top of page
Singampalli Sesha Sai Kumar

జగమంత కుటుంబం


'Jagamantha Kutumbam' written by Singampalli Sesha Sai Kumar

రచన : సింగంపల్లి శేష సాయి కుమార్

పాత కాలం నాటి చెక్క తలుపును, కట్టెతో రెండుసార్లు దబ దబ కొట్టినట్టు చప్పుడైంది. లోపలనున్న మంచంపై నుండి ఓపిక చేసుకొని, మూతికి మాస్క్ కట్టుకొని తలుపు తీసేటప్పటికి ఓ మూడు నిమిషాలు పట్టేసింది సిద్దాంతి గారికి. నిశబ్దం అలుముకున్న చిన్న మిద్దెలోనికి ఏవో వెచ్చని కాంతి కిరణాలు చప్పుడు చేస్తున్నట్లు వచ్చాయి ఆయన వాకిలి తెరవగానే. వాకిలి గడపకు ఆనుకొని ఓ చేతి సంచి , దానికి ఓ రెండు భారల దూరంలో సలీం మాష్టారు.

'సంచి తీసుకో' అన్నట్టు ఓ సైగ చేసి , "ఏమన్నా కావాలంటే ఫోన్ చెయ్యి , సాయంత్రం వచ్చేటప్పుడు పట్టుకొస్తా" అంటూ ఆయనకు మాత్రమే వినపడేలా చెప్పి గేటు మూసి రోడ్డుకు ఉత్తరం వైపు నున్న వీధిలోకి వెళ్ళిపోయాడు.


సిద్దాంతి గారికి కరోనా వైరస్ సోకింది . శివాలయంలో అర్చకత్వం , చుట్టు పక్కల రెండు , మూడు పల్లెల్లో పౌరోహిత్యం . ఊరికి ఒకే ఒక్క పెద్ద సామి ఆయన . వయసు మీద పడింది. భార్య ఆయనను వదిలి వెళ్ళి చాలా కాలం గడిచిపోయింది. పిల్లలు లేరు. ఇద్దరూ చిన్న పిల్లల్లా ఉండేవారు. ఇంట్లో చీటికీ మాటికీ చిన్న చిన్న గొడవలు ఎందుకని వారికి వారే ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటే "పొద్దుపోవద్దూ"అంటూ సమాధానం ఇచ్చుకునే వారు.


ఆవిడ లేక పోయినా ఆయన అంత దైర్యంగా ఉన్నారంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది చుట్టుప్రక్కల వాళ్లకు. ఉదయాన్నే సంధ్యా వందనం చేసుకొని ఆయన వంట ఆయనే బొగ్గుల కుంపటిపై వండుకొనే అప్పుడప్పుడు మడి కట్టు మనసు వాడు. అలాగని ఇతరులంటే చిన్న చూపు కాదు . "సమయం రాలేదు వచ్చినప్పుడు భోజనం చేస్తాలే "అంటుండే వాడు ప్రాణ స్నేహితుడు సలీం దగ్గర. పక్క సందులోనే సలీం సారు ఇల్లు, ఆయనో గవర్నమెంటు టీచరు.


ఎప్పుడైనా మాటల్లో నువ్వు మా ఇంట్లో ఎందుకు తింటావులే అని అరిస్తే" అన్న మాయములైనవన్ని జీవములు/ కూడు లేక జీవ కోటి లేదు/కూడు తినెడి కాడ కుల భేదమేలకో /కాళికాంబ హంస కాళికాంబ"అంటూ వీర బ్రహ్మంగారు చెప్పిన పద్యం చెప్పి, వారిని నొప్పించకుండా ఓ చిరు తిండి పదార్థం నోట్లో వేసుకొని వెళ్ళేవాడు.


సిద్ధాంతి గారికి ఎక్కడి నుండి వచ్చి పట్టుకున్నదో ఏమో మాయదారి కరోనా , వచ్చి నాలుగు రోజులు అవుతోంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, నీరసం డాక్టర్లు ఇంటికొచ్చి , వాడాల్సిన మందులిచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి , బి. పి. , షుగరు లేవు కాబట్టి ఇక్కడే ఏకాంతంగా ఉండండి, అందునా ఇంట్లో వ్యాధి అల్లుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. "అంటూ సలహా ఇచ్చి పోయారు. వెళ్తూ వెళ్తూ "బాగా భోజనం చేయాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, శ్రమ పడకూడదు"అంటూ ఓ రెండు ముక్కలు చెవినేశారు.


ఇంకేం చేయాలో పాలుపోలేదు అంతే సలీం కు ఫొన్ చేసి విషయం చెప్పేసారు సిద్ధాంతి గారు. ఇంకేం మూడు పూటలా భోజనం , మంచి మంచి పండ్లు, మాత్రలు, ఆవిరి పట్టే మిషను, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక సంచిలో పెట్టి తలుపు దగ్గర పెట్టి ఇంటికెళ్లి ఫోన్ చేసి ఇంకెమన్నా కావాలా అని అడిగే వాడు. ఎదో ఈశ్వరానుగ్రహమో , సిద్ధాంతి గారి రోగనిరోధక శక్తి మహిమో గానీ కరోనా నుండి ఓ కొన్ని రోజుల్లోనే పూర్తిగా కొలుకున్నాడు.

* * * * * *


ఓ సాయంత్రం గుళ్ళో ఏకాంతంగా స్వామికి దీపారాధన ముగించుకొని వెళ్తుంటే అప్పుడే ఇంటి అరుగుపై కూర్చున్న శంకరయ్య పలకరించాడు. అది ఆయన కూతురి ఇల్లు, పక్కూరి నుండి అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు.


"ఏం సామి కరోనా వచ్చిందట, తగ్గిందా? తిండి ఎట్లా చేసావు? మా పాప చెప్పింది సలీం సార్ తెచ్చి ఇచ్చాడంట కదా?" అంటూ వరుసగా ప్రశ్నల బాణాలు కురిపిస్తున్నాడు. మాయదారి కరోనా నే తట్టుకున్నోడు ఈ ప్రశ్నలు ఓ లెక్కా ఒక్క మాటలో "ఊ. . "అని అన్నిటికీ సమాదానం చెప్పి ముగించేశాడు.


ఐనా వదలని శంకరయ్య "మీరు వాళ్ళింట్లో తింటారా ? నేనెప్పుడూ చూడలేదే?" అంటూ ఈ సారి సిద్ధాంతి గారికి పెద్ద జవాబు చెప్పగలిగే ప్రశ్న వేసేసాడు.

"నేను తిననని మెడలో బోర్డు కట్టుకున్నానా

శంకరా, ఐనా నువ్వు బియ్యం , కూర గాయాలు పండిస్తావు. మీ కూతురు గుడికొచ్చి నాకు సామాగ్రి ఇస్తుంది. నేనెప్పుడన్నా తీసుకోను అన్నానా? , ఐనా మనం ఉండేది ఏ దేశంలో , ఎప్పటి నుంచో మనం అందరం కలిసే ఉంటున్నాం. కులభేదాలు , మత భేదాలు చూస్తే ఈ దేశం ఇప్పటి వరకు ఇలా ప్రశాంతంగా ఉండేది కాదు.


ఆచారాలు , వ్యవహారాలు మానకూడదు. అది మన ఇంటి గడప లోపలి వరకే , బయటకు వస్తే మనం ఉండేది సమాజంలో అందునా ఎప్పుడూ సలీం పిల్లకు స్కూల్లో చెబుతుంటాడు 'భిన్నత్వంలో ఏకత్వం 'అని , అలాంటి చోట వాడి స్నేహితుడు ఐన నేను అలా ప్రవర్తిస్తే ఇక నీ పేరు గల దేవుడు నన్ను పూజ చేయడానికి దగ్గరకు రానిస్తాడా చెప్పు .


నాది , నీది జగమంత కుటుంభం . నేను పురోహితం చేస్తున్నాను అంటే మనందరి హితం కోరుతున్నాను అని అర్థం కదా అలాంటిది ఆపదలో ఉంటే మీరు పెట్టే అన్నం తింటే తప్పా చెప్పు" అంటూ శంకరయ్యకు చేతిలో గుడి నుంచి తెచ్చిన కొబ్బరి ముక్క , ఒక పువ్వు ఉంచి చెప్పే సరికి కళ్ళు కాస్తా జ్ఞానోదయమై టప్పును వెలుగుతున్న వీధి దీపం వైపుకు మళ్ళింది.

"ఆ . . . లేదులే సామి , రేపు సామాగ్రి గుడికి తీసుకొస్తా" అంటూ తాను పలికిన మాటకు సిగ్గు పడి. 'విశాల దేశంలో విశాల భావం ఉంటేనే కదా మనిషి జన్మకు సార్ధకత' అనుకుంటూ ముందుకు కదిలాడు.

***శుభం***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


36 views0 comments

Comments


bottom of page