top of page

ఈ జీవితం నీది


'Ee Jivitham Needi' New Telugu Story

Written By Saraswathi Karavadi

రచన : సరస్వతి కరవది




గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ద్వితీయ బహుమతి రూ : 3,000 /- గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.


నిద్ర పోతున్న నళినికి, సెల్ ఫోన్ మోగుతుండటంతో మెలుకువ వచ్చింది.

"అబ్బా అర్దరాత్రి, ఇప్పుడెవరు చేసింది?" బలవంతంగా కళ్ళు తెరిచి అందుకునేలోగా రింగ్ టోన్ ఆగి పోయింది. ఎవరో చూద్దామనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది నళిని. ఆమె ప్రాజెక్ట్ పని మీద న్యూయార్క్ వచ్చి వారమయ్యిందేమో!


"మాధురేమో!"ఒక్క సారి లేచి కూర్చుంది నళిని. కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ ఫంక్షన్ కి రాకుండా చెయ్యి ఇచ్చాక అలిగింది తను మాధురి మీద. ఆఖరికి ఇలా ‘యూ యస్’ కి వస్తున్నానని కూడా చెప్పలేదు.

ఫోన్ అందుకుంది నళిని. మాధురి నెంబర్ నుంచే కాల్. తన నించే పది దాకా మెస్సేజ్ లు, రకరకాలుగా.


"ఏయ్ పిచ్చి మొద్దు. నా మీద కోపమా? క్షమించవే. "

"నళినీ , నువ్వు కూడా నా మీద అలిగితే ఇక అర్ధం చేసుకునేదెవరు?"

"నా బంగారు కదా. ఇంకెప్పుడు ఇలా చెయ్యనే. మాట్లాడవా?"

" ఇదిగో,ఇలాగే మాట్లాడకపోతే నేను మీ ఇంటికి వచ్చేస్తా ఇప్పుడే"

"మన కాలేజీ గ్రూప్ లో అందరికీ అపాలజీస్ చెప్పానే. నువ్వు తప్ప అందరూ జవా బిచ్చారు. నువ్వే అలిగితే నేనేమైపోవాలి?"


చివరి మెసేజ్ నిన్నే ఉంది.

"సరే.. మరి నిన్ను విసిగించనులే. ఆఖరిసారి రేపు ఫోన్ చేస్తా. ఎత్తకపోతే ఇక నేనూ అలుగుతా. నీతో మాట్లాడను. "


ఆ మెసేజ్ చూసుకున్న నళిని నవ్వుకుంది. ఈ మాత్రం డోస్ పడాలి అమ్మగారికి. లేకపోతే ఇలా దిగొచ్చేదా?


రేపు లేవగానే దానితో మాట్లాడాలి. పాపం బాధ పడుతోందేమో. ఆ ఆలోచన నళినిని నిలువనివ్వలేదు. మాధురికి ఫోన్ చెయ్యటానికి సెల్ వైపు చెయ్యి చాచింది . ఈలోగా మళ్ళీ సెల్ మోగ సాగింది. మాధురి నించే. ఇంక లాభం లేదని కాల్ తీసుకుంది నళిని.


"నళిని గారు, నేను తేజని. మాధురి నిన్న హఠాత్తుగా మాసివ్ హార్ట్ అటాక్ తో పోయింది. ఇవాళే క్రిమేషన్.” నళిని నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది.

"ఏమిటి మీరంటున్నది?"


"నిజం. మాధురి ఇక మనకి లేదు" తేజ గొంతులో అంతులేని దుఃఖం. “మనందరినీ వదిలేసి మాధురి వెళ్లి పోయింది." ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేసాడు తేజ. నళిని తల దిమ్మెక్కి పోయింది. ఏమి విన్నది తను? తన ప్రియ నెచ్చెలి మాధురి ఇక లేదా? నిజమేనా? మాధురికి హార్ట్ అటాక్ ఏమిటి?


నిద్ర మత్తు వదిలి పోయింది నళినికి. ఆమె కళ్ళ వెంట నీటి చుక్క రాలేదు. మనసంతా ఐస్ లో పెట్టినట్టు ఘనీభవించి పోయింది. తల విదుల్చుకుని కాఫీ మేకర్ వైపు నడుస్తున్న ఆమెను మాధురి జ్ఞాపకాలు చుట్టు ముట్టాయి, బైట దట్టంగా కమ్ముకున్న మంచులా.

*** *** ***

"ఏయ్ మొద్దు, ఎవర్నో గుర్తు పట్టావా?" ఫోన్ ఎత్తగానే ఉత్సాహంతో ఉర్రూత లూగుతున్న కంఠస్వరం ఒకటి మాధురి చెవులను తాకింది. ఆ గొంతులో ఉరకలేసే ఉత్సాహం వెంటనే మాధురి మనసును తాకింది.


"ఏయ్ నళినీ, ఎలా ఉన్నావే?" నన్ను మొద్దు అని పిలిచేది నువ్వొక్కదానివేనే పిచ్చి మొద్దూ ". గల గలా నవ్వేసింది నళిని.


"ఇంతకీ నా నెంబర్ నీకెలా దొరికింది? నేను ఇండియాకి వొచ్చి ఇంకా వారం కాలేదు!” ఆశ్చర్యంగా అన్నది మాధురి.


"మనసుంటే మార్గాలుంటాయి తల్లీ, మీ అత్తగారు, మా పిన్ని గుడిలో ఫ్రెండ్స్ అని మరిచిపోయావా? నువ్వు హైద్రాబాద్ లో నిన్నే దిగావని ఆవిడ ఈవిడకీ, ఈవిడ నాకూ చెప్పారోచ్. " ఎంత దాచుకుందా మనుకున్నా దాగని ఆనందం ప్రవహిస్తోంది నళిని గొంతులో.


“అబ్బా, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి?" ఆపుకోలేని ఆనందం మాధురి గొంతులో. "నాళ్ళు కాదే బాబూ, ఏళ్ళు అను.అయినా నీకు నేను గుర్తుంటే కదా. యూ.ఎస్ వెళ్లిన కొన్నాళ్ళు ఫోన్లు చేసావు. తరవాత ఇంతే సంగతులు. నేను చెయ్యటానికి అప్పట్లో వాట్సాప్ కాల్స్ లేవు. మామూలు ఫోన్లు చేసే తాహతు నాకు లేదు. "


"నోర్ముయ్యవే." కసిరింది మాధురి. “నేనేదో సంసారం, బాధ్యతలతో తీరక చెయ్యలేదు. అంత మాత్రం చేత నిన్ను మరచి పోయినట్లేనా?"


"అవునమ్మా..మేమే మరి ఖాళీగా కూర్చున్నాం. పెళ్ళైతే చేసుకోలేదేమో కానీ అమ్మా, నాన్నా పెద్ద వాళ్ళై పోయారు. వాళ్ళు దాటిపోయే వరకూ వాళ్ళు మటుకు నా బాధ్యత కాదా? అందులో ఉద్యోగంలో సీనియర్ అయిన కొద్దీ ఇండియా మొత్తం తిప్పారు. ఇక ఆ ఉద్యోగం వదిలేసి కన్సల్టెన్సీ పెట్టుకున్నాక, ఇదిగో హైదరాబాద్ లో స్థిరపడ గలిగాను. " గుక్క తిప్పుకోకుండా అన్నది నళిని.


"సరే లేవే. ఇంకా జెట్ లాగ్ వదల్లేదు. పైగా సామాను సర్దుకోవాలి. రేపో, ఎల్లుండో నేనే ఫోన్ చేస్తాను. నీ నెంబర్ ఇదేగా, సేవ్ చేసుకుంటున్నాను. 'రాక్షసి' అని" ఆఖరి మాటలు కొంటెగా అంది మాధురి.


"నేనూ 'దయ్యం' అని భద్రం చేస్తున్నా నీ నెంబర్. ఫోన్ చెయ్యకపోతే ఇంటికొచ్చి చంపేస్తాను" నవ్వుతూ బెదిరించింది నళిని.


"ఆమ్మో, ఇప్పట్లో చావటానికి నేనురెడీగా లేను. తప్పకుండా చేస్తాను. బై " కాల్ ముగించింది మాధురి.


మాధురితో మాట్లాడాక నళిని మనసు గాలిలో తేలినట్లయిపోయింది. ఎప్పటి స్నేహం! ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే స్కూల్, కాలేజీ. నళిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, డాక్టరేట్ కానిచ్చి, పెద్ద సంస్థలో అనుభవం సంపాదించి,కొన్నాళ్ళు ఉద్యోగం చేసాక, కన్సల్టెన్సీ పెట్టుకుంటే, మాధురి ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా పై చదువులకి ఒప్పుకోలేదనే వంకతో డిగ్రీ తోనే చదువు ఆపేసింది. నిజానికి మాధురికే ఆసక్తి లేదు. ఇల్లు చక్క దిద్దుకోవటం, తోట పనులు,కుట్లు అల్లికలు, చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ కబుర్లు చెప్పటం,బుట్ట బొమ్మలా అలంకరించుకుని, శ్రావ్యంగా పాడటం వంటి వాటిలో ఉన్న ఆసక్తి చదువు మీద ఉంటేగా!


డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళింట్లో డాబా మీదకి పాకిన విరజాజికి వేసిన పందిరి కింద కూర్చుని, భవిష్యత్తు కి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటుంటే, నళిని ఏమో పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుందని మాట్లాడుతుంటే , మాధురేమో ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళని చదివిస్తాను కానీ, నేను చదవనని చెప్పేసింది. అదేదో సరదా కంటోందనుకుంది నళిని. కానీ నిజమే!


వారి ఇద్దరి మధ్య పందేలకు, పంతాలకు, ప్రమాణాలకు ఎప్పుడూ చందమామే సాక్షి. ఆరోజు నళినిచెప్పింది చందమామకు.


"ఓ మామా, నువ్వే సాక్షి. పదేళ్లలో నేను సైంటిస్ట్ ని అయి తీరతాను.నేను కూడా నీ మీదకి రావటానికి చూస్తాను."


"అవునా, ఓ చందమామా నువ్వే సాక్షి నేను పదేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యే తీరతాను. నిన్ను చూపిస్తూనే నా పిల్లలకు గోరుముద్దలు పెడతాను, జోల పాటలు పాడతాను కూడా! ఇదే నా శపథం " వోణి కొంగుని విలాసంగా ఊపుతూ, చందమామకు కన్ను కొడుతూ అన్నది మాధురి అల్లరిగా.


"చాల్లేవే,అదో పెద్ద లక్ష్యం."కినుకగా అంది నళిని. "నీకసలు చదువంటే ఎందుకే అంత అశ్రద్ధ?"


"తల్లీ, ఉపన్యాసం వద్దు. నన్ను వదిలేయ్, నా చదువు, నీ చదువు కలిపి నువ్వే చదువు. నాకేం నీలా దేశాన్ని ఉధ్ధరించే లక్ష్యాలేమీ లేవు. నేను హాయిగా పెళ్ళిచేసుకుని, పిల్లల్ని కంటా. అదైనా అంత తేలికనుకున్నావా? ఏదీ, నువ్వు చేసి చూపించు, చూద్దాం" కొట్టబోయిన నళినిని తప్పించుకుంటూ పరిగెత్తింది మాధురి.


మాధురి వెంట పడుతూ "నేనసలు పెళ్ళే చేసుకోను.చూడు."అన్నది నళిని. ఇద్దరు నవ్వుకుంటూ, ఒకరి వెంట ఒకరు పడుతూ కాసేపు వెన్నెల్లో ఆడుకున్నారు చిన్న పిల్లల్లా. భోజనానికి పిలుపు రాగానే మెట్లుదిగి, మాధురి అమ్మ పెట్టే అన్నం తినటానికి పరిగెత్తారు.


ఆ విషయం గుర్తు రాగానే నళిని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. తమాషా! ఇద్దరూ ఏమవ్వాలనుకున్నారో అదే అయ్యారు. సాధారణంగా అలా జరగదు. తనకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉండగా మాధురి పెళ్లి కుదిరింది. పెళ్ళికి వెళ్ళింది తను. పెళ్ళికొడుకు తేజ. మాధురి అందానికి తగ్గ జోడి. దిష్టి తగిలేలా ఉన్నది జంట.


రేపు మాధురిని చూడబోతోంది తను.ఎలావుందో ఇప్పుడు? ఆ రోజుల్లో మెరుపు తీగలా, కలల సుందరిలా ఉండేది. ఔనూ, అసలు తనెలా ఉందో ఇప్పుడు?ఒకసారి అద్దం ముందుకు వెళ్లి తనను తను చూసుకుంది నళిని. పెద్దగా మార్పు లేకపోయినా ముప్ఫయి ఐదేళ్ల వయసు తెచ్చిన పరిపక్వత, హుందాతనం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు జీవితంలో అనుకున్నది సాధించాలనే ఆశతో కళకళలాడిన కళ్ళు, ఇప్పుడు ఆశించింది సాధించిన సంతృప్తితో తళతళ మెరుస్తున్నాయి.


మర్నాడు ఫోన్ చేస్తానన్న మాధురి ఫోన్ చెయ్యనే లేదు. నళిని అలిగింది.

"నేను నీతో మాట్లాడను పో" అని మాధురికి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ కి ఒక రెండు రోజుల తరువాత జవాబిచ్చింది మాధురి.


"మా తల్లివి కదా,చాలా బిజీగా ఉన్నానే నళినీ. ఇల్లంతా సర్దాలి, పిల్లలని స్కూళ్లలో చేర్చాలి. డ్రైవర్ని కుదుర్చుకోవాలి. పనమ్మాయి, వంట మనిషి, తోటమాలి! మా అత్తగారిని, మామగారిని ఊరినించి తెచ్చేస్తా నంటున్నాడీయన. వాళ్ళు వస్తే నాకింక అసలు ఖాళీ ఉండదు." ఇంచుమించు మాట్లాడినట్లే ఉన్న మెసేజ్ చూసిన నళినీకి మాధురి ఫోన్ చేయలేదన్న గునుపు తీరిపోయింది. మాధురి వచ్చి నెల రోజులైంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నళినికి ఫోన్ చేసిందే లేదు. కాదు కాదు, చేసింది. అన్ని సార్లు ఏదో పని మీదే. ఊళ్ళో షాపుల గురించో లేక మంచి టైలర్ గురించో, అదీ కాకపోతే పిల్లలకి ట్యూషన్ టీచర్ గురించో. ఏ పనీ లేకపోతే ఫోన్ చెయ్యట్లేదు. నళిని వొళ్ళు మండిపోతోంది. కానీ ఏం చెయ్యగలదు? ప్రియ స్నేహితురాలాయె !


అక్కడికీ నళినీయే రెండు సార్లు వెళ్ళింది మాధురి ఇంటికి. ఎప్పుడు చూసినా మాధురి బిజీనే. ఒకసారి కర్టైన్లు కొనటానికి వెళ్తే, ఇంకోసారి మైక్రో వేవ్ కోసమని వెళ్ళిందిట. రెండు సార్లూ వాళ్ళ అత్తగారు, మామగారే ఉన్నారింట్లో. వాళ్ళెంతో బాగా మాట్లాడారు. మాధురి స్నేహితురాలనగానే ఎంతో ప్రేమగా చూసారు. ప్రాణం పెట్టినట్లే ఉన్నారు. మాధురి అంటే వాళ్ళ మనస్సులో ఉన్న అభిమానం మాటల్లో వ్యక్తమైంది. ఆమెని వాళ్ళ కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్ధమయ్యింది. మాధురి తన అత్త, మామల అభిమానం అంతగా పొందగలిగినందుకు నళిని కెంతో ఆనందమనిపించింది.


ఇక లాభం లేదని టైం మార్చి ఒకసారి సాయంత్రం వేళ వెళ్ళింది నళిని. ఇంటిముందు గార్డెన్లో విశ్రాంతిగా కూర్చుని టీ తాగుతున్న వాళ్ళ అత్తగారు, మామగారే కాక ఆడపడుచు కూడా దర్శన మిచ్చింది. వాళ్ళ వదినకి బెస్ట్ ఫ్రెండ్ ని అని తెలియగానే ఆ అమ్మాయి సంబరానికి హద్దే లేదు. మాధురి తన వదినగా దొరకటం తన అదృష్టమని చెప్పింది. తనకి మాధురి వదినే కాదు, మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పింది. నళినికి చాలా సంతోష మనిపించింది. గర్వంగా కూడా అనిపించింది.


మరోసారి రాత్రి పూట ప్రయత్నించింది. మాధురి, వాళ్ళాయన సెకండ్ షో సినిమాకు వెళ్లారుట. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆఖరిసారి మరో రోజున పొద్దున్నే ఏడింటికి వెళ్ళింది. ఈ సారి అయినా మాధురి దర్శన మవుతుందనే తపనతో. ఊహూ, ఈసారి మామగారి చెల్లెలికి కాలు విరిగి ఆపరేషన్ ట. హాస్పిటల్లో ఉన్నది.


మాధురికో స్లిప్ రాసి ఆమె కూతురి చేతికిచ్చి వచ్చింది నళిని. "మాధురీ,ఇక నేను రానే,నీకు ఫోన్ కూడా చెయ్యను.ఎందుకంటే నీదగ్గర, నా కిచ్చేందుకు సమయం లేదు. ఇప్పటికి నాలుగు సార్లు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాను. అసలు నేను వచ్చినట్లు నీకు తెలిసిందో లేదో కూడా నాకు తెలియట్లేదు. కనీసం ఫోన్ కూడా చెయ్యవు. నువ్వు వచ్చావని నేను చెప్పగానే, నిన్ను చూడాలని, మాట్లాడాలని ఎంతమంది మన డిగ్రీ క్లాస్ మేట్సు తపించి పోతున్నారో తెలుసా? నీకు నాకు దర్శనమిచ్చే తీరికే లేదు. అసలు నన్ను మరచి పోయావేమో! నేను, ఒకప్పటి నీ ప్రాణస్నేహితురాలి ననుకుంటున్న నళినీని.నేనూ నిన్ను మరచిపోవాలేమో ఇంక."


మర్నాడు పొద్దున్న ఆరింటికల్లా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరవగానే తుఫానులా మాధురి నళినీని చుట్టేసింది.


"నళినీ, సారీనే. నాకస్సలు టైమ్ దొరకట్లేదంటే నమ్ము. నువ్వొచ్చెళ్ళిన ప్రతీసారీ ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారే. నాకే కుదరక అశ్రద్ధ చేశాను నిన్ను కాంటాక్ట్ చెయ్యటం‌. అర్జంట్ గా కాఫీ పొయ్యి నా మొహాన. మళ్ళీ వెళ్ళి పోవాలి"


మాధురి వచ్చిన సంతోషంతో ఎల్ ఈ డీ బల్బులా వెలగబోయిన నళిని మొహం ఊదేసిన కొవ్వొత్తి లా అయిపోయింది.

"వెళ్ళిపోవాలా!!!"

"వెళ్ళక? తెల్లవారుఝామునే తేజ వాళ్ళ కజిన్, ఫ్యామిలీతో సహా దిగాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి చూపులు, మా ఇంట్లోనే. నువ్వూ వస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు."


వేడి వేడి కాఫీ తెచ్చి మాధురికి ఇచ్చి అంది నళినీ తన నిరాశను కప్పి పుచ్చుకుంటూ హాస్యాన్ని మేళవించి “నేనెందుకు లేవే మధూ! మళ్ళీ ఆ అబ్బాయికి నేను నచ్చితే విషయం తల్లకిందు లౌతుంది."


"ఏడిశావులే, నువ్వూ నీ కొంటెతనమూనూ. త్వరగా తెములు. తేజ లేచే వేళ్టికి ఇంట్లో ఉండాలి. తనకి కాఫీ ఇవ్వద్దూ..."

"నువ్వే ఇవ్వాలా? మీ వంటమ్మాయి ఉందిగా"


"ప్రొద్దున్నే నా మొహం చూసి, నా చేతి కాఫీ తాగక పోతే తేజకి బాగుండదే. నువ్వు తెమలటానికి ఆలస్యమయ్యేలా ఉంది కదా. నేను వెళ్ళిపోతాను. ఏమీ అనుకోకుండా నువ్వొచ్చెయ్యి. సరేనా?? బైదవే నీ చేతి కాఫీరుచి ఏమీ మారలేదు.అద్భుతంగా ఉంది" కాఫీ టేబుల్ మీద పెట్టిన కారు కీస్ అందుకుని మాయమయ్యింది మాధురి.


నళిని ఓ నిట్టూర్పు విడిచి మరో కప్పు కాఫీ కలుపుకోటానికి లేచింది. మాధురి ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు నళినికి.


మరో రెండు నెలలు గడిచాయి. ఆరోజు తరవాత మాధురి నళినీ ఇంటికి రానేలేదు. కానీ గుడ్ మార్నింగ్ మెసేజ్ లు మటుకు పెడుతుంది నళినికి ఒళ్ళు మండి పోయేలా! రెండు మూడు సార్లు నళినీయే వెళ్ళింది మాధురి ఇంటికి. ఒకసారి రాత్రి కూడా ఉండిపోయింది మాధురి బలవంతం మీద. మాధురి మామగారి నుంచి, ఇంట్లో ఉన్న పనివాళ్ళ దాకా అందరూ నళినీతో కూర్చుని సమయం గడిపారు కానీ మాధురి మటుకు నళినీతో రెండు నిమిషాలు కూడ స్థిమితంగా మాట్లాడ లేక పోయింది. తేజ ఆఫీసుకు వెళ్ళే వరకు ఆమె అతని నీడ మాత్రమే. తరువాత మామగారి, అత్తగారి సేవలు, కూతురి మంచీ చెడులు, కొడుకు చదువు సంధ్యలు చుట్టాల రాకపోకలు, పనివారి అజమాయిషీ!


ఆ సంసారం మాధురితో ఎంత పెనవేసుకు పోయిందో అర్థమైంది నళినికి.

మాధురి ఎలాంటి జీవితం కోసం కలలు గందో అదే ఆమెకు దొరికింది. భర్త, పిల్లలే కాదు, అత్త మామలే కాదు,చుట్టపక్కాలతో సహా అందరూ ఆమె చుట్టూ ఆత్మీయ బంధాన్ని అల్లుకున్న వారే. మాధురి చెప్పుకుంటున్నట్లే ఆమె లేకపోతే వారికి క్షణం గడవటం కూడా కష్టం.


మాధురి స్నేహ స్వభావం వల్ల కాలేజీ రోజుల్లో ఆమెకు చాలామంది స్నేహితులే ఉండేవారు. వారందరూ మాధురి ఇండియా కి వచ్చేసిందని విని ఎంతో సంతోషించారు.

ఫోన్లుచేసి మాధురి తో మాట్లాడేవారు. వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానించే వాళ్ళు. ఇంట్లో పార్టీ లకి, పెళ్ళిళ్ళ కీ పిలిచేవారు.


ఒక చక్కని చిరునవ్వు విసిరి "నేనూ, నళినీ కలిసి తప్పకుండా వస్తాం" ఆనేది మాధురి. ఆమెకూ వెళ్ళాలనే ఉండేది. కానీ కుదిరేదే కాదు. ఏదో ఒక పని వచ్చిపడేది. ఒక్కోసారి నళినీకి ఒళ్ళు మండిపోయేది ఆమె చెప్పే కారణాలకి.


"మా పెడ్రోని వెట్ దగ్గరకు తీసుకు వెళ్ళాలే" అనేది ఒక్కోసారి. పెడ్రో వాళ్ళ పెంపుడు కుక్క.

"మా అమ్మాయి తన ఫ్రెండ్ ని లంచ్ కి పిలిచిందే” ఆనేది మరోసారి.

"ఇవాళ మాలి వస్తాడే, మొక్కలు మార్పించమన్నాడు తేజ "అనేది ఇంకోసారి

నళినీ ఉక్రోషపడేది. "నీ పెంపుడు కుక్క పాటి చెయ్యమేంటే నీ ఫ్రెండ్స్ మి" అని లడాయికి దిగేది.


"అలాగని కాదు, పాపం దానికి ఏ ఇంజెక్షనో ఇవ్వాల్సి వస్తే నేనుంటే ధైర్యం కదా” అనేది మాధురి జాలిగా.

ఈ విధంగా మాధురి వచ్చి ఆరు నెలలు దాటిపోయినా పాత స్నేహితులను కలవటానికి కుదరనే లేదు. శాపం పెట్టినట్టు ఫ్రెండ్స్ దేనికి పిలిచినా ఆ రోజు వదిలించుకోలేని పని ఉండనే ఉండేది మాధురికి. ఐతే ఆమె ఇంటికి ఎవరు వెళ్లినా భోజనం చేస్తే కానీ అపర అన్నపూర్ణ లాగా వదిలేదే కాదు. ఇంట్లో అందరు కూడా ఎంతో ఆదరించేవారు వాళ్ళని.


ఒకరోజు నళిని ఫోన్ చేసింది మాధురికి. "మధూ ,ఇది మనవాళ్లందరినీ కలిసేందుకు సువర్ణావకాశం. మన ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ వచ్చే నెల పదిహేనున గుంటూరులో జరగబోతోంది. ఇందాకే తెలిసింది నాకు. మన క్లాస్ మేట్ రఘు ఫోన్ చేసాడు. నన్నే ప్రోగ్రాము తయారు చేయమన్నాడు. ఆ రోజుకి నువ్వు మీ ఇంట్లో వాళ్లందరికీ చెప్పి ఫ్రీగా ఉండు. మనం వెళ్ళి తీరాలి. ముందే చెప్తున్నాను."మాధురి కూడా చాలా సంతోష పడింది.


"ముందే చెప్పి మంచి పని చేసావు. మా తేజ అనుమతి తీసుకుంటాను. అన్నట్టు నేను ఓ పాట పాడవచ్చా నళినీ ?"


"ఎందుకు పాడకూడదు ? నువ్వెంతమందికి అభిమాన గాయనివో నీకు తెలియదు. మంచి పాట సాధన చెయ్యి." ప్రోత్సహించింది నళిని.


ఆ రోజు నించి వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రోగ్రాం గురించి చాలా చర్చలే జరిగాయి. మాధురి తనకు తోచిన సలహాలను నళినికి ఫోన్ లోనే చెప్పేది. ఇద్దరు కలిసి కలవబోయే స్నేహితులకి చిన్న చిన్న బహుమతులు కొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్న ప్రయాణం రానే వచ్చింది.


"నేను మీ ఇంటికి వచ్చేస్తా. అక్కడనించి నీ కార్లోనే వెళ్దాం .ఇక్కడ నించి అయితే తెమలలేను" అన్నది మాధురి.


"మా తల్లే. రాఅమ్మా. నీ కంత మంచి బుద్ధి పుడితే నే కాదంటానా? సాయంత్రం నాలుగు కల్లా రా. సిద్ధంగా ఉంటాను. వెంటనే బయల్దేరితే రాత్రి పదింటికల్లా వెళ్లిపోగలము."

"డన్ " ఉత్సాహం పొంగి పొర్లింది మాధురి గొంతులో.


నాలుగింటి కల్లా సామాను ప్యాక్ చేసుకుని రెడీగా ఉంది నళిని. మాధురి ఫోన్ చేసింది బయలు దేరుతున్నానని. 'హమ్మయ్య' అనుకుంది నళిని. ఇన్నాళ్ళకి మొదటిసారి మాధురి ఇల్లు విడిచి బయటకు వస్తోంది. మరీ వంటింటి కుందేలయి పోయింది. అసలు దానికి అంటూ ఉన్న అభిరుచులు, ఆనందాలు, అలవాట్లు అన్నీ మరిచిపోయి, సంసారానికి అంకితమై పోయింది. ఆశ్చర్యమేంటంటే తనేదో కోల్పోయానని అనుకోవట్లేదు మాధురి. జీవితానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తోంది. ఆలోచిస్తుండగానే ఫోన్ మోగింది. మాధురే .

అనుమానంగానే ఫోన్ ఎత్తింది నళిని.


"సారీనే. నేను రాలేకపోతున్నాను. మా మామగారికి ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువైపోయింది. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి."

"తేజ లేడా?"


"ఉన్నారనుకో. కానీ మావయ్య పసిబిడ్డలా నువ్వెళ్ళి పోతావా అమ్మా అని కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు నా చెయ్యి పట్టుకుని. ఎలా వదిలి వచ్చేది? ఇటువంటి మీట్ కి వచ్చే సారైనా రావొచ్చు. కానీ నేను లేకపోతే ఇక్కడ జరగదే" నచ్చచెప్తున్నట్లు అన్నది మాధురి. నళినికి కోపంతో, నిస్సహాయతతో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఎన్నికలలు కంది ఈ ట్రిప్ గురించి!


"మంచిది" అని మాధురి ఇంకేదో మాట్లాడబోతుండగా కాల్ కట్ చేసేసింది నళిని.

ఆ తరువాత నళిని ఊరు వెళ్ళింది, వచ్చింది. కానీ మాధురి మీద కోపం మటుకు తగ్గలేదు. ఎంతమంది పెళ్లిళ్లు చేసుకోలేదు? ఎంతమందికి సంసారాలు లేవు? అందరు మాధురి లానే ఉన్నారా? ఆ కోపంతోనే మూడునెలల ప్రాజెక్ట్ పని మీద మాధురితో చెప్పకుండానే యూ ఎస్ వచ్చేసింది నళిని.


*** *** ***

మాధురి అప్పట్నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా నళిని ఆ కోపంతోనే ఫోన్ కాల్ తీసుకోలేదు. కానీ అప్పుడు తెలియదు నళినికి, తన ప్రాణ స్నేహితురాలు ఈ లోకాన్ని వదలి వెళ్లి పోతుందని. తనిక శాశ్వతంగా మాధురిని చూడలేనని, తనతో మాట్లాడలేనని. ఒక్కసారి మాట్లాడి ఉంటె ఎంత బాగుండేది? ఒక్క మెసేజ్ కి జవాబిస్తే మాధురి ఎంత సంతోష పడేది? ఎందుకీ పిచ్చి కోపం తనకి? ఇప్పుడు కావాలంటే మాధురి వస్తుందా? వెక్కి వెక్కి ఏడ్చింది నళిని. మాధురి స్నేహం తన జీవితంలో ఒంటరితనం అనే ఎండలో చల్లనినీడ నిచ్చే చెట్టు. తను అలిగి ఆ చెట్టును వదిలేసి వచ్చేసింది. ఆ ఆలోచనతో పేరుకు పోయిన దుఖం కరిగి నళిని కళ్ళవెంట నీటి ప్రవాహ మయ్యింది.

*** *** ***

తరువాత మూడు నెలలు ప్రోజెక్ట్ పనిలో మునిగి ఉన్నప్పటికీ, మాధురి లేని ప్రపంచంలో తను ఉన్నానన్నది నళినికి ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నది. తనకే ఇలా ఉంటె తేజ ఎలా ఉన్నాడో? మాధురి పిల్లలు, అత్తగారు, మామ గారు! వీళ్లంతా మాధురి పంచ ప్రాణాలు. మాధురి చుట్టూ అల్లుకున్న తీగెలు. వాళ్ళసలెలా ఉన్నారో!


ఇండియాకి రాగానే వణికే చేతులతో తేజకి ఫోన్ చేసింది నళిని, ఆ మర్నాడు ఇంటికి వస్తానని చెప్పటానికి. అవతల ఫోన్ ఎత్తే తేజ ఎలా ఉన్నాడో? ఏమంటాడో? అతడి నసలు ఎలా ఓదార్చాలో? మాధురి లేని తేజను ఊహించుకుంటేనే ఆమె కాళ్ళు చేతులు వొణుకుతున్నాయి.


"హలో" అది తేజ గొంతు కాదే!

"నేను వంట మనిషినమ్మా! అయ్యగారు బయట కెళ్లారు. సెల్ వదిలేసి వెళ్లారు" తనకు ఫోన్ చెయ్యమని పేరు, నెంబరు చెప్పి కాల్ కట్ చేసేసింది నళిని.


తేజ రాగానే ఫోన్ చేసాడు. "సారీ నళిని, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను స్విమ్మింగ్ కి వెళ్ళాను. వంటమ్మాయి చెప్పింది. ఎలా ఉన్నావు?"గొంతు చాలా మామూలుగా ఉంది. షాక్ తిన్నట్లయ్యింది నళినికి. తమాయించుకుని అడిగింది.

"ఆ ప్రశ్న నేనడగాలి. నువ్వెలా ఉన్నావు? నీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు తేజా. పిల్లలెలా ఉన్నారు? మీ అమ్మా నాన్నా? చాలా బాధగా ఉంది మిమ్మల్నందరినీ తలుచుకుంటే" నళిని గొంతు వణికింది.


"బాగున్నాం నళినీ. పిల్లల్ని చూసుకునేందుకు ఒక ఆయాని పెట్టాను. చాలా బాగా చూసుకుంటోంది. ఇక అమ్మని నాన్నని చూసుకునేందుకు ఇద్దరు నర్సులని పెట్టాను. వంటమ్మాయి ఉండనే ఉంది. ఏదో గడిపేస్తున్నాంలే. జీవితం మనకోసం ఆగదు కదా! సరే, వీలు చూసుకుని ఒక సారి రా మరి!”


"తప్పకుండా" అంటూ ఫోన్ పెట్టేసింది నళిని. ఆమె కెందుకో మాధురి, ఆమె ఆ కుటుంబం కోసం పడ్డ తాపత్రయం గుర్తొచ్చి గట్టిగా ఏడవాలనిపించింది. ఏమిటీ జీవితం? అనుబంధానికి అర్ధం ఏమిటి? తనని ప్రాణాధికంగా ప్రేమించిన మాధురి చనిపోతే, తేజా తనకి కలిగిన అసౌకర్యాలని ఎలా అధిగమించాడో చెప్తున్నాడే కానీ, మాధురి పోయిన వెలితి గురించి మాట్లాడనే లేదు. తేజ గొంతులో ఎక్కడా విచారం వినపడలేదు. మాధురి లేని లోటు అతన్ని బాధించట్లేదా? మాధురి చేసే పనులను నలుగురు పనివాళ్ళు చేసేస్తున్నారు సరే, మాధురి పంచిన ప్రేమ మాటేంటి? ఈ మాత్రం దానికేనా మాధురి తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కకి పెట్టి, కుటుంబమే తనలోకంగా బ్రతికింది?


వాళ్ళ సౌఖ్యమే తన ఆనందంగా తలచింది? ఒక మనిషి ఉనికిని మూడు నెలలు కాకుండా మరచి పోగలిగేలా అయితే పెంచుకున్న బంధాలకి విలువేమిటి? ఈ తేజ తన వాడని, ఇతని కుటుంబం తనదని అనుకుని మాధురి ఎన్ని వదులుకుంది? అందరితో బంధాలని, బంధుత్వాలని, స్నేహాలని, సాంఘిక జీవనాన్ని! ఆఖరికి వాళ్ళ అమ్మ, నాన్నల యాభయ్యవ పెళ్లిరోజు అని జరిపిన ఫంక్షన్ కి కూడా, చిన్నత్తగారి షష్టిపూర్తి అని వెళ్ళలేదు. ఆ కుటుంబం తాను లేకపోతే నిలవదు అనుకుంది!. పిచ్చిది.


"జీవితం ఎవరికోసం ఆగదుగా"! తేజ మాటలు చెవుల్లో మ్రోగాయి నళినికి. గుండె మెలి తిప్పినట్లయ్యింది. మనసు మూగగా రోదించింది. మాధురి కూడా జీవితం ఎవరి కోసం ఆగదని గుర్తించి, అందులో కొంత భాగాన్నైనా తన కోసం జీవించి ఉంటే ఎంత బాగుండేది! తమ జీవితం తమ కోసం కాకుండా కుటుంబం కోసమే జీవించే మాధురులు ఇంకా ఎందరో ఈ లోకంలో!

***



రచయిత్రి పరిచయం : సరస్వతి కరవది.

నేను స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగినిని. మా వారి పేరు వరప్రసాదరావు. కథలు, కవితలు, సమీక్షలు వ్రాయటం, బొమ్మలు వేయటం, నటన, పుస్తకాలు చదవటం, ప్రకృతి ని ఆస్వాదించటం వంటివి నా అభిరుచులు. తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. రచనలు చేయటానికి సమయం మటుకు ఈ మధ్యే లభించి వ్రాయగలుగు తున్నాను. రమారమి ఒక ముప్ఫై కథలు వ్రాసి ఉంటాను. స్వాతి, నవ్య వంటి పత్రికలలో కొన్ని పబహుమతులు కూడా పొందాయి. ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో కూడా నా కథలు పెడుతుంటాను.





1,382 views1 comment
bottom of page