top of page

ఫస్ట్ క్రష్


First Crush written by Vadlamani Manimurthy

రచన : వడ్లమాని మణిమూర్తి

చికాగో ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ చెక్ అయిన తరువాత, షార్లెట్ వెళ్ళే ఫ్లైట్ కోసం ,షటిల్ ట్రైన్ ఎక్కి డొమెస్టిక్ టెర్మినల్ కి వెళ్లి గేట్ వెతుక్కొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొంటూ ఇంకాఆరుగంటలు వెయిట్ చెయ్యాలి. ఒక్కోసారి ఈ కనెక్టింగ్ ఫ్లైట్ తో ఇదే ప్రాబ్లం. ఇమిగ్రేషన్ కనుక తొందరగా అవకపోతే బుక్ అయిన ఫ్లయిట్ మిస్ అయిపోతుంది. వేరే దాంట్లో ఎకామ్ డేట్ చేస్తారు అది ఒక్కోసారి వెంటనే దొరుకుతుంది లేదా ఇదిగో ఇలా ఐదు ఆరు గంటలు వెయిట్ చెయ్యాలిసిందే అనుకుంది. లైట్ల కాంతి, రకరకాల బ్రాండెడ్ వస్తువులు మరీ అంత తక్కువ లేరు

జనాలు. ఏదో కోవిడ్ ఉంది కదా ప్రయాణాలు పెద్దగా తగ్గలేదు. మాములు గానే ఉన్నట్టున్నారు. మోహన్ కాఫీ తీసుకు రావడానికి వెళ్ళాడు. విజయ కూర్చున్న చోటుకి కొంచెము దూరం లో బి అని రాసినచోట నించొని ఫోన్ మాట్లాడుతున్న అతణ్ణి ఓ సారి యథాలాపంగా చూసి అంతలో నే మళ్ళీ చూసింది, మనసు గుర్తించడానికి ప్రయత్నం చేస్తోంది. అవును ..... అతనే పొడవుగా కాస్త ఓ పక్కకి వంగి నిలుచోవడము.., ఎన్ని రోజులయింది, రోజులా... కాదు..కాదు.. కొన్ని ఏళ్లు గడిచాయి. గుర్తు పట్టి ఉంటాడా... ఏమో, మర్చిపోయి ఉండచ్చు... అయినా పిచ్చి కానీ ఇన్ని ఏళ్ళ తరువాత ... అస్సలు ఛాన్స్ లేనే లేదు. వెంట తెచ్చుకున్న పుస్తకం తీసింది. పట్టు మని పది నిమిషాలు కూడా చదవలేదు విసుగ్గా మూసేసింది. బాగ్ లోంచి ఫోన్ తీసింది వాట్స్అప్ మెసేజ్ లు చూసుకుంది. కొన్నింటికి జవాబులు ఇచ్చింది. కాసేపు అన్నీ చూసి, ఫోన్ మూసేసింది. అతను కూర్చొన్న వైపుకి చూసింది. . అవును ..అతనే అస్సలు సందేహం లేదు. హ్యాండ్ బాగ్ గట్టిగ పట్టుకొని కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.ఏదో అలికిడి వినిపించి గభాల్న కళ్ళు తెరచి చూసింది. పక్క కుర్చీలో ఉన్న చిన్న పాప కిందకి పైకి గెంతుతోంది. ఆ పాప వైపు వవ్వుతూ చూసింది. వాళ్ళ అమ్మ కాబోలు చిన్నగాఅల్లరి చేయకూడదని చెప్పింది. పాత జ్ఞాపకాలు రింగులు రింగులుగా తిరగడానికి ఇలా ఐదు గంటలు, ఆరుగంటలు వెయిట్ చెయ్యడానికి ఒక్కోసారి ఈ ఎయిర్ పోర్ట్స్ పనికివస్తాయి అని నవ్వుకుని. అయినా ఇప్పుడు నన్ను గుర్తుపడతాడా? ఆనాటి రూపమే లేదుగా అని గాఢంగా నిట్టూర్చింది.

“ విజ్జి ఇదిగో కాఫీ అని ఇచ్చి అక్కడ భలే తమాషా జరిగిందని ఏదో చెప్పబోతున్న మోహన్ ఆగిపోయాడు. “నువ్వు మీరు విజ్జి ,విజయ కదా” అంటున్న అతన్ని చూసి అవాక్కయింది.

“శ్రీరామ్ … మీరు.నువ్వు”.. అని తడబడింది.

“హమ్మయ్య నువ్వే ,హే విజ్జి ఎలా ఉన్నావు ? నువ్వు అవునా కాదా అని అనిపించింది. పోనీ అడిగిస్తే పోలా అనుకున్నాను” అన్నాడు. వయసు తెచ్చిన మార్పు కళ్ళజోడు ,కాస్త వత్తు తగ్గిన ఉంగరాలు జుట్టు, ఆ వాలుకళ్ళు . చూడటానికి భలే ఇష్టంగా ఉండేవి. డ్రీమ్ ఐస్ అని నిక్ నేమ్ తో పిలిచేవారు విజ్జి గ్యాంగ్.

“హే మాలతి ఇలారా అని అక్కడ నుంచి కాస్త దూరం లో పంజాబీ డ్రెస్ వేసుకున్నవిడ పిలిచాడు. “మాలతీ తను విజ్జి అని మా క్లాస్ లో చెబుతూ ఉండేవాడిని చూడు” అని విజయ ని పరిచయం చేశాడు. అంత వరకు శ్రోతగా మిగిలిపోయిన మోహన్కి అతన్ని పరిచయం చేస్తూ ఇతనే శ్రీరామ్ అని టెన్త్ వరకు కలిసి చదువుకున్నాము అని పరిచయం చేసింది.

అది విన్న మోహన్ నవ్వుతూ “ ఒహ్ శ్రీరామ్ అంటే మీరా. మా ఆవిడ ఎప్పుడు స్కూల్ విషయాలు వచ్చినా మీ పేరు చెబుతూనే ఉంటుంది. నలభై ఏళ్లు అయినా ఒకళ్లనొక్కళ్ళు గుర్తు పెట్టుకున్నారంటే మీలో పెద్దగా మార్పులు రాలేదనుకోవాలి” అని పెద్దగా నవ్వాడు.

మోహన్ అప్పటికే రిటైర్ అయ్యి రెండేళ్లు అయింది. అతని స్వభావం అంతే భోళాగా ఉంటాడు. ఏదీ మనసులో దాచుకోడు. నిర్మల మైన మనసు.

వింటున్న మాలతి ,మోహన్ మాటలకి ఒక సారి చురుక్కుమని చూసింది శ్రీరామ్ వైపు. అది చూసి శ్రీరామ్ మనసు లోనే నవ్వుకున్నాడు. ఎందుకంటే తన ఫస్ట్ క్రష్ విజ్జి అని చెప్పాడు. ఎంత లేదన్నా ఆడ మనసు. తట్టుకోలేకపోయింది. శ్రీరామ్, నిజానికి తెగ ఏడిపించే వాడు విజయని. అది ఇష్టం తోనే , ఎప్పుడూ సైకిల్ వేసుకుని విజయ ఇంటి చుట్టూ తిరిగే వాడు. కొంత రౌడీ వేషాలు లు వేసినా చదువులో ఫస్ట్ రావడం తో మాస్టార్లు ఏమి అనలేక పోయేవారు. అట్లతద్ది కి ఆడపిల్లలు లేచి ,ఉయ్యాలలూగడానికి వెళితే అక్కడ వీళ్ల గ్యాంగ్ తయారు. పైగా “ అట్లతద్ది ఎందుకు చేస్తారో తెలుసా మా అక్క చెప్పింది .వీళ్ళకి అంటూ ఆడపిల్లల్ని చూపిస్తూ మంచి మొగుడు రావాలని” , “ విజ్జి నాకోసం పూజ చేయి” అంటూ కిసుక్కున నవ్వేవాడు.

శ్రీరామ్ తో పాటు ఆ కిష్కింధ మూక కూడా అల్లరి చేసే వారు. అదేమిటో ఎలాగో తెలిసిపోయేది. సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టి తిరుగుతూ గొబ్బి సుబ్బమ్మ పాట పాడుతూ ,ఆఖరున వచ్చే మొగిలీ పువ్వంటీ మొగుడు నియ్యవే అనేటప్పుడు విజ్జి మొగుడు శ్రీరామ్ అని అరిచే వాడు. వినాయక పందిళ్ల లో జరిగే ప్రోగ్రామ్స్ కి వెళితే ,వీళ్ళ వెనకే తయారు. హరి కథలకు,బుర్ర కథల కు విజ్జి వాళ్ళ నాయనమ్మ వచ్చేది ఈ అల్లరి మూక గోల ని భరించ లేక తిట్టి పోసేది. అది విన్న ఆడపిల్లల గ్యాంగ్ బాగా అయిందని నవ్వుకునే వారు. దానికి బదులు గా ఆడపిల్లల పేర్లతో గట్టిగా అరిచే వాళ్ళు. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇద్దరూ ఒక్క సారి అప్పటి రోజులలోకి వెళ్ళిపోయి కబుర్లు చెప్పేసుకుంటున్నారు.

“ శ్రీరామ్ మీరు పెద్దగా మారలేదు. సోమయాజి మాస్టారు మిమ్మల్ని భలే మెచ్చుకునేవాడుకదా,” “మీరు మాత్రము తక్కువేంటి? తులసీ టీచర్ పెట్ కదా,” “అందుకే ఏడిపిస్తూ ఉండే వారు తోక తోక అని”

“మాకూ పెట్టారుగా పేర్లు కిష్కింద వాసులమని" అని నవ్వాడు .అలా చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరూ బాల్యావస్థ దాటి అసలు లోకం లోకి వచ్చారు. ఒకళ్ళ నొకళ్ళు గురించి తెలుసుకున్నారు. శ్రీరామ్ ఇంజనీర్ గా మూడు నెలలు క్రితం రిటైర్ అయ్యేడు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసాడు, ఇద్దరూ ఒక్క చోట ఉంటున్నారు. సెయింట్ లూయిస్ లో ఉంటున్నారు. విజయ భర్త మోహన్ బాంక్ లో ఏ జి ఎం గా చేసి రెండు నెలలు క్రితమే అయ్యారు . ఇద్దరూ అబ్బాయిలు. పెద్ద వాడికి పెళ్లి అయ్యి మనవడు

పుట్టాడు. వాడి ఏడాది పుట్టిన రోజుకు వెళుతున్నాము షార్లెట్ లో ఉంటాడు. రెండో వాడు న్యూయార్క్ లో ఉన్నాడు .పెళ్లి చేయాలి. విజయ, మాలతి దగ్గరకు వెళ్లి “చిన్నప్పుడు చాలా ఏడిపించే వాడు. మా ఆడపిల్లల గ్యాంగ్ శ్రీరామ్ అంటే భయపడి పోయేవాళ్లం. కానీ మీ ఆయన కి అందగాడు అనే పేరుండేది . మీరు అదృష్ట వంతులు" అని నవ్వింది.. బదులుగా మాలతి కూడా స్నేహంగా నవ్వింది. అది విన్న మోహన్ ,శ్రీరామ్ దగ్గరగా వెళ్లి “ అందరి లో కంటే మా విజ్జి అంటే మీకు ఎక్కువ ఇష్టమని తెలిసింది”.అని 'హహ్హ' అని గట్టిగా నవ్వాడు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ముందుగా విజయ,మోహన్ లేచి మాలతి, శ్రీరామ్ లకి వీడ్కోలు చెప్పి వాళ్ళ గేట్ వైపు వెళ్లిపోయారు.

వెళ్లిపోతున్న వాళ్ళని చూస్తూ "అబ్బ !ఆయన ఏమిటండి మరీనూ... 'మా ఆవిడకి మీరంటే ఇష్టం' అని ఓపెన్ గా చెప్పేసాడు" అంది శ్రీరామ్ తో.

“కొంతమంది ఉంటారులే కభీ కభీ సినిమా లో శశీ కపూర్ లాగా తేలిక గా తీసుకుంటారు. మోహన్ గారు అదే టైప్ లా ఉన్నారు. అయినా మాలతీ, జీవితం లో నాలుగో వంతులోకి వచ్చేసాము. ఈ సమయం లో మనసులు ఆహ్లాదంగా ఉంచుకోవాలి కానీ “..అని ఆపేశాడు.

'అబ్బే అదేమి లేదండీ, అంటూ బయటపడినందుకు సిగ్గుపడి పోయింది. ఒక్కో సారి జీవితంలో .ఇలాంటి అనుకోని మరపురాని సందర్భాలు వచ్చి మనసుల్ని మధురం చేస్తాయి' అనుకున్నాడు శ్రీరామ్.

-------------------

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం : వడ్లమాని మణిమూర్తి

:2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. చదవడమంటే ఇష్టం. కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు తొలి కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. నవ్య,ఆంధ్రభూమి,స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి వంటి వార,మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ,ప్రజాశక్తి,వెలుగు వంటి దినపత్రికలలోనూ

విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ కథలు ప్రచురింపబడ్డాయి. చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గ వచ్చి ,పుస్తకంగ వెలువడింది .మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురిచతమయింది. కొలిమి, నెచ్చెలి, అచ్చంగా తెలుగు ,రస్తా,వెలుగు, విశాఖ సంస్కృతి ,ఇప్పుడు కొత్తగా వస్తున్న సహరి అంతర్జాల వారపత్రిక లలో కూడా నాకథలు ప్రచురించబడ్డాయి కొన్ని కథలకు మొదటి బహుమతి కొన్నింటికి ప్రోత్సాహక బహుమతులు కూడా వచ్చాయి



























66 views2 comments
bottom of page