top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

ఇడ్లీ పాత్ర



'Idli Pathra' Written By Srinivasarao Jidigunta

రచన : జీడిగుంట శ్రీనివాస రావు








“అమ్మా! యిటు రా, నాన్న రమ్మంటున్నారు” అని తల్లిని పిలిచింది శ్రీలక్ష్మి.

“ఆ.. వస్తున్నా” అంటూ తడి చేయిని కొంగుకి తుడుచుకుంటూ భర్త సుబ్బారావు దగ్గరికి వచ్చింది జానకి.

లాప్టాప్ లో ఇడ్లీ పాత్ర చూపిస్తూ “యిది ఎలా వుంది?” అని ఆడిగాడు భార్యని.

“ఫోటోలో చూడటానికి బాగానే వుంది. అయినా యిప్పుడు మనకెందుకు? శుభ్రంగా మన పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన ఇడ్లీపాత్ర వుందిగా!” అంది జానకి.

“అమ్మ ఏదీ కొననియ్యదు నాన్నా! మన ఇడ్లీపాత్ర లో ఇడ్లీలు తినాలంటే డోకు కూడా వస్తుంది. కొత్తది కొందాము” అని కూతురు అడగటం విని, “వేసినప్పుడల్లా నాలుగు ఇడ్లీలకి తక్కువ తినరు. అలాంటిది మన ఇడ్లీ పాత్రకి వంక పెడతావా? యిప్పుడు అనవసరంగా ఇంకొకటి కొనటం దండగ. అయినా మీ తండ్రి కూతుళ్ళకి ఆదివారం వస్తే చాలు ఆన్ లైన్ లో ఏ వస్తువు కొందామా అని చూడటం అలవాటైపోయింది” అంటూ కూతురిని గదమాయించి వంట గదిలోకి వెళ్ళింది జానకి.

“యిదీ వరస! మీ అమ్మ వద్దన్న తరువాత యింకా ఏమిచేస్తాం? పద.. ఆలా గార్డెనింగ్ అయినా చేద్దాం” అంటూ కూతురిని తీసుకొని పెరటి వైపుకి బయలుదేరాడు సుబ్బారావు.

నాలుగు రోజుల తరువాత జానకమ్మ గారు తనకి యిష్టమైన ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసి మొగుడికి, కూతురికి చెరో నాలుగు ఇడ్లీలు యిచ్చి, తను కూడా ఒక ప్లేట్ లో రెండు ఇడ్లీలు పెట్టుకుని తినడం మొదలు పెట్టింది. ముక్క తుంచగానే ఇడ్లీ రాయి లాగా వుంది అని అనిపించి, భర్త వంక చూసింది.

ఇడ్లీ ని ముక్కలు చేయలేక మొత్తంగా తింటున్న భర్తతో “ఏమండీ! మీరన్నట్లు ఇడ్లీ పాత్ర పాడైంది అనుకుంటా! ఇడ్లీలు గట్టిగా వచ్చాయి” అంది.

“ఇడ్లీ పాత్ర వలన ఇడ్లీ గట్టిగా రాదు. నీకు ఇడ్లీ పిండి పాళ్ళు ఎలా కలపాలో తెలియక ఈ నలభై ఏళ్ళ నుండి మా చేత రాళ్లు తినిపించావు. అంతే!

నిన్న నీకు చూపించిన ఇడ్లీ పాత్ర అమ్మే వాళ్ళు, ఇడ్లీ పాత్ర అమ్మటంతో పాటు ఇడ్లీ ఎలా చేయాలో కూడా ట్రయినింగ్ ఇస్తారట. అందుకనే కొందామన్నాను” అన్నాడు సుబ్బారావు.

“చాల్లేండి, యింతోటి దానికి ట్రైనింగ్ కూడా నా? యూట్యూబ్ లో బోలెడు వీడియోలు వుంటాయి, వాడికి అంత డబ్బు పోసి కొనటం కంటే జనరల్ బజారు లో కొందాము, సగానికి సగం ఖరీదు కి దొరుకుతుంది” అంది జానకమ్మ.

“సరే నీ యిష్టం. ఈ లోపుగా ఆ వీడియోలు ఏవో చూసి ముందు దూదిలాంటి ఇడ్లీలు ఎలా చేయాలో నేర్చుకో” అన్నాడు సుబ్బారావు.

నాలుగు రోజుల తరువాత ఒకరోజు ఉదయమే జానకమ్మ, భర్త తో “ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అవగానే బజార్ వెళ్ళి ఇడ్లీ పాత్ర కొందాము” అంది.

“మరీ అంత పొద్దున్నే ఎందుకే? సాయంత్రం వెళదాములే” అన్నాడు సుబ్బారావు.

“బలే వారే! వాళ్ళు షాప్ తెరవగానే వెళ్ళి కొంటే బోణి బేరం వదులుకోలేక మనం అడిగినంత రేట్ కి యిస్తారు, ఈ మాత్రం లోకజ్ఞానం లేకపోతే ఎలా అండి” అంటూ హడావుడి పెట్టి భర్తని తీసుకుని ఒక షాప్ కి వెళ్ళింది.

పాపం షాప్ వాడు అప్పుడే షాప్ తెరిచినట్లున్నాడు, దేముడి ఫోటోకి అగరబత్తి వెలిగిస్తూ కనిపించాడు. ఈ లోపుగా నాలుగు ప్లేట్స్ వున్న ఇడ్లీ పాత్ర ని ఎన్నుకుని, “అబ్బాయీ! దీని ఖరీదు ఎంతా?” అని అడిగింది. మంచి బేరం దొరికింది అనుకున్న షాప్ వాడు “పదకొండు వందలు” అన్నాడు.

“చాల్లే! ఎందుకంత రేట్? మా దగ్గర దీనికన్నా మంచి ఇడ్లీ పాత్ర వుంది. అయిదు వందలకి కొన్నాము” అంది జానకమ్మ.

“వుంటే మళ్ళీ ఎందుకమ్మా కొనటం? అదే వాడుకోండి” అన్నాడు షాప్ వాడు.

“అందులో మూడు ప్లేట్స్ వున్నాయి. యింకో ప్లేట్ వుంటే బాగుంటుంది అని కొంటున్నాము. ఆరొందలకి యిస్తావా?” అని అడిగింది.

“మాకే పడలేదు ఆ రేట్. చివరగా వెయ్యి రూపాయలకి అయితే యిస్తాను” అన్నాడు షాప్ వాడు.

“అంత ఇవ్వలేము. అసలే సార్ రిటైరయి యింట్లో వుంటున్నారు. యింకో వంద చేసుకుని ఏడు వందలకి యివ్వు, లేదంటే మా పాత ఇడ్లీ పాత్ర తోనే రెండు సార్లు వేసుకుంటాం” అని బేరం చేసింది జానకమ్మ.

చివరికి ఎనిమిది వందలకి కొని ఇంటికి బయలుదేరారు.

“ఎందుకు అనవసరంగా నేను రిటైర్ అయ్యి డబ్బుకి అడుక్కు తింటున్నట్లుగా వాడితో చెప్పటం? నాకు తలకొట్టేసినట్లైంది” అన్నాడు సుబ్బారావు భార్యతో.

“ఆలా చెప్పబట్టే మూడొందలు తగ్గించాడు” అంది జానకమ్మ.

యింటి ముందు ఆటో దిగి, బేరం ఆడుకున్న వందరూపాయలు డ్రైవరుకి యిచ్చాడు సుబ్బారావు. ఆటో వాడు మళ్ళీ యింకో యిరవై రూపాయలు తిరిగిఇస్తూ, “ఎనబయి రూపాయలు చాల్లే సార్! అసలే మీరు రిటైర్ అయ్యారని విన్నాను మీ మాటలబట్టి” అంటూ వెళ్ళిపోయాడు.

సుబ్బారావు ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు సిగ్గుతో.

“నీవల్ల చివరికి ఆటో అతను కూడా నాపైన జాలి చూపించాడు. నా జన్మ ధన్యమైంది. యిహనైనా వంట వండి నాలుగు మెతుకులు పడేస్తావా లేక రిటైర్ అయ్యానని ఒక్కపూట పెడతావా” అంటూ కోపం గా సోపాలో కూలబడ్డాడు.

“ఛీ! మరీ అంత దుర్మార్గరాలిని అనుకున్నారా? ఒక్క క్షణం లో వంట చేసి పిలుస్తాను. ఈలోపుగా న్యూస్ చూడండి” అని వంటకి ఉపక్రమించింది.

అరగంట తరువాత భోజనానికి పిలుపు రావటంతో వెళ్లి పీట మీద కూర్చుని వెండి కంచం దగ్గరికి లాక్కున్నాడు.

కంచంలో తనకిష్టమైన దోసకాయ పప్పు, వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర, కొత్త ఆవకాయ, కారం అప్పడాలు, చిన్న కటోరలో ముక్కలపులుసు చూడగానే, సుబ్బారావు కోపం కాస్తా ఎగిరిపోయి ఆకలి తన్నుకుంటూ వచ్చింది. అవపోసన పట్టి, పప్పుతో అన్నం కలిపి ముద్దని ఆవకాయలో అద్ది నోట్లో పెట్టుకుని తిని, “జానకీ! వంటలో నిన్ను మించిన వారు లేరే. ఒక్క ఇడ్లీ చేయడం తప్ప అన్ని వంటలూ బాగా చేస్తావు” అని భార్యని మెచ్చుకున్నాడు.

భోజనం కానిచ్చి, “అమ్మయ్య! రుచిగా కడుపు నిండా తినేసాను. యిహ పోయినా పరవలేదోయ్” అన్నాడు.

“ఛీ.. పాడు మాటలు! నాలుగు ముద్దలు కూడా సరిగ్గా తినలేదు” అంటూ భర్త కి చెయ్యి వూతం యిచ్చింది. భార్య చెయ్యి సపోర్ట్ తో పైకి లేచి పంపు దగ్గర చెయ్యి కడుగుకుని వస్తూ ఉండగా భార్య ఎందుకో నవ్వటం చూసి, “ఎందుకు ఆ నవ్వు” అన్నాడు.

“ఏమిలేదు, యిప్పుడు మళ్ళీ పాణిగ్రహణం జరిగింది” అంది జానకమ్మ.

“ఆ సరేలే! పెళ్ళిలో చేసిన పాణిగ్రహణానికే ఇంతవరకు చెయ్యి నొప్పి తగ్గక మూవ్ ఆయింట్మెంట్ వాడుతున్నాను” అన్నాడు నవ్వుతూ.

జానకమ్మ గారు భోజనం చేసి, యిల్లు సర్దుకుని హాలులోకి వచ్చింది. చూస్తే భర్త సోఫా లో గుర్రు పెడుతూ నిద్రపోవడం కనిపించింది. తను కూడా కొద్దిసేపు నడుము వాలుద్దామని, గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది.

పడుకున్న అయిదు నిమిషాలలోనే గాఢ నిద్ర లోకి వెళ్ళిపోయింది.

సెల్ ఫోన్ మ్రోగడం తో ఉలిక్కిపడి లేచి, ‘ఫోన్ మ్రోగుతున్నా తీయకుండా ఈయన ఏమిచేస్తున్నాడు’ అనుకుంటూ హాలులోకి వచ్చి ఫోన్ తీసింది. ఎవరో ‘లోన్ కావాలా..’ అంటూ అడుగుతూ వుంటే ‘అక్కర్లేదు’ అని ఫోన్ కట్ చేసి, భర్త ని లేవమని పిలిచింది. రెండు పిలుపులకి కూడా లేవకపోవడంతో కంగారుగా కుదిపి చూసింది.

అయినా లేవకపోవడంతో, “కొంప ముంచి వెళ్ళిపోయాడు నాయనో” అని గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది. తల్లి ఎందుకు ఏడుస్తోందో తెలియక కూతురు కూడా ఏడుపు మొదలుపెట్టింది.

వీళ్ళ ఏడుపులు విని పక్కింటి వారు కంగారుపడుతూ వచ్చి “ఏమైంది?” అని అడిగారు.

“అన్నం తిని పడుకున్నారు, ఎంత లేపుతున్నా లేవటం లేదు. ఎవరైనా యితరులకు దిష్టి కొడతారు, ఇయన తనకి తనే దిష్టి కొట్టుకుని, పోయాడు. ఉదయమే కొత్త ఇడ్లీ పాత్ర కొన్నాము, రాత్రికి దానిలో ఇడ్లీలు వేసి పెడదామనుకున్నాను” అంది జానకమ్మ.

ఇడ్లీ పాత్ర పేరు వినగానే మార్నింగ్ జరిగిన అవమానం గుర్తుకు వచ్చి, ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు సుబ్బారావు.

అంతవరకు ఏడుస్తున్న జానకమ్మ సుబ్బారావు లేవడం చూసి, “అదేంటి? మీరు పోలేదా.. మరి ఎంతసేపు లేపినా లేవలేదేమిటి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“నీ బొంద! నేను పోవడమేమిటి? భుక్తాయాసంతో ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. ఇడ్లీ పాత్ర అన్న మాటలు వినిపించి, ‘నేను రిటైర్ అయిన తర్వాత అడుక్కుతింటున్నాను’ అన్న అభిప్రాయం ఇచ్చావు కదా, అది గుర్తుకువచ్చి లేచాను అన్నాడు.

“బాగానే వుంది వరస! అనవసరంగా ఏడిచాను. లేచి మొహం కడుక్కుని రండి, కాఫీ యిస్తాను” అని, “మీరు కూడా కాఫీ తాగి వెళ్ళండి వదినగారు, పాపం మిమ్మల్ని కూడా కంగారు పెట్టాము” అంది పక్కింటి వాళ్ళతో.

శుభం


114 views0 comments

Comments


bottom of page