top of page

హరివిల్లు రాగం


Harivillu ragam written by Ghali Lalitha Pravallika

రచన : ఘాలి లలిత ప్రవల్లిక

సా పా సా ....... సరిగమపదనిస సనిదప మగరిస ...... సస రిరి గగ మమ పప దద నిని సస స స ని ని దద పప మమ గగ రి రి సస ........ తన్మయత్వంలో ప్రాక్టీస్ చేస్తోంది జానకమ్మ .

అప్పుడే లోపలికి వస్తున్న అచ్యుతరామయ్య

"ఇక ఆపు వినలేక చస్తున్నాం . కర్ణ కఠోరంగా ఉంది నీ గార్దభ రాగము" చెవులు రెండు గట్టిగా మూసుకుని చిరాకుపడుతూ అన్నాడు జానకమ్మ భర్త అచ్యుతరామయ్య.

భర్త అరుపులకు గజగజ వణికి పోతూ " "మీరు ఎప్పుడు వచ్చారు ? !?"అడిగింది జానకమ్మ .

"ఏం రాకూడదా ? నా ఇంటికి నేను రావటానికి కూడా వేళా ,పాళా ఉండాలా ?"గద్దించాడు అచ్యుతరామయ్య .

"వాకింగ్ కి అని వెళ్ళారు కదా ! అప్పుడే అయిపోయిందా అని ....." నసిగింది జానకమ్మ

"ఏం నీకు అడ్డమైపోయానా !?!" మండిపడ్డాడు అచ్యుతరామయ్య .

"అయ్యో రామ నేను అలా అన్నానుటండీ! ఇంత వయసు వచ్చినా మీ మాటల ధోరణి మారనే లేదు సుమీ." చెంగు నోట్లో కుక్కుకుని గద్గద స్వరంతో అంది జానకమ్మ .

"నా వయసును ఎంచుతావు ఎందుకు ?నాతో పాటు నీకు వచ్చాయి కదా ...ఏళ్ళు !ఈ వయసులో ఆ సంగీత సాధన ఏంటి ? అవసరమా ? అహా అవసరమా అంటా ?"కోపంగా అడిగాడు అచ్యుతరామయ్య .

"మీ వాకింగ్ కి ,యోగా కి ,మెడిటేషన్కి నేనేమన్నా అడ్డు చెప్పానా ? ఆహా ఏనాడన్నా మీ ఇష్టాలను కాదన్నానా .ఏదో ఇన్నాళ్ళకు నా చిరకాల వాంఛ తీర్చుకుంటుంటే ...... మీరిలా అంటం ఏమీ బాగోలేదు సుమండీ .నా స్వర సాధనను ,నాకిష్టమైన సంగీతాన్ని ఎందుకు ఆడిపోసుకుంటారు ?" చిన్నప్పటినుంచి నేర్చుకోవాలనే కోరిక అలా ఉండి పోయింది. పుట్టిల్లు పుణ్యతీర్థం, చొచ్చినిల్లు చావు తీర్థం అయినట్లు అయింది నా బతుకు . అయినా ఈ వయసులోనూ మీ ఆంక్షలు ఏమిటి ?

ఇంజను వెనుక రైలు పెట్టెలా మిమ్మల్ని అంటిపెట్టుకుని మీ వెనుకే నడిచాను కదా !

అయ్యో దానికీ మనసు ఉంటుంది . దాని ఇష్టాఇష్టాలకూ మనం విలువివ్వాలని అనుకున్నారా ?

ఏదో నా అదృష్టం కొద్దీ మంచి కోడలు దొరికింది కాబట్టి ఇంత ఉడకేసి పడేస్తోంది .పని భారం తగ్గింది కాబట్టి నాకు ఏదో కాస్త తీరుబడి దొరికింది . నా కోరిక విన్న నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి మన కోడలుఇంట్లో ఉండే సంగీతం నేర్చుకునేట్లుగా ఏర్పాటుకూడా చేసింది . ఏదో తంటాలు పడి నేర్చుకుంటున్నాను . మీకు ఎందుకు ఆ ఒప్పనితనం ."అంది జానకమ్మ నిష్టూరంగా .

"తీరుబడి దొరికిందని తిరగబడుతున్నావేంటి ? సంగీతం ఇంట్లో కూర్చుని నేర్చుకుంటే రాదే పిచ్చిమొహమా. సూర్యోదయానికి పూర్వమే గొంతులోతు నీటిలో నిలబడి సాధన చేయాలి . ప్రకృతిలో మమేకమై పలికితేనే సప్తస్వరాలమధురిమలు నీ వసమవుతాయి .నెమలి క్రేంకారంలో వినిపించేది షడ్జమం. ఎద్దురంకెలో వినిపించేదే రిషభం .మేక అరుపులో పలికించే గాంధారం.

ప్రకృతి అందాలకు ముగ్ధయైన క్రౌంచపక్షి కూతలో ఇమిడినది మధ్యమం.

వసంతాగమనంతో పరవసించిన కోయిలమ్మ గొంతులో వినిపించేను పంచమం.

గుర్రపు సకిలింతలలో దైవదం,ఏనుగు ఘీంకారంలో నిషదం,సామవేదంలోని సప్తస్వరాలు

ప్రకృతికాంత ఒడిలో ఉంటే నాలుగు గోడల మధ్య యంత్రాలతో కుస్తీ పడితే అయ్యేది రాద్ధాంతమేగాని సరిగమపదనిసలు కావు . గురుముఖంగా నేర్చుకుంటేనే ఏ విద్య అయినా రాణిస్తుంది "అన్నాడు అచ్యుతరామయ్య .

"మీకేం మీరలాగే చెబుతారు. ఈ వయసులో అంత సాహసం చేయగలనా. చలి నా ఎముకల్ని కొరికేయదూ ..... అయినా ఏకలవ్యుడు గురువును బొమ్మలో చూసుకొని విద్యనభ్యసించలేదా ? అంతటి కష్టమైనదానినే అభ్యసించగలిగినప్పుడు

ఈ బుల్లి పెట్టెలో వినిపిస్తున్న స్వరాలను అభ్యసించలేనా "?!? అంది జానకమ్మ .


"కృష్ణా రామా అనుకునే వయసులో నీకీ కోరిక పుట్టింది . ఎలాగోలాగా అఘోరించు" అంటూ విసురుగా బయటకెళ్ళి పోయాడు అచ్యుతరామయ్య .


విద్య నేర్చుకోవడానికి మనసుండాలే గానీ వయసుతో పని ఏముంది . జీవిత పయనంలో ఎన్నో మలుపులు ,అనుభవసారాలు . చివరి మజిలీ చేరే వరకూ మనం నిరంతర విద్యార్థులమే "అనుకుంది జానకి .


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత్రి పరిచయం : పేరు : ఘాలి లలితా ప్రవల్లిక

రచనలు : మట్టి పాదాలు కవితాసంపుటి

ఆహా కథాకుసుమాల సంపుటి

మర్మదేశం సహరి లో సీరియల్ గా వస్తోంది .

అనేక పత్రికలలో అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంకలనాలలో కవితలు , కథలు ,గజల్స్ ,పద్యాలు ,నానీలు , గేయాలు వెలువడ్డాయి .

పొందిన పురస్కారాలు / బిరుదులు:

1.జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు2.గురజాడఅప్పారావుఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి రాష్టీయ పురస్కారము

3.సావిత్రిబాయి పూలే ఆదర్శ ఉపాద్యాయిని పురస్కారం

4.ఆదర్శ మహిళా పురస్కారం

5.పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం

6.గుర్రాల రమణమ్మా సాహితీపురస్కారం

7.గుఱ్ఱం జాషువా పురస్కారం

8.సత్యశ్రీ పురస్కారం

9.గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం

10. తానా వారి నుంచి 10,000 నగదు , సత్కారం

11.వివిద సాహితీ సంస్థలనుంచి సత్కారాలు

బిరుదులు

* ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద'బిరుదు

తెలుగు కవితా వైభవం హైద్రాబాదు వారినుంచి

సహస్రకవిమిత్ర

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యత

అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో (ఉభయ రాష్ట్రాలకు) ప్రధాన కార్యదర్శి

అక్షర యాన్ బాలికా ,బాలురవిభాగములను నెలకొల్పాను . వారిలో రచనా శక్తి పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయం






































114 views0 comments

Comments


bottom of page