top of page

గోల్డెన్ బాల్


'Golden Ball' New Telugu Story

Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి


మధుకర్ పరధ్యానంగా ఉదయం యింట్లో జరిగిన ఉదంతం గురించి తల పోస్తూ ల్యాబ్ కాంప్లెక్సు దాటుకుంటూ ఫుడ్ కోర్ట్ వేపు నడుస్తున్నాడు.తండ్రి మాటలు సింహనాదం లా చెవుల్లో మ్రోగుతున్నాయి.’కుర్రాడి తో అంత లావు పదప్రయోగం చేయక’ని అడ్డు వచ్చిన అమ్మను ప్రక్కకు తోసేసాడాయన.

”ఆట ముఖ్యమే—ఆడవద్దని మేం అనడంలేదు.కాని మైదానంలోని ఆటకంటే జీవితరంగంలోని బ్రతుకాట అంతకంటే ముఖ్యం.ఇది గుర్తుంచుకుని, స్కోరింగ్-అంటే నేను చెప్పేది మార్కుల స్కోరింగ్ యెత్తులకు యెదిగేలా చూసుకొమ్మని.

ఇప్పటి పదునైన పోటీ ప్రపంచంలో అత్తెసరు మార్కులు చాలవు. నడిరోడ్డున నక్కి పోతావు. ప్రొఫెషనల్ కోర్సులో సీటు సంపాదించాలంటే ఇప్పటి కటాఫ్ మార్కులెంతో తెలుసా?తొంబై శాతం పైమాటే—మొన్న మా కొలీగ్ అబ్బాయికి తొంబై ఒక శాతం వచ్చింది.అయినా వాడికి సీటు లభ్యం కాలేదు.ఎందుకో తెలుసా?”

తెలియదన్నట్టు తను తల అ డ్డంగా ఆడించాడు.

“నీలాగే వాడికి కూడా గాడ్ ఫాదర్ వంటి వాడేమీ లేడు.అంచేత మ్యాచ్ కి చివరన విసురుతూన్న ఆఖరి బంతిలా చెప్తున్నాను.బాగా విను.నీ స్వంత రెక్కల పైనే పైకెగరాటనికి ప్రయత్నించు.మీ బాబు రెక్కల పైన ఒరగకు.ఎందుకంటే—మీ బాబు రెండు మూడేళ్ళలో ఉద్యోగానికి టాటా చెప్పబోతున్నాడు.ఈ స్కోరింగ్ లెవల్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసావంటే నిన్ను యేదైనా కిరణా షాపులోనో లేదా గుడ్డల మార్కెట్టులోనో చేర్చవలసి ఉంటుంది.ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బు నీ కోసం ఖర్చు చేస్తానని యే మాత్రమూ ఆశించకు. ఎందుకో తెలుసా!”

తను జోరుగా తెలుసన్నట్టు తల ఆడించాడు.

“కొన్ని విషయాలకు తలాడిస్తే చాలదు.నోరు విప్పాలి”

అప్పుడు తనకు నోరు విప్పక తప్పలేదు-’అక్కయ్య పెళ్ళిక’ని.

నాన్న చిన్నగా నవ్వి తనకొక రాయితీ యిచ్చాడు-“ఎలాగూ నేను త్వర లో రిటైర్ కాబోతున్నాను కాబట్టి వారం రోజుల్లో నా స్కూటర్ ని సర్వీసింగ్ చేసి నీకు యిస్తాను.పెట్రోల్ నీళ్ళలా కాకుండా పదిలంగా ఖర్చుచేసుకుంటూ బండి నడుపు” .

తను కూడా ప్రతిస్పందనగా నవ్వి’-థేంక్స్ బాబూ’ అని బయట పడ్డాడు.ముళ్ళ కంప నుండి రెక్కలు విడిపించుకున్న పచ్చ చిలకలా ఆలోచనల తీగల నుండి బయట పడుతూ ఫుడ్ కోర్టు వేపు మరొక అడుగు వేసేటప్పటికి యెవడో గ్రుడ్డెద్దులా మధుకర్ ని ఢీ కొట్టాడు.

యెర్రబడ్డ ముఖంతో కోపం గా తిరిగి చూసాడు మధుకర్.

మంజ్రేకర్ అలక్ష్యంగా చూస్తూ నిల్చున్నాడు.

“సారీ చెప్పాలన్న యింగిత జ్ఞానం కూడా నీకు లేదా!” అని తీవ్ర స్వరంతో అడిగాడు మధుకర్.

“ఇంగిత జ్ఞానం నేర్చుకోవలసింది నేను కాదు.నువ్వు-స్ఫురణ ఉన్నవాడికి ఒక చురక చాలు,నీకెన్ని సార్లు వేసినా బుధ్ధి రావడం లేదు కదా!”

“ఏంవిట్రా నువ్వు వాగుతున్నది?చెప్పేదేదో సూటిగా చెప్పరా—“

“నేనేమి వాగడం లేదు.సూటిగానే చెప్తున్నాను.అర్థం చేసుకోలేక పోవడం నీ తెలివిమాలిన తనం.ప్రీతితో చేరువగా ఉండకని నీకు చెప్పలేదూ!”

అప్పుడు క్షణం పాటు ఆగాడు మధుకర్.విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు.“బుర్ర ఉపయోగించే మాట్లా డుతున్నావా!నేను మీ చెల్లిని వెంటాడుతున్నానా?ఒకే కాలేజీలో చదువుకుంటున్నవాళ్ళు ఒకరిని చూసి మరొకరు హాయ్-అని పలకరించుకోరా!“

అప్పటికి అక్కడ తోటి కాలేజీ స్టూడెంట్సు గుమికూడారు.వాసుదేవ్ అసహనంగా స్పందించాడు -“ఒరేయ్ మంజ్రేకర్! మధుకర్ తో నీకున్నతరతరాల నాటి తగవు క్రికెట్ పిచ్ లో తేల్చుకోవాలి,నువ్వు బౌల్ చేసే బాల్ ని ఒక్కటి విడిచి పెట్టకుండా బౌండరీలకు చితక బాదుతున్నాడు మధుకర్.అది మనసులో పెట్టుకుని మీ చెల్లిని రంగంలోకి దింపుతావా? మేమైనా పొద్దు పోనప్పుడు గర్ల్ స్టూడెంట్స్ తో ఆకతాయి వేషాలు వేస్తాం. మధుకర్ అసలు అమ్మాయిలతో పెట్టుకోనే పెట్టుకోడే! దించిన తల యెత్తకుండా వాడి మానాన వాడు పోతుంటాడు.ఐనా తెలియక అడుగుతానూ--మీ చెల్లి తానుగా అడ్డం వచ్చి పలకరిస్తే వాణ్ణి ఉలక్కుండా పలక్కుండా వెళ్ళిపోమంటావా!ఇక్కడ అసలు విషయం గమనించావా!నువ్వెలా గమనిస్తావు?అంతటి ఓపిక నీకుంటే కదా! నీ చెల్లీ, వాడి చెల్లీ బడి రోజుల్నించీ క్లోజ్ ఫ్రెండ్సు. ఆ చనువుతో ప్రీతి మధుకర్ ని పలకరించి ఉంటుంది.నథింగ్ మోర్ అండ్ నధింగ్ లెస్. ఇక వచ్చే రంజీ ట్రోఫీకి ప్లేయర్స్ ని లిస్టౌట్ చేయబోతున్నారట.దాని కోసం డిస్ట్రిక్ట్ లెవల్ ప్లేయర్స్ సెలక్షన్ జరగబోతుందట.అక్కడ చూపించు ‘బాల్ అండ్ బ్యాట్’ లో నీ ప్రతాపం.ఐనా మరొకసారి తెలియక అడుగుతానూ—నీ చెల్లి నిజంగానే మధుకర్ వల్ల యిబ్బందికి లోనయి ఉంటే తిన్నగా వెళ్ళి వైస్ ప్రిన్స్ పాల్ కి పిర్యా దు చేయవచ్చుగా---ఇక్కడెందుకు ఈ రాధ్ధాంతమంతా—అత్తపైన కోపం దుత్తపైన చూ పించినట్టు--“

ఆ మాట విన్నంతనే వినయ్ వంత పాడాడు.”నువ్వు చెప్పిన సామెత వాడికర్థం కాదురా వాసుదేవ్!ఇప్పుడు నేను చెప్తాను విను.విసిరిన ఫస్ట్ భాల్ కే ఔట్ ఐపోయిన బ్యాట్స్ మాన్ తనను తను సరిదిద్దుకోకుండా నిందించుకోకుండా చూపుడు వ్రేలిని పైకెత్తి చూపించిన అంపైర్ పైన విరుచుకు పడ్డట్లుంది వాడి వాలకం!”

ఈ మాటకు అక్కడ గుమి కూడిన తోటి విద్యార్థులంతా పక్కున నవ్వేసారు.మంజ్రేకర్ మధుకర్ ని యెర్రెర్రగా యెగాదిగా చూసి”మీరందరూ నైట్ క్లబ్ గ్యాంగులా తయారయారు కదూ!నేనూ చూస్తాను మీరందరూ యెంతకాలం యిలా గ్రూపిజిమ్ చూపిస్తూ ఉంటారో--”అని సరసరా సాగిపోయాడు. బిగిలేని అతడి వాలకానికి అందరూ నవ్వుకుంటూ ఫుడ్ కోర్టు వేపు నడిచారు.

కాలేజీ స్పోర్ట్స్ మైదానం విద్యార్థులతో కిటకిటలాడుతూంది.క్రికెట్ పిచ్ కి యెంత దగ్గరగా రాగలరో అంత దగ్గ రకు రావటానికి ప్రయాస పడుతున్నారు యువ క్రికెట్ లవర్సు. విడిగా గ్యాలరీలో కూర్చున్న గర్ల్ స్టూడెంట్సు అబ్బాయిలకు పోటీగా విజిల్ కొడ్తూ హాంకారాలు చేస్తున్నారు.

ఇప్పుడు పిచ్ లో యెదురెదురుగా నిల్చున్నది బ్యాట్స్ మన్ మధుకర్-అతణ్ణి ఢీకొట్ట బోతున్నది ఫాస్ట్ బౌలర్ మంజ్రేకర్.

రంజీ ట్రోఫీ కి ప్లేయర్సుని యెంపిక చేసే ముఖ్యమైన ప్రిలిమినరీ మ్యాచ్ అది. ఎదురొచ్చిన బౌలర్లు అందరినీ బ్యాటింగుతో ఆడుకున్నాడు.వచ్చిన ప్రతి బంతినీ చితకబాదాడు మధుకర్.అలా గేములో అవిశ్రాంతంగా విజృంభించి డబల్ సెంచరీకు నాలుగు పరుగుల దూరాన ఉన్నాడతను, నాలుగే నాలుగు పరుగులు-డబుల్ సెంచరీ సాధించడం, మైదానం హోరెత్తి పోవడం ఒకేసారి జరిగి పోతాయి. యువ క్రికెట్ లవర్సు-సెలక్టర్సు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు అనుకోకుండా యెదురు చూడనిది జరిగిపోయింది. క్రికెట్ గేములోనే కాదు.జీవిత గేములోనూ యెదురు చూడనిది యెదురు చూడని విధంగా జరిగిపోవడమేగా బ్రతుకాట.

మధుకర్ డబుల్ సెంచరీ సాధించకుండానే అవుట్ ఐపోయాడు.

అందరూ నిస్పృహతో-“హాఁ!“అని నిట్టూరుస్తూ లేచారు.

ఆరోజు సోమవారం.క్రికెట్ లవర్స్ అందరూ రిక్రియేషన్ క్లబ్బు రూములో ఉద్వేగపూరితంగా మాట్లాడుకుంటున్నారు.

“నేను కలలో కూడా అనుకోలేదురా మధుకర్ ఇంత బేలగా ఈజీగా క్యాచ్ యిస్తాడని, డబుల్ సెంచరీ చాన్స్ పోగొట్టుకుంటాడని”

“కాని నేననుకున్నానురా నేను అవుట్ ఐపోతానని-“

ఆ గొంతుక వినవచ్చిన వేపు అందరూ తలతిప్పి చూసారు.

మధుకర్ నడుస్తూ వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చున్నాడు

“అదెలా తెలుసు నీకు ముందే అవుట్ ఐపోతావని!”వాసుదేవ్ అడిగాడు.

“ఎలాగంటే—నేను డబుల్ సెంచరీ సాధించక ముందే తీర్మానించాను ఔట్ ఐపోవాలని—“ తెల్లబోతూ మిత్రులందరూ లేచి నిల్చున్నారు.

“బట్ వై-వై!” ఆర్తనాదాలూ అరుపులూ కలగలసాయి.

“ఆవేశ పడకుండా కామ్ గా వినండి.వింటానంటే మనసు విప్పి చెప్తాను”

అందరూ“అలాగే అలాగే!“అంటూ తలలూపారు.

“నేను సెంచరీ కొట్టిన వెంటనే నాకు తెలుసు, నేను రంజీ ట్రోఫీ టీముకి సెలెక్టయి పోతానని.అది మీకూ తెలుసు.మంజ్రేకర్ విషయం అలా కాదు.నాచేతిలో అతడు ఓడి డబుల్ సెంచరీ యిచ్చుకున్నాడని గమనిస్తే సెలక్టర్స్ అతణ్ణి టీముకి దూరంగా పెట్టేస్తారు. మళ్ళీ రంజీ ట్రోఫీకి ఆడగల అవకాశం యెప్పుడొస్తుందో! అతడికి నష్టం కలిగితే నాకొచ్చేదేమిటి? మంజ్రేకర్ నాకు గేములో ప్రత్యర్థే గాని-వ్యక్తిగత శత్రువు కాడు.వాడూ మనతో బాటు మన కాలేజీలో చదువుకుంటున్నవాడే--రేపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరవాత వాడెక్కడుంటాడో మన మెక్కడుంటామో—మనకే తెలియదు. వాళ్ళకు వాళ్ళు ముమ్మరమైన బ్రతుకు పోరాటంలో పడ్డ తరవాత యిప్పుడు మన మధ్య ప్రజ్వరిల్లుతూన్న కోపతాపాలన్నీ మంచు తునకల్లా యెగిరి చల్లబడిపోతాయి.నిజం చెప్పాలంటే—కొన్నాళ్ళకు మన వాళ్ళ పేర్లే మనకు గుర్తుండక పోవచ్చు.గేము గెలవడమే మన లక్ష్యం కావాలి గాని.ప్రత్యర్థిని నేల కూల్చడం మన టార్గెట్ కాకూడదు. ఇక ఆఖరి పాయింటుకి వస్తే-మీరిప్పుడు నా గురించి పరి పరి విధాల తర్జన భర్జనలు పడుతూ యేమని తలపోస్తున్నారో నాకు తెలుసు. చెప్పనా?“

మిత్రులు మధుకర్ వేపు కళ్ళు మిటకరించి చూడసాగారు.

”నేనిదంతా ప్రీతి కోసం చేస్తున్నాననుకుంటున్నారు.కాదు.ముమ్మాటికీ కాదు. నాకిప్పుడు ప్రేమలో పడేంత సమయం లేదు.మా యింటి పరిస్థితులు అలాగున్నాయి మరి--అవి మీకు తెలిస్తే—మీరు నేను చెప్పిందానితో తప్పకుండా ఒప్పుకుంటారు.ఇక నేను క్లాసుకి వెళ్తాను.మీరూ రండి.కలసి వెళదాం” అని లేచి బయటకు నడిచాడు మధుకర్.

ఆటగదరా బ్రతుకాటకదరా!ఈ ఆటలో పసందైన పచ్చదనం ఉండాలి కదరా! పచ్చదనంతో బాటు నిలువెత్తు నిండుదనమూ ఉండాలి కదరా !


రచయిత పరిచయం :

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల-ఆంధ్రభూమి మాసపత్రికలో

ప్రచురించబడ్డాయి.55 views0 comments

Commenti


bottom of page