top of page

హత్యో హత్యతి హంతకః

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Hathyo Hathyathi Hanthakaha' New Telugu Story Written By Vasundhara

రచన: వసుంధర


సాయం సమయం.

ధవళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున రామపాదాల రేవులో ఇసుకలో కూర్చున్నారు అఘోర్, పంతులు.


అఘోర్‌ సన్నగా తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. వయసు ముప్పై లోపుంటుంది.

పంతులు సన్నగా చామనచాయగా అఘోర్‌ కంటే కాస్త పొట్టిగా ఉన్నాడు. ఇంచుమించు అఘోర్ వయసే ఉంటుంది.


నదిమీంచీ చల్లగాలి వీస్తోంది. మరీ ఆహ్లాదంగా లేదు. వంట్లో అదో రకం చలి.

“ఇంకా ఎంతసేపు?” అన్నాడు అఘోర్ విసుగ్గా.

“వేటని పట్టడానికి శ్రద్ధ, సహనం కావాలి. సాయిబాబా ప్రబోధిస్తాడే- అంతకంటే ఎక్కువగా!” అన్నాడు పంతులు.

వాళ్లక్కడికి వేట కోసం వచ్చారు.


వేట-

నదిలో చేపలకోసం కాదు.

నది బయట పందుల కోసం కాదు.

వాళ్లకిప్పుడు చంపడానికి ఓ మనిషి కావాలి.

చంపేది అఘోర్. కానీ ఎవర్ని చంపాలో నిర్ణయించేది పంతులు.


అక్కడ జనం ఆట్టే లేరు. అప్పుడప్పుడు ఒకరూ ఇద్దరూ వచ్చి వెడుతున్నారు.

అఘోర్ వాళ్లనోసారి చూసి వెంటనే పంతుల్ని చూస్తున్నాడు. పంతులు అడ్డంగా తలూపితే అసంతృప్తిగా నిట్టూరుస్తున్నాడు.


అప్పటికి డెబ్బై ఏళ్ల ముసలాయన, పదహారేళ్ల కన్నెపిల్ల, బిందెతో నీళ్లు పట్టుకెళ్లడానికో పూజారి, నదీమతల్లిని తాకి దణ్ణం పెట్టుకుందుకు నలుగురు భక్తులు వచ్చారు.

వాళ్లలో ఒక్కర్నీ పంతులు అప్రూవ్ చెయ్యలేదు.

“ఇంకా ఎంతసేపు?” అన్నాడు అఘోర్ విసుగ్గా.

పంతులు మళ్లీ శ్రద్ధనీ సహనాన్నీ ప్రబోధించాడు.


అలా అరగంట గడిచేక అఘోర్‌కి సహనం పూర్తిగా నశించింది. “వేట కనబడితే పిలు” అని కళ్లు మూసుకున్నాడు.అలా కూర్చునే నిద్రపోవడం చిన్నప్పట్నించీ అతడి అలవాటు.

పంతులు లేచి నిలబడ్డం అతడికి తెలుసు. తర్వాత కునుకులోకి జారాడు.

మనిషి మాత్రం కూర్చునే ఉన్నాడు.


ఈలోగా పంతులు కొంచెం దూరంలోనే ఉన్న ఓ బిచ్చగాడి దగ్గరికి వెళ్లాడు.

మాసిన పంచె, చిరుగుల చొక్కా, ఆకలి కళ్లు.

వయసు నలబై ఏళ్లుండొచ్చు. దృఢంగా ఉన్నాడు.

పంతుల్ని చూస్తూనే చెయ్యి చాపి బిచ్చమడిగాడు.


“కాళ్లూ చేతులూ సక్రమంగా ఉన్నాయి. ఇలా అడుక్కునే బదుకు వళ్లొంచి పని చేసి బతకొచ్చుగా” అన్నాడు పంతులు.

“నాకంటూ ఎవరూ లేరు. ఒంటరిగాణ్ణి. ఎవరికోసం సంపాదించాలి బాబూ!” అన్నాడు బిచ్చగాడు.


పంతులు కళ్లు మెరిశాయి, “ఒంటిగాడివన్నమాట! ఐతేనేం బతకడానికి డబ్బు కావాలిగా! ఈరోజు నీ పంట పండిందనుకో” అన్నాడు.

“పంట పండడానికి నాకేమైనా పొలముందా, ఇంటి పెరడుందా?” అన్నాడు బిచ్చగాడు అనాసక్తంగా.


“అవేమక్కర్లేదు. ఆయనున్నాడుగా, అది చాలు” అంటూ అల్లంత దూరాన కూర్చున్న అఘోర్‌ని చూపించాడు పంతులు.

“ఆయనక్కడ కూర్చుంటే, నాకు నేలెక్కణ్ణించొస్తుందీ, పంటెలా పండుతుందీ” అన్నాడు బిచ్చగాడు చిరాగ్గా.


“ఆ అయ్యగారు ధర్మాత్ముడు. నదీతీరాన ధ్యానంలో కూర్చున్నాడు. కళ్లు తెరవగానే ఎవరు కనిపిస్తే వాళ్లకి వెయ్యి రూపాయ లిస్తాడు. ఐతే ఆయనకి బిచ్చమెయ్యడం నచ్చదు. నువ్వు కాయకష్టం చెయ్యాలి” అన్నాడు.


“కాయకష్టమంటే?” అన్నాడు బిచ్చగాడు అనుమానంగా.

“ఏముందీ, ఎక్కడో ఓ గొయ్యి తియ్యమంటాడు. అందుకు మామూలుగా ఐతే వందో నూట యాభయ్యో ఇస్తారేమో! ఈయన వెయ్యిస్తాడు. నీ ఇష్టం. ఆలోచించుకో మరి” అన్నాడు

గొయ్యి తియ్యడానికి వెయ్యి రూపాయలంటే బిచ్చగాడికి ఆశ పుట్టింది. సరేనని అఘోర్‌ని సమీపించి ఆగాడు.


“ఫరవాలేదు, పిలు” అన్నాడు పంతులు నెమ్మదిగా.

“బాబూ!” అన్నాడు బిచ్చగాడు కాస్త గట్టిగానే.

అఘోర్ చటుక్కున కళ్లు తెరిచాడు.

ఎదురుగా బిచ్చగాడు. అతడి పక్కనే పంతులు.


అఘోర్‌కి చాలా కోపమొచ్చింది. అవతలికి పొమ్మని చెప్పొచ్చుగా అన్నట్లు పంతులు వైపు చూసి ఖంగు తిన్నాడు.

పంతులి కళ్లలో వేట దొరికిందన్న సంతోషాన్ని అతడు పసికట్టాడు.


“ఇతణ్ణిప్పుడో చోటికి తీసుకెడతామనీ, అక్కడ ఆరడుగుల పెట్టె పట్టే గొయ్యి ఒకటి తవ్వాలనీ, అందుకు నువ్వు వెయ్యి రూపాయ లిస్తావనీ చెప్పాను. తనకి ఓకే. నీకు ఓకేనా?” అన్నాడు పంతులు.


అఘోర్‌కి విషయం అర్థమైంది, “నువ్వు చెప్పాక నేను ఓకే చెయ్యకుండా ఉంటానా?” అన్నాడు.

“నాకొక్కటే అర్థం కాలేదండి. ఆరడుగుల గొయ్యి దేనికండీ?” అన్నాడు బిచ్చగాడు ఆశ్చర్యంగా.


“ఎందుకా, నిన్ను చంపి పాతిపెట్టడానికి. సరేనా?” అని నవ్వాడు పంతులు.

తన్ను చంపి పాతిపెట్టడంవల్ల వాళ్లకొచ్చే లాభమేముంటుంది- అనుకున్నాడేమో- తనూ నవ్వి, “కూలోణ్ణి కాదుగా, గొయ్యి తియ్యడానికి నావద్ద గునపం లేదండి” అన్నాడు బిచ్చగాడు.


సమాధానంగా పంతులు తన భుజానికి తగిలించిన సంచీలోంచి చిన్న పెట్టె తీశాడు. అందులోంచి అడుగున్నర పొడవున్న నాలుగు ఉక్కుముక్కలు తీసి స్క్రూ సిస్టంలో ఒకదానిలో ఒకటి అమిర్చి, “గొయ్యి తవ్వడానికిది పనికొస్తుందిగా” అన్నాడు.


బిచ్చగాడు దాన్ని అందుకుని పరీక్షించి, “చాలా బలంగా ఉంది. మొన పదునుగా ఉంది. ఒక్క మనిషేం, ఇద్దరు మనుషులు పట్టేటంత గొయ్యి తవ్వొచ్చు” అని నవ్వాడు.

పంతులు ఉలిక్కిపడి వాడి మొహం చూసి, వాడు కూడా తన హాస్యస్ఫూర్తిని ప్రదర్శించాడని గ్రహించాడు.


తర్వాత మళ్లీ గునపాన్ని నాలుగు భాగాలు చేసి తన సంచీలోనే ఉంచి లేచి నిలబడి, ‘పద” అన్నాడు.

ముగ్గురూ అక్కణ్ణించి కదిలారు.

అది కొండ వెనుక ప్రాంతం. పంతులుకి ఆ దారి బాగా తెలుసు.


చెట్లు గుబురుగా ఉన్నచోట లోపలికి మళ్లి, కొంచెం ముందుకెళ్లి, బిచ్చగాడికి ఓ చోటు చూపించాడు. గునపం తయారు చేసి ఇచ్చాడు.

బిచ్చగాడు పని మొదలెట్టగానే ఇద్దరూ కొంచెం దూరంగా వెళ్లారు.


“నిలువెత్తు గొయ్యి తవ్వేక అందులోంచి బయటకు రావడానికి బిచ్చగాడికి మనమే చెయ్యివ్వాలి. అప్పుడు నువ్వు గునపంతో వాడి బుర్ర బద్దలుకొట్టు. తాను తవ్విన గోతిలో తనే పడిపోతాడు. మట్టిపోసి కప్పెట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడో హత్య జరిగిందనీ, శవం ఇక్కడే ఉందనీ ఎవరికీ తెలిసే అవకాశం లేదు. తెలిసినా, పోయింది బిచ్చగాడే కాబట్టి ఎవరూ పట్టించుకోరు. పైగా వాడికి నా అన్న వాళ్లు కూడా లేరు” అన్నాడు పంతులు నెమ్మదిగా.


“ఔననుకో. ఒక మనిషిని చంపితే అందువల్ల ప్రయోజనముండాలి. ఇంతవరకూ నేను చేసిన ప్రతి హత్యకీ లక్షకి తక్కువ కాకుండా ముట్టింది. పైసా ప్రతిఫలం లేకుండా వీణ్ణి చంపడం నా వృత్తికి అవమానం కదూ!” అన్నాడు అఘోర్.


“ప్రతిఫలం ఎంత కావాలో నన్నడుగు. నేనిస్తాను. ఎటొచ్చీ ఫ్రెండుని కదా, బాగా డిస్కౌంటివ్వాలి” అన్నాడు పంతులు.

“సరేలే కానీ, నీకు మాత్రం ఈ హత్య అవసరమేముంది?” అన్నాడు అఘోర్.

“ఉంది. ఈ బిచ్చగాణ్ణి చూడగానే వాడివల్ల నీకు ప్రాణగండముందని సిక్స్త్ సెన్స్ చెప్పింది నాకు. వాడి అడ్డు తొలగించాలని అనుకున్నాను. ఎలాగూ వేటకోసం చూస్తున్నాం కాబట్టి, ఆ వేటకో ప్రయోజనమూ ఉంటుందని వీణ్ణి ఎంపిక చేశాను”


అఘోర్ క్షణమాగి, “ఒక బిచ్చగాడివల్ల నాకు ప్రాణగండమా? ఏమనుకుంటున్నావ్ నా గురించి?” అన్నాడు.

“నేను నీ గురించి ఏమనుకుంటున్నానూ అన్నది కాదు కొశ్చను. నా సిక్స్త్ సెన్సు గురించి నువ్వేమనుకుంటున్నావూ అన్నది పాయింటు” అన్నాడు పంతులు.


“సరే నీ సిక్స్త్ సెన్సు నిజమే అనుకుందాం. మరి ఈ బిచ్చగాడి వల్ల ప్రమాదం నాకైతే, వాణ్ణి చంపడానికి నువ్వెందుకు డబ్బివ్వాలి?” అడిగాడు అఘోర్.

“నీమీద ఆధారపడి బ్రతుకుతున్నవాణ్ణి. నిన్ను రక్షించుకోవడం నాకవసరం కదా!” నవ్వాడు పంతులు.


“బాబూ, గొయ్యి రెడీ” అని బిచ్చగాడు గట్టిగా పిలవడంతో వాళ్ల సంభాషణకు బ్రేక్ పడింది.

ఇద్దరూ అటు కదిలారు.


ఆ గొయ్యి తన శాశ్వతనిద్రకోసమే రెడీ అని తెలియని బిచ్చగాడు, వెయ్యి రూపాయల గురించి పగటికలలు కంటున్నాడు…

అప్పటికి ఓ రోజు ముందు…..

- - - - -

“ఇంతవరకూ ఐదు హత్యలు చేశాను. ఎప్పుడూ తప్పనిపించలేదు. ఈసారే ఎందుకో……” ఆగాడు అఘోర్.

అఘోర్ గ్రాడ్యుయేటు. తెలివైనవాడు. తన చదువునీ, తెలివినీ- హత్యలు చెయ్యడానికి ఉపయోగించే కిరాయి హంతకుడు.


పంతులు నవ్వి, “చేసేది హత్యలైనా నీ మనసెంతో మెత్తన. ఇంతవరకూ నువ్వు చంపింది- సమాజానికి చీడపురుగుల్ని. ఇప్పుడు చంపబోయేది ఓ అమాయకుణ్ణి. అదీ తేడా” అన్నాడు.


పంతులు అఘోర్‌కి స్నేహితుడు, సన్నిహితుడు, శ్రేయోభిలాషి. అఘోర్ హత్యలు చెయ్యడానికి నైతికబలాన్నివ్వడం తన బాధ్యతగా భావిస్తాడు.


“నువ్వన్నది నిజమే! సుధీర్‌ నిజంగానే అమాయకుడు” అన్నాడు అఘోర్ సాలోచనగా.

సుధీర్ ఓ ప్రైవేట్ కాలేజిలో లెక్చరర్. నెలకి పదిహేనువేల జీతంతో బ్రతుకీడుస్తున్న సామాన్యుడు.

రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారస్థుడు లక్ష్మయ్య కూతురు అమల అతణ్ణి ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానంది.


సుధీర్ ఔననలేదు, కాదనలేదు. ఆమె తలిదండ్రులు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిద్దామన్నాడు.

అమల వెంటనే తల్లికి తన ప్రేమ గురించి చెప్పింది. తల్లి భర్తకి చెప్పింది.


లక్ష్మయ్య ధనికుడే కాదు. పేదవాళ్లని అసహ్యించుకునే అహంకారి. తననుకున్నది సాధించడానికి దేనికీ వెనుకాడని దుష్టుడు.


కూతురు చెప్పింది విని ముందాయన మండిపడ్డాడు. తర్వాత బెదిరించాడు.

అమల లెక్క చెయ్యలేదు. చలించలేదు.

“నీ సంగతిలా కాదు. కాళ్లూ చేతులూ కట్టేసైనా సరే నీకు వెంటనే బావతో పెళ్లి జరిపించేస్తాను” అన్నాడు లక్ష్మయ్య.


ఆ రాత్రే అమల ఉరేసుకునే ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో తల్లి చూడకపోతే, ఆమె శవమై వేళ్లాడేదే!

“కావాలనే నన్ను రక్షించే అవకాశమిచ్చాను. బావతో పెళ్లి ఉద్దేశ్యం మానుకోకపోతే, మీకా అవకాశమివ్వను” అందామె.


లక్ష్మయ్యకి అర్థమైంది. సుధీర్ బ్రతికుండగా తన కూతురు వేరేవాణ్ణి పెళ్లి చేసుకోదు.

సుధీర్ చస్తే కనుక నాలుగు రోజులు ఏడ్చి, చివరకు సద్దుకుపోతుందనుకున్నాడు.

వెంటనే అఘోర్‌కి కబురుపెట్టి రప్పించాడు. సుధీర్ వివరాలు చెప్పాడు. రెండ్రోజుల్లో సుధీర్‌కి భూమ్మీద నూకలు చెల్లిపోవాలన్నాడు.


మూడు లక్షలు అడ్వాన్సన్నాడు. పని పూర్తయ్యేక ఇంకో ఏడు లక్షలు ఇస్తానన్నాడు.

అంతవరకూ అఘోర్ రేటు మర్డరుకి ఒకట్నించి ఐదు లక్షలదాకా ఉంది.

పది లక్షల బేరం ఇదే మొదటిది.


అఘోర్ మర్డరు కోసం సుధీర్ ఆనుపానులు తెలుసుకున్నాడు.

హంతకుడు కావడానికి ముందు తనెలాంటి జీవితం గడిపాడో, ఇప్పుడు సుధీర్ అలాంటి జీవితమే గడుపుతున్నాడు.


ఒకరి జోలీ శొంఠీ అక్కర్లేకుండా తన మానాన తాను అతి సామాన్యంగా బతుకుతున్నాడు.

అతడు అమలని ప్రేమించలేదు.

అమలే అతణ్ణి ప్రేమించింది. ప్రేమించి దగ్గర కావడానికి ప్రయత్నించినా సుధీర్ దూరంగానే ఉన్నాడు.


పెళ్లికి ఆమె అమ్మానాన్నల అనుమతి ముఖ్యమని పంపేశాడే తప్ప ఆశతో తప్పటడుగు వెయ్యలేదు.

ఏ తప్పూ చెయ్యని సామాన్యుణ్ణి, ఉత్తపుణ్యాన చంపడానికి అఘోర్‌కి మనసొప్పలేదు. పంతులుకి చెప్పుకున్నాడు.


“సుధీర్ని నువ్వు కాకపోతే మరొకడు చంపేస్తాడు. సెంటిమెంట్లు పెట్టుకుంటే నీ వృత్తిలో పైకి రాలేవు. లక్ష్మయ్యతో పెట్టుకున్నా అంతే!” అన్నాడు పంతులు.

ఆయనతో పెట్టుకోవడం ప్రమాదమని అఘోర్‌కి తెలుసు. అందుకే అడ్వాన్సుగా మూడు లక్షలు తీసుకున్నాడు.


“జీవితమొక యుద్ధం. నువ్వో సైనికుడివి. హత్య చేసినందుకు నీకొచ్చే డబ్బు జీతం. మంచో, చెడో దాని ఫలితం చేయించిన వాడిదే! నువ్వు నిమిత్తమాత్రుడివి. గీతలో కృష్ణభగవానుడు చెప్పిందిదే! అర్జునుడాయన చెప్పింది వినడంవల్ల ఇరుపక్షాల్లోనూ లక్షలాది సైనికులు చచ్చారు. పాపమో, పుణ్యమో అది అర్జునుడిది మాత్రం కాదు”

ఇదీ అఘోర్‌కి పంతులి ప్రబోధం.


అంతే కాదు. ఈ హత్యకూ పంతులే ముహూర్తం పెట్టాడు.

ఎప్పటిలాగే ముహూర్తంపెట్టినందుకు కొంత డబ్బు తీసుకుని- ఆ పాపంలో తనూ భాగస్వామి అయ్యాడు.


ఇంతవరకూ తను పట్టుబడకపోవడానికి, పంతులు ముహూర్త బలమూ ఓ కారణమని అఘోర్ నమ్ముతాడు.

నేరానికి ముందు జయసిద్ధికీ, నేరం తర్వాత పాప పరిహారానికీ- ఒకోసారి ఒకో దేవుడికి పూజలు చేస్తారు వాళ్లిద్దరూ.


అలా ఇప్పుడు వాళ్లు ధవళేశ్వరం వచ్చి, హనుమంతుణ్ణి దర్శించి అర్చన చేశారు.

“ప్రతి మనిషిలోనూ ఎంతోకొంత దుష్టత్వం, రాక్షసత్వం ఉంటాయి. సుధీర్‌లోనూ ఉండే ఉంటాయి. హనుమంతుడు దుష్టుల్నీ, రాక్షసుల్నీ నిర్దాక్షిణ్యంగానూ క్రూరంగానూ చంపేస్తాడు. సుధీర్ నీ చేతుల్లో చస్తే కనుక, అది హనుమంతుడి ఆశీర్వాదమే అనుకో” అని పంతులు అఘోర్‌కి ధైర్యం చెప్పాడు.


“ఎన్ని చెప్పు. సుధీర్ విషయంలో మనసొప్పడంలేదు. కానీ లక్ష్మయ్యని కాదంటే నా బ్రతుకు దుర్భరమౌతుంది” వాపోయాడు అఘోర్.


“దానికో సులభ పరిష్కారముంది. సుధీర్ కంటే ముందు, ఓ అపరిచిత అనామకుణ్ణి చంపెయ్. ఆ హత్య సుధీర్ విషయంలో నువ్వు హంతకుడివన్న ఫీలింగుని చంపేస్తుంది. హత్యో హత్యతి హంతకః” అన్నాడు పంతులు.


హంతకులకి సెంటిమెంట్లు ప్రమాదం కాబట్టి పంతులు సలహా పాటించక తప్పదనుకుని, “సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. మరి ఆ అపరిచిత అనామకుణ్ణి నువ్వే చూపించు. చూపించి ఊరుకుంటే సరిపోదు. అతణ్ణి చంపడాన్ని సమర్థించే గట్టి కారణం కూడా చెప్పాలి” అన్నాడు.


“గట్టి కారణమంటే?” అడిగాడు పంతులు.

“నేనేం చేసినా డబ్బుకోసం కదా! ఇప్పుడు నువ్వు చెప్పే హత్యకి నాకేం డబ్బు రాదు. అమాయకుల్ని చంపడం ప్రాక్టీసౌతుందన్న కారణం నాకంత నచ్చలేదు” అన్నాడు అఘోర్.


పంతులు సామాన్యుడా, గోదావరీ తీరాన గట్టి కారణం చూపించి ఓ బిచ్చగాడి జీవితానికి చరమగీతం పాడాడు.


ఐతే- తథాస్తు దేవతలే ఔనన్నారో, హనుమంతుడే పూనుకున్నాడో- పంతులు సిక్స్త్ సెన్స్ నిజంగా నిజమౌతుందని పంతులు కూడా ఊహించి ఉండడు.

అది అఘోర్‌కి మేలు చేసిందా, కీడు చేసిందా అన్నది కర్మఫలంమీద ఆధారపడి ఉంది.

ఆ కర్మఫలం ఏమిటంటే……

- - - - -

“డియర్ మోసగాడా!

ప్రేమించానన్నావు. పెళ్లికిముందే నా శీలం దోచుకున్నావు. ఇప్పుడు డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకుని, నేనెవరో తెలియదని అంటున్నావు. నువ్వు సమాజానికి పట్టిన చీడపురుగువి. నిన్ను అంతం చెయ్యాలనుకున్నాను. చేశాను.


నువ్వెలా చనిపోయావో, ఎందుకు చనిపోయావో ఎవ్వరూ ఊహించలేరు. అదీ నా ప్రతీకారం.

నీ చావు ఆడపిల్లల్ని మోసం చేసే దుర్మార్గులకి హెచ్చరిక కావాలి. అందుకే ఈ ఉత్తరం.

ఇట్లు

మోసగాళ్లకు రోషగత్తె”


ఇదీ పంతులు కంప్యూటర్లో టైపు చేసిన ఉత్తరం.

అఘోర్ దాన్ని ఒకటికి రెండుసార్లు చదివి మడిచి జేబులో పెట్టుకున్నాడు.

రాత్రి పదింటికి తనింట్లోంచి బయల్దేరాడు.


సుధీర్ ఉండేది ఓ అపార్టుమెంట్ కాంప్లెక్సులో సింగిల్ బెడ్రూం పోర్షన్. అది మొదటి అంతస్తులో ఉంది.

ఆ కాంప్లెక్సుకి కాపలాదార్లు లేరు.


రాత్రి పది దాటడంవల్ల అఘోర్ సుధీర్ ఇంటిముందుకి వెళ్లడం ఎవరూ గమనించలేదు.

ఇంటి తలుపుకి ఆటోమేటిక్ తాళం. తలుపు మూస్తే తాళం పడిపోతుంది. లోపల్నుంచీ, బయట్నించీ తాళం తియ్యొచ్చు.


ఆ తాళాలు తియ్యడంలో అఘోర్ సిద్ధహస్తుడు.

ఒకే ఒక్క నిముషంలో తలుపు తెరిచాడతడు.

గదిలో దీపం వెలుగుతోంది. మంచంమీద సుధీర్ గాఢనిద్రలో ఉన్నాడు.

“నా పని సులువైంది” అనుకున్నాడు అఘోర్.


సుధీర్‌కి స్పృహ తప్పించి, అప్పుడు మొహంమీద తలగడ అదిమి శ్వాస ఆడకుండా చేసి అతణ్ణి చంపెయ్యాలన్నది అఘోర్ పథకం. చనిపోయేక అతడి జేబులో తను తెచ్చిన ఉత్తరం ఉంచాలి.


సుధీర్ సామాన్యుడు కాబట్టి అతడి చావుని ఆ ఉత్తరంతో ముడిపెట్టి కేసు క్లోజ్ చేసేస్తారు.

లక్ష్మయ్య విషయానికొస్తే- తీగ లాగితే డొంకంతా కదిలే ప్రమాదముంది.


కాబట్టి ఆయన కూడా ఆ కేసు త్వరగా క్లోజ్ కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. పైగా ఆయనకి పోలీసు డిపార్టుమెంట్లో చెప్పుకోతగ్గ పలుకుబడి ఉంది.

ఇప్పుడు సుధీర్ మంచి నిద్రలో ఉన్నాడు కాబట్టి, స్పృహ తప్పించడం మరింత సులభం.


అఘోర్ వెనక్కి తిరిగి లోపల్నుంచి తలుపు తాళం వేశాడు చప్పుడు కాకుండా.

మళ్లీ ఇటు తిరిగేసరికి కళ్లెదుట కనిపించిన దృశ్యం చూసి తెల్లబోయాడు అఘోర్.

మంచంమీద సుధీర్ ఇంకా నిద్ర పోతూనే ఉన్నాడు కానీ అతడి పక్కన ఎవరో కూర్చుని ఉన్నారు.


“ఎవరూ?” అన్నాడు అప్రయత్నంగా.

కూర్చున్న వ్యక్తి ఇటు తిరిగాడు. అఘోర్ తెల్లబోయి చూస్తుండగా ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు.


మాసిన పంచె, చిరుగుల చొక్కా, ఆకలి కళ్లు. వయసు నలబై ఏళ్లుండొచ్చు. దృఢంగా ఉన్నాడు.

అతడు చేయి సాచి, “ఇస్తానన్న వెయ్యి రూపాయలూ ఇవ్వకుండానే వెళ్లిపోయారు బాబూ!” అంటూ ముందడుగు వేశాడు.


అది నిజమో, భ్రమో అఘోర్‌కి తెలియదు.

కానీ భయమంటే తెలియని అతడు వళ్లంతా షాక్ కొట్టినట్లు ఆపాదమస్తకం వణికిపోయాడు.


బిచ్చగాడు రెండడుగులు ముందుకేశాడో లేదో మనిషి కుప్పలా కూలిపోయాడు.


ఆ బిచ్చగాడివల్ల అఘోర్‌కి ప్రాణగండమున్నదంది పంతులి సిక్స్త్ సెన్స్.


“ప్రతి మనిషిలోనూ ఎంతోకొంత దుష్టత్వం, రాక్షసత్వం ఉంటాయి. హనుమంతుడు దుష్టుల్నీ, రాక్షసుల్నీ నిర్దాక్షిణ్యంగానూ క్రూరంగానూ చంపేస్తాడు. సుధీర్ నీ చేతుల్లో కనుక చస్తే, అది హనుమంతుడి దీవెనే అనుకో” అన్నది పంతులి ప్రబోధం.


తన దీవెన ఎవరికో వేరే చెప్పాలా అన్నట్లు- గోడమీద పటంలోని హనుమంతుడి బొమ్మ నవ్వుతోంది.


పంతులు ‘హత్యో హత్యతి హంతకః’ అని ఏ ఉద్దేశ్యంతో అన్నాడో కానీ- ఆ మాట అక్షరాలా నిజమైంది.

---౦---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.52 views0 comments

Comments


bottom of page