంటనే బదులివ్వలేదు. రవంత సేపు మౌనంగా ఉండిపోయి ఆతరవాత అంది- “నువ్వంటున్నది నేను మా ఆడపడుచుతో మాటలు కలపడం లేదని. అదే కదూ!”

ఔనన్నట్టు తలూపింది శ్వేత.

“నువ్వు పొరపాటుగా ఊహించుకుంటున్నా వు. నేను మాట్లాడక పోవడం కాదు. అటునుంచి మా ఆడపడుచే నాతోమాటలు కలపదు. ఎందుకూ అని నువ్వు అడుగుతావని నాకు తెలుసు. నేనే చెప్తాను. నేనంటే ఆవిడకి నచ్చదు. ఆదినుంచీ నచ్చదు. మా మధ్య గొడవలేమైనా జరిగాయేమోనని సందేహి స్తున్నావా! లేదు, అటువంటిదేమీ జరగలేదు. నేనంటే ఆవిడకు ఇష్టం లేదు. మొదట్నించీ నాతో యెడముఖమూ పెడ ముఖమే-“

“నువ్వంటే ఆమెగారికి ఇష్టం లేకపోవడమా! ఐ కాంట్ బిలీవిట్. హానస్ట్లీ స్పీకింగ్- నువ్వంటే ఈ ప్రపంచంలో ఇష్టం లేని వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను పెద్దమ్మా! అమ్మ ఒకసారి చెప్పింది. దేవలోకంలో దేవతలకు అన్నీ దొరుకుతాయట- సమృధ్ది గా అమృతంతో సహా-- కాని ఒకటి తప్ప. తళ తళ మెరిసే నీళ్పు తప్ప.. అందుకే దేవతలూ గంధర్వులూ అర్థరాత్రి పూట భువికి దిగి వచ్చి తనివి తీరా జలకాటాలు ఆడుతుంటారట. అటువంటి అరుదైనదే వాళ్లకు లేనిది మీలో తొణికిసలాడుతుంటుంది. వాళ్లు సహితం మీ ముందుకు వచ్చి చేతులు చాచి అడగాలి”

“తెగ పొగిడేస్తున్నావు-- విషయం ఏమిటంట?”

శ్వేత తడుముకోకుండా బదులిచ్చింది- “అమృతం కంటే విలువైన దయాగుణం. ఇంతకీ నిన్నెందుకు ఆ మహాతల్లి డిస్ లైక్ చేస్తుందో తెలుసుకోవచ్చా పెద్దమ్మా!” ఆ ప్రశ్నవిని సీతాదేవి బరువుగానిట్టూ ర్చింది. పిమ్మట కాసేపాగి అంది- “చాలామంది ఆడవాళ్ళలో కనిపించే గుణాంశమే— నేనంటే ఈర్ష్య-కోపమూను . మొన్న జరిగింది కూడా అదేగా! మా పెళ్లి రోజు ఇంటికి ఫోను చేసింది. చేసి వాళ్ళన్నయ్యకు మాత్రం శుభాకాంక్షలు తెలియ చేసింది. నాకు తెలియ చేయలేదు. ఇక నేను లేకుండా వాళ్లన్నయ్యకు పెళ్లి జరిగుండేది కాదు కదా? ఈ చిన్న విషయం ఆవిడకు తెలవద్దూ!”

“ఇంతకూ మీ ఆడపడుచు పిలిచి కంగ్రాట్స్ చెప్పిందా లేదా?“ ఈసారి హరిప్రియ ఉగ్గబెట్ట లేక అడిగింది. ”చెప్పింది. ఎప్పుడని? వాళ్లన్నయ్య నా ఉనికి గుర్తు చేసింతర్వాత— “

అది విని శ్వేత ఉద్వేగానికి లోనయింది. నిష్ఠుర స్వరంతో అంది. “నాకు నిజంగా బాధగా ఉంది పెద్దమ్మా! ఇటువంటి అవమానం ఇంకెవరికి జరిగినా ఇంతగా ఫీలవను. నీకు జరగడమా? అందులో నీ వంటి హృదయావేశం గల రచయిత్రికా! ఇంతకూ ఆమె యెందుకిలా విరుచు పడ్తుందో చెప్తావా పెద్దమ్మా!“

“చెప్తాను. ఐతే ఒక షరతుపైన— మీరిద్దరూ దీనిని యెక్కడా పొక్కనీయకూడదు. సరేనా!“

ఆ షరతు విన్నంతనే అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రమాణం చేసారు ఇంకెక్కడా చెప్పమని-- అప్పుడు సీతాదేవి పెదవి కదిపింది.

”సరే చెప్తాను. మా ఆయనకున్మ యేకైక తోబు ట్టువు భాగ్యవతి. ఆవిడ మనసున ఒక అపోహ బలంగా ముద్రించుకుపోయింది. అదేమంటే- నేను వయ్యారాలు ఒలకబోస్తూ మాయ మాటలతో వలపుల మత్తులో నింపి వాళ్ళన్నయ్యను ఒడిసిపట్టుకుని వలలో వేసుకున్నానని”

శ్వేత వెంటనే అందుకుంది-

“ఇదీ మరీ బాగుంది. మీ వంటి ఉత్తమురాలు వాళ్లింట కోడలు పిల్లగా కాలు పెట్టాలి కదా!“

“కాదు! అటువంటి అభిప్రాయం ఆమెకులేదు. అప్పుడు ఆయనకు నా సంబంధంతో బాటు మూడు పెళ్లి సంబందాలు వచ్చాయి. ఒకటి సూరత్ నుండి వజ్ర వ్యాపారి కుటుంబం. రెండవది- తమిళనాడులోరాజపాలయం నుండి—“

“ఇక్కడొక్కసారి ఆగు పెద్దమ్మా! సూరత్ అంటున్నావు. అది గుజరాత్ ప్రాంతం కదూ?”

“ఔను అది గుజరాత్ ప్రాంతమే! కాని కుటుంబం మాత్రం అక్కడికెళ్లి స్థిరపడ్డ తెలుగు కుటుంబమే! ఇక రాజపాలెయం కుటుంబమేమో పారిశ్రామిక కుటుంబం. ఈ రెండు కుటుంబాలనూ కాదని ఒక బడిపంతులుగారి కూతురైన నన్ను నెత్తికెక్కించుకుని చేసుకుంటాననడం ఆమెకు అరికాలి మంట నషాలానికి తాకింది. ఇప్పుడైనా కొంచెం పర్వాలేదు, మునుపైతే వాళ్ళన్నయ్య పిలిచి మాట్లాడమని చెప్పినా పోనెత్తి మాట్లాడేది కాదు. నా గొంతు విన్నంతనే కొడుకునో భర్తనో పిలిచి నాతో సంభాషణ తెంపేసేది. ఇప్పుడు తగ్గింది. వయసు కూడా పైబడిందిగా! కాల గమనంలో ఒకప్పటి భావోద్వేగాలు కొంచెం కొంచెంగా చల్లబడే తీరాలిగా!”

”అంటే—పెదనాన్నగారి కుటుంబం నిజంగానే మోతుబరి కుటుంబమేనన్నమాట!”

“అలాగనలేం. కాని వాళ్లది ఉన్నత కుటుంబం. ఎలాగంటారా! వాళ్లది ఉత్కృష్ట నేపథ్యం గల కుటుంబం. మా వారి తాతయ్యా బామ్మా కలసి స్వాతంత్య్ర సమరంలో పాలు పంచుకుని జైలుకి వెళ్లారు. ఇద్దరూ కేంద్ర ప్రభుత్వం నుండి తామర పత్రం అందుకు న్నారు. అంచేత వాళ్ల కుటుంబంతో సంపర్కం పెట్టుకోవడానికి చాలామంది తెలుగు కుటుంబాలు ఉబలాట పడుతుంటాయి. సెన్సాఫ్ హిస్టోరికల్ ఫీల్ అనవచ్చేమో!”

ఆపైన నోరు మెదపకుండా అక్కాచెల్లెళ్లిద్దరూ మిన్నకుండిపోయారు. కాని ఇద్దరూ ఎక్కువ సేపు అలా ఉండలేక పోయారు. సద సద్వివేక సంపన్న ఐన సీతమ్మగారికా ఇంతటి ఇరకాటం! ఇద్దరూ భరించలేక పోతున్నారు. శ్వేత దగ్గరకు వచ్చి సీతాదేవి చేతిని అంది పుచ్చుకుంది. ”మా పెదనాన్నగారికి అటువంటి కఠిన మనస్కురాలు చెల్లెలుగా పుట్టి ఉంటుందని నేను ఊహించలేక పోతున్నాను పెద్దమ్మా!”

ఆది విని సీతమ్మ తల అడ్డంగాఆడించింది. “మీకు జీవితానుభవం తక్కువ. మా ఆడపడుచుని మీరేదో తాటకిలా ఇంకేదోలా ఊహించేసుకుంటున్నట్టున్నారు. చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అటు వంటి తోబుట్టువు నాకుంటే బాగున్ననిపించేది”

అది విని ఇద్దరమ్మాయిలా ఖంగుతిన్నట్టు చూసారు. “ఏమి మాట్లాడుతు న్నావు పెద్దమ్మా! ఆలోచించే మాట్లాడుతున్నావా? నిన్ను అడుగడుగునా తక్కువ చేసి కించపర్చేలా ప్రవర్తించిన స్ద్రీయేనా నీకు తోబుట్టుగా పుట్తి ఉంటే బాగుంటుందని అంటున్నావూ!“

“ఉఁ తెలిసే మాట్లాడుతున్నాను. నాకు నచ్చక పోవచ్చుగాని- ఆమె కుటుంబం కోసమూ తోడ బుట్టిన అన్నయ్య బాగోగుల కోసం ఆక్రోశించడంలో విడ్డూరం యేముంది? ఆస్ట్రేలియాలో స్ఖిరపడి రెండకరాల విస్తీర్ణంలో ఇల్లూ తోటా ఉంచుకుని కూడా తన కోసం మాత్రమే ఆలోచించకుండా తన భర్తా కొడుకుల కోసమే ఆలోచించకుండా కొన్ని వేల కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నయ్యను మరచి పోకుండా ఉందంటే అది ఉదాత్త గుణం కాదూ! అడగాలే గాని అన్నయ్య కోసం యేమైనా చేస్తుంది. అంతటి స్వఛ్ఛమైన ఆత్మీయాను బంధాన్ని చూపించగల మనసు ఆడదానికే ఉంటుందేమో! మగ కుర్రాళ్లకూ ఆడపిల్లలకూ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కదా! ఆడపిల్ల యెక్కడున్నా యేమి చేస్తున్నా పుట్టినింటి కోసం దాని ఆత్మ పరితపిస్తుంటుంది. అది మగకుర్రాళ్ళలో అంతగా ఉండదేమో-- ఇంకా అర్థం కాలేదు కదూ! మొన్న మా పెళ్లిరోజు. ముప్పై రెండో సంవత్సరం. మొట్ట మొదట ఇక్కడకు మరిచిపోకుండా ఫోను చేసి శుభాకాంక్షలు తెలియ చేసిందెవరు! మా అబ్బాయిలు కారు. మా కోడళ్లూ కారు. మా ఆడపడుచే ఫోను చేసింది. మా పెళ్లి రోజుకే కాదు. ప్రతి ముఖ్యమైన తెలుగింటి పండక్కీ భాగ్యవతే మొదట ఫోను చేస్తుంది. ఇన్నేళ్ల యెడబాటు తరవాత కూడా ఆమె తోడబుట్టిన వాణ్ణి మరవకుండా ఉండటం ఆశ్చర్యం కదూ! ఇక నా పట్ల జరిగిన చీదరింపు గురించి అంటావా! ఇంతవరకూ నన్ను గాని మా అమ్మానాన్నలను గాని ఆమెగాని ఆమె బంధువులు గాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కదా! మా మెట్టింటి వాళ్ళు అడగాలే గాని తనకున్న ఇరవై యెకరాల మాగాణి నుండి పది యెకరాలు మా నాన్న మా వారికి వ్రాసిచ్చేసేవాడు. ఐతే ఒకే ఒకటి మా ఆడపడుచుని అతలాకుతలం చేస్తుంటుంది. నేను వాళ్ల కుటుంబానికి తగను. నన్ను చేసుకుని వాళ్ళన్నయ్య నష్టపోయాడు. అలా జరగడానికి కారణం- నేను వయ్యారాలు ఒలకబోసి రామరాజుని మరో గొప్ప సంబంధం వేపు చూపు మరల్చనీయకుండా వలపుల సంకెళ్లెలో బంధించడమే!”

“మీ ఆడపడుచుకి బాగా తిక్క పట్టుకున్నట్లుంది. మీ అందం యేమిటి? మీ చదువేంటి? మీ హుందాతనం యేమిటి! మెరిసే యవ్వన ప్రాయంలో మగాడి తోడు కోసం మీరుగా వెంపర్లాడే అవసరం మీకు యేమొచ్చింది? ఆమెది అంతా నేల విడిచి సాము చేసే ఊహాగానం” ఈమాట విని సీతాదేవి పక్కున నవ్వింది.ఇంకా నవ్వుతూనే ఉంది. అది చూసి హరిప్రియ అడిగింది- “ఎందుకలా నవ్వు తున్నావు పెద్దమ్మా! మేమిద్దరమూ చిన్నవాళ్ళం కదానని మా బుర్రను తికమక పెట్టకు--”

“లేదు. అలా మిమ్మల్ని తికమక పెట్టను. నిజమే చెప్తాను. నేను వాస్తవంగానే నా యవ్వన సుగంధాలను విరజల్లి రామరాజుగారి ని నా వలపుల బాణాలతో మైమరిపించాను. ఆ మాటకు వస్తే- ఎంత సత్సాంప్రదాయాల మధ్య పెరిగిన పంతులుగారి కూతురినై తే మట్టుకు నా కిష్టమైన మగాణ్ణి స్వంతం చేసుకునే అధికారం నాకుంది కదా!

”ఈసారి అక్కాచెల్లెళ్లిద్దరూ అవాక్కయారు. అబ్బో! వాళ్ళనుకునేంత అమాయకురాలు కాదేమో ఈ పెద్దమ్మ! వాళ్ళను ఉన్నపాటున చెరువు గట్టు పైనుండి వీచే ఉదయకాల గాలిలా రొమాన్స్ పీలింగు సోకి భాగ్యవతి పైనున్న అసహనం ఒక్కపెట్టున చల్లబడిపోయింది. మొత్తానికి పెద్దమ్మ నివురుగప్పిన నిప్పే!

***11***

దీపావళి పండగ జరుపుకున్న మరునాడు వినోదిని వాళ్ళింట్లో జరగబోయే వ్రతపూజకు రామరాజు దంపుతులిద్దరూ వెళ్లారు. వ్రతపూజకు వినోదిని వాళ్ళ చెల్లెలు మరది కూడా వచ్చారు. పూజా పునస్కారాలు పూర్తయి భోజనాలు కూడా ముగిసిన తరవాత రిటైర్డ్ జడ్జీ దక్షిణా మూర్తిగారు గుడి శుధ్ది పనులు చేస్తున్నప్పుడు శ్వేత హరిప్రియల గురించి లేవదీసిన అంశాన్ని ప్రస్తావించాడు రామరాజు. ప్రాథమిక చర్యగా అమ్మాయిల తల్లి దండ్రులు జాతక వివరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నా అంత త్వరలో పెళ్ళి యేర్పాట్లు చేసే స్థితిలో తాము లేనట్టు తమ అసహాయతను వెల్లడించారు. అప్పుడు సీతాదేవి కలుగ చేసుకుంది ”మొదట దక్షిణామూర్తిగారు అమ్మాయిలకు ఈడూ జోడూ గల సంబంధాలను తీసుకు రానివ్వండి. ఆతరవాత మిగతావి తేల్చుకుందాం. ప్రయత్నాలు ఇప్పుడారంభిస్తేనే కదా మరొక రెండు మూడు సంవత్సారాలలో సంబంధం కుదురు తుంది. ఆ మాటకు వస్తే యెన్నాళ్ళని పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిల్ని ఇంట్లో పెట్టుకుంటారు? న్యాయంగా చూస్తే చదివించాలి. కొన్నికారణాంతరాల వల్ల చదివించలేక పోయారు. గతం-గత:- ఇక దీనిపైన చర్చలు సాగించి ప్రయోజనం ఉండబోదు. కనీసం పెళ్లి సంబందాలు కూడా చూడమంటే యెలా?”

ఆ మాటతో వాళ్లు ఊరకుండి పోయారు. వేగంగా వెళ్లి చెక్కపెట్టెలోనో బీరువాలోనో ఉంచుకున్న జాతకాల్ని తెచ్చి ఇచ్చా రు. జాతకాల్ని అందుకున్న తరవాత సీతాదేవి అంది. “గంతకు తగ్గ బొంతలా మీకు అందు బాటులో ఉన్న సంబంధాన్నే మీరు ఔనా కాదా అనడానికి సంసిధ్దులు కండి. కన్న తల్లి దండ్రులుగా చివరి నిర్ణయం మీదేగా! ఇప్పుడు మరొక విషయం. నాలుగు రోజుల తరవాత మావారి స్వంతూరికి వెళ్తున్నాం. మాతో బాటు శ్వేతను హరిప్రియనూ తీసుకు వెళ్తున్నాం. ఎందుకంటారా? చెప్తాను. అక్కడ రుద్రేశ్వరాలయం ఉంది. ఆ గుడికి మావారు అనువంశిక ధర్మకర్త. ఇంకా చెప్పాలంటే ఆ గుడిని మా మెట్టింటివారి పూర్వీకులే ఆ కాలంలో నిర్మించారు. కావున ప్రతి రెండేళ్ళకోమారు జరిపే జాతరోత్సవానికి కుటుంబ సభ్యులెవరైనా తప్పని సరిగా వెళ్లాలి. ఇప్పుడిక్కడున్నది మా వారే కదా! అబ్బాయిలిద్దరూ భార్యాబిడ్డలతో ఫారన్ లో కదా స్థిరపడ్డారు. కాబట్టి అంత దూరం నుంచి వాళ్లిక్కడకు రాలేరు. కాబట్టి మేం తప్పని సరిగా వెళ్లాలి. ఊరి సంప్రదా యం - గుడి ఆచారం. ఇకపోతే— ఈ గుడి గురించి ఒక విషయం చెప్పాలి. అదేం మహత్యమో తెలియదు. ఆలయ దర్శనం చేసుకుని వచ్చినప్పుడల్లా ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆ దివ్యక్షేత్రం వెళ్లి వచ్చిన వెంటనే మా వారికి రెండు సార్లు ఫ్రమోషన్లు వచ్చాయి. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుండి డెడికేటెడ్ సర్వీసు కని బంగారు పతకం కూడా అందుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈసారి అమ్మాయిలిద్దరినీ రుద్రేశ్వరాలయానికి తీసుకు వెళ్తున్నాం. ఇందులో మీకేమీ ఆక్షేపణ లేదు కదా!”

ఆమాట విన్నంతనే అందరూ లేచి- “ఎంత మాట! ఎంతమాట! మీరు అమ్మా యిలిద్దర్నీ పుణ్యక్షేత్రానికి తీసుకు వెళ్ళడమూ మేము కాదనడమూనా!”

కాని ఆరోజు రాత్రి భోజనాలప్పుడు అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒక్కసారిగా అన్నారు, “మా పెళ్ళి విషయం మీకొక మాట చెప్పాలి పెదనాన్నా!”

పప్పు వేసుకుని ముద్ద కలుపుకుంటూ- “ఉఁ చెప్పండి. చెప్పేదేదో మీ ఇంట్లోనే చెప్పి ఉండాల్సింది కదా!”అని బదులిచ్చాడు రామరాజు.

అప్పుడు శ్వేత స్పందించింది. “నిజమే పెద్దనాన్నా! కాని మా ఇంట్లోవాళ్లు విని అర్థం చేసు కోగల స్థితిలో లేరనిపించింది. అందుకే ఓపిక పట్టి ఇంత వరకూ మీతో గప్ చిప్ గా నడచి వచ్చాం. ఇప్పుడు మేమిద్దరమూ చెప్పొచ్చేదేమంటే మాకు ఇంత త్వరలో పెళ్లి వద్దంటున్నాం. రెండు కారణాలు ఉన్నాయి పెదనాన్నా! మొదటి కారణం- వాళ్లు పెళ్లి ఖర్చులు భరించ

గల స్థితిలో లేరు- అప్పో సప్పో చేయడం తప్ప-- ఉన్న వాటినంతటినీ తాకట్టు పెట్టడం తప్ప-- ఇంక రెండవది- ఇప్పుడు కాస్తో కూస్తో పని నేర్చుకున్నాం కదా! దీనితో బాటు మాకు పనికొచ్చే షార్ట్ టార్మ్ కోర్సు పూర్తి చేసి ఏదైనా కార్పొరేట్ నేపథ్యం గల కంపెనీలో జాబ్ దొరికేటట్టు చేస్తే, మేం ఉద్యోగాలు చేస్తూ మా అమ్మానాన్నలకు వత్తాసుగా ఉంటాం. ప్లీజ్ పెదనాన్నా! మీ మాట కాదంటున్నామని కోపగించుకోకండి”

రామరాజు వెంటనే బదులివ్వలేదు. భోజనం ముగించి చేతులు కడుక్కొచ్చి అమ్మాయిలకు యెదురుగా కూర్చున్నాడు. “చూడమ్మాయిలూ! మీరు రెండు క్వరీలు లేవదీసారు. నేను మొదట చివరి క్వరీని ప్రస్తావిస్తూ ఆ తరవాత మొదటి క్వరీకి వెళ్తాను. మీరు మంచి కంపెనీలో ఉద్యోగం చూడమన్నారు. చూస్తున్నాను. మంచి బ్రాండ్ పైనాన్స్ కంపెనీలో జాబ్ వెతకాలంటే దానికి తగ్గట్టు మీ అనుభవం కూడా యెదగాలి కదా! మీరడుగుతున్నారు కదానని యేదో ఒక ఫ్లయ్ బై నైట్ సంస్థలో చేర్పించలేను. మంచి కంపెనీలో జాబే దొరకడం ఆలస్యమవుతుందంటే అవనియ్యి— అంతవరకూ మీరిద్దరూ మాతోనే ఉంటారు- మీ పెద్దమ్మగారితో కలసి పద్యాలూ కవితలూ కావ్యాలూ చదువుతూ- నాతో కలసి బ్యాంకు పనులు చూసుకుంటూ- - ఇక మొదటి అంశానికి వస్తున్నాను, ఉద్యోగం చేసి కుటుంబానికి వత్తాసుగా ఉండాలనుకోవ డం శ్లాఘనీయం, ఐతే ఒకటి- మీరు ఇప్పటికిప్పుడు పెళ్లి వద్దని నెట్టగలరు. కాని పైబడుతూన్న వయసుని కాదనలేరు కదా! ఈ విషయమై మిమ్మల్ని కన్న తల్లి దండ్రులకు బాధ్యత ఉంది కదా! అదే సమయాన పెద్దలమైన మేం చోద్యం చూస్తూ ఉండలేం కదా! ఇందులో మాకూ కొంత బాధ్యత ఉంది కదా! అందుచేత మీరిప్పటికి మీ గదుల్లోకి వెళ్లి నిద్రపొండి. మనం దూర ప్రాంతానికి ప్రయాణం చేయబోతున్నాం. వాటికి తగ్గ యేర్పాట్లు చేసుకోండి. సరేనా!”

అక్కాచెల్లెళ్ళిద్దరూ లేచి నవ్వుతూ కూర్చున్న సీతాదేవి ముఖంలోకి ఓపారి నిదానంగా చూసి- “శుభరాత్రి పెద్దమ్మా!“ అంటూ అక్కణ్ణించి వెళ్లిపోయారు. అమ్మాయిలిద్దరి మనసులోనూ రివ్పున రిగిన అలజడి సీతాదేవి గమనించక పోలేదు. వయసు తేడా మాట అటుంచి, ఆడదాని మనసు ఆడదానికేగా తెలుస్తుంది – ఇప్పటికే రిటైర్డ్ జడ్జిగారు రెండుసార్లు యెవరో వాళ్ళకు తెలిసిన బంధువుల అబ్బాయి కోసమని పెళ్ళి ప్రస్తావన తెచ్చా రు. సన్మానాలూ లాంఛనాలూ బరువుగా యిచ్చుకోగల స్థాయి అమ్మాయిల యింట్లోవాళ్ళకు లేదని సీతాదేవి విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నింది. ఐనా దక్షిణా మూర్తిగారు అక్కాచెల్లిళ్ళిద్దెరి పెళ్ళి ప్రస్తావన విడిచి పెట్టేటట్టు లేరు.

***12***

బుచ్చిలపాలెం ఒకటవ జాతీయ రహదారికి కుడి ప్రక్కన ఉంది, కొత్త ప్రాతల మేలు కలియికలా ఊళ్లో సగం పట్నపు వాసన- సగం గ్రామీణ వాతావరణమూ మిళితమై ఉంటుంది. పచ్చటి పంట పొలాలతో పంటకాలవల గలగలల ప్రవాహాలతో పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. తనువుకీ మనసుకీ చిరకాల స్నేహంలా పెనవేసుకున్న అనుబంధంలా ఊరినుండి వెళ్లనివ్వదు. గ్రామీణ సామాజిక వాతావరణంలోని మమకారాలు ఆత్మీయతలు అటువంటివి మరి. ఇక విషయానికి వస్తే రామరాజు వాళ్ళ పూర్వీకుల విశాలమైన నాలుగు లోగిళ్ళ పెంకుటిల్లు చెక్కుచెదరకుండా ఇంకా అలాగే ఉంది; గతకాల వైభవోన్నతికి ప్రతీకగా-- ఇంటి పరామరింపు అతడికి మామయ్య వరసైన తిరుపతిరావు చూసుకుంటున్నాడు. అతడంత నికార్సుగా ఇంటిని చూసుకోవడానికి కారణం లేక పోలేదు. అందులో స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న రామరాజు తాతయ్య బామ్మలు కలిసున్న ఇల్లు. వాళ్ళ ఉనికి బుచ్చిలపాలేనికే గర్వకారణం. అటువంటి గతకాల చరిత్రగల నివాసాన్ని చూసుకోవడంలో అతడికి సహజం గానే ఆత్మతృప్తి ఉంటుంది కదా! ఇంకా చెప్పాలంటే— తిరుపతిరావే తన ఖర్చుతో తన స్వయం ప్రయత్నంతోనే ఇంటి ముంగిట వ్రాత ఫలక వ్రాసి ఉంచాడు, అది ఒక నాడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగారి నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని చెరసాలకు వెళ్లి వచ్చిన దంపతుల పావన గృహ ప్రాంగణమని- ఫలానా తేదీనాడు కేంద్ర ప్రభుత్వం వారి నుండి తామ్ర పత్రం అందుకున్నారని. ఇక రెండవ కారణం— రామరాజు కుటుంబీకులు రెండేళ్ళకు ఒకసారి జరుపుకునే జాతరోత్సవానికి రావలసి ఉంది. ఆ కుటుంబ సభ్యులు యెన్ని పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డా విదేశాలకు పై చదువులకో పెద్ద ఉద్యోగాలకో వెళ్లిపో యినా వాళ్లకూ బుచ్చిలపాలేనికీ యేదో ఒక అవిశ్రాంత అనుబంధం- ఉద్వేగ పూరితమైన రాగానుబంధం కొనసాగుతూనే ఉండాలిగా! అప్పుడే కదా ఆ కుటుంబీకులు యెప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా ఇల్లూ ఊరూ వెతుక్కుంటూ వస్తారు-- ఇక విషయానికి సూటిగా వస్తే- రామరాజో అతడి భార్యామణి సీతాదేవో- లేక అతడి కొడుకులో రాకపోతే జాతరోత్సవం ఆగిపోతుందని కాదు. లక్ష వత్తుల దీపారాధన దైవానికి అర్పించడం మానేస్తారని కాదు, ప్రారంభ పూజకు ఆలయ అనువంశిక ధర్మకర్తలు- పోషకులు రాకపోతే ఊరంతటికీ వెలితే, చమురు తీరిపోయిన ప్రమిదలా--

బుచ్చిలపాలెం అల్లంత దూరాన ఉండగానే ఊళ్ళోకి వస్తూన్న కారుని చూసి ఊరి జనం అది యెవరదయి ఉంటుందో ఊహించగలిగారు. మొదట తిరుపతిరావు యెదురుగా రావడం చూసి కారాపి డోరు తెరుచుకుని క్రిందకు దిగాడు రామరాజు. అతడి వెంట సీతాదేవి కూడా దిగి చేతులు జోడించింది. తిరుపతిరావూ అతడి దగ్గరి బంధువులూ భార్యాభర్తలిద్దరికీ యెదుర్కోలు పలుకుతూ “ఎన్నాళ్ళికి యెన్నాళ్ళికి ”అంటూ మెడన పూలమాలలు వేసారు. రామరాజు ధన్యవాదాలు తెలియ చేస్తూ మన సున అనుకున్నాడు ”ఇదంతా నాకు కాదు. నాకోసం కాదు. నాలో నా రూపంలో ఇక్కడి వాళ్ళందరూ దివంగతులైన మా తాతయ్యా బామ్మలను చూస్తున్నారు. రేపు తన తరపున ఆస్త్రేలియా నుండి భాగ్యవతి వచ్చినా విదేశాల నుండి కొడుకులు వచ్చినా ఇదే మర్యాద వాళ్ళకూ లభిస్తుంది. ఈ వాస్తవాన్ని నేనెన్నడూ మరవకూడదు” అనుకుంటూ తిరుపతిరావుని కారులోకి యెక్కించుకుని తమ నాలుగు లోగిళ్ల ఇల్లు చేరాడు. అప్ప టికే అక్కడ చుట్టు ప్రక్కల ఆడాళ్ళు దూరపు బంధవులూ గుమికూడి ఉన్నారు. హారతి తీసి, ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి ప్రవేశించిన తోడనే దంపతులిద్దరూ తిన్నగా వెళ్లి రామరాజు ఫ్రేమ్ చేసుంచిన పూర్వీకుల ఫొటోలకు నమస్కరించారు. అక్కడ రామరాజు దంపతులకు లభిస్తూన్న ఆదరణ గమనించి శ్వేత- హరిప్రియ కండ్లప్పగించి చూస్తూ నిల్చున్నారు. స్నానాలు కానిచ్చి, చావడిలోకి వచ్చి చూసేటప్పటికి నలువైపులా వెండి గిన్నెలూ స్టీలు తపేళాలూ కనిపించాయి. తమకు తినిపించాలని యెంత మంది రైతు కుటుంబాలు ఇవన్నీ చేసి తీసుకు వచ్చారో! అవన్నీ చేయడానికి యెంత పెందలడే మేల్కొన్నారో! అంతటి ఆదరణ వెనుక అబిమానాల వెనుక అప్పటికప్పుడు పెదవి విప్పి చెప్పలేని సామాజిక అంశం ఉందన్నది అతడికి మాత్రమే తెలుసు. ఆ ఊరి రుద్రేశ్వరాలయాన్ని తమ పూర్వీకులు నిర్మించారన్న అంశాన్ని ప్రక్కన పెట్టి చూస్తే కూడా— తన యెరుకలో సామాజిక న్యాయానుసారం- తమ కుటుంబం మరొక కార్యమూ చేసారు. తాతయ్య ఆదేశానుసారం తన తండ్రి నలభై యెకరాల మాగాణిలో పది యెకరాలు మాత్రం ఉంచుకుని మిగతావి సర్వోదయ ఉద్యమ ప్రభావ ఫలితంగా భూమి లేని రైతు కూలీలకు పంచి పెట్టేసాడు. ఇది అంత తేలిగ్గా మరచి పోదగ్గ సామాజికాంశం కాదు కదా! భోజనాలు ముగించి ఆరు బైటకు వచ్చాడు రామరాజు భార్యాసమేతంగా-- దైవ వృశక్షాలైన జువ్వి- మావిడి- మేడి- మా రేడు చెట్లు వాళ్ళను చూసిగావాలి దగ్గరకు రమ్మనమని సైగచేస్తున్నట్టు రెమ్మల చేతులతో పిలుస్తున్నట్లనిపించింది. జీవితంలో యెన్నెన్ని మార్పులు- ఇంకెన్నెన్ని సంఘటనలు-- పలు పొరుగు ప్రాంతాలకు- పలు పొరుగు రాష్ట్రాలకు యెన్నెన్ని బదలీలు- రౌండ్ ది వరల్డ్ వితిన్ యేటీ డేస్ లా-- అంతలోనే అతని కళ్లు పెద్దవయాయి. వేగంగా వెళ్లి అక్కడున్న రచ్చబండ పైన వెళ్లి కూర్చున్నాడు. కళ్ళు కన్నీటితో ఊరాయి. ఇక్కడే బామ్మ ప్రొద్దుటే బడికి వెళ్లే ముందు తనకీ చెల్లికీ రాత్రి మిగిలి పోయిన అన్నం లో పెరుగు జీలకర్ర ఉల్లి ముక్కలు కలిపి ముద్దలు చేసి పెట్టేది, టీ-కాఫీలకు అలవాటు పడవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ-- ఏవీ అప్పటి ఆ ప్యాయతలు అనురాగ స్రవంతులు? ఏరీ ఓర్పుగా బుధ్ది మతులు చెప్పే ఆ కాలపు పెద్దలు? ఇప్పుడివన్నీ చాతక పక్షి ఆకాశం లోకి ఆరాటంతో యెదురు చూసే చిటపట చినుకులే-- ఇక తాతయ్య విషయానికి వస్తే— ఆయన చెప్పిన అమృత వాక్కు తనెన్నటికైనా మరచి పోగలడా! ”ఒరేయ్ రామయ్యా! నేనిప్పుడు చెప్తూన్న మాట నీకు చల్దన్నం మూట వంటిదిరా! నువ్వెక్కడున్నా యేమి తింటున్నా చుట్టూ ఓసారి చూపులు తిప్పి చూడు— ఏదో మూల పొట్ట లోపలకు అతుక్కుపోయే వాడు ఒకడుంటాడు. వాడికి కాస్తంత పంచి మిగతాది ఆరగించు. ఇది నా మాట అ నుకునేవు. కానే కాదు. ఇది సాక్షాత్తు కృష్ణపరమాత్ముడే భగవద్గీతలో చెప్పాడు. ఇక దీనికి యెదురేముంటుంది చెప్పు?” వాళ్లందరూ మంచోళ్లు. పుణ్యాత్ములు. అందుకే మూలుగుడూ సణుగుడూ లేకుండా పుట్టినూరుకి వెళ్ళిపోయినట్టు కైలాసం చేరుకున్నారు. భర్త తడిసిన కళ్లు చూసిన సీతాదేవికి కూడా అసంకల్పితంగా కన్నీటి చుక్కలు నేల రాలాయి. ఒక తెలుగు మహాకవి అనలేదూ- “అశ్రువులు నన్నెపుడు ఆదుకొని వుండాలె— అశ్రువులు లేనట్టి అసువులేల నాకు--“అని.

ఇక అటు చూస్తే శ్వేతా హరిప్రియా చావడిలోకి హరిణల్లా చురుక్కున వస్తూ చటుక్కున దూసుకు పోతూన్న ఆ ఊరి అమ్మాయిల్ని తదేకంగా చూడసాగారు. అందరూ ఒకేలా లేరు. ఒకేలా దుస్తులు ధరించలేదు. కొందరు ఆధునికంగా స్కర్టులు చుడీదార్లు దుపట్టాలు కూడా వేసుకు వచ్చారు, కాని యెక్కువ మంది అమ్మాయిలు ఆ కాలపు తెలుపు నలుపు సినిమాలోని ఆడ పడుచుల్లాగే అమాయకపు చూపులతో కనిపించారు, మళ్లీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నారు. వెండి జడ కుప్పెలు- బుట్ట లోలకులు- పాములా కదిలే వయ్యారపు వాలు జడలు- బంగారు చెంప సరాలు- కాళ్ళకు ఘల్లు ఘల్లుమనే వెండి గొలుసులు- పట్టు పరికిణీ పట్టు ఓణీల రెపరెపలు- వీనుల విందైన మువ్వల సవ్వడి-- వాళ్ళనలా మురిపెంగా చూస్తుంటే- ఇద్దరూ సరాసరి అప్పటి శ్రీరంజని, అంజలీదేవి, భానుమతి- జి.వరలక్ష్మి- షావుకారు జానకి నటించిన సిమాల్లోకి ఊహల తేరు యెక్కి సరాసరి వెళ్ళి పోయారు. మొత్తానికి అక్కాచెల్లెళ్లిద్దరికీ బుచ్చెలపాలెం ఊరు మరచిపోవడం కష్టం. ముఖ్యంగా ఆ ఊరి చిన్నారి అమ్మాయిల్ని మరచిపోవడం యింకా కష్టం, అంతకంటే ముఖ్యంగా— వీధిలో పిల్లకాయలు ఆంక్షలు లేకుండా ఆడుకునే గిల్లీ దండా- అమ్మాయిలు తమను సహితం చేర్చుకుని ఆడుకున్న తొక్కుడు బిళ్ళ- చెమ్మా చెక్కా- దూరాలకు మారు మూలలకు వెళ్లి ఆడుకునే దాగుడు మూతలు- చింతపిక్కలు- గచ్చకాయలు- ఇవన్నీ చివరి వరకూ వాళ్ళ హృదయమందిరాలలో రంగుల మయంగా వడ్డాది పాపయ్యవారి తైల వర్ణ చిత్రంలా నిలచిపోతాయి. పట్నంలో ఇటువంటివన్నీ ఆడితే యేమవు తుంది; కిటికీ అద్దాలు విరుగుతాయి. తలుపుల గొళ్లాలు ఊడుతాయి. ఆటలకు తావులేని స్థలాన,స్వేఛ్ఛకు దారిలేని వాతావరణంలో జీవం యెలా ఉట్టిపడుతుంది? మిగిలిపోయిన జ్ఞాపకాలు మధురంగా యెలా మిగులుతాయి?

మరునాడు ఉదయం ఆలయ ప్రత్యేక పూజకు హాజరయాడు రామరాజు భార్యాసమేతంగా-- రుద్రేశ్వరుడికి అర్పించిన పంచెను తలకు తలపాగా చేసి చుట్టారు ఆలయ ధర్మకర్తలు. సీతాదేవికి పట్టు వస్త్రం అందచేసారు. ధర్మకర్తలు అరుదైన మినహాయింపు నిస్తూ దంపతులిద్దర్నీ గర్భగుడిలోకి వచ్చి ఆశీర్వచనాలు పొందమని ఆహ్వానించారు. కాని రామరాజు సుతారంగా తిరస్కరించాడు. దేవుడి ముందు ప్రత్యేక గౌరవం అంటూ యేముంటుంది? ఎవరికుంటుంది దినమూ దేవార్చన చేసే అర్చకుడికి తప్ప? రుద్రేశ్వరుడి దర్శన భాగ్యం లబించడమే ఒక వరం. ”దజ్ ఫార్ అండ్ నో ఫర్దర్!” అన్న సూక్తి అతడికి బాగా గుర్తు. ఇక విష యానికి వస్తే- తను పుట్టకముందు తను పుట్టిన తరవాత తమ పూర్వీకులు తమ ఇంటి పెద్దలు యెంత మంది యెన్ని సార్లు ఆలయ దర్శనం చేసుకోలేదని? వాళ్లెవరూ ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించలేదు కదా! ఆలయ ఆగమశాస్త్ర నియమాలను అతిక్రమించి అపచారానికి పాల్పడితే యెప్పుడో యెక్కడో కాదు. ఇక్కడే ఇప్పుడే పైనుండి రుద్రేశ్వరుడు