top of page

ఏది ధర్మం


'Edi Dharmam' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

'ఎంకీ!'

వంట్లో ఉన్న శక్తినంతా కూడ దీసుకుని పిలిచేడు పైడయ్య.

'ఒత్తున్నా మావా' అంటూ పొయ్యి ఊదుతున్న గొట్టం అక్కడే పడేసి, పొగబట్టిన కళ్లను నులుముకొంటూ పరిగెత్తుకొని వచ్చి "ఏం మావా?'' అంది వెంకమ్మ వురఫ్ ఎంకి.

"సానా రోజుల్నించీ...నీకో...మాట సెప్పాలనుకొంటున్నానే ఎంకీ!''

తెరల తెరలుగా వస్తున్న దగ్గును ఆపుకుంటూ అంటున్న పైడయ్యతో వెంకమ్మ 'అసలే నీ ఒంటో ఏం బాగానేదు. ఇప్పుడెందుకు మావా? ఆనక సెపుదువుగాని పడుకో గంజి కాత్తున్నాను... ఒట్టుకొత్తాను, కాసింత తాగుదువుగానీ ' అంది.

"పెతీసారీ అలాగే అడ్డు తగుల్తూ నన్ను సెప్పనీడం నేదు నువ్వు, నా పేనం కాత్త పోకముందే సెప్పనీయ్ ఎంకీ" బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు పైడయ్య. మావ నోటిని తన సేత్తో మూస్తూ 'అంత మాటనకు మావా' సెప్పాలని నీకిదిగా ఉంటే సెప్పుమావా' అంది వెంకమ్మ. వెంకమ్మ అలా అనడమేంటి పైడయ్య ఓ దగ్గు దగ్గి "ఎంకీ.. బతికుండగా నాను నిన్నెలాగూ సుఖపెట్టలేకపోయేను. నేను పోయేకయినా నువ్వు సుకపడాలని సెపుతున్నా. నా మాట కాదనకు. నేను పోయేక నీవు మారు మనువు సేసుకుంటానని నాకు మాట యియ్యవే ఎంకీ. ఇదే నా సివరి కోరిక" ఇన్నాళ్ళూ తన మనసులో అణచి ఉంచిన మాటను బయట పెట్టేడు పైడయ్య చెమ్మగిలిన కళ్లతో .

" ఇయ్యాల నీకేం పిచ్చిగాని పట్టిందేటి మావా" పైట చెంగుతో పైదయ్య కన్నీళ్ళు తుడుస్తూ అంది వెంకమ్మ"

" అవునూ నీకేమయిందని పోడం అదీ అంటున్నావ్?"

''ఎంకీ! ఎంత నువ్వు దాత్తే మాత్తరం దాగుతాదనుకున్నావేటే? నాకు తెలీదనుకున్నావేటి? ఆయాల ఆసుపత్రిలో డాట్టరు బాబు సెప్పిన మాటలు. నాకదేదో పెద్ద జబ్బనీ ఆపరేషను సేత్తేగాని బతకననీ ఆపరేసనుకు 50 వేలవుతాయనీ సెప్పడం నాను యినలేదనుకొంటున్నావు నువ్వు. ఇలాంటి జబ్బులు మాతరం బేదం నేకుండా డబ్బున్నోల్లతో పాటు లేనోల్లకీ ఒత్తున్నాయి. కరీదైనోల్లు కరీదైన రోగాల్ని బరించగలరు. కానీ నాలాటోడికి 50 ఏలు ఎక్కడ్నుంచొత్తాయే? 50 ఏలు కాదు గదా 50 రూ. లు కూడ ఇంతవరకూ నే కల్ల సూడనేదు. అంసేత నిన్ను బాద పెట్టేకంటే నాను సచ్చిపోడమే మంచిదే" ఆవేశ పడుతున్న పైడయ్యను అక్కడున్న అల్యూమినియం గ్లాసులోని మంచినీళ్ళు త్రాగిస్తూ " నానేవన్నా తప్పు సేసేనా మావా? సెప్పు అట్టా సేత్తే సిచ్చపడాల్సింది నాకు కాని నీకు కాదు మావా" అని బోరుమంది వెంకమ్మ.

" నువ్వు తప్పు సేసే దానివి కాదనీ, సేయ నేదనీ తెలుసు గనకనే నాను పోయేక మారు మనువు సేసుకోమంటున్నానే నిన్ను ఎర్రి మొగమా!" అన్నాడు పైడయ్య.

" మల్లీ ఆ ఊసెత్తకు మావా!' నీకు దండమెడతాను. నీకేమవదు . నువు సల్లగా ఉంటావు. నాను ననిన్నెలాగైనా బతికించుకొంటాను. సూడు నువు మరేవీ మాటాడక ఇలా పడుకో, గంజట్టుకొత్తాను" అంటూ పొయ్యి దగ్గరకు పరిగెత్తింది వెంకమ్మ.

" అమాయకురాలు... నోట్లు అగుపడితేగానీ నోరు ఇప్పరు డాట్టర్లని తెలీదు దీనికి. నన్ను బతికించుకుంటదట పిచ్చిది" అనుకుంటూ ఓ నిర్జీవమైన నవ్వు నవ్వుతూ సజీవమైన ఎముకల గూడును నులక మంచం మీద వాల్చేడు. వెంకమ్మ మట్టి మూకులో వేడి గంజి తెచ్చి గ్లాసులో పోసి చల్లార్చి పట్టింది పైడయ్యకు. అదే అమృతం పైడయ్యకు. అది త్రాగగానే కాస్త కంటి మీద కునుకు వచ్చింది. ఎప్పుడు నిద్దరోయేడో తెలీలేదు.

***

కంటి మీద వెలుతురు పడగానే తెలివొచ్చింది పైడయ్యకు. కళ్ళు విప్పి చూసే సరికి ఎప్పుడో తెల్లవారి పోయినట్లుండి బాగా ప్రొద్దెక్కింది. 'ఎంకీ' అని పిలిచేడు. జవాబు లేదు. గుడిసె బయట గోలీలాడుతున్న ఓ కుర్రాడ్ని పిలిచేడు....'నారిగా'అని.

' ఏమావయ్యా' అంటూ వచ్చేడు ఓ పదేళ్ళ కుర్రాడు.

" ఎంకి పిన్నమ్మ ఏదిరా?" అడిగేడు పైడయ్య.

" నువు లేత్తే సూడమని ఇప్పుడే ఒత్తాననీ సెప్పి ఎల్లింది . ఏడకెళుతున్నావని అడిగితే అట్టా అడగకూడదు అని ఎల్లిపోయింది" అని చెప్పేడు.

'నానించి పాపం ఎన్ని అవత్తలు పడుతుందో' అనుకుంటూ "పోరా.. పోయి ఆడుకో " అని మంచం మీద నుంచి లేవబోయేడు. కాని తూలి మళ్ళీ కుక్కి మంచంలో కూలబడ్డాడు పైడయ్య.

***

హాస్పటల్ లో అయితే తనలాంటి వాళ్ల వైపు కనీసం చూడనైనా చూడరనీ సరాసరి డాక్టర్లింటికే వెళ్లింది వెంకమ్మ. తన గోడు అంతా చెప్పుకొని ఎలాగైనా తన మావకి ఆపరేషను చేసి బ్రతికిస్తే ఎంత కాయ కట్టం చేసైనా కూలీ నాలీ చేసయినా ఆ 50 వేలు ఎప్పటికైనా చెల్లిస్తానని కాళ్లా వేళ్లా వేడుకుంది. నా పసుపుకుంకుమలు నిలబెట్టమని ప్రాధేయపడింది. కాని ససేమేరా డాక్టరు గుండె కరగలేదు.

" పనయేవరకూ అందరూ ఇలాగే చెప్తారు ముందు. ఆ తర్వాత మరి కనబడరు. ఆ 50 వేలూ తెస్తేనే మరి మాట్లడేది. ఇదేమీ చిన్న ఆపరేషను కాదు. అదీ నువ్వు అంతగా అడుగుతున్నావని తక్కువే చెప్పేను . ఇంకో డాక్టరు దగ్గరి కెళ్లినా ఇంతకంటే ఎక్కువే గాని తక్కువ చెప్పరు. ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను మాట మాటకీ డిస్ట్రబ్ చేసి విసిగించకు. నా టైము వేస్ట్ చేయకు" అని పంపించేసేడు.

'నాను కూటికి లేనిదాన్ని కాని గునానికి కాదు" అన్న సంగతి ఆ డాట్టరు బాబుకే వెరుక? అయినా ఆల్లనీ ఈల్లనీ అని ఏం నాబం! అంతా నా దురదృట్టం. ఎలాగైనా నిన్ను బతికించుకుంటానని మామతో గొప్పలు పోయేను. అయినా నేను బతికుంటే కదా మావని బతికించుకునేది' అనే నిర్ణయానికొచ్చి గబబగా నడవసాగింది వెంకమ్మ.

***

ఓ రోజు గడిచిపోయింది. గూడెంలో పైడయ్యని ఒక్కొక్కరూ వచ్చి పలకరించడం మొదలు పెట్టేరు. " ఎంకేది పైడయ్యా" అని ఒకరంటే " తనకొకటి తెలిత్తేకదా సెప్పడానికి " అని ఇంకొకరు. " అయితే ఎక్కడికెల్లిందంటావు " మరొకరి ప్రశ్న. " ఆ.. ఎక్కడికెల్తాది? తన మావనిలా సూత్తూ కూకుంటే కడుపు తరుక్కుపోతది గాని నిండుతదా? రెక్క విరుచుకొని నాలుగు రాల్లు సంపాదించడానికి ఎల్లుంటది. ఎలాగయినా తన మావకి ఆపరేషన్ సేయించి బతికించుకోవాలని దాని ఆశ".

" ఆశలందరికీ ఉంటాయయ్యా.. కాని ఆపరేషను సేయించాలంటే మాటలా? డబ్బు. డబ్బు ఏడ నించి వత్తాది మనలాటోల్లకి? దానికోసమే ఎల్లుంటుది ఎంకి. ఒచ్చేత్తాదిలే పైడయ్య మావ మరి మేం ఎల్లొత్తాం " అని గుడిసెలోంచి బయటకు వచ్చి వాళ్లలో వాళ్ళు " ఒరేయ్ తవిటయ్యా! ఎంకి ఎందుకెల్లి పోయిందో తెలుసా నీకు ?"

" ఎందుకేటి ?"

" ఈ రోగిట్టోడితోటి అది ఏం కాపురం సేత్తది ఒయసులో ఉన్న ఆడది " ....ఓ కంఠం. " అదో నేకపోతే దాని మావకి ఆపరేషను సేయించడానికి డబ్బు కావాలిగదా డాట్టరును పట్టడానికెల్లిందో, సూడ సక్కగ ఉన్న గుంట ఎవర్ని ఒల్లో ఏసుకున్నా ఏసుకుంటది." మరో గొంతుక. 'మనకెందుకు పోనీలేరా'...ఇలా చెవులు కొరుక్కోవడం గుడిసెలో ఉన్న పైడయ్య వినకపోలేదు. కాని ఏం చేయగలడు. మాటాడే శక్తి లేదు. లేచే శక్తి లేదు లేకపోతే వీళ్ల అంతు చూసేవాడిని అనుకోడం తప్ప. నా ఎంకి ఆనాటి సీతమ్మ నాటిది. దాని మీద యిన్ని అబాండాలు ఏత్తున్నా సరే సీరామసందురోడిలా తను ఒల్లకోవలసి వచ్చింది. ఎంత గోరం అని విలపించేడు. ఈ తాగుబోతునాయాల్లతో నాకెందుకులే అని.

***

రెండ్రోజులైంది. గూడెంలో వాళ్లు ఎవరి పనులు మీద వాళ్లు వెళ్ళిపోయేరు.పైడయ్య మూసిన కన్ను తెరవలేదు. ఏదీ వినిపించుకొనే స్థితిలో లేడు. నోట మాట లేదు. ఊపిరాడుతుంది కాబట్టి బ్రతికున్నట్లు తెలుస్తుందంతే. ఇది తెలిసి రెక్కలు కట్టుకు వాలినట్లు ఎక్కడినుండో ఊడిపడ్డట్టూ ఎంకి ఆయాసపడుతూ పరిగెత్తుకొంటూ వచ్చింది.

" మావా! మావా! అంటూ , కాని ఆ పిలుపు తన మావ వినిపించుకొనే స్థితిలో లేడని గ్రహించింది. వెంకమ్మ గుడిసెలో మంచం మీదున్న పైడయ్యను చూసేక " మావా మావా" అంటూ పట్టుకుని కుదిపింది.

" నేను మావా! నేను. ఎంకిని ఒచ్చేసేను మావా".

'ఎంకీ ' అన్న మాట మాత్రం పైడయ్య చెవిలో ఎక్కడో పడినట్లుంది. అతి కష్టంగా బరువుగా ఉన్న కనురెప్పల్ని విప్పేడు. అంతే ఎంకి రూపు కళ్లబడింది.... మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాడు కాని మాట పెగలడం లేదు.

"నీకాపరేషను సేయిత్తాను మావా! నిన్ను బండిలో తీసుకెల్తాను" అనే సరికి కనీళ్ళు కూడా ఇంకిపోయిన పైడయ్య కళ్ళు మెరిసేయి.

" మావా! యిన్నాళ్ళూ నానెక్కడికి కెల్లేననీ, ఆపరేషనుకి డబ్బెట్ట ఒచ్చిందనీ నువ్వడక్క ముందే నానే సెపుతున్నాను. నువ్వు నన్ను అనుమానించవని తెలిసినా , నాను సేసిన పని తప్పో ఒప్పో సెప్తున్నా. నీకు ఆపరేసను సేయించలేని నాకు బతకాలనిపించలేదు . ఆలోసించేను సివరికి రేలు కిందపడి సచ్చిపోదామని ఎల్లేను. నాను పట్టాల మీద తొంగున్నాను. దూరంగా ఎవరో పట్టాల మద్దిన ఏదో సేత్తున్నట్టు అగుపడింది. ఎవరో పని సేసేవాల్లొ నేక నానాగే ఎవరో సచ్చిపోడానికొచ్చారో.. అయినా నాకెందుకని ఒల్లకున్నా, దూరంగా రేలు కూత యినపడింది. కళ్లు గట్టిగా మూసుకున్నా, సెవులు సేతుల్తో మూసుకొని యిక నా పని సరే అనుకుని నిన్నోసరి తలుసుకున్నా ఎంత సేపటికీ రేలు కూత యినపడనేదు. అల్లంత దూరాన రేలు ఆగిపోయి ఉంది. పరిగెత్తుకొని ఎల్లి సూసేను. ఎవురో పట్టాలు తీసేసేరంట. రేలు పడిపోయిందంట. .. అంతా గోల గోలగా ఉంది. సేవాల మీద పడి సచ్చిపోయినోల్ల తాలూకోల్ల ఏడుపులూ, దెబ్బలు తగిల్నోల్ల కేకలూ. సటుక్కున నా బుర్రకోటి తట్టింది. వెంటనే ముకం ఆనవాలు పట్టలేని ఓ సెవం మీద పడి గుండెలవిసేలా ఏడవడం మొదలెట్టేను. మావా! నువు కోరినట్టే ఆ సచ్చినోడి తోటే నా మారు మనువైపోనాది. పోలీసోల్లొచ్చేరు. ఆఫీసర్లొచ్చేరు. నన్నడిగేరు. ఆ సచ్చినోడు నా పెనిమిటని సెప్పేను. నా పేరు అడిగేరు. ఇతరాలన్నీ అడిగితే ఏవేవో సెప్పేను. రాసుకున్నారు. నా పెనిమిటి పోయేడని సెప్పేను. నీకు కీడు పోతది మావా.. రాతిరంతా ఆ సెవం కాడ ఉన్నాను. పొద్దున్న పోలీసోల్లొచ్చి ఆ సెవాన్ని అట్టుకుపోయేరు. నాకు నట్ట పరీరమట 50 ఏలు ఇచ్చేరు. ఇయిగో మావ, నాను సేసింది మోసం . నాను ఆల్లకు సెప్పింది అబద్దమే కాని నిన్ను బతికించుకోవడానిక్కావలసిన డబ్బు కోసం నానీపని సేయాల్సొచ్చింది మావా. నువ్వేవన్నా అనుకోని, నాక్కావలసింది నువ్వు మావా" అని అంటున్న ఎంకిని చూస్తూ పైడయ్య " నా ఎంకి సంగతి నాకు తెలుసు అది సీతమ్మ ఓరినాటి పతివ్రత" అన్నట్లు చూసిన పైడయ్య చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది వెంకమ్మ. ( ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం “యువవాణి”లో తే.10.5.1991 దీని ప్రసారితమైంది. అమెరికాలోని అంతర్జాల పత్రిక " వాస్తవం " లో తే.25.10.2016 దీని ప్రచురితమైంది. “ఆఫ్ ప్రింట్ “ అంతర్జాలపత్రికలో తే.10.05.2017 దీని ప్రచురితమైంది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం95 views0 comments

Comments


bottom of page