top of page

హస్బెండ్ ఇన్ లా


'Husband In Law' written by Mudunuru Padma

రచన : ముదునూరు పద్మ

టౌన్ హాల్ ఆహుతులతో నిండుగా ఉంది. నిర్వాహకులు హడావుడిగా తిరుగుతూ అతిథులను పలకరిస్తున్నారు. మానవి పబ్లికేషన్స్ సెక్రటరీ మధులిక మాటిమాటికి టైం చూసుకుంటోంది. గేట్ దగ్గర కారు ఆగటంతో పరుగు లాంటి నడక తో అక్కడికి చేరుకుని హేమలతకు ఆహ్వానపూర్వకంగా నమస్కరించి వేదిక దగ్గరికి తీసికెళ్లింది.

ఇంకా ఒకరిద్దరు అతిధులు రావలసి ఉండటంతో హేమలతని ముందువరుసలో కూర్చోబెట్టింది. " పావుగంటలో మొదలుపెట్టేస్తాము. డాక్టర్ జయంతిగారు, కలెక్టర్ గారు దారిలో ఉన్నారు. మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నందుకు సారీ మేడం". అభ్యర్ధనగా అంది.

"మరేమీ పరవాలేదమ్మా. మీరు ఏర్పాట్లు చూసుకోండి. ఐ విల్ ఎంగేజ్ మైసెల్ఫ్" హేమలత చిరునవ్వుతో సమాధానం ఇవ్వటంతో మధులిక మళ్ళీ తనపనిలో పడింది.

హేమలత ప్రముఖ వారపత్రికలో సీరియల్ గా వ్రాసిన "హస్బెండ్ ఇన్ లా" పుస్తక ఆవిష్కరణ. సీరియల్ గా వస్తున్నప్పుడే ఎంతో ప్రజాదరణ పొందటంతో పత్రిక సర్కులేషన్ కూడా పెరిగింది. మానవి పబ్లికేషన్స్ వాళ్ళు ఈ కధను నవల గా ప్రచురించారు. దాని ఆవిష్కరణ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయబడింది.

"మేడం మీరు రచయిత్రి హేమలత గారే కదా.." పాతిక ముప్ఫై ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయి సంభ్రమంగా అడిగింది. సభా కార్యక్రమాల బ్రోచర్ ను పరిశీలిస్తున్న హేమలత ఆ పలకరింపుకి తలెత్తి అవునమ్మ...అంది.

"నమస్కారం మేడం. ఈ రోజు మిమ్మల్ని చూడాలని వచ్చాను. కానీ మీతో కలిసి మాట్లాడే అదృష్టం దొరికింది. మీ సీరియల్ ని ఒక్క వారం కూడా మిస్ అవకుండా చదివాను మేడం. నా జీవితంలోకి చూసి వ్రాసినట్టే అనిపించింది. చదువుతున్నంత సేపు స్నేహితురాలితో బాధ పంచుకున్న ఫీలింగ్ కలిగేది." ఆ అమ్మాయి కళ్ళలో తడి హేమలత చూపులను దాటిపోలేదు. ఆ అమ్మాయి చేతిని నెమ్మదిగా నొక్కింది.

"ఆహుతులకు నమస్కారం. మన అతిధులందరూ విచ్చేసారు కనుక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం" మధులిక ఒక్కొక్కొరినే వేదిక మీదకు ఆహ్వానిస్తున్నది. హేమలత పేరు పిలవగానే చప్పట్లతో హాలు దద్దరిల్లింది. నెమ్మదిగా వేదిక పైకి వచ్చిన హేమలతకి సభలో ఉన్న మహిళలను చూసాక తన ప్రయత్నం సఫలమైనదనే తృప్తి కలిగింది.

ముందుగా ముఖ్య అతిధి, జిల్లా కలెక్టర్ రాహుల్ సభనుద్దేశించి మాట్లాడుతూ "నేను నా ఉద్యోగబాధ్యతల రీత్యా రోజు అనేక సభలు, సమావేశాలకు హాజరవుతుంటాను. కానీ ఈ మీటింగ్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఒక పుస్తకావిష్కరణ సభకు ఇంతమంది సోదరీమణులు హాజరయ్యారంటే ఆ రచన ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అటువంటి మంచి పుస్తకాన్ని నా చేతులమీదుగా ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను" అనటంతో మరోసారి చప్పట్లు మారుమోగాయి.

తరువాత డాక్టర్ జయంతి సీరియల్ చదివి తను ఎంతగా ఇంప్రెస్ అయినది చెప్పారు. పుస్తక ఆవిష్కరణ తర్వాత ముఖ్యమైన ఘట్టం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అదే రచయిత్రి స్పందన. అభిమానుల కోలాహలం మధ్య హేమలత నెమ్మదిగా మైక్ అందుకుంది. "సభకు నమస్కారం. మీఅందరిని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి శ్రీ సుందరం గారు. వ్యక్తిగత కారణాల రీత్యా నేను రచనావ్యాసంగానికి కొంత విరామమిచ్చాను. కానీ సుందరంగారు పట్టుబట్టి నన్ను ఒప్పించారు. మళ్ళా వ్రాయాలన్న సంకల్పాన్ని కలిగించారు. ఈ సీరియల్ వ్రాసేవరకు రచన నాకు ఒక హాబీ మాత్రమే. కానీ ఈ సీరియల్ నా ఆలోచనలకు, అనుభవాలకు ప్రతిబింబం.

సీరియల్ మొదలుపెట్టినప్పుడు సాధారణంగా అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే క్రమేణా అందులో పాత్రలే నాచేయి పుచ్చుకుని తీసికెళ్లాయా అనిపిస్తుంది. అందుకు కారణం ఇది కల్పిత గాధ కాదు. నిత్యం మనచుట్టు ఉన్న ఎందరో స్త్రీల జీవితాలు. వీళ్ళందరూ విజేతలు కాదు. కానీ తమకు ఎదురైన సమస్యలకు జీవితాన్ని బలిపెట్టకుండా ఎదురొడ్డి పోరాడారు. అది సామాన్యమైన విషయమేమీ కాదు.

"ఇందాకే చెప్పినట్లు ఈ కథలో పాత్రలన్నీ సజీవమైనవి. రజని, కమల, గ్రేస్, భార్గవి, సయిదా, మాణిక్యం పేరేదైనా, ఊరేదైనా ఒక్కొక్కరిది ఒక్కో కధ. వీరి గురించి ఆలోచిస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో లెక్కలేదు. వీరంతా చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించినవారే.

మన వివాహవ్యవస్థ లో ఉన్న క్లిష్టత మరే సమాజంలోనూ లేదనిపిస్తుంది. అందుకే భార్యగా, జీవితభాగస్వామిగా కాక పోయినా కనీసం తోటి మనిషిగా కూడా చూడ(లే)ని మగవారిలో ఎప్పటికన్నా మార్పు వస్తుందనే ఆశతో, రావాలనే కోరికతో దేవుడిమీద భారమేసి బతుకుతున్నారు.

చదువు, ఉద్యోగం, సమాజంలో గౌరవమైన స్థానం అన్నీ ఉండికూడా శాడిస్టు భర్తలను భరిస్తున్న వాళ్లు ఎంతోమంది. కారణం సోషల్ స్టిగ్మా. పరువు పోతుందని భయం. పిల్లలు తండ్రిలేని వారవుతారనే సంకోచం. ఇవన్నీ కలిసి కష్టమైనా కళ్ళు మూసుకుని కాలంవెళ్లదీస్తున్నారు."

"ఈ సీరియల్ రాయటానికి ప్రేరణ నేను గతంలో పనిచేసిన ఆఫీసులో నాలుగోతరగతి ఉద్యోగి మాణిక్యం. "నా గ్రాట్యుటీ, పి.ఎఫ్. నామినేషన్ మా ఆయన పేరుతోటి ఉంది మేడం. దానిని నా పిల్లల పేర మార్పించాల. జర సాయం జెయ్యుండ్రి" ఒకరోజు నా దగ్గరికి వచ్చి అడిగింది. ఎందుకు? అని అడిగాను. పెళ్లైన దగ్గరనుంచి ఇద్దరు పిల్లల తల్లి ఆయిన తర్వాత కూడా భర్త ఆమెను గొడ్డును బాదినట్టు బాదేవాడు. ఆమె జీతం తాగుడుకు, ఇతర వ్యాసనాలకు ఖర్చుపెట్టేవాడు. కొన్నాళ్ళకి మరో పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టాడు.

ఈమె భర్తని పట్టించుకోక పోవటం వల్లనే అతగాడు పాపం రెండో పెళ్లి చేసుకున్నాడని, ఏ మగాడు మాత్రం ఊరుకుంటాడని ఊళ్ళోవాళ్లు సమాధానం చెప్పుకున్నారు. తన జోలికి రాకపోవటంతో ఆమె అదే చాలనుకుని సొంత కష్టంతో పిల్లల్ని పెంచింది. లోన్ తో ఇల్లు కట్టుకుంది.

పిల్లలు పెళ్లీడుకొచ్చే సమయానికి అతని రెండో భార్య చనిపోయింది. అక్కడ జరుగుబాటు లేకపోవటం, మాణిక్యం పేరు మీద ఇల్లు కూడా ఉండటంతో మళ్ళీ ఆమె పంచన చేరాడు.

"ఎందుకు రానిచ్చావన్న" నా ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు నన్ను ఆలోచనలో పడేసింది. "పోనియ్యమ్మ. నాకు భర్త కాదు గాని నా పిల్లలకి నాన్నే కదా. పెట్టింది తిని గమ్మున ఉండమన్న. నా జోలికొస్తే మంచిగుండదని చెప్పిన. కానీ ఈ మధ్య మల్ల పాతలెక్క తయారయ్యిండు. డబ్బులివ్వలేదని నా పెద్ద కొడుకును కొట్టిపిచ్చిండు. నన్ను రోజు బెదిరిస్తుండు. ఇంకా నాతోని గాదు. అందికే పీ.ఎఫ్., గ్రాట్యుటీ గిట్ల నా పిల్లల పేరుకి మార్సుకుంటా. నడిమిట్ల నాకేదన్న అయినా పికరుండది. లేదంటే వాడు మొత్తం ఖతం బట్టిస్తాడు. నా ఇంట్లకి రానిచ్చెడిది లేదు" అంది.

రోజూ టైంకి ఆఫిస్ కి వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ పని చేసే మాణిక్యాన్ని చూస్తే ఆమె జీవితంలో ఇంతటి కష్టం ఉందని ఎవ్వరు ఉహించలేరు." సభికులు కొనసాగింపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

చదువు, తెలివితేటలు, అందం ఒకదానితో ఒకటి పోటీపడే రజనిని చూస్తే ఇష్టపడని వాళ్ళు ఉండరు. . అన్నిటా ఆమెతో సరిజోడిగా ఉండాలని అమ్మానాన్నలు ఏరికోరి వినోద్ తో ఆమె పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వారానికి అతడు వైవాహిక జీవితానికి పనికిరాడనే పిడుగులాంటి నిజం ఆమెకి అర్ధమైంది. అయినా కుంగిపోలేదు.

ఈ రోజుల్లో వైద్యానికి లొంగనిదేమి లేదనే ధైర్యంతో ప్రయత్నం ప్రారంభించింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు. పైగా ఆత్మన్యూనతతో ఆమేమీద ఎదురుదాడికి దిగేవాడు. సూటిపోటి మాటలతో బాధించేవాడు. వేధించేవాడు. ఒకపక్క వినోద్ ప్రవర్తన, మరోపక్క పేరెంట్స్ కి విషయం ఎలా చెప్పాలి, అనే సందిగ్ధత.

పరిస్థితులు చక్కబడే మార్గం లేకపోవటంతో రెండేళ్ల తన ప్రయత్నానికి స్వస్తి చెప్పి కొత్త జీవితం ప్రారంభించటానికి నిర్ణయించుకుంది." వీరంతా కేవలం సమాజం దృష్టిలో, చట్టప్రకారం మాత్రమే భర్తలు. భార్య పట్ల ఏ పూచీ, బాధ్యతా లేని మహాపురుషులు."

పదహారేళ్లకే ప్రేమపెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కని, వాళ్ళని పోషించటం కోసం ఇళ్లల్లో పనులుచేసుకుంటూ, ఆన్లైన్ జూదాలకి, వ్యసనాలకి డబ్బులివ్వలేదని నిత్యం నరకం చూపించే మొగుణ్ణి వదిలిపోలేక, అభిమానం చంపుకోలేక దినదినగండం గా బతుకుతున్న ఎందరో సయిదాలు, వసంతలు మనకు తారసపడతారు.

నూటికి ఏభై కాపురాలలో ఇదే పరిస్థితి. కొందరు ఆర్ధిక అవసరాల కోసం, మరికొందరు పిల్లల కోసం, ఇంకా కొంతమంది తల్లిదండ్రుల పరువు కాపాడటం కోసం బలవంతంగా గౌరవం, గుర్తింపులేని సంసారాలు చేస్తున్నారు. అయితే వీళ్ళకి బాధల్ని భరించటమే కాదు అవసరమైతే ఎదురుతిరగటం కూడా చేతనవుతుంది.

భార్య అంటే కార్యేషు దాసీ, శయనేషు రంభ గా మాత్రమే భావించి భర్తగా నేను ఏంచేసినా చెల్లుతుందనుకునే మగవాళ్ళు , కాలం ఎప్పుడూ తమకే అనుకూలంగా ఉండదని తెలుసుకునే రోజు వస్తుంది. ఈ విషయాన్ని సీరియల్ ద్వారా చెప్పాలని నేను చేసిన చిన్న ప్రయత్నాన్ని ఆమోదించి, ఆదరించిన పాఠకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో మనసు విప్పి మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు." " కమల పాత్ర చిత్రణ ఆకట్టుకునేవిధంగా ఉంది. ముగింపు చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మేడం" , అని అడిగిన విలేకరులకు "ప్రతి పాత్ర వాస్తవమైనదే. పేర్లు మాత్రమే మార్చాను. భవిష్యత్ ప్రణాళిక త్వరలోనే తెలియజేస్తాను" అని బదులిచ్చింది.

***** వేగంగా ముందుకు సాగుతున్న కారుతో పోటీపడుతూ హేమలత ఉరఫ్ కమల ఆలోచనలు కూడా అంతే వేగంగా వెనక్కి వెళుతున్నాయి.

హేమది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగమే ఆధారం. తను చాలా సాదాసీదా అమ్మాయి. పెద్దపెద్ద ఆశలు, ఆశయాలు ఏమి లేవు. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల వల్ల అమ్మానాన్నలు తరచుగా గోడవపడటం చూసి ఉద్యోగం దొరికిన తర్వాతే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది.

డిగ్రీ అయిన వెంటనే అనుకున్న ప్రకారం మంచి ఉద్యోగం వచ్చింది. ఆరోజు తన జీవితంలో మరచిపోలేదు. ఎంతో ఎత్తుకి ఎదిగిన అనుభూతి. తన పంతం నెగ్గింది కాబట్టి అమ్మానాన్న సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ తాహతుకు తగ్గ కుటుంబం, అర్ధం చేసుకునే మనిషి అయితేచాలు, జీవితం సాఫీగా సాగిపోతుందనేది హేమ అభిప్రాయం. అందువల్ల పెళ్ళికొడుకుని చూడటానికి ఇంట్లోవాళ్ళు పెద్ద కష్టపడలేదు.

"దూరపు బంధువులు. అబ్బాయికి చెడు అలవాట్లేమి లేవు. గౌరవమైన కుటుంబం. ఉద్యోగంచేసే అమ్మాయి కావాలను కుంటున్నారు." రెండువైపులా ఈక్వేషన్ కుదరటంతో పెళ్లి ముహుర్తాలు పెట్టేసుకున్నారు.

హేమ స్వతహాగా కలుపుగోలుగా ఉంటుంది కాబట్టి అత్తగారింట్లో తొందరగానే అలవాటుపడింది. అత్తయ్య, మామయ్య, మరిది అందరూ ఆప్యాయంగా ఉండేవారు. ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరగటంలోనే నెలరోజులు ఎలా గడిచాయో తెలీలేదు. "మా అమ్మా నాన్నల అవసరాలు నువ్వే చూసుకోవాలి. ఇంట్లో ఏమన్నా గొడవ జరిగినా నువ్వే సద్దుకుపోవాలి. నానుంచి పెద్దగా ఏమి ఆశించద్దు." హానీమూన్లోనే సుమంత్ తన ఆర్డర్ లాంటి అభిప్రాయం చెప్పాడు. తనుకూడా సంతోషంగా ఒప్పుకుంది.

ఆఫీసు పని, ఇంటిపని రెండింటిని బాలన్స్ చేసుకోవటానికి ఆర్నెల్లు పట్టింది. ఈలోగా సుమంత్ అలవాట్లు, ఆలోచనలు అర్ధం కాసాగాయి. అతనికి కుటుంబ బాధ్యతలు, బాదరబందీ లేని జీవితం కావాలి. అందుకే పెళ్లి అంటే వాయిదా వేస్తూ వచ్చాడు. కానీ ఇంట్లో ఒత్తిడితో ఒప్పుకున్నాడు.

అతని మనస్తత్వం అర్ధమౌతున్న కొద్ది అతని మూడుని బట్టి జాగ్రత్తగా నడుచుకోవటం అలవాటు చేసుకుంది. తన ఫీలింగ్స్ ని చెప్తే అర్ధం చేసుకుంటాడని, మారతాడని ఓపిగ్గా ఎదురుచూసింది. కానీ రెండేళ్లు గడిచేసరికి అతడు మారడనే విషయం నిర్ధారణ అయింది.

తనలో మునుపటి ఉత్సాహం తగ్గుతోంది. జీవితం యాంత్రికంగా ఉందనుకుంటుండగా గర్భవతి అయింది. పట్టరాని ఆనందం . మళ్ళీ జీవితం పట్ల కొత్త ఆశ మొలకెత్తింది. పాప పుట్టిన తర్వాత దాని పెంపకం, ఇల్లు, ఆఫీసు ఆలోచించటానికి తీరికలేదు. ఎప్పటిలాగే అన్ని ఒక్కటే చూసుకోవాలి.

తన అలవాట్లు, ఆలోచనలు, ఆరోగ్యం ఏ విషయంలోనూ అతనికి సంబంధం లేదు. పెళ్ళైన ఇన్నేళ్లలో తనని గురించిన ఒక్క మంచి మాట అతని నుండి వినలేదు. కష్టంలో ఓదార్పులేదు. సంతోషం పంచుకున్నదీ లేదు. అంతా యాంత్రికం. అతని సుఖం అతనిది. తన కష్టం తనది. కేవలం ప్రపంచం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలు.

తామిద్దరు ఎందుకు కలిసి ఉంటున్నారని ఈ ఇరవై ఏళ్లల్లో కొన్ని వేలసార్లు ప్రశ్నించుకుంది. దానికి సమాధానం "స్నేహ".

తమ మధ్య క్రమేపీ మాటలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు తన దృష్టంతా కూతురు స్నేహ భవిష్యత్తు మీదే. చూస్తుండగానే ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అత్తయ్య మామయ్య నాలుగేళ్ళ తేడాతో కాలం చేశారు. మరిది పెళ్లై అమెరికాలో సెటిల్ అయ్యాడు. స్నేహ ఎం.టెక్. పూర్తి చేసి ఉద్యోగం లో చేరింది.

హానీమూన్లో సంపత్ కిచ్చిన మాటను తను నిలబెట్టుకుంది. కానీ పెద్దల సాక్షిగా పెళ్లిలో చేసిన ప్రమాణాలను మాత్రం సంపత్ గుర్తుకూడా పెట్టుకోలేదు. ఈ కాలంలో అతని వ్యాపారం బాగా డెవెలప్ అయిందని మాత్రమే తెలుసు కానీ వివరాలు తనకి తెలీదు. ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మాత్రమే తను భార్య. అంతవరకే తమ సంబంధం.

ఆర్ధికంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఎప్పుడు అతని సపోర్ట్ తనకి లేదు. ఒక కప్పు కింద బతుకుతున్న ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తాము. బాధ్యతలు తగ్గి ఖాళీ సమయం దొరకడంతో మళ్ళీ ఆలోచనలు తనపై దాడి మొదలెట్టాయి. వాటినుండి తప్పించుకోవటానికి ఎప్పుడో కాలేజీ టైంలో ఉన్న హాబీని మళ్ళీ ప్రారంభించింది. వ్యాపకం కోసం మొదలైన రచనా వ్యాసంగం సీరియల్ దాకా వస్తుందని తను ఎప్పుడు అనుకోలేదు.

ఒక ఆదివారం పొద్దున్నే స్నేహ తన పెళ్లి విషయం కదిపింది. తన కొలీగ్ రఘుతో సంవత్సరంగా ప్రేమలో ఉన్నానని, తొందరలో పెళ్లిచేసుకోవాలను కుంటున్నామని చెప్పింది. ఇలాంటి వార్త కోసమే ఎదురుచూస్తున్న హేమ ఎంతో సంతోషించింది. పెళ్లి, తర్వాత కొత్త జంట అమెరికా వెళ్లిపోవడం అంతా వెంటవెంటనే జరిగిపోయాయి. మళ్లీ తనకి కాలం ఆగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువైంది.

స్కైప్ లో హేమ మాటలు వింటున్న స్నేహ క్షణకాలం బిత్తరపోయింది. అయితే వెంటనే తేరుకుని "అమ్మా నీకు ఎలా బాగుంటుందనుకుంటే అలా చెయ్యి. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతకాలానికి ఇప్పుడెందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనిపించింది? కేవలం తెలుసుకోవాలని అడుగుతున్నాను. అంతే".

"కొంతకాలం మారతాడని ఆశ. ఆ తర్వాత నీ కోసం. ఇప్పుడు నిర్ణయించుకునే టైం వచ్చిందని అనుకున్నాను."

"నాన్నకి చెప్పావా"

"లేదు చెప్పాలి. కానీ నిర్ణయం అయిపోయింది."

తన నిర్ణయం చెప్పగానే సంపత్ రియాక్షన్ హేమ ఊహించిందే. ఇన్నాళ్లూ లేని ధైర్యం ఇప్పుడు చేస్తుందని ఊహించకపోవటంతో అతని అహం తీవ్రంగా దెబ్బతింది. "నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. " అనేసి వెళ్ళిపోయాడు. మరో వారం రోజులకి హేమలత మకాం సింగిల్ ఫ్లాట్ అపార్ట్మెంట్ కి మారిపోయింది.

కిర్రుమంటూ వేసిన సడన్ బ్రేక్ శబ్దానికి హేమలత వర్తమానంలోకి వచ్చింది.

"ఏమైంది రాజు?"

"ఎవరో పెద్దమనిషి అడ్డమొచ్చింది మేడం".

"సరే జాగ్రత్తగా చూసుకుని నడుపు".

మళ్ళీ ఆలోచనలు ఆమెను లొంగదీసుకున్నాయి.

హేమ రిటైర్మెంట్ రోజు స్నేహితులు, సహోద్యోగుల ప్రేమ పూరితమైన మాటలు,సత్కారాలతో సందడిగా గడిచింది. పెన్షన్ కాయితాలు అందుకుని సంతకం పెట్టింది.

తన బాధ్యతలైపోయాయి. ఇంతకాలం స్నేహ కోసం, సమాజం కోసం ఒక కృత్రిమ జీవితాన్ని గడిపింది. ఇట్స్ హై టైం. తన కోసం తాను బతకాలి. కాదు కాదు జీవించాలి. స్వేచ్చగా, ఎటువంటి అడ్డుగోడలు లేని ప్రపంచంలోకి పయనించాలి. ఇదిగో ఇలా మొదలైన తన సెకండ్ ఇన్నింగ్స్ లో అప్రయత్నంగానే తనలాంటి ఆడవాళ్ల జీవితాలమీద దృష్టి పెట్టింది. అప్పుడే సుందరం గారి పట్టుదలతో తన కర్తవ్యానికి బీజం పడింది. తన ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు అర్థవంతంగా కొనసాగించాలి. అవును, తనలో ఆశలు చిగుళ్లు తొడుగుతున్నాయి. అవి శాఖోపశాఖలుగా విస్తరించటానికి ఎంతో కాలం పట్టదు.

********

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

814 views2 comments
bottom of page