International Women's Day 2023 New Telugu article
Written By Neeraja Hari Prabhala
అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు.🌷🌷
స్త్రీ కోరుకునే స్వేచ్ఛ….
మన అమ్మల, అమ్ముమ్మల కాలంలో స్త్రీ ని వంటింటి కుందేలుగా , పిల్లలని కనే యంత్రం లాగా చూసి కేవలం ఇంటికే పరిమితం చేసి ఆమె స్వేచ్ఛాహక్కులను కాలరాసేవారు. ఆడపిల్ల పుట్టిన మొదలు కన్నవాళ్లు అమ్మో! ఆడపిల్ల ! అనీ ,ఆ పిల్ల పోషణకూ, పెళ్లి ఖర్చులకూ ఎలా? అని దిగులు పడుతూ ఆమెని గుండెలమీద కుంపటి లాగా భావించేవారు. ఇంక ఆమెకు చదువు సంధ్యలు ఎందుకు? చాకలి పద్దుకు లెక్కలు తెలిస్తే చాలు అని భావించి ఆమెకు విద్య లేకుండా చేసేవారు.
ఇంక వివాహమైన మొదలూ అత్తింటి బాధ్యతలు, భర్త, పిల్లలు, సంసార బాధ్యతలలో కడదాకా మునిగి తనువు చాలించేది. ఇంక ఆమె అభిప్రాయాలకు విలువేదీ ? కోరికలకు నెలవేదీ ? పాపం కష్టాలను భరిస్తూ కన్నీళ్లను మౌనంగానే రెప్పలమాటున దాచుకునేది. ఆనాడు "ఆడది అబల" అన్నట్టు ఉండేది.
కానీ తరాలతో పాటు కాలం కూడా మారింది. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టిన మొదలూ మగపిల్లలతో సమానంగా చదువులలో, ఆటపాటలలో అన్నిటిలో ఆరితేరి మంచిగా వృధ్ధిలోకి వచ్చి అంతరిక్షంలోకి కూడా వెళ్లివస్తున్నారు. ఈనాడు ఆడది "అబల కాదు సబల ' అని నిరూపించింది.
స్త్రీ విద్యావంతురాలై ఉద్యోగం చేస్తూ ఆర్ధిక స్వావలంబన సాధించి తన కుటుంబాన్ని చూసుకుంటూ, సమాజంలో కూడా తన స్థానాన్ని పెంపొందించుకుంటూ సామాజిక సేవ చేస్తూ రాజకీయాలలో కూడా రాణిస్తోంది. ముఖ్యమంత్రులు , ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు కూడా అయ్యారు, అవుతున్నారు. స్త్రీ తలుచుకుంటే అసాధ్యమేదీ లేదు.
"యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్ధితా" అన్నది యదార్ధం. స్త్రీ ఒక శక్తి.
ఆమె లేనిదే పురుషుని జీవితం పరిపూర్ణత కాదు. ఆడ, మగ అనే లింగ భేదము లేకుండా నవమాసాలు మోసి , మరోజన్మ (ప్రసవం) ఎత్తి బిడ్డకు ప్రాణం పోసే ప్రాణ శక్తి స్త్రీ.
భర్తను సేద తీర్చే చైతన్య శక్తి స్త్రీ.
మనిషిని పోరాట యోథునిగా తీర్చిదిద్దే శక్తి స్త్రీ.
తన శ్వాసను వదిలైనా సరే బిడ్డకు శ్వాసను అందించాలని నిస్వార్థంగా కోరుకునే ప్రాణి ఈ భూమి మీద కేవలం ఆమె మాత్రమే. అందుకే వేదాలన్నీ ఆమెకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చాయి . కనుకనే స్త్రీ " వేద స్వరూపిణి " అయినది.
నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి ప్రేమగా స్థన్యమిచ్చి పోషించి ఆ బిడ్డ వృధ్ధిలోకి రావాలని అనుక్షణం పరితపిస్తూ ఉండేది స్ర్తీ. నేటి కాలంలో తనకంటూ రక్షణ కోసం అవసరమైతే కరాటేవంటివి నేర్చుకుని తన్నుతాను సమయానుకూలంగా రక్షించుకోవాలి. ఎవరో వచ్చి తనని రక్షిస్తారనకోవడం పిచ్చి భ్రమ. స్ర్తీ ఒక శక్తి.
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః". ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు . కానీ ఈనాగరిక సమాజంలో స్త్రీ ని పూజించడం కాదుకదా ! ఆమె స్వేఛ్ఛగా తిరిగే హక్కు లేదు. రక్షణ కరువైంది. గుప్పెడు ప్రేమాభిమానాలను, గౌరవమర్యాదలను పొందుతూ స్వేచ్ఛగా విలవలతో కూడిన జీవితాన్ని కోరుకుంటోంది స్త్రీ.
……నీరజ హరి ప్రభల.
Comments