top of page

ఇందుకళిక


'Indukalika' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ఇందుకళిక' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


పరాశర ఆ ఊళ్ళో అత్యంత బీద కుటుంబీకుడు. భార్య కాంతి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి వాళ్ళది. ఊరి చివరన పూరి గుడిసెలో నివాసం.. కాంతిది పక్క ఊరే. అయినా ఉండి లేముడులకు తల్లిగారింటిమీద ఆధార పడని పట్టుదల గల మనిషి. పెళ్ళయి పదేండ్ల తరువాత ఒక కూతురు జన్మిస్తది. పక్కఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో కానుపు. ఆస్పత్రిలో పది రోజులు ఉండవలసి వస్తది. ఆస్పత్రి వైద్యురాలి పేరు ఇందుకళిక.


ఆమె శ్రద్ధగా చూసుకొని ఉపచారము చేసింది కనుక కాంతి పదవ రోజు ఇంటికి వస్తు వైద్యురాలిని అడుగుతుంది “అమ్మా! మా పాపకు ఏమి పేరు పెట్టాలమ్మా?” అని.


దానికి వైద్యురాలు “ఇందుకళిక.. నాపేరే, పెట్టుకో” అని నవ్వుతూ అంటుంది. “మీ పాప ముక్కు గూడా పొడుగ్గా ఉంటుంది. ఇందుకళిక అంటె మొగలి పువ్వు” అని చెబుతుంది.


బిడ్డతో ఇంటికి వచ్చేనాడు వైద్యురాలికి నమస్కరిస్తూ “నీ పేరే పెట్టుకుంటము అమ్మగారు” అని చెబుతుంది కాంతి.


వైద్యురాలు సంతోష పడుతూ పిల్లను జాగ్రత్తగా చూసుకొమ్మని వంద రూపాయలు చేతిలో పెట్టి ఆస్పత్రిలో ఉన్న కొన్ని మందులు ఇస్తుంది.

పరాశర గాని కాంతి గాని ఆత్మాభిమాన మున్న వ్యక్తులు. ఎవరినీ యాచించరు. ఊరిలో ఉన్న వాళ్ళు పాపకు పాత బట్టలు ఇస్తమంటే తీసుకోరు. అదనపు కష్టము చేసైనా బిడ్డకు కొత్త బట్టలు కొంటారు.


ఇందుకళికకు ఐదవ యేడు రాగానే ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తారు. ఇందుకళిక కూడా బాగా చదువుతు పదవ తరగతిలొ జిల్లాలోనే ప్రథమ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తుంది.


ఇక పరాశర కు కాంతికి ఆనందానికి అవధులు లేకుండా అయితుంది. పైచదువులు కూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్చి చదివిస్తారు. అందులోనూ మొడటి శ్రేణే ఇందుకళిక సొత్తుగా భావించి సాధిస్తుంది.


ఇంటర్ మీడియేట్ అయిపోగానే తల్లి దండ్రులకు సహాయకారిగా ఉండడానికి స్వంతంగా పిల్లలకు చదువు చెబుతూ ఆ వచ్చే డబ్బులతో కొంత తన చదువులకు ఉపయోగిస్తుంది ఇందుకళిక.


అందులోనూ ప్రథమ శ్రేణే. ఆ కారణంగా ఇందుకళికకు మంచి ఉద్యోగము లభిస్తుంది. ఇక వెనుకకు తిరిగి చూడకుండా ఆర్థికంగా నిలదొక్కుకొని ఒక రెండు గదుల ఇల్లు గూడ సమకూర్చుకుంటారు. నివాసము పట్టణ ప్రాంతానికి మారుస్తారు.


తల్లి దండ్రిని పనులు చేయవద్దని చెబుతుంది. ఆత్మాభిమానముగల తలిదండ్రులు పనులు మానడానికి ఇష్ట పడరు. చాలా వరకు వాళ్ళకు నచ్చ జెప్పి ప్రభుత్వము ఇచ్చే రుణముతో వ్యాపారము పెట్టిస్తుంది ఇందుకళిక.

పరాశరకు గాని కాంతికి గాని ఏబది ఏండ్లు దాటడము చే కూలి పనులకన్న వ్యాపారము అనుకూలమని నిజాయితీతో నిర్వహిస్తుంటారు.


ఇందుకళికకు ఇరువది ఏండ్లు దాటుటచె తలిదండ్రులు వివాహము చేయాలని తలంచుతారు.


ఇందుకళిక తను పని చేయు కార్యాలయములో పనిచేస్తున్న ధనుష్పాణి తో పరిచయము ఏర్పడుతుంది. ఆ పరిచయము స్నేహంగా మారి ఆ స్నేహము ముదిరి ఇరువురి మనసులు ఒకే దారిలో నడుస్తాయి. ఒకరిని చూడక ఒకరు ఉండలేని స్థితికి వస్తారు. ఆ స్థితే ప్రేమకు దారితీస్తుంది. ధైర్యము చేసి ఒకరి అభిప్రాయము ఒకరు తెలుపుకొనడానికి జంకుతారు.


ఒకనాడు ఇందుకళిక తండ్రి పరాశర, తల్లి కాంతి ఇందుకళికతో “అమ్మా! నీకు ఇరువది ఏండ్లు దాటిపోయినవి, మాకూ వయసు పెరుగుచున్నది. నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తె మా బాధ్యత తీరిపోతుంది. ఏమంటావు?” అని అడుగుతారు.


తనే తన పెండ్లి విషయము నేరుగా చెప్పలేక తలిదండ్రులు ఎప్పుడు ఆ విషయము ప్రస్తావించుతారా అని ఎదిరి చూపులతో ఉన్న ఇందుకళికకు ఇది మంచి అవకాశంగా తోస్తుంది. ప్రత్యుత్తరంగా తాను రేపు చెబుతాను అంటుంది ఇందుకళిక.


తలిదండ్రులకు మనసులో కొంత అనుమానము స్ఫురిస్తుంది. తమకు తామే పరిపరి విధాల ఆలోచించుచు ఏదీ అడుగకుండ సరె అమ్మా అంటారు.


ఇందుకళిక కార్యాలయము పోతూనే ధనుష్పాణితో నేరుగ అడుగ లేక ఒక కాగితము మీద ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు సిద్ధమేనా.. నాకు రేపటి లోగా సమాధానము కావాలె’ అని వ్రాసి కాగితము మడుత పెట్టి ధనుష్పాణికి ఇస్తుంది.


ధనుష్పాణి కూడా అదే ఆలోచనలో ఉండడముచే ఆ కాగితము వెంటనే విప్పి చదువుతాడు. అతని ముఖము శరదేందు బింబమోలె వెలిగి పోతుంది. ధనుష్పాణి ఆలసించక తనూ ఒక కాగితము తీసికొని ‘ఇందుకళికా.. ఎందుకింక ఆలస్యము’ అని వ్రాసి ‘నీ ధనుష్పాణి’ అని సంతకము కూడా చేసి ఇస్తాడు.


అది చదువుకున్న ఇందుకళికకు కూడా విప్పారిన గులాబీలా ముఖము మారిపోతుంది.


ఇక అప్పుడే పెళ్ళై ఒకటయినట్టు ధనుష్ అంటే ఇందూ అని పిలుచుకోసాగారు.


“నేను మా తలిదండ్రులను ఒప్పించ గలను. ఆ నమ్మకము నాకున్నది. మరి నీ సంగతేమిటి ధనుష్?” అంటుంది ఇందుకళిక.


“తల్లి దండ్రులు అంటే నాకూ గౌరవమున్నది ఈ రోజే కద బండి గాడిలో పడింది. ఈ రోజు రాత్రి మా అమ్మ నాన్నల సంప్రదించి నీకు ఫోన్ చేస్తాను” అంటాడు ధనుష్పాణి.


“పెళ్ళంటె వెయ్యేండ్ల పంట నూరేండ్ల కాపురం అంటారు. స్నేహము, ప్రేమ, ప్రణయం అన్నీ తలిదండ్రుల అనుమతుంటేనే ఒక కొలిక్కి వస్తుంది. వాళ్ళను కాదని పోయే ధైర్యము నాకు లేదు. పెళ్ళంటె పెళ్ళాము కాదుకద” అని ఎంతో సౌమ్యంగ అంటాడు ధనుష్పాణి.


ఇందుకళికకు కొంత నిరుత్సాహ భావం కలుగుతుంది. సరె అని క్లుప్తంగా సమాధాన మిస్తుంది ఇందుకళిక.


ఇన్ని పరీక్షలలో సునాయాసంగా నెగ్గిన దానికి ఈ పరీక్ష నెగ్గడము ఎందుకో అనుమానంగా తోస్తుంది అని నిర్లిప్తతగా అనుకొని పెదవి విరుస్తుంది ఇందుకళిక.


ఇది గమనించిన ధనుష్పాణి “నీవు ఏమి దిగులు పడకు. ఆరు నూరైన మా అమ్మా నాన్నలను ఒప్పించి ఈ రోజు రాత్రే నేను ఫోన్ చేస్తాను. ఆ ధ్వని రింగ్ రింగ్ బదులు శుభం శుభం అంటుంది చూడు” అని అనునయిస్తాడు ధనుష్పాణి.


ఇందుకళికకు మనసు కుదుటపడి ధనుష్పాణి చేతిలో చేయి కలుపబోయి వెనుకకు లాక్కుంటుంది. ఈ పాణి గ్రహణము ఈ రోజు రాత్రే నీ ఫోన్ గొంతు విని అనుకుంటు ఇంటి బాట పడుతుంది ఇందుకళిక.


ఇంట్లోకి పోతూనే స్నానాల గదిలోనికి పోయి కాళ్ళూ చేతులు ముఖము కడుక్కుంటు ఈలలు వేయసాగాడు ధనుష్పాణి.


ఆ కార్యక్రమము ముగించుకొని “అమ్మా! తినడానికి ఏముంది?” అని అడుగుతాడు తల్లి మందాకినిని ధనుష్పాణి.


“కాస్త ఆగు, ఉప్మా చేసి పెడుతాను” అంటుంది మందాకిని.


“రోజూ ఉప్మా, చపాతీలేనా” అనుకుంటూ “నేతి గారెలు చెయ్యవచ్చుగదా” అంటాడు ధనుష్పాణి.


“నేతి గారెలు చేయడానికి నాకు ఓపిక లేదురా! రేపు నీ పెళ్ళాము వచ్చినంక రోజూ అదే పనిగ చేయించుకుందువు గాని ఇప్పటికైతె ఉప్మా తిను కొడుక” అంటుంది మందాకిని.


“సరేలే అమ్మా! ఆ ఉప్మానే పెట్టు” అనుకుంటు “ఇంతకు ముందు ఏమన్నవు” అంటుంటే “నేనేమన్నరా” అని అడుగుతుంది మందాకిని.


“అదేనమ్మా! పెండ్లాము వస్తె.. అని అంటివిగద. నేను మా కార్యాలయములో పని చేసే ఇందుకళిక అనే అమ్మాయిని నీకు కోడలుగా తెస్తా. మరి నీవు ఒప్పుకుంటవా” అని అడుగుతాడు ధనుష్పాణి. తల్లి కొడుకుల సంభాషణ అంతా విన్న ధనుష్పాణి తండ్రి ఇందుమౌళి “ఎవరా అమ్మాయి?” అని అడుగుతాడు తన అర్రలో కూర్చున్నవాడు వంటింట్లోకి వచ్చి.


“మా కార్యాలయములో పని చేస్తుంది నాన్నా. పేరు ఇందు కళిక. తలిదండ్రులు వ్యాపారము చేస్తున్నారు. నా వోలె తోబుట్టువులు ఎవరూ లేరు. మొత్తానికి నాకు నచ్చింది” అంటాడు ధనుష్పాణి తండ్రి ముఖములో సమాధానము వెతుక్కుంటు.


“సరెలే.. మేము ఎక్కడైన సంబంధము వెదికినా నీకు నచ్చాలిగద. రేపు సంసారము చేసేది నీవేనాయె. ఎటొచ్చి మన యింటికి కళంకము రాకుండా చూసుకో” అంటాడు ఇందుమౌళి.


ధనుష్పాణికి కొంత ఊరట లభించినట్లైతది తండ్రి మాటలతొ.


తల్లి మందాకిని అడుగుతుంది “ఇంతకూ ఆ అమ్మాయి చూడడానికి కన్ను ముక్కు బాగున్నవా” అని.


“అమ్మా! ఆ అమ్మాయి పుట్టగానే ముక్కు చక్కగా ఉన్నదని ఇందుకళిక అని పేరు పెట్టారు. మీరు ఊ అంటె రేపు మన యింటికి తీసుక వస్తాను” అంటాడు ధనుష్పాణి.


తనకూ కోడలు వస్తుందని “సరె నాయనా, ఎట్లైనా తాను మునిగింది గంగ, తాను మెచ్చింది రంభ అంటరు. నీ ఇష్టానికి మేమేమి అడ్డురాము” అంటుంది మందాకిని.


ఇందుమౌళి గూడా “నీవంటున్నవుగద.. నీ మాటకే నా ఓటు” అంటాడు భార్య వైపు చూస్తూ, కొడుకు భుజముపై చేయి వేస్తు.


ఇక ధనుష్పాణికి పట్టలేని సంతోషము కలిగి వెంటనే ఇందుకళికకు ఫోన్ చేస్తాడు “శుభం ఇందూ! రేపు కార్యాలయములో కలిసి మాట్లాడుకుందాము” అంటూ.


“మా అమ్మ నాన్నలు కూడ నూరు శాతం సరే అన్నారు. ఇక నీపేరు ఇందుపాణే” అంటూ కిలకిలా నవ్వుతుంది ఇందుకళిక.


సరె అని ఎవ్వరూ చూడకుండ ఫోన్ లోనే ముద్దుపెట్టుకుంటాడు ధనుష్పాణి.


మరునాడు కార్యాలయము పోతూనే ఇందుకళిక కొరకు వెదుకుతాడు ధనుష్పాణి. ధనుష్పాణికంటే ముందే వచ్చిన ఇందుకళిక అధికారి పిలువడముతో లోనికిపోయి అధికారితో ముచ్చటిసుంది. ఆ సంభాషణ అయిపోయే వరకు అరగంట పడుతుంది. అటు అధికారితో మాట్లాడుచున్నా ఇటు మనసంతా ధనుష్పాణి వైపే. ఎట్టకేలకు బయటికొచ్చి ధనుష్పాణిని చూసి కొంత మందాక్షము ప్రదర్శిస్తుంది ఇందుకళిక.


ధనుష్పాణి అది గ్రహించి “కాలము చాలా విశాలమైంది. నీ ప్రదర్శన కొంచెము దాచుకో ఇందూ” అంటాడు ఇందుకళికతొ.


“దాచినా దోచుకునే వారు ఎదురుగా ఉండగా ఇక దాపరికానికి తావేది” అంటుంది ఇందుకళిక.


“ఇందూ! ఈరోజు మా యింటికి రావాలె” అంటాడు ధనుష్పాణి.


“సరె! సాయంత్రము అరగంట ముందే అనుమతి తీసుకుంటాను” అంటుంది ఇందుకళిక. సాయంత్రము బయటకు వచ్చేముందు కార్యాలయములో ధనుష్పాణి కొరకు వెదుకుతుంది ఇందుకళిక.


అనుకోకుండా గేటు వైపు చూసే సరికి అక్కడ ఈమె కొరకు ఎదిరి చూస్తుంటాడు ధనుష్పాణి.


ఆటో మాట్లాడుకొని ఇద్దరూ ధనుష్పాణి ఇంటికి చేరుతారు. ఆటోలో ప్రయాణము చేసినంత సేపు ఒకరికొకరు తగులుతూ అవ్యక్త అనుభూతి పొందుతారు.


ఇంట్లోకి చేరగానే తలిదండ్రులను పరిచయం చేస్తాడు ఇందుకళికకు ధనుష్పాణి. ఇందుకళిక వారిద్దరికి నమస్కరిస్తుంది. ‘శుభము కలుగుగాక’ అని దీవిస్తారు ఇందుమౌళి, మందాకిని.


కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మంటుంది ఇద్దరిని మందాకిని.

పది నిమిషాలలో ఆ పని ముగించుకొని “అమ్మా! ఈ రోజు కూడా ఉప్మానేనా?” అంటాడు ధనుష్పాణి.


“లేదురా మా అమ్మాయి వచ్చిందికద! నిన్న నీవు అడిగిన నేతి గారెలే చేశాను, తినండి” అని ఇద్దరికి వడ్డిస్తుంది మందాకిని.


అవి తినుకుంటూ ‘తనవారైతే తగినటు రుచులు’ అనుకుంటూ “ఇందూ! గారెలు బాగున్నవి, ఇంక రెండెయ్య మంటావ?” అని అడుగుతాడు ధనుష్పాణి.


“నువ్వు తిను, నాకు చాలు” అని తిన్న తపుకు తీసుక పోయి అవతల జాలారు లో పెడుతుంది ఇందుకళిక.


ఇందుకళిక కాబోయే అత్త గారితో కాసేపు ముచ్చటించి, “ఇక పోయి వస్తానండి. ఇంట్లో అమ్మా నాన్నలు ఎదురు చూస్తారు” అంటూ మరోసారి ఇందుమౌళికి, మందాకినికి నమస్కరించి పోబోతుంటె ”జాగ్రత్త అమ్మా! ఇల్లు చేరగానే ఫోన్ చెయ్యి” అంటాడు ఇందుమౌళి. ‘సరేనండి’ అని బయలుదేరుతుంది ఇందుకళిక.


ఇందుకళికను ఆటో ఎక్కించి ఇంట్లోకి వస్తాడు ధనుష్పాణి.

పక్షము రోజులకే ఇరుపక్షాల వారు సంప్రదింపులు జరిపి వెంటనే ప్రభుత్వ నమోదు కార్యాలయములో ఇద్దరికి నమోదు వివాహం జరిపిస్తారు.


శుభం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.37 views0 comments

Commentaires


bottom of page