top of page

జగ్గాపురం పెద్దమ్మ


'Jaggapuram Peddamma' written by Talluri Nagamani

రచన :తాళ్లూరి నాగమణి

తెలి మబ్బు అట్టా పట్టి, గాలి సుతారంగా తోలుదామని ఒళ్ళు ఇట్టా ఇరుసుకుంటదో లేదో కరెంటు పోయిద్ది. అసలు మా ఊళ్ళో మబ్బట్టిన సంగతి, వాన పడేలా ఉండే సంగతి ఆ కరంటు ఆపీసరుకు ఎట్టా తెలిసిద్దో మరి దుర్భిణీ ఏసి సూసినట్టే తీసేత్తాడు. ఎంత బుడ్డీ ఎలిగించినా, కొవ్వొత్తి ఒళ్ళు కరిగించినా గుడ్డి ఎలుగే గానీ నల్ల జీకటిని మింగేసేంత ఎలుతురు వచ్చిద్దా ఏందీ? “మొన్న తవుడమ్మే కోటేశు గాడిని వాకిట్టోనే కట్ల పాము కరిసిందంట. నెత్తీనోరు బాదుకుంటా ఆసుపత్రికి ఏసుకెల్లారంట, కాళ్ళు మంచం పైకి పెట్టుకో” అని మా ఇంటాయన్ని గసురుతా రెండు నువ్వుల ఉండలు చేతిలో ఎట్టాను. నముల్తా ఉంటే బెల్లం పాకం నువ్వుల సారం కమ్మగా గొంతు జారతా ఉండాది గాబోలు “భలే జేసినావే, ఏ క్లాసుగా ఉండాయి” అనుకుంటా పసపసా నమల్తా ఉండాడు. ఏదో గునగునా గొణగతా బిరాబిరా వాకిట్లోకి, నట్టింట్లోకి ఉరుకులు పరుగులు పెడతా ఉంది మా తోటి కోడలు.

“యామే! మీ అప్ప ఏందే చిందు మీద ఉండాది, అప్పచ్చులు గానీ ఇయ్యలేదా ఏంది నువ్వూ” మా ఇంటాయనకు పరాచికాలకేం తక్కువవలా.

“ఊకోవయ్యా! నీకేం తోచుబడి కానంటందా ఏంది? ఆ మడిసి తోటి కయ్యాటకు కూసుండావు, ఇనిందంటే కాళ్ళకాడ గోతాం జాడించిన మాదిరి జాడించి ఎండేసిద్ధి. పరధ్ధానం మడిసి కదా పొయ్యి మీద పాలు మరిసిందో లేక కూర మాడబెట్టిందో” సర్ది చెప్పినాను.

మర్నాడు, ఆ మర్నాడు కూడా మడిసి యవ్వారం చిందు మీదే ఉండాది, “యాందకా! రాజియ్యగారి దొడ్లో ఉసిరి చెట్టు దులుపుతారంట! కాయలేమన్న గావాల్నేమో అడగమన్నాడు మీ మరిది” అని మాట గలపబోయినా!

ముంగిలాగా మూతి ముడిసింది. నేను ఏనాడూ నోరు జారి అన్నదీ లేదు. ఆ మడిసి ఓరుపుగా ఉండాదీ లేదు.. మరెందుకబ్బా ఈ పరాకు? ఏ తుపాను రాబోతోందో అనుకుంటానే ఉండాను. గుండె గుబగుబ లాడతానే ఉండాది. మూడో రోజు గావాలా.. మద్దేనపు ఏళ ఫోనెత్తి ఎవురితోనో ఏందో మాట్టాడతా ఉంది “అయ్యో! దానికేం మాయరోగం కమ్మిందే, మంచిదేమో అనుకుంటిని గదా ఇన్ని దినాలు!” అని యాష్ట పోతా మెటికలు ఇరిసింది, రెండో మూడో శాపనార్ధాలు కూడా ఇడిసింది.

నాకు ఇక జూడూ గుబులు రేగింది. ఏపాకులు నమిలినట్టు చేదుగా అయిపాయె మనుసు.

“ఏందే! ఎప్పుడూ మొకం అట్టా దిగజారబెట్టుకుంటావు, ఏందో పారేసుకున్న దానికి మల్లే, ఇప్పుడు ఎవురేమంటిరి నిన్ను” అని నా పెనిమిటి గదిమేసరికి ఇక ఆగలేకపోయినాయి నాలుగు రోజుల నుండీ నేను దాపెట్టుకున్న కన్నీళ్ళు. బడబడమంటూ కారిపోయినయ్యి.

“నువ్ నాయం జెప్పయ్యా! పేద్ద పెద్ద మడుసులు గందా మీరు మీ బంధురికాల్లో. ఆయమ్మి లచ్చిమిని కనింది మీ వదినే అయినా పెంచింది నేను గాదా! నేను కాపరానికి వచ్చే నాటికి ఇంకా పాలైనా మరవని పసిగుడ్డు గాదా! ‘చినమా చినమా’ అని పొద్దుగూకులు నా యనకమాల తిరిగేది పిల్ల. పాలకు బోయినా కాలవలో బట్టలు జాడిచ్చబోయినా సంకనేసుకు పోయి సాదింది నేను గాదా” ముక్కులు ఎగరేసినాను.

నిన్నేమైనా శివయ్యన్న ఇంటికాడి పిచ్చి కుక్క గాని కరిసిందా ఏందే! ఎవులు కాదన్నారిప్పుడు నువ్వెంత కడుపులో పెట్టుకు పెంచింది మన ఊరంతా తెలుసు” అన్నాడు మా ఆయన.

“అట్టైతే ఈ మాట కూడా ఇని నాయం జెప్పు. ఎవుర్నీ నమ్మే రోజులు గాదని అయినోళ్ళలో మనం గాదా ఆ పిల్లకు సంబందం జూసింది, దగ్గరుండి లగ్గం జేసింది. అత్తారింటికి ఆ పిల్ల పోయిన్నాటి నుండీ రెండు రోజులకో పాలి పోను జేసి ఏడీ ఎచ్చా కనుక్కుంటన్నానా లేదా”

“కాదని ఏ మగాడు అన్నాడే, తప్పు అని ఏ ఆడది అన్నదీ! దాని గుంజుకుని తీసకచ్చి నీ పాదాల ముందు పారేస్తా”

“మరి ఆయమ్మి లచ్చిమి నిన్న కూడా ‘అంతా బానే ఉండాం చినమా, నీ అల్లుడు డూటీ పని మీద బెంగుళూరు పోయినాడు వారం తరవాత వస్తా అన్నాడు’ అనింది. మరి ఇప్పుడేమో అమ్మకు పోను జేసి ఏందో రగస్యంగా చెబుతుంటే ఆమె తిట్లు లంకించుకుంది. కాపరంలో ఇక్కట్లు ముక్కట్లు ఉంటే మనకు చెప్పాల గానీ అమ్మకు చెప్పిద్దా! ఈ మడిసి ఏనాడైనా శాంతంగా నాలుగు మంచి మాటలు జెప్పిందా.. ఎవురిదైనా కాపరం కదదోసిందా! అసలు నీయన్న కాలు బెట్టిన కాడ కూసుని మాట్టాడుకునే జనం కూడా లేచి జుట్లు పట్టుకుని తన్నుకోబొతారు గదా” ఈసడించుకున్నా.

“నువ్వనేది ఏందే! లచ్చిమి అత్తగారింట్లో ఏదో కీసులాట జరగతాంది, ఆయమ్మి నీ దగ్గర దాపరికంగా ఉందనే కదా! ఓపాలి మాట్టాడితే తెలిసిద్ది కదా” అన్నాడు.

“పనిమంతుడు పందిరేస్తే పిచ్చికలు పడేసినాయంట! అయ్యో నా రాత! నాకు చెప్పకూడని యవ్వారం అనే గదా తల్లికి జెప్పుకుంది, నేను పరాయి దాన్ని అయినానేమో ఇన్నాళ్ళకి! మడుసులకి ఇలవ ఇచ్చే లచ్చనం మీ కొంపల్లో ఏనాడు ఉండాదిలే” ముక్కులు ఎగబీలుస్తానే ఉండాను. జేబులో నుండీ పోను దీసి కూతురిని పలకరిస్తానే ఉండాడు‌, నేను సైగ జేసేది ఇనేటట్టు లేడు. నెత్తి బాదుకున్నా ఆగెటట్టు లేడు. “అమాయ్! ఎట్టా ఉండావమా! మీ చినమ్మకి గుబులుగా ఉండాదంట నీమీద, అందుకే జేసినా” అంటూ నా చేతిలో పెట్టాడు పోను.

“లచ్చిమీ!” పిలస్తా ఉంటేనే గుండె గొంతులో కొట్టకపోయే, ఎంతైనా కన్న పేగు కన్నా పెంచిన మమకారమే తీపి. “నా బంగారు తల్లీ ఎట్టా ఉండావమ్మా” అన్నాను.

“బానే ఉండాను మా, నా మీద గాలి మల్లితే ఈడకి రాకూడదా నువ్వూ చిన్నాయనా? నీ అల్లుడు మొన్నే అంటా ఉండాడు ‘ఏట కూర తినాలని ఉందే! మా చిన్నత్త వొండినట్టు నీకూ నీ అమ్మకూ సేతకాదు’ అని. పిల్ల పుచ్చ పువ్వులా పకపకమని నవ్వతా ఉంటే గుబులు గాలికి తేలిపోయినట్టే ఉండాది.

“అమ్మీ ఆ అంగట్టో ఏట మాసం కొనగాకూ వండగాకు. మస్తాను బాబాయి రేపటి ఆదోరం నాడు ఏటను కోసి భాగాలు పంచుకుందామన్నాడంట. మీ చిన్నాయనను బంపి రెండు కేజీలు తెప్పిచ్చి ఆయగల ఏసి పంపుతాలే నీ తమ్ముడికిచ్చి. రెండు మాట్టు వొండిపెట్టు అల్లుడికి. బుడ్డ ముండ ఏం జేత్తాందే ఓపాలి దాని మాట ఇంటా పోను ఇయ్యమ్మా” అన్నా.

యాడుండాది? అయ్యమ్మా మనవరాలు సందకాడ పోయారు ఊరిమీద పెత్తనాలకి. మూడు మాట్టు దాలేసినా నీళ్ళ కాగు కింద. నీళ్ళు మసిలి పోయే, పొయ్యి ఆరిపోయే గానీ ఈళ్ళకి కొంప గుర్తు రాలా” ముద్దుగా ఇసుక్కుంటా ఉంటే మనసు సల్లబడింది గానీ యవ్వారమే ఇంకా తేల్లా. లచ్చిమి బాగానే ఉండాది మరి మా తోటి కోడలు పోను జేసి ఎవుర్ని తిట్టిందబ్బా!

అడిగేస్తినా గోడలకు చెవులుండాయయ్యో! నేను ఆవులించినా నీ మరదలికి జేరిపోతంది, ఈ కాపరం నేను చెయలేనయ్యో!” అని శోఖండాలు మొదులు. ఆ తల్లిని కదిలిచ్చేదాని కన్నా గుళ్ళోకి పొయ్యి అయ్యగారు జెప్పే హరికధ ఇనేది మేలు అనుకుని గమ్మున ఉండా.

రెండు దినాలు గడిసినంక తాటితోపుల కాడ అరెకరంలో దిబ్బ మీద నాటిన కంది మొక్కలకి మందు కొట్టేదానికి పోయినాం, నేనూ మా ఇంటాయనా!

“నేను ఒక్క రవ్వ పచ్చి మేత కోసకొస్తా గానీ నువ్ ఇంటికిబోయి గొడ్లకి నీళ్ళు చూపిచ్చి సావిట్టో కట్టెయ్” అని ఇంటాయన అనేవరకి గబగబా ఇంటికొచ్చే వరకి వాకిట్టో కూచుని ముచ్చట్లు పెట్టుకుని ఉండారు మా తోడి కోడలూ ఇంటెనకమాల అలివేలూ.

ఇప్పుడంటే మోకాలి చిప్ప అరిగి నడవలేకపోతాంది గానీ ఈయక్క ఒకప్పుడు ఒంటిగ అరెకరం నాటు ఏసేదంట. కోత కోసినా, నూర్పిళ్ళ కాడ చేటలందించినా గిరగిరమంటూ బొంగరంలా తిరగతా ఉండేదంట. బహుపనిమంతురాలని మా ఆయన జెపతా ఉంటాడు.

“ఏందకా! వంట వండినవా లేదా” అని నేనడిగినా ఆ చెవిలోకి పొయ్యేలా లేదు ఆ మాట.

“ఊ..ఊ..అంటానే మా తోడి కోడలు మొఖంలో మొఖం పెట్టి కళ్ళప్పజెప్పి చూస్తా కబుర్లు ఇంటా ఉండాది.

మా తోడి కోడలు మొఖం అంతా చిన్నబుచ్చుకుని “డబ్బున్న మారాజులకు గోరోజనం జాస్తి అని మా నాయన చెబితే నేను నమ్మలా! కలికాలం కాసుల కాలం అని చెప్పేది మా ముసిల్ది” నిష్టూరంగా అంటోంది. సావిట్టోకి పోయి బరిగొడ్డును సమదాయించుకొచ్చినా.

“రాయమ్మీ! పొద్దుగూకులూ పొలం మీన దుంకులాడతా ఉంటావు. నిమ్మలంగా కూసోని కనపడవు, ముచ్చట్లు ఇనవు. రా.. కూసో!” అలివేలక్క పిలిసింది.

పని ఉండాదని పక్కకు పోతే నా గోడు ఇనే మడిసి కూడా కరవైందని పది రోజులు దెప్పి పొడుస్తదని కూసింత దప్పిక దీర్చుకుని పక్కనే కూలబడి నేనూ ఓ చెవ్వొగ్గా.

మా. తోడికోడలు పుట్టింటోళ్ళు బాగా బలిసి ఉండారు ఎవురి ఇంటి బాగోతమో మొదలెట్టింది. “ఆ పెద్దమ్మ భలే భలే కోకలు గట్టుకుని,నగలు ఏసుకుని భలే ముస్తాబుగా ఉంటాది. ఆయమ్మకు కూసింత టెక్కు పెచ్చు. డబ్బు మదం పట్టేసిందిలే, బీదాబిక్కి కళ్ళకి అగపడరు. నల్లగా ఉండాదని మనవరాల్నే ఒళ్ళో నుండి కిందకు నూకేసినాది. కోడలు నల్లగ ఉండాదని ఎంత చిన్న చూపో!” అనింది.

“ఆ పెద్దమ్మకు నలుపు నచ్చకపోతే తిరపతి పోయి నున్నంగా గుండు గీక్కోవాలి గానీ పసిబిడ్డను నూకేసిద్దా! మా మల్లీసరి పిన్నికి జెబితే మెరక చేలో ఏసి ఈడ్చిద్ది”అన్నాను.

“ఇప్పుడు రవంత మారిందిలేయే తలుపులు.. దిగులుబడి సస్తాంది! ఆయమ్మ కొడుకు కోడల్ని ఒగ్గేసినాడు. పాపం ఒంటిరిగా పాపను సాక్కుంటా వంటలు జేసుకుని బతుకుతాంది”

“అయ్యో! ఎందుకు అకా”

“పెళ్ళాం మీద బహు అనుమానం ఉండాదిలే! పెళ్ళానికి కడుపొస్తే అది తన వల్ల కాదని బయటకు నెట్టేసాడు. ఇద్దరు ఆడపిల్లకాయలు పుట్టినారు. అయ్యమ్మ ఓ పిల్లను సాకుతాంటే తల్లి ఓ పిల్లను సాకుతాంది. అదేందీ వింత!

ఆయబ్బాయి మీద మనుసు పడ్డ అమ్మి ఒకర్తి ఆక్సిడెంటు జేపిత్తే ఈ అబ్బికి దెబ్బలు తగిలాయి అపుడు పిల్లలు పుట్టరని డాట్రు చెపతాడులే.”

“మనసు పడితే మనువాడాలి గానీ ఆక్సిడెంటు ఏందకా”

“అబ్బా! నీకు బుర్ర లేదమ్మీ, ఆ కారులో మరో పిల్ల ఉండాదిలే. ఆ పిల్ల అంటే ఈ పిలగాడికి ఇష్టం అని ఆ పిల్లను చంపేదానికి ఆ ఆక్సిడెంటు?”

“ఆ అమ్మాయే చనిపోయిద్దని, ఈ పిలగాడు బతుకుతాడని ఆ పిల్లకి ఎట్టా తెలిసిందబ్బా! బహ్మ దేవుడు ఏదైనా కోరుసు పెట్టి నేర్పినాడా ఏంది?”

‘మరి ఆక్సిడెంటు జేయించిన పిల్ల ఈ మనువు ఆపలేదేందో మరి..సవరాలు కట్టిచ్చుకోను పోయిందా ఏందీ?’

మనసులోనే అనుకున్నా! బయటకు అంటే మా తోడికోడలు ఇంతెత్తున దూకుద్ది.

“మరి కడుపొచ్చినాకైనా మరోపాలి పరీఛ్చ జేయించుకోకూడదా అకా, డాట్టర్లకి ఏం కరువొచ్చింది దేశంలో. ఇప్పుడేదో టెస్టు కూడా ఉండాదంట కదా ఎవురి పిల్లలు ఎవురో కనిపెట్టేది! ఆ అబ్బాయి సదువుకోలేదా!”

“అయ్యో పిచ్చిదానా! ఆ యబ్బాయే ఓ పెద్ద డాట్టరు. ఇంకేది ఇంకోళ్ళు జెప్పేది? అయినా ఆ టెస్టు చేసిన డాట్టరుతో కూడా అబద్ధమే సెప్పిత్తాందే ఆ అమ్మి.. ఆ డాట్టరు బాబు ఎవురి మాటా నమ్మడాయే! ఆడపిల్లలు ఎదిగి ఈడుకొస్తిరాయే! తల్లి ఇద్దరు పిల్లలను దీసుకుని ఊరొదిలేసి పొరుగుర్లో అట్లు అమ్ముకుంటా బతకాల్సిన రాత రాసె!

మా తోడి కోడలు కూతురు కాపరానికి పొయ్యేనాడు గూడా కంట తడి పెట్టలేదు గానీ ఈ కాపురం గురించి ఎంత బుగులు పడతందో! ఈ యవ్వరమే గామాలా మొన్న కరెంటు పోయిన నాడు పోనులో మాట్టాడతా యాష్ట పోయింది. పాపం ఏందో ఇన్ని తికమకలు ఒక ఇంట్లోనే పెట్టాడు భగమంతుడు. మీరేమన్నా అనుకోండి నాకు కడుపు రగులుకు పోయిందంటే నమ్మండి.

“ఎంత మంది చెప్పినా ఇనకుంటే ఆళ్ళు మడుసులా...మా సావిట్టో దున్నలా! అది ఊరా.. మరేమన్నానా! ఒక ఆడబిడ్డ ఇన్ని ఇక్కట్లు పడతంటే సూత్తా ఉండారా ఊళ్ళో జనాలూ!”

“అకా!నువ్వేమైనా అనుకో! మీ జగ్గాపురం పెద్దమ్మను తొలీగా జూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈమె కోడళ్ళను ఏగనీయదు, సంసారాలు సాగనీయదు అని. నీ మరిదిని తీసుకుని ఓసారి ఆ ఊరు పొయ్యొద్దాం. నాలుగు మంచి మాటలు చెప్పి ఆ కాపరం కదదోద్దాం. ఇని సక్కగా కాపురం చేసుకుంటిరా సరేసరి. లేకుంటే నీ మరిది సంగతి తెలుసుగా చింత బరికె తీసుకుని ఆడామగా సూడకుండా తుక్కు రేగ్గొడతాడు. దెబ్బకి దయ్యం వదిలిద్ది” అన్నాను.

పకాపకా నవ్వతా “ఓ యమ్మీ తలుపులూ! అది టీవీలో రోజూ వచ్చే నాటిక. చానా బాగుండాది సూడమని మా పెద మరదలు పోను జేసి కథ చెబితే నేనూ నాలుగు దినాల సంధి సూస్తా ఉంటి. భలేగా ఉండాది. నీకు తలకాయ నొప్పి అని టీవీ జూడవు కదా! అందుకే ఈ కథ మీకు తెలవలా “అంది.

“హమ్మయ్యా! బతికించినావకా! ఇందాకటి నుండీ ఏందో బుర్ర గిర్రన తిరగతాంది. తగ్గిన తలకాయ నొప్పి మల్లా తిరగబెట్టినట్టే అనిపించింది. కథలు కథలుగా నువ్ చెబతంటే నమ్మిక కలగలా! టీవీలోనా! సరిపోయింది పో. సరి ఉంటానకా” దులపరించుకుని లేచి వచ్చేసాను.

సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నాగమణి తాళ్ళూరి

సాధారణ గృహిణి


67 views0 comments

Comments


bottom of page