
'Hello Wrong Number' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
హలో! రాంగ్ నంబర్ తెలుగు కథ
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నేను ఉదయాన్నే మార్నింగ్ వాక్ ముగించుకొని ఇంటి కొచ్చి పేపరు చదువు కుంటున్న సమయంలో అప్పారావు పరిగెత్తు కుంటూ వచ్చి “రమణా! ఈ రోజు నుంచి కలెక్టర్ గారు స్పందన కార్యక్రమం నిర్వహిస్తారట. ఎవరైనా ఫోను చేసి తమ సమస్య చెబితే దాన్ని వెంటనే పరిష్కారం చేస్తారట” అన్నాడు ఆయాసపడుతూ..
నేను వాడిని కుర్చీలో కూర్చోమని చెప్పి "అయితే మన కాలనీలో సమస్యలు కూడా చెప్పొచ్చా” అని అడిగాను.
“తప్పకుండా! ఈ రోజు 12 గంటలకు ఆ కార్యక్రమం మొదలవుతుంది. వెంటనే మన వాళ్ళందరికీ ఆ విషయం చెప్పి కాలనీ సమస్యలన్నింటినీ కాగితం మీద వ్రాసి ఫోనులో కలెక్టర్ గారికి చెబుదాము” అన్నాడు.
నేను “అలాగే చేద్దాం” అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు.
మాది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాలనీ... అందులో 300 ఇళ్లకు పైగా ఉన్నాయి. అందరూ ఉద్యోగస్తులే. మా కాలనీకి బోలెడు సమస్యలు. ప్రతీ సంవత్సరం మేము ఆ సమస్యల పోరాటం కోసం కొందరిని ఎన్నుకుంటాము. ఈ సంవత్సరం ప్రసాదరావుని ప్రెసిడెంట్ గా, నన్ను సెక్రటరీగా, అప్పారావు, శేషగిరిలిద్దర్నీ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నుకున్నాము. అలాగే మహిళా కార్యదర్శిగా పద్మ ఎన్నుకోబడింది. ఆమె భర్త సత్యం ఓ పత్రికలో జర్నలిస్టు.
ఎప్పుడైతే అప్పారావు వెళ్లి ఈ రోజు కలెక్టర్ స్పందన ప్రోగ్రాం ఉందనీ, కలెక్టర్ తో డైరక్టుగా తమ సమస్యలు చెప్పకోవచ్చనీ చెప్పాడో మా కాలనీ అంతా ఎలర్టైపోయింది. కలెక్టర్తో ఫోన్ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలవుతుందనీ, సమస్యలు చెప్పకోదల్చిన వారు సెల్లార్లోని ఆఫీసు దగ్గరికి వస్తే కలెక్టర్ గారితో లైవ్ లో మాట్లాడ వచ్చనీ అందరికీ నోట్ పంపించాము. – ఇంతలో మాధవరావ్ మా దగ్గరకు వచ్చాడు.
“ఏంటి మాధవరావ్ ఇలా వచ్చావ్?” అని అడిగాను.
"ఈ రోజు కలెక్టర్ గారి స్పందన కార్యక్రమం ఉంది కదా, అందుకని శలవు పెట్టాను. అతనికి ఏ సమస్యలు చెప్పాలో ఒక లిస్టు తయారు చేస్తున్నాను” అని ఆ లిస్టు తీసి చదవబోతుంటే మాకు గుండె దడ మొదలైంది. అది ఐదు పేజీల లిస్టు... వాటన్నింటినీ చదివితే గంట దాటుతుంది.
వెంటనే అప్పారావు లేచి ”ఇప్పుడు చదవడం ఎందుకులే... మా కిస్తే తరువాత చదువు కుంటాము” అని వాడి చేతిలోంచి బలవంతంగా ఆ లిస్టుని లాక్కున్నాడు.
పదకొండు గంటలకు కాలనీ నుంచి ఓ ఏభైమంది పెద్ద పెద్ద పుస్తకాలతో మా ఆఫీసుకి వచ్చారు. వాళ్ళందరినీ మాధవరావు గైడ్ చేస్తున్నాడు. ఇంతలో పదకొండున్నర అయింది. మేము ఒక టేబుల్ మీద నాలుగు కార్డు లెస్ ఫోన్లు పట్టుకొని కూర్చున్నాము. మిగతా వాళ్ళంతా హాల్లో ని కుర్చీల్లో కూర్చొన్నారు.
సరిగ్గా పన్నెండు గంటలకు స్పందన కార్యక్రమ మొదలైందని టీ.వి.లోని లోకల్ ఛానల్ వాళ్ళు ప్రకటించారు. అది లైవ్ ప్రోగామ్. అక్కడ కలెక్టర్, మిగతా అధికారులు కూర్చుని ఉన్నారు. అప్పుడే మా కోలనీలోని నలుగురు స్త్రీలు వచ్చి కలెక్టర్ గారి నెంబరుకి డయల్ చెయ్యిటం మొదలుపెట్టారు. అప్పటికే చాలా మంది అదే నెంబరుకి ప్రయత్నిస్తున్నట్లున్నారు... అందరికీ ఎంగేజ్ వస్తోంది. ఇంతలో సెక్రటరీ పద్మ ఫోన్ ఆ నెంబరుకి కలిసింది.వెంటనే మా వాళ్ళంతా ఆతృతతో ఆమె చుట్టూ మూగారు. ఇంతలో కలెక్టర్ గారు లైన్లోకి వచ్చారు.
“హల్లో!”
వెంటనే పద్మ “హలో సార్! నేను సమస్యల వలయం కోలనీ నుంచి మాట్లాడుతునాను. నా పేరు పద్మ. రోజూ నీరు - మీరు, పచ్చదనం- పరిశుభ్రత, తడిచెత్త - పొడిచెత్త, ఇంటికో తోట - మనిషికో చెట్టూ” అంటూ మీ ప్రభుత్వం తెగ ఊదర కొడుతునాది కదా! చెత్త మాట దేవుడెరుగు, మూడు రోజులైంది తాగడానికి మా కోలనీకి నీళ్ళు రావటం లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాము... ఆఖరికి బోలెడు డబ్బు పోసి టేంకులతో నీళ్ళు పోయించుకుంటున్నాము. మీరు చెబితే నమ్మరు గానీ మూడు రోజుల్నుంచీ ఎవ్వరం స్నానాలు చేయ్యలేదు... మనుషులంతా కంపు కొడుతునారు... ఎవరైనా ఎదురు పడితే భయం వేసి ముక్కు మూసుకుంటున్నాం..
నీళ్ళ కోసం మా కాలనీలోని మూడు వందల కుటుంబాలు నరకం అనుభవిస్తున్నాయి . కాబట్టి వెంటనే నీటిని సప్లై చెయ్యివలసిందిగా కోరుచున్నాను” అంటూ ఆమె తను రాసుకొచ్చిన దంతా గబగబ చదివి “హమ్మయ్యా” అని ఊపిరి పీల్చుకుంది.
ఆ తరువాత అందరం కలెక్టర్ గారి జవాబు కోసం ఎదురు చూస్తున్నాము. ఇంతలో ఆయన గొంతు వినిపించింది.
“ఏంటే! మందులోకి నీళ్ళు గావాలా? నీళ్ళు గలిపితే మందుకి కిక్ ఉండదనీ తెలియదా నీకు? అయినా ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే మందు మొదలెట్టారో అప్పట్నుంచీ మందు దొరకటం కష్టమైపోతోంది? పైగా దాన్లో కలపడానికి నీళ్ళ గొడవోటి” అని వినిపించింది.
దాంతో పద్మ ముఖం వాడిపోయింది. ఆ మాటలు వినీ మేమందదరం అవాక్కయ్యాము.
అప్పారావు కైతే కోపం ముంచుకొచ్చింది. “ఏంటి కలెక్టర్ గారు తాగూతూ కార్యక్రమం చేస్తున్నాడా? ఇది మరీ టూమచ్” అన్నాడు ఊగిపోతూ.
పద్మ తేరుకొని “సార్! మీరేం మాట్లాడుతునారో అర్థం కావటం లేదు. నేను మా కాలనీ నీటి సమస్య గురించి చెబుతుంటే మీరేంటి తాగే మందు గురించి అదీ ఒక స్త్రీతో అంత ఘోరంగా మాట్లాడుతునారు.. ఇది టూ మచ్ గా ఉంది” అంది గట్టిగా. ఆ విషయం చెబుతున్నప్పుడు ఆమె పెదవులు వణకసాగాయి.
“నా మందు నా ఇష్టం. అడగటానికి మధ్యలో నువ్వెవర్తివే. నేను మందు కొడుతున్నప్పుడు ఎవ్వరైనా ఫోన్లో మాట్లాడితే ఇలాగే తిడతా.. ఇంకా నాకు కోపం పెరిగిందో నువ్వు ఆ బూతులు వినలేక ఛస్తావ్”.. అయినా నాకు ఫోన్ చెయ్యమని నీకెవడే చెప్పింది మచ్చల మొహందానా".
ఆ మాటలు విన్న తరువాత ఆ మాట్లాడుతోంది కలెక్టర్ గారు కాదనీ మాకర్థం అయిపోయింది. ఎందుకంటే ఎదురుగా టీవీలో ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. దాంతో సత్యానికి ఒళ్ళు మండింది. ఫోన్ పద్మ నుంచి లాక్కొని “ఎవడ్రా నువ్వు? ఆడవాళ్ళతో ఇలాగేన్రా మాట్లాడేది” పోలీసులకి కంప్లైంట్ చేసి నిన్ను బొక్కలో వేయిస్తాను” అనీ చెప్పాడు.
“పోలీసులకు చెబితే భయపడతాననుకున్నావురా సాలే... పోలీసు వాళ్ళు రోజూ నా దగ్గరికి తాగడానికొస్తార్రా. నేను వన్ టౌన్ రౌడీ అప్పల్రాజున్రా ! ఇప్పటి దాకా నాలుగు మర్డర్స్ చేసాను. ఫోన్ పెట్టకపోతే ఐదో మర్డర్ చెయ్యివలసి ఉంటుంది నా..!” అంటూ అవతల నుంచి బూతు పురాణం మొదలైంది.
వెంటనే అప్పారావు లేచి సత్యం చేతిలో ఫోన్ లాక్కు ని దాన్ని డిస్కనట్ చేసి “రాంగ్ నెంబర్ కి వెళ్లింది..” అని చెప్పాడు.
ఇంతలో రామదాసుకి కనెక్షన్ దొరికింది..
“హలో”
“హలో... ఎవరు?
“నమస్తే సార్.. నేను సమస్యల వలయం కాలనీ నుంచి రామదాసుని మాట్లాడుతున్నాను.. - సార్! మా కోలనీలో ప్రతిరోజు ఉదయం పూట కరెంట్ రావట్లేదు.. - ఏవంటే పవర్ కట్ అంటున్నారు. కానీ మిగతా కోలనీల్లో ఉంటోంది...” అని చెబుతుండగానే అవతల నుంచి గట్టిగా నవ్వు వినిపించింది.
“ఏరా? ఉదయం పూట కరెంట్ ఎందుకురా?”
“సార్! మీ మాటలు నా కర్థం కావటం లేదు”
.
“అర్థం కాకపోవటమేమిట్రా? ముఖ్యమంత్రిని నా ఇంట్లోనే ఉదయం కరెంటు ఉండదు.. మరి మీ కోలనీకి ఉదయం కరెంటెందుకు రా.. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా?” అని గట్టిగా అరుపు వినిపించింది అట్నుంచి.
“సార్! మీరు ముఖ్యమంత్రి గారా? కలెక్టర్ గారు కాదా? నమస్తే సార్.- సార్... మాకు కరెంట్ ఉదయం పూట ఉండటం లేదు. ఎంతమందికి చెప్పినా రావటం లేదు”.
“ఒరేయ్! నువ్వు చీకట్లో ఎప్పుడైనా నడిచావా? చెప్పరా... నడిచావా?”
“సార్! చీకట్లో నడవటం ఏమిటి, ఉదయం పూట కరెంట్ ఉండటం లేదు. ఆ విషయం చెబుతుంటే మీరు చాలా తప్పుగా మాట్లాడుతునారు” కోపంగా చెప్పాడు రామదాసు... అతనికి కోపం కొంచెం ఎక్కువ..
“నేనూ అదేరా చెప్పేది? ఉదయం పూట దొంగతనం చెయ్యడానికి కరెంటెందుకురా? హాయిగా మందు తాగి పడుకో, మీ కోలనీలో మందు దొరకుతునాదా లేదా చెప్పు! పెతీ అడ్డమైన ఎదవా ఫోన్ చేసెయ్యిడమే”.
“సార్ మీరు జాగ్రత్తగా మాట్లాడండి.. ఎంత మీరు ముఖ్య మంత్రై తే మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము”
“నేను ముఖ్యమంత్రి నేమిట్రా.... పిచ్చి నాయాలా.... మళ్ళీ మాట్లాడేవంటే ఇరగదన్ని బొక్కలో ఏత్తాను ”
“సార్! ఇది మరీ టూ మచ్? మీరు బూతులు కంట్రోల్ చేసుకోకపోతే మర్యాదుండదు”
“హలో! హలో... సారీ సార్. ఇది టూ టౌన్ పోలీస్టేషన్. మా కానిస్టేబుల్ బాగా తాగేసి మీతో మాట్లాడాడు. ఏమీ అనుకోకండి... ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో? ” అనీ అట్నుంచి వినిపించింది.
రామదాసు ఫోన్ని అప్పారావుకిచ్చి "మళ్ళీ రాంగ్ నెంబర్” అన్నాడు కోపంగా.
ఇంతలో మా కాలనీలో ఉంటున్న రైల్వేగార్డు భార్య లతకి ఫోను కనెక్టయింది. “హలో... హలో” ఛ... వెధవ ఫోను... కనెక్షన్ కట్ అయింది” అంటూ మళ్ళీ డయల్ చేసింది. “మీ ఫోనులో బేలన్స్ అయి పోయింది.. - వెంటనే రీఛార్జి చెయ్యండి...” అని వినిపించింది .
“ఇది లాండ్ లైన్ కదా! రీఛార్జు అంటుందేమిటి” అంటూ మళ్ళీ డయల్ చేసింది.
“ప్రస్తుతం ఈ నెంబర్లో ఏఫోనూ పనిచెయ్యటం లేదు”.
అలా రెండు సార్లు మళ్ళీ డయిల్ చేసిన తరువాత మళ్ళీ రింగైంది. “హలో! నేను సార్... సమస్యల వలయం కాలనీ నుంచి లతని మాట్లాడుతున్నాను..”
“హలో.... లతా డియర్... ఎక్కడున్నావు... నీ గురించి ఉదయం నుంచి హోటల్లో వెయిట్ చేస్తున్నాను. వెంటనే వచ్చెయ్... ఇవాళ ఫుల్ ఎంజాయ్... నీతో పాటు మీ ఫ్రెండ్ రాధను కూడా తీసుకురా... నా ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఐదు వేలిస్తానంటునాడు. వెంటనే వచ్చెయ్యండి...”
“హలో! ఎవరు మీరు... హోటల్ కి రమ్మంటున్నావేంటి?"
“నేను దయానంద్ ని... ఏమీ తెలియనట్లు మాట్లాడుతునావేంటి... మనిద్దరి సెక్స్ వీడియో నా దగ్గరుంది... జాగ్రత్త.... రాకపోతే దాన్ని యూట్యూబ్ లో పెడతాను. వెంటనే వచ్చేయ్.”
లత కంగారు పడుతూ ఫోన్ డిస్ కనెక్ట్ చేసి ”వాడెవడో నాకు తెలియదు” అంది అప్పారావుతో...
“అది కూడా రాంగ్ నెంబర్ అయింటుంది” అని వాడు ఫోను అందుకుంటున్న సమయంలో మళ్ళీ రింగైంది.
“హలో,
“హలో... కలెక్టర్ గారా! నా పేరు రమణి. నేను వేమన వీధి నుంచి మాట్లాడుతున్నాను. మా కాలనీకి చెత్త బళ్ళు రావటం లేదు. వారం నుంచి బోలెడు చెత్త పేరుకు పోయింది. అందువల్ల దోమలు పెరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి వెంటనే చెత్త బళ్ళను పంపించవలసించిందిగా కోరుతునాను. మున్సిపాల్టీ వాళ్ళకైన్ని సార్లు చెప్పినా మాకు జీతాలివ్వటం లేదు కాబట్టి మేము రావనీ చెబుతునారు.”
“హలో! మేడమ్... నేను కలెక్టర్ గారిని కాదు. నేను కూడా మీ లాగే మా కాలనీ సమస్యలు చెప్పడానికి కలెక్టర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను.” అని అప్పారావు చెబుతుండగానే ఇంతలో ఇంకో కొత్త గొంతు వినిపించింది. “హలో... కలెక్టర్ గారా మా అత్త నన్ను చాలా హింసిస్తోంది. రెండు రోజుల నుంచి నాకు భోజనం పెట్టలేదు.. నన్నో రూమ్ లో బంధించింది. ఈ రాత్రికి ఎలాగైనా చంపెయ్యాలని చూస్తోంది. నన్ను మీరే కాపాడాలి”.
“చెత్త గురించి నేను మాట్లాడుతుంటే అత్త గురించి మాట్లాడతారేంటి” కోపంగా అడిగింది రమణి.
“మా కాలనీలో రౌడీల బాధ ఎక్కువైందంటే అత్త గురించి, చెత్త గురించి ఎవరు మాట్లాడుతోంది” ఇంతలో నాలుగో గొంతు ప్రవేశించింది...వెంటనే అప్పారావు చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు శేషగిరి.
“హలో! నేను కలెక్టర్ని కానయ్యా బాబు అంటే వినవేం.”
“కలెక్టర్ గారి స్పందన ప్రోగ్రాంలో కలెక్టర్ ఉండరా? మరెవరు ఉంటారు. ఏం కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిందా?”
“కాదండీ బాబూ! నేనూ మీలాగే కలెక్టర్ గారి గురించి ట్రై చేస్తునాను.”
“ఆ విషయం నా కెందుకు చెబుతున్నావ్! చేస్కుంటే చేసుకో”. ఆ సమయంలో మళ్ళీ కలెక్టర్ గారి గొంతు వినిపించింది.
“హలో! దయచేసి ఒక్కరే అడగండి...”
“సార్! నేను అడుగుతుంటే ఎవ్వరెవ్వరో లైన్లోకి వచ్చేస్తున్నారు.”
"నేను కాదురా... నువ్వే మా మధ్యలో దూరావు” రమణి గట్టిగా అరిచింది.
“కలెక్టర్ గారూ! నాకు ఉద్యోగం రాలేదు అప్పటికీ బోలెడు లంచం ఇచ్చాను.”
“హలో! ఎవరు మాట్లాడుతోంది.”
"నేను రమణి అనీ”
“అమ్మ ఒడి రాలేదు సార్”.
“చూడండి... చెత్త వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు.'
” సార్! నేనడిగింది నీళ్ళ గురించి” గట్టిగా అరిచారెవరో
“సార్ నా అమ్మ ఒడి”
“నీళ్ళు రావటం లేదా?”
“నేను దోమల గురించి అడుగుతుంటే అమ్మ ఒడి అంటున్నారు.. ఎవరయ్యా”
“మేడం! నేను రాజుని పెళ్ళి చేసుకొని అమర్‌తో ఉంటునాను. నాకు పుట్టిన పిల్లకు ఎవరు తండ్రి అవుతారు.”
“చూడమ్మా! నువ్వు రాజుని పెళ్ళి చేసుకున్నావు. కాబట్టి నీ పిల్లకు రాజే తండ్రి అవుతాడు.”
“మేడం! మరి పెళ్ళికి ముందు గిరితో కలవడం వల్ల గర్భం వచ్చింది. అప్పుడు నాకు రాజుతో పెళ్ళెంది... ఇప్పుడు చెప్పండి... నా పిల్లకు తండ్రెవరు”.
“హలో! కలెక్టర్ గారూ! నేను మావారికి మూడో భార్యను. అతని పెన్షన్ నాకు వస్తుందా?”
“హలో! నేను కలెక్టర్ని కానయ్యా అంటే వినవేం?
“కాకుంటే ఫోను ఎందుకు ఎత్తావు?”
“నేను ఫోన్ ఎత్తడం ఏమిటి? నువ్వే నా లైన్లోకి వచ్చావ్”.
“చూడండి... అమ్మఒడి అన్నది పేదల కోసం.. ఆఫీసర్ల పిల్లలకు కాదు”
“హలో! కలెక్టర్ గారూ!"
“మేడం! నేను టెలీఫోన్ లైన్ మేన్ని, కలెక్టర్ని గాను”.
“నువ్వెందుకురా మధ్యలో కొచ్చావ్?”
“నేను రిపేర్ చేస్తుంటే మీరే అడిగారు”.
“ఏంటే తిక్క తిక్కగా మాట్లాడుతునావు... మొగుడంటే గౌరవం ఉండక్కర్లేదా?”
ఆ మాటకు రమణకి కోపం వచ్చింది.
“ఏంట్రా నేను నీ పెళ్ళాన్నా! బులెట్ దిగుద్ది”.
“నేను డ్యూటీలో ఉన్న టెలీఫోన్ లైన్ మేన్ని మేడం... ఈ ఏరియాలో చాలా లైన్లు తెగిపోయాయి. రిపేరు కొచ్చాను; నాకు బులెట్ ఎందుకు దిగుద్ది?”
“యస్పైగారు! ఇద్దరమ్మాయిలు దొరికారు. మీ గెస్ట్ హౌస్ దగ్గరికి తెమ్మంటారా?”
“సార్... గంజాయితో దొరికిన వాళ్ళను పట్టుకుంటే ఐదువేలిచ్చారు. వాళ్ళను వొదిలేసాను. డబ్బు తెమ్మంటారా?”
“కలెక్టర్ గారూ! నా పేరు శంకర్.”..
“ఒరేయ్ శంకర్.. నా .. డబ్బులు అప్పు తీసుకోని ఎగ్గొ డతావురా... నీ సంగతి చూస్తా”
“హలో! లత గారూ మీ ప్రాబ్లెం ఏమిటో చెప్పండి”.
“రమణి గారూ! మీ మొగుడు మిమ్మల్ని వదిలేసాడా.”
“హలో! ఎవరూ!”
“ఈత కొట్టాలంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ముఖ్యం... అందులో ఆరడగుల నీళ్ళుండాలి.”
"గార్లు పిండితో చేసిన తరువాత వేడి నూనెను మూకుట్లో మరిగించాలి.”
"కొత్తగా ఈత నేర్చుకునే వాళ్ళు వెంటనే అందులో కి గెంతాలి "
"పాసెంజర్ గంట లేటా "
"ఏంటీ వర్షంలో కాలనీ మునిగిపోయిందా "
"హలో విజయవాడ కి బస్సుందాండి "
ఇక ఆ టార్చర్ భరించలేక ఆ ఫోన్లన్నింటినీ విసిరి కొట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము.
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comentários