top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - పార్ట్ 7


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 7' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 7' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.


అతను ఆఫీసుకు రాకపోవడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది రూపవతి. అతను పార్కులో ఎవరితోనో గొడవ పడ్డట్టు తెలుసుకొని బాధ పడుతుంది. అతని పిల్లల స్కూల్ అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానంటుంది.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 7' చదవండి.


మెస్సు చీఫ్ కుక్ సోమనాథం హిందీ సరళంగా మాట్లాడగలడు. అక్కడక్కడ కొంచెం పంజాబీ మరికొంచెం రాజస్థానీ కూడా జోడించి మాట్లాడగలగటం వల్ల అక్కడివాళ్ళతో కలగలసిపోతాడు. చూసేవారికి అతడు అక్కడి ప్రాంతానికి చెందినవాడి గానే తోస్తూంది. ఐతే- అతడు నిజానికి ఢిల్లీ నగరానికి చెందినవాడు మాత్రం కాడు. ఆ మాటకు వస్తే, రూపవతి మేడమ్ లా మంగళూరు ప్రాంతానికి చెందిన వాడు కూడా కాడు. తమిళనాట తెలుగు పూర్వీకులైన కుటుంబానికి చెందిన వాడు.


త్యాగరాజు స్వామివారు తంబూరా పట్టుకుని తిరిగిన దక్షిణ తమిళ ప్రాంత ధాన్యాగారమైన తంజావూరు ధరణిలో పుట్టి పెరిగిన వ్యక్తి. అత డి పూర్వీకులకు శాస్త్రీయ సంగీత రంగంతో- రాగాల శృతులతో అవినాభావ సంబంధం ఉంది. అప్పటిలా కాకపోయినా ఇప్పటికీ అక్కడున్న సోమనాథం కుటుంబీకులందరూ ప్రతి ఏడూ జరిగే త్యాగరాజు స్వామివారి ఆరాధనోత్సవాలకు- కీర్తనోత్సవాలకు ఉన్నంతలో సేవలు చేస్తూనే ఉన్నారు. తరిస్తూనే ఉన్నారు. సంప్రదాయ సంగీతాభిమానమంటే—పూర్వజన్మ సుకృతమే కదూ! ”నిధి సుఖమా! లేక రాముని సన్నిధి చాలా సుఖమా! ” అని నిలదీయలేదూ తెలుగు రసికుల హృదయ పెన్నిధి త్యాగయ్య!


ఇకపోతే, విషయానికి వస్తే—సోమనాథం మాత్రం కొన్నివ్యక్తిగత పరిస్థితుల వల్ల పుట్టునూరులో ఉండలేకపోయాడు. ఎప్పుడెక్కడ ఎటువంటి అపచారం జరిగిందో గాని- వాళ్ళింటికి ప్రేతకళ వాటేసుకుంది. ఉన్న మాగాణిని సాగుచేసుకుంటూ బ్రతుకీ డుస్తూన్న పెద్దన్నయ్య ఆ తరవాత చిన్నన్నయ్య- ఆ తీరున ఒకరు తరవాత ఒకరుగా పరలోక ప్రాప్తి చెందారు. ఆ దు:ఖ పూరిత క్షోభనుండి తేరుకొనక ముందే అతడి జీవిత భాగస్వామిని బిడ్డ ప్రసవించిన మరునాడు పైలోకాలకు దారిచూసుకుంటూ అదృశ్య ప్రపంచానికి చేరుకుంది. దానితో భూకంపానికి లోనై నెర్రెలు బారిన నేలలా సోమనాథం గుండె పగిలింది. మాటలకందని వైరాగ్యం తనువెల్లా ప్రబలింది.


తనకత్యంత ప్రియమైన ప్రాణ ప్రదమైన శాస్త్రీయ సంగీత పైరు గాలిని విస్మరించి, మాంసపు ముద్ద లాంటి పాపను ఇద్దరు వదినమ్మలకు అప్పగించి- పెట్టే బేడా అందుకుని యెకాయెకిన ఊరువిడిచి వచ్చేసాడు. తిన్నగా కొత్త ఢిల్లీలో దిగి కరోళ్ బాగ్ కి చేరుకుని తెలిసిన మిత్రుడి పంచన చేరాడు. అతడి సహాయంతో అదే ప్రాంతంలో ఉన్న రూపవతి వాళ్ల నాన్నగారి మెస్సులో కుక్ సహాయకుడిగా చేరాడు. ఆనువంశికంగా అతడు వంటలు వార్చే వృత్తికి చెందిన వాడు కాకపోయినా మన్ననతో పనిచేస్తూ వంట పనులు నేర్చుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.


రూపవతి నాన్నగారు స్వర్గస్థులైన తరవాత మెస్సు నిర్వహణ రూపవతి హయాములోకి వచ్చింది. సమర్థనీయురాలూ- విద్యావంతురాలూ అయిన రూపవతి మంగుళూరు నుండి తనతో బాటు తన మరదలు మంజులవాణిని తోడ్కొ ని వచ్చి మెస్సుని ఆధునీకరించి పకడ్బందీగా నడుపుతూంది. మిలిటరీ ఫీల్డులో ఉన్నప్పుడు- ఆ తరవాత స్వఛ్ఛంద ఉద్యోగ విరమణ పొంది సెకెండ్ ఇన్నింగ్స్ గా ప్రైవేటు కంపెనీలో చేరిన రూపవతిగారి భర్త లీవు పొందినప్పుడల్లా మంగళూరు వచ్చి చేరుతాడు. భార్యతో గడుపుతాడు. పిమ్మట అటునుంచి అటుగా వెళ్లిపోతాడు.


అప్పుడీమె కూడా మంజులకూ మాలినికీ తాత్కాలిక నిర్వహణా బాధ్యతలు అప్పగించి వెళ్తుంది. ఎటొచ్చీ ఆమెకు బిడ్డలు కలగక పోవడమే పెద్ద నష్టజాతకంగా తయారయింది. అంత ఉత్కృష్ట గుణ సంపద గల స్త్రీకి అలా పుష్పవిహీనగా మిగిలిపోవడం అందరితో బాటు అక్కడి మెస్ స్టాఫ్ ని కూడా పీడిస్తుంటుంది. విషయానికి వస్తే ఆ పరిస్థితి ఏ స్త్రీకి దాపరించకూడదు. అందునా మంచీ మన్ననగల రూపవతి వంటి ఉత్తమురాలికి అటువంటి పరిస్థితి కలగనే కూడదు. పుత్రకామేష్టి యాగం చేయడానికి ఇంతవరకూ భార్యా భర్తలిద్దరూ ఎందుకు పూనుకోలేదో రామభద్రానికీ సోమనాథానికీ అగమ్య గోచరంగానే ఉంది.


ఇక- యాజ్ ఎ మేటరాఫ్ ప్యాక్ట్- అన్నట్టు ఇద్దరూ, ఇప్పటివరకూ రూపవతిగారి భర్తను దర్శించగల భాగ్యానికి నోచుకునే లేదు- గోడన వ్రేలాడుతూన్న ఫొటోలో చూడటం తప్ప. ఆమె భర్త నిజంగానే మాటల కందని తీవ్ర హుందాతనం గల వ్యక్తిలాగే ఉన్నాడు.


ఎంతటి హుందాతనం గల అధికారి ఐతే మట్టుకు భార్య మానసిక అవసరాలను కూడా గుర్చించాలి కదా! బిడ్డలు లేని పుష్ప హీనగా రూపవతి మేడమ్ మాత్రం యెన్నాళ్ళు భరిస్తూ ఉండగలదు?

ఇప్పుడు హెడ్ కుక్ సోమనాథం విషయానికి వస్తే తంజాఊరు నుండి ఉత్తరాల ప్రవాహం తాకనా రంభించింది. తనకేమంత వయసు దాటిపోలేదని— ఉన్నవాడ నుండి- చుట్టు ప్రక్కల ఊళ్ళనుండీ రెండు మూడు కుటుంబాలు అమ్మాయిల్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారని వదినలిద్దరూ యెడాపెడా ఉత్తరాలు వ్రాయసాగారు. కనీసం తల్లి లేని తన ఆడకూతురు కోస మైనా మళ్లీ ఓ ఇంటివాడివి కావాలని ఒత్తిడి పెట్టసాగారు. ఎందుకో మరి— సోమనాథాన్ని ఒక విధమైన జంకేదో వెనక్కిలాగ సాగింది. ఒకనాడు ఇంట్లో ఆవహించిన ప్రేత కళ కళ్లముందు క్రీనీడలా కదలాడ సాగింది, ఇప్పటికీ తను పుట్టి పెరిగిన ఇంటిని తలచుకుంటేనే- అతడికి నినువెల్లా ప్రేతకళ ఆవహించినట్లే ఉంటుంది. ఏదో తరుముకొస్తున్నట్లే అనిపిస్తుంటుంది.


తంజావూరు పురోహితుల చేత యెన్ని శాంతి పూజలు చేయిపిస్తే మాత్రం- ఇంటినావరించిన ఆ ప్రేతకళ పొలిమేర దాటి వెళ్ళిపోయిందన్న భరోసా యెవరిస్తారు? మితభాషి ఐన సోమనాథం తన కుటుంబ నేపథ్యాన్ని ఎవరితోనూ మనసునిప్పి చెప్పలేదు. చెప్పి గోడు వెళ్ల బోసుకున్నంత మాత్రాన గుండెబరువు కూసింత తగ్గుతుందేమో గాని- సమస్య తీరుతుందా! తనది సంకుల సమరం వంటి జీవితకాల సమస్య కదూ! ఇక మరొ క విషయం- ముఖ్యమైన విషయం- తను ఊరు విడిచి వచ్చేసిన తరవాత మళ్ళీ ఇంట్లో దు:ఖ భాజిత దుర్ఘటనేదీ సంభవించ లేదు. తను మళ్ళీ ఊరు చేరితే తననూ తన ఒక్కగా నొక్క కూతుర్నీ అటువంటి పీడ కలే వెంటాడుతుందేమో! అదృష్య దుష్ట శక్తి దాడి చేస్తుందేమో!

కాని— మొదటిసారి, అదీను కొన్ని సంవత్సరాల తరవాత అతడికి గుండె విప్పి చెప్పాలనిపించింది. బరువైన గతాన్ని మరొకరితో పంచుకోవాలనిపించింది. ఎంతటి గుండె నిబ్బరం గల వ్యక్తి అయినా గుండె గూడులో అంతటి కటిక చీకటిని కలకాల మూ దాచుకోలేడు కదా! అంచేత తన గుండె కవాటాలన్నీ విప్పి పచ్చటి మానసిక తివాసీపైన పరచి ఇద్దరు బిడ్డల తండ్రయిన రామభద్రానికి తెలియచేసాడు. అంతా విన్న తరవాత భద్రానికి గుండె చెరువైంది.


ఈ ప్రపంచంలో ఇంతటి దు:ఖం ఒకే ఇంటిలో ఒకే కుటుంబంలో ఎండు తాటాకుల్లా ప్రోగయి ఉంటుందా! అసలు మరణ దేవతకు నిజంగా అంత కాఠిన్యత ఉంటుందా-- ఒకరు తరవాత ఒకరుగా ముగ్గుర్నీ ఏకధాటిగా మోసుకుపోవడానికి? ఇక అటువంటప్పుడు సోమనాథానికి మళ్లీ ఊరుచేరి ఇంటి గడప తొక్కడానికి మనసెలా వస్తుంది? తన ఉనికి వల్ల మరి కొందరికి కీడెందుకు కలగనివ్వాలి? నిజానికిదంతా తమ కుటుంబానికి ఆవహించిన దుదృష్టం గతజన్మ కృతమేనేమో!


అంతా విన్న రామభద్రం ఉన్నపళాన కళ్లు మూసుకుని కొన్ని క్షణాల వరకూ అలానే ఉండిపోయాడు. అదెప్పుడో సీత మ్మ ధార ప్రక్కనున్న గుడిలో తను విన్న అగ్రజ అర్చకస్వాముల వారి ప్రసంగం అతడికి గుర్తుకి వచ్చింది. ప్రతి పదాన్ని నెమ రు వేసుకున్నాడు. ”ఈ ప్రంచంలో ప్రతి మనిషికీ ప్రథమ శత్రువు దు:ఖం- దు:ఖం మాత్రమే! ఎందుకంటే-- దు:ఖం మనిషిలోని సత్తువుని తీసివేస్తుంది. ఆలోచించగల శక్తిని సహితం లేకుండా హరించివేస్తుంది. నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆ తీరున సంపూర్ణంగా నిస్సహాయుణ్ణి చేస్తుంది.


అంచేత మనిషి పులినోట్లో తలదూర్చినట్లు దు:ఖం ముందు శరాణాగతుడు కాకూడదు. బేలతనంతో బెంబేలు పడుతూ పిరికివాడుగామారకూడదు. ఎదిరించాలి. వేయి యేనుగుల బలంతో యెదిరించాలి”అప్పుడు దైవం తప్పకుం డా ఆసరాగా నిల్చుంటుంది. తను నేర్చుకున్న విషయాలను సోమనాధానికి మెట్టు మెట్టుగా విడమర్చి చెప్పడానికి తీర్మానించాడు రామభద్రం.

--------------------------------------------------------------------

బుధవారం రెక్కలు విదుల్చుతూ వాలిన పక్షిలా రానే వచ్చింది. సుమోలో దిగిన రూపవతి వెహికల్ ని గోబింద్ సింగ్ స్కూలు ఆవరణలో ఉన్నఖాలీ స్థంలో ఉంచి నవ్వు ముఖంతో స్కూలు గేటు వద్దకు వచ్చి ఆశ్చర్యంతో చూస్తూ నిల్చుంది. ఇదే మిటి ఇంతమంది గుమికూడారు? రామభద్రం కుటుంబ సమేతంగా వచ్సినట్టున్నాడు. కుటుంబ సమేతంగా అంటే—తన వృధ్ధ తల్లి దండ్రులతో సహా- ఇంత మంది ఒక్కపెట్టున వస్తే స్కూలు మేనేజిమెంటు వాళ్లు విసుక్కుంటారేమో!


అదేమాట- తనను నమ స్కరించడానికి ఎదురు వచ్చిన వాళ్ల నుండి విడివడుతూ రామభద్రాన్ని కాస్తంత దూరంగా తీసుకువెళ్లి అంది- “అదేమటి రామభద్రం! నేను అబ్బాయిలిద్దరితో మీ భార్య భర్తలిద్దరిని మాత్రమేగా రమ్మన్నది స్కూలుకి! వాళ్ళు ముఖాముఖి చూడదల చినది మీ ఇద్దరినేగా!”

దానికతడు పేలవంగా నవ్వాడు. ”నిజమే! నాకు గుర్తుందండి. కాని నేనేమి చేయను మా అమ్మా బాబూ ఇద్దరూ మనవళ్లతో బాటు వస్తానని పట్టు పడితే-- మొదట మనవళ్లు చేరబోయే స్కూలు చూస్తామన్నారు. తరవాత పిల్లకాయ లిద్దర్నీ ప్రతిరోజూ స్కూలుకి దిగబెట్టి రావడానికి స్కూలు దారి తెలుసుకోవాలన్నారు. అంచేత వచ్చేతీరాలన్నారు, మీరే చెప్పండి నేనేమి చేయాలో! ”


ఆమె ఇక మాట్లాడకుండా కదలి వచ్చి పెద్దవాళ్ళిద్దరికీ నమస్కరించింది ప్రసన్నంగా నవ్వుతూ-- “మీరిప్పుడెక్కడ కూర్చుంటారు? అంత మందికి లోపల కుర్చీలు లేవేమో! ఐతే మీరొక పని చేయండి. రండి. నా వెహికల్ లోకి వచ్చి కూర్చుందురు గాని. ఏ సీ ఉండటాన లోపల చల్లగానే ఉంటుంది. మీరు మాత్రం మనవళ్లిద్దరి అడ్మిషన్ ల గురించి దిగులు పడబోకండి. ఎలాగో ఒకలా గట్టెక్కించే బాధ్యత నాది. సరేనా! ”అంటూ వృధ్ధ దంపతులిద్దర్నీ నడిపించుకు వెళ్లి- ”ఎవరైనా వచ్చి అడిగితే నా పేరు చెప్పండి” అని భరోసా ఇస్తూ సుమోలో కూర్చుండ బెట్టి వచ్చిందామె.


ఆ తరవాత కుర్రాళ్ళిద్దరి చేతుల్నీ పట్టుకుని భద్రం దంపతుల్ని తనతో బాటు లోపలకు తీసుకు వెళ్లింది. లోపల ఇంటర్వ్యూ తతంగం పూర్తయి అడ్మిషన్లు ఖరారై రావడానికి గంటన్నరకు పైగా అయింది. ఆవరణలోకి పిల్ల కాయలూ దంపతులిద్దరూ నవ్వు ముఖాలతో రావడం చూసి తాతయ్యా బామ్మా ఇక నిల్చోలేక పోయారు. బండినుండి తడబడుతూనే బైటకు వచ్చి ఆతృతతో అడిగారు- “పండే కదూ! ఆలస్యమైతే యేమో అనుకున్నాం“అని.


ఎక్కడెక్కడ సౌగంధ సుమదళ వీచిక పారాడితే అక్కడ సురభిళ వాతావరణం శోభిల్లుతుందిగా-- అదే విధంగా వృధ్ధ దంపతులిద్దరిలో తాండవించిన సంతోషమూ సహర్షమూ రూపవతిని సహితం ముప్పిరిగొన్నాయి.


”మరేం లేదు అంకుల్ గారూ! ఇక్కడంతా ఓ రకమైన రాచరిక తతంగం వంటిది. చెప్పకూడదు గాని—చిన్న తరగతి పిల్లలకెందుకూ ఈ ఇంటర్వ్యూలూ ఇన్ఫర్ మేషన్ లూను-- ఇదంతా ఒక పథక రచన ప్రకారం సాగుతుంది. అదంతా మీకెందుకు లెండి? రామభద్రంగారికి తరవాత తరవాత తెలుస్తుంది అందులో అణగి ఉన్న అండ పిండ బ్రహ్మాండమంతా-- ఈ స్కూలు కట్టడానికి మానాన్నగారు కూడా- ఆయన బ్రతికున్న రోజుల్లో-- కొంత విరాళం ఇచ్చారు. నేను కూడా అప్పుడప్పుడు పండగలకూ స్కూలు వార్షికోత్సవాలకూ యేదో కొంత ఇస్తూనే ఉంటానండి.


మొత్తానికి ఒకటి మాత్రం వాస్తవం- బడి మంచిది. ఇక మనం బయల్దేరుదామా? అన్నట్టు మాటల్లో పడి అసలు విషయం మరచి పోయేటట్టున్నాను. అబ్బాయిలిద్దరూ మేథ్స్ లోనూ హిందీలోనూ కొంచెం వెనుకబడినట్టున్నారు. అంచేత మరి కొన్నాళ్ళపాటు ట్యూషన్ క్లాసులు కొనసాగించాల్సిన అవసరం ఉందండి! ” అంటూ ముందుకు నడిచింది రూపవతి. అప్పుడు రాఘవయ్య మనవళ్ళిద్దరి చెవిలో ఏమి చెప్పాడో మరి-- ఇద్దరూ పరుగున వచ్చి రూపవతి రెండు కాళ్ళకూ వంగి నమస్కరించారు.


వాళ్ళను ఆశ్చర్యంగా చూసి అటు పిమ్మట నవ్వు ముఖంతో అక్కున చేర్చుకుందామె- “కంచెరపాలెం కుర్రాళ్లు గట్టోళ్ళే! ”అంటూ. అప్పుడక్కడకు నిదానంగా నడచుకుంటూ వచ్చాడు రాఘవయ్య. ”నువ్వు అచ్చు మా కోడలు పిల్లలాగే సౌమ్యంగా ప్రసన్నంగా కనిపిస్తున్నావు. ఒకటడు గుతాను ఏమీ అనుకోవు కదా! ”ఆమాటకామె చిన్నగా నవ్విఅంది- “మీరు పెద్దవారు. నాపట్ల ఇంతటి మన్నన చూపించనవ సరం లేదండీ. నిరభ్యంతరంగా చెప్పండి, వింటాను”


“మరేమి లేదమ్మా—ఎలాగో ఒకలా పుణ్యం కట్టుకుని కుర్రాళ్లిద్దరినీ స్కుల్ ఫైనల్ పూర్తి చేసేలా చూస్తే, మాకంతే చాలు. మీకు తెలుసో తెలియదో గాని- మావాడు మీకు చెప్పాడో లేదో గాని- ఉన్న ఊరు విడిచి మేమింత వరకూ వచ్చినది—కుర్రకా యల చదువులు గట్టెక్కించడానికే. రామభద్రం కూడా స్కూల్ ఫైనల్ వరకూ చేరలేక పోయాడు. ఎనిమిది వరకే చదవగలిగాడు. అంచేతనే తహసిల్దార్ కార్యాలయంలో కొలువు సంపాదించలేక పోయాడు. ఇదీ అసలు విషయం--”


ఆ మాట విన్నంతనే రూపవ తి ఆగిపోయింది. కనురెప్పలు అల్లార్చుతూ చూస్తూండిపోయింది. ఆ తరవాత పెదవి తెరిచింది- “నాకు తెలియ కడగుతాను అయ్యగారూ! మీకూ మీ అబ్బాయికీ ఈ స్కూల్ ఫైనల్ స్థాయి పట్ల ఎందు కంత అబ్షెషన్- అంటే ఎందుకంత వ్యామోహం? పెద్దోడు ఇప్పుడు ఏడులో చేరాడు. చిన్నోడేమో ఐదులో చేరాడు. స్కూల్ ఫైనల్ లో ఇద్దరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయి పై క్లాసు లకు వెళ్తానంటే చదివించరా! చదివించనంటే వాళ్లిద్దరూ ఊరుకుంటారా? ఏమో చెప్పలేం గాని- మంచి మార్కులతో ఉత్తీర్ణులయితే స్కాలర్ షిప్స్ కూడా రావచ్చు కదా!”


”ఆమాటకు అనంగీకారంగా తల అడ్డంగా ఆడించాడు రాఘవయ్య- “వీలుకాదమ్మా! మా పరిధులు మాకు తెలుసు కదా! ఇద్దరూ దేవుడి దయవల్ల స్కూల్ ఫైనల్ దరికి చేరుకుంటే, ఇకపైన వాళ్లిద్దరి అదృష్టం కొద్దీ ఏదై నా పాలిటెక్నిక్ లోనో- లేదా- మరేదైనా వృత్తి పరమైన టెక్నికల్ స్కూలులోనో చేర్పించేస్తాం. వాళ్ల బాబుకీ అమ్మకీ ఉన్న ధ్యాస కూడా ఇదే! కొడుకులిద్దరూ తాతయ్యలా తండ్రిలా మల్లసాలలో ప్రవేశించకూడదనే-- అది మంచికో చెడుకో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమేమో గాని- కన్న తల్లితండ్రులుగా వాళ్ళ వాంఛను మనం గుర్తించాలి కదా!”


అప్పుడామె వెంటనే బదులివ్వ లేదు. ప్రశాంతంగా రాఘవయ్య ముఖంలోకి చూస్తూ అంది- “మీరు చెప్పింది పూర్తిగా విన్నాను ఇక నేను చెప్పేది వింటారా అంకుల్?”


”ఊఁ- అన్నాడతను.


“మీకు తెలుసో తెలియదో గాని- చెప్పడం నా కర్తవ్యం- నాకు బిడ్డలు లేరు. ఈ జన్మకింతేనేమో నాకు తెలియదు. కొందరనుకుంటారు— నేనూ నా భర్తా యాగాలు గట్రా- వైద్య పరీక్షలు గట్రా చేయలేదని- బిడ్డల కోసం. అది నిజం కాదు. మేం అన్నీ చేసాం బహుశ: ఈ జన్మలో నాకున్న జన్మ సుకృతం అంతేనేమా!


ఇప్పుడిక పాయింటుకి వస్తున్నా ను. ఇకపైనుంచి మీరు మీ మనవ్వళ్ళిద్దరి గురించి ఆందోళన చెందకండి. మాది మంగళూరైనా నేను ఈ ప్రాంతంలోనే స్థిరపడిన దానిని. కచ్చితమైన పంజాబీ టైప్. పరిసరాల ఆనుపానులు తెలిసిన దానిని. నాకు వీలైనంత మేర ఇద్దర్నీ ఎంత వరకు ఎలా మోల్డ్ చేయాలో ఎలా మలచాలో-- అలా చేయడానికి ప్రయత్నిస్తాను. నామాట నమ్ముతారు కదూ”


ఆమె నోట ఆమాట విన్నంతనే రాఘవయ్య రూపవతి రెండుచేతుల్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆప్యాయంగా-- రూపవతి తన బండిలోనే అందర్నీ వాళ్ల ఇంటి వద్ద దిగబెట్టి తన అపార్టుమెంటుకి వెళ్ళిపోయింది. పిమ్మట విరామం తీసుకుని మెస్సుకి రావల్సిందని భద్రాన్ని ఫోనులో పురమాయించి మెస్సు చేరుకుంది.


ఇక కాంతం విషయానికి వస్తే- ఆమెకా రోజు మామూలు రోజు కాదు. తమ కుటుంబానికీ తన బిడ్డల భవిష్యత్తుకీ బంగారు రోజు. మరవలేని రోజు. కొడుకులిద్దరికీ తనకూ ఏదో ఒక సందర్భాన పనికి వస్తుందని ఆమె ఇప్పటికే పట్టుదలతో హిందీ నేర్చుకోసాగింది. ఇకపైన పంజాబీ కూడా పట్టుదలతో నేర్చుకోవాలి. ఇఁకేముంది- ప్రతిరోజూ తమింటికి ఆ సీనియర్ రిటైర్ట్ టీచరమ్మ ఎలాగు వస్తూనే ఉందిగా! ఆమె ద్వారా రెండు భాషల్నీ పటిష్టంగా నేర్చుకోవడమే తరువాయి—“ముదితల్ నేర్వగ రాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్! “


మరునాడు కమల కాంతం రూపవతి ఫోటోని పెద్దది చేసి హాలులో పెట్టింది. తన కుటుంబానికి ముఖ్యంగా తన బిడ్డల భవిష్యత్తుకి ప్రాణ దీపంలా వెలుగు చూపించిన వ్యక్తికి ఆపాటి మర్యాద చేయకపోతే యెలా—అది చూసి అత్తామామలు కూడా ఆనందించారు. కోడలు పిల్లను అభినందించారు. కృతజ్ఞతా భావం ఎక్కడైనా ఎవరి పట్లయినా శ్లాఘ నీయమే కదా!


ఓ గంట ఎడబాటు తరవాత మెస్సుకి చేరి పనుల్లో నిమగ్నుడైపోయిన రామభద్రం సాయంత్రం తెరపి దొరికినప్పుడు స్కూలు అడ్మీషన్ వ్యవహారంలో జరిగిందంతా సోమనాధానికి విడమర్చి చెప్పాడు. దానికతడు ఎక్కువగా స్పందించలేదు- ఒక్క మాటతో ముగించాడు-- “మన బాస్ మనసు మంచిది- పైకి కటువుగా కనిపించినా- వెన్నకంటే మెత్తనిది- మల్లె కంటే తెల్లనిది. ” “వెన్నకంటే చల్లనిదా? వెన్న కంటే మెత్తనిదా? అదెలా?"


”ఎలాగంటే- వెన్న నిప్పు వెచ్చ దనం సోకితేనే కరుగుతుంది. మన రూపవతి మేడమ్ ఏమో ఎదుటివారి కడగండ్లను చూసిన తోడనే తనుకు తానుగా కరిగిపోతుంది. సరిపోయిందా నేనిచ్చిన ఉపమానం-- ”


రామభద్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతడె ప్పుడో యెక్కడో ఒక సుందరమైన పదం విన్నాడు. ”సోమవత్ ప్రియదర్శన:”


చంద్రుడిలా కనువిందు చేసే వ్యక్తిత్వమని— ఇప్పుడా హృదయాంగతమైన పదం మళ్ళీ మళ్ళీ గుర్తుకి వస్తూంది.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




36 views0 comments

Comentarios


bottom of page