top of page

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు


'Etiloni Keratalu Eru Vidichi Povu' written by

Mangu Krishna Kumari

రచన: మంగు కృష్ణ కుమారి


"నాన్న బోయినం అయ్యిందా" నూకరాజు చొక్కా విప్పి తలుపుమీద తగిలిస్తూ అడిగేడు.

రాజేశ్వరి కోపంగా చూసి "మీ అయ్య అలిగేడు. ఎక్కడికో ఎలిపోయాడు" అంది.

నూకరాజుకి ఆశ్చర్యం వేయలేదు. "సరిగ్గా చెప్పేడువ్" అన్నాడు పెళ్ళాంతో.

చేతులు తిప్పుతూ వెటకారంగా "సేపల‌ పులుసు సెయ్యలేదని అలిగి బేగూ, కర్రా అట్టుకొని సరసరా ఎలిపోయాడు" అందామె.

"నువ్వింకేటన్న అన్నావా" అనుమానంగా అడిగేడు నూకరాజు.

"ఏటంతాను. సుక్కురారం, అదీ సేవన మాసం, నీసు కూర బాప్ప కూడా ఎప్పుడూ సెయ్యలే! అన్నాను. అదీ తప్పా" నిగ్గతీసింది.

పెళ్ళాం తప్పేం లేదని నూకరాజుకి తెలుసు. తల్లి చనిపోయిన తరవాత, తండ్రి రాజయ్య విచిత్రంగా మారేడు. ఏ రోజు ఏది తినకూడదో, అదే వండమంటాడు.

ఓ సారి జ్వరంతో రాజేశ్వరి పడుకుంటే, గారెలు వెయ్యమని సతాయించేడు. కష్టం మీద లేచి గారెలొండి పెడితే, కోడి కూర లేదని, తినకుండా, ఇంట్లోంచి వెళిపోయేడు.

బీచ్ లో చూసేం, అని పక్కింటాళ్ళు చెప్తే నూకరాజు స్కూటర్ మీద వెళ్ళి ‌తెచ్చేడు. మళ్ళీ ఇప్పుడు ఇలా.

జేబులో సెల్ మోగింది. పెద్ద బావ అప్పారావు చేసేడు. "రాజూ! మీ అయ్య మద్దేనం ఒచ్చేడు. ఏటేటో అంటా ఉన్నడు" చెప్పేడు.

"సర్లే బావా! నాకు రేపు ఫుల్లు పని ఉంది. ఎల్లుండి వచ్చి తీసుకొస్తాను. ఓ రోజు అక్కడ ఉండనీ" అని ఫోన్ పెట్టేసాడు నూకరాజు.

"సేతినిండా పనున్నపుడే, ముసిలాడు గొడవాడతాడు" రాజేశ్వరి సణుగుతోంది.

ఇప్పుడు ముసిలి అయిన రాజయ్య వయసులో ఉన్నపుడు కూలీ పని చేసి బియ్యం బస్తాలు మోస్తూ సంపాదిస్తుంటే, భార్య చంద్రమ్మ చాల రకాల కాయ కష్టం చేసింది. కొన్నాళ్ళు కూరలు అమ్మి, కోళ్ళ పెంపకం చేసి సంసారం నడిపింది. ఇద్దరు కూతుళ్ళ తరవాత నూకరాజు భూమ్మీద పడ్డాడు. కొడుకుని గవర్నమెంట్ స్కూల్ లో వేసింది.

నూకరాజు కి చదువు కన్నా ఎలక్ట్రికల్ పనుల మీద ఆసక్తి చాలా ఎక్కువ. ఆ పని బాగా నేర్చుకొని ఇరవై ఏళ్ళు రాకుండానే సంపాదించడం మొదలెట్టేడు. చంద్రమ్మ పల్లెలో ఉన్న చిన్న గుడ్డి అమ్మి, ( చిన్నపొలం బిట్ ని గుడ్డి అంటారు) ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. ఒకల్లుడు కార్పెంటర్.. ఇంకో అల్లుడు నూకరాజు లాగ ఎలెక్ట్రికల్ పనులు చేస్తాడు.

పల్లెలో ఉన్న పాత పెంకుటిల్లు అమ్మేసి పట్నంలో ఓ జాగా కొడుకు పేరు మీద కొన్నాది. ఓ మాదిరి ఇల్లు కట్టుకోవాలని ఆశ. నూకరాజు తల్లి ఆశ తీర్చేడు. పనుల‌ మీద బాగానే సంపాదించి ఇల్లు‌ మొదలెట్టేడు.

తన తమ్ముడు కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిపించింది చంద్రమ్మ.

ఏడాది తిరిగేసరికి ఆడపిల్ల. చంద్రకళని పేరు పెట్టేరు. తరవాత కొడుకు. వాడికి రాజేశ్వరే రాజేష్ అన్న పేరు పెడదామంది‌‌.

ఆడబిడ్డలొస్తే రాజేశ్వరి చాలా ఇష్టంగా చూస్తుంది. వాళ్ళు బయల్దేరేటప్పుడు కొత్త చీరా రవికతో పాటు, జంతికలు, పాకుండలూ, పొంగడాలు సంచీ నిండా సర్ది ఇస్తుంది.

చంద్రమ్మ , తన కొడుకులా ఎవరుండరని, తన కోడలు సాక్షాత్తు బూదేవంత గొప్పదని, వాళ్ళ పిల్లలిద్దరికీ తమ ఇద్దరి పేర్లూ కలిసేలా పెట్టేరని, అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ గర్వంగా చెప్పుకోటం మొదలెట్టింది. చంద్రమ్మ కూతుళ్ళు కూడా అత్తా కోడళ్ళ పొత్తు చూసి సరదా పడేవారు.

పిల్లలు కాస్త పెద్దయి, నూకరాజు పిల్లలని బాగా చదివించాలనీ రాత్రీ పగలూ కష్టపడుతూ ఉంటే, చంద్రమ్మ కి కడుపులో నొప్పిలా మొదలయి ఎక్కువయిన దాకా మొండిగా ఓర్చింది.

పెద్దాసుపత్రికి తీసుకెళ్తే కేన్సర్ అని తెలిసింది. నూకరాజు నానా బాధలూ పడ్డాడు.‌ అప్పుకూడా చేసేడు. రెండేళ్ళు అసుపత్రీ, ఇల్లూ తిరుగుడే జీవితం అయింది. చంద్రమ్మ దక్కలేదు. రాజయ్య చతికిల పడ్డాడు.

ఏడాది తిరిగేసరికి రాజయ్య ఆటో కిందపడి భుజం దగ్గర ఎముక విరిగింది. ఆపరేషన్ అవసరం అయింది. పూర్వం‌లాగ బరువులు ఎత్తవద్దనేసాడు డాక్టర్.

ఖాళీ గా కూచోడం తో అస్తమానం ‌భార్యే తలపులోకి వచ్చేది రాజయ్యకి. కొడుకు ఎప్పుడూ పనుల్లో మునిగి తేలుతూ ఉంటాడు. రాజేశ్వరికి ఇంటిపని, పిల్లలతో సరిపోతుంది. కాకుండా ఇంటి ఖర్చులకి తనూ సంపాదించాలని, మిషిన్ కుట్టడం నేర్చుకుందికి సెంటర్ కి వెళ్ళడం మొదలెట్టింది.

ఎవరికీ తీరిక లేదు, తనకి తప్ప. ఏదోఒక గొడవ పెట్టుకోడం అలవాటయింది రాజయ్యకి. పనిచేసి అలసివచ్చిన మనిషికి ఈ గొడవంతా చెప్పడం ఎందుకని రాజేశ్వరి ఒక్కోసారి నూకరాజుకి చెప్పేది కాదు. రాజయ్య సణుగుడుతో గొడవ బయటపడేది.

రాజేశ్వరి సహనం తగ్గిపోయింది. ఇంటి పనులూ, కుట్టు సెంటర్ కి వెళ్ళిరాడం, పిల్లలని చూసుకోడం, అప్పులు ఇంకా తీరలేదన్న బెంగతో సతమతం అవుతూ మావగారి అలకలు, కోపాలు భరించే శక్తి తగ్గింది. రాజయ్యకి గట్టిగా జవాబులు చెప్పడం మొదలెట్టింది. ఏ ఆడబిడ్డో అడిగితే అంతా చెప్పీయాలని, ఇలా నస పెడుతూ ఉంటే చెయ్యడం తనవల్ల అవదని చెప్పేద్దాం అనుకుంది.

పూజ చేసుకున్న రోజే రాజయ్య చేపల పులుసు చెయ్యమంటే ఒళ్ళు మండి గట్టిగా అరిచింది. రాజయ్య ఇదిగో ఇలా ఇల్లొదిలి పోయేడు.


"నా తమ్ముడి బొట్టి, నా తమ్ముడి బొట్టి అని ఓ ఇదయ్యీది మీ యమ్మ! సూడు, అసలు రంగు ఇప్పుడు తెలుత్తోంది" వెటకారంగా అన్నాడు రాజయ్య పెద్ద కూతురు కనకమ్మ ఇంట్లో. కనకమ్మ మారు మాటాడలేదు. ఆమెకి తండ్రి చేసిన పని నచ్చలేదు. రాజేశ్వరి ఎంత కుదురయిన పిల్లో ఆమెకి తెలుసు.

పోనీలే అని చేపల పులుసు చేసి అన్నం పెట్టింది. తమ్ముడి రాకకోసం చూస్తోంది.

పెద్ద బావ అప్పారావు తో జరిగిందంతా చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు నూకరాజు. "ఏటి సెయ్యాలి? నువ్వే సెప్పు" అన్నాడు. కనకమ్మ తండ్రిని పిలిచి కోపంగా దెబ్బలాడింది. "ఏటిది అయ్యా! అమ్మున్నపుడు ఇలగెప్పుడైన అలిగేవా! ఇట్టా చేస్తే చేస్తే ఆల్లకి ఇసుగు రాదా! ఏదో ఓ పాలికి నేను సేసేను గానీ రోజూ అయితే నేనూ సెయ్యలేను"

రాజయ్యకి ఉక్రోషం వచ్చింది. "ఏవో ముసలాల్ల ఓమ్ లు ఉంతాయత. ఆడ దింపీరా అప్పూ! నేనీడ కూడ ఉండన్లే" అన్నాడు.

కనకమ్మ గంయ్ మని లేచింది. "నువ్వు సెప్పే ఓముల్లో ఆల్లు ఇలా సీటికీ మాటికీ అలగతా ఉంటే కొడుకులా బతిమిలాడతార్లే అనుకుంటున్నవేటి! ఆల్లు ఎలా సెపితే అలా ఇనాల" కోపంగా తిట్టింది .

రాజయ్య బుర్ర దించుకొని కూచున్నాడు. పెద్ద కూతురు తండ్రికి బుద్ధి చెపుతోంది రాజేశ్వరి తప్పేం లేదని. ఎంత గొడవాడి వచ్చేసినా ఎప్పటికీ తనకి గంజి పోసేది, దినం గడపాల్సినది కొడుకూ కోడలే అని.


తెల్లారి లేచి చూస్తే రాజయ్య ఎక్కడా అయిపు లేడు. “ముసలాడు ఏదో ఓమ్ కి గాని ఎలిపోనాడేటి” అనుకుంటూ అప్పారావు కంగారు పడ్డాడు గాని కూతురు కనకమ్మ నిబ్బరంగానే ఉంది.

ఇంతలో అప్పారావు సెల్ మోగింది. అవతల బావ నూకరాజు. “బావోయ్.. మీరేటి మంత్రం ఏసేరో గాని, నాన్న పొద్దు పొద్దున్నే ఇంటికి ఎలిపొచ్చీసేడు. రాజేశ్వరితో పకపకా నవ్వుకుంటా మాట్లాడతన్నాడు..”

మంత్రం వేసిన కనకమ్మ వైపు నవ్వుతూ చూసేడు అప్పారావు.

************


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు మంగు కృష్ణకుమారి. విశాఖపట్నం నేవల్ బేస్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేసి రిటైరయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. విద్యార్ధి దశలో ప్రారంభించి వదిలేసిన రచనావ్యాసంగాన్ని ఈ మధ్యనే మళ్లీ ప్రారంభించాను. నా రచనలు ప్రచురించి ప్రోత్సహిస్తున్న మన తెలుగు.కామ్ వారికి ధన్యవాదాలు.

53 views1 comment
bottom of page