top of page
Writer's pictureMeghanath Reddy K. V.

జీవన వై ' చిత్రం '


Jeevana Vaichitram written by K.V.Meghanath Reddy

రచన : K. V. మేఘనాథ్ రెడ్డి

ఎర్రని ఎండలో నెత్తిపై గొంగడి వేసుకొని, చేతిలో సద్దిమూట మరోచేతిలో అరటి ఆకులు పట్టుకొని, పచ్చని వరిపైరు వద్ద నడుచుకుంటూ వస్తున్న ఆమెను చూస్తూ, చేతిలో చెలగపార, భుజాన నాగలి తగిలించుకుని నవ్వుతున్న రైతు ఫోటోకు బహుమతి వచ్చిందని అధికారికంగా ప్రకటించి ఆ చిత్రాన్ని చూపించారు.

జీవం ఉట్టిపడే ఆ చిత్రాన్ని చూసినవారు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు, మరోవైపు

ఆ చిత్రం తీసింది ఎవరా!? అని సర్వత్రా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

వీరెప్పుడు విజేతల్ని ప్రకటించినా మొదట పేరు కంటే చిత్రాన్నే చూపుతారు. ఎందుకంటే వ్యక్తి ఎవరో తెలియకపోయినా చిత్రం అందరి మనసు ఆకట్టుకోవాలి. తదుపరి విజేతను తెలుపుతారు ఇలా...

"దిస్ టైమ్ ది విన్నర్ ఈజ్ మిస్టర్ మధుకర్ " అని అనౌన్స్ చేసారు.

మధుకర్ మెల్లగా లేచాడు. చూపులన్ని మధుకర్ వైపునకు మళ్ళాయి. చప్పట్లతో మారుమ్రోగింది. మధుకర్ కళ్ళలో ఉబికొస్తున్న ఆనందబాష్పాలతో మెల్లగా అడుగులేస్తూ మైక్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు.

"పరిచయమే అవసరంలేని లేని వ్యక్తి రైతు, అలాంటి వ్యక్తిని మరొక్కసారి ఇలా నా ద్వారా మీ అందరి ముందు ఆవిష్కరించటం నా అదృష్టం. రైతు చిత్రానికి పట్టం కట్టిన మీకు ధన్యవాదాలు.

పండుగ పబ్బాలకు ఇళ్ళలో జరిగే అలంకరణలన్ని,

గుళ్ళు,గోపురాలలో ఉత్సవ ఊరేగింపుల వేడుకలన్ని, పంటల్లోనే ఉన్నట్టు,

కరువుతీరా వర్షం కురిసి తనివితీరా పంటలు పండితే

నేలను నమ్ముకున్నోడు ఎన్నటికీ వమ్ముకాడు. ఈఏడాది

ఇన్నేళ్లకు రైతన్న జీవితంలో ఆశాకిరణాలు ప్రసరించనున్నాయి.

అందరి అరచేతిలో అన్నమయిన రైతన్న ఐదువేళ్ళు అతని నోట్లోకి వెళ్లేరోజు వచ్చేలా ఉంది.

ఈ ఏడు సంక్రాంతి అంబరాన్ని తాకనుంది. కనుచూపుమేరా కనిపించే పంటపొలాల్ని అరచేతిలోని కెమెరాతో ఒడిసి పట్టుకున్న పరంపరలోని చిత్రమే నన్ను విశ్వవిజేతను చేసింది "

అని హర్షం వ్యక్తం చేశాడు మధుకర్.

****** ****** ****** ******

" అందరూ సెలెబ్రెటీలైపోతున్నారు చివరికి మీద్వారా కూడా. మిమ్మల్ని ఫోటోలో బంధించి పెద్దమొత్తంలో బహుమతులు అందుకున్నాడొకాయన. పేరు, కీర్తికి కొదవేలేదు. ప్రముఖ ఛానల్ వాళ్ళందరూ ఆయనకోసం పోటీ పడుతున్నారు..!

పత్రికల్లో, టీవీల్లో చక్కర్లు కొడుతున్న చిత్రం మా అమ్మ,నాన్నలదని చెప్పుకోలేని నిస్సహాయ స్థితి నాది, ఎందుకంటే నేను రెక్కలు కష్టంతో బ్రతుకుతున్న రైతు బిడ్డను కదా!? నేను రైతు బిడ్డను అని తెలిస్తే కాలేజ్ నుండి తీసేస్తారు.

ఎడ్యుకేటెడ్ పిల్లలకే ఈ కాలేజీలో స్థానం అని యాజమాన్యం నియమం విధించిందిగా.

నా భవిష్యత్తు కోసం మీరు దేవుడిలా రూపాలు మార్చారు! నన్ను చదువులో బాగా ఎన్కరేజ్ చేసిన ప్రొఫెసర్ మూర్తి గారు గార్డియన్ గా నన్నీ కాలేజీలో చేర్పించేలా చేసారు.

నాన్న! ఈ క్షణం నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు, గంజో,కూడో మీతో కలిసి తిని మీతో కలిసి కష్టపడాలనిపిస్తుంది..!

వెంటనే అనిపిస్తుంది...

మూడేళ్లు మీ రెక్కల కష్టాన్ని, తాతయ్య ఇచ్చిన నాలుగు ఎకరాల్ని అమ్మి నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేస్తే మీ శ్రమకు ప్రతిఫలం ఏముంటుంది!? అని.

ఒక్క సంవత్సరం రోజులు నాన్న! మీ కలల్ని సాకారం చేస్తాను. అన్నట్టు పరీక్షలకు పదివేలు డబ్బులు కట్టాలి, ఈ నెలాఖరులోపు పంపిస్తావుగా నాన్న! నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాను నాన్న!

నీ బిడ్డ నీలిమ. "


లేఖ చదివి సంతోషం దుఃఖం రెండింటితో ఉక్కిరిబిక్కిరి అవుతూ " ఏమే రత్న, బిడ్డకాడ్నుంచి ఉత్తరం వచ్చిండాది. ఆయప్ప ఎవుర్రో మన పోటో తీసిండాడంట. ఆ పోటో దేశానికంతా పోయిండాది అని రాసిండాది. ఆయప్పకు దుడ్లు గూడ ఇచ్చిండారంట" అన్నాడు రామయ్య.

"అదంతా ఏమిడిదో నాకి తెలీదు గాని నీలిమ ఎట్లా ఉండాది? బాగుండదా? బాగా సదువుతుండాదా!? " అంది రత్నమ్మ.

"అంతా బాగేలేయే, బిడ్డకి పదివేలు కావాలంట, ఈ సారి మడి బాగా పండిండాది. ఇరవై దినాలు పోతే కోసేయొచ్చు. మడిమీద ఎవుర్నైనా అప్పు అడుగుతాను. బిడ్డకి పంపికుంటే శ్యానా కష్టం అయితాది".

" మన కట్టం ఎట్లైనా అయిపోని, ముందుగా ఆ పని సూడు. ఆ బిడ్డ కోసరమే మనము బతకతా ఉండేది" అంది బదులుగా రత్నమ్మ.

ఇంటినుండి బయటకు వచ్చి రైతులందరూ కట్ట దగ్గర మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చాడు రామయ్య.

" ఈతూరి అందురికి బాగా పండిండాదిరా మడి. శ్యానామందికి కట్టాలు తీరిపూడిస్తాయి. ఉండే నీళ్లుకి ఇబ్బుడు కోసేసి మళ్ళింకీ పంట సేసుకోవచ్చు"

" నిజింగా రా ఒగసారి పంట అమ్ముకొని అప్పులు కట్టినా ఇంగోసారి ఇంటికి తిండిగింజలు అయితాయి" అన్నాడు ఇంకో రైతు.

"అంతమాతరం కట్టమంతాపోయి నాలుగు దుడ్లు వస్తే సంకురాత్రికి పిల్లోళ్ళు అందురికి కొత్త గుడ్డలు అయినా తేవచ్చు".

"అంతా మంచిగానే అయితాది దేముడు మనతో ఉండాడు కానీయండ్రా బయమొద్దు" అని మాట్లాడుకొని తలోదారి వెళ్లిపోయారు రైతులు.

****** ****** ******

" అయ్యో... ఇదేంటి!? పెద్ద వాయుగుండం పొంచిఉంది. ఎడతెరిపి లేని వర్షాలు రాబోతున్నట్టు చూసిస్తుంది వాతావరణశాఖ. మరొక్కసారి పరిశీలించండి " అన్నాడు ప్రముఖులతో మధుకర్.

ఒక్క ఫొటోతో సెలెబ్రిటీ కావటం దేశంలోనే పేరిన్నికగన్న టీవీ చానల్ లో ఉద్యోగం వచ్చింది మధుకర్ కి.

" నిజమే సర్ మీరన్నట్టు పెద్ద ఉపద్రవమే పొంచి ఉంది మరోనాలుగు రోజుల్లో " అన్నారు వారు పరిశీలించి.

మధుకర్ ఆలోచనా దృష్టి రైతుల మీదకు మళ్లింది. 'ఇప్పుడెలా!? ఎప్పుడూ లేనంతగా ఈ సారి పంటలు పండాయి, రైతులు గట్టెక్కేస్తారు అనిపించింది. కానీ ఇప్పుడిలా జరగబోతోంది. ఎలా ఈ ఉపద్రవాన్ని నివారించడం!? ' అని సతమతమైపోయాడు మధుకర్ తనలోతాను.

ఏదైతేనేమి ముందుగా వారి టివి ఛానల్ లో 'రైతులందరు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టుప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు రావాలని' హెచ్చరికలు జారీ చేశారు.

టీవీలో చూసి ఆనోట ఈనోట పడి రైతులకు తెలిసింది.

అందరికీ గుండె తరుక్కుపోయింది. ఏమిచేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు రైతులు.

ఉహించినట్టే కుంభవృష్టితో ఎడతెరిపి లేకుండా వర్షం ఏకధాటిగా పడింది. ఆగని వర్షంతో పదిహేను రోజుల్లో

పూర్తిస్థాయిలో పంట నీటమునిగింది. రైతన్న ఆశలు అడియాసలు అయ్యాయి ఎప్పటిలాగే.

గట్టిపిండాలు కొన్ని చచ్చి బ్రతకలేకున్నాయి. రేపటిరోజుకోసం తట్టుకుని నిలబడలేని అభాగ్య అన్నదాతలు కొంతమంది అప్పులు కట్టలేక ఆయువు తీసుకున్నారు.

ఈ విపత్కర పరిణామాన్ని ముందుగా పసిగట్టినా చేసేదేమిలేక దేవుని ఆటముందు ఓడిపోయాడు మధుకర్. జరిగిన పరిణామానికి పూర్తిగా కృంగిపోయాడు.

***** ***** ******

పోస్ట్ లో తనపేరిట వచ్చిన ఉత్తరం తెరచి చదవసాగాడు మధుకర్.

" గతించిన రైతన్నల సాక్షిగా... ఆశ చావక బతుకు వెళ్ళదీస్తున్న ఇంకొందరి రైతుల నీడగా, అలాంటి రైతు కడుపులో పుట్టిన బిడ్డగా రాస్తున్నాను!.

మధుకర్ గారు... మిమ్మల్నే!

నిన్నటి రోజుల్ని తలచుకుంటూ కృంగిపోవటం కంటే రేపటి రోజుకోసం మనమేం చేయగలం!? మననుంచి ఏమైనా అవుతుందా? మనమేమైనా చేయగలమేమో ఆలోచించండి!

ఈ సంక్రాంతి తీపిగుర్తుల్ని మిగుల్చుతుందని, పంట ఎన్నడూ లేనంతగా పండిందని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ... ఎంతో ధీమాగా మా నాన్న రాసిన లేఖ నాకు చేరింది. అంతలోనే చూస్తుండగానే జరగాల్సిందంతా జరిగిపోయింది.

మీకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన చిత్రంలోని వారు నా తల్లిదండ్రులు..! ఇప్పుడక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నేను వారికి చాలా దూరంగా ఉంటున్నాను చదువుకోసం.

ఇప్పుడు నేనెళ్లినా వారిని చూస్తానోలేదో!? నేను చేరుకోలేని దూరం వారు వెళ్లిపోయారేమో!? అనే భయం నన్ను వెంటాడుతోంది! "

అని ఉత్తరం ముగిసింది.


చదువుతుండగానే మధుకర్ కి కళ్ళు చెమర్చాయి. కవర్ తిప్పిచూస్తే ఓ కాలేజి అడ్రస్ నుండి నీలిమ అనే స్టూడెంట్ రాసిన ఉత్తరం అది.

వెంటనే క్షణమాలోచించక మధుకర్ ఆ గ్రామానికి బయలుదేరాడు.

అక్కడి పంటలంతా స్మశాన పువ్వులై యుగళగీతం పాడుతూ చేదుపాట నేపథ్యంలో రోదిస్తున్నాయి.

గ్రామమంతా కన్నీటి పర్యంతమై విలపిస్తున్నది..!

కడుపు తరుక్కుపోయింది మధుకర్ కి. అక్కడి నుండి బాధాతప్త హృదయంతో మోయలేని బాధతో వెనుదిరిగాడు.

****** ****** ******

సువిశాలమైన కాలేజి భవనం, అంత పెద్ద కాలేజిలో పేరు మాత్రమే తెలిసి ఉంటే మనిషిని గుర్తించటం కష్టమైన పని.

కానీ ఎదురుగా ఒక్క అమ్మాయి వచ్చి " మధుకర్ గారు" అంది.

మధుకర్ ఆశ్చర్యపోయాడు "నేను ఎలా మీకు తెలుసు!?" అన్నాడు.

"నన్ను గుర్తు పట్టటం కష్టం కానీ మిమ్మల్ని గుర్తుపట్టటం కష్టమేమీ కాదు. ప్రపంచానికి మా అమ్మ నాన్నలు మిమ్మల్ని పరిచయం చేశారుగా" అంది ఆ అమ్మాయి.

" మీరు నీలిమనే కదా!?" అన్నాడు మధుకర్.

" నన్ను గుర్తుపట్టటం కూడా సులువే కదా!" అంది నవ్వుతూ నీలిమ.

" మా ఊరు వెళ్లెవచ్చారు కదా!?" అంది నీలిమ.

" మీకెలా తెలుసు నేనెళ్లివచ్చిన సంగతి" అన్నాడు మధుకర్.

నీలిమ మొహంలో అనేకానేక ప్రశ్నలు మెదులుతున్నాయి. మధుకర్ నోటి నుండి ఏమి వినాల్సి వస్తుందోననే భయం కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది.

" ఇంతకీ... " అనేదో అడగబోయింది నీలిమ.

" ఉత్తరంలో రాశారుగా, ముందుచూపుతో మనమేదైనా చేయగలమా!? అని. ఆ పనిమీదే వచ్చాను ఇంతదూరం.తప్పకుండా చేద్దాం! ఖచ్చితంగా సాధిద్దాం!

మీ పరీక్షలు అయిపోగానే మీ ఊరి నుండే మొదలెడదాం. మీకోసం ఎదురుచూస్తుంటాను" అని మధుకర్ వెనుదిరిగాడు.

ఊరేమైందో!? తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియని నీలిమకు మధుకర్ ద్వారా అన్ని తెలుస్తాయి అనుకుంది మధుకర్ ని చూడగానే.

కానీ మధుకర్ నీలిమకు జరిగింది ఏమి చెప్పలేదు.

జరగబోయేది చెప్పాడు. నీలిమలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొద్దిరోజుల్లోనే పరీక్షలు అయిపోయాయి. నేరుగా మధుకర్ ని కలిసింది నీలిమ.

అప్పటికే వందమందితో టీంని రెడీ చేసి రైతే రాజంటూ వ్యవసాయం కూడా ఉన్నతమైన వృత్తిగా, రైతు అంటే ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా పరిచయం చేసే సన్నద్ధాలు సిద్ధం చేస్తున్నారు వారు.

అక్కడ వారు అనుకున్నది అనుకున్నట్లు నెరవేరితే ప్రతి పల్లెకూ వారనుకున్న ప్రాజెక్ట్ ను విస్తరించాలనుకున్నారు.

ఎక్కడో ఒకచోట మార్పురావాలి. మార్పు శుభపరిణామాలు తీసుకువస్తే అంతకంటే కావలసినదేముంది!?

' రైతు బ్రతకాలి. ఈసారన్నా జరగబోయే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాలి. జై కిసాన్...' నినాదంతో వారందరూ ముందడుగు వేసారు.

మానవాళికి మంచి జరగాలనే ఆశ ఎప్పుడైనా మనిషిని పురోగతివైపు నడిపిస్తుంది.

మధుకర్, నీలిమలు పటిష్టమైన టీం వర్క్ తో చేయబోయే కార్యం విజయవంతమౌతుందనే ఆశిద్దాం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

పేరు: కె.వి. మేఘనాథ్ రెడ్డి

పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, మారుమూల పల్లెప్రాంతం కాలువపల్లి.

రచయితగా సాహితీ ప్రపంచానికి పరిచయమై, 3 నవలలు, 80 వరకు కథలు రాసాను అలాగే సృజనసాహితీ సంస్థ స్థాపించి వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకంగా పుస్తకపోటీలతో సాహితీ ప్రపంచానికి పరిచయమై నిర్వాహకుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.

ధన్యవాదాలు.

181 views5 comments

5 Comments


sunanda.28051965
Jan 20, 2021

కథా కథనం చాలా బాగుంది.మంచి అంశం తీసుకున్నందుకు చాలా సంతోషం నాన్నా

అభినందనలు

Like

Vijaya Rakhi
Vijaya Rakhi
Jan 17, 2021

కథ చాలా బాగుంది నానా. రైతన్నల వెతలు బాసి రైతే రాజు అన్న చందంగా మన దేశంలో అభివృద్ధి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కథను అందించిన తమ్ముడు చిన్ని కృష్ణకు అభినందనల మందార మాలలు

Like

Perisetty Babuw
Perisetty Babuw
Jan 17, 2021

కథనం బాగుంది.

ముగింపు ఇంకొంత స్పష్టంగా ఉంటే ఇంకా బాగా ఆకట్టుకునేది.

రచయిత దృక్పథానికి అభినందనలు.

Like

Rajeshwer Jaya
Rajeshwer Jaya
Jan 17, 2021

కథ చాలా బాగుంది సర్. ముగింపు కూడా బాగుంది. అభినందనలు మేఘనాథ్ రెడ్డి గారికి

Like

Narahari Rao
Narahari Rao
Jan 17, 2021

కథను చాలా బాగా నడిపారు రచయిత. రైతుల కష్టాలను చక్కగా చూపించారు. రైతు అవస్థలను తెలుపుతూ ఆ రైతు బాగుపడే విధంగా ఆలోచిస్తూ ఆశాభావం తో కథను ముగించిన తీరు బాగుంది. రచయిత ఆశించినట్లే జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి... జై కిసాన్ అన్న నినాదం సాకారమైనట్లే. మంచి కథను అందించిన రచయిత మేఘనాథ్ రెడ్డి గారికి అభినందనలు.

Like
bottom of page