top of page

ఇదే బంధమంటే


Ide Bandhamante Written By Subbalakshmi Garimella

రచన : గరిమెళ్ళ సుబ్బలక్ష్మి


పొద్దున్నే రాజారావు, సుమతి కాఫీ తాగుతుంటే ఇంటిముందు ఆగిన కాబ్ లోంచి కూతురు నీల దిగి, విసురుగా ఇంట్లోకి రావడం కనిపించింది. భర్త చైతూ దగ్గరికి బెంగుళూరు వెళ్ళి ఇంకా మూడురోజులు కూడా కాలేదు. అంతలోనే నీల మళ్ళీ ఇలా చిటపటలాడుతూ వచ్చిందేమిటా అని భార్యాభర్తలిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. నీల ఇదేమీ పట్టించుకోకుండా “మామ్.. స్ట్రాంగ్ కాఫీ..” అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.

బెంగుళూరు…

చైతూ అని పిలవబడే చైతన్య పొద్దున్నే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తండ్రి రాఘవ చైతూని చూసి, “వాకింగ్ కి వెడదాం.. రా.. “ అన్నాడు. వస్తావా అని అడగకుండా ఏకంగా రమ్మంటున్నాడంటే తండ్రి తనకేదో హితబోధ చెయ్యడానికే అనుకున్న చైతూ విసుగ్గా మొహం పెట్టేడు.

“ఊ.. నడు..” అంటున్న తండ్రి మాటలని కాదనలేక అయిష్టంగానే రాఘవతో బయల్దేరేడు చైతూ.

హైద్రాబాదు…

“ఏమైందే! మళ్ళీ చైతూతో ఏవన్నా గొడవ పడ్దావా!” “నేనేదో కావాలని దెబ్బలాట వేసుకుంటున్నట్టు మాట్లాడతావేంటీ! చైతూ మటుకు నన్నేవన్నా అనొచ్చా! నేను మటుకు ఏమీ అనకూడదా!” గయ్యిమంది తల్లి మీద నీల.

“ఎందుకనకూడదూ!..మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు.. కానీ.. అది పూర్తిగా మీ ఇద్దరిమధ్యనే ఉండాలి కానీ ఇలా ఇళ్ళూ, ఊళ్ళూ దాటి రాకూడదు.”

“ఓహో.. ఇప్పుడు తమరు నాకు సూక్తి ముక్తావళి వినిపిస్తారా యేంటీ!” వేళాకోళంగా అంది. “అవన్నీ వినే వయసు నీకెప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పింది మేం వినడమే మిగిలింది.”

“అయితే విను. నేనింకక్కడికి వెళ్ళను. మా కంపెనీ బ్రాంచ్ హైద్రాబాదులో కూడా ఉంది. ఇక్కడికి మార్చేసుకుంటాను. రేపే వెళ్ళి లాయర్ ని కలుస్తాను. హాయిగా నాక్కావల్సినట్టుంటాను.” “చాలా బాగుంది. మంచి విషయం చెప్పేవు. నీక్కావల్సినట్టంటే ..” తల్లి అడిగిన ప్రశ్నకి విసురుగా జవాబు చెప్పింది నీల. “ఏవుందీ.. కంపెనీలో నాకు మంచి రెప్యుటేషన్ ఉంది. మా హెడ్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. వన్ యియర్ లోనే పే ఇంత హైక్ చేసేడంటే ముందు ముందు ఇంకా ఎంత పెరుగుతుందో..ఆ చైతూకి ఇదంతా చూసి కుళ్ళు.. అందుకే నన్ను ఉద్యోగం మానెయ్యమంటున్నాడు..” కడుపులో ఉన్న కసి నంతా దింపేసుకుంది నీల.

“మిగిలిన వాళ్ళకన్న నువ్వేం ఘనకార్యం చేసేవని నీకంత పే పెంచేరూ!”

“కమాన్ మామ్.. నా ఎం.బి.యె. డిగ్రీ రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచని నీకు తెలీదా! మా సెక్షన్ లో అందరిచేతా అంతపని ఎలా చేయించగలుగుతున్నానూ… ఆ క్వాలిఫికేషన్ వల్లేకదా! ఎవరెవరు ఎలాంటివారో, ఎవరి చేతిలో ఏ నైపుణ్యం వుందో, ఎవరు ఎక్కువ పని చేస్తారో.. ఎవరు తెలివిగా పని చేస్తారో.. ఎవరెవరికి ఎలాంటి ఆశలు చూపించి పని చేయించుకోవాలో, మధ్యలో సమస్యలు వచ్చిన్నప్పుడు ఎలా వాటిని సామరస్యంగా పరిష్కరించాలో….ఇలాంటివన్నీ ఆ కంపెనీలో నేనే బాగా చేస్తాను. అందుకే నాకీ ప్రత్యేక గుర్తింపు. అలాంటి డబ్బూ, గౌరవం ఇచ్చే పని మానేసి, ఇంట్లో వాళ్ళమ్మకి కాళ్ళొత్తుతూ కూర్చోమంటాడా చైతూ.. ఇదేవన్నా బాగుందా!” కడుపులో వున్న బాధనంతా తల్లి దగ్గర కక్కేసిన నీల నిస్సత్తువగా కళ్ళు మూసుకుని మంచం మీద వెనక్కి వాలింది.

“అంత పెద్ద కంపెనీలో అన్ని రకాల మనుషులని ఒకతాటికి తెచ్చి బ్రహ్మాండంగా పని చేయించే నువ్వు నీ ఇంట్లో నలుగురి మధ్య సామరస్యం తెచ్చుకోలేకపోతున్నావా!” సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి ఒక్కసారి తుళ్ళిపడి లేచి కూర్చుంది నీల.

బెంగుళూరు…

పార్కులో బెంచీమీద కూర్చున్నారు రాఘవ, చైతూ. “నీల ఎందుకు వెళ్ళిపోయిందీ!” సూటిగా అడిగేడు రాఘవ కొడుకుని.

“ఒళ్ళు పొగరెక్కి..” పళ్ళు పిండుకున్నాడు చైతూ.

“కాస్త సంస్కారంతో మాట్లాడు. నీల నీ బానిసేం కాదు నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి. మనింటి కొచ్చిన శ్రీ మహాలక్ష్మి..”

“ఆ.. శ్రీ మహాలక్ష్మే.. కాకేం.. అందుకే సంపాదిస్తున్నానని పొగరు..”

“తన పొగరు నీకెక్కడ కనిపించింది..” సౌమ్యంగా అడిగేడు రాఘవ.

“కనిపించకేం..తను ఈ ఇంటికోడలు కదా! ఈ ఇంట్లో పనిపాటల్లో తను కూడా ఓ చెయ్యి వెయ్యాలా వద్దా! పాపం అమ్మే పొద్దున్నే లేచి అందరికీ ఏం కావాలో చూస్తోంది. ఆ హడావిడి టైమ్ లోనైనా కాస్త అమ్మకి సాయంగా వెళ్ళి ఓ కూర తరిగో, టిఫిన్ చేసో సాయం చెయ్యొచ్చుగా.. అబ్బే.. ఆ టైమ్ లో కూడా ఆవిడగారికి కంపెనీ నుండి ఫోన్లూ, ఈవిడగారి సలహాలూ.. ఎంతసేపూ కంపెనీ, పనిదృష్టీ తప్పితే అసలు ఇంటి దృష్టి లేనే లేదు. అమ్మ మటుకు ఎన్నాళ్లని చేస్తుందీ పాపం.. పెద్దదౌతోంది కదా.. నడుం నెప్పీ, కాళ్ల నెప్పులూ మొదలయ్యాయా..కాస్తైనా రెస్టు కావాలి కదా! అందుకే ఈ శ్రీ మహాలక్ష్మిని ఆ వెధవుద్యోగం మానైమన్నాను. మనకేం లోటనీ గడవకపోడానికీ..” “ఉద్యోగం చెయ్యాలా మానాలా అని నిర్ణయించుకోవల్సింది నీల కానీ నువ్వు కాదు. తన మీద అధికారం చెలాయించడానికి నువ్వెవరూ!” సూటిగా రాఘవ అడిగిన ప్రశ్నకి తెల్లబోయేడు చైతూ. “ఎవరినేంటీ.. తన మొగుడిని కాదా! ఏం మొగుడన్నాక ఆమాత్రం అధికారం ఉండదా …!” “మొగుడంటే అధికారం కాదు బాధ్యత. తన కన్నవాళ్లని, ఉన్న ఊరినీ వదిలి మన వంశం నిలబెట్టడానికి మనింటికి వచ్చిన మహలక్ష్మి. అలాంటి అమ్మాయిని ఆప్యాయంగా చూసుకోవాలి తప్పితే అధికారం చెలాయింఛకూడదు.”

“హబ్బో.. పాతకాలంనాటి కబుర్లు చెప్పకు డాడ్. ఈ రోజుల్లో అమ్మాయిలు సంపాదిస్తున్నామని మహా పొగరుగా ఉన్నారు. వాళ్లని ముందే అదుపులో పెట్టుకోకపోతే నెత్తికెక్కి కూర్చుంటారని అమ్మ చెప్పిందిలే.” “ఓహో.. ఇదంతా మీ అమ్మ బోధన అన్న మాట.”

“ఏం.. తప్పేముందీ.. నా సంతోషమే కదా అమ్మకి కావల్సింది..”

“నీ సంతోషమొకటే కాదు, నువ్వు చేజారిపోకుండా ఉండడం కూడా మీ అమ్మకి కావల్సిందే..” “అదేంటీ!”

“కాపోతే మరేంటీ! ఇన్నేళ్ళూ నిన్ను కంటికి రెప్పలా ప్రేమగా పెంచుకుంది. ఇప్పుడేమో కోడలు వచ్చేక ఎక్కడ ఆ పిల్లకి దగ్గరైపోతావోనన్న బెంగ.. అత్తగారయిన చాలామంది తల్లుల్లో ఉండే పొసెసివ్ నెస్. అదే మీ అమ్మకీ ఉంది. అందుకే కోడలు తనకి సాయం చెయ్యటంలేదనే భావం నీలో కలిగించి నిన్ను కోడలిని తప్పు పట్టేలా చేస్తోంది. కానీ ఇంతకీ నీ తెలివేమయినట్టు! ఎదుటిమనిషి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతోందో గ్రహించలేవా!” సూటిగా అడిగిన రాఘవ ప్రశ్న కోపం తెప్పించింది చైతూకి.

“అమ్మనలా అనుకోడం తప్పు డాడ్..” అన్నాడు.

“ఇంకెలా అనమంటావ్! అప్పటివరకూ ప్రేమగా పెంచిన అమ్మని నెత్తిమీద పెట్టుకుని, తనని నమ్ముకుని వచ్చిన భార్యని హృదయంలో పెట్టుకుని చూసుకోగలిగినవాడే అసలైన మగవాడు. తల్లికివ్వాల్సిన గౌరవం తల్లికిస్తూ, భార్య కందివ్వాల్సిన ప్రేమ భార్య కందిస్తూ ఇద్దరి మధ్యా సమన్వయం తేగలిగినవాడే మగవాడు.”

“పోనీ నువ్వన్నదే సరైనదనుకుందాం. నేను నీలని జాబ్ మానెయ్యమన్నాను కదా! నా మాట మీద గౌరవం ఉంచి మానెయ్యొచ్చు కదా! ఇంట్లో అమ్మ వెనకాలే ఉండి ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటే చాలు కదా!”

“హూ…నీ ఆలోచన ఇంత అధ్వాన్నంగా ఉంటుందనుకోలేదు..”

“డాడ్..” కోపంగా అన్నాడు చైతూ.

“మరి లేకపోతే..ఇంత చదువుకుని, ఇన్ని తెలిసున్నవాడివి… కేవలం నీల నీ భార్య అవడం వల్ల మర్చిపోతున్నావా యేంటీ! నీలలో ఉన్న ఆ టాలెంట్ చూసేకదా నువ్వు మురిసిపోయి పెళ్ళి కొప్పుకున్నది. చాలా తెలివైనవారు మాత్రమే నీల చదువుకున్నంత గొప్ప చదువు చదవగలరు. అందులో కొద్దిమంది మాత్రమే అటువంటి జాబ్ కి సెలెక్ట్ అవగలరు. అందులో ఇంకా తక్కువమంది అంత మంచి పేరు తెచ్చుకోగలరు. ఒక కంపెనీలో పెద్ద పొజిషన్ లో వున్న నీలని నువ్వు కేవలం ఒక చిన్న ఇంటి బాధ్యతలకు కుదించుకుపోయి ఉండమనడం ఎంత సబబుగా ఉంటుందో ఆలోచించు. ఇంటి బాధ్యతలని చూసుకుందుకు ఇంట్లో రిటైరయిన నేనూ, అనుభవం ఉన్న మీ అమ్మా ఉండనే ఉన్నామాయె. అటువంటప్పుడు నువ్వెలా ఆలోచించాలీ.. మాకు శ్రమ తగ్గాలంటే ఒక వంటమనిషినీ, ఇంకో పనిమనిషినీ ఎక్కువ పెట్టి మమ్మల్ని సుఖపెట్టాలి. అంతేకానీ కేవలం వంటమనిషీ, పనిమనిషీ చేసే పనులకి కోడలుగా వచ్చిన పాపానికి నీలకి అంటగట్టడం అన్యాయం. అంత చదువూ, తెలివితేటలూ ఉన్న పిల్ల వాటినన్నింటినీ అణిచేసుకుని ఇంట్లో పడుండడమంటే ఉంటుందా!... ఉండదు.. అందుకే వెళ్ళిపోయింది.”

హైద్రాబాదు…

“అంత పెద్ద కంపెనీలో అన్ని రకాల మనుషులని ఒకతాటికి తెచ్చి, బ్రహ్మాండంగా పని చేయించే నువ్వు నీ ఇంట్లో నలుగురి మధ్య సామరస్యం తెచ్చుకోలేకపోతున్నావా!” సూటిగా ఆ మాట అడిగేసి, కాఫీ ఇచ్చేసి అక్కడినుంచి వెళ్ళిపోయిన సుమతి మాటలు నీలని బాగా ఆలోచించేలా చేసాయి. నిజమేకదా! కంపెనీలో అన్నిరకాల వయసున్నవారిమధ్యా, వివిధరకాల మనస్తత్వాల మధ్యా సమన్వయం సాధించగలిగిన తను ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యుల మధ్య ఎందుకు తేలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు తనని కుటుంబంలో ఒకదానిగా అంగీకరించకపోవడం వల్ల.. ఎంతసేపూ వాళ్ళు ఆర్డర్లు వేస్తారు తప్పితే తన గురించి ఆలోచించరు కనక.. వెంటనేలేచి తల్లి దగ్గరికి పరిగెట్టింది. “వాళ్ళెప్పుడూ నన్ను వాళ్ళల్లో ఒకదానిగా చూడలేదు. ఎంతసేపూ ఇలా చెయ్యి… అలా చెయ్యి అని ఆర్డర్లు వెయ్యడం తప్పితే నువ్వేమనుకుంటున్నావ్ అని ఒక్కసారి కూడా అడగలేదు. ఏం… ఆమాత్రం నా అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకా ఇంట్లో ఉండదా!”

నీల మాటలకి నవ్వింది సుమతి. “హక్కుల గురించి మాట్లాడేముందు బాధ్యతలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఆ ఇంటికోడలిగా నువ్వేం బాధ్యతలు నిర్వహించేవని వాళ్ళు నిన్ను అభిప్రాయం అడగడానికి. ఎప్పుడైనా మీ అత్తగారికి ఏం కావాలో చూసేవా! ఏ పూటైనా ఏదైనా చేస్తానని చెప్పేవా!”

“చెయ్యడానికి వాళ్ళింట్లో పధ్ధతులన్నీ వేరమ్మా.. నాకు తెలీదు. వేలెడితే మళ్ళీ తప్పు పట్టుకుంటారు..”

“అందుకని అసలు పట్టించుకోడమే మానేస్తావా! కనీసం మీ అత్తగారికి శ్రమ తగ్గించడానికి ఏవైనా ప్రయత్నమైనా చేసేవా! ఇంతకాలం ఆవిడ మాటమీద నడిచిన ఇంటిని నువ్వొచ్చావని ఒక్కసారి నీ చేతిలో పెట్టెయ్యడానికి ఇదేమీ ఆఫీసులో ఉద్యోగం కాదు…ప్రేమలూ, భావావేశాలూ కలబోసి పెంచుకున్న కుటుంబ బంధం. నిన్ను నీ కంపెనీలో పెద్దదాన్ని చేసి సలహాలు అడుగుతారేమో కానీ ఇంట్లో నువ్వు వాళ్లందరికన్నా వయసులోనూ, అనుభవంలోనూ కూడా చిన్నదానివే. ఉద్యోగంలో చేరేముందు నువ్వెలా ట్రైనింగ్ తీసుకున్నావో ప్రస్తుతం అలాగే నువ్వా ఇంట్లో ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నావు. అదే ఏదైనా కంపెనీలో ట్రైనింగ్ పేరియడ్ లో వుంటే నువ్వెలా క్రమశిక్షణతో వుంటావో అలా ఉండాలి అత్తారింట్లో కొత్తలో.”

“నాకీ పాత చింతకాయపచ్చడి కబుర్లు చెప్పకు. నాకేం తక్కువని అలా ఉండాలీ! చైతూతో సరిగ్గా సంపాదిస్తున్నాను తెల్సా! అయినా కంపెనీలో ఇచ్చినట్టు వాళ్ళేమైనా నాకు జీతం ఇస్తున్నారా అంత డిసిప్లిన్డ్ గా ఉండడానికీ!”

“లెక్కలు పెట్టుకునేలాగా నీకు జీతభత్యాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఆ ఇంటికోడలిగా అంతకు మించిన సోషల్ స్టేటస్ నీకొచ్చిందని మర్చిపోకు. ఎప్పుడైతే ఆ ఇల్లు దాటి వచ్చేవో అప్పుడే సొసైటీలో నీ స్టేటస్ పడిపోతుంది. నీకు వచ్చే డబ్బు చూసి అందరూ నీ ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడొచ్చు.. కానీ పక్కకి వెళ్ళేక ఆ నవ్వినవాళ్ళే నొసలుతో వెక్కిరిస్తారు.. ఆ మాత్రం తెలీకుండా వుంటావనుకోను.”

“నలుగురూ ఏమనుకుంటే నాకేం..నేనెవర్నీ లెక్క చెయ్యను. నాకేం కావాలో నాకు తెల్సు..” “నీకేం కావాలో నీకు తెలీటం లేదన్నదే నా బాధ.. నువ్వింకా జీవితంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టేవు. నీ జీవితమంతా ముందే వుంది. డబ్బుతోనే జీవితాలు వెళ్ళిపోతాయనుకున్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేనూ, నావాళ్ళూ అనే బంధం లేకపోతే కొన్నాళ్ళకి నీకు జీవితం మీదే విరక్తి పుడుతుంది..”

“హూ.. అంతా ట్రాష్.. లేనిపోని విషయాలు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. ఎవర్ని మనం దగ్గరికి తీస్తే వాళ్ళే మనవాళ్ళౌతారు. ఈ సంసారం, కుటుంబం అంటూ నన్ను ఆ రొంపిలోకి లాగకు..”

“ఓహో.. అలాగా.. మరి ఇప్పుడు నువ్వు ఏ బంధముందని ఈ రొంపిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేవూ!” సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి తెల్లబోయింది నీల.

బెంగుళూరు…

“అంత చదువూ, తెలివితేటలూ ఉన్న పిల్ల వాటినన్నింటినీ అణిచేసుకుని ఇంట్లో పడుండడమంటే ఉంటుందా!... ఉండదు.. అందుకే వెళ్ళిపోయింది.” అన్న రాఘవ మాటలు వింటూ చైతూ ఊరుకోలేకపోయేడు.

“ఆ మాత్రానికే చెప్పా చెయ్యకుండా పుట్టింటికి పరిగెట్టాలా! జాబ్ మాననూ అని నాతో ఖచ్చితంగా చెప్పొచ్చుకదా!”

“చెప్తే నువ్వు వినవు కదా! రిజైన్ చేసేవరకూ ఊరుకునేలా లేవని, ఇంక నీతో వాదించి లాభం లేదని వెళ్ళిపోయిందేమో.”

“అలా కాపరం వదిలి వచ్చేస్తే పేరెంట్స్ ఊరుకుంటారా! నాలుగు తిట్టి వాళ్ళే తీసుకొచ్చి దింపుతారు..”

“నువ్వేకాలంలో ఉన్నావురా.. ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయేయి. నువ్వన్నీ మాకు చెప్పే చేస్తున్నావా! అలాగే అమ్మాయిలు కూడానూ. పేరెంట్స్ చెప్పడం పిల్లలు వినడం అనే రోజులు ఎప్పుడో పోయేయి. ‘అంతా నా ఇష్టమే..’ అంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అయినా ఇలా కోడలు నువ్వు ఉద్యోగం మానైమంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని మీ అమ్మకి తెల్సా!”

“తెలీదు.. నీల ఏదంటే వాళ్లమ్మగారు ఎందుకో అర్జంటుగా రమ్మన్నారు.. అందుకే వెళ్ళిందని చెప్పేను పొద్దున్న.”

“చూసేవా.. అసలు సంగతి ఎందుకు చెప్పలేదు. చెపితే మీ అమ్మ బాధపడుతుందని నీ ఉద్దేశ్యం.. నిజమే.. ఆ తల్లికి నువ్వు దూరమైపోతావేమోనన్న ఆరాటం తప్పితే మీరిద్దరూ విడిపోవాలని అస్సలు అనుకోదు. ఈ సంగతి తెలిస్తే మీ ఇద్దరి గురించీ అందరి కన్నా ఎక్కువ బాధపడేది అమ్మే..”

“నిజవే డాడ్.. నువ్వు చెప్తుంటే అలాగే అనిపిస్తోంది. నువ్వన్నట్టు పనికి ఇంకో నలుగురు మనుషులని పెట్టుకుందాం.. అంతేకానీ అంత టాలెంటెడ్ నీలని ఉద్యోగం మానమనడం నిజంగా తప్పే.. మరిప్పుడు ఏం చేద్దాం డాడ్.. నువ్వు నీలకి ఫోన్ చేసి రమ్మని చెప్పకూడదూ!” “ఊహూ.. నేనెందుకు వస్తాను మీ మధ్యకీ..”

“అదికాదు డాడ్.. ఎంతైనా మగవాణ్ణి కదా! ఈగో ప్రాబ్లమ్ అంటూ ఒకటుంటుంది కదా!”

“ఎంత కలిసిమెలిసి చదువుకుని ఆడవాళ్లలోని గొప్పతనాన్ని గుర్తించినా మగవాడిలో ఈ ఈగో అన్నది మటుకు పోవటంలేదు. ఇప్పటికైనా పోగొట్టుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్యా ఉన్న సమస్య కనక మీరిద్దరే తేల్చుకోవాలి. తప్పదు..”

హైద్రాబాదు…

“ఓహో.. అలాగా.. మరి ఇప్పుడు నువ్వు ఏ బంధముందని ఈ రొంపిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేవూ!” సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి తెల్లబోయిన నీల సమాధానం చెప్పలేక తలవంచుకుంది.

“మామ్.. నువ్వే చెప్పు.. నేను ఉద్యోగం మానెయ్యడం నీకు భావ్యంగా అనిపిస్తోందా!”

“లేదు.. నువ్వు అంత మంచి ఉద్యోగాన్ని మానెయ్యక్కర్లేదు. కానీ దానికోసం కాపురాన్ని వదిలేసుకోవల్సిన అవసరం కూడా లేదు. చైతూ నిన్ను ఉద్యోగం మానెయ్యమనడమూ, నువ్వు ఇలా వచ్చెయ్యడమూ…మీరిద్దరూ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు. బహుశా ఇప్పటికే నీకు తెలిసుంటుంది ఆ విషయం. కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే ఈ విషయాన్ని మీరిద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోగలరు. ఆ మార్గాలేమైనా ఆలోచించు.”

“మామ్.. అయితే ఒకసారి ఫోన్ చేసి చైతూతో మాట్లాడతావా!”

“ఊహు.. నేను మాట్లాడను. నేను చెపితే నువ్వు ఇల్లు వదిలి రాలేదు. నీ అంతట నువ్వే వచ్చేవు. ఇది మీ ఇద్దరూ మాత్రమే తేల్చుకోవలసిన విషయం. మూడో మనిషిని భార్యాభర్తల సమస్యల మధ్యకి లాగడం మూర్ఖత్వం. నువ్వే ఆలోచించుకుని ఏం చెయ్యాలో చెయ్యి.”

“నా అంతట నేను వెడితే చైతూకి లోకువైపోతానేమో!”

“లోకువే అవుతావో నెత్తిమీద దేవతవే అవుతావో.. పూర్తిగా మీ ఇద్దరి మధ్యా వున్న విషయమది.” “ఐతే సాయంత్రం ఫ్లయిట్ కి వెడతాను..”

“నీ ఇష్టం.”

మొబైల్ లో బీప్ సౌండ్. “మామ్.. చైతూ మెసేజ్ చేసేడు.. ఈవినింగ్ ఫ్లయిట్ కి వస్తున్నాట్ట..”..సంతోషం నిండిన గొంతు..

“నిజమా!”

“ఊ.. నిజం.. నేను ఎయిర్ పోర్ట్ కి వెడతాను. రాత్రి డిన్నర్ కి హైద్రబాదీ బిర్యానీ చెయ్యి.. చైతూ కిష్టం..” మందారంలా విచ్చుకున్న నీల మొహం చూసి మురిసిపోయింది సుమతి.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


189 views2 comments
bottom of page