'Giriki Bharamavuthunna Tharuvulu' written by Voleti Sasikala
రచన : వోలేటి శశికళ
" పెద్దమ్మా! పెద్దనాన్నా! .... " పెద్ద పెద్ద అరుపులు విని గుండెలు దడదడలాడాయి సీతకి.
గొడ్లచావడ్లో పాలేరుతో పనిచేయిస్తున్న సీత, చేతులు కొంగుకు తుడుచుకుంటూ, పరిగెట్టుకుంటూ ఇంట్లోకి ఒచ్చింది.
" పెద్దమ్మా! అజయ్ గోదారి కాలవలో మునిగీత కొడుతున్నాడు. ఆడ సుళ్ళుంటాయి సూడు! అక్కడ. మేము రమ్మంటుంటే రావట్లేదు. జాకీని పట్టుకుని దూకీసాడు"... వగర్చుకుంటూ చెప్తున్నాడు సతీష్, సీత మరిది కొడుకు.
ముచ్చెమట్లు పోసాయి సీతకి. బీపీ పెరిగిపోయింది.
"" రంగా! ఒరే రంగా! " అంటూ పాలేరుని బిగ్గరగా పిలిచింది.
గబగబా చెప్పుల్లో కాలుదూర్చి, పాలేరూ , సతీష్ వెంటరాగా గోదారొడ్డుకి పరిగెట్టింది సీత.
సతీష్ వేలెట్టి కాలవలోకి చూపించాడు.
" అజయ్" , సీతా , రమేష్ ల ఏకైక సంతానం .... పెద్దపెద్ద బారలేసుకుంటూ , అరుచుకుంటూ, గోదారికాలువలో ఈదుతున్నాడు. వాడి తోటి ఈదుతూ వాళ్ళ ఆల్ సేషియన్ కుక్క జాకీ!!
అంత లోతుకాలవలో పిల్లాడిని చూసిన సీత ప్రాణాలు అరిచేతులోకి వచ్చాయి. " అజయ్! అజయ్!
" అజీ బాబూ!
" ఒరే అజయ్" .... పిలుస్తూనే ఉన్నారు. కావాలనే అటు చూడకుండా ఇంకా లోపలికి వెళిపోతున్నాడు అజయ్.
రంగా నీళ్ళలోకి దూకి , ఈదుకుంటూ పోయి వాడిని పట్టుకున్నాడు.
వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్న పిల్లాడిని లాక్కుంటూ తెచ్చి ఒడ్డున పడేసాడు రంగా.
అప్పటికే అక్కడ దొరికిన చింతబరికె పట్టుకుని రెడీగా ఉన్న వాళ్ళమ్మ పిల్లాడిని చితకబాదేసింది.
" దరిద్రుడా! చచ్చినాడా! ఏడిపించేస్తున్నావు కదరా! అక్కడ ఊబిలో పడితే చచ్చుండేవాడివి"....... తిడుతూ , ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుపోతోంది.
ఈ చోద్యం చూస్తున్న వీధిలో అమ్మలక్కలడుగుతున్నారు "ఏమయిందని?"..... వాళ్ళకి సతీష్ గాడు కధలు కధలుగా అజయ్ గాడు ఏం చేసాడో చెప్తున్నాడు.
" బాబోయ్! ఇంత దుడుకు పిల్లడ్ని నా పుట్టిబుద్దెరిగి చూడలేదు.
అబ్బ! ఎంత అల్లరో బాబూ! అసలా సీత ఎలా భరిస్తోందో! నా పిల్లాడయితే ఈ పాటికి చంపి పాతరేసేదాన్ని".....
కనకమహాలక్ష్మి సీత వినేట్టు గాట్టిగా అనేసరికి ఆ సీతకి ఇంకోంత కోపమొచ్చి మరో నాలుగు ఒడ్డించేసింది.
" ఒద్దమ్మా! ప్లీజ్ ! కొట్టకమ్మా! ఇంకెప్పుడు ఎళ్ళనే! కొట్టుకే........" ఏడుస్తున్నాడు అజయ్.
అక్కడే అరుగుమీద కూర్చుని చుట్టలు చేసుకుంటున్న రాఘవయ్యగారు ఇదంతా చూస్తూ భార్యతో అంటున్నారు.
" ఈడి అల్లరి పట్టలేకపోతున్నామమ్మీ! మొన్న పంతుళ్ళారి శీను చెప్తున్నాడు. కాలవ గట్టున ఇసకలో పిల్లాడెత్తు గోతులు
తవ్వతున్నాట్ట. ఆటిమీద పుల్లలూ, తాటాకులూ కప్పేసిపోతాట్ట
. రాత్రి ఆపీసులయ్యాకా, బస్సుదిగి ఊళ్ళోకొచ్చేవోళ్ళు కాలవగట్టంబడి రావాల గదా! ఆళ్ళంతా సీకట్లో ఈడు తవ్విన గోతుల్లో పడి నడుం ఇరక్కొట్టుకుంటున్నారు. పొద్దుగాల లేచి కాలవొడ్డున ఎన్ని గోతులు దిగిపోయాయో చూసుకుని ఎగురుతుంటే మన శీనుగాడు పట్టుకున్ని నాలుగు తన్నాట్ట!!
పిల్లల్లేని శాంత అందుకుంది. " పోనీలేండి! పదేళ్ళ పిల్లలు అల్లరిచెయ్యరా! మనమంతా ఏ అల్లరీ చెయ్యకుండానే ఇంత పెద్దోళ్ళమవ్వలేదు కదా!
ఆడు కాస్త పెద్దయితే ఆడే తెలుసుకుంటాడు. అయినా ఆళ్ళమ్మా, నాన్నా చీటికీ మాటికీ పిల్లడినలాగ కొట్టి చంపేత్తున్నారు! ....
పక్కింటి రాజేశ్వరి మూతి మూడువంకర్లు తిప్పి, " నువ్వు కనిపెంచితే తెలిసేదమ్మా! కబుర్లు చెప్పడం కాదు" అనగానే పాపం మొహం చిన్నబుచ్చుకుని లోపలికెళ్ళిపోయింది శాంత
అక్కడే ఇంటి ఎత్తు అరుగుల మీద కూర్చుని చింతపండు గింజతీస్తున్న సుందరి, సీత తోటికోడలు పెద్దగొంతుకేసుకుని ఊరంతా వినపడేట్టు
" ఎప్పుడో ఈడి చేతులోనే ఈ ఇల్లు బూడిదవుతుంది. .ఒక నిప్పని లేదు, నీరనిలేదు అన్నిటితో ఆటలే ఈడికి. చదువు సంధ్య లేకుండా మా పిల్లల్నీ తగలెడుతున్నాడు ఎదవ. అయినా పెంపకాలు రాకపోతే ఆష్టళ్ళలో ఏసి చదివించాల. ఇలా ఊరుమీద ఒదిలేసి కాదు"........... దెప్పడానికి ఏఒక్క అవకాశం ఒదలదామె.
" మొన్నటికి మొన్న పొలంలో ట్రాక్ట రు తోలుకుంటూ యెళ్ళి పంపుగదిని కొట్టేసాడు. గోడలిరిగిపోయి, పంపుసెట్టంతా ధ్వంసమయిపోయింది. లక్ష రూపాయిల ఖర్చు. ఏరా రంగా! చెప్పు నువ్వూ అక్కడే ఉన్నావుకదా!"
" అవునమ్మా! మీ తమ్ముడిగారి జాంతోటంతా ఆ ఉప్పరికుర్రాళ్ళని తెచ్చి పళ్ళన్నీ దూసేసారు కదా బాబు".... నేను సైతం అనుకుంటూ తనూ ఓ సమిధ పడేసాడు.
ఏమంత పెద్దవీధి. సగం వీధి తమయిల్లేనాయే!! సీతకి అందరి మాటలూ వినిపిస్తున్నాయి.
బాత్రూంలో అజయ్కి తలమీద నీళ్ళుపోస్తూ వింటోంది.
బరికెదెబ్బలకి తట్తేలిపోయిన పిల్లాడి వీపు చూసేసరికి కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి.
తలతుడిచీ వీపంతా క్రీంరాసి , వేడివేడి అన్నం ముద్దలు చేసి, పెట్టి, పడుకోపెట్టింది. ఏమీ ఎరగనట్టు పడుకున్న వాడిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది.
" ఎందుకురా కన్నా! ఇంత అల్లరి చేసి, శాపనార్ధాలు, దెబ్బలూ తింటున్నావు? ప్రేమగా వాడి తలనిమిరింది. అంత నిద్రలోనూ అమ్మచెయ్యి గట్టిగా పట్టుకున్నాడు వాడు.
మధ్యాహ్నం భోజనానికొచ్చిన రమేష్ తో చెప్పింది జరిగినదంతా. చటుక్కున కోపం ఒచ్చేసిందతనికి.
" లేపు ఎదవ నాకొడుకుని. చంపిపారేస్తే పీడావిరగడవుతుంది. ఇంకీడితో మనం పడలేం. బడికి పంపితే అక్కడ అల్లరి. తోట్లమ్మట దొడ్లమ్మట తిరుగుతూ ఊర్లో తలెత్తుకోకుండా చేసేస్తున్నాడు. కిందటేడే హాస్టల్లో ఏసేస్తానంటే నువ్వు అడ్డం పడిపోయావు. ఇంక వాడేనా ఉండాలి మనమేనా ఉండాలి. ఆలోచించుకో!!"
ఏవాలోచించుకుంటుంది తను. లేకలేక పుట్టిన పిల్లాడు. ఏడాదికే నడక, కబుర్లు, రెండేళ్ళకే అంకెలూ, పద్యాలు వచ్చేసాయి. పిల్లాడు చురుకని మురియినంతసేపు పట్టలేదు. పిచ్చి అల్లరి మొదలుపెట్టాడు.
తాముండేది పల్లెటూర్లో, ఉమ్మడికుటుంబం. పెద్దమోతుబరుల కోడళ్ళమని పేరే కానీ ఒక్క క్షణం సమయం ఉండదు. పిల్లాడిని ఇరుగూపొరుగూ మీద, ప్రెవేట్ల మీదా ఒదిలేసారు. భర్త చేస్తే వెర్రిగారం లేకపోతే అతి క్రమశిక్షణ. అజయ్ ని ఎలా సరయిన మార్గంలో పెట్టాలో తెలీట్లేదు.
హాస్టళ్ళంటే భయం. తమవూర్లో నాయుడుగారి మనవరాలు హాస్టల్లో బాధలు తట్టుకోలేక ఆసిడ్ తాగి చచ్చిపోయింది .
ఇలాంటి పిల్లాడిని ఏం హాస్టళ్ళలో పెట్టగలరు? ఒకప్పుడు ముద్దుచేసిన వాళ్ళంతా వీడిని అసయ్యించుకోడమే.
వాళ్ళ పిల్లలు వీడితో ఆడితే ఎక్కడ చెడిపోతారా అని వాళ్ళని కట్టడి చెయ్యడం తను గమనించకపోలేదు. వాళ్ళ తప్పేమీ లేదు.
ఆడపడుచయితే నవ్వుతూనే అనేస్తుంది, " ఒదినా! నువ్వొక్కత్తివీ అయితేనే రా!
మొన్న మా వాడిని అజయ్ చెట్టుమీంచి తోసేసినప్పటి నుండీ ఆయన కోపంగా ఉన్నారు.
పిల్లాడు కాలువిరిగి ఆరునెలలు మంచం మీద ఉండాలిసొచ్చింది".... అంటూ దీరఘం తీస్తూ!
తను చదువుకున్నదే! హాయిగా పిల్లాడికి అన్నీ నేర్పించుకుంటూ , బుద్దులు గరపాలనే ఉంటుంది. టైమేది. పాడీ, పంట, పాలేర్లతిండీ... ఇదే బతుకు. ఎన్ని నగలు, బట్టలూ, కార్లూ ఉంటే ఏమిటి? తమకంటూ సమయం లేకపోగా!!! పదకొండేళ్ళ పిల్లాడిని పెంచుకోలేక పోతున్నారు!!".....
ఆరోజు రాత్రే అన్నగారికి ఫోన్ చేసింది సీత.
క్రిందటేడు వేసవిసెలవులకి సీతఅన్నయ్య, ఒదినా వాళ్ళ కొడుకూ, కూతురూ, ఒదిన మేనల్లుళ్ళూ ఒచ్చారు. పిల్లలందరూ అజయ్ తో బాగా ఆడుకున్నారు. రమేష్ వాళ్ళందరికీ మంచి మంచు బహుమానాలిచ్చీ, టౌనులో సినిమాలూ, హోటళ్ళకీ తిప్పాడు. అన్నగారు వెళ్ళిపోతూ అన్నాడు
" అజయ్ ని మాతో పంపేయండి. వైజాగ్ లో మా పిల్లలు మంచిస్కూల్ లో చదువుతున్నారు. వీడిని నా దగ్గర పెట్టుకుని చదివిస్తా. మంచి క్రమశిక్షణ ఒస్తుంది!!"
"చూద్దాంలే అన్నయ్యా!".. అంటూ తేల్చేసింది.
కానీ ఇప్పడనిపిస్తోంది అన్నగారితో మాట్లాడితే బాగుంటుందని.
సీత అన్నయ్య శాంతారాం వెంటనే పంపమన్నాడు. తెలిసిన స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటానని, మంచినిర్ణయమని, మొక్కయి వంచకపోతే రేపు యేకు మేకవుతాడని అంటూ.
అర్ధరాత్రి రమేష్ ని లేపి విషయం చెప్పింది సీత. అతనికీ అంతకన్నా పరిష్కారం కనిపించలేదు.
సీత చెప్తోంది. "అక్కడ చదువుతో పాటూ టెన్నిసు, స్కేటింగు నేర్చుకోవచ్చుట. శనాదివారాలు అంతా కలసి పిక్నిక్ లూ అవీ వెళ్తారుట. వీడికి మనం ఎలానూ ఏమీ చెయ్యలేకపోతున్నాం. కనీసం అక్కడయినా ఎంజాయ్ చేస్తాడు"
" నిజమే సీతా ! కొన్నాళ్ళు మనకి దూరంగా ఉంటే ఆడు మారతాడు. శాంతారాం అకవుంట్ కి మూడులక్షలు పంపుతాను. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఆడు కుదురుగా మారితే చాలు. రెండురోజుల్లో వెళ్ళి దింపి ఒద్దాం."....
ఆరాత్రి భార్యాభర్తలిద్దరికీ కాస్త నిశ్చింత చిక్కింది.
...................... ..... ........................
రెండ్రోజులెంతలో రావాలి!! అజయ్ ని విశాఖపట్టణం తీసుకెళ్ళడం, శాంతారాం ఇంట్లో దించేసి, తమ వూరుకి ఒచ్చేయడం కలలోలా అయిపోయింది. ఒదినగారయితే తమకు బ్రహ్మరధం పట్టేసింది. అన్నగారి పిల్లలిద్దరూ అజయ్ ని ఒదలట్లేదు. శాంతారాం కూతురు కౌముది పదేళ్ళది "బావా బావా " అంటూ అజయ్ కి అన్నీ పరిచయం చేస్తూఎంత స్నేహంగా ఉందో. సీత తల్లితండ్రులు కూడా ఇప్పుడు శాంతారాంతోనే ఉంటున్నారు. సీత " అమ్మయ్యా" అనుకుంది. అజయ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. కొత్తజీవితం ఊహించుకుంటూ. తల్లీతండ్రీ తిరిగి వెళ్ళిపోతుంటే మాత్రం వాడికి దుఃఖం ఒచ్చేసింది.
ఇంటికి తిరిగిరాగానే బావురమంటున్న ఇల్లుని చూసి సీత భోరుమంది. రమేష్ కీ ఏమీ తోచలేదు. అయినా తప్పదు.
విశాఖపట్నంలో అజయ్ ని పెద్ద సీబీఎస్ఈ ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఆరవతరగతిలో చేర్పించాడు. మిడిల్ టర్మ్ లో జాయిన్ అవ్వడం వలన అజయ్ కి పాఠాలన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయి. తను చదివిన స్కూలూ పెద్దదే అయినా ఇంత స్టాండర్డ్ ఉండదు.
పైగా ప్రోజెక్ట్ లని ఏవో ఇచ్చేస్తున్నారు. అవి కంప్యూటర్ లో చెయ్యాలిట. తనకి వీడియోగేములొచ్చు కానీ కంప్యూటర్ రాదు. మామయ్య కొడుక్కి తనంటే అంత ఇష్టం లేదు. అస్తమానం " కంట్రీ బ్రూట్" అని తిడతాడు. మామయ్య రాత్రి లేటుగా ఒస్తాడు. అత్తయ్య అసలు ఇంట్లోనే ఉండదు ఎక్కువ. ఉన్నా తనతో అంటీముట్టనట్టు ఉంటుంది.
పాపం కౌముది చాలా మంచిది. తనే కంప్యూటర్ ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్పింది. ఇంటర్ నెట్ లో డౌన్ లోడ్ చెయ్యడం అవన్నీ. కానీ బావ అన్వేష్ తనని కంప్యూటర్ ముట్టుకోనివ్వడు. అమ్మ కాల్ చేసినప్పుడు చెప్పాడు. వెంటనే నాన్న డబ్బు పంపారు. మామయ్య లాప్ టాప్ కొన్నాడు. కానీ తనే వాడుతున్నాడు.
స్కూల్లో టీచర్లు పనిష్ చేస్తున్నారు హోంవర్కు చెయ్యకపోతే.
అజయ్ కి అర్ధంకాని విషయమేంటంటే తన అమ్మమ్మా, తాతల ప్రవర్తన!!
వాళ్ళ ఊరెళితే ఎంతో గారం చేసేవారు, ఇప్పుడెందుకో అంత ఆదరణ లేదు.
అమ్మమ్మ భోజనం, బట్టలూ చూస్తుందంతే.
తాత ఎప్పుడూ అన్వేష్ బావతోనే , చదువుచెప్తూ, చెస్ ఆడుతూ.
తనూ వచ్చి కబుర్లు చెప్పబోతే, " పోరా? పోయి చదువుకో అల్లరి మొద్దా! " అని విసుక్కుంటాడు.
అజయ్ కి పదేపదే ఊళ్ళో తనవాళ్ళూ, తనెంత అల్లరి చేసినా భరించే వూరివాళ్ళూ, తన కుక్క జాకీ పదేపదే గుర్తొస్తున్నారు.
తండ్రి ఫోనుచేసినప్పుడు "ఒచ్చేస్తా! నాకేమీ బావుండలేదు" అంటే నాన్న పెద్ద పెద్ద అరుపులరిచి , పిచ్చి వేషాలేస్తే బెల్ట్ తియ్యమని చెప్పాడు.
మామయ్య కొట్టడు కానీ గంటలు గంటలు క్లాసు పీకుతాడు. నిలబడే వినాలి. ఇది చూసి తాత, అన్వేష్ వేళాకోళంగా నవ్వతారు. అవమానం భరించలేకపోతున్నాడు.
అమ్మమ్మ వారం రోజులు ఊరెళ్ళింది. అత్త తనకి అన్నంతో చారో కూరో ఒకటే పెట్టేది. వాళ్ళందరికీ నాన్ వెజ్ తెప్పించి పెట్టేది. ఒకరోజు తనకీ కావాలన్నాడు. కానీ పెట్టలేదు. చాలా కోపం ఒచ్చింది. అన్నం పళ్ళెం విసిరేసాడు.
అంతే అత్త అరుపులు!!
తాత బెల్టు తెచ్చి చితకబాదాడు. దెబ్బలకన్నా ఆయన తనతండ్రినీ, తాతగారినీ తిడుతుంటే ఎక్కువ బాధేసింది.
మామయ్య ఒచ్చాక మళ్ళీ పడ్డాయి. ఆ రోజు తిండిలేదు. ఏడుస్తూ పడుకున్నాడు. అర్ధరాత్రి కౌముది లేపి పెద్దకప్పునిండా ఐస్ క్రీం, బిస్కట్లు తెచ్చిఇచ్చింది.
స్కూల్ పరీక్షల్లో మార్కులు బాగా రాలేదు. తన స్కూల్లో తనెప్పుడూ ఫస్టే. మామయ్య మరీ స్ట్రిక్ట్ అయిపోయాడు. అమ్మవాళ్ళు ఫోన్ చేసినా ఇవ్వడు. తనకి చచ్చిపోవాలనుంది. ఆకలి, బెంగ, అవమానం. "అమ్మావాళ్ళు అల్లరి చేస్తున్నానని ఒదిలించేసుకున్నారా? నేనింక వాళ్ళెవర్నీ చూడనా!!"
తనకి భోజనం చాలడం లేదు. అడిగినా అత్త విననట్టే నటిస్తుంది. అమ్మ ఎన్నిరకాలు చేసిపెట్టేది. అత్త వాళ్ళిద్దరినీ బయట తినమని డబ్బులిస్తుంది. తనకీయదు.
బయట హాల్లో దివాన్ మీద పడుకుంటే రాత్రంతా దోమలు కుడతాయి. ఆ మధ్య చాలా జ్వరం ఒచ్చినా అమ్మ ఫోను చెయ్యలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు తను.
" హూ! తను ఎవరికీ ఒద్దు. ఈ జైలులో ఉండేకన్నా పారిపోవడం బెటర్. అవును పారిపోతా""
...............................
" హల్లో! సీతగారేనా?"
" అవునండి. ఎవరూ మాట్లాడేది?"
" నా పేరు నిహారిక అండి.. వైజాగ్ నుండి. నేను కౌముదికి డాన్స్ టీచర్ని"
అర్ధం అవ్వడానికి కొన్ని క్షణాలు పట్టింది సీతకి.
" ఆఆఆ.... ఓ! ఏంటి సంగతి? " అంటూ అడిగింది సీత.
" మేం! నేను మీ అబ్బాయి అజయ్ గురించి కొంచెం మాట్లాడాలి"
సీతగుండెలు పీచుపీచుమన్నాయి. "కొత్తగా ఏం మోసుకొచ్చాడో వీడు" అనుకుని " చెప్పండి" అంది.
" మేడమ్! మీ అబ్బాయి చాలా దయనీయమయిన పరిస్థితిలో ఉన్నాడు. మీరే పరిస్థితుల వలన పంపారో తెలియదు కానీ కొన్నాళ్ళు మీ అన్నయ్యా వాళ్ళింట్లో కంటిన్యూ అయితే పిచ్చోడు అయిపోతాడు. తన హెల్త్ కూడా బాగాలేదు. మీరు వెంటనే ఒచ్చి తీసుకెళ్ళండి"
" అదేంటి చాలా బాగున్నాడు, కాల్ చెయ్యకు , దారిలో కొచ్చాడని మా నాన్నగారు, అన్నయ్యా ఇద్దరూ చెప్తేనే మేము నిశ్చింతగా ఉన్నామండి. అయినా మీకివన్నీ ఎలా తెలుసు?
" మీ కౌముది నాచేత చేయించింది. కావాలంటే తనిక్కడే ఉంది మాట్లాడండి. దయచేసి వాళ్ళకి చెప్పకండి ఇలా కాల్ చేసామని!" అంటూ నిహారిక కౌముది చేతికి ఫోన్ ఇచ్చింది.
" నమస్తే అత్తా! " అని మొదలుపెట్టి కౌముది చెప్పిన మాటలు వింటుంటే సీతకి మతిపోయింది.
" నిజమా! ఇంత ద్రోహమా!" ఆమె మాతృహృదయం కొడుకు గురించి ఆక్రోశిస్తోంది.
అప్పటికే సమయం 7:30. భర్తకి ఫోన్ చేసింది ఏడుస్తూ. రమేష్ పరిగెట్టుకొచ్చాడు రైస్ మిల్లునుంచి.
" నడు వెంటనే! మనం వైజాగ్ వెళ్తున్నాం" అన్నాడు.
" అదిగాదండీ! ఒకసారి అన్నయ్యకి కాల్ చేద్దాం"
" ఏమని కాల్ చేస్తావ్? నాకొడుకున్నాడా? చచ్చాడా? అనా!! చేసిన నిర్వాకం చాలు. అజయ్ ని ఇంటికి తెచ్చుకుందాం నడు".
అన్నేళ్ళలో అతని కంట నీరెప్పుడూ చూడలేదామె. అలాంటిది రమేష్ కళ్ళు నిండిపోతున్నాయి కన్నీటితో.
...............................
ట్రింగ్ ట్రింగ్ మంటూ కాలింగ్ బెల్ శబ్దానికి ఇంటిల్లిపాతీ ఉలిక్కిపడ్డారు. శాంతారాం లేచి తలుపుతీసాడు. రమేష్ అతన్ని తోసుకుంటూ లోపలికొచ్చి " అజయ్! అజయ్!" అని పిలుస్తున్నాడు. శాంతారాం భార్యకి వేళకాని వేళ ఒచ్చిన ఆడపడుచుని చూసి ముచ్చెమటలు పోసేసాయి. సీత తల్లీతండ్రీ లేచొచ్చి కూతురిని చూసి విస్తుపోయారు.
" అజయ్ ఏడి ఒదిన?" చుట్టూ వెతుకుతూ.
అందరి కళ్ళూ హాల్లో దివాన్ మీదకి మళ్ళాయి.
నలిగిపోయిన పక్క ఉంది. అజయ్ లేడు. ఇంట్లో, బయటా ఎక్కడా లేడు.
" బాబోయ్! ఈ పిల్లాడు మన కొంప ముంచుతాడని ముందునుండీ చెప్తున్నానే ఉన్నా! తెచ్చి నెత్తినెట్టారు. అన్వేష్! వెళ్ళి బీరువాలు చూడు. ఏం పట్టుకుపోయాడో! ఏంటో!
" నోర్ముయ్! ఇంకొక్క మాట్లాడేవంటే చంపేస్తా!" ఒక్క అరుపు అరిచాడు రమేష్.
అప్పటికే శాంతారాం బయటికొచ్చి ఎదురు అపార్ట్ మెంట్ వాచ్ మేన్ ని అడుగుతున్నాడు "ఎవరయినా పిల్లాడిని చూసావా ?అని.
కార్లో ఎక్కి రమేష్, సీత డ్రైవర్ ని రైల్వే స్టేషన్ వేపు పొమ్మన్నారు. దారంతా చూసుకుంటూ పోతున్నారు. శాంతారాం తండ్రినెక్కించుకుని బస్టాండ్ వేపు బయలుదేరాడు.
రెండు రోజులు వెతికారు. మొత్తం వెతికారు. పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. బీచంతా గాలించారు. టీవీల్లో, పేపర్లో అన్నిచోట్ల వేయించారు. అజయ్ దొరకలేదు.
కుప్పకూలిపోయారు ఆ తల్లితండ్రులు. వాళ్ళ ఊరువూరంతా గగ్గోలు పెట్టేసారు. కంటతడి పెట్టనివాళ్ళు లేరు.
రమేష్ తండ్రిగారయితే వియ్యంకుడిమీదా అతనికొడుకు మీదా పోలీస్ కేసు పెడతానని కూర్చున్నారు.
ఎవరికోసం ఆగని కాలం ఇంకో ఏడాది పూర్తిచేసుకుంది.
............................................
" సీతా! సీతా! " రమేష్ పెద్ద అరుపులుతో ఇంటికొచ్చాడు.
సీత అలవాటుగా పరిగెట్టుకొచ్చింది, అజయ్ గురించి తెలిసిందేమోనని.
రమేష్ వెనుక ఎవరో ఒక సిటీ అబ్బాయిని చూసి వెనకడుగేసింది.
"సీతా! ఈ అబ్బాయి మన అజయ్ ని చూసాడు. బేలూరులో ఉన్నాడట. నేను , ఈ అబ్బాయిని తీసుకుని బేలూరు వెళ్తున్నా. బట్టలు సర్దు."
ఆ.... నా అజయ్ కనిపించాడా! బాబూ! ఎలా ఉన్నాడమ్మా! తెచ్చేయలేకపోయావా? సీత ఏడుస్తూ అడుగుతోంది.
" ఆంటీ! మేమంతా కాలేజీ తరుఫున కలకత్తా వెళ్ళి అక్కడ నుండి బేలూరి మఠం వెళ్ళాం. అక్కడ నాకు చెయ్యితెగి తీవ్ర రక్తస్రావం అవుతుంటే , రామకృష్ణా మిషన్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక మంచం మీద చాలా దైన్యస్థితిలో మీ అబ్బాయి ఉన్నాట్ట. చలికి కాళ్ళు కొరికేసి, చావుబతుకుల్లో ఉన్న పిల్లాడిని రక్షించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారుట. నేను తెలుగు మాట్లాడడం విని నన్ను మాట్లాడమన్నారు. మీ ఊరూపేరూ చెప్పాడు. మీ నంబరు చెపలేకపోయాడు. నా టూరు అయిపోగానే విజయవాడ నుండి మీవూరు వెతుక్కుంటూ వచ్చేనమ్మా! మీరు వెంటనే బయలుదేరండి అంకుల్. "
సీత అతనిమాటలు వింటూనే స్పృహతప్పి పడిపోయింది. మరదలు కప్పచెప్పి రమేష్ బయలుదేరివెళ్ళిపోయాడు.
.................... ................
"అజయ్! అజయ్! "
"ఒస్తున్నా నాన్నా! ", పదిహేనేళ్ళకే అయిదున్నరడుగులు దాటిపోయి, పచ్చని పసిమిరంగు మొహం మీద చిన్న నూనూగు మీసాలతో, అందంగా, ఆరోగ్యంగా .....అజయ్ !! పరిగెత్తుకొచ్చి జీపులో తండ్రి పక్క కూర్చున్నాడు .
" సీతా! ఒచ్చి అజయ్ బాబుకు బొట్టుపెట్టు. ఈరోజునుండి నాతో పొలానికి తీసుకెళ్తున్నా.
ఏడాదిలో మన జిల్లాలోనే ఏ వన్ రైతుని చేస్తా అజయ్ గాడిని. ఆడిక్కావాలనుకుంటే ప్రెవేట్ గా చదువుకుంటాడు. నలుగురికి ముద్దెట్టే రైతూ గొప్పే కదా.
రైతే రాజు!! ఏరా! " అంటూ కొడికిని ప్రేమతో పొదివి పట్టుకుని అంటున్న రమేష్ నీ,
" నువ్వేంచెప్తే అదే రైటు నాన్నా!!" అంటున్న కొడుకునీ మురిపెంగా చూసుకుంటూ కుంకుమ తేవడానికి లోపలికి నడిచింది సీత!!!!!
***శుభం***
పేరు: వోలేటి శశికళ
వయసు : 59
వృత్తి : గృహిణి
Education: MSc
Hobbies: Writing, Music
రచనా వ్యాసంగం: ఫేస్ బుక్ వేదిక గా 300 పైగా కథలు రాశాను! కొన్ని కథలు విపుల, ఆంధ్రభూమి, మధురవాణి, కథామంజరి, సంచిక, మాలిక, అచ్చంగా తెలుగు వెబ్ మాగజైన్స్ లో వచ్చాయి!
నివాస స్థలం: విశాఖపట్నం!
Comments