top of page

ఈ జన్మకిది చాలు


Ee Janmakidi Chalu Written By Mohana Murali Kumar Annavarapu

రచన : అన్నవరపు మోహనమురళి కుమార్


రామయ్య గారు జిల్లా పరిషత్ స్కూల్లో లెక్కల మాష్టారు. అయన భార్య సీత. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు కిరణ్. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రామయ్య గారు లెక్కల్లో దిట్ట. ఎటువంటి క్లిష్టమైన లెక్కనైనను కూడా సులువుగా ఎలా చేయాలో విద్యార్థులకు బోధించి లెక్కలంటే ఉన్న భయం పోగొట్టాడు. రామయ్య గారి భార్య సీత ఉత్తమ ఇల్లాలు. రామయ్య గారు నెల నెలా తనకొచ్చే జీతంలోనుంచి కొంత బీద విద్యార్థుల కొరకు తీసి మిగతా జీతం సీతకిచ్చేవాడు. సీత ఆ ఇచ్చిన డబ్బును పొదుపుగా వాడుతూ అందరి అవసరాలు తీరుస్తూ నెలంతా గడిపేది. కిరణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైద్రాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి జీతం. అదే కంపెనీలో పనిచేసే సునీతను ప్రేమించి, తల్లి తండ్రి వద్దన్నా వినకుండా పెళ్లిచేసు కున్నాడు. తమ పెద్దరికం పోకుండా, రామయ్య దంపతులు అక్షింతలు వేసి వచ్చారు. సునీతకు చాలా బాధ్యతలున్నాయి. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు, పెళ్లి కావలిసిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తన ఒక్కదాని జీతం సరిపోదని, భర్త జీతం కూడా ఉంటే బావుంటుందని, కిరణ్ ని ప్రేమ ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంది. తన జీతం తల్లిదండ్రులకు, చెల్లెళ్లకు,ఖర్చు చేసి, కిరణ్ జీతం ఇంట్లోకి వాడేది. ప్రేమించి పెళ్లిచేసుకోవటం, సునీత గడసరి తనంతో కిరణ్ భార్యా విధేయుడై తల్లి తండ్రులను పట్టించుకోవటం మానేసాడు. రామయ్యగారు పదవీ విరమణ చేశారు. వచ్చిన ప్రోవిడెంట్ ఫండ్ డబ్బుల్లోనుంచి కొంత డబ్బుతో అప్పులు తీర్చారు. ప్రోవిడెంట్ ఫండ్ డబ్బులు వచ్చాయని తెలిసి, భార్య సలహాతో కిరణ్ వచ్చి గొడవచేసి కొంత డబ్బు పట్టుకు పోయాడు. మిగిలిన డబ్బు పెన్షన్ వచ్చేదాకా రోజువారీ అవసరాలకు తనదగ్గర ఉంచుకున్నాడు. ఎన్నాళ్లయినా పెన్షన్ శాంక్షన్ కాకపోవటంతో, విషయమేమిటో తెలుసు కుందామని ఆఫీసుకు వెళ్ళాడు. పెన్షన్ కాగితాలు చూసే సీట్లో ఉన్నది రంగారావు. అతను రామయ్యగారి దగ్గర చదువుకున్న వాడే. పని తొందరగా అవుతుందని రామయ్య గారు అనుకొన్నారు. తన పెన్షన్ గురించి అడిగారు రామయ్య గారు. రామయ్య గారి పెన్షన్ కాగితాలు తన దగ్గరే ఉన్నాయని, తను అడిగినంత డబ్బులు ఇస్తే కానీ పెన్షన్ కాగితాలు కదలవని చెప్పాడు.

అప్పుడు రామయ్య గారు "దాదాపు నలభై సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేశాను. నా జీవితమంతా స్కూలుకి అంకితం చేసాను. నీకు కూడా లెక్కల్లో మార్కులు తక్కువ వస్తుంటే ప్రత్యేకంగా నీకు లెక్కలు చెప్పి లెక్కల్లో పాస్ అయ్యేటట్లుగా చేసాను. లేకపోతె నువ్వు పాస్ అయ్యేవాడివి కాదు, నీకు ఉద్యోగం వచ్చేది కాద"న్నారు.

"నాదగ్గర చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో ఉండి కూడా నేను కనపడితే గౌరవంగా నమస్కారాలు పెడతారు. వృధాప్యంలో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంటే చదువు చెప్పిన మాష్టారన్న గౌరవం లేకుండా నన్నే లంచం అడుగుతున్నావ"న్నారు. "ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అదంతా గతం. ఇప్పుడు ఇక్కడ పద్దతి ఇంతే. మీ కిష్టమైతే నేనడిగింది ఇవ్వండి. మీ కాగితాలు కదులుతాయి. లేకపోతే ఇక్కడే ఉంటాయి". "ఆలా అయితే నీ పై ఆఫిసరుకు రిపోర్ట్ చేస్తాన"న్నారు .

"చేసుకోండి, నాకేమి భయం లేదు ఎందుకంటే ఇందులో ఆయనకు కూడా వాటా వుంది. నేనడిగింది ఇచ్చేదాకా, మీ కాగితాలు కదలవు, మీకు పెన్షన్ రాద"న్నాడు రంగారావు. ఇంక చేసేదేమి లేక ఎవరికీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టారు రామయ్య గారు. పి.ఎఫ్. డబ్బులన్నీ అయిపోయాయి. ఆదాయం వచ్చే మార్గం లేదు. ఇల్లు గడవటం కష్టంగా వుంది. కొడుకుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి నీ దగ్గరకు వస్తామన్నారు.

"ఇక్కడ మాకే కష్టంగా వుంది, మా జీతాలు చాలడం లేదు. ఇల్లు కూడా చిన్నది. ఇక్కడ కాస్ట్ అఫ్ లివింగ్ ఎక్కువ. మీరు వస్తే చాలా ఇబ్బంది పడతారు. అక్కడే వుండండి. మీకు నెల నెలా కొంత డబ్బు పంపిస్తాను. మీరు కూడా ఎదో ఒకటి చెయ్యండి. వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడుగా ఉంటాయి. ఎంతకని నామీద అదార పడతారు.అని ఫోన్ పెట్టేశాడు కిరణ్. రెండు, మూడు నెలలు డబ్బు పంపించి తరువాత మానేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా తియ్యడు, లేకపోతె ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చేది. పెద్దతనం, ఎప్పుడూ ఎదో ఒక నలత. మందులకు చాలా ఖర్చు అవుతున్నది. పెన్షన్ రావటం లేదు. ఆదాయం వచ్చే మార్గం లేదు. కష్టపడి కొడుకును పెంచి పెద్దచే సి, చదువు చెప్పించి ఒక దారి ఏర్పరిస్తే, కొడుకు చూడటం లేదన్న దిగులుతో మంచం పట్టారు రామయ్య గారు. భర్తకు తెలియకుండా నాలుగిళ్ళల్లో పనిచేసి ఇంట్లోకి ఏ లోటూ రాకుండా చూసు కుంటున్నది సీత. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారని తెలిసి, సీత రామయ్య గారితో కలసి కలెక్టరాఫీసుకు వెళ్ళింది. ఇంకా సమయం ఉండటం చేత ఓపిక లేక ఒక చెట్టు క్రింద అరుగు మీద కూర్చున్నారు. అక్కడక్కడా చినుగులతో, మాసిపోయిన బట్టలతో ఉన్నారు. వీళ్ళు కూర్చున్న చోటు కలెక్టరుగారి ఆఫీస్ రూమ్ కిటికీలోంచి కనపడుతుంది. ఫైల్లో ఎదో రాసుకుంటున్న కలెక్టర్ గారు తలపైకెత్తి కిటికీ వైపు చూసి మళ్ళీ రాసుకుందామని ఫైల్లో కి చూస్తూ అనుమానం వచ్చి తల పైకెత్తి పరిశీలనగా చూశారు. కలెక్టర్ గారు రామయ్యగారిని గుర్తు పట్టి గబగబా సీట్లోనుంచి లేచి పరుగులాంటి నడకతో రామయ్య గారి దగ్గరకు వచ్చారు.

ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమిటి మాష్టారు! మీరు ఇక్కడేమిటి? ఈ చిరిగిపోయిన బట్టలేమిటి, చెట్టు క్రింద కూర్చోవడమేమిటి...." అంటూ ఆయన చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా ఆయన ఆఫీస్ రూంలోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆయన వెనకనే వచ్చిన బంట్రోతు సీతను చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి రామయ్యగారి పక్కన కుర్సీలో కూర్చో బెట్టాడు.

అప్పుడు కలెక్టరుగారు "మాష్టారూ ! నన్ను గుర్తు పట్టారా" అని అడిగాడు.

పాతబడ్డ కళ్ళజోడు సవరించుకుంటూ "నాకు చత్వారం బాబూ, సరిగా పోల్చుకోలేక పోతున్నాను. ఇంతకీ తమరెవరు, బాబూ " అడిగారు రామయ్య గారు.

" నేనండీ , చంద్రాన్నిమాస్టారూ. నన్ను మీ ఇంట్లో పెట్టుకుని, మీ కన్న కొడుకులాగా చూసి, నన్ను చదివించారు. గురుకొచ్చిందా మాస్టారూ. నేనండీ, ఊరి చివర గుడిసెలో ఉండే దళిత చంద్రాన్ని మాష్టారూ ! మా నాన్న పోయి, మా అమ్మ కూలిపనులు చేసుకుంటూ డబ్బులు లేక చదివించనంటే మీరు ఆదుకుని చదివించారు. నేను కలెక్టర్ని అయ్యానంటే ఇదంతా మీ చలవేనండి" అన్నడు చంద్రం.

రామయ్య గారి మనసు గతంలోకి పరుగులు తీసింది. రామయ్య గారు ఎదో పనివుండి దళిత వాడ మీదుగా వెళుతుంటే ఒక గుడిసెలోనుంచి "ఏందిరా సదూకుంటానంటూ నా పానం తీస్తున్నావు. కూలి నాలి చేసి వచ్చిన ఆ కూసిన డబ్బులు తిండికే సరిపోక పోతుంటే ఇంగ నీకు సదువేమి సెప్పిస్తానురా సెంద్రం" అంటూ ఒక ఆడ గొంతుక గట్టిగా అరుస్తున్నది.

"అదంతా నా కెరుక నేదే. అమ్మా! నేను మాతరం సదూకుంటా "నంటూ ఒక పిల్లాడి గొంతుక ఏడుస్తూ అనటం వినపడ్డది రామయ్య గారికి. లోపలి వెళ్లి సంగతేమిటో తెలుసుకుందామని అనుకున్నారు కానీ, 'మీకెందుకులే బాబూ మా విషయాల'ని అంటారేమోనని ఎటూ పాలుపోక అక్కడే నిలబడ్డారు. ఇంతలో పెద్దగా ఏడుపులూ, దెబ్బలు కొడుతున్నట్లుగా చప్పుడు వినబడేటప్పడికి ఇంక ఆగలేక రామయ్య గారు లోపలి వెళదామని అడుగేస్తుండగా ఆ ఇంట్లోనుంచి ఒక ఆరేళ్ళ కుర్రాడు ఏడుస్తూ, కళ్లు చొక్కాతో తుడుచుకుంటూ కాళ్ళు తపతప కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. ఆ దృశ్యం చూడగానే రామయ్యగారి హృదయం ద్రవించి పోయింది.

"నీ పేరేమిటి బాబూ, ఎందుకు ఏడుస్తున్నావంటూ" తలమీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ అడిగారు.

ఆ ప్రేమతో కూడిన ఓదార్పుకు తట్టుకోలేక బెక్కుతూనే "నా పేరు సెంద్రం. సదూకుంటానంటే సదివించటానికి డబ్బులు లేవంటూ మాయమ్మ కొట్టిందండి" అంటూ వెక్కివెక్కి ఏడవటం మొదలు పెట్టాడు.

చంద్రం తల్లి పుల్లమ్మ బయటకు వచ్చి రామయ్య గారిని గుర్తు పట్టి, "సూడండి పంతులు గారు, కూటికి గడవక ఒక పూట తిని ఇంకొక పూట పస్తులుంటుంటే " చంద్రం వైపు చూపిస్తూ "వీడికి సధువు కావాలంట సధువు. ఇస్కూలుకి పోయి సదూకుంటాడంట. మీరైనా సెప్పండి పంతులు గారు, ఆ సదువులు మాకెట్టా వస్తాయి, మాకేటి లాభం? చివరాఖరికి కూలి చేసుకుని బతకడమేగా మా రాత" అంటూ మొత్తుకుంది

"పుల్లమ్మా! నువ్వుకొంచెం ఆగు, అసలు విషయం నేను కనుక్కుంటాగా అంటూ "ఏరా చంద్రం, నీకు చదువుకోవాలని ఉందా" అని అడిగాడు.

" ఔనండీ, నాకు పెద్ద సదువులు సదూకొని కలెట్టారు అవ్వాలని ఉంద"న్నాడు.

"మీరు నన్ను సదివిస్తారా?" అంటూ ఆశగా అడిగాడు చంద్రం.

"ఆడి మాటలు మీరేమి ఇనకండి బాబూ. ఆడట్టాగే అంటాడు" అంది పుల్లమ్మ.

"నువ్వు కాస్త ఆగు పుల్లమ్మా..." అంటూ "ఏరా చంద్రం, నేను చదివిస్తే నువ్వు బాగా చదువుకుంటావా? " అని అడిగారు రామయ్య గారు.

"మా బాగా సదూకుంటానండి, అన్నింట్లో ఫస్టుగా వస్తానండి. తప్పకుండా కాలెట్టారు అవుతానండి".

అయితే "పుల్లమ్మా .చంద్రాన్ని బాగా చదివించు" అన్నారు.

"ఆడ్ని సదివించటం నావల్ల కాదు పంతులు గారు, నా కాడ ఆ డబ్బు నేదండి."

"నిన్ను చదివించమనటం లేదు పుల్లమ్మా, వాడి సంగతి నాకు వదిలెయ్యి, వాడు చదువుకోవాలె గాని ఎంతవరకైనా నేను చదివిస్తాను. వాడిని మా ఇంటికి పంపించు. తిండి, బట్టలు, పుస్తకాలు అన్ని నేను చూసుకుంటాను. "

"సరే మీ ఇట్టం, వాడికి మీరు సదూ సెప్పిస్తానంటే, వాడు సదూకుంటానంటే నాకేటి కట్టం? అలాగే పంతులు గారు. "

రామయ్య గారు చంద్రాన్ని వాళ్ళింట్లో ఉంచుకొని వాడి చదువుకు కావలసిన పుస్తకాలు, వాడికి బట్టలు తిండి అన్ని రామయ్య గారే చూసుకొంటూ ఆ వూళ్ళో ఉన్నంత వరకు చదివించారు. తరువాత పై చదువులకు చంద్రం హైద్రాబాదు వెళ్ళాడు . రామయ్య గారి శిష్యుడు హైద్రాబాదులో ఐఏఎస్ పరీక్షలకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి కోచింగ్ ఇస్తుంటే చంద్రాన్ని అక్కడ చేర్పించి ఫ్రీగా కోచింగ్ ఇప్పించాడు. చంద్ర ఐఏఎస్ పాస్ అయ్యాడు. సబ్ కలెక్టర్ గా వేరే రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చారు. రామయ్యగారు పదవి విరమణ చెయ్యటం, కిరణ్ తండ్రిని చూడక పోవటంతో, అద్దె భరాయించలేక వూరికి దూరంగా, ఉన్నఇంట్లోకి మారటంవలన చంద్రం సంగతులేవి మాస్టారుకు తెలియలేదు.

గతంలోనుంచి వర్తమానంలోకి వచ్చిన రామయ్యగారు, "ఆ చంద్రం, నువ్వా... ఎంత వాడివయ్యావు? మనూరికే కలెక్టరుగా వచ్చావా? చాలా సంతోషం. నీ ఆశయం నెరవేర్చుకున్నావన్న మాట " అంటూ మెచ్చుకోలుగా చంద్రం వైపు అభిమానంగా చూశారు. "అవును మాస్టారూ, ప్రమోషన్ ఇచ్చి మన ఊరికే బదిలీ చేశారు. నేను ఇక్కడకు వచ్చి రెండు రోజులే అయింది. నేను కలెక్టర్ని అయ్యానని చెప్పి, మీ ఆశీర్వాదం తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా మీరెక్కడున్నారో తెలియలేదు. మీకెన్ని ఉత్తరాలు రాసినా సమాధానంలేదు. మీ గురించి విచారించి తెలుసుకొని మిమ్మల్ని కలవాలనుకొంటుంటే మీరే ఇక్కడ కలిశారు" అన్నాడు చంద్రం.

ఆయన్ని అంత బీద స్థితిలో చూసిన చంద్రానికి హృదయం ద్రవించి పోగా, కళ్ళ నీళ్లతో, "ఏమిటి మాస్టారూ ఇలా వచ్చార"ని అడిగాడు. ఇంకొక కలెక్టర్ అయితే తను ఎందుకొచ్చేవాడో చెప్పేవాడు. చంద్రం దగ్గర తన దీన స్థితిని చెప్పటానికి ఇష్టం లేక "ఏమి లేదు చంద్రం. ఇటు పోతూ పోతూ ఒకసారి కలెక్టరాఫీస్ చూద్దామని వచ్చానని అన్నారు.

"మాస్టారూ నేను మీ శిష్యుడిని, మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు. మీరు ఎందుకు వచ్చారో నా బంట్రోతు అంతా చెప్పాడు"అంటూ అప్పుడే బంట్రోతు తీసుక వచ్చిన కూల్ డ్రింక్స్ ఇచ్చి మర్యాదలు చేశాడు.

"మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం రావడమేమిటి మాస్టారూ, మీకు పెన్షన్ వస్తుంది కదా? మీరు ఈ వూళ్ళో వున్నారేమిటి? కిరణ్ దగ్గర ఉండటం లేదా ?" .

చంద్రం ఆలా అడిగేటప్పటికీ, సీతకి గుండెల్లోనుంచి దుఃఖం తన్నుకొచ్చి, కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుండగా "నాయన చంద్రం, మా పరిస్థితి కన్నకొడుకులాంటి నీతో కాక ఎవరితో చెప్పుకుంటాము? కడుపు కట్టుకొని కిరణ్ కి ఇంజనీరింగ్ చెప్పించాము. చదువైపోగానే హైద్రాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తన ఆఫీసులోనే పనిచేసే సునీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరివీ పెద్ద జీతాలే. మీ మాస్టారు పదవి విరమణ చేశాక "నాకు ఇంకా పెన్షన్ మంజూరు కాలేదు, నీ దగ్గరకు వస్తాము, అందరం కలసి ఉందామని అడిగితే వాడిచ్చిన సమాధానం తెలుసా చంద్రం? వాళ్ళ జీతాలు వాళ్ళకే చాలటం లేదట, ఇల్లు చిన్నదని ఏవో సాకులు చెప్పి మమ్మల్ని అక్కడకు రావద్దన్నాడు. అంతేకాదు, ఒక సొంత గూడు కూడా ఏర్పరుచుకోలేక పోయాము. గుమస్తా అడిగిన లంచం ఇవ్వలేకపోవటం వలన మాకు పెన్షన్ రావటం లేదు.ఒక పూట తిండికి కూడా కష్టంగా ఉంది. అందుకే వచ్చాము. కలెక్టరువి నువ్వని తెలిసుంటే ఈయన రావటానికి ఇష్టపడే వారు కాదు. నీకు తెలుసు కదా మీ మాస్టారు ఎంత అభిమాన వంతులో" అని ఊపిరి పీల్చుకున్నది.

" ఇవన్నీ చంద్రానికి చెప్పాలా?" అన్నారు రామయ్య గారు.

"అయితే కిరణ్ ని పిలిచి మాట్లాడమంటారా మాస్టారూ" చంద్రం అడిగాడు.

" వద్దు చంద్రం, వాడికి స్వతహాగా ఉండాలి కానీ, సిఫార్సులతో ప్రేమలు పుడతాయా, బాధ్యతలు స్వీకరిస్తారా? అన్నారు రామయ్యగారు.

" మీరేమి దిగులు పడకండి మాస్టారూ, అన్ని నేను చూసుకుంటాను" అన్నాడు చంద్రం రామయ్య గారికి ధైర్యం చెపుతూ. వెంటనే చంద్రం పెన్షన్లు చూసే గుమస్తాని, సూపర్ వైజర్ని పిలిపించాడు. వాళ్ళు రాగానే, గుమస్తాని చూస్తూ, "నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రాణం పోతున్నాసరే, లంచం ఇవ్వకుండా పని చేయవుట కదా. మాస్టార్ గారినే లంచం అడుగుతావా? నీ వల్ల చాలా కష్టాలు అనుభవించారు. ఈ క్షణమే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను" అన్నాడు చంద్రం..

సూపర్ వైజర్ని చూస్తూ, "మీరు ఏమి చేస్తారో తెలియదు. ఒక వారం రోజులలో మాస్టారుగారి పెన్షన్, బకాయిలతో సహా అంద చేయాలి. లేకపోతె మీమీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్షణమే మాస్టారు గారికి ఒక పది వేలు మంజూరు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పెట్టండి. సంతకం పెడతాను."అన్నాడు

"సరే సార్,"అని బ్రతుకు జీవుడా అనుకుంటూ వాళ్లిద్దరూ అక్కడనుంచి వెళ్లిపోయారు. చంద్రం, మాస్టారు గారిని, ఆయన భార్యని తన క్వార్టర్స్ కి తీసుకెళ్లి,తన భార్య మంజులను పరిచయం చేస్తూ, ""నా పెళ్ళికి మీకు శుభ లేఖ వేసాను మాస్టారూ, మీరు ఆ చిరునామాలో లేరని తిరిగొచ్చిందన్నాడు." భార్య (మంజుల) వైపు చూస్తూ "నన్ను ఇంట్లో పెట్టుకుని చదివించి, బట్టలు కొనిపెట్టి, తిండిపెట్టి కన్న కొడుకులాగా చూసుకుంటూ నన్ను చదివించారని, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణమని ఎప్పుడూ చెపుతూ ఉండే మాస్టారు గారు వీరే."అని చెపుతూ తన పిల్లలకు తాతయ్య, నానమ్మ అంటూ పరిచయం చేసాడు. తరువాత అందరు కలసి, రామయ్య దంపతులకు పాద నమస్కారాలు చేశారు.

" మాస్టారూ! మీరిద్దరూ బాగా అలసి పోయారు. ముందుగా స్నానం చేసి రండి "అని మంజులని పిలిచి వాళ్ళకి స్నానాలగది చూపించమన్నాడు. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల విందు భోజనం తయారు చేసింది మంజుల. ఇద్దరికీ కొత్త బట్టలు తెప్పించాడు. వాళ్ళు స్నానం చేసి రాగానే, ఇద్దరికి బట్టలు పెట్టి వాళ్ళ చేత కట్టింప చేసి భోజనాల దగ్గర కొసరి కొసరి తినిపించాడు. ఒక గది చూపించి "అందులో రెస్ట్ తీసుకోండి, నేను ఒక సారి ఆఫీసుకు వెళ్లి వస్తాన"ని చంద్రం ఆఫీసుకు వెళ్ళాడు.

"నాకుగాని, మంజులకు గాని తల్లిదండ్రులు ఎవరూ లేరు. అందరూ కాలం చేశారు. మాకు మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఇకనుంచి మీరే మాకు పెద్ద దిక్కు. మీరే మాకు తల్లిదండులు. ఎలాగూ కిరణ్ మిమ్మల్ని చూడటం లేదు. మీకు చాలా ఋణపడి ఉన్నాము. మీరు మాతోనే ఉండండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము. మీకు అన్ని సౌకర్యాలున్న గది ఇస్తాను. హాయిగా మీ మనవడు, మనవరాలితో ఆడుకుంటూ చదువు చెపుతూ, మంచి పౌరులుగా తయారు చేయండి" అని అభ్యర్దించాడు .

"ఎందుకులే చంద్రం, పెన్షన్ మంజూరు చేయించావు. అంతే చాలు. ఇక మా పాట్లేవో మేము పడతాము. నాకెందుకులే అని అనుకోకుండా నీ అంతటా నువ్వే గుర్తు పట్టి, గౌరవ మర్యాదలు చేసి, బట్టలు పెట్టి, విందు భోజనం పెట్టి, కలలో కూడా ఊహించని ఆప్యాయత, గౌరవం, అనురాగం కనబరచావు. నా పర్యవేక్షణలో చదువుకున్న నా ప్రియ శిష్యుడు ఇంత గొప్పవాడయ్యాడంటే నాకు అంతకన్నా కావలిసిన దేముంది" అని ఇంకా మేము బయలు దేరుతామన్నాడు. అప్పుడు చంద్రం. "మాస్టారూ మీరు వెళ్లారంటే నా మీద ఒట్టే అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.

మంజుల కూడా " మామయ్య గారు మీరు ఇక్కడే ఉండాలి, మీ గురించి ఎంతో గొప్పగా చెపుతుంటారు ఈయన. ఇప్పుడు కళ్లారా చూస్తుంటే ఆయన చెప్పింది చాలా తక్కువనిపిస్తోంది. మీరు ఇక్కడే ఉండాలి", ఉంటారంటూ బ్రతిమాలాడింది. చంద్రం పిల్లలు కూడా "తాతయ్య, బామ్మా మీరు ఇక్కడే ఉండండి, మాకు చదువు చెప్పాలి, బోలెడు కథలు చెప్పాలి, మాతో ఆడుకోవాలి" అంటూ కాళ్ళు పట్టేసుకున్నారు.

వాళ్ళ ప్రేమకు కట్టుబడ్డ రామయ్య గారు, ఉండిపోదామని మనసులో నిశ్చయించుకొని "ఏమో నర్రా నాకేమీ తెలియదు. అంతా మీ బామ్మ ఇష్టమన్నారు. చిరునవ్వు నవ్వుతూ భార్య వైపు చూశారు. సీత భర్త మనసును గ్రహించి "సరేనర్రా ఇహ నుంచి మీతో బాటే ఉంటాము, ఎక్కడికీ వెళ్లమం"టూ ఇద్దరు పిల్లలను ఎత్తుకున్నది. పిల్లల సంతోషానికి పట్టపగ్గాలు లేవు, చంద్రం, మంజులల ఆనందానికి అంతే లేదు. రామయ్య దంపతులకి అన్ని సౌకర్యాలున్న గది ఇచ్చారు. ,మంజుల,చంద్రంలు వాళ్ళ అవసరాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ వైద్య పరీక్షలు చేయిస్తూ తలలో నాలుక లాగా నడుచుకుంటున్నారు. రామయ్య గారు పిల్లలకు చదువు చెబుతూ వాళ్ళ తో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే సీత మంజులకి సహాయం చేస్తుండేది. పిల్లలకు స్కూలునుంచి రాగానే స్నానాలు చేయించి, అన్నం తినిపించడం చేసేది. రాత్రిపూట పిల్లల దగ్గర పడుకొని రామాయణ. భారత భాగవతాలు కథలు చెపుతుంటే, రామయ్య గారు పిల్లలకు గాంధీ, నెహ్రు, తిలక్, వివేకానందుల గురించి వారి దేశభక్తిని, నీతి కథలు చెబుతూ, కిరణ్ చూడటం లేదన్న బాధని మర్చి పోయి సుఖంగా వుంటున్నారు. చంద్రం కూడా ఆఫీసునుంచి రాగానే వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వారిని ఎంతో ప్రేమగా చూసు కుంటున్నాడు.

తన సుఖాలన్నీ వదులుకొని పెంచి పెద్దచేసిన కడుపున పుట్టిన కొడుకు బాధ్యతా రహితంగా ప్రవర్తిచటం, తాను చేరదీసి చదివించిన శిష్యుడు చదువుకొని పైకొచ్చి కలెక్టర్ కావటం, ఎంతో ఆదరంగా ప్రేమతో చూడటం తలుచుకొని, కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతుండగా ఈ జన్మకింతకన్నా ఏమి కావాలి, నా జన్మ ధన్యమైందనుకున్నారు రామయ్య గారు. సమాప్తం

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయిరచయిత పరిచయం :


నా పేరు మోహన మురళి కుమార్. నేను పుట్టింది తెనాలి. గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.పుట్టిన తేదీ 15 -7 -1942 . నా కలంపేరు తేజస్విని.నా చదువు వివరాలు బి.ఏ., బి.కామ్., ఎల్.ఎల్.బి. నేను విజవాడలో స్థిర నివాసం, ప్రస్తుతం హైద్రాబాదులో తాత్కాలిక నివాసం.నేనొక గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసరును. నా విద్యాభ్యాసం డిగ్రీ వరకు తెనాలి,, గుంటూరులో, చదివాను. బి.కామ్ ప్రైవేట్ గాను, ఎల్.ఎల్.బి విశాఖపట్నంలో చదివాను. 31 -7 2002 న బందరులో ఆఫీసర్ హోదాలో పదవీ విరమణ చేసాను. ఇంతవరకు ఆరు వందల కవితలు, ఎనభై కథలు,మూడు నాటికలు వ్రాసాను. మూడు వందలకు పైగా నానీలు, వంద మినీ కవితలు, వ్యంజకాలు, కొన్ని గేయాలు వ్రాసినాను. ఇవి అన్నియూ అముద్రితాలే. నా కవితలు కథలు, విజ్ఞాన సుధ (బందరు) భావతరంగిణి (బందరు) రమ్య భారతి (వి జయవాడ) విశాలాక్ష్మి (నెల్లూరు) పత్రికలలో ప్రచురింప బడినsవి. రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో చెలిమి, మానస, పద్మ భూషణ్ గుర్రం జాషువా కళా పరిషత్, దుగ్గిరాల సంస్థలనుండి బహుమానాలు, సన్మానాలు పొందాను. మూడు కథలకు, జాతీయ స్థాయిలో బహుమానాలు వచ్చాయి. 30 కవితా సంకలనాలలో నా కవితలు ప్రచురింపబడ్డాయి.పద్మభూషణ్ గుర్రం జాషువా కళా పరిషద్ దుగ్గిరాల సంస్థ నుండి 'సాహితీ రత్న,బిరుదు ప్రదానం. అనేక శతాధిక కవి సమ్మేళనాలలో పాల్గొన్నాను. జీసస్ క్రిస్ట్ప్రేయర్ ఫెలోషిప్,సంస్థ వారిచే "డాక్టరేట్తో" ప్రదానం. ఉగాది కవి సమ్మేళనాలలో కవిత పఠనాలు, ఉగాది పురస్కారాలు .ఇది సంక్షిప్తంగా నా పరిచయ వివరాలు.. ఏ.మోహన మురళి కుమార్


37 views0 comments

Comentarios


bottom of page