top of page

ఎమోషనల్ బ్లాక్ మెయిల్!


'Emotional Black Mail' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త


“నీలో ఈ అసహనానికి కారణం ఏమిటి కావ్యా ?

నీ మీద ప్రేమగా చేయివేస్తే దూరంగా తొలిగిపోతావు!

సరదాగా జోక్స్ వేస్తే మాట్లాడకుండా, మౌనంగా ఉండిపోతావ్!

సినిమాకి వెళదామంటే, రాలేను, తలనొప్పి అంటావు!

ఎందుకలా ఉంటావు కావ్యా! పెళ్లి అయి మూడు సంవత్సరాలైనా నాతో ఎందుకంత బిడియంగా తప్పుకు తప్పుకు తిరుగుతావు ?

ఎన్నో కలలు, ఆశలు, ఆకాంక్షల తో కలసి సంసారం చేయవలసిన వాళ్లం, అదేమిటీ నీవు ఎప్పుడూ విరాగిణిలా మౌనంగా ఉంటావు ?

తన భర్త ఇలా ఉండాలి. అలా ఉండాలని చాలామంది అమ్మాయిలు లెక్కలేసుకుంటూ ఉంటారు. అబ్బాయిలు కూడా అంతే. తన భార్య సంతోషంగా ఉండాలని. సంతోషాన్ని పంచాలని ఆశిస్తారు. నీలో ఏ చిన్న కోరికా లేనట్లు గా ఉంటావు.

నా ఫ్రెండ్ కిరణ్ ను అతని భార్య సంధ్యను చూడు. ఎంత సరదాగా ఉంటారో ఇద్దరూ. ఒకరు మీద మరొకరు జోక్స్ వేసుకుంటూ, ఎక్కడ చూసినా వారిద్దరే! మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా!

ఎంత తరచి అడిగినా నీ మనసులోని భావం చెప్పవు! మీ అమ్మగారు, నాన్నగారు ఫోన్ చేసినప్పుడల్లా, మీరిద్దరూ బాగున్నారుకదూ, తొందరలో మనవడినో మనవరాలినో ఇవ్వండి అంటారు. మీ అమ్మగారైతే మాకు ఓపిక ఉన్నప్పుడే కనేయండి పిల్లలని అని అంటారు. నాకు పిల్లలంటే ఇష్టం లేనట్లుగా ఆవిడ భావిస్తారు. అమ్మ అయితే నేను ఫోన్ చేసినప్పుడల్లా, శుభవార్త ఏమీ లేదా అంటుంది. ఆ మధ్య అమ్మ నిన్ను కూడా పిల్లల గురించి అడిగారని ' ఎప్పుడూ అదే గొడవ మీ అమ్మకు అంటూ విసుక్కున్నావు కూడా! వింటున్నావా కావ్యా” అంటూ లాప్ టాప్ లోకి చూసుకుంటూ తలొంచుకుని మాట్లాడుతున్న వంశీ తలెత్తి కావ్యకేసి చూడాలనుకున్నవాడు కావ్య అక్కడ లేకపోవడం చూసి అవాక్కైనాడు.

తను మాట్లాడుతుంటుంటే కావ్య ఇంతవరకు ఇక్కడే ఉంది అనుకుంటూ. తన మాటలు ఇష్టంలేక వినలేనట్లు అక్కడ నుండి వెళ్లిపోయింది. ఏమిటీ కావ్య మనస్తత్వం అనుకుంటూ బరువుగా నిట్టూర్చాడు!

వంశీ కు కావ్యతో పెళ్లి అయి మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఇద్దరూ అమెరికాలో ఉంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. పైగా కావ్య వాళ్ల నాన్నగారికి వంశీ వాళ్ల నాన్నగారైన సూర్యనారాయణ గారితో స్నేహం కూడా ఉంది. చిన్నతనంలో ఇద్దరూ ఒక ఊరి వారే అయిన మూలాన కలసి చదువుకోవడం, తరువాత ఉద్యోగరీత్యా సూర్యనారాయణ గారు హైదరాబాద్ వచ్చేయడంతో గ్యాప్ వచ్చేసింది.. సూర్యనారాయణ కొడుకు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఎవరి ద్వారానో విని ఆఘమేఘాలమీద సూర్యం గారి దగ్గరకు వచ్చేసి తన కూతురు బి.టెక్. కంప్యూటర్ సైన్స్ చేసిందని, అందమైనదని ఫొటో చూపించడం, ఆ ఫొటోను స్కాన్ చేసి సూర్యంగారు వంశీకి పంపడం, వంశీకి నచ్చేయడం, ఆ తరువాత నిశ్చితార్థం , పెళ్లి అది కూడా వెంట వెంటనే జరిగిపోవడం, వంశీ తో కావ్య అమెరికా వెళ్లిపోవడం జరిగిపోయింది!

అమెరికా వెళ్ళాక వంశీ కావ్యను ఏవేవో కోర్సులో జాయిన్ చేసి, మెల్లిగా ఒక సంవత్సరం దాటాక తను పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం వచ్చేటట్లు చేసాడు!

అమెరికా వాతావరణం అలవాటు కావడానికి, ఉద్యోగం లో నిలదొక్కుకోవడానికి కావ్యకు చాలా సమయం తీసుకోవడం తో వంశీ పిల్లల గురించి ఎక్కువ పట్టించుకోలేదు. కావ్య అలా దూర దూరంగా అంటీముట్టనట్లు ఉన్నా కారణం ఏమై ఉంటుందా అన్న ఆలోచన రాలేదు.

ఉద్యోగం, వాతావరణం బాగా అలవాటైనా, కావ్య ఎప్పుడూ వంశీకి టచ్ మీ నాట్ గా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండడం, అర్ధరాత్రివరకు లేప్ టాప్ ముందు కూర్చుని ఉండడంతో కావ్య పట్ల ఏదో తెలియని అసహనం ఏర్పడిపోయింది వంశీకి. పెళ్లి అయి మూడేళ్లే అయినా ముఫై ఏళ్లు గడచినట్లుగా నిర్లిప్తత కావ్యలో! ఎంత తరచి అడిగినా కావ్య ఏమీ లేదంటూ తప్పించుకోవడం చేసేది.

కావ్యకు తను ఏదీ లోటు చేయలేదు. కిందటిసారి ఇండియా వెళ్లినపుడు కావ్యకు నచ్చిన జ్యూయెలరీ చాలా కొని ఇచ్చాడు. ఏది కావాలంటే అది చేస్తున్నాడు. వంశీకి గ్రీన్ కార్డ్ ఉన్న మూలాన కావ్యకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చేసింది. కావ్యకు నచ్చిన ఇల్లు కొన్నాడు. ఫర్నిచర్, కారు అన్నీ కావ్యకు నచ్చినట్లుగానే కొన్నాడు.

కావ్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు, కాని కావ్య ? ఎందుకు అలా ఉంటుందో అర్ధం కావడంలేదు!

ఒకరోజు అర్ధరాత్రి వంశీ లేచి చూసేసరికి కావ్య బెడ్ మీద లేదు. హాల్లో లాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది.


అది చూసిన వంశీ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లాడు. భుజం మీద చెయ్యివేసేసరికి కావ్య గాభరాపడ్తూ తలెత్తి చూసింది. బాగా ఏడ్చినట్లుగా కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఎవరితోటో చాటింగ్ చేస్తోంది. గబుక్కున లాప్ టాప్ మూసివేయబోయేసరికి వంశీ బలవంతంగా ఆమె చేతిలోని లాప్ టాప్ తీసుకుని చూసాడు.

అక్కడ చాటింగ్ లో ఎవరో క్రిష్ణ అని ఉంది. అతను చాట్ చేస్తున్నాడు, కావ్యను మరచిపోలేక పోతున్నానని, కావ్య జ్నాపకాలతో పిచ్చి వాడిని అవుతున్నానని ఉంది!

ఒక వారం క్రితం కావ్యను మరచిపోలేక చచ్చిపోవాలని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నానని, ఆఖరి దశలో డాక్టర్సే తనను బ్రతికించారని టైప్ చేసి ఉంది.

అతనికి తెలీదు, అతని చాటింగ్ వంశీ చూస్తున్నాడని. అలా టైప్ చేస్తూనే ఉన్నాడు క్రిష్ణ!


వంశీ కి విడాకులు ఇచ్చేసి వచ్చేయమని, ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ!

కావ్య ఏ విషయమూ వెంటనే చెప్పాలని తను డిప్రెషన్ లో కూరుకుపోతాన్నానంటూ.

నీవు నీ భర్తతో ఆనందంగా ఉంటూ, నన్ను పట్టించుకోవడంలేదని, కావ్య లేని బ్రతుకు తనకు శూన్యమని ఏదో ఓ రోజు తను శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి అందనంత దూరం వెళ్లిపోతానంటూ..

అలా చాట్ చేస్తూనే ఉన్నాడు క్రిష్ణ!

వంశీ కావ్య వైపు చూస్తున్నాడు. కావ్య గాభరా పడిపోతోంది. కళ్లమ్మట నీళ్లు కారిపోతున్నాయి!

‘ఓకే. క్రిష్ణా, గివ్ మి సమ్ టైమ్ టు ధింక్.’ అంటూ కావ్య చేసినట్లుగానే టైప్ చేసి. బై. చెబుతూ ఆ చాటింగ్ పూర్తిచేసాడు!

కిచెన్లోకి వెళ్లి రెండుకప్పుల్లో కాఫీ తయారు చేసి కావ్య దగ్గరకు వచ్చాడు. కావ్య అలాగే తల వంచుకుని కళ్లమ్మట కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటోంది! వంశీ కాఫీ తాగమని ఇచ్చాడు. మాట్లాడకుండా కాఫీ కప్పు తీసుకుంది!

“ఏమైంది కావ్యా, ఎవరతను?” అంటూ నెమ్మదిగా కాఫీ తాగుతూ అడిగాడు వంశీ.

“ప్లీజ్ వంశీ, ఇప్పుడేమీ చెప్పలేను నేను, నన్ను వదిలేయ్ కొంచెంసేపం”టూ బెడ్ రూమ్ లోకి వడి వడి గా వెళ్లిపోయింది!

కావ్య చెప్పేవరకూ తను వెయిట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు.

మర్నాడు లేచి ఇద్దరూ మౌనంగా తయారయి ఆఫీసుకి వెళ్లిపోయారు.

ఇద్దరి మధ్యా మాటల్లేవు!

వంశీకు పదకొండు గంటలకు కావ్య నుండి మెయిల్ వచ్చింది!

ఆ మెయిల్ పూర్తిగా చదివిన వంశీ ముఖం తెల్లగా పాలిపోయింది!


“కావ్య తను ఇంజనీరింగ్ లో ఉండగా తన సీనియర్ అయిన రవిక్రిష్ణ ను ప్రేమించానని, అతనితో చాలా సన్నిహితంగా ఉండేదాన్నని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కావ్య తండ్రికి ఈ విషయం తెలుసునని, ఆయనకు తమ ప్రేమ ఇష్టం లేదని, అతని కులమే కాకుండా, అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితులూ అవీ నచ్చక, కావ్య ప్రేమని కాదని, కావ్య ఎంత చెప్పినా వినకుండా, కావ్య వంశీను చేసుకోపోతే కావ్య తల్లీ తండ్రీ ప్రాణాలే తీసుకుంటామని తమ మీద ఒట్టువేసుకుని మరీ తన వివాహం చేసారని వ్రాసింది. తనకు వంశీతో పెళ్లి ఇష్టం లేకనే అతనితో ఒక భార్యగా ఉండలేక పోతున్నానని వ్రాసింది. రవిక్రిష్ణను మరచిపోలేక పోతున్నానంటూ వ్రాసింది. తనకోసం క్రిష్ణ ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడని, ఆ విషయాన్ని తను తట్టుకోలేక పోతున్నానని వ్రాసింది. ఇప్పటకీ క్రిష్ణ మీద తన ప్రేమ అలాగే ఉందని, వంశీ తో జీవితం కొనసాగించలేనని, విడాకులు ఇచ్చేస్తే తను రవిక్రిష్ణను పెళ్లి చేసుకుంటానని ఆ మెయిల్ సారాంశం”.

అయిపోయింది. తన కలలు అన్నీ సర్వ నాశనం అయిపోయాయి. కావ్యను తను ఎంతగానో ఇష్టపడ్డాడు. కాని కావ్య తనను ఇష్టపడలేదు. ఆమె మనసులో మరెవరో. హే భగవాన్, వంశీ కళ్లనుండి కన్నీటి ధారలు!

తను మోసపోయాడు. అవును. ఇన్నాళ్లూ కావ్య తనదే అనుకున్నాడు. ఏమి చేయాలిప్పుడు? కూతురు ప్రేమ సంగతి తెలిసి కూడా కావ్య తండ్రి దాచిపెట్టి కావ్యను తనకిచ్చి పెళ్లిచేయడాన్ని భరించలేక పోతున్నాడు. వంశీతో పెళ్లి జరిపించేస్తే కావ్య తన ప్రేమను మరచిపోయి వంశీతో సర్దుకుపోతుందనుకున్నాడు. ఆయన తెలివికి జోహార్లు! ఆయన ఆలోచనలలో తనని ఇరికించి బలిపశువుని చేయడం ఎంతవరకు న్యాయం? కావ్య వాళ్ల కుటుంబం డాడీకి బాగా తెలుసునని, మంచి మనుషులని తెలిసి తను కావ్యతో వివాహానికి అంగీకరించాడు. కాని కావ్య? తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ముందుగా కావ్య తనకు చెప్పినా ఈ పెళ్లి జరిగేది కాదేమో! పెళ్లి అయినా, భర్త తన పక్కనే ఉన్నా, మానసికంగా తను ప్రేమించినవాడితోనే ఉంది. ఏమిటి దీని పరిష్కారం, కావ్య కోరినట్లు చేయడమేనా ?

మరునాడు కావ్య దగ్గర లేకుండా చూసి కావ్య తండ్రికి విషయమంతా చెప్పాడు. వెంటనే క్రిష్ణ ను కలిసి అతని వ్యవహారం ఏమిటో చూడమన్నాడు. సాధ్యమైనంత త్వరగా కావ్యకు విడాకులిచ్చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ప్రేమ లేని కాపురం ఎందుకంటూ ప్రశ్నించాడు. ఆయన చాలా కంగారు పడ్డాడు. అదేమీ లేదు వంశీ, కావ్య వట్టి పిచ్చి పిల్ల. ఇంకా చిన్నతనం. అప్పట్లో ఏదో ఒక రకమైన వ్యామోహం అంతే. అయినా పెళ్లి అయిపోయిన పిల్లతో క్రిష్ణ అలా ప్రవర్తించడం సబబు కాదని మండిపడ్డాడు. నీవు సీరియస్ గా తీసుకోవద్దని, నేను రవిక్రిష్ణను కలుస్తాను. గట్టిగా హెచ్చరిస్తాను. కావ్యకు పెళ్లైపోయిందని, ఇటువంటి వేషాలు వేయవద్దని, పోలీస్ కంప్లైంట్ చేస్తానని హెచ్చరిస్తానని నచ్చచెప్పారాయన వంశీకి. కొన్నిరోజులు ఓపిక పట్టు వంశీ, కావ్య ను జాగ్రత్తగా చూసుకో. నన్ను క్షమించు వంశీ, కావ్య సర్దుకుపోయిందని నీతో సంతోషంగా ఉందని మురిసిపోతున్నాం నేను, మీ అత్తయ్యానూ. కావ్య చేసిన పనికి నా తరపున సారీ అల్లుడూ అంటూ దాదాపు ఆయన ఫోన్ లో ఏడ్చేస్తున్నాడు. వంశీ ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు.

రోజులు అలాగే మౌనంగా గడిచిపోతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా వంశీ, కావ్యల మధ్య మాటలు లేవు. వారం రోజుల తరువాత వంశీకి ఒక రోజు ఇండియా నుండి కొరియర్ లో ఒక కవరు వచ్చింది. కవరు బరువుగా ఉంది. కావ్య తండ్రి నుండి వచ్చింది ఆ కవరు. ఈ వారం రోజులూ ఆయన కూడా ఫోను చేయలేదు.

కవరు ఏమిటా అని విప్పి చూసాడు. అందులో మామగారు వ్రాసిన లెటర్ తో బాటు ఏవో కొన్ని ఫొటోలు. డియర్ వంశీ, నీవు ఫోన్ చేసి చెప్పాక నేను రవిక్రిష్ణను కలుసుకున్నాను నా మిత్రుడొకడు పోలీస్ డిపార్ట్ మెంట్లో పని చేస్తున్నాడు, అతన్ని వెంట తీసుకుని వెళ్ళాను. రవిక్రిష్ణ లేడు. ఇంట్లో అప్పుడు. ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని రవిక్రిష్ణ గురించి అడిగితే, తను రవిక్రిష్ణ భార్యనని, సంవత్సరం క్రితమే తమకు వివాహం అయిందని చెప్పింది. ఫెళ్లి ఫొటోలు చూపమంటే పెళ్లి ఆల్బమ్ తెచ్చింది. పెళ్లి ఫొటోలు కొన్ని తీసుకున్నాం. అతనికి ఫోన్ చేసి పిలిపించాం. ఊహించలేదు, మేము ఇలా వస్తామని. నా స్నేహితుడు గట్టిగా బెదిరించి అడిగాడు ' పెళ్లి చేసుకోలేదని, కావ్యమీద ప్రేమతో ఆత్మహత్యకు పాల్పడ్డావని, కావ్యని విడాకులు తీసుకుని వచ్చేయమని, పెళ్లిచేసుకుందామంటూ ఎందుకు ఆమెతో అలా అన్నావని అడిగాడు'. కంగారుపడిపోయాడు అతను. ఇలా ఒక పెళ్లైన అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసావన్న ఆరోపణలో అరెస్ట్ చేయిస్తానని, అతను కావ్యకు ఇచ్చిన మెసేజ్ లు అవీ తమ దగ్గరే ఉన్నాయని, అతనికి భవిష్యత్ లేకుండా చేస్తామని చెప్పేసరికి కాళ్లమీద పడ్డాడు. ఇంకెప్పుడు అలా చేయనన్నాడు. ఏడ్చాడు. అతని భార్యకూడా మా కాళ్లుపట్టుకుని అతని జీవితం నాశనం చేయొద్దని ఏడ్చింది. అతన్ని తిట్టి పోసింది. ఇకముందు కావ్యతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నా జైలు గోడల మధ్యే జీవించవలసి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. కావ్య కు క్రిష్ణ విషయం తెలియాలని, అతను ఎటువంటి నీచుడో తెలియచెప్పాలన్న ఉద్దేశ్యం తో అతని పెళ్లి ఫొటోలు, మేరేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పంపుతున్నాను. ఇంక అతను జీవితంలో కావ్యతో కాంటాక్ట్ పెట్టుకోడు. వంశీ, కావ్యను క్షమించి దాన్ని నీ గుండెల్లో పెట్టుకో.అది వట్టి అమాయకురాలు. నిన్ను మోసం చేయాలనే సంకల్పం మాకు లేదు. కావ్యతో కూడా నేను మాట్లాడతాను, మందలిస్తాను. ఉంటాను వంశీ, ఆశీస్సులతో.చంద్రశేఖర్ ". అని ముగించాడు!

వంశీ ఆ కవరు ని కావ్యకు ఇచ్చాడు. అవి అన్నీ చూసిన కావ్య ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయింది. వంశీ వైపు చూడలేకపోయింది.చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. దుఖంతో ఆమె భుజాలు ఎగిసి పడుతున్నాయి. వంశీయే కావ్య కు దగ్గరగా వెళ్లేసరికి కావ్య నిగ్రహించుకోలేక అతన్ని గట్టిగా కౌగలించుకుంటూ, వెక్కి వెక్కి ఏడుస్తూ అతన్ని అల్లుకుపోయింది. వంశీ ప్రేమకు తను అర్హురాలిని కాదంటూ ఏడుస్తోంది. తనని క్షమించమని పదే పదే అంటూ, క్షమించనంటే చచ్చిపోతానని ఏడుస్తూ అతనిని గట్టిగా హత్తుకుని, నిన్ను ఎప్పటికీ వదలనంటూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది!

“ఏయ్, పిచ్చీ ఏమిటిది చిన్నపిల్లలాగ! లేచి సరిగా కూర్చో! నిన్ను ఎన్నోసార్లు అడిగాను కావ్యా, నీ మనసులోని బాధ ఏమిటో చెప్పమని. నన్ను పరాయివాడిననుకున్నావు కదూ. ఈ విషయం నీవు నాతో పంచుకుని ఉండాల్సింది కావ్యా. చూడు అతని మోసం తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అతను నిన్ను ఇలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు. నిన్ను ప్రేమీంచే వ్యక్తి నీ ఎదురుగానే ఉన్నా గమనించక, ఎవరికోసమో నీవు దుఖించడం. ఓ గాడ్.!నా కావ్య నన్ను విడిచి వెళ్లిపోతుందని భయపడ్డాను. ఇంక నీవు ఎక్కడకీ వెళ్లలేవు కావ్యా” అంటూ, నిన్ను క్షమించేసాను సుమా అన్నట్లుగా కావ్య నుదుటిమీద మృదువుగా ముద్దుపెట్టుకుని ఆమెను తన కౌగిలిలోనికి తీసుకుంటూ " నా శ్వాస, నా మనసు, నా సంతోషం, నా ప్రపంచం అన్నీ నువ్వే కావ్యా, నీవు ఇలా దుఃఖపడే రోజు రానివ్వను" అన్నాడు ఆర్తిగా!


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

మానస వీణ

సొంత ఇంటి కల

మమతలూ - అనుబంధాలు

అపర్ణ

రివార్డ్

కురువింద

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub.Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాకా పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం


55 views0 comments
bottom of page