top of page

జాలరి జీవనం


Jalari Jeevanam written by Dr. Prathibha Lakshmi

రచన : డా. ప్రతిభా లక్ష్మీ


ఒక ఇల్లు సముద్రం ఒడ్డున ఉన్న భూమి మీద అయితే, తల్లిగా ఆరాధించే, ఆ సముద్రాన్ని మరొక ఇల్లుగా భావించి, వేటకు పోతే, ఆ తల్లి ఒడిలోనే రోజులు సైతం ఉండే మత్సకారుల జీవితం ప్రతిదినం గండమే. ఆ అలల కదలికలతో, తమ శ్వాసనిశ్వాసలు మమేకమవగా, వారి

జీవితమంతా ఆ తీరానికి పరిమితం చేసిన బ్రతుకుల్లో, ఆశలకు హద్దులు పెట్టుకున్నా,ఊహలకు పరిధులు లేవు.


'బాబాయ్‌.. బాబాయ్‌.. నా మావ ఏమైనా కానొచ్చిండా..' సముద్రం ఒడ్డున ఉన్న తన గుడిసె

బయట నిల్చొని అడిగింది మంగి.


' లేదే మంగి... రేపొస్తాడులే.. బెంగడకు.. పానం జాగర్త..' అంటూ, తన వలను మోసుకుంటూ

వెళ్ళిపోయాడు బాబాయ్‌.


' ఎప్పుడొస్తాడో ఏందో.. నిన్నననంగ పోయిన మడిసి.. ఇయ్యాలన్న రాకపాయే.. పెళ్ళాం

కడుపుతో ఉంది, పెందరాళే వెళ్లి సూస్కోవాలె అనే ధ్యాస ఏమైనా ఉంటే గదా..' గులుగుతూనే

అత్తకి అన్నం పెట్టింది.


' ఈ పాలి వచ్చినాక, నీ కాన్పు అయ్యేదాకా మల్లి గాడిని మల్ల ఏటకు వెళ్లనియ్యొద్దు..' కోడలి

బాధ అర్ధం చేసుకున్నట్లు చెప్పింది అత్త.


'ఇంటి కాడనే ఉంచి, ముగ్గురం కలిసి వలలల్లుకుంటా ఉందాం.' అంది కోడలికి ఓదార్పుగా.


ఆమెకు ఒక్కగానొక్క కొడుకు మల్లి. కడుపున పడ్డప్పుడే చేపలు పట్టడానికి అని నిర్ణయించేసారు. ఎందుకంటే ఆ కుటుంబంలో, వాళ్ళ కులవృత్తి కాక ఇంక వేరే ఆలోచనే

తెలియదు. కొడుకు అయితే పది, కూతురు అయితే ఏడు దాకా చదివించడం. తరవాత అమ్మాయికి ఇంటి పని, అబ్బాయికి చేపలు పట్టడం నేర్పించడం.. ఈడు రాగానే పెళ్లిళ్లు చేసేయడం. పెద్దవాళ్ళు అయ్యాక వలలు అల్లుతూ, పిల్లల్ని చూసుకుంటూ ఉండడం. తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో అదే పద్దతి.


మంగి, మల్లి కి మామ కూతురే. ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకళ్ళ మీద, ఒకళ్ళు చాలా ప్రేమ పెంచుకున్నారని, వాళ్ళిద్దరికీ చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మంగికి పదిహేను., మల్లి కి పద్దెనిమిది ఉండగా పెళ్లి జరిగిపోయింది. 'మావా.. మావా..' అంటూ వాడు ఇంట్లో ఉన్నంత

సేపు చుట్టూ తిరుగుతూ ఉండడం. మల్లి వేటకు పోయిన నిమిషం నుండి వాడి కోసం కళ్ళు కాయలు కాసే లాగా ఎదురు చూడడం. ఇది తప్ప మంగికి ఇంక వేరే లోకం తెలియదు. పెళ్ళైన ఏడాదికి మంగి కడుపుతో ఉంది అని తెలిసి కుటుంబం అంతా సంబరపడ్డారు. ఇంకా చిన్నపిల్ల

మనస్తత్వం ఉన్న మంగికి, కాన్పు ఎలా అవుతదో, పుట్టేటోడిని ఎలా పెంచుతుందో అని వాళ్ళ

అత్త ఎప్పుడూ కంగారు పడుతూ, కోడలిని కంటికి రెప్పలా చూసుకునేది. ప్రాణం అంతా పొట్టలో

పెట్టుకొని, మనసంతా మామ మీద పెట్టుకొని బ్రతుకుతుంది మంగి. అత్తకు భోజనం పెట్టి, కాసేపు గుమ్మం దగ్గరే ఉంది. మల్లి కోసం ఎదురు చూసి, అత్త కేకేయడంతో, తను కూడా తినేసి, తన మామ గురించే ఆలోచిస్తూ ఒరిగింది మంగి.

మల్లి వెళ్లిన పడవ, అనుకోకుండా పెద్ద తుఫానులో ఇరుక్కుంది. 'గాలి ఏగం ఎక్కువవుతుంది.

తొందరగా ఒడ్డు చేరకపోతే కష్టం అవుతది. బేగి నడుపు. అనుకున్నాడు తనకు తానే మల్లి.


చేతుల్లో ఉన్న బలమంతా పెట్టి, నీటి తాటికి ఎదురొడ్డి పడవను నడిపే ప్రయత్నం చేసాడు.

ఎంత కష్ట పడ్డా.. ఆ తుఫాను తీవ్రతకు నావ అదుపు తప్పి, మల్లి నీళ్ళల్లో పడ్డాడు. అలలకు కొట్టుకుపోతూ, మునగకుండా కష్టపడుతూ, ఇన్నాళ్ళ తన అనుభవం అంతా వాడి, శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఈత కొట్టాడు. చివరికి కష్టం మీద ఒక బండని చేరుకున్నాడు. దాని

మీద అలిసిపోయి సొమ్మ సిల్లినట్టు పడిపోయాడు.


ఆ రాత్రంతా అక్కడే తెలియకుండా

పడుకున్నాడు. సూర్యుడి కిరణాల వడికి, స్పృహ వచ్చి లేచి, తను బ్రతికి ఉన్నందుకు సంతోషించి, పక్కకు చూసే సరికి, మల్లి పక్కనే ఒక జలకన్య తననే చూస్తూ కనిపించింది. ఒక్క

సారిగా భయంతో గట్టిగా అరిచాడు. మల్లి అరుపుకి భయపడ్డ జల కన్య, ఒక్క సారిగా నీటిలోకి మునిగిపోయింది.


తను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు మల్లికి... చుట్టుపక్కల అంతా చూసాడు మల్లి. కనుచూపు మేరలో నీళ్ళు తప్ప ఇంక ఏమి కనిపించలేదు. తను ఇంటికి వెళ్ళే దారి కనిపించట్లేదు.


' ఓలన్న ఉన్నారా.. నన్ను కాపాడండి..' అని గట్టి గట్టిగా అరిచాడు. ఎవరికి వినిపించే అవకాశం లేదు అని అర్ధం అయ్యి.. ' అయ్యో.. నా బతుకు ఇక్కడే అయిపోతుందా.. నా

యమ్మ, మంగి, బిడ్డ.. ఎలా బతుకుతారు.. దేవుడా.. నన్ను రచ్చించు...' అని అరుస్తూ బాధపడ్డాడు.

మల్లి బాధ చూసి, మళ్ళీ ఆ జల కన్య మెల్లిగా నీటి నుండి బయటకు వచ్చి.."బాధపడకు నేను నీకు సహాయం చేస్తా... " అంది. దారి తోచని స్థితిలో ఉన్న మల్లి కి ఒక్క సారిగా ఆశ కలిగింది.


'నిజంగానా... నువ్వు జలకన్నెవా.. నిజంగా జల కన్నెలు ఉంటారా..' అన్నాడు కళ్ళు నలుచుకుని, చూస్తూ..

'అవును.. నాపేరు సిరి..' అంది అందంగా నవ్వుతూ..

'ఓ.. నాపేరు మల్లి.. నన్ను నువ్వు ఎట్ట కాపాడతావు..?' అన్నాడు.


'నువ్వు మీ ఇంటికి వెళ్ళడానికి నేను సహాయం చేస్తా..' అంది.

'అట్లనే.. ఇప్పుడు నన్నేమి సేయమంటావ్‌ సెప్పు.' అన్నాడు ఆశగా..'నువ్వు మీ ఇంటికి వెళ్లడానికి, తూర్పు వైపు అయిదు గంటలు వెళ్ళవలసి ఉంటుంది.' అంది.


'అయిబాబోయి.. అయిదు గంటలు నేను ఆపకుండా ఈత కొట్టలేను.. నడిమిట్లనే మునిగిపోతా..' అన్నాడు కంగారుగా..


'మునిగిపోయినా ఏమి అవ్వకుండా, నువ్వు నీటిలో కూడా గాలి తీసుకునే లాగా నేను చేయగలను' అంది.


'దేవతల్లే కనిపించినావు.. అలా చేసి పున్నెం కట్టుకో తల్లి..' అన్నాడు చేతులు జోడిస్తూ.


' దానికి, నువ్వు నా పెదవులను ఒకసారి పెదవులతో తాకితే, నీకు నీటిలో గాలి తీసుకునే శక్తి వస్తుంది. దానితో నువ్వు క్షేమంగా మీ లోకానికి వెళ్లగలవు.' అంది.


'ఛీ.. నేను నిన్ను ముద్దాడాలా!!? నేను నా మంగిని గాక ఇంకోళ్లను ముద్దాడలేదు.. ముద్దాడను గూడా.!!' అన్నాడు

ఖరాకండిగా. 'సరే అయితే, నేను వెళ్లిపోతున్నా.. ఇక్కడే ఆకలితో, దాహంతో అలమటించి చచ్చిపోతావ్‌.. నీకు ఇంక ఏ దారి లేదు..' అంది ఆ జలకన్య.


'ఆగమ్మి.. ఆగు.. నన్నాలోచించుకోనివ్వవా ఏంది.. నా మంగి అసలే నీళ్లోసుకొని ఉంది.. నేనీడనే సచ్చిపోతే, ఆడ అది ఆగం అయిపోద్ది.. ఒక్క ముద్దుకు ఏం కాదులే.. తప్పదు కదా

మరి.. నీళ్లల్ల ఎట్ట పోత మరి.. సరే.. కానీ.. నాకు ఆ శక్తి ఏదో ఇయ్యి..' అన్నాడు అయిష్టంగా ముద్దుకు సరేనంటూ .


ఆ జలకన్య, మల్లి పెదవులను తన పెదవులతో తాకగానే, మల్లి శరీరమంతా కంపించినట్టు అయ్యి, రెండు పక్కలా మెడ పక్కన గీతల లాగా వచ్చి, మళ్ళీ నీటిలో పడిపోయాడు.

ఆశ్చర్యం.. మల్లి నీటిలో ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. అదంతా వింతగా ఉంది మల్లి కి..


నీటి లోపల అందమైన చేపలను, రంగు రంగుల జలచరాలను చూసి ఆశ్చర్యపోయాడు మల్లి. తను

ఇన్నేళ్ళుగా ప్రయాణిస్తున్న ఓడ కింద ఇంత అందమైన ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోయాడు.


'నీకు ఈ శక్తి ఈ రోజు సూర్యాస్తమయం వరకే ఉంటుంది. ఇక నీ ప్రయాణం ప్రారంభించు.' అంది సిరి.


'ఇగో.. అమ్మి.. అయిదు గంటలు పోవాల్నంటుంటివి.. మరి, నాకు బాగ ఆకలైతుంది. నీరసంతోని ఎక్కడన్నా పడిపోతానో ఏమో.. ఏమైనా తిననీకి దొరుకుతయా చెప్పి ఇంకా

పున్నెం కట్టుకోరాదు..' అన్నాడు పొట్ట పట్టుకుంటూ...


'సరే.. రా.. పక్కనే మా లోకం ఉంది. నువ్వు కొంత దూరంలో ఉండు. నేనేమైనా తినడానికి తీసుకొస్తా.. కాని ఒక్క విషయం

గుర్తుపెట్టుకో.. మా వాళ్ళు నిన్ను చూస్తే నీ ప్రాణాలకే

ప్రమాదం..' అంటూ మల్లి ని తీసుకొని వెళ్లింది. మల్లి చుట్టూ ఉన్న ఆ వింత లోకాన్ని చూస్తూ, సంబరపడిపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక, ఒక చోట, రహస్యంగా మల్లిని ఉంచి,

'నువ్వు ఇక్కడే ఉండు. నేను ఏమైనా తినడానికి తీసుకొస్తా' అని చెప్పి వెళ్ళింది.


మల్లికి ఒక వైపు ఆకలి.. మరో వైపు.. జల కన్యల లోకం అంటే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం వల్ల.. ఆగలేక.. మెల్లిగా.. ఆ జల కన్య వెళ్లిన వైపు కొద్దిగా ముందుకు వెళ్ళాడు.


మరు నిమిషం, ఎవరో ఇద్దరు జలపురుషులు వచ్చి, 'మనిషి.. మనిషి..' అని మల్లి ని పట్టుకొని అరిచారు... 'అయ్యో.. దొరికిపోయానే' అనే భయంతో మల్లి గజ గజ వణికిపోయాడు.

వెంటనే.. అక్కడికి చాలా జలకన్యలు, జల పురుషులు వచ్చేసారు.. అందరూ మల్లి ని కోపంగా చూస్తున్నారు..


'నన్నొగ్గేయండి.. ఒలమ్మి సిరి.. నన్ను కాపాడమ్మి.' అని అరిచాడు.


'సిరి నా..' అంటూ.. అందరూ గుస గుస

మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి ఒక

పెద్దాయన వచ్చాడు. వెంటనే అందరూ పక్కకు తప్పుకొని ఆయనకు నమస్కారం చేశారు.

'ఎవరు నువ్వు..!?' అని అడిగాడు ఆ పెద్దాయన, గంభీరమైన స్వరంతో.


'నా పేరు మల్లి.. నిన్న రాత్రి తుఫాను వచ్చుల్లా.. అందులో పడవ కొట్టుకుపోయి, ఇలాగొచ్చాను.. సిరి అమ్మి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నన్నొగ్గేస్తే నానింటికి ఎల్లిపోతాను.

అసలే చాన తోవ పోవాల.' అన్నాడు భయం భయంగా.


అంత లో సిరి అక్కడికి వచ్చింది... అక్కడ ఉన్న అందరినీ చూసి, భయంగా పక్కకు నిలుచుంది.


'సిరి.. వీడు చెప్పేది నిజమేనా.. నువ్వే ఈ మానవుడిని ఇక్కడికి తీసుకొచ్చావా..' అడిగాడు కోపంగా


'క్షమించండి నాన్నా... కష్టాల్లో ఉన్నాడని కాపాడాను. ఆకలిగా ఉంది అంటే.. ఏమైనా తినడానికి ఇద్దామని..!' అంది.. వణుకుతున్న గొంతుతో తడబడుతూ.


'ఈ మానవుడి వృత్తి తెలుసా నీకు.. జాలరి.. అంటే, మన సహచరులైన చేపలను పట్టుకొని, చంపి, అమ్ముతాడు.. వండుకొని తింటాడు.. అలాంటి వాడికి నువ్వు సహాయం చేసావా..!?' అన్నాడు గొంతు పెద్దది చేస్తూ.. కోపంగా.


'అతని జీవనం కోసం తనకు తెలిసిన వృత్తి చేసుకుంటున్నాడు. తప్పేం ఉంది' అంది సిరి ధైర్యం

కూడగట్టుకొని.


'వాడు మన శత్రువు. మన జాతి నాశకుడు... వాడిని వెనకేసుకొస్తున్నావా..' అన్నాడు మళ్ళీ కోపంగా...


'అది కాదు నాన్నా... ' అని ఏదో చెప్పబోతుండగా,


'అయినా.. వీడు నీటిలో గాలి ఎలా పీలుస్తున్నాడు.. అంటే.. నువ్వు.. నువ్వు... వాడికి ఆ శక్తిని ఇచ్చావన్న మాట.' అన్నాడు ఇంకా కోపంగా.


నిశ్శబ్దంగా నిలుచుండి పోయింది సిరి. ఆ సంభాషణ చూస్తూ, తన భవిష్యత్తు అర్ధం కాక, భయంతో వణికిపోతూ..

నిలుచున్నాడు మల్లి.


'ఇప్పుడు ఈ మానవుడు వాళ్ళ లోకంకి వెళ్లి ఇక్కడ జరిగిందంతా చెబితే ఏం జరుగుతుందో

తెలుసా నీకు!!?' అన్నాడు మళ్ళీ ఆ పెద్దాయన.


'సామీ.. నేనీలకు సెప్పను గానీ.. నన్నొగ్గేయి సామి... నీకు పుణ్యముండిద్ది.. నా ఇంటిది

నీల్లోస్కొని ఉండే. మా యమ్మకు నేనొక్కడినే బిడ్డను.' అన్నాడు ప్రాధేయపడుతూ.


'ఈ భూమి మీద ఉన్న చరాచర జీవులన్నింటిలో నమ్మకూడని ప్రాణి మనిషి..' అన్నాడు.


'నాన్న గారు.. దయచేసినా తప్పు క్షమించండి. అతన్ని వదిలేయండి.. భూమి మీదకు వెళ్లినాక ఇక్కడిది ఏదీ గుర్తు ఉండకుండా చేద్దాం.. పాపం నాన్న.. వదిలేయండి...' అంది సిరి. 'వీడు మన శత్రువు... వదిలే ప్రసక్తే లేదు.. వీడిని కాపాడే ప్రయత్నం చేసినందుకు నీకు శిక్ష తప్పదు' అంటూ.. చెయ్యి గాలిలోకి లేపాడు.. వెంటనే ఒక పెద్ద వెలుగుతో, తన చేతిలోకి పెద్ద కత్తి వచ్చింది.


'ఈ పాపి పాపాలు ఇక్కడితో సమాప్తం.' అంటూ మల్లి గొంతు కోసేసాడు.


'మావా..' అంటూ... పెద్ద కేక పెట్టి లేచింది మంగి. ఒళ్ళంతా చెమటలు పట్టి.. గుండె వేగంగా

కొట్టుకుంటుంది తెలుస్తుండగా, భయంతో వణికిపోతోంది. వెంటనే.. చుట్టూ చూసుకుంది. మంగి తన గుడిసెలోనే

ఉంది. పక్కన అత్త పడుకుని ఉంది. మంగి అరుపుకి భయపడి లేచింది అత్త. 'ఏమైందే మంగి.. ఏమైనా కలగన్నావా.!? ఇయ్యాల వచ్చేస్తాడులే మల్లి గాడు... బెంగడకు...' అంది వెన్ను తడుతూ...


'అమ్మో.. కలనా..' అంటూ... లేచి మంచి నీళ్ళు తాగింది. అప్పుడే సూర్యోదయం అవుతుంది. 'మావా.. తొందరగా రా మావా..' అని మనసులో అనుకుంటూ ఇక లేచి తన దినచర్య మొదలు పెట్టడానికి బయటకు వెళ్ళింది.


ఎదురుగా సముద్రం నుండి వస్తూ.. మల్లి కనిపించాడు.

పరుగున వెళ్లి.. గట్టిగా హత్తుకొని, 'మావా.. వచ్చేసినావా.. నేను సానా బెంగడిపోయా.. ఇట్టా, ఎక్కువ రోజులు పోబాకు మావా...' అంటూ కంట తడి పెట్టుకుంది.


'నాకేటవుతదే.. పిచ్చి దాన.. సర్లే.. ఇయ్యాల్టి సంది, పొద్దుగూకగానే గుడిసెకొస్తాలే.. ఏడవకు..' అన్నాడు.. మంగిని పట్టుకొని.. సంతోషంగా చూసిన మంగి, మల్లి మెడ మీద ఉన్న నల్లటి గీతలు కనిపించగా, ఒక్క సారిగా భయపడింది. వెంటనే కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసి, అది తన భ్రమ అని నిర్ధారించుకొని ధైర్యంగా ఊపిరి పీల్చుకుంది.



గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత్రి పరిచయం : డా. ప్రతిభా లక్ష్మీ

వైద్యురాలు, ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య ఉపాధ్యాయురాలు, రచయిత, సామాజిక వేత్త, మహిళా సాధికారత కోసం 'వీ ఫర్ విమెన్' అనే సంస్థ వ్యవస్థాపకులు.

435 views4 comments
bottom of page