top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

గమనం


'Gamanam' written by Gannavarapu Narasimha Murthy

రచన : గన్నవరపు నరసింహమూర్తి

ప్రభాత సమయం...

తూరుపు రాగరంజితం అయ్యే వేళ!...

పక్షులు గూళ్ళలోంచి బయటకొచ్చి కీరవాణి రాగాన్ని ఆలపించే శుభోదయ వేళ...

పాసింజర్‌ వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది...

నేను ఎప్పుడు వస్తుందా మా ఊరు అని అరగంట నుంచీ కిటికీ పక్క కూర్చొని చూస్తున్నాను...

పాసింజెర్‌ ఆగగానే ప్లాట్ ఫారం మీదకు ఒక్క సారిగా దూకేను...

ఇంకా రైలు కదులుతూ ఉండటంవల్ల తూగిపోయి పడిపోబోతుంటే ఒక పెద్దాయన పట్టుకున్నాడు...

“ఏమిటా తొందర? కొంచెం ఆలస్యం అయితే ప్రమాదం జరిగేది!” అన్నాడు కోపంగా...

నేను అతని మాటలు వినిపించుకోలేదు.

బేగు పట్టుకొని పరుగు లంఘించుకున్నాను...

ప్లాట్ ఫారం బయట ప్రశాంతంగా ఉంది. నా మోటార్‌బైక్‌ని తీసుకు రమ్మని మా రైతు సన్యాసికి

చెప్పాను.

వాడు తెల్లారకముందే బండి మీదొచ్చి స్టేషన్‌ బయట నా కోసం చూస్తున్నాడు...

మా ఊరు సుభద్రాపురం.... స్టేషన్‌కి ఇరవై కిలోమీటర్లుంటుంది.

మా ఊరు వదలి అప్పుడే ఆరు నెలలవుతోంది. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్‌లో చేరాను...


విశాఖపట్నంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువు...

సివిల్‌ ఇంజనీరింగ్‌ నా బ్రాంచ్‌...


బయట రూమ్‌ తీసుకొని అక్కడుండే వాడిని. భోజనం మాత్రం నెల్లూరు మెస్‌లో... అక్కడ


భోజనం చాలా బాగుండేది. ముఖ్యంగా మజ్జిగ మిరపకాయలు, ఉలవచారు, మజ్జిగ పులుసు, కొబ్బరిపచ్చడి, నిమ్మకాయ ఆవకాయ.. ఇవన్నీ నాకు బాగా ఇష్టం.


సెమిస్టర్‌ పరీక్షలవగానే ఇంటికి వెళ్ళేవాడిని. అలా నాలుగు సంవత్సరాలు ఆనందంగా గడిపేసాను..మా ప్రొఫెసర్లు బాగా చెప్పారు.. చదువంటే ఆసక్తిని కలిగించారు... దేశభక్తిని రగిలించారు.. దేశానికి సేవ చెయ్యాలన్న అనురక్తిని కలిగించారు.


నాలుగో సంవత్సరం ఆఖరి సెమిస్టర్ పరీక్ష మొన్ననే పూర్తయింది. ఆ మర్నాడంతా మా

స్నేహితులందరం ఒకరి కొకరు వీడ్కోలు చెప్పుకున్నాము... మా ఐదుగురు స్నేహితులు... శ్రీనివాస్‌, రఘు, దిలీప్‌, శ్రీకర్‌, సుధాకర్‌... మేమంతా పక్కపక్కన కూర్చునే వాళ్ళం... కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్లం. పరీక్షల్లో కలిసి చదివేవాళ్ళం.


ఆ రోజు మా అందరికీ బాధేసింది. నాలుగు సంవత్సరాలు నాలుగు సెకన్లుగా గడిచిపోయాయి.

ఇక రేపట్నుంచి ఎవరిదారి వారిదే.. ఆ ఐదుగుర్లో ముగ్గురు ఎమ్‌టెక్‌కి గేట్‌ పరీక్ష వ్రాస్తామన్నారు.

నాకైతే ఇంక చదవాలని లేదు..


'ఏం చేస్తావ'ని వాళ్ళు అడిగేరు.


“ఏమోరా.. భవిష్యత్తు గురించి నేనేమీ కలలు కనలేదు. 'కలలు కనండి... ఆ కలల్ని సాకారం

చేసుకోండి అని కలాం మహానుభావుడు చెప్పినట్లు నేను కలలు కనలేదు. కాబట్టి ఇంక సాకారం

ప్రశ్నేలేదు..” అన్నాను.


నా మాటలు విన్న నా స్నేహితులు 'ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా?' అని నా వంక ఆశ్చర్యంగా

చూడటాన్ని నేను గమనించాను..


"మరి ఇంజనీరింగ్‌ ఎందుకు చదివావు.. అదీ కాక మా అందరి కన్నా ఎంతో బాగా కష్టపడి

చదివావు... మంచి జ్ఞానాన్ని సంపాదించావు..” అని ఆశ్చర్యపోతూ అడిగారు...


"నేను హైస్కూల్లో చదువుతున్నపుడు మావూరి హెడ్మాస్టర్‌ రామారావుగారు 'చదువన్నది డబ్బు,

పేరుకి కాదు.. జ్ఞాన సముపార్జనకు ... తద్వారా సమాజసేవ కోసం' అని చెప్పారు... అది నా మనసులో నాటుకుపోయింది... అందుకే ఇష్టపడి చదివాను... ఇంకా ఏమి చెయ్యాలో నేను ఆలోచించలేదు. కానీ మన సమాజం కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను... కానీ కొన్నాళ్ళు మా అమ్మానాన్నలతో కలిసి, మా ఊళ్లో ఆనందంగా గడుపుతాను. అందుకు రేపుదయాన్న పాసింజర్‌కి బయలుదేరతాను... ప్రస్తుతానికి నా గమ్యం అదే” అన్నాను ఉద్వేగంగా...

ఆ మాటలంటున్నప్పుడు నా కళ్ళు చెమర్చడం మా స్నేహితులు గమనించేరు...


అందుకే వాళ్ళు ఇంకేం ప్రశ్నలు వెయ్యలేదు.


ఆ రాత్రి మా ఊరిని తలుచుకుంటూ హాయిగా నిద్రపోయాను.


ఆలోచనల్లోంచి బయటపడి స్టేషన్‌ బయట కొచ్చాను. అక్కడ మారైతు సన్యాసి నా మోటార్‌

సైకిల్తో ఎదురు చూస్తున్నాడు.


నన్ను చూడగానే ఓ నవ్వు నవ్వి నా బండి తాళాలు నాకిచ్చాడు... తను సంతలో పని చూసుకొని

వస్తానని నన్ను వెళ్ళిపొమ్మన్నాడు..


వాడు వెళ్ళిపోయిన తరువాత నేను అక్కడే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చున్నాను.

అప్పటికి చాలామంది ఆటోల్లోనూ, సైకిళ్ళ మీద వెళ్ళిపోయారు..

ఇప్పుడు స్టేషన్‌ ఆవరణ అంతా నిర్మానుష్యంగా ఉంది..


వేగావతి రోడ్‌ హాల్ట్‌ చాలా చిన్న స్టేషన్‌... రోజూ రెండు ప్యాసింజర్లు అక్కడ ఆగుతాయి... ఆ

తరువాత అక్కడ నిశ్శబ్దం తాండవిస్తుంటుంది..


చిన్నప్పట్నుంచీ ఆ స్టేషన్‌కి ఎన్నోసార్లు వచ్చాను.. చిన్నప్పుడు మా అమ్మ సంక్రాంతికి తాతగారింటికి వెళ్ళినపుడు నేను, అమ్మా ఎడ్లబండి మీద స్టేషన్‌ కొచ్చేవాళ్ళం. నాన్న పొలం పనుల్లో హడావుడివల్ల మాతో వచ్చేవాడు కాదు... ఆ తరువాత బొబ్బిలిలో సినిమా చూడటానికి బండి మీదే వెళ్ళేవాళ్ళం. నాకు ఆ ఎడ్లబండి మీద అమ్మతో ప్రయాణించడం అంటే ఎంత ఇష్టం... ఇందాక వచ్చిన సన్యాసి తండ్రి సీతన్న మా రైతుగా ఉండేవాడు. వాడి గూడుబండి చాలా బాగుండేది. అందులో ఎండు వరిగడ్డి వేసి దాని మీద బొంత వేసేవాడు... ఆ బొంతని మా అమ్మే పాతచీరలతో కుట్టేది.


దారి మధ్యలో తాగడానికి హార్లిక్స్‌ సీసాలతో నీళ్ళు పట్టుకొనేది. తినడానికి దిబ్బరొట్టె విస్తరాకుల్లో

పెట్టి పట్టుకునేది..

మధ్య మార్గంలో నందబలగ అడ్డేరు దగ్గర ఉండే మర్రిచెట్టు దగ్గర బండినాపి ఆ రొట్టెను తినేవాళ్లం..ఆ రొట్టె ఎంతో రుచిగా అనిపించేది.. ఆ రొట్టెను మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ అలా చెయ్యలేరు.


ఆ తరువాత ఏటిలో బండిని ఆపి ఎద్దులు నీటిని తాగడాన్ని ఆనందంగా చూన్తుండేవాడిని...

మేము బొబ్బిలి చేరేసరికి ఒంటిగంట అయ్యేది. బొబ్బిలిలో అప్పుడు మూడు సినిమా హాళ్ళు ఉండేవి.

శ్రీరామా, శ్రీకృష్ణ, లక్ష్మీహాల్స్‌... సంపూర్ణ రామాయణం సినిమాకి ఇసుక వేస్తే రాలని జనం... ఎంతో కష్టపడితే మాకు బెంచీ టిక్కెట్లు దొరికాయి.


ముందే నాకు మా స్కూలు మేస్టారు సన్యాసిరావుగారు ఆ కథ చెప్పడం వల్ల నాకు రామాయణం

కథ ఎంతో నచ్చింది... ముఖ్యంగా రాముడు రావణుల యుద్దం, హనుమంతుడు చివర్లో పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడిని బతికించడం.. ఇలా ఎన్నో నచ్చాయి.


అలా ఆ చెట్టు నీడలో కూర్చుంటే గతం అంతా గుర్తుకొస్తున్నాది. ఇంత అందమైన జ్ఞాపకాలకు

నెలవైన మా ఊరిని, మా ప్రాంతాన్ని వదలి ఉద్యోగాలకు హైదరాబాద్‌, ఢిల్లీ, అమెరికాకి వెళ్ళడం నాకు ససేమిరా ఇష్టం లేదు..


సమయం అప్పుడే ఏడుగంటలైంది. తూర్పు నుంచి కిరణాలు ఏటవాలుగా ముఖం మీద

పడుతున్నాయి.

అమ్మో! ఎండెక్కి పోతోంది.. వెంటనే బండిని స్టార్ట్ చేసి బయలుదేరాను... త్వరగా ఇంటికెళ్ళి

అమ్మని చూడాలని ఉంది..

“అప్పుడే నిన్ను చూసి ఆర్నెల్లయిందని అమ్మ కంట నీరు పెట్టుకుంటుంది. నాన్న ఆ బాధని లోపల అణుచుకుంటూ బయటపడడు..


ఈ వయసులో మా పల్లెలో అమ్మ చేసే రుచికరమైన వంటలు తింటూ ఏట్లో స్నానాలు చేస్తూ

పచ్చటి పొలాల కెళ్తూ ఏటి ఒడ్డున వాలీబాలు, కబాడీలాంటి ఆటలు ఆడుతూ గడపటం కన్నా

మధురస్మృతులు ఏముంటాయి.. అందుకే నా ఈ ప్రయాణం... అందరూ పరీక్షలైన తరువాత

విశాఖపట్నంలో వారం రోజులుండి సినిమాలు, బీచ్‌లు, జూ, కైలాసగిరి లాంటివి చూసుకుంటూ

గడుపుతుంటే నేను మాత్రం ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆనందాలను చవిచూడాలనే బయలుదేరాను.


మోటారు సైకిల్ని ఎండలో డ్రైవ్ చేస్తుంటే చెమటలు పడుతున్నాయి... నాలుగు కిలోమీటర్లు

వెళ్ళాక అలజంగి అడ్డ రోడ్డు వచ్చింది.. అక్కడ కూడా ఓ పెద్ద మర్రి వృక్షం... అక్కడ మళ్ళీ బండి ఆపాను... మళ్ళీ నా ఆలోచనలు మా ఊరిపైకి మళ్ళాయి.


ఇంకా మొన్ననే నేను మా ఊరి స్కూల్లో ఒకటో తరగతిలో చేరినట్లనిపిస్తోంది కానీ అప్పుడే నా

చదువు పూర్తెంది.. అంతా కళ్ళు మూసుకొని తెరిచేలోపే జరిగిపోయినట్లనిపిస్తోంది...


ఇంట్లోనే నాకు అక్షరాభ్యాసం.. నా జాతకం చూసి మా హెడ్మాస్టర్‌ గారు వీడు మంచి

తెలివైనవాడవుతాడని మా అమ్మతో అనడంతో ఆ రోజు నాకు దిష్టితీసింది అమ్మ.


రోజూ ఉదయాన్నే నూతి దగ్గర స్నానం.. తలకు కొబ్బరి నూనె, చేతులతో నా బుగ్గలను గట్టిగా

నొక్కి పట్టుకొని కర్ర దువ్వెనతో నా జుట్టును కళ్ళలో నీళ్ళు వచ్చేలా దువ్వేది మా అమ్మ...


ఆ తరువాత చాకింటి బట్టలు.. నిక్కరు, చొక్కా వేసేది... వంటింట్లో చద్దెన్నం తినిపించి పలక

చేతికిచ్చి నన్ను స్కూలుకి పంపించేది..


స్కూల్ లో అఆలు మొత్తం నేలమీదే చేతితో దిద్ది నేర్చుకున్నాను. అలాగే రెండవ తరగతిలో బుర్రు పిట్ట పాఠం, మూడవ తరగతి తెలుగు వాచకంలో “కాకి ఒకటి నీళ్ళకు కావు కావుమన్నది” అని కాకి కడవ అడుగున ఉన్న నీళ్ళను తన తెలివితేటలతో రాళ్ళను వేసి తాగి వెళ్ళే పాఠం రంగుల బొమ్మతో ఉండేది. ఆ పాఠాన్ని ఇంటికి వచ్చి భోజనం పెడుతున్నప్పుడు అమ్మకి చెప్పే దాకా నాకు నిద్రపట్టేది కాదు.


మధ్యాహ్నం భోజనం అమ్మ తినిపిస్తుంటే ఎంతో రుచిగా ఉండేది... నా కోసం వంకాయ పులుసు

పచ్చడిలో పంచదార వేసి వేడి అన్నంలో కలిపి పెడితే అమృతంలా ఉండేది..


అప్పుడప్పుడు మా నాన్నతో వరిచేలను కోస్తున్నప్పుడు పొలానికి వెళ్ళే వాడిని. అక్కడికి పేలాల

ఉండలు అమ్మకానికి తెస్తే రైతు వరికంకుల్నిచ్చి కొని నాకిచ్చేవాడు.

పొలానికి వెళ్తున్న దారిలో తాటి పిందెలు ఉండేవి.. ఆ చెట్లనిండా చెట్లకు సంచీల్లా వేలాడుతూ

పిచ్చుక గూళ్ళు.. వాటి మీద కిచకిచమని ఎగిరే పిచ్చుకలు... వాటిని అలా చూస్తూ చాలా సేపు ఉండి పోయేవాడిని...


పెరట్లో ఎన్నో చింతచెట్లు, నేరేడుచెట్లు ఉండేవి. చింతచెట్ల నిండా తెల్లటి కొంగలు ఎగురుతుండేవి..


నేరేడు చెట్టు తొర్రలో ఆకుపచ్చటి రామచిలుకని చూడటానికి రోజూ ఉదయాన్న లేచి చెట్టు దగ్గర నిల్చొని ఆ తొర్రలోంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని పళ్ళైనా తోముకోకుండా ఎదురు చూస్తుండేవాడిని..


కార్తీక మాసంలో తెల్లవారిలేచి అమ్మతో ఆ మంచులో చలి వణికిస్తుంటే కార్తీక స్నానాలు చెయ్యటానికి ఏటికి వెళ్ళేవాడిని... ఆ చలిలో చీకట్లో మునుగుతుంటే శరీరమంతా గడ్డ కట్టేసినట్లు అనిపించేది. మా అమ్మ మాత్రం చలికి భయపడకుండా స్నానం చేసి ఆ తడిబట్టలతోనే ఏట్లో అరటి దొప్పల్తో కార్తీక దీపాలు వెలిగించి వదిలేది. నేను కూడా ప్రతీరోజు ఒక దీపాన్ని వదిలేవాడిని. అవి అలా ఏటి ప్రవాహంలా వెళుతుంటే ఆ చిరు చీకట్లో దూరం నుంచి చూస్తుంటే పౌర్ణమి నాటి ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తుంటే వాటిని మా అమ్మ పిలుస్తున్నా వినకుండా చూస్తుండేవాడిని...


ఇక సంక్రాంతికైతే మా ఊరు చెప్పక్కర్లేదు. వారం రోజుల ముందే మా అగ్రహారం వీధిలోని

అందరిళ్ళకూ చుట్టాలు పక్కాలు వచ్చే వాళ్ళు. ఇంక ఆవారం రోజులూ స్వర్గమే.. ఉదయాన్నే ఏట్లో స్నానాలు, అమ్మ పెట్టే వేడివేడి ఉప్మాలు, మధ్యాహ్నం బొబ్బట్లు, పులిహోర... చక్కెర పొంగలి...... ఇలా ఒకేటమిటి ఎన్నో వంటకాలు...


ఇంక రోజంతా పేకాటలే.. అప్పటికి నేను 9వ తరగతి వచ్చేసాను కాబట్టి పేకాట తప్పు కాదు.

అంతవరకు పేకాటాడితే నాన్న కోప్పడేవాడు.


మళ్ళీ ఆలోచనల్లోంచి బయట పడ్డాను ... సమయం పది దాటి పోయింది... వెంటనే బయలుదేరితే ఈపాటికి మా ఊరు చేరిపోయి అమ్మ ఇచ్చిన కాఫీ హాయిగా తాగుతూ పెరడంతా కలియ తిరుగుతూ ఉండేవాడిని..


కానీ నాకెందుకో వెంటనే అక్కడికి వెళ్ళాలనిపించటం లేదు.. వెళితే మా ఊర్ని, మా అమ్మనీ

చూడాలన్న ఆనందం క్షణంలో మాయమవుతుంది. అది నా కిష్టం లేదు... ఇలా ఆగుతూ వెళితే ఇంకా ఆ ఆనందకరమైన క్షణాలు వస్తాయన్న ఆశ నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది...


నా గమ్యం మా ఊరు వెళ్ళి అమ్మని నాన్నని చూడటం... అక్కడ హాయిగా గడపటం. అందుకే ఈ

రోజు ఈ ప్రయాణం... నాకీ ప్రయాణం త్వరగా పూర్తవ్వాలని లేదు... ఈ గమనం మెలమెల్లగా సాగాలి...


గమ్యం కన్నా గమనం చాలా గొప్పదని ఎక్కడో చదివాను... అవును అది నిజం... నేనీ పాటికి

ఇంటికి వెళ్ళిపోతే ఆ గమనం ముగిసేది కానీ ఇప్పుడు... ఇంకా ఉంది... ఇలా ఇది కొనసాగాలి...

అవును...


గమ్యం కోసం వెళ్ళే గమనం ఎంతో గొప్పది.


(సమాప్తం)


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం:

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.



169 views1 comment

1 commento


Bindu Madhavi
Bindu Madhavi
03 feb 2021

కధ నడిపిన విధానం ఆసక్తికరంగా, చక చకా మెరుపు వేగంతో ఉన్నది.

బాల్య స్మృతులు ఎవరికైనా మధురమే! అందరికీ అవి పదిలంగా మనసు మూలల్లో ఉంటాయి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నేముంబామని ఓదార్చటానికి మనో ఫలకం మీద పేత్యక్షమవుతాయి

Mi piace
bottom of page