top of page

జీవన స్వరాలు


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Jeevana Swaralu' New Telugu Story







(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పెళ్లి పందిట్లోంచి వినిపిస్తున్న సుస్వరాల సన్నాయి మేళాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.


“చక్కని అన్నమయ్య కీర్తనలు విని చాలా రోజులు అయ్యింది. ఈ మధ్యన చెవులు చిల్లులు పడే వాయిద్యాల హోరు, పిచ్చి పిచ్చి పాటలు విని విసుగెత్తిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది” అన్నాడు రామమూర్తి, పక్కన ఉన్న జగన్నాధంతో.


“ఈ సన్నాయి మేళం వాళ్ళది రాఘవాపురంట. రాయుడు గారు ప్రత్యేకంగా పురమాయిన్చారుట’ అన్నాడు జగన్నాధం.


రాయుడుగారి మేనకోడలు పెళ్లి శివపురం బాలాజీ ఎ.సి. ఫంక్షన్ హాలులో చాలా వేడుకగా జరిగింది. విందు భోజనం కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలా మంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం. సన్నాయి రమణ, రాయుడుగారి దగ్గరికి వచ్చి దణ్ణంపెట్టి “వెళ్తామండి అయ్యగారూ” అన్నాడు వినయంగా.


“భోజనాలు చేసారుగా. టీ తాగి వెళ్ళండి” అన్నారు రాయుడుగారు.


ఆయన మాట కాదనలేక “అలాగే నండి” అని మండపం చివర తమకు కేటాయించిన చోటు దగ్గరకి వచ్చి తమ వాళ్ళతో ‘దొర గారు టీ తాగి వెళ్ళమన్నారు’ అని చెప్పాడు.

సన్నాయి మేళానికి డబ్బులు ముందుగానే ఇచ్చేశారు రాయుడు గారు.


భోజనాలప్పుడు గుమాస్తా గారు వచ్చి దారి ఖర్చులు డబ్బులు కూడా ఇచ్చేశారు. డబ్బులు దండిగా వచ్చినందుకు అందరూ సంతోషించారు. పావుగంట గడిచేసరికి ఒక అమ్మాయి ట్రే లో మైసూరు పాకు, కారబ్బూంది ప్లేట్లలో తీసుకువచ్చి సన్నాయి బృందం ఆరుగురికీ ఇచ్చింది.


డోలు వాయించే శేఖర్, ఆ అమ్మాయి కట్టుకున్న పరికిణీ చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లి ఊరేగింపు బొమ్మలు, ఆ అమ్మాయి పరికిణీ మీద చాలా అందంగా కుట్టి ఉన్నాయి. జాకెట్టు చేతులమీద కూడా హంస బొమ్మలు రంగు రంగుల దారాలతో కుట్టి ఉన్నాయి.


“అమ్మాయి గారూ, మీ పరికిణీ చాలా బాగుందండి. బొమ్మలు కూడా బాగా కుట్టారు” అన్నాడు శేఖర్.


ఆ అమ్మాయి చిన్నగా నవ్వి “రాజమండ్రిలో కుట్టించారు. నెల్లాళ్ళు పట్టింది ఈ బొమ్మలు కుట్టడానికి” అని వెళ్ళిపోయింది.

రాయుడు గారి అబ్బాయి వెంకటాద్రి రాయుడు ఆ అమ్మాయిని పిలిచి అడిగాడు ‘ఆ కుర్రాడు నీతో ఏం మాట్లాడాడు’ అని.


‘పరికిణీ గురించి అడిగాడు. అంతే’ అని చెప్పి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది.


తన స్నేహితులు ఇద్దర్ని తీసుకుని శేఖర్ దగ్గరకు వచ్చి లాగి చెంప మీద కొట్టాడు వెంకటాద్రి రాయుడు. సన్నాయి మేళం వాళ్ళు అందరూ నివ్వెరపోయారు ఆ సంఘటనకి.


రమణ ముందుకు వచ్చి ‘దండాలయ్యా, ఏం పొరపాటు జరిగింది అయ్యా’ అన్నాడు వణికిపోతూ.


“ఏం జరిగిందా, మీ వాడు మా ఆడపిల్లలతో వేళాకోళం ఆడుతున్నాడు” అని మళ్ళీ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు వేంకటాద్రి రాయుడు.


రమణ చటుక్కున ఆయన కాళ్ళు పట్టుకుని “సేమించండి అయ్యా. సేమించండి ఇంకెప్పుడూ ఇటువంటి పొరపాటు జరగదు” అని ప్రాధేయపడ్డాడు.


శేఖర్ ఎదో చెప్పబోతే ‘నోర్ముయ్ ఎదవకానా’ అని కేకలేసాడు.


‘నీ మొహం చూసి వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండమని చెప్పు మీ వాడికి. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పు మీ వాడికి’ అని హుంకరించి వెళ్ళాడు వెంకటాద్రి రాయుడు.

తండ్రి నీలాద్రి రాయుడు ఎంత సాత్వికుడో , కొడుకు వెంకటాద్రి రాయుడు అంత దుడుకు మనిషి. అది రమణకి బాగా తెలుసు. ఐదు నిముషాలలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్నాయి మేళం బృందం.


ఒక అరగంట గడిచాక నీలాద్రి రాయుడుకి తెలిసింది ఈ సంగతి.


“ఏమిటో మా వాడికి కోపం ఎక్కువ అవుతోంది ఈ మధ్య. ఏదైనా విషయం ఉంటే వివరంగా మాట్లాడాలి. తప్పు జరిగితే మందలించాలి. అంతేకానీ ఎదుటివారి మీద చెయ్యి చేసుకోకూడదు కదా” అని గుమస్తా దగ్గర వాపోయాడు రాయుడు.


ఇంటికొచ్చాక శేఖర్, తండ్రితో “నేను తప్పుగా ఏమీఅనలేదు ఆ అమ్మాయిని. పరికిణీ మీద బొమ్మలు చాలా బాగున్నాయని అన్నాను. ఆ మాత్రం దానికే నలుగురిలో కొట్టి అవమానం చేసారు” అని బాధపడ్డాడు.


“చూడు శేఖర్, మనం పేదవాళ్ళం. అరిటాకు లాంటి వాళ్ళం. ముల్లు అరిటాకు మీద పడినా, అరిటాకు ముల్లు మీద పడినా అరిటాకుకే నష్టం.పెద్దోళ్ళపెళ్ళిళ్ళలో ఆడాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల. మౌనంగా ఉండడడమే మంచిది” అన్నాడు రమణ.

పెళ్ళిలో జరిగిన అవమానం తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయాడు శేఖర్. మిత్రుల సాయంతో చిన్న ఉద్యోగం సంపాదించుకుని జీవించసాగాడు.

****

కాలచక్రంలో సంవత్సరాలు గిర్రున తిరుగుతున్నాయి. వెంకటాద్రి రాయుడుకి తిరుగుళ్ళు ఎక్కువ అయ్యాయి. తాగుడు, వ్యభిచారం వ్యసనాలతో పూర్తిగా పతనమైపోయాడు. నీలాద్రిరాయుడు ఆస్తి కోడలు పేర, మనవల పేర రాసాడు. కొడుక్కి నామమాత్రం డబ్బు ఇస్తున్నాడు అతని అవసరాలకి, లేకపోతే కోడల్ని నానా బాధలు పెడుతున్నాడని.


కొడుక్కి శివపురంలో జరిగిన అవమానం తర్వాత మళ్ళీ ఎప్పుడూ సన్నాయి మేళంతో శివపురం వెళ్ళలేదు రమణ. మేళానికి వేరే ఊళ్ళు వెళ్తున్నాడు గానీ శివపురం మాత్రం వెళ్ళడంలేదు. తన బృందంలో మిగతా వారిని పంపుతున్నాడు అక్కడికి.


వెంకటాద్రి రాయుడి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. లివర్ పూర్తిగా పాడైపోయింది. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు తండ్రి. లివర్ మార్పిడి జరిగితేనే బతుకుతాడని చెప్పారు డాక్టర్లు.


ఎవరిదైనా లివర్ దొరికితే మీకు కబురుచేస్తాం ఇంటికి వెళ్లిపొండని చెప్పడంతో కొడుకుని తీసుకుని శివపురం వచ్చాడు రాయుడు. ఇంటి దగ్గరే వైద్యం నడుస్తోంది.


ఒకరోజు సారధి రమణ దగ్గరకు వచ్చాడు.”చూసావా మావా, కండ కావరం మనిషికి తగిన శాస్తి జరిగింది.వెంకటాద్రి రాయుడికి లివర్ పూర్తిగా పోయిందంట.ఆ రోజు మన శేఖర్ ని అన్యాయంగా కొట్టాడు. దేవుడు సరైన శిక్ష వేసాడు” అన్నాడు సారధి.


“ఒరేయ్, తప్పురా. అలా మాట్లాడకూడదు. ఆయనకీ పెళ్ళాం, బిడ్డలు ఉన్నారు. ఆయన తొందర ఆళ్ళని బాధించకూడదు. పెద రాయుడు గారు దేవుడు. ఆయన చల్లగా ఉండాల” అన్నాడు రమణ.


“ఊరుకో మావా, నీయన్నీ పాతకాలం ఆలోచనలు. చిన రాయుడి పాపం ఆడిని కట్టి కుడుపుతుంది” అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు సారధి.


శివపురం లోని విషయాలు అన్నీ రాఘవాపురం ప్రజలకు తెలుస్తాయి. రెండూ దగ్గిర ఊళ్ళే. ఒక వారం గడిచాక హైదరాబాద్ డాక్టర్ నుండి ఫోన్ వచ్చింది రాయుడికి. ‘ఒక ఆక్సిడెంట్ కేసు వచ్చింది. లివర్ ఇవ్వడానికి వాళ్ళ బంధువులు ఒప్పుకున్నారు. మీరు వెంటనే మీ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ రండని’ చెప్పారు డాక్టర్.


వెంటనే కొడుకుని తీసుకుని అంబులెన్సు లో హైదరాబాద్ వచ్చాడు రాయుడు. కుటుంబ సభ్యులు కారులో వెనకాలే వచ్చారు.


మర్నాడు వెంకటాద్రి రాయుడికి కొన్ని పరీక్షలు చేసి, తర్వాత అతనికి చనిపోయిన వ్యక్తి లివర్ అమర్చారు. నీలాద్రి రాయుడు, భార్య, కోడలు వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నారు ఆపరేషన్ మంచిగా జరగాలని. వారం రోజులు గడిచాయి. ఆపద గట్టెక్కిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ సంతోషించారు.


ఒక రోజు సాయంకాలం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నీలాద్రిరాయుడు.

‘అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది, చనిపోయిన అతను ఎవర’ని అడిగాడు.

“ఇక్కడ ప్రైవేటు కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న అతను, మిత్రుడితో కలిసి మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనుకనుంచి లారీ గుద్దేయడంతో, వెనుక కూర్చున్న సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. అతని తండ్రికి ఇతను ఒక్కడే కొడుకుట. పాపం అతను చాలా బాధపడ్డాడు కొడుకు దుర్మరణానికి. అవయవదానం గురించి చెప్పగానే చాలా సహృదయతతో ముందుకు వచ్చాడు. ఇక్కడ ఇంకో విచిత్రం కూడా జరిగింది. తన కొడుకు లివర్ మీ అబ్బాయికి ఇవ్వమని అతనే చెప్పాడు. తన పేరు మాత్రం ఎవరికీ చెప్పవద్దన్నాడు.”


డాక్టర్ క్షణం సేపు ఆగాడు. నీలాద్రి రాయుడులో ఆత్రుత పెరిగిపోయింది. అంత మంచి మనసున్న మనిషి గురించి తప్పక తెలుసుకోవాలనిపించింది.

“డాక్టర్ గారూ, మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయిగా. అతని పేరు చెప్పండి. ప్లీజ్” అని బతిమాలాడు రాయుడు.


డాక్టర్ ఆయన పరిస్థితి చూసి కరిగిపోయాడు. టేబుల్ సొరుగులో ఉన్న రికార్డ్స్ తీసాడు.


“అతని పేరు రమణ. రాఘవాపురం. సన్నాయి వాయిస్తాడట. చనిపోయిన అతని కొడుకు పేరు శేఖర్”


డాక్టర్ చెప్పిన మాటలు వినగానే రాయుడు కళ్ళు, నీటి చెలమలయ్యాయి.


‘ఎంత గొప్పవాడివి రమణా, నా కొడుకు చేసిన దుర్మార్గాన్ని క్షమించి,పెద్ద మనసుతో నా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. సన్నాయితో మధుర స్వరాల్ని అందించే నువ్వు, నీ వ్యక్తిత్వంతో జీవనస్వరాల్ని మాకు అందించావు’ అని మనసులోనే రమణకి నమస్కరించాడు రాయుడు.


డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి బయటకు వచ్చి , గుమాస్తాని తీసుకుని కారులో రాఘవాపురం బయల్దేరాడు నీలాద్రి రాయుడు.

*****


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


59 views1 comment
bottom of page