Interview Written By Nistala Vijaya Shankar
రచన : నిష్టల విజయశంకర్
విశాలమైన ఏసీ హాలు, చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలూ కుర్చీలలో కూర్చోని వెయిట్ చేస్తున్నారు. అది విశాఖపట్టణం లోనే అతి పెద్ద పేరున్న సువిధా ఇన్పోటెక్ మల్టీ నేషనల్ కంపెనీ. ఆ రోజు అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ ఎనలిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు అవుతున్నాయి. ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఆ కంపెనీకి బ్రాంచీలు ఉండటంతో అక్కడ ఉద్యోగం వస్తే హాయిగా విదేశాలకు ఎగిరిపోవచ్చు అని ఆశతో ఎదురుచూస్తున్నారు అక్కడకు వచ్చినవారు. అభ్యర్దులకు ఉదయం సరిగ్గా పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూ సమయం అని ముందుగానే తెలియచేసి ఉండటంతో ఎక్కువమంది వాళ్ళ సర్టిఫికెట్స్ తో పది గంటలకే ఆఫీసుకి వచ్చేసారు. చెప్పినట్టుగానే ఖచ్చితంగా పది గంటలవగానే అభ్యర్దుల పేర్లను పిలవడం మొదలుపెట్టారు. అభ్యర్దులు వస్తునే ఉన్నారు. ఇంటర్వ్యూలు అవుతునే ఉన్నాయి. పన్నెండు గంటలు అవగానే రిసెప్షనిస్టు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి “ఇక్కడ ఇప్పటివరకు వచ్చి వేచి ఉన్న వాళ్ళను తప్పించి ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే తిప్పిపంపించమని సర్ చెప్పారు” అన్నాడు. రిసెప్షనిస్టు లేచి నిలబడి “ఎస్ సర్ అలాగే “ అంది. అతను అక్కడ ఉన్న వారందరి పేర్లు నోట్ చేసుకొని లోపలకు వెళ్ళిపోయాడు. రిసెప్షనిస్టు తన సీటులో ఇలా కూర్చొందో లేదో ఒక యువకుడు చాలా కంగారుగా లోపలకు ప్రవేశించాడు. అతని చేతిలో ఈ కంపెనీ పంపిన ఇంటర్వ్యూ లెటరు ఉంది. కానీ చూడడానికి మాత్రం అతను ఇంటర్వ్యూకు వచ్చినట్టుగా అస్సలు కనిపించటం లేదు, కారణం అతని బట్టలు బాగా నలిగిపోయి, అక్కడక్కడా మరకలతో ఉన్నాయి, జుత్తు కూడా రేగిపోయి మనిషి చాలా అలసటగా కనిపిస్తున్నాడు. ఆ యువకుడు నేరుగా రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళి ఇంటర్వ్యూ లెటరు చూపించాడు. కానీ ఆ రిసెప్షనిస్టు కనీసం ఆ కాగితాన్ని చూడను కూడా చూడకుండానే “సారీ మిస్టర్, మీరు ఆలస్యంగా వచ్చారు. ఇంటర్వ్యూ టైమింగ్స్ పది గంటలనుండి పన్నెండు గంటల వరకే అని మీకు క్లియర్ గా లెటరులో ఇచ్చాము..... టైమ్ అప్ సో....... మీరిక వెళ్ళిపోవచ్చు“ అని చెప్పింది. ఆ యువకుడు “నాకు తెలుసు మేడమ్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇంటర్వ్యూకు సమయానికి హాజరు కాలేకపోయాను, ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి“ అంటూ ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసాడు. ఆమె “మా సర్ ఇంటర్వ్యూ టైమ్ అయిపోయిందని ఇప్పుడే నాకు తెలియచేసారు, అంతే కాకండా ఇప్పుడిక ఎవరు వచ్చినా తిప్పి పంపించమని నాకు ఆదేశాలు ఉన్నాయి కనుక నేను మీకు ఏ విధమైన సహాయము చేయలేను, దయచేసి నా టైం వేస్ట్ చేయకండి“ కాస్త కటువుగా అంది. అక్కడ ఇంతకుముందే వచ్చి కాల్ కోసం ఎదురుచూస్తున్నవాళ్ళు అతనిని వింతగా చూసారు. కొంతమంది నెమ్మదిగా “ఇప్పుడే కదా పన్నెండు అయింది, అనుమతిస్తే ఏమౌతుంది“ అంటుంటే మరికొంతమంది “సమయం పాటించాలి, అందరూ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమంటే ముందు వచ్చి కూర్చొన్న మనం దద్దమ్మలమా ఎంటీ?“ అంటూ గుసగుసలు పోతున్నారు. అతను వెనక్కు వచ్చి అలసటగా అక్కడ ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళందరివీ పేర్లు పిలుస్తున్నారు. రిసెప్షనిస్టు అతనితో “మిస్టర్ మా సర్ దగ్గర 12 గంటలవరకూ వచ్చిన వారి లిస్టు ఉంది. ఆయన వారి తర్వాత వచ్చిన వారిని అనుమతించవద్దని మాకు చెప్పారు, సో మీరు వెయిట్ చేసినా ఉపయోగం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు“ అంది. కానీ అతను “అందరి ఇంటర్వ్యూలు అయిపోయేవరకూ ఎదురుచూస్తాను మేడం, నా పేరు విజయ్ ఒక్కసారి మీ సర్ ని కలుస్తాను ప్లీజ్ నేను ఒక్క ఐదు నిమిషాలే కదా లేటుగా వచ్చాను“ అంటూ చాలా పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తుండటంతో అతనిని ఇంకేం అనలేక పోయింది ఆమె. అక్కడ కూర్చున్న వారందరివీ ఇంటర్వ్యూలు పూర్తి అయిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. ఆఖరిగా అతను మిగిలి ఉన్నాడు. అతను మరోసారి రిక్వెస్టు చేసేసరికి రిసెప్షనిస్టు కొంచెం భయంగానే వాళ్ళ డైరెక్టరుకు ఫోను చేసి “సర్ 12 గంటల తర్వాత విజయ్ అనే అతను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆలస్యంగా వచ్చాడు. నేను తిరిగి వెళ్ళిపొమ్మని ఎంత చెప్పినా ఒక్కసారి మిమ్మలిని కలుస్తానని ఎదురు చూస్తున్నాడు“ అని చెప్తూ ఉండగానే అవతల నుండి “బుద్దుందా లేదా నీకు, నేనా నీకు యజమానిని లేక ఆ వచ్చిన అతనా, ఐదు నిముషాలు లేటు అవునా కాదా అని నిర్ణయించవలసింది నేను, నువ్వుకాదు“ అంటూ గట్టిగా మాటలు వినిపించాయి. ఆ మాటలకు ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ మాటలు విజయ్ కూడా వినడంతో “సారీ మేడమ్ నా వల్ల మీరు అనవసరంగా మాట పడవలసి వచ్చింది. ఐ యామ్ రియల్లీ సారీ, కాకపోతే నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం అవడంతో మిమ్మలిని అనవసరంగా ఇబ్బంది పెట్టాను, క్షమించండి“ అంటూ తిరిగి వెళ్ళిపోవడానికి సిద్దమయ్యాడు. ఇంతలో ఇంటర్ కమ్ లో అతనినిలోపలకు పంపిచమని బాస్ నుండి ఫోన్ రావడంతో రిసెప్షనిస్టు “సర్ పిలుస్తున్నారు లోపలకు వెళ్ళండి“ అని చెప్పింది. అది వినగానే విజయ్ వదనంలో ఆనందం కనిపించింది. పోనీలే ఆయన తనను అనుమతించారు, ఎలాగోలా ఇంటర్వ్యూ లో సెలెక్టు అయితే తన సమస్యలు తీరిపోయినట్టే అని మనసులో అనుకుంటూ రిసెప్షనిస్టుకు ధాంక్స్ చెప్పి సర్టిఫికెట్స్ పైలుతో లోపలకు వెళ్ళాడు. అదొక ఏయిర్ కండిషన్డ్ ఛాంబర్. అక్కడక్కడ గ్రీన్ ప్లాంట్స్ కుండీలలో పెంచారు. కిటీకీలకు లేత రంగు పరదాలతో రూమంతా ఒక రకమైన సువాసనతో ఉంది. రూం మధ్యలో పెద్ద టేబిల్ దానికి ఇటువైపు చాలా ఖరీదైన కుర్చీలు రెండు ఉన్నాయి. కొంచెం పక్కగా ఒక సోఫా దాని ముందు చిన్న టీపాయ్. టేబిల్ కి అటువైపు కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనే ఆ కంపెనీ డైరెక్టరు రవీందర్ మెహతా. లోపలకు వచ్చిన విజయ్ ఆయనకు విష్ చేసాడు. దానికి ప్రతిస్పందిచలేదు సరికదా చాలా కోపంగా చూసాడు విజయ్ వైపు. కనీసం విజయ్ ను కూర్చోమని కూడా చెప్పకుండా “చూడు మిస్టర్ నీకు కాల్ లెటర్లో ఇంటర్వ్యూ టైమింగ్స్ ఏం ఇచ్చాము?“ అని అడిగాడు. “ సర్ అది పది నుండి పన్నెండు గంటలవరకు” చెప్పాడు విజయ్. “నువ్వు ఎక్కడ ఉంటావు, అక్కడనుండి మా ఆఫీసుకు రావడానికి ఒకవేళ బస్ లో అయితే ఎంత సమయం పడుతుంది?“ ప్రశ్నించాడు రవీందర్ “నేను ఋషికొండ దగ్గర ఉంటాను, అక్కడ నుండి సుమారు 40 నిముషాలు పడతుంది ఇక్కడకు అంటే సిరిపురం రావడానికి సర్“ చెప్పాడు విజయ్. “నీకు రెండు గంటలు టైం ఇచ్చి మేము మా విలువైన సమయాన్ని వెచ్చిస్తుంటే నువ్వు మాత్రం టైం దాటిపోయాక వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమంటే మేం తీసుకోవాలా, అసలు ఇంటర్వ్యూకే సమయానికి హాజరు అవ్వాలి అన్న సెన్స్ లేనివాడివి, రేపు జాబ్ మాత్రం సరిగ్గా ఏం చేస్తావు?........ నిన్ను కలవకుండానే పంపించాలని అనుకొన్నా కానీ నీ తప్పు నీకు తెలియాలి, నువ్వు పోగొట్టుకొన్న జాబ్ విలువేంటో తెలుసా నీకు, సెలెక్టు అయితే నెలకు ఏభై వేల జీతం, హౌస్ ఎలవెన్సు ఇంకా ఇతర ఎలవెన్సులు అన్నీ కలిపి సుమారు ఎనభై వేలు. నువ్వు ఐదు నిముషాలే అనుకొంటున్న నీ ఆలస్యం ఖరీదు ఎనభై వేలు. అది నీకు తెలియాలి. ఇంక నువ్వు వెళ్ళవచ్చు” చాలా కఠినంగా చెప్పాడు డైరెక్టరు రవీందర్ మెహతా. “సర్ మీరు చెప్పేది కరెక్టే సర్... కానీ నేను చెప్పేది కూడా కొంచెం వినండి సర్, నేను టైం కన్నా ముందే బయలుదేరాను ఇంటర్వ్యూకు అటెండ్ అవడానికి. కానీ నేను షేర్ ఆటోలో ఋషికొండ నుండి బీచ్ రోడ్డులో వస్తుండగా అక్కడ ఏక్సిడెంటు అయింది. నా కళ్ళముందే రోడ్డుకు అటువైపు బైక్ పై ఒక అబ్బాయి చాలా స్పీడుగా వస్తూ డివైడర్ ను గట్టిగా గుద్దుకొని పడిపోయాడు. మా ఆటో డ్రైవరు కూడా ఆటో ఆపడంతో అటువైపు వెళ్ళి ఆ అబ్బాయిని చూసాను. తలకి బాగా దెబ్బతగిలి రక్తం పోతుంది కానీ ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరూ వాళ్ళ వాళ్ళ పనులు బిజీ అనుకొంటూ ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైగా పోలీసులతో లేనిపోని ఇబ్బంది అని అందరూ చూసి వెళ్ళిపోతుండటంతో నేను అతనిని ఆటోలో ఎక్కించి గీతం హాస్పిటల్ లో జాయిన్ చేసాను. అతనికి రక్తం ఎక్కించాలి అన్నారు కాకపోతే అతనిది ఓ నెగిటివ్ .. త్వరగా దొరకదంటే నాది అదే గ్రూపు అవడంతో రక్తం ఇచ్చాను. అందువల్ల ఇంకా లేట్ అయింది. ఆ అబ్బాయి తాలూకు వాళ్ళకు తెలియచేద్దామంటే అతని సెల్ ఫోన్ ఏక్సిడెంటు అయినప్పుడు బండి క్రింద పడి పనిచేయకుండా పోయింది. నేను వెంటనే బయలుదేరాను కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి ఐదు నిముషాలు లేట్ అయ్యింది. ప్లీజ్ సర్ కొంచెం కన్సిడర్ చేసి మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి సర్ , ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సర్, ప్లీజ్ “ అంటూ అభ్యర్ధించాడు విజయ్. వింటున్న రవీందర్ వ్యంగంగా నవ్వుతూ “ ఓ అయితే తమరు హీరోనా, ఎవరికో ఏక్సిడెంటు అయింది రక్తం ఇచ్చాను అని సినిమా కధ చెప్పగానే ఆ..ఆ... అవునా ఎంత మంచి పని చేసావు, గ్రేట్ అని మెచ్చుకొని నిన్ను ఇంటర్వ్యూ చేయకుండానే జాబ్ ఇచ్చేస్తానని అనుకొన్నావా, నేనంత వెర్రి వెధవలా కనిపిస్తున్నానా... నమ్మేయటానికి?“ అన్నాడు. “లేదు సర్ నేను అబద్దం చెప్పటం లేదు మీరు కావాలంటే గీతం హాస్పిటల్ కు ఫోను చేసి కనుక్కోండి, లేదంటే నా దగ్గర ఆ అబ్బాయి ఫోటో ఉంది ఫోనులో ఒక్కసారి మీరు చూడండి” అన్నాడు విజయ్. “అవసరం లేదు మిస్టర్, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా సరే, ఇది జీవితం, నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను. నా దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా అలాగే ఉండాలని అనుకొంటాను. నా దగ్గర పనిచేసే వాళ్ళు నా కంపెనీ వర్కుకు ఇంపార్టెన్సు ఇవ్వాలి అంతేకానీ రోడ్డు మీద ఎవరికో ఏదో అయిందని టైం వేస్టు చేయడం నేను సహించను. ఇప్పుడు నేను చెప్పినా నిన్ను పంపేయకుండా రెండు నిముషాలు నాకు ఫోనులో నీ గురించి చెప్పింది కదా ఆ రిసెప్షనిస్టు ఆమెకు సాలరీలో రెండు వేలు కట్ చేస్తున్నాను నా టైం వేస్టు చేసినందుకు అదీ నా పాలసీ, సో నీ లాంటివాడికి ఎన్ని అర్హతలున్నా నా దగ్గర జాబ్ ఇవ్వను. నౌ యూ కెన్ గో, నాట్ ఓన్లీ దట్ ఐ యామ్ కీపింగ్ యువర్ నేమ్ ఇన్ బ్లాక్ లిస్ట్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా నువ్వెప్పుడైనా మా కంపెనీ జాబ్ కి అప్లయి చేసినా ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోతుంది నీ అప్లికేషన్. ఇంక నువ్వు వెళ్ళి సోషల్ సర్వీ సు చేసుకో “ అన్నాడు రవీందర్. ఇంతలో రవీందర్ ఫోన్ మోగింది. విజయ్ కు బయటకు వెళ్ళిపొమ్మన్నట్టు చేయి చూపించి ఫోను తీసాడు రవీందర్. అటునుండి ఫోను చేసింది రవీందర్ ఫ్రెండ్ డాక్టర్ సతీష్. అతను గీతం హాస్పిటల్ లో న్యూరాలజీ హెడ్. “రవీందర్... .. మీ అబ్బాయి కుమార్ కి ఏక్సిడెంట్ అయింది. మా హాస్పిటల్ లోనే జాయిన్ చేసారు, నేను ఇప్పుడే రౌండ్స్ కి వెళ్ళినప్పుడు చూసాను, త్వరగా రా“ అని చెప్పాడు. పొజిషన్ కొంచెం సీరియస్సే కానీ సమయానికి అతనిని హాస్పిటల్ లో జాయిన్ చేసిన వాళ్ళే బ్లడ్ కూడా ఇవ్వటంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఫోను కట్ చేసాడు. ఫోన్ మాట్లాడి చూసిన రవీందర్ కు విజయ్ అతని చాంబరు నుండి బయటకు వెళ్ళిపోతూ కనిపించాడు. రవీందర్ కు విజయ్ చెప్పింది తన కొడుకు గురించే అని అర్దమైంది. తను ఎంత తప్పు చేసాడో కూడా అతనికి అర్ధమైంది. అతను కంగారుగా విజయ్ విజయ్ అంటూ పిలుస్తూ తన ఛాంబరు నుండి రిసెప్షను హాలులోకి వచ్చేసాడు. అతని పిలుపుకు వెనుకకు తిరిగిన విజయ్ దగ్గరకు వెళ్ళి ఫోనులో తన కొడుకు ఫోటో చూపించి “ఇతనినేనా నువ్వు ప్రొద్దున హాస్పిటల్ లో జాయిన్ చేసింది” అని అడిగాడు. విజయ్ అవును అనగానే అతని చేతులు పట్టుకొని “సారీ విజయ్ , నువ్వు కాపాడింది నా కొడుకునే, వాడు నా ఒక్కగానొక్క కొడుకు, నా ప్రాణం, నీకు ఎలా ధ్యాంక్సు చెప్పుకోవాలో నాకు అర్ధం కావట్లేదు. నీకు ఈ జాబ్ చాలా అవసరం అన్నావు కదా, నిన్ను సెలెక్టు చేస్తున్నాను” అన్నాడు. అప్పటికే బాస్ ని చూసి లేచి నిలబడిన రిసెప్షనిస్టుతో “వాణీ హెచ్. ఆర్ డిపార్టుమెంటు హెడ్ రాంని వెంటనే విజయ్ వివరాలు తీసుకొని ఎపాయింట్మెంటు ఆర్డరు ప్రిపేర్ చేయమని చెప్పు” అంటూనే విజయ్ తో “విజయ్ ప్లీజ్ నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు నేనిప్పుడు హాస్పిటల్ కు వెళ్తున్నాను ఓకే నా” అంటూ బైటికి వెళ్ళబోతున్న రవీందర్ ని విజయ్ “సర్ ఒక్క నిముషం“ అంటూ ఆపాడు. ఆగిన రవీందర్ తో “సర్ మీరు నాకు జాబ్ ఇచ్చారు చాలా సంతోషం కానీ నాకు ఈ జాబ్ వద్దు“ అన్నాడు. రవీందర్ తో పాటూ అక్కడ ఉన్న వారందరూ ఊహించని ఆ మాటకు షాక్ అయ్యారు. విజయ్ “అవును సర్ నాకు మీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మీరు నేను ఎవరికో రక్తం ఇవ్వడం కోసం ఐదు నిమిషాలు ఇంటర్వ్యూకు ఆలస్యమయ్యానని నన్ను బ్లాక్ లిస్టులో పెడ్తానన్నారు, అలాంటి మీరు నేను రక్తం ఇచ్చింది మీ కొడుకు కే అని తెలిసి నాకు జాబ్ ఇచ్చేసానన్నారు. మీ దృష్టిలో మీ కొడుకుది మాత్రమే ప్రాణం, వేరేవాళ్ళ ప్రాణానికి విలువలేదు. అంటే మీరు స్వార్ధపరులు,” అన్నాడు. నో.. నో.. విజయ్ అంటూ ఏదో చెప్పబోతున్న రవీందర్ ని అడ్డుకొన్నాడు విజయ్. ”నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు, మధ్యలో నన్ను అడ్డకోకండి సర్, మీ సమయమే వృధా అయిపోతుంది, మీ అబ్బాయిని చూడటానికి మీరు త్వరగా వెళ్ళాలి కూడాను” అంటూ తన మాటలు కొనసాగించాడు విజయ్ ”మీ రెండు నిమిషాల సమయం వేస్టే చేసిందని మీ రిసెప్షనిస్టు జీతం లో రెండు వేలు కట్ చేస్తానని ఎంత ఈజీగా చెప్పారు, మరి ఉదయం నుండీ మీ ఆఫీసుకు ఎంతో మంది వచ్చి గంటలు గంటలు వెయిట్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. అందులో నా కన్నా సమర్ధులు, ఎక్కువ అర్హతలు ఉన్నవారు చాలా మంది ఉండి ఉండవచ్చు, కానీ మీరు మీ అబ్బాయికి ప్రాణదానం చేసాను కాబట్టి కనీసం నా ఇంటర్వ్యూకూడా తీసుకోకుండా నన్ను సెలెక్టు చేసామన్నారు, అంటే వాళ్ళ రెండు గంటల సమయానికి మీ దృష్టిలో ఏ విలువా లేనట్టేనా. నేను లేటుగా వచ్చానని ఒప్పుకొన్నాను, మిమ్మల్ని కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కండక్టు చేయమని రిక్వెస్టు చేసాను, అప్పుడు సెలెక్ట్ అవుతానని నా మీద నాకు నమ్మకం. అంతే కానీ మీరు దానంగా ఇచ్చే ఉద్యోగం నాకు అక్కరలేదు. మీరు ఎలా అయితే మీ దగ్గర పని చేయడానికి తగిన అర్హతలున్న వారిని ఉద్యోగానికి ఎంపిక చేసుకుంటారో అలాగే మేము కూడా ఎవరి దగ్గర పనిచేస్తామో వారికీ కొన్నిమానవతా విలువలు, అర్హతలు ఉండాలి అనుకొంటాము. సారీ నా దృష్టిలో మీరు రైట్ ఎంప్లాయర్ కాదు సో ఐ డోంట్ వాంట్ టు బీ యువర్ ఎంప్లాయి బై” అంటూ బైటకు వెళ్ళిపోతున్న విజయ్ ను అలాగే చూస్తుండిపోయాడు రవీందర్.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పారు.
ఇటువంటి కథలు చాలా చదివినా శైలి మరలా చదివించేలా చేసింది.
పాత్ర నేపథ్యాలు పరంగా ఆంగ్లం దొర్లినా అవి పరిమిత స్థాయిలో ఉంటే బాగుంటుంది.
శీర్షిక కూడా కథకు సరిపడా ఉంది.
రచయిత నిష్టల విజయ్ శంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
-
దొండపాటి కృష్ణ®