top of page

జీవనతరంగాలు



'Jeevanatharangalu' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అప్పుడే పూజ ముగించుకుని వచ్చి సోఫాలో కూర్చుని లేప్ టాప్ తెరిచారు అనంతరామయ్యగారు ! ' తార' నుండి మెయిల్ వచ్చినట్లుగా చూసారు ! వెంటనే భార్య రేవతి ని పిలిచారు, " ఇదిగో రేవతీ, మన తార నుండి మెయిల్ వచ్చింది, వస్తావా, చదువుతాను” , “ఆనక నన్ను దెప్పుతావు” మళ్లీ అనగానే రేవతి గారు లోపలినుండి వచ్చి ఆయన పక్కనే కూర్చుని చదవమన్నారు !

" పూజ్యులైన మామయ్యగారికి, అత్తయ్యగారికి , నమస్కారములు !

ఎలా ఉన్నారిద్దరూ? వేళకు మందులు వేసుకుంటున్నారా? మీ హోమ్ ఎలా ఉంది.. అడ్జస్ట్ అయ్యారా ? కొత్త స్నేహితులతో పరిచయాలు అయ్యాయా ? మొన్న మీ సీనియర్ సిటిజన్స్ అందరూ కలసి చేసిన ప్రార్ధనలు, అంత్యాక్షరీ పోటీలూ, అలాగే పాటలు పాడిన వీడియోలూ అవీ అప్లోడ్ చేసి పంపారు కదా, చాలా బాగున్నాయి మామయ్యగారూ.. చరణ్ కు కూడా చూపించాను.. చాలా సంతోషించాడు.. ఇక్కడ మేమిద్దరూ బాగున్నాం.. బాగుండక ఏమిచేస్తాం ? మీ ఆశీర్వాద బలం.. మా ఇద్దరిని కలిపి ఒకటిగా జీవించండి అంటూ మమ్మలని భార్యా భర్తలను చేసారు ! నేను ఎంత స్వార్ధపరురాలిని అనుకుంటాను ఎప్పుడూ ! నాకు ఇటువంటి జీవితమే వద్దనుకుని, నేనే మీ అబ్బాయి మాధవ్ గా మిమ్మలని దగ్గర పెట్టుకుని జీవితాంతం మిమ్మలని చూసుకోవాలనుకున్న నా నిర్ణయాన్ని మీరు త్రోసి పుచ్చి నాకు మరో జన్మను ప్రసాదించిన మీ ఇరువురి బుుణం ఎలా తీర్చుకోను మామయ్యా ? ఇలా వ్రాస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు. అదిగో......మీరిద్దరూ కూడా కన్నీళ్లు తుడుచుకుంటున్నారు ! మాధవ్ తో నా పరిచయం, ప్రేమ, పెళ్లి, అతని సాహచర్యాన్ని మరవగలనా ? నేనే ఇలా బాధ పడుతుంటే, ఇరవై ఆరు సంవత్సరాలు పెంచి, పెద్దచేసి, ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చి దిద్దిన మీ ఒక్కగా నొక్క కొడుకుని మరిచిపోగలరని నేను ఎలా అనుకోగలను ? గుండెలను కోసే రంపపు కోత గర్భశోకం ! అయినా ఆ బాధను లోపలే దిగమింగుకుంటూ, ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపచేయాలని అహర్నిశలు మీరు అత్తయ్యగారు నా జీవితం పట్ల మీరు తీసుకున్న శ్రధ్ద, పట్టుదలను ఎప్పటకీ మరచిపోలేను ! పదే పదే గుర్తుచేసి మిమ్మలని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు..

చరణ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు.. ఇద్దరం ఉద్యోగాలకు వెళ్లిరావడంతో చాలా సమయం గడచిపోతోంది.. తొందరలో మనవడినో మనవరాలినో ఇవ్వమన్నారు.. మీ కోరిక తీరుస్తాం మామయ్యగారూ ! ఆరోజు వస్తే పుట్టిన బిడ్డను తీసుకుని ఇండియా వచ్చి మీకు చూపించి మీ ఆశీర్వాదాలు తీసుకుంటాం !

జాగ్రత్త సుమా, ఏ అవసరానికైనా నేను ఉన్నాను, నన్ను మీ కొడుకుగానే భావిస్తారు కదూ !

ఉంటాను మామయ్యా, అత్తయ్యా!

మీ ప్రియమైన ' తారాకాంతి ' !!

మెయిల్ చదవడం పూర్తవగానే, రేవతి దుఖాన్ని ఆప శక్యం కాలేదు !వెక్కి వెక్కి ఏడుస్తోంది.. అనంతరామయ్యగారు భార్య భుజం చుట్టూ చేయివేసి అనునయించసాగారు..

“ఛ, ఏమిటి రేవతీ, నీవు ఇలా మాటి మాటికి మన అబ్బాయి మాధవ్ ను తలచుకుంటూ ఏడుస్తుంటే నేను ఏమై పోవాలి ? ఏమి చేస్తాం రేవతీ ? మన మాధవ్ కు ఆయుర్దాయం లేకపోయింది, మనలని దుఖసాగరంలో వదిలి వెళ్లిపోయా”డంటూ ఉత్తరీయంతో కళ్లు తుడుచుకున్నారు ! ' తార' మెయిల్ చదవడానికి ఆయన కంట్లో సన్నటి కన్నీటితెర అడ్డువచ్చింది !

మాధవ్ వారికి లేక లేక కలిగిన ఒక్కగా నొక్క కొడుకు.. అందమైనవాడు, తెలివైన వాడు.. ఐఐటి లో టాపర్ ! చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లనంటూ కేంపస్ లో వచ్చిన ఉద్యోగంలో చేరిపోయాడు.. రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత మరో పెద్ద కంపెనీలో ఆఫర్ వస్తే చేరిపోయాడు.. అక్కడ ఉద్యోగంలో ఉండగానే, జూనియర్ గా జాయిన్ అయిన ' తారాకాంతి' తో పరిచయం, ప్రేమ, ఇరుపక్కల పెద్దవారి ఆశీస్సులతో పెళ్లి జరిగిపోయింది !

అత్తగారి మామగారి ఆత్మీయ సాహచర్యంలో తార చాలా ఆనందంగా ఒదిగిపోయింది ..

కూతుళ్లు లేని ఆ దంపతులకు తార అంటే మహా ముద్దు. ' తారే' వారికి సర్వశ్వం అయిపోయింది..

ఏవిషయము మాట్లాడడానికైనా కోడలు కావాలి.. కోడలి సలహా తీసుకోకుండా ఏ పనీ చేయరు..

తారకు వారిరువురూ తల్లీ తండ్రీ కంటే ఎక్కువైపోయారు..

అదే వూళ్లో ఉంటున్న తార తల్లీ తండ్రీ దగ్గరకు చుట్టపుచూపుగా వెళ్లి కాసేపుండి వచ్చేస్తుంది..

"ఓ నాలుగురోజులుండి రా తారా అంటే అలాగేననడం, రెండుమూడు గంటల్లే వచ్చేసేది"..

మాధవ్ కు ప్రమోషన్ రావడం, కంపెనీ ఒక ఆరునెలల పాటు మాధవ్ ను ఆఫీస్ పని నిమిత్తం అమెరికా పంపించింది.. ఆరునెలలే కదా అంటూ తార, మాధవ్ ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నారు.. తార అత్తగారింట్లో ఉంటూనే ఆఫీస్ కు వెడ్తూ ఉండేది !

ఆరునెలలు ఎప్పుడు పూర్తి అవుతాయా అని ఎదురుచూస్తున్నారు కొత్త దంపతులు ..

రోజులు ఎవరికోసం ఆగవన్నట్లుగానే మాధవ్ ప్రాజక్ట్ పని పూర్తి అయిపోవడం, మాధవ్ తిరిగి బయలదేరుతున్నట్లుగా ఫోన్ చేసి చెప్పాడు..

ఇంట్లో సందడి మొదలైంది.. రేవతి, తార కలసి మాధవ్ కు ఇష్టమైన వంటలు చేస్తున్నారు హడావుడిగా.. ఫ్లైట్ లేండ్ అయిందని, బేగేజ్ కలక్షన్ లో ఉన్నానని ఒకసారి ఫోన్ చేసాడు.. తరువాత అరగంటకి కేబ్ లో కూర్చున్నానన్నాడు........ ఆ తరవాత ఒక గంటలో ఇంటికి వచ్చేయాలి.. గంటకాదు, రెండు మూడు గంటలైనా ఫోన్ లేదు.. తార ఫోన్ చేస్తుంటే ' సిగ్నల్స్ కేచ్ కావడం లేదు.. ఏమైందో తెలియడం లేదు.. టెన్షన్, టెన్షన్ !


ఉన్నట్టుండి ఫోన్, మాధవ్ నుండి కాదు.. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో ఫోన్ లో, తార కావాలని అడిగితే తార ఫోన్ అందుకుంది.. అవతల వార్త విని ' నో ' అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది.. అనంతరామయ్యగారు తీసుకున్నారు ఫోన్.. సంగతి విని మ్రాన్పడిపోయారు, ఒణికి పోయారు.. భార్యను పట్టుకుని భోరుమవి విలపించారు.. మాధవ్ ఎక్కిన కేబ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర అదుపుతప్పడంతో బోర్లాపడడం, కేబ్ డ్రైవర్, మాధవ్ అక్కడకక్కడే యాక్సిడెంట్ లో పోవడం...... హే భగవాన్, ఎంత దారుణమైన సంగతి ! శత్రువుకు కూడా ఇటువంటి పరిస్తితి కలగకూడదు ! జీవితం ఎంత చిత్రమైనది, ఆనందాన్ని ఇస్తూనే, తిరిగి లాగేసుకోవడం ఆ భగవంతునికి వినోదమేమో !

ఇంట్లో అందరూ కోలుకోడానికి నాలుగైదు నెలలు సమయం పట్టింది.. " తారా, కొన్నాళ్లు మీ అమ్మగారింటికి వెళ్లమ్మా, మార్పు ఉంటుందంటే", ' నా ఇల్లు ఇదే ఎక్కడకు వెళ్లనంటూ ఏడుపు '.. ఎప్పుడూ ఆ గదిలోనే కూర్చోవడం, బయటకు వచ్చేది కాదు.. తార అమ్మ నాన్న వచ్చి అనునయించినా లాభంలేకపోయింది.. ఇంక ఆ అమ్మాయి అలా ఉంటే లాభం లేదని, పిచ్చిదానిలా తయారైందని, ఒకరోజు అనంతరామయ్యగారు తారను దగ్గర కూర్చో పెట్టుకుని ఎంతో ధైర్యాన్ని చెప్పారు..

ఇలా కంటికిమంటికి ఏకధారగా దుఖిస్తూ ఉంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మాధవ్ తిరిగొస్తాడా తల్లీ అంటూ శతవిధాలుగా మామగారు అనునయించసాగారు..

మాధవ్ ఆత్మశాంతికైనా నీవు మనుషులలో పడాలమ్మా అంటూ ఊరడించారు..

విధి వైపరీత్యాన్ని ఎవరూ తప్పించలేరంటూ, తారను తిరిగి ఉద్యోగం లోకి వెళ్లేటట్లు తయారుచేసారు..

ఎడతెరిపిలేని కార్యక్రమాలతో రోజులు మళ్ళీ గబగబా గడవసాగాయి. ఆ గడవడంలో వారి ప్రమేయంలేకున్నా, కాలం తనపనిని తాను చేసుకుంటూ పోతోంది..

సంవత్సరం పూర్తయి మాధవ్ పుణ్య కార్యాలు కూడా జరిగిపోయాయి. మాధవ్ పేరు మీద ఇద్దరు పేద విద్యార్థులకు 'డిగ్రీ' వరకు 'స్కాలర్‌షిప్' ప్రకటించి, దానికి అవసరమైన ధనం ఒక సంస్థకి అప్పజెప్పింది తార..


ఒకవైపు రోజులు ఇలా నిర్వేదంగా గడచిపోవడం అనంతరామయ్యగారు చూస్తూ ఉండలేకపోయారు..

భార్యతో సంప్రదించారు.. తారను పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని అనునయంగా చెప్పారు, తిరిగి పునర్వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకొమ్మని..

ఏం, మీకు బరువయ్యానా మామయ్యా అని బేలగా కళ్ల నిండా నీళ్లు నిండుతుండగా అడుగుతున్న తారను దగ్గరగా తీసుకుని నచ్చ చెప్పారు.. అది కాదు తల్లీ, నిండా పాతిక సంవత్సరాలైనా లేవు నీకు, ఇంకా నీ వయస్సు వాళ్లకు పెళ్లిళ్లే అవడం లేదు, అటువంటి వయస్సులో నీవు మా కళ్ల ఎదురుగా ఇలా అన్నీ కోల్పోయినదానిలా తిరుగుతూంటే చాలా బాధగా ఉంటోంది తల్లీ..


మాధవ్ లేడన్న దుఖం కంటే సర్వం కోల్పోయినట్లుగా మా కళ్ల ఎదురే నీవు ఇలా తిరుగుతుంటుంటే మా మనస్సులు మెలిపెట్టేసినట్లుగా అయిపోతున్నాయి తారా ! నీవు తిరిగి పెళ్లి చేసుకుని పచ్చగా కళ కళ లాడుతూ ఉంటే చూడాలని ఉందమ్మా !

నీవు ఊ....అంటే సంబంధాలు చూస్తాను తారా, లేకపోతే నీవు చూసుకున్నా సమ్మతమే అనగానే......కళ్ల నీళ్లు పెట్టుకుంటూ, మీ ఇష్టం మామయ్యా అంటూ అక్కడనుండి గబ గబా వెళ్లిపోయింది !

వెంటనే అనంతరామయ్యగారు తన స్నేహితులందరికీ చెప్పి పెట్టడమే కాకుండా మెట్రిమొనీ సంస్తల లో తార పేరు రిజిస్టర్ చేసారు.. తార అదృష్టమో ఏమో రెండునెలలకే అమెరికా సంబంధం వచ్చింది, అనంతరామయ్యగారి స్నేహితుని ద్వారా.. వారికి తెలుసున్న అబ్బాయి చరణ్, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు.. చరణ్ కి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు.. తండ్రి పెద్దకూతురు పెళ్లి చేసిన రెండు సంవత్సరాలకు చనిపోయారు.. ఆస్తి పాస్తు లేమీ లేని చరణ్ తన ఇంజనీరింగ్ పూర్తి అవగానే ఉద్యోగంలో చేరాడు.. కంపెనీనే చరణ్ ను అమెరికా ప్రాజక్ట్ప పని మీద రెండు సృవత్సరాలు పంపడం, ఆ తరువాత చరణ్ ఆ ప్రాజక్ట్ నుండి మరోకంపెనీకి ప్రయత్నం చేసుకుని మారిపోయాడు..

అమెరికాలో ఉంటూ, అతని చెల్లెళ్లు, తమ్ముడి చదువుకి ఆర్ధికంగా సహాయపడుతూ, చెల్లెళ్ల కు చక్కని వరుళ్లను చూసి ఘనంగా పెళ్లిచేసాడు.. అతని తమ్ముడికి ఉద్యోగంరావడం పెళ్లికూడా అయిపోయిందికానీ, చరణ్ మాత్రం అలాగే ఉండిపోయాడు..

తారతో చెప్పారు.. తార డిటైల్స్ అవీ ఇచ్చి వారిరువురూ మాట్లాడుకునే అవకాశం ఏర్పాటు చేసారు..

ఎందుకో తార ప్రొఫైల్ అతనికి ఆసక్తిని కలిగించింది..

ఇద్దరూ మాటలాడుకోవడం, ఒకరికొకరు నచ్చడం, అతను అమెరికా నుండిరావడం పెళ్లిచేసుకోవడం రెండునెలల్లో జరిగి పోయింది !

ఇంక తార, చరణ్ ల అమెరికా ప్రయాణం దగ్గరలోనే ఉంది.. ఇన్నాళ్లూ తమనే అంటిపెట్టుకుని ఉన్న తార, సొంతకూతురిలా తమలో ఒక్కర్తిగా కలసిపోయింది.. అహర్నిశలు తమ గురించే ఆరాటపడే తార తమని విడిచి వెళ్లిపోతోందే అన్నబెంగ కన్నా, ఆ పిల్ల జీవితం అలాగే ఉండిపోతుందేమోనని భయపడిపోయిన వారికి, చరణ్ లాంటి భర్త తార జీవితంలోకి ప్రవేశించడం తో ఆనందంతో మనస్సు నిండిపోయింది.. తమ బాధ్యత తీరిపోయింది !

ఇంకో రెండురోజుల్లో తార చరణ్ అమెరికా వెళ్లిపోతున్నారు.. ఒక రోజు ఇద్దరినీ పిలిచారు !

ఒక ఏభైలక్షల రూపాయల చెక్ తార చేతిలో పెట్టారు.. ఏమిటి మామయ్యా అని కంగారు పడింది తార.. ఇది ఉంచుకో తల్లీ.. నేను ఈ ఇల్లు అమ్మేసాను.. ఇదే ఊళ్లో సీనియర్ సిటిజన్స్ హోమ్స్ లో ఒక ఫ్లాట్ కొన్నాను.. నేను మీ అత్తయ్య అక్కడకు వెళ్లిపోతాం తల్లీ ! ఇది నీ పెళ్లి కానుకగా నీకు ఇవ్వాలని అనుకున్నాం.. మీకు అవసరం లేకపోయినా, నా మనవడు మనలరాలి కి ఉపయోగించమ్మా ..

అదేమిటి మామయ్యా, నాకు ఈ డబ్బేమిటీ, మీరు అక్కడ ఉండడం ఏమిటంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది తార..

ఒద్దురా తల్లీ ఏడవకు, ఈ మలిసంధ్య వయస్సులో మేము అక్కడ ఉండడమే క్షేమకరం.. మాలాంటి వారు ఎందరో అక్కడ ఉన్నారు.. నా మనస్సుకి అది మంచిదని తోచింది ! మా గురించి బాధపడడకు.. చరణ్ తో నీ వైవాహిక జీవితం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండాలని, పిల్లా పాపలతో పచ్చగా కళ కళలాడుతూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాన్నమ్మా అంటూ ఇద్దరికీ వీడ్కోలిస్తు సాగనంపారు !

గత జ్నాపకాలనుండి బయటకు వచ్చిన భార్యాభర్తలిరువురూ మౌనంగా శూన్యంలోకి చూడసాగారు..

ఈ జీవన తరంగాలలో ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు అన్న శుష్కహాసం ఆయన పెదవులమీద మెరిసింది !

అమెరికా నుండి తార అప్పుడప్పుడు వీడియో కాల్స్, మెయిల్స్ ఇస్తూ వారి క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటుంది !

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


47 views0 comments
bottom of page