హృదయ ధార
- Pandranki Subramani
- May 18
- 7 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #HrudayaDhara, #హృదయధార, #IllicitRelationship, #HypoactiveSexualDesireDisorder, #వివాహేతరసంబంధం

Hrudaya Dhara - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 18/05/2025
హృదయ ధార - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
వరసగా మూడు నెలలపాటు పలు పుణ్యక్షేత్రాలతో బాటు దేశం నలుమూలలా ఉన్న ద్వాదశ శక్తిపీఠాలు కూడా దివ్యంగా దర్శించి వస్తూన్న వత్సలమ్మ ఇంద్రయ్య దంపతులు అనుకోకుండా అదే ట్రైనులో తమ దూరపు బంధువు గంగాధరాన్ని కలుసుకోవడం జరిగింది.
అలా మాటా మంతీ మాట్లాడుకుంటున్నప్పుడు తన చిన్నకొడుకు ఇంటి వ్యవహారం గురించి విని భార్యాభర్తలిద్దరూ నిరుత్తురులయిపోయారు. ఇక వత్సలమ్మ పరిస్థితి గురించి చెప్పనే అవసరం లేదు. తాము పుణ్య క్షేత్రాల చుట్టూ హిమాలయ గుహలచుట్టూ తిరిగొచ్చే లోపల సంతోషరావు సంసారం మూడు ముక్కలయిపోయిందా! కొడుకూ కోడలూ చెరొక వేపూ ఎడముఖం పెడముఖంగా చీలిపోయి దారులు తప్పి సరాసరి లంబసింగ అగాధంలో జారి పడ్డారా!
ఊఁహు—అయుండదు. స్వతహాగా ఎదురొచ్చిన చిన్న చిన్న విష యాలలోనూ తొందరపడిపోయి వేగిరపాటుకి లోన యే గంగాధరం మనస్తత్వం గురించి వాళ్ళకు తెలుసు. తాడుని చూసి పామనుకునే రకం. ఎంత వద్దన్నా, భార్యా భర్తలయిన తరవాత అప్పుడప్పుడు చికాకులూ చీదరింపులూ చోటు చేసుకోవా? అప్పుడప్పుడు అలుకలు చిరుకోపాలు నల్లమబ్బుల్లా ఆవహించుకోవా? ఆ మాటకు వస్తే వయసులో ఉన్న మొగుడూ పెళ్ళాల మధ్య అలుకలకూ కులుకులకూ తేడా అన్నది ఉండదు.
అవి చెదరకుండా అలానే ఉన్నావనుకో-- అంత మాత్రం చేత కోర్టుకెక్కి విడాకులు తీసుకుంటారా! ముగ్గురు బిడ్డల తండ్రయిన గంగాధరానికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలుసుకునేంత పాటి లోకజ్ఞానం ఉండవద్దూ! ఇంకా చెప్పాలంటే— కొందరున్నారు, వాళ్ళకు కట్టెదుట ముఖాలు ముడుచుకునే వాళ్ళను చూస్తే అదొక వింతైన సరదా. అటువంటి బాపతేనేమో ఈ గంగాధరానిది!
ఇలా పరిపరి విధాల తర్జన భర్జన పడుతూ వృధ్ద దంపతులిద్దరూ ఒకరినొకరు నిశ్శబ్దంగా కళ్ళ కదలికలను గమనిస్తూ ఉండి పోయారు. వాళ్ళిద్దరి చూపుల్లోనూ భయం కొంత బేలతనం మరి కొంత ప్రస్ఫుటిత మయాయి. కారణం- ఇప్పటికే పెద్దకొడుకు సంసారం ఎక్కడ వేసిన గొంగళి అక్క డే పడున్నట్టు బిడ్డాపాపల అలికిడి లేకుండా బోడిగా ఉంది. అది చాలదని ఇదొక్కటా-పులికి పుట్ర తోడయినట్టు-- ఊఁహు- ఇది కొన్ని వారాలలోనో కొన్ని నెలల్లోనో సంభవించే వ్యవహారం కాదు. నివురు గప్పిన నిప్పులా చాలానాళ్ళే రాజుకుంటూ వచ్చి ఉంటుంది. వేద పురాణ ధర్మశాస్త్రాల న్యాయ సూత్రాల అనుసారం అమరిన వివాహబంధం చెడిపోయి వేరయపోవడమన్నది మామూలు సినీరంగ క్లైమాక్స్ దృశ్యమా!
బోగీనుండి సామాను గట్రా క్రిందకు దించేటప్పటికి సంతోషరావు పరుగున వచ్చి చేరాడు. మొదట అమ్మానాన్నల పాదాలు తాకి పిదప సామాను అందుకుని ప్లాట్ ఫాం అవతలికి నడవసాగాడు. ఇద్దరూ తేలిక పాటి సామగ్రి మాత్రం చేతుల్లోకి తీసుకుని కొడుకుని అనుసరించారు. అంతమంది ప్యాసంజర్ల మధ్య కలసి నడుస్తున్నారే గాని వాళ్ల మధ్య చోటుచేసుకున్న నిశ్శబ్దం- నడి సముద్రాన తాండవించే గాఢమైన గంభీరమైన సునామీ నిశ్సబ్దం.
మరికాసేపటికి వాళ్ళు అపార్టుమెంట్స్ ముంగిట వచ్చారు. అక్కడున్నసెక్యూరిటీ గార్డ్ సహాయంతో మొదటి అంతస్తులో ఉన్న సంతోషరావు అపార్టుమెంట్ చేరుకున్నారు. చేరుకున్న వెంటనే భార్యా భర్తలిద్దరూ కోడలు మౌనిక కోసం చూపులు సారించారు. మౌనిక అలికిడి లేదు! ఇద్దరి కళ్ళూ పెద్దవయాయి. నాలిక తడారింది. మొదట గుండెల్ని అదుముకుంటూ వత్సలమ్మే అడిగింది- “మరి గంగాధరం చెప్పింది నిజమేనట్రా!”
సంతోషరావు అర్థరహితంగా చూసాడు; ఎవరా గంగాధరం అన్నట్టు.
“ఇంకెవరు? నీకు వరసకు చినబాబవుతాడు. కోడలు పిల్ల కోపగించుకుని వెళ్లిపోయిందా లేక నిజంగానే—”
“ఔను. చినబాబు చెప్పింది నిజమే! చీకూ చిదారాలతో వేరుపడలేదు. పూర్తిగా విడిపోయాం- పరస్పరాంగీకారంతోనే--”
అప్పుడు ఇందిరయ్య కలుగ చేసుకున్నాడు- “నిన్ను కన్న పాపానికి మేమింగా బ్రతికే ఉన్నామని— మేము ఊరుచేరేవరకూ ఆగాలన్న ఆలోచన నీకు కలగలేదన్నమాట! చేసింది పాపిష్టి పని— అందులో మంచి పాపిష్టి పనంటావా! మాముందే పరస్పరాంగీకారమంటావా! ”
“సారీ నాన్నగారూ! వాస్తవానికి విషయం చాలా రోజుల్నించి నానుతూనే రాజుతూనే ఉంది మా మధ్య”
ఆమాటతో ఇందిరయ్య కళ్లు ఎరుపెక్కాయి. “నువ్వు ఎదిగిపోయావు. నా అంత ఎదిగిపోయావు. లేక పోతే నీరెండు దవళ్లూ ఈపాటికి వాచిపోయున్ను! అగ్నిసాక్షిగా పెండ్లి చేసుకున్న పెండ్లాం నీ చూపులో ఆటబొమ్మలా సెక్స్ టాయ్ లా కనిపిస్తుందా మోజు తీరింతర్వాత ప్రక్కన పడేయడానికి? పోర్టబుల్ ల్యాప్ టాప్ అనుకున్నావా ఎక్కడైనా విడిచి పెట్టి వెళ్ళిపోవడానికి?
మీ ఇద్దరి పెండ్లీ మేము జరిపించాం. ఎదురయేది మంచయినా చెడయినా-- ఆ విషయంలో తుది నిర్ణయం మేమే తీసుకోవాలి. కుర్రకుంకవి- నువ్వు కాదు నిర్ణయం తీసుకోవలసింది.. ఎందుకంటే నీకు వాళ్ళు పిల్లనిచ్చింది నిన్ను చూసి కాదు— మమ్మల్ని చూసి.
ఎప్పుడైనా అనుకోకుండా కోపతాపాలు చోటుచేసుకుంటే సర్దుబాటు చేసుకోవాలి గాని- ఉన్నపాటున ఊడబెరి కేస్తావా రుద్రాక్ష వృక్షంలా! నీకూ పెళ్ళయిన అక్క ఒకతె ఉందన్నది మరచిపోకు.. దానిని ఇలాగే మీ బావ అర్థాంతరంగా విడిచి పెట్టేస్తే ఎలాగుంటుంది నీకూ మాకూ--”
సంతోషరావు స్పందించకుండా మౌనం వహించాడు.
“సరే-దీనికి బదులియ్యి- ఇప్పుడు నువ్వేమి చేయబోతున్నావు?”
“మాకంపెనీలో నాతో బాటు పనిచేస్తూన్న మాలతిని ఇష్టపడ్డాను. ఆమెకు కూడా నేనంటే ఇష్టం. త్వరలో ఆమెను—”
అంతే! అతడామాట పూర్తి చేసే లోపల చెంప ఛెల్లుమంది. “కొత్త కొత్త రుచులు వెతుక్కుంటూ వెళ్ళడానికి ఇదేమిటి పూటకూళ్ల వ్యవహారం అనుకుంటున్నావా! ఇక పైన కూడా నీ రెండోపెళ్ళికి మేమొచ్చి ఆశీర్వదిస్తామనుకుంటున్నావా?” అంటూ ఇందిరయ్య ఇక అక్కడ ఆగే ప్రసక్తే లేనట్టు పెట్టే బేడా అందుకుని బైటకు నడిచాడు- భార్యను తనను అనుసరించమని చూపులతో సంకేతం ఇస్తూ--
అప్పుడు సంతోషరావు తండ్రికి ఎదురొచ్చాడు- “నాపైన మీకు నమ్మకం ఎలాగూ సడలిపోయింది కాబట్టి మీరలాగే వెళ్ళిపొండి నాన్నగారూ! కాని నాదొక చిన్నపాటి వేడికోలు- మీరూ అమ్మా స్వయంగా వెళ్లి మౌనికను కలుసుకోండి. అడగండి ఏమి జరిగి మేము విడిపోయామో! నిజానికి నాకు మౌనిక నుండి దూరం కావాలన్న ఉద్దేశ్యమే లేదు. పరిస్థితులు అలా బెడిసి కొట్టుకు పోయాయి. నేనేమి చేసేది చెప్పండి! ”
దానితో ఇందిరయ్య ఆగిపోయాడు సతీమణి నుండి చూపుల హెచ్చరిక అందుకుంటూ.. ఈసారి కొడుకు వాదనలో సహేతుకత ఉన్నట్లు తోచింది. అదే ఊపున ఇద్దరూ స్నానాలు కానిచ్చి పూజా గదిలో దైవ ప్రార్ధన ముగించి ఉన్నంతలో పలహారం తీసుకుని రేడియల్ ఐ. టి. పార్కు చేరుకున్నారు. వాళ్ళొచ్చిన కబురందు కుని మౌనిక వెంటనే వచ్చి ఇద్దరి కాళ్లకూ నమస్కరించి “మా ప్యాంట్రీలో మంచి కాఫీ దొరుకుతుంది. దోరగావేసిన గారెలు కూడా దొరుకుతాయి అత్తయ్యా! ” అని అటు దారి తీయబోయింది.
కాని ఇద్దరూ కదల్లేదు. ఏమీ జరగనట్టు నిబ్బరంగా ప్రవర్తిస్తూన్న మౌనికను తేరి చూస్తూ భార్యాభర్తలిద్దరూ ముక్త కంఠంతో అన్నారు- “అదేమీ వద్దమ్మా! నీతో రెండు నిమిషాలు మాట్లాడి పోదామని ఇటు వచ్చాం”
మౌనిక ఇక మాట్లాడకుండా బయటి లాన్ వేపు నడిచింది.
అప్పుడు నడుస్తూనే ఇందిరయ్య అడిగాడు- “విడాకుల పేపర్లపైన సంతకాలు చేసేటప్పుడు- ఫ్యామిలీ మేజిస్ట్రేట్ మిమ్మల్నిద్దరినీ పిలిచి ఔనా కాదా అని అడిగేటప్పుడు మేము ఒక్కసారి కూడా గుర్తుకురాలేదా! మేమే కదా ముందుండి మీ ఇద్దరి పెళ్లీ జరిపించాం! ”
కదలిక లేని విగ్రహంలా మౌనిక మౌనంగా ఉండిపోయింది.
ఆ తరవాత ఆగిపోయి తిరిగి చూసింది. కోడలి చూపులో చూపు కలపకుండా కొనసాగించాడు ఇంద్రియ్య-- “వాడు మగాడు— చిన్నచిన్నదాని కి ఉక్రోశం చూపిస్తాడు. దానికి నువ్వే కదా చల్లబరచి సర్దుబాటు చేసుకోవాలి. నిన్ను మా ఇంటికి తీసుకొస్తున్నప్పుడు మీ నాన్నగారు కన్నీరు పెట్టుకున్నా రు. అప్పుడు నేనేమన్నాను- నేను లేనా- నేను మాత్రం మౌనికకు తండ్రిని కానా అని ఊరడించాను.
అదంతా మరచిపోయావ న్నమాట. పర్వాలేదు. ఇప్పటి కార్పొరేట్ సంస్థల్లో పని చేసే వారికి వేగిరిపాటుతో బాటు మతిమరుపు కూడా యెక్కువేలే! సరే- ఇప్పుడు సూటిగానే అడుగుతున్నాను- వాడేం చేసాడు? అడ్డూ ఆపూ లేకుండా పార్టీలూ నైట్ గేదరింగులూ అంటూ మందు ఎక్కవగా వేసుకువచ్చి నిన్ను హింసించాడా! లేకపోతే- ఇంటి ఖర్చులకు వాడి సరదాలకు రొక్కం చాలడం లేదని ఇంట్లోనుంచి ఇంకొంత తెమ్మన్నాడా?”
ఆమె తల అడ్డంగా ఆడించింది.
“నువ్వలా తల అడ్డంగా ఆడిస్తూ నిల్చుంటే మాకెలా అర్థమవుతుందమ్మా! విడాకులన్నది మా ఇంటా ఒంటా లేని వ్యవహారం. ఇద్దరూ చివరి వరకూ కలిసే ఉంటారు. ఒకరి తరవాత ఒకరుగా మట్టిలో కలిసిపోతారు. ఇదీ మా కుటుంబ సంప్రదాయం. గుర్తుంచుకో! ”
“అటువంటిదేమీ జరగలేదు మామగారూ! మీ అబ్బాయినేమీ అనకండి. న్యాయగుణం గలవాడు”
“వాడూ మంచివాడు, నువ్వూ మంచిదానివే. నిదానపరురాలివే-- మరెవ్వరివల్లనమ్మా ఈ విడాకుల వ్యవహారం చోటుచేసుకుంది?”
దానికామె మరొకసారి తల అడ్డంగా ఆడించింది -“కాదు. నేను మీరనుకున్నంత నిదానపరు రాలిని కాను. నా అలవాట్లు మార్చుకోలేక నా జీవన శైలిని సరిదిద్దుకోలేక మీ అబ్బాయికి ఇక్కట్లు కలిగించాను. నిజానికి నన్ను నేను సర్దుకోవటానికి లాంగ్ రోప్ యిచ్చాడు. అయినా తేరుకోలేక పోయాను. అందుకే- అడిగిన వెంటనే విడాకుల పత్రాలపైన సంతకం చేసాను. ఇక నేను వెళ్తానండీ! ” అంటూ కన్నీటి తుంపరను తుడుచు కంటూ చివరి దశ వీడ్కోలుగా మాజీ అత్తామామలకు నమస్కరించి వెడలిపోయిందామె.
సరసరా నడచి వెళ్లిపోతూన్న మౌనిక వేపు తదేకంగా చూస్తూండిపోయారిద్దరూ-‘అంతా మిస్టరీలాగుందే! ’అనుకుంటూ-
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అలానే జరిగిపోతుంటాయి కొందరి జీవితాలలో-యెదురు చూడని మలుపుల్లో-- ఇద్దరికిద్దరూ ఒండొరులు ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులే వేరయిపోతుంటారు. ఒకరికొకరు ఇష్టపడి ఇష్టంగా మన:పూర్వ కంగా సంసారం చేస్తున్నవారే- మరెందు కిలా అయింది? కారణం స్వల్పమైనదిగా గోచరించవచ్చు గాని-వ్యవహారం మాత్రం లోతైనదే— ఇక అసలు విషయానికి వస్తే- కొన్ని సంగతులు కావలసిన దగ్గరి బంధువులకు చెప్పుకోవచ్చు- మరికొన్ని సంగతులేమో స్నేహితులకు చెప్పుకుని కడివెడు కన్నీరు కార్చి గుండె భారం తగ్గించుకోవచ్చు. మరైతే— కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఎవరికీ చెప్పుకో లేనివి. క్లుప్తంగా చెప్పాలంటే అవి నివురుగప్పిన నిప్పువంటివి. ఇంకా విడమర్చి చెప్పాలంటే— అవి అణచుకోలేనివి— అవలీలంగా విస్మరించలేనివి.
శారీరకంగా మానసికంగా మౌనికకు యుక్తవయసునుండీ ఉద్రేకమూ ఉద్రిక్తతా ఎక్కువ. తరవాత తరవాత తెలుసుకుంది తనలోకి తను చూసుకుని;తనను తను అదుపులో ఉంచుకోలేని హైపో సెన్సిటివిటీ హైపో సెక్యువాలిటీ తనలో ఉందని. తనకు తెలియకుండానే తనలో ఓ విధమైన బయోలోజికల్ డిస్ ఆర్డర్ చోటుచేసుకుందని. తనకింకా బాగా జ్ఞాపకం- తను రజస్వల ఐన మరుదినమే అడ్డూ ఆపూలేని కామ వాంఛతో ప్రక్కింటి అబ్బాయితో తన కన్నెచెర చెరిపించుకుంది.
అడగనివాడిదే పాపమన్నట్టు ఎదురు వచ్చిన బడి కుర్రాకాయలకు ఆ తరవాత కాలేజీ కుర్రాలకూ చెరగు పరచి వాంఛల జల్లు కురిపించింది. ఎందుకో మరి- ఎలాగో మరి తను ఎప్పుడూ గర్భం దాల్చలేదు. సంతోషరావుతో పెండ్లయిన తరవాతనైనా గర్భం దాల్చిందా-- అదీ లేదు. కాని ఒక్కటి మాత్రం తనలో అనుక్షణం ఆవిరిలా పొంగుతూనే ఉంది— తీరని ఎడారి దాహం--
చివరకు క్రమ క్రమంగా తన జీవిత విధానం ఎలా తయారయిందంటే— తన ఆత్మ కట్టుకున్న భర్త వద్ద ఉంటే- శరీరం మాత్రం పరాయి పురుషుల వద్ద చెలగాట మాడనారంభించింది-- రెండుచేతులా సంపాదిస్తున్న మహిళ కాబట్టి ఇష్టానుసారం నైట్ క్లబ్పులకు బ్రెజిల్ పబ్బులకు నిశ్చింతగా వెళ్లసాగింది. తనికిష్టం వచ్చినట్టు కోరికలు తీర్చుకోసాగింది. తన విపరీత పోకడను తన ఫ్రెండ్సు ద్వారా వినడం మాత్రమే కాక సంతోషరావు స్వయంగా వెన్నంటి వచ్చి విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న తన భర్త రాధ్ధాంతమేదీ చేయలేదు. గంభీరంగా హుందాగా నడచుకున్నాడతను. ఒకే ఒక మాటతో తన వద్ద విడాకు పత్రాలు తీసుకున్నాడు- “నీ పోకడ నాకూ మంచిది కాదు. మా కుటుంబ గౌరవానికీ మంచిది కాదు” అని.
మరి ఇదంతా స్త్రీగా శాపగ్రస్త స్త్రీగా తనెవరితో చెప్పుకోగలదు! నిజం చెప్పాలంటే తనకెదురైనవి కేవలం శారీరక పరమైన బాధలు కావు- ఏ జన్మలోనో ఎదురైన శాపనార్ధాలు. పూర్వజన్మ వాసనలు. లేకపోతే ఉత్తముడైన పురుషోత్తముడైన భర్తను ఎందుకు కోల్పోతుంది! శాశ్వత బంధానికి దూరమై నిస్సారమైన నేలగా యెందుకు ఒంటరిగా మిగిలిపోతుంది!
-----------------------------------------------------------------------
ఇకపోతే- అన్నీ కాకపోయినా కొన్ని అనుకున్నవి అనుకున్నట్లే డార్ట్ లోకి విసిరిన సూటైన బాణంలా జరిగిపోతుంటాయి. సంతోష్ రావు మాలతిని పెండ్లి చేసుకున్న తరవాత ఒక కూతురుకి ఒక కొడుక్కీ తండ్రయాడు. అటు తరవాత మునుపులా అమ్మా నాన్నలిద్దరికీ దగ్గరయాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇలా జరుగుతుందనుకున్నట్లే మౌనిక ఉద్యోగం మానుకుందని విన్నాడతను. పిమ్మట మంచాన పడిందన్న కబురు కుడా అందుకున్నాడు. అదేమి జబ్బో కూడా తెలుసుకున్నాడు- తీవ్రదశకు చేరుకున్న ఎయిడ్స్—
----------------------------------------------------------------------------------------
డిప్యుటీ మేనేజర్ గా ప్రమోషన్ పొందిన సంతోషరావు ఎప్పటిలాగే ఆరోజు ఆఫీసుకి బయల్తేరడానికి సిధ్ధమవుతూ డ్రెస్సెప్ అయి నెక్ టై కట్టుకుంటున్నాడు. అప్పుడక్కడకు కాఫీ కప్పుతో వచ్చి నిల్చుంది మాలతి. సరిగ్గా అప్పుడు ఫోను మ్రోగింది రాకెట్ శబ్దం చేస్తూ-- ఫోను తీసి మాట్లాడుతూన్న భర్త ముఖకవళికలు మారడం గమనించిన మాలతి అడిగింది సంగతే మిటని-- “మౌనికకి సీరియస్ గా ఉందట. చివరి ఊపిరితో ఉందట—”
“ఉండదూ మరి! రంకుల రాట్నంలా ఎన్ని తిరుగుళ్లు తిరిగిందని— ఎంతమంది పరువు తీసిందని— ఎంతమంది పురుషుల్ని నట్టేట ముంచిందని- -ఇప్పుడు దానికోసం మరీ పట్టించుకోకుండా మీరు ఆఫీసుకి వెళ్లిరండి. ఇదేమి కొత్త కాదుగా! అంతా ఎదురు చూసినదేగా! ”
“లేదు మాలతీ! ఈ రోజు నేను ఆఫీసుకి వెళ్లలేను”
“ఇంత పెద్ద పోస్టులో ఉన్న మీరు దానింటికి వెళ్తున్నారా! మీకూ మీ కుటుంబానికీ చేసిన అన్యాయం మరచిపోయారా?”
“లేదు మాలతీ! నువ్వు పొరపడుతున్నావు. మౌనిక నాకెప్పుడూ అన్యాయం చేయలేదు. గ్రహపాటున తనను తను అదుపులో ఉంచుకోలేక పోయింది. ఇక చివరిమాటగా నేనొకటి చెప్తాను వింటావా!”
మాలతి కళ్లింతలు చేసుకుంటూ తలూపింది.
“మౌనిక చివరి వరకూ నన్నుహృదయ పూర్వకంగానే ప్రేమించింది -ప్రేమతోనే నాతో సంసారం చేసింది. అది నాకు మాత్రమే తెలుసు. నా హృదయానికి మాత్రమే తెలుసు” అంటూ చక చకా కారు వైపు నడిచాడు. మౌనిక అడ్మిట్ అయిన హాస్పిటల్ వేపు పోనిచ్చాడు. కొన్ని బంధాలు తెగినట్లు కనిపిస్తాయి. కాని- -తెంచుకోవాలనుకున్నాఅవి ఎన్నటికీ తెగవేమో!
మరణించిన మౌనిక కర్మకాండలు ముగిసిన తరవాత సంతోషరావు ఇల్లు చేరిన తరవాత తనని చూసీ చూడటంతో మాలతి మండి పడుతుందనుకున్నాడు. కాని— అలా జరగలేదు. అతడి చేతికి నిశ్శబ్దంగా ఓ పొడవాటి కవరు అందించింది; ‘మౌనికి చనిపోయేముందు ఈ కవరు పంపినట్లుంది’ అంటూ— అతడు కవరుని విప్పాడు నోరు మెదపకుండా--
ప్రియమైన నా జీవన సహచరుడు సంతోషరావుకి చేతులు జోడించి నమస్కరిస్తూ వ్రాయునది— కొందరికి నాకు పరిచయాలు ఉండవచ్చు. మరికొందరితో పెనవేసుకునే స్నేహాలు కూడా ఉండవచ్చు. కాని— అందరూ మీలా నా జీవన సహచరుడిగా ఉండలేరు కదా! నాకు తెలుసు మిమ్మల్నీ మా అత్తామామలిద్దర్నీ చాలా కష్టపెట్టానని.
కాని— ఏదీ నేను కావాలని చేయలేదు. ఏదో దుష్ట శక్తి నన్ను వెనుక నుండి ముందుకు తోస్తూ ఉండేదేమో! నాకు చివర క్షణాలు ఆసన్మమవుతున్నాయి కాబట్టి ఇక విషయానికి వస్తాను. నాపేర ఉన్న ఇంటినీ సేవింగ్స్ అంతటినీ నీపేర వ్రాసాను. ఈ విషయమై లాయర్ నిన్ను త్వరలో కలుసుకుంటాడు. నా మనశ్శాంతి కోసం కాదనకుండా తీసుకోండి. మీ అభిమతం ప్రకారం దానిని ఉపయోగించండి.
దయచేసి నా పేర మాత్రం యేదీ చేయకండి. ఎందుకుంటే— నేనీ మానవ ప్రపంచంలో పుట్టవలసిన దాని కాను. ప్లీజ్! అర్థం చేసుకోండి
ఇక సెలవు— నీ మౌనిక
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

హైపో అంటే తక్కువ అని అర్ధం. మీరు చెప్పదలచినది, హైపర్.Hypersexuality is a proposed medical condition said to cause unwanted or excessive sexual arousal, causing people to engage in or think about sexual activity. Doctors use a combination of therapies, including cognitive-behavioral therapy (CBT), and in some cases, medication.
మంచి కథా వస్తువు ని ఎంచుకున్నారు. కానీ సమస్య కి వైద్య పరంగా చేసిన ప్రయత్నం ప్రస్థావించి వుంటే బాగుండేది.