top of page

ఎందుకీ తేడా?!


'Enduki Theda'written by Pottabathini Rajyalakshmi

రచన : పొట్టాబత్తిని రాజ్యలక్ష్మి

ఇంటి నుంచి బైట అడుగు పెట్టాలంటేనే గుబులుగా ఉంది.

"నేను ఎదురుపడితే చాలు, పొద్దున్నే ఎదురైంది దరిద్రం. ఇక ఈరోజు పని జరిగినట్లే" అని తిట్టి పోస్తున్నారు. నేను అంత కాని పని ఏం చేశాను. ఎవరికైనా అన్యాయం చేశానా? లేక అపకారం తలపోశానా? నేనూ అందరిలాంటి ఆడపిల్లనేగా! నాలుగేళ్ల కిందట.. శుభశ్రీ,

"మంచి కలుపుగోలు పిల్ల. అందరిలో ఇట్టే కలిసిపోతుంది. తన చదువుకు తగ్గట్టు లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుంది. ఏ ఇంటికి వెళ్తుందోగానీ ఆ ఇల్లు, ఇంట్లోవాళ్ళు అదృష్టవంతులు" అని పొగిడేవారు, ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ తల్లి అనసూయతో.

అనుకున్నట్లుగానే శ్రీకర్ సంబంధం రావడం,ఆ వెంటనే అతనితో పెళ్లి. కలలా అనిపిస్తుంది తనకు. పెళ్లైన తొలినాళ్లలో ఎంతో మధురంగా గడిచిపోయాయి రోజులు. కొన్నిరోజులకే అత్తమామలకి ప్రియమైన కోడలిగా మారింది.


పెళ్లై రెండేళ్లు పూర్తవుతున్నా పిల్లలు లేరన్న భావన ఇద్దర్నీ నిరాశకు గురి చేసింది. చాలామంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్లి చూపించుకున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, మీకు ఎప్పటికీ పిల్లలు కలగరని. ఈ విషయం ఇంట్లో చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తల్చుకుంటేనే భయమేస్తోంది శ్రీకర్ కి. అలా అనుకుంటూనే హాస్పిటల్ నుంచి బయటకొచ్చేశారు నిరాసక్తంగా.


కానీ ఇంట్లో పర్యవసానం ఊహించిన దానికన్నా భిన్నంగా మారింది.

విషయం తెలిసిన వెంటనే శ్రీకర్ తల్లి..

"పిల్లలు లేని ఆడదానికి ఈ సమాజంలో విలువ లేదు. తనని వాళ్లింటికి పంపించెయ్. నీకు ఇంకో పెళ్లి చేస్తాం. మన వంశాన్ని నిలబెట్టలేనప్పుడు తనకి ఈ ఇంట్లో ఉండటానికి ఎటువంటి అర్హతా లేదంటూ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది. ఈ మాటలు విన్న శుభ ఏడుపు శబ్దం బైటకి రాకుండా మనసులోనే మౌనంగా ఏడుస్తోంది.

"అమ్మా, ఇందులో తన తప్పేముంది. పిల్లలు కలగలేకపోవడానికి కారణం తను మాత్రమే కాదు నేను కూడా. ఇది మా దురదృష్టం. అలాగని శుభని తప్పుబట్టలేం. పైగా నువ్వనట్లు మరో పెళ్లి చేసుకుంటే చట్టం దృష్టిలో నేను దోషినవుతాను అని నచ్చజెప్పే ధోరణిలో బదులిచ్చాడు.


"అలా అయితే తనకి విడాకులిచ్చేసేయ్. ఆ తరువాతే నీ పెళ్లి జరుగుతుంది. కానీ తను మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటూ మరోమాటకి తావివ్వకుండా తెగేసి చెప్పింది" తల్లి.

ఈ మాటలు విన్న శుభ ఇక అక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేకపోయింది. ఉన్నపళంగా అక్కడినుంచి ఏమి చెప్పకుండా బయల్దేరింది అమ్మవాళ్లింటికి.

శుభ ఏంటీ ఎన్నడూ లేనిది, ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేసిందీ, అదీ ఏదో పోగొట్టుకున్నదానిలా కనిపిస్తుంది, అని మనసులో గాభరా పడుతూ.. పైకి

"రా శుభా ఎలా ఉన్నావే, అంతా బాగానే ఉంది కదా! అల్లుడుగారు రాలేదా ఏంటి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అనసూయ.

'ఆ' అంటూ లోపలికి వస్తూనే తల్లిని పట్టుకొని భోరున ఏడ్చేసింది. ఏమైందంటూ గదిలో పుస్తకం చదువుకుంటున్న తండ్రి కంగారుగా బైటకి వచ్చాడు.

ఏమైందో ఏమో తెలియదు. అమ్మాయ్ వచ్చి రాగానే ఇలా ఏడుస్తోంది. కారణం మాత్రం చెప్పడం లేదు. గంట గడిచింది. తను చెప్పిన వాటిల్లో ఒక్కటే స్పష్టమవుతోంది. ఇక తిరిగి తన అత్తారింటికి వెళ్లబోయేది లేదనీ. ఇక్కడే ఉండబోతున్నా అని.

రెండ్రోజులుగా తన గదిలోనే ముభావంగా కూర్చొని ఉంది. ఎన్నిసార్లు తెలుసుకోవడానికి ప్రయత్నించినా అసలైన కారణం రాబట్టలేకపోతుంది తల్లి. ఇక కూతుర్ని అడిగి లాభం లేదని... అల్లుడుగారికి ఫోన్ చేసి అస్సలు జరిగిందేంటో కనుక్కోమని భర్తని కోరింది. అల్లుడు శ్రీకర్ కి కాల్ చేశాడు పరశురామ్...

"బాబు శ్రీకర్ ఎలా ఉన్నావ్. అమ్మాయ్ వచ్చినప్పటినుంచి మాతో సరిగ్గా మాట్లాడటం లేదు. తనలో తానే బాధ పడుతోంది. కారణం ఏంటో చెప్పడం లేదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా..?" అని ఆందోళనగా అడిగాడు.

"అలాంటిదేం లేదు. మీరు కంగారు పడకండి నేను సాయంత్రం వచ్చి అన్ని విషయాలు చెబుతాను. అప్పటివరకు శుభని జాగ్రత్తగా చూసుకోండి" అంటూ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు.

****

నా వయసప్పుడు పదమూడనుకుంటా. మన ఇంటికి దగ్గర్లోనే బడి. అయిపోగానే ఐదు నిమిషాల్లో ఇల్లు చేరేదాన్ని. పరిగెత్తుకుంటూ ఎదురింట్లోనున్న పిన్నింటికి వెళ్లేదాన్ని గుర్తుందా! అమ్మా, నువ్వేమో హోంవర్క్ పూర్తి చేస్తేగాని బయటికి వెళ్ళనిచ్చేదానివి కాదు. నాకేమో ఎప్పుడెప్పుడూ ఇంట్లో నుంచి వాడి దగ్గరికెళ్తానా, ఎప్పుడు ఆడుకుంటానా అని ఉండేది.


పేరుకి వాళ్ల బాబే అయినా నన్ను చూడగానే బుడిబుడి అడుగులు వేసుకుంటూ నవ్వుతూ ఎదురొచ్చేవాడు. నిండా రెండేళ్లు కూడా లేవు అప్పటికీ. సాయంత్రం పాలు నేను డబ్బాతో పడితే తప్ప తాగేవాడు కాదు. స్నానం చేయించేటప్పుడు కూడా పక్కనే ఉండి వాడి భాషలో ఏవేవో కబుర్లు చెప్పాలి లేదంటే ఏడ్చేవాడు. ఇలా ప్రతి సాయంత్రం వాడిని ఆడించడం నాకు నిత్యకృత్యమైంది.

అక్కడున్న బామ్మేమో...

"అదిగో శ్రీ వచ్చిందిగా ఇక మన దగ్గరికి రాడు. బహుశా వాడికే ఓ అక్క ఉంటే వీడ్ని ఇంతలా ముద్దు చేసి ఆడించదేమో? సొంతక్క కన్నా ఎక్కువేనే నువ్వు వాడికి. చూడు నువ్వు వెళ్లిపోతుంటే ఎలా నీ వెనుకే వస్తానని ఎంత మారాం చేస్తున్నాడో" అని అనేది.

అవును, కానీ ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావో అర్ధం కావడం లేదు.

అమ్మా.. మీతో చెప్పకూడదని కాదు. రెండు రోజుల క్రితం చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాం. మాకు ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చేశారు. దాని గురించే మా అత్తయ్య నన్ను ఇంట్లో ఉండకూడదని శ్రీకర్ తో అంది. అలాగే తనకి మరో పెళ్లి చేస్తామంటూ రాద్ధాంతం చేసింది. దాంతో నేనిలా వచ్చేసాను. నేనిక ఆ ఇంటికి వెళ్లాలని అనుకోవడం లేదు. మీరు నన్ను బలవంతపెట్టకండి అంటూ చెప్పింది. ఇవిగో విడాకుల పత్రాల మీద నా సంతకం చేసి ఉంచాను. ఆయన వస్తే వీటిని మీరే ఇచ్చేయండి. ఇదే నా నిర్ణయం! సాయంత్రం వస్తానన్న అల్లుడు ఇంకా రాలేదు.

****

ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం తప్పై ఉండొచ్చు ఆయా. కానీ ఒకప్పుడు..

నేను ఎదురుపడితే చాలు

"పొద్దునే ఎదురైంది దరిద్రం. ఇక ఈరోజు పని జరిగినట్లే!" అని తిట్టి పోసేవాళ్ళు. నేను అంతకానీ పని ఏం చేశాను. ఎవరికైనా అన్యాయం చేశానా? లేక అపకారం తలపోశానా? నేను అందరిలాంటి ఆడపిల్లనేగా! పదమూడేళ్లపుడు పక్కింట్లోనున్న బాబుని ఆడిస్తే సొంతక్క కన్నా ఎక్కువే అన్నారు.

మంచి ఉద్యోగం చేస్తూ అందరితో కలివిడిగా ఉంటే కలుపుగోలు పిల్ల అన్నారు. కానీ ఏడాది క్రితం పిల్లలు పుట్టలేదన్న కారణంతో చేయని తప్పుకు దోషిని చేసి నిందిస్తున్నారు. అప్పుడు అలా అన్నవాళ్లే ఇప్పుడిలా ఎందుకు అంటున్నారు. ఎందుకీ తేడా?

అందుకే నన్ను కావాలనుకున్న అమ్మానాన్నల్ని, నన్ను వద్దనుకున్న అత్తారింటిని వదిలి ఇలా వచ్చేశాను. నేను ఎప్పటికీ తల్లిని కాలేకపోవచ్చు. కానీ తల్లిగా పిల్లల బాధ్యత తీసుకొని వారికి సంరక్షకురాలిగా ఉండలేనా అనే ప్రశ్న నాలో తలెత్తింది.

***

సాయంత్రం అనగా వస్తానన్న అల్లుడు ఇంట్లో అమ్మానాన్నల ఒత్తిడికి లొంగిపోయి, వారం తరువాత విడాకుల పత్రంతో వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు.

***

"అది కాదు శుభా.. మీరు దత్తత తీసుకునే ప్రయత్నం చేయలేకపోయారా! అప్పుడైనా మీ అత్త తన నిర్ణయం మార్చుకునేదేమో కదా!"

"నేను అలా కూడా ఆలోచించా ఆయా. నా పేరులో, నా జీవితంలో సగభాగం పంచుకున్న భర్త.. నన్ను మాత్రం సరిగా అర్ధం చేసుకోలేకపోయాడు. ఆరోజు ఇంట్లో నేను కూడా ఉండడంతో నాకు సపోర్టుగా మాట్లాడాడే గాని, వెళ్తున్న నాకోసం రెండురోజులైనా, ఏడాదైనా తిరిగి రాలేదు. నాకు అండగా నిలవలేకపోయాడు. దత్తత తీసుకొని కన్నతల్లిగా కాకుండా పెంచిన తల్లిగా ముద్ర వేసుకోవడం నాకు సబబుగా అనిపించలేదు. అందుకే ఈ నిర్ణయనికొచ్చా.

పెంచే స్తోమత లేక, అప్పుడే పుట్టిన పసికందుల్ని చెత్తకుప్పల్లో, రైల్వే ట్రాకుల మీద నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న సంఘటనలు నిత్యం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. నాలాంటి పిల్లలు లేని తల్లులంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ కుటీరంలో అలాంటి పిల్లలకి కొంత నీడ కల్పిస్తే అంతే చాలు. వాళ్ళని సంరక్షించడమే మా బాధ్యత. వాళ్ళ నవ్వుల్లో నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాను అన్న శుభ మాటలకి మనసులోనే అభినందనలు తెలిపింది ఆయా.

*****

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

మనతెలుగు కథలు సంపాదకీయ వర్గానికి ముందుగా ధన్యవాదాలు. నా పూర్తి పేరు పొట్టబత్తిని రాజ్యలక్ష్మి, నేనొక ప్రైవేట్ ఉద్యోగిని, రచనల మీద అభిలాషతో కథలు, కవితలు, వ్యాసాలు రాయడం నా అలవాటు.




71 views0 comments
bottom of page