గగనంలో గడబిడ
- Munipalle Vasundhara Rani

- Aug 2
- 3 min read

Gaganamlo Gadabida - Telugu Comedy Story | Vasundhara Rani Munipalle
గగనంలో గడబిడ - తెలుగు హాస్య కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 02/08/2026
ప్రతిరోజూ కొత్త విమానాశ్రయాలు ప్రారంభమవుతున్న ఈ కాలంలో, ఒకవేళ ప్రతి పట్టణంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పడితే... ఆకాశంలో కూడా భూమ్మీదలాగే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందా? అనే వినూత్నమైన ఊహను హాస్యభరితంగా ఆవిష్కరించిన కథే "గగనంలో గడబిడ". రచయిత్రి వసుంధర రాణి మునిపల్లె తన చమత్కారమైన శైలిలో మేఘాల మధ్య నిలిచిపోయిన విమానాలు, గొడవపడే పైలట్లు, గాల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు, విసిగిపోయిన ప్రయాణికుల దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చిత్రించారు. చివరి వరకు నవ్వులు పంచుతూనే, ఆధునిక అభివృద్ధిపై ఒక సరదా వ్యంగ్యాన్ని అందించే ఈ తెలుగు హాస్యకథను తప్పక చదవండి.
ఉదయాన్నే లేవగానే పేపర్ తిరగేస్తుంటే ఒక పెద్ద హెడ్‌లైన్ కళ్ళ పడింది. "కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం... త్వరలో మన జిల్లా కేంద్రంలోనూ విమానాశ్రయ నిర్మాణానికి సన్నాహాలు!" ఆ వార్త చదివినప్పటి నుంచి నా మదిలో అదే ఆలోచన తిరుగుతోంది. రేపు నిజంగానే మన సొంతూరిలో కూడా ఎయిర్‌పోర్ట్ వస్తే, ఆ పక్క ఊరి నుంచి ఆకాశం అంతా విమానాలతో కిటకిటలాడిపోతుంది కదా!
ఒకవేళ ఆకాశంలో కూడా భూమ్మీద లాగే ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విచిత్రమైన ఆలోచనలతోనే రాత్రి పడుకున్నాను. ఆ ఆలోచనలే కాస్తా నిద్రలోకి వెళ్ళాక ఒక అద్భుతమైన కలగా మారిపోయాయి.
నేను నా సొంతూరు నుంచి పక్క ఊరు వెళ్లే విమాన ప్రయాణం కోసం ఉదయాన్నే హడావుడిగా ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాను. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేల అడుగుల ఎత్తులో ఉన్న మేఘాల నడుమ ఉన్నట్టుండి వందలాది విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
అసలు భూమ్మీద రోడ్ల మీద కూడా ఇంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ చూసి ఉండము. ఆకాశమంతా ఒకే రకమైన గందరగోళం, విమానాల ఇంజిన్ల హోరుతో నిండిపోయింది. చుట్టూ ఎక్కడ చూసినా బోయింగ్‌లు, ఎయిర్‌బస్‌లు బారులు తీరి నిలబడి ఉన్నాయి.
భూమ్మీద కార్ల హారన్లు, ఆటో వాళ్ళ కేకలు వినిపించినట్టే, ఇక్కడ ఆకాశంలో కూడా ఇద్దరు పైలట్లు క్లౌడ్ సిగ్నల్ దగ్గర తమ ప్లేన్లను ఆపి కిటికీలు దించి ఒకరికొకరు గట్టిగా అరుచుకుంటున్నారు. ఒక పైలట్ కోపంగా తల బయటపెట్టి, "ఏమయ్యా బోయింగ్ డ్రైవర్! ఎడమ వైపు ఇండికేటర్ వేసి కుడి వైపు ఎందుకు టర్న్ తీసుకున్నావ్? పైలట్ లైసెన్స్ ఏమైనా లాటరీలో గెలుచుకున్నావా? కనీసం క్లౌడ్ డెన్సిటి చూసుకోకుండా ఇలా మేఘాల మధ్యలో పార్క్ చేశావ్ ఏంటి?" అని ఎదుటి వాడిని నిలదీస్తున్నాడు.
భూమ్మీద ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ లాగే, ఆకాశంలో కూడా ఇప్పుడు డిజిటల్ క్లౌడ్ సిగ్నల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడో ఆకాశంలో పెద్ద రెడ్ లైట్ పడగానే, దాని ముందున్న విమానాలన్నీ మేఘాల వెనుక గాల్లోనే నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ మాత్రం కింద లాగా నిలబడలేక, గాల్లో తేలే ఒక పెద్ద డ్రోన్ సిగ్నల్ పట్టుకుని గాల్లోనే చక్కర్లు కొడుతూ పర్యవేషిస్తున్నాడు.
తలకి హెల్మెట్ బదులు హైటెక్ ఆక్సిజన్ మాస్క్ వేసుకుని, ఒక విమానం కాక్‌పిట్ విండో దగ్గరికి వచ్చి డ్రైవర్‌ను సీరియస్‌గా అడుగుతున్నాడు. "ఏది సార్ మీ లైసెన్స్? పొగమంచు ఎక్కువైందని ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌లో ల్యాండ్ చేయకుండా నేరుగా ఇక్కడ ఆకాశంలోనే సర్వీస్ రోడ్డు మీద, సరిగ్గా ఆ సప్తఋషుల నక్షత్రాల లైన్ దగ్గర వచ్చి ఆపేశారు? నో ఎంట్రీ బోర్డు లేదా? వెంటనే ఫైన్ కట్టండి!" అని వార్నింగ్ ఇస్తున్నాడు.
ఈ గందరగోళం చూసి ప్రయాణికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. విమానం లోపల ఏసీ పనిచేయక ఉక్కబోస్తుంటే, జనాలంతా విండోల నుంచి బయటికి తొంగి చూస్తూ విసుక్కుంటున్నారు.
సరిగ్గా అదే సమయంలో ఒక ముసలాయన తన సీట్ నుంచి ఆందోళనగా లేచి, నేరుగా ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్లిపోయాడు. "అమ్మా, ఈ రూట్లో ఈ ట్రాఫిక్ జామ్ ఎప్పుడైతే క్లియర్ అవుతుంది? కింద మా ఇంటి దగ్గర పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను, ఇప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి, ఆ పైలట్ కి చెప్పి తొందరగా బండి కదిలించమను!" అని అమాయకంగా అడుగుతున్నాడు.
ఆయన మాటలకు పక్క సీటు వాళ్ళు నవ్వుతూ, తాము కూడా విమానం విండో కొద్దిగా తెరిచి కిందకి చూస్తూ, "అసలు ఈ క్లౌడ్ జామ్ ఎప్పటికీ తగ్గుతుందో ఏమో! కనీసం ఈ ఆకాశంలో ఎక్కడైనా చిన్న టీ బండి ఉంటే, కిందకి దిగి ఒక కప్పు టీ తాగి వచ్చేటోళ్ళం" అని జోకులు వేసుకుంటున్నారు.
రోడ్డు మీద అయితే బస్సు జామ్ అయినప్పుడు దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ముప్పై వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇలా నడుచుకుంటూ పోవడానికి కుదరదు కదా అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. రేపు పొద్దున నిజంగానే ప్రతి ఊరిలోనూ ఎయిర్‌పోర్ట్ వస్తే, మన ట్రాఫిక్ పోలీసులు భూమ్మీద నుంచి గాల్లోకి ప్రమోషన్ తెచ్చుకుని, "ఎడమ వైపు వెళ్ళండి బాబూ, దూరం ఉండు, హారన్ కొట్టు" అని మైకుల్లో అరవాల్సిందే అని అందరూ అనుకుంటున్నారు.
అలా ఆకాశంలో జరుగుతున్న ఆ గోల మధ్యలో ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే, నా పక్కనే టేబుల్ మీద పెట్టిన ఫోన్ అలారం మోగుతోంది. బెడ్‌రూమ్ సీలింగ్ ఫ్యాన్ సుడులు తిరుగుతూ గాలి ఇస్తోంది.
***
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.







Comments