top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

గరుడాస్త్రం - ఎపిసోడ్ 9



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.


కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష. పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు..

పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.

ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.

శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.

తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.

పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.

శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.

హైదరాబాద్ లో రిపోర్ట్ చేస్తాడు.



ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 చదవండి..


శ్రీహర్షకు సంవత్సరం లో ట్రైనింగ్ పూర్తైంది. ఆ సమయంలో ప్రణవి పుట్టింటే ఉంది. ఈ లోగా ఆమె తన లా పూర్తి కావడంతో తండ్రి కరుణాకరం వద్దే జూనియర్ లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టింది. ప్రతి శనివారం శ్రీహర్ష ప్రణవి కోసం మామగారింటికి వచ్చేవాడు. ఆ రెండు రోజులు వాళ్ళిద్దరూ సినిమాలకి, బీచ్ కి వెళ్ళేవారు..


ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష కొత్తగా డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.. ఆ టీమ్ లీడర్ భరద్వాజ దేశంలోనే ప్రముఖ శాస్త్రవేత్త. రక్షణ రంగ నిపుణులు. అతను అబ్దుల్ కలాంతో కలిసి అగ్ని, ఆకాశ్, త్రిశూల్ మిసైల్స్ ప్రాజెక్ట్ లకు పని చేసాడు. అప్పుడు అబ్దుల్ కలాం గారిని మిసైల్ మేన్ అని పిలిచేవారు. ఒక కొత్త రంగాన్ని దేశానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తులను అదే పేరుతో పిలవడం మనదేశంలో ఒక ఆనవాయితీ. అబ్దుల్ కలాం గారిని మిసైల్ మేన్ అనీ, శ్రీధరన్ని మెట్రోమేన్ అనీ పిలవడం అందుకు ఉదాహరణలు.


ఎప్పుడైతే ట్రైనింగ్ పూర్తైందో శ్రీహర్షకు బంగ్లా కేటాయించారు. అవి టైప్ 4 బంగ్లా.. మూడు బెడ్ రూమ్ల ఇల్లు. వెంటనే మామగారికి చెప్పి అందులోకి మారిపోతామనీ చెప్పాడు. కానీ కరుణాకరం కూతుర్ని పంపడానికి ఇష్టపడలేదు . ఎందుకంటే ప్రణవి ఒక్కర్తె కూతురు. పుట్టినప్పట్నుంచి కూతుర్ని వదలి ఉండలేదతను. అటువంటిది పెళ్ళైన తరువాత మొదటిసారిగా కూతురు అల్లుడి దగ్గరకి వెళ్ళిపోతుందన్న విషయం అతనికి మింగుడు పడలేదు.

ఆ రాత్రి భోజనాల దగ్గర శ్రీహర్షతో ఆవిషయం కదిపాడు.


“నిన్ను అల్లుణ్ణి చేసుకుంది మాతో కలిసి ఈ ఇంట్లో ఉంటావన్న ఉద్దేశ్యంతో.. దానివల్ల నా కూతురు మాతోనే ఉంటుందన్న స్వార్థం. నాకా ఒక్కొగానొక్క కూతురు; దాన్ని వదిలి మేము ఉండలేము.. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపోతే మంచిది” అనీ చెప్పాడు.


దానికి శ్రీహర్ష కొద్దిసేపు ఆలోచించి "అంకుల్! ఇక్కడికి మా ప్రయోగశాల పాతిక కిలోమీటర్ల దూరం. రోజూ ఇక్కడ నుంచి వెళ్ళిరావాలంటే కష్టం. అదీ కాక మిలట్రీకి సంబంధించిన సైంటిస్టులు బయట ఉండకూడదు. మాకు కేటాయించిన ఇళ్ళలోనే ఉండాలి. కాబట్టి అక్కడికి మేము వెళ్ళక తప్పదు. అయినా ప్రతీ శనివారం మీ దగ్గరికి మేమిద్దరం వస్తూ ఉంటాము. ప్రాక్టీస్ కోసం ప్రణవి రెండు రోజులకొకసారి మీ దగ్గరికొస్తుంటుంది” అని చెప్పిన తరువాత కరుణాకరం, సుశీల దంపతులు కూతుర్ని పంపడానికి ఒప్పుకున్నారు. వాళ్ళతో పాటు ఆ దంపతులిద్దరూ వచ్చి కూతురుతో వేరు కాపురం పెట్టించి పాలు పొంగించారు..


రెండురోజుల కోసారి కరుణాకరం గారు కారు పంపిస్తే ప్రణవి దాంట్లో ఇంటికి వచ్చి తండ్రి దగ్గర లా ప్రాక్టీసు చేస్తూ ఉండేది. కరుణాకరం కొన్నిసార్లు ప్రణవిని కొన్ని కేసులను ఆమెకే అప్పచెప్పి కోర్టులో ఆమె చేతే వాదింప చేసేవాడు.. అలా సంవత్సరం తిరిగే సరికి ప్రణవి మంచి లాయర్‌గా పేరు తెచ్చుకుంది.


రాను రాను శ్రీహర్ష మిసైల్ డిజైన్లో నిమగ్నమవసాగేడు. అతని బృందంలో నలుగురు సైంటిస్టులుండేవారు. భరద్వాజ గారు శ్రీహర్ష లోని మెరుపు తెలివితేటలు చూసి ఆ ప్రాజెక్ట్ కి టీమ్ లీడర్ గా శ్రీహర్షని నియమించాడు..


ఈ గరుడ మిసైల్ రెండు సంవత్సరాల్లో పూర్తి కావాలనీ రక్షణ మంత్రిత్వ శాఖ గడువు విధించింది. రాబోయే ఆగష్టు పదిహేను నాడు ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి మాట్లాడే ప్రసంగంలో అది పూర్తి అయిన ప్రస్తావన తేవాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే టీమ్ సభ్యులందరూ రాత్రి-పగలనక డిజైన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు.


ఒకరోజు ప్రణవి శ్రీహర్షతో తాను మిసైల్ సెంటర్ని చూస్తానని చెప్పడంతో భరద్వాజ గారి అనుమతి తీసుకొని ఆమెను లోపలికి తీసికెళ్ళాడు శ్రీహర్ష.


అది ఐదువందల ఎకరాల్లో సువిశాలంగా నిర్మించిన ప్రయోగశాల.. ఆధునికమైన ప్రయోగశాలలు, భవనాలు, మధ్యలో పచ్చని చెట్లతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అతను తను పనిచేస్తున్న ప్రయోగశాలకి ఆమెను తీసికెళ్ళాడు. అక్కడ సైంటిస్టులతో పాటు ఇద్దరు స్త్రీలు కూడా పనిచేయడం ఆమె గమనించింది.. వారిద్దర్ని ప్రణవికి పరిచయం చేసాడు శ్రీహర్ష. ఒకామె భావన.. ఇంకొకరు ప్రీతి.. ఇద్దరూ సైంటిఫిక్ అసిస్టెంట్లు; సైంటిస్టులకు పరిశోధన, డిజైన్లలో సహాయ పడుతుంటారు. అక్కడ ఒక పెద్ద మిసైల్ నమునా ఉంది. ఆ పక్కనే గోడమీద స్క్రీన్.. దాని మీద మిసైల్ డ్రాయింగ్స్ ఉన్నాయి. వాటిని ఆసక్తిగా పరిశీలించసాగింది ప్రణవి. అక్కడున్న సైంటిస్టుల బృందం అంతా కంప్యూటర్ మీద నిశ్శబ్దంగా, నిర్విరామాంగా పనిచేస్తూ కనిపించారు.


శ్రీహర్ష "అన్ని చూపించిన తరువాత ప్రణవిని తన ఛాంబర్ కి తీసుకువచ్చాడు. ఇంటర్ కమ్ లో కాఫీలు ఆర్డరిచ్చాడు.

“హర్ష! అసలు ఈ మిసైల్స్ దేనికి తయారు చేస్తున్నారు? దీనివల్ల ఏమిటి ఉపయోగం ?.. శతృ దేశాల మీద ప్రయోగించడానికి వీటిని వాడతారు అంటారు.. ఇది నిజమేనా?” అని అడిగింది..


“నువ్వు విన్నది, చదివింది నిజమే కానీ అసలు ఉపయోగం అది కాదు.. పూర్వం యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం మీద బాంబులు వెయ్యాలన్నా ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాన్ని ఉపయోగించేవారు. ఉదాహరణకు ఫాట్ మేన్, లిటిల్ బాయ్ అనే ఆటంబాంబులను జపాన్లోని హిరోషిమా, నాగాసాకి అనే పట్టణాల మీద విమానాల ద్వారానే ప్రయోగించారు.దానివల్ల లక్షల మంది చనిపోయారు.


దానివల్ల ఓ ప్రమాదం ఉంది. శతృదేశపు రాడార్లు పసిగట్టి ఆ విమానాన్ని కూల్చేస్తే భారీ నష్టంతో పాటు అందులోని పైలెట్సు, సిబ్బంది చనిపోతారు. ఇప్పుడు మిసైల్స్ కనిపెట్టిన తరువాత టార్జెట్స ని మిసైల్లో బాంబులు పెట్టి సుదీర ప్రాంతాల నుంచి ప్రయోగిస్తున్నారు. ఒక వేళ శతృదేశాలు రాడార్లు పసిగట్టినా ఆ మిసైల్ ఒక్కటే నాశనం అవుతుంది తప్ప ఇంకేం నష్టం ఉండదు.


ఉదాహరణకు గల్ఫ్ వార్ టైములో ఇరాక్ ఇజ్రాయిల్ మీద స్కడ్ మిసైల్స్ ని ప్రయోగించింది. ఒక విధంగా చెప్పాలంటే మిసైల్ కూడా ఒక రాకెట్ లాంటిది. మనం ఉపగ్రహాలను వేల కిలోమీటర్ల ఎత్తుకు అంటే స్ట్రాటో స్ఫియర్ దాటి రాకెట్ ద్వారా పంపుతునాము. మన మిసైల్స్ ద్వారా బాంబులను ప్రయోగించడం కూడా అటువంటిదే.. ఇంగ్లీషులో చెప్పాలంటే ఎ మిసైల్ ఈజ్ ఇంటిలిజెంట్ అన్ మ్యా డ్ రాకెట్ డిజైన్ టు కేరీ ది పే లోడ్ టు ఎ డిజిగ్నేటెడ్ పాయింట్ విత్ ఏన్ ఎయిమ్ ఆఫ్ డిస్టరోయింగ్ ది ఆబ్జెక్ట్;


సుదీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చెయ్యడానికి అవసరమైన బాంబులను తీసికెళ్ళే ఒక తెలివైన మానవ రహిత రాకెట్ నే మిసైల్ అనవచ్చు. దీని ద్వారా రసాయనిక ఆయుధాలు, అణుబాంబులు, బయోలజికల్ ఆయుధాలను ప్రయోగించవచ్చు” అని వివరంగా చెప్పాడు.

“మరి వీటినెక్కడ తయారు చేస్తారు”


“ఈ మిసైల్స్ రాకెట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే న్యూటన్ మూడవ సిద్ధాంతం ఆధారంగా ఇవి పనిచేస్తాయి. అంటే ప్రతీ చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది ..

మేము దాని ఆధారంగా మిసైల్స్ ని ఇక్కడ డిజైన్ చేస్తాము. వీటి నిర్మాణం వేరో చోట జరుగుతాయి.. ఈ డిజైన్లు, నిర్మాణం ప్రైవేట్ వాళ్ళకు చేరకూడదనీ ప్రభుత్వమే స్వంతంగా తయారుచేస్తోంది. అణుశక్తి లాగన్న మాట. అణుశక్తిని కూడా కేంద్ర ప్రభుత్వమే తయారుచేస్తోంది. ఇటువంటివి శత్రువులకు చేరితే దేశభద్రతకు ప్రమాదం. అందుకే ఈ గోప్యత. సాధారణంగా మిసైల్స్ లో రాకెట్ ఇంజన్లు గానీ, జెట్ ఇంజన్లను గానీ వాడతాము.” అనీ సుదీర్ఘంగా ఆమెకు వాటి గురించి వివరించాడు.

అతను చెబుతుంటే ఆమె చాలా ఆసక్తిగా వింది.


“నిజం చెప్పాలంటే సైన్స్, ఇంజనీరింగ్ ప్రపంచానికి గొప్ప మేలు చేస్తున్నాయి. అత్యంత తెలివైన మేథావులు మాత్రమే ఈ రంగంలో మన గలుగుతారు. దురదృష్టవశాత్తు ప్రపంచాన్ని ఏలే వాళ్ళంతా ఈ రంగాలకు చెందిన వాళ్ళు కారు; ఐన్ స్టెయిన్, న్యూటన్, థామస్ అల్వా ఎడిసన్, మేరీ క్యూరీ, రైట్ బ్రదర్స్, జేమ్స్ వాట్ ఇలా చెప్పకుంటూ పోతే ఎందరో.. వారు ప్రపంచాని కెంతో సేవ చేసి దీన్ని ముందరు తీసికెళ్ళారు..” అంది ప్రణవి..


శ్రీహర్ష నవ్వుతూ “బాబోయ్.. మమ్మల్ని ఆకాశానికెత్తేస్తున్నావేంటి” అన్నాడు; ఆ తరువాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.


******* ******** *******


కాలచక్ర భ్రమణం కొనసాగుతోంది. అది నిరంతర చలనశీలి.. ప్రణవి ప్రాక్టీస్ బాగా కొనసాగు తోంది. శ్రీహర్ష వాళ్ళ టీమ్ చేపట్టిన గరుడ మిసైల్ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది; ఇంకో నెల రోజుల్లో అది తుది దశకు చేరుకోనుంది.. ప్రణవి శ్రీహర్షలు నెలరోజులు శలవు పెట్టి గోవా, బెంగళూర్, సిమ్లా వెళ్ళి వచ్చారు.


ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ అనుకోని సంఘటన ఓ కుదుపు కుదిపింది.

ఒకరోజు శ్రీహర్ష ఆఫీసులో వున్నప్పుడు డైరెక్టర్ గారు పిలుస్తునారు అంటూ అటెండర్ చెప్పాడు .ఎప్పుడూ తనని పిలవని డైరెక్టర్ ఈ రోజెందుకు పిలిచారో నని ఆలోచిస్తూ రెండవ అంతస్తులో ఉన్న అతని ఛాంబర్ కి వెళ్ళాడు. ఐదు నిముషాలు బయట వేచి ఉన్న తర్వాత అతన్ని లోపలికి రమ్మని పిలుపొచ్చింది.


శ్రీహర్ష లోపలికి వెళ్లాడు. చాలా విశాలంగా, ఆధునాతనంగా ఉందా గది. ఎదురుగా విశాలమైన టేబుల్ ముందు డైరెక్టర్, అతని కెదురుగా ఒక పొడవైన వ్యక్తి కూర్చొన్నారు.

శ్రీహర్షని చూడగానే డైరెక్టర్ వేదవ్యాస్ “కమిన్” అని చెప్పి ఎదురుగా కుర్చీలో కూర్చోమని చెప్పాడు.

కొద్దిసేపు అక్కడ సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం.


“మిస్టర్ శ్రీహర్ష మీరు ఈ కేంద్రంలో చేరి ఎన్నాళ్ళైంది” అని అతనడిగాడు.

“సార్! రెండు సంవత్సరాలైంది.”

“ప్రస్తుతం మీ ఎసైన్మెంట్ ఏమిటి?”

“సార్ మేము గరుడ మిసైల్ ని డిజైన్ చేస్తున్నాము”

“ఓకే! అది పూర్తైందా?”


“95%” అయింది.. ఇంకా డిజైన్స్ ఫైనలైజ్ కావాలి. ఆ పనిలోనే ఉన్నాము”

“ఓకే..” అంటూ అతను ఒక డ్రాయింగుని శ్రీహర్షకి చూపించాడు.


అది తాము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ దే.. అది అతని చేతిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ లను తాము బయటకు పంపలేదు. ఎవ్వరికి తెలియదు కూడా.

అందుకే దాన్ని చూడగానే శ్రీహర్షకు ఆశ్చర్యం కలిగింది.


“ఈ డ్రాయింగ్ దేనికి సంబంధించినది” అని అడిగాడు.. మెల్లగా అతని స్వరంలో మార్పుని గమనించసాగాడు శ్రీహర్ష..

“సార్! ఇది మేము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ ది. కానీ అది ఎవ్వరికీ తెలియదు. ఇంకా అది ఫైనల్త్జ్ కాలేదు” అని చెప్పాడు హర్ష.


“మరి ఇది బయటకు ఎలా వచ్చింది”?అతని స్వరం గంభీరంగా ఉంది. ప్రశ్నిస్తున్నాట్లు గా ఉంది.

అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు శ్రీ హర్షకు.

“తెలియదు” అన్నాడు మెల్లగా.. ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు తడి ఆరిపోయింది. “మిస్టర్ హర్ష! ఈ డ్రాయింగ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయి?”


“సార్! ఇవి మా సెక్షన్ ఆధీనంలోనే ఉంటాయి. భావన అనే సైంటిఫిక్ అసిస్టెంట్ కస్టడీలో ఉంటాయి.”


“కానీ ఆ సెక్షన్ కి ఇంఛార్జీ మీరు.. మీకు తెలియకుండా ఇది బయటకు ఎలా వచ్చింది. నువ్వు పనిచేస్తున్నది మిలట్రీకి ఆయుధాలకు సంబంధించిన డిజైన్ ఆర్గనైజేషన్లో.. జాగ్రత్తగా ఉండాలనీ తెలియదా? ఈ డ్రాయింగులు బయటకొచ్చి శత్రువుల చేతిలోకి వెళితే ఎంత ప్రమాదమో తెలుసా? శత్రువుల చేతిలో పడితే వాళ్ళు కూడా మన లాగే మిసైల్స్ ని తయారు చేసి మనమీదే ప్రయోగిస్తారు. మనం ప్రయోగించే మిసైల్స్ ని సులభంగా కూల్చేయగల ఏన్టీ మిసైల్స్ ని తయారు చేసే అవకాశం ఉంటుంది.. అంత ప్రమాదకరం ఇవి బయటకెళితే..”


“లేదు సార్.. మేము జాగ్రత్తగా ఉంచుతునాము సార్.. సెల్ ఫోన్లు కూడా తీసుకురానివ్వము . అందువల్ల బయటకెళ్ళే అవకాశంమే లేదు” అన్నాడు శ్రీహర్ష..


"మిస్టర్ శ్రీహర్ష! సావధానంగా విను.. ఈ డ్రాయింగ్ పాకిస్థాన్ గూఢాచారి చేతిలోకి వెళ్ళింది.. అదృష్టవశాత్తూ అతను మన సీఐడీ పోలీసులకు చిక్కాడు లేకపోతే ఈ డిజైన్ సరిహద్దు దాటి పాకిస్థాను వెళ్ళిపోయేదే?; మీ పక్కన కూర్చున్నదెవరు అనుకుంటునారు? అతను సిఐడి ఛీఫ్ పరీక్షత్.. అతనే ఈ డ్రాయింగ్ ని తీసుకొచ్చారు.. నిన్న అరెస్ట్ కాబడ్డ పాక్ గూఢచారి ఇమ్రాన్ దగ్గర ఇది దొరికింది. చెప్పండి.. అది అతని చేతికి ఎలా వెళ్ళింది” అని అడినాడు.


ఇప్పుడు అతని స్వరం పూర్తిగా మారిపోయింది.. ఆ ప్రశ్నలో అధికారం, అనుమానం ధ్వనిస్తున్నాయి. అతని మాటలకు శ్రీహర్ష మైండ్ బ్లాక్ అయింది.. ఏం జరిగిందో అర్థం కావటం లేదు.. అతని ముఖమంతా చెమటలు పడుతునాయి.. తను జీవితంలో ఏదైతే జరగకూడ దనుకున్నాడో అదే జరుగుతోంది.. తను ఈ రెండేళ్ళు పడ్డ కష్టం కొద్ది నిముషాల్లో ఆవిరైపోతోదన్న ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏం జరగబోతోంది? నిజంగా తనకేం తెలియదు.. బహుశ తనేమైనా నిర్లక్ష్యం వహించాడా? ఈ ప్రశ్నలతో అతని మస్తిష్కం వెడెక్కి పోతోంది.


ఇంతలో అతని పక్కన కూర్చున్న సీఐడి ఛీఫ్ పరీక్షత్ “మిస్టర్ శ్రీహర్షా! మీరు మా స్టేషన్ కోసారి రావలసి ఉంటుంది. మిమ్మల్ని ఇంటరాగేషన్ చెయ్యాలి.. మిస్టర్ వేదవ్యాస్.!.. వుయ్ విల్ టేక్ హిమ్ టూ అవర్ స్టేషన్.. ఫర్ దిస్ వుయ్ నీడ్ యువర్ పర్మిషన్” అన్నాడు.


ఆ తరువాత సంఘటనలన్నీ త్వరత్వరగా చోటుచేసుకున్నాయి. పది నిముషాల్లో సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, భరద్వాజ గారిని మరో ఇద్దరూ సైంటిస్టులను పోలీసు స్టేషన్ కి తీసికెళ్ళి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇంటరాగేషన్ మొదలు పెట్టారు.

=================================================================

ఇంకా వుంది

=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


29 views0 comments

Comments


bottom of page