top of page

జీవితనౌక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Jeevitha Nouka' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)


రామాపురం పేరుకు తగ్గట్టుగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే పల్లెప్రాంతం.

ఆప్యాయతలకు అనురాగాలకు పుట్టినిల్లు. చిన్నలు పెద్దలు అందరూ ఒకరంటే ఒకరికి గౌరవం. “పెద్దలమాట చద్దన్నం మూట” అన్న నానుడిలాగా, పెద్దవాళ్లకు ఎదురుచెప్పడమనేదే

ఎరుగరు ఆ పల్లెప్రజలు. ఆడవాళ్ళంటే గౌరవం, పిల్లలంటే ఆత్మీయత. అంతా ఒకే కుటుంబంలా ఉంటారు వాళ్ళంతా. ఎవరింట్లో కష్టం వచ్చినా తమకే వచ్చినంతగా బాధపడతారు. ఎవరింట్లో శుభకార్యం జరిగినా తమ ఇంట్లోనే జరుగుతున్నంత హడావుడి చేస్తారు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరి ఇలవేలుపు తండ్రి మాటజవదాటని శ్రీరామచంద్రుడే.


ఊరు చిన్నదే అయినా బస్సు సౌకర్యం ఉంది. పదవతరగతి వరకు బడి ఉంది. చిన్న గ్రామ పంచాయితి కూడా ఉంది. కానీ , ఎప్పుడూ దాని అవసరం ఆ ఊరిలో ఎవరి కీ అవసర పడలేదు. ఎందుకంటే ఐకమత్యమే వారి బలం, బలగం. అందుకే వాళ్ళలో ఎప్పుడూ జగడాలు రాలేదు. ఆ ఊరి బడిలో కృష్ణమాచార్యులు అనే పేరుగల బడిపంతులున్నాడు.

అతనికి ఎంతసేపు ఎవరికైనా ఏమైన చిన్న చిన్న సమస్యలుంటే చక్కబరచడం, అందరికి నీతిపాఠాలు వల్లించడమే తెలుసుగానీ, ఎవరి దగ్గర చేయిచాచిన పాపాన పోలేదు. అతనికి నలుగురు కొడుకులు . అనుకూలవతి అయిన భార్య కామాక్షమ్మ. పిల్లలందరిని అంతో ఇంతో చదివించి పెళ్ళిలు చేసి ఎవరి దారిన వాళ్ళను పంపించాడు.


తనకొచ్చే చిన్నపాటి బడిపంతులు జీతంమీదనే సంసారాన్ని ఈదుకొచ్చాడు. బాధ్యతలన్నీ అయిపోయాయి. బడిలో కూడా పదవివిరమణ అయిపోయింది. వచ్చిన డబ్బును కొడుకులు అడగకముందే తలో ఇంత, పంచి ఇచ్చాడు. తనకంటూ ఉన్నది ఇల్లు, తనకొచ్చే పదిహేను వందల ఫించను మాత్రమే.


“ ఏమయ్యా … ఉన్నదంతా పిల్లలకు ఊడ్చిపెడుతున్నావు, రేపు మన గతి ఏమిటో ఆలోచించావా? రోగమొచ్చినా నొప్పొచ్చినా మన దగ్గర డబ్బుండాలి కదా ! సమయానికి వాళ్ళ దగ్గరలేదనుకో , అప్పుడేం చేస్తావయ్యా,” అడిగింది కామాక్షమ్మ చూస్తూ ఊరుకోలేక ఉన్నదంతా పిల్లలకు పంచిపెడుతుంటే.


“ అబ్బా … ఏమిటి కాముడు నువ్వు మరీనూ, నేనెవరికో పరాయివాళ్ళకు మన సొమ్మంతా దానం చేస్తున్నట్టు బాధపడుతున్నావు, మన పిల్లలకే కదా ఇస్తున్నాను వాళ్ళకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాము చెప్పు? ఎప్పుడైనా ఇచ్చివెయ్యాలిసిందే కదా! అవునా కాదా?,” అడిగాడు భార్యకు నచ్చచెబుతూ.


“ ఏమోనయ్యా … నీ పైసా నీ ఇష్టం వచ్చినట్టుచేసుకో నాదేం పోతుంది గనుక, “పట్టమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం” ఎందుకొచ్చిన బాధ నాకు, అన్ని విధాల చూసుకునే మీరున్నాక నాకెందుకు,” అంటూ చీరచెంగు నడుములో దోపుకుంటూ లోపలకు వెళ్లింది వంటచేయడానికని.


“ ఏమేవ్… నీ వంటపూర్తయ్యేటప్పటికి అలా ఊర్లోకి వెళ్ళి వస్తాను తలుపేసుకో,” అంటూ వెళ్ళిపోయాడు ఆచార్యులు.


“ రావయ్యా పంతులు రా, ఇది విషయం విన్నావటయ్యా, మనకు గోదావరి నీళ్ళు వస్తాయట. ఇక నుండి రైతులకు ఏ కష్టాలులేకుండా చేస్తారట, కాకపోతే కొన్ని ఊర్లు మునిగిపోతాయట. అందులో మన ఊరుకూడా ఉందట,” చెప్పాడు పటేలు రామయ్య . అప్పటికే అందరూ కూర్చొని ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.


“ అదేమిటి రామయ్య, మన ఊరు మునిగిపోతే మన పరిస్థితి ఏంటి?,” అడిగాడు ఆదుర్ధాగా.


“అదే కదయ్యా మేమందరం బాధపడేది, రేపు మన ఊరికి మంత్రులు వస్తారట వచ్చి మనందరికి వేరే ఊరిలో జాగలు ఇస్తారట, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారట, మన ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు లేదంటే డబ్బులు ఇస్తారట, మనకు ఏదికావాలో మనమే నిర్ణయించుకోవాలట,” అన్నాడు మల్లయ్య.


“ ఏమిటో… మనం ఇన్నాళ్ళుగా నమ్ముకున్న మన ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మాత్రం నామనసొప్పడంలేదు మీకెలాగుందో కానీ,” బాధపడుతూ చెప్పాడు ఆచార్యులు.


“ నీకేందయ్య పంతులు నువ్వు అదృష్టవంతుడివి, నలుగురు కొడుకులు తలో రెండునెలలున్నా సరిపోతుంది కదా! మాకు చూడు ఉన్నది ఒక్కడే కొడుకు, తిట్టినా కొట్టినా వాడిదగ్గరే పడిండాలి,” అన్నాడు ఊరి షావుకారు రాజేషం.


“ అంతేలేవయ్యా … దేనికైనా పెట్టి పుట్టాలంటారు, నాకు ఉన్నారు నలుగురు కొడుకులు ఏం లాభం, ఒకరంటే ఒకరికి పడిచావడంలేదు ఇక మమ్మల్నేం చూస్తారు,” బాధపడుతూ అన్నాడు లెక్కలు రాసే ఆ ఊరి కరణం శేషగిరిరావు.


అందరూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకొని. మధ్యాన్నం కావడంతో భోజనాలకు సమయం అయిందని ఎవరింటికి వాళ్ళువెళ్ళిపోయారు. ఇంటికి వెడుతూనే భార్య కామాక్షితో జరిగిన విషయం చెప్పాడు. అమె చాలా బాధపడింది ఉన్న ఊరు విడిచిపెట్టివెళ్ళాలంటే. మనసేం బాగుండక నాలుగుమెతుకులు తిన్నట్టనిపించారు. ఎందుకైనా మంచిదని కొడుకులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఏం చెబుతారోనని వాళ్ళు చెప్పినదాన్ని బట్టి , ఆలోచించు కుందామనుకున్నాడు. అందరూ చెప్పిన విషయాలు విన్నాడు. అందరూ ఒకటే సలహా ఇచ్చారు. ఎలాగు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా! ఇంకా ఆ పల్లెటూరులో ఏం ఉంటారు. అందుకని డబ్బులే ఇవ్వమని చెప్పండి ఎలాగు మా అందరి దగ్గరికి రావాలి కదా అన్నారు.

నిజమేననిపించింది కృష్ణమాచార్యులకు. వయసు మీదపడుతుంది చేసుకుని తినే

ఓపికపోతుంది. కనుక వాళ్ళు చెప్పినట్టే చెయ్యడం మంచిదనిపించింది. ఆ విషయమే భార్యకు చెప్పాడు. ఆమెకు కూడా చాలా ఆనందమేసింది. 'మనవళ్లు, మనవరాళ్ళతో కలిసి ఉండొచ్చు' అనుకుంది మనసులో. అనుకున్నట్టుగానే ఊరిలో నుండి వెళ్ళేరోజు రానే వచ్చింది. ముందుగానే నలుగురుకొడుకులు వచ్చి , ఎవరికెంత రావాలో వాటాలువేసుకుని ఉన్న డబ్బును అందరూ పంచుకున్నారు. కామాక్షమ్మ చూస్తూ ఊరుకోలేక కొడుకులను అడిగింది.


“ అదేమిట్రా …ఉన్న డబ్బులన్ని మీరు మీరు పంచుకుంటే మా పరిస్థితేంటి ?మాకంటూ కొంత డబ్బులుండాలి కదరా! మందులకో మాకులకో కావాలి కదా! ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా,” అంది.


“ అలా అంటావేంటమ్మా… మీ అవసరాలకు డబ్బులివ్వడానికి మేములేమా? ఎందుకలా బాధపడుతున్నావు,” అన్నాడు పెద్దబ్బాయి మోహన్.


“ అమ్మా మీకు ఏదికావాలన్నా చెయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అయినా మీరు డబ్బులకోసం ఇబ్బంది పడడమేమిటి? నాన్నకు నెల నెలా ఫించను వస్తుందికదా! ఇంకా అలా అంటావేంటమ్మా?,” అడిగాడు చిన్నవాడు కిరణ్.


“ ఏదో లేరా… దానికి ఏమి తోచక అలా అడిగింది, అంటూ “ కాముడు నీకెందుకు ఈ విషయాలన్నీ నేను చూసుకుంటా కదా! మనకే లోటురాకుండా వాళ్ళు చూసుకుంటామంటున్నారు నువ్వింకా దిగులుమానేయ్యి,” అన్నాడు ఆచార్యులు. ఎలా జరగాల్సి వస్తే అలా జరుగుతుంది అనుకున్నాడు మనసులో.


“ అమ్మా… నాన్న బట్టలన్నీ నాన్నకు సర్ధిపెట్టావా ? నీ బట్టలన్నీ నువ్వు సర్ధుకున్నావా? మిగిలిన వస్తువులన్నీ ఎవరికైనా ఇచ్చివేద్దాము,” అన్నాడు రెండోవాడు నవిన్.


“ ఆహా … మీ నాన్న బట్టలన్నీ ఒకపెట్టే ,రెండుబ్యాగులలో సర్దాను లేదంటే, అస్తామానం 'కాముడు.. నా పంచెక్కడుంది, నా కండువా ఎక్కడుంది' అని అడుగుతూనే ఉంటారు, అందుకని ఆయన బట్టలన్నీ ఆయనకు పెట్టేసాను,” అంది ముసి ముసిగా నవ్వుతూ భర్త వైపు చూస్తూ . అందరికి వీడ్కోలు పలుకుతూ బాధతప్త హృదయంతో కారు ఎక్కారు. మరలి మరలి చూస్తూ , ఆప్తులకు దూరమయితున్నామనే ఆవేదనతో.


కారు దిగడమే ఆలస్యం అన్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చారు పెద్దమనవడు మనవరాలు.

వస్తూనే నానమ్మను ఒకరు, తాతయ్యను ఒకరు గట్టిగా హత్తుకుని చెయ్యిపట్టి లోపలకుతీసుకవచ్చారు.


“ ఏయ్ మానసా… మా అమ్మ నాన్న వచ్చారు కాస్తా టీ తీసుకరా,” అంటూ భార్యను పిలిచాడు మోహన్.


“ అబ్బా ఏమిటా అరుపులు వస్తున్నాను కదా! మీ అమ్మ నాన్న వచ్చారన్న ఆనందం తట్టుకోలేకపోతున్నట్టున్నారు,” అంది లోపలనుండి వస్తూనే.


“బాగున్నారా … అత్తయ్యా , మామయ్యా ,” అంది టీ కప్పు అందిస్తూ.


“ ఆ …ఆ బాగున్నాము తల్లి, నీ ఆరోగ్యం పిల్లలు మీరందరూ బాగున్నారు కదా!,” అడిగింది కామాక్షమ్మ కోడలివైపు ఆప్యాయంగా చూస్తూ.


“ అయ్యో … మా బాగుకేమొచ్చిందిలెండి మేమెలాగు బాగానేఉంటాము, ఇప్పుడు మీరు కూడా వచ్చారు కదా!,” అంది డొంకతిరుగుడు మాట మాట్లాడుతూ.


“ మానసా … ఏమిటామాటలు, కాస్తా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో,” కొంచెం గద్దిస్తున్నట్టుగా అన్నాడు మోహన్.


“ ఏమిటో మీ అమ్మా నాన్నను చూడగానే నోరు బాగానే లేస్తుంది, అయినా నేనేమన్నానని అంతకోపం వస్తుంది, అనుకున్నాను వీళ్ళు వస్తున్నారంటేనే నాకు అర్ధమైంది, ఇంట్లో గొడవలు మొదలౌతాయని ఇకనుండి అన్నీ భరించుకోవాలన్నమాట,” నిష్టూరంగా అంది.


“ బాబు … అమ్మాయిని ఏమి అనకు, తనేమి అన్నదని నువ్వంతగా కోపానికి వస్తున్నావు,”

అంటూ మందలించాడు ఆచార్యులు.


అంతావింటున్న ఆచార్యుల రెండో అబ్బాయి నవీన్. “నాన్నా పదండి మనమిక బయలుదేరుదాము, అంటూ లేచాడు తండ్రి బ్యాగులు చేతిలోకితీసుకుంటూ.


“ అదేమిటి ! కొన్నాళ్ళు ఇక్కడున్నాక నీ దగ్గరకొస్తాము, ఇప్పుడే కదా వచ్చాము నీకు టైం అవుతున్నట్టుంది నువ్వు బయలుదేరు బాబు ,” అన్నాడు .


“ అదికాదు నాన్నా… మీరు నాతోపాటుగా మా ఇంటికి వస్తున్నారు, అక్కడ ఒకనెల ఉన్నాక తమ్ముడు దగ్గరకు మీరు వెళతారు, అమ్మ ఇప్పుడు ఇక్కడే అన్నయ్య దగ్గర ఉంటుంది, మీరు వెళ్ళాక అమ్మ నా దగ్గరకు వస్తుంది,” చెప్పాడు చాలా చిన్న విషయం అన్నట్టుగా.


నోటమాటరానట్టుగా అలానే బిత్తరపోయి చూస్తూ నిలుచున్నారు ఆచార్యులుగారు, కామాక్షమ్మ.


“ బాబు … మమ్మల్ని పంచుకుంటున్నారా? పెళ్ళైన ఇన్నేళ్ళలో మేమేనాడు విడిచిపెట్టి ఉండలేదు , ఇప్పుడు మీకారణంగా దూరం ఉండవలసి వస్తుంది, బాగుంది బాబు చాలా బాగుంది,” అన్నాడు బాధతో.


“ అదికాదు నాన్నా… మీరిద్దరు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, అమ్మ కైనా మీకైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకొండి, ఆహా ఊరికే అంటున్నాను ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ కు ఖర్చులు వగైరా చాలా అవుతాయి కదా !అందుకని తలా కొన్ని రోజులు ఉండమంటున్నాము, అంతేకదరా అన్నయ్య నువ్వుకూడా చెప్పారా,” అన్నాడు అన్నవైపు చూస్తు.


“ మాకు ఎవ్వరు ఏమి చెప్పవద్దు మాకన్ని అర్ధమయ్యాయి, మీకెలా నచ్చితే అలానే చెయ్యండి, కాముడు నేను వెళ్ళివస్తాను… వీళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకుందాము సరేనా,” అంటూ భార్య దగ్గరకు వచ్చి నిలుచున్నాడు.


“ ఏమయ్యా … ఇదెక్కడి న్యాయం, మిమ్మల్ని విడిచి నేనుండడమేమిటి నేను మీతోపాటే వస్తాను, మనలను విడదియ్యాటానికి వీళ్ళేవరూ,” అంటూ చీరకొంగు నోట్లో కుక్కుకొని బావురుమంది కామాక్షమ్మ.


” కాముడు కొన్ని రోజులు ఓపికపట్టు పరిస్థితులు చక్కబడేవరకు అలా ఉంటుంది,” అంటూ భార్యను ఓదారుస్తూ గబగబా వెళ్ళిపోయాడు ఆచార్యులు.


పెద్దకోడలు ప్రేమ చూసాక కడుపునిండిపోయింది. ఇక రెండోకోడలు ఎలా ఉంటుందో వెళితే కానీ తెలియదు అనుకుంటుండగానే ఇల్లు వచ్చేసింది.


“ రండి మామయ్యా బాగున్నారా? అత్తయ్య బాగున్నారా ?,” చేతిలో ఉన్న బ్యాగుతీసుకుంటూ నవ్వుతూ పలకరించింది కోడలు రాధ.


“ బాగున్నాను తల్లి… పిల్లలు మీరందరూ బాగున్నారు కదా!,” అడిగాడు. మనసులో మాత్రం పరవాలేదే కోడలు బాగానే పలకరించింది. ఎంతైనా పెద్దకుటుంబంలో నుండి వచ్చిన పిల్లకదా! మంచీ చెడు తెలిసే ఉంటుంది అనుకున్నాడు.


పిల్లలు కొడుకు కోడలు అందరు కలిసిమెలిసి బాగానే ఉన్నారు. అప్పుడే వారంరోజులు గడిచిపోయింది. ఏమిటో తెలియనేలేదు అనుకున్నాడు ఆచార్యులు.


ఒకరోజు రాత్రి నిద్దురపట్టక పక్కమీద అటు ఇటు దొర్లుతున్నాడు. పక్కరూంలో నుండి కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలన్నీ వినబడుతున్నాయి. వాళ్ళకు కూడా నిద్దురరానట్టుంది అనుకున్నాడు. వాళ్ళ మాటలు వినవద్దు అనుకున్నా గట్టి గట్టిగా మాట్లాడుతుంటే, అందులో తనగురించే వస్తుంటే వినకుండా ఉండలేకపోయాడు.


“ ఏమండి… మీ నాన్నను ముప్పొద్దులా మెపడానికేనా ఇక్కడకు తీసుకవచ్చింది, చిన్నా చితక పనులన్నా చేసిపెట్టాలి కదా! ఆమాత్రం కూడా తెలియదా ఆ ముసలాయనకు, పొద్దస్తమానం టీవి ముందుకూర్చోకపోతే, పిల్లలను స్కూల్ నుండి తీసుకరావడం, చెట్లకు నీళ్ళుపొయ్యడం, అవసరమైతే నాకు కూరగాయలు కట్ చేసివ్వడం అలాంటివి చెయ్యొచ్చు, కమ్మగ పుల్లగా చేసిపెడుతుంటే, ఇది బాగుందమ్మ అది బాగుందమ్మ అంటూ లొట్టలేసుకుని తినడం మాత్రం తెలుసు,” కొడుకుతో కోడలుచెబుతున్న మాటలన్ని వింటుంటే , కడుపులో తిప్పినట్టయింది ఆచార్యులకు. కొడుకు ఏమంటాడోనని మళ్ళి వినసాగాడు.


“ రాధ నీకన్నీ తొందరనే , మా నాన్న వచ్చి వారంరోజులే కదా అయింది ఇక అన్నీ అలవాటుచేద్దాం, బయటపనులు కూడా చేస్తారు అదే కూరగాయలుతేవడం, షాపునుండి సరుకులుతేవడం ఇవన్నీ ఆయనకే అప్పచెబుదాము, ఎందుకంటే ? ఆయన ఫించను డబ్బులు ఎలాగు మనకివ్వరు, అడిగామనుకో మనను వేరే విధంగా అర్ధంచేసుకుంటారు, అందుకని ఆయనచేతనే ఆ డబ్బులన్నీ ఖర్చుపెట్టిద్దాము సరిపోతుంది కదా!,” అన్నాడు భార్యను దగ్గరకు తీసుకుంటూ.


“ అబ్బో ఎన్ని తెలివితేటలండి మీకు, ఏమో అనుకున్నాను మీగురించి పరవాలేదు, ముందుచూపు చాలానే ఉంది,” నవ్వుతూ భర్త జుట్టును తనవేళ్ళతో తిప్పుతూ అంది.


అంతావిన్న తరువాత ఆచార్యుల మనసు బాధతో విలవిలలాడింది. ఎంత స్వార్థచింతన మనుషులకు. కన్నతల్లి తండ్రులనే స్వార్థానికి ఉపయోగించుకునే ముర్ఖులనా తను కన్నది. ఇందుకోసమేనా కపటప్రేమలు ఒలకబోసింది. దేవుడా ! ఎలాంటి సంతానాన్ని ఇచ్చావయ్యా.


మేమేం పాపంచేశామని? నా పరిస్థితే ఇలాగా ఉంది అంటే, ఫోన్ చేసి మాట్లాడుదామన్నా ఆ ఫోన్ వాళ్ళ రూంలో ఉంటుంది. పాపం ఆమాయకురాలు కాముడు ఎలా ఉందో, నోరెత్తలేదు కన్నకొడుకుతో చెప్పుకోలేదు, కడుపున పుట్టిన పిల్లలే కన్నకడుపును అర్ధంచేసుకోలేకపోతే, ఇంకా ఎవరికి చెప్పుకోగలం. చూద్దాం కొన్నాళ్ళు ఓపికతో మిగతా వాళ్ళ సంగతి కూడా తెలిసాక అప్పుడు ఆలోచిస్తాను అనుకున్నాడు. ఉదయం కొడుకు కోడలు లేచిసరికి తను చెయ్యవలసిన పనులన్నీ చేసిపెట్టాడు. అన్నీ చూసి కొడుకూ కోడలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు .


“ రాధ … మనమాటలేం మా నాన్న వినలేదు కదా?,”


“ ఆ వింటే విననివ్వండి, మనం చెప్పావలసిన అవసరంలేకుండాపోయింది, ఎవరైనా అడిగినా మనకేం తెలియదు వద్దన్నా ఆయననే అలా చేస్తారు అని చెబుదాము,” అంది. ఇదేదో మాములు విషయమన్నట్టుగా. నవీన్ కు తండ్రి ముఖంచూడటానికి ఇబ్బందిగా ఫీలయ్యాడు.


అనుకున్నట్టుగానే ఏ గొడవలు లేకుండా నెలరోజులు గడిచిపోయాయి. ఎందుకు గడవవు? అన్ని పనులు ఆయనే చేస్తున్నారాయే, ఇంటికి కావలసిన సరుకులు తెస్తున్నారు. ఇక గొడవపడవలసిన అవసరం ఏముంది. సమయానికి ఇంతముద్ద పడెయ్యడమే కదా! అందుకే సాఫీగా గడిచిపోయింది. “ముందుంది ముసళ్ళ పండుగా” అన్నట్టు మూడోవాళ్ళింటికి వెళితేగాని బయటపడదు అనుకుంటుండగానే , వచ్చాడు జగన్ మూడేవాడు.


“ నాన్నా బాగున్నారా” మీరు తయారుగానే ఉన్నారు కదా! పదండి ఆటోను నిలబెట్టి వచ్చాను, నాకట్టే టైం లేదు మిమ్మల్ని ఇంటిలో దిగబెట్టి మేము ఆఫీస్‌కు వెళ్ళిపోవాలి,” అంటూ తొందరచేసాడు.


“ అయ్యో… అంతతొందరైతే ఎలారా? ఈ రోజు మీ అమ్మ వస్తుంది, దాన్నీ చూసాకా వెళదాము,మీ అన్నయ్యా వదిన కూడా లేవాలికదా! వాళ్ళులేచాక చెప్పివెళదాము నేను తయారుగానే ఉన్నాను,” అంటూ లేచివెళ్ళి ముందే సర్ధిపెట్టుకున్న తన పెట్టే

బ్యాగు తెచ్చుకున్నాడు.


“ అబ్బ నాన్నా… మీ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కులివే, చెప్పిన మాటలు అర్ధంచేసుకోరు, అమ్మను చూసి ఎన్నాళ్ళయింది, మహా అయితే నెలరోజులు అంతేకదా! అమ్మను చూడకుండా ఆమాత్రం ఉండలేనట్టున్నారు, నేను తరువాత అన్నయ్యకు ఫోన్ చేసి చెబుతాను ముందు మీరునడవండి,” అంటూ పెట్టే చేతిలోకి తీసుకున్నాడు. మారుమాటాడకుండా బ్యాగుచేతిలోకి తీసుకున్నాడు ఆచార్యులు. కొడుకుమాటలకు చివుక్కుమన్నది మనసు. దారిలో ఎవరూ ఎవరితో మాట్లాడుకోలేదు.జగన్ డబ్బుమనిషి అందుకే అతని ఆలోచనలన్నీ వ్యాపారం గురించే ఆలోచిస్తుంటాడు. ఆయనకు తగ్గ ఇల్లాలు పద్మ, ఆమెచేసే ఉద్యోగం ప్రైవేటు స్కూల్ లో టీచరు. దానికే ఏదో పెద్ద ఆఫీసరులా బీరాలుపోతుంది. ఇక పిల్లలైతే ఏ అమెరికాలో పుట్టిపెరిగిన వాళ్ళలా ఉంటారు.


అవున్లే మీకెలా తెలుస్తాయి మా ప్రేమానురాగాలు. మా పెళ్ళి అయినదగ్గర నుండి మేము

విడిగా ఉన్నదే చాలా తక్కువ, మీ ప్రేమలు నీటిమీద రాతలులాంటివి కానీ! మా ప్రేమలకు బీటలువారుడు తెలియదు అనుకున్నాడు మనసులో.


“ మామయ్యా వచ్చారా రండి మీ కోసమే ఎదిరిచూస్తున్నాను, మీకు అన్ని అప్పచెప్పి వెళ్ళిపోదామనుకుంటున్నాను, నేను వెళ్ళిపోయాక మీరు ఏమి దొరకక ఇబ్బందిపడతారేమోనని ఆలోచిస్తున్నాను, త్వరగా రండి మామయ్యా,” తను హడావుడి పడుతూ చెప్పింది.


భర్తకు తగ్గ భార్యనే అనుకున్నాడు మూడోకోడలిని చూసి. అవును ఇంతకు ఏమి అప్పచెబుతుందో పిల్లలనా? లేకా! నాకు తినడానికి అన్ని చేసిపెట్టి దొరకక ఇబ్బంది పడతానేమోనని అనుకుంటుందేమో, మాటతీరు చూస్తే బాగానే ఉంది అనుకుంటూ

తనకోసం కేటాయించిన క్రిందిగదిలో బ్యాగు అవి పెట్టుకుని గబగబా పైకి వచ్చాడు.


“ మామయ్యా ఇలా చూడండి, ఈరోజుకు మీకు వంటచేసాను, మేమెవ్వరం ఇంట్లోనుండి టిఫిన్ బాక్స్ లు తీసుకవెళ్ళం అందరం బయటనే తింటాం, ఉదయం టిఫిన్ మాత్రం చేస్తాము, మీకు టిఫిన్ కు ఇబ్బందిలేదు ఎటొచ్చి వంటచేసుకోవడమే ,” అంది నవ్వుతూ.


“ అదేంటమ్మా … మీరందరూ తినకుండానే వెళ్ళిపోతారా? మరి నా ఒక్కడికోసం నువ్వు కష్టపడడం ఎందుకు, నాకు అంతో ఇంతో వంటవస్తుంది నేను చేసుకుంటాలేమ్మా,”చెప్పాడు కోడలికి. బాగుంది అక్కడ చాకిరిచేస్తే కనీసం ఇంత మెతుకు పడేసేవాళ్ళు. ఇక్కడ ఆ పనికూడా నేనే చేసుకోవాలి. కర్మ కర్మ అనుకుంటూ నుదురుపట్టుకున్నాడు.


“ అయ్యో ఏమైంది మామయ్యా , అలా నుదురుపట్టుకున్నారు తలనొప్పిగా ఉందా? అడిగింది ప్రేమఒలకబోస్తున్నట్టు.


“ అబ్బే ఏంలేదమ్మా,”


“ సరే మామయ్యా, మీరు వండుకునేటప్పుడే మాకోసం కూడా చేసిపెట్టండి, వచ్చాక వేడిచేసుకోవచ్చు, మరీ నేను వెళతాను,” అంటూ చెప్పవలసినవన్నీ చెప్పి వెళ్ళిపోయింది.


పిల్లలు కోసం అటు ఇటు చూసాడు. వాళ్ళు లేవడమే ఆలస్యం అన్నట్టు రికార్డు పెట్టుకుని డాన్సులు చేస్తున్నారు. ఇవతల గోలపెట్టి అరచినా వినిపించుకునే పరిస్థితిలో లేరు. చాలాసేపుచూసాడు వాళ్ళకోసం ఇవతలికి వస్తారేమోనని. కాలేజికి సమయం అయిందని అప్పుడు గబగబా వచ్చారు తయారై. హల్లో కూర్చున్న ఆచార్యులను చూడగానే ముఖం చిట్లిస్తూ.


“ ఏయ్ ఎవరు నువ్వు నీకిక్కడేం పని, నిన్నెవరు రానిచ్చారు ఇంట్లోకి ఏంకావాలి నీకు,” మీదమీదకు వస్తూ గయ్యిమని లేచాడు మనవడు. అసహ్యంగా ముఖంపెట్టింది మనవరాలు ఆయనను చూస్తూ.


“ ఒరేయ్ నేను మీ తాతనురా, ఇందాకే మీ నాన్నా నన్ను ఊరినుండి తీసుకవచ్చాడు, ఎంతపెద్దగా అయిపోయారురా ,” అంటూ సంతోషంతో దగ్గరకు రాబోయాడు.


“ ఛీ ఛీ నువ్వు మా తాతవేంటి, ఒకసారి నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? పల్లెటూరు బైతులా ఉన్నావు, అసలు మా నాన్న ఎందుకు తీసుకవచ్చాడు, రాని వచ్చాక చెబుతాను ఆయనపని,” అనుకుంటూ వెళ్ళిపోయారు మనవడు మనవరాలు.


“ఛీ …ఛీ, ఏం బ్రతుకురా నీది, అందరిలో పెద్దమనిషిలా… మంచి మర్యాద చెప్పేవాడివని పేరు తెచ్చుకున్నావు, ఇప్పుడేమయింది నోరుకూడా మెదపకుండా కుక్కినపేనులా పడుంటున్నావు, ముసలాడివి అయిపోయావని నీలో జవసత్వాలు ఉడికిపోయాయా,”అంటూ వెక్కిరించింది అతని అంతరాత్మ.


“ ఏయ్ ఎవరునువ్వు నన్నెందుకు వెక్కిరిస్తున్నావు, నాకేం జవసత్వాలు ఊడిపోలేదు, నేనే కావాలని ఊరుకుంటున్నా, అందరూ అంటుంటారు కదా నన్ను, ధశరథ మాహారాజులాగా నలుగురు కొడుకులున్నారు అని, చూద్దాం ఎవరెలా ఉంటారో అని చూస్తున్నా,” అన్నాడు ఆచార్యులు.


“ పకపకా నవ్వింది అంతరాత్మ , పిచ్చివాడా… నీ కొడుకులు రామలక్ష్మణులనుకున్నావా?,”


“ అనుకోలేదు కానీ! శ్రీరాముడి మంచితనం , లక్ష్మణుడి సేవానిరతి, భరతుడి భక్తిభావం,

శత్రఘ్నుడి సోదరసన్నిహితం, ఇన్ని మంచిలక్షణాలలో ఒక్కటన్నా రాకపోతుందా అనుకున్నా నలుగురు కొడుకులు పుట్టినప్పుడు, నా చేతులలో పెరిగినప్పుడు తండ్రి మాటజవదాటని పిల్లల్లా పెంచాననుకున్నాను, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తండ్రి కి ఎదురుచెప్పని తనయులు నా పిల్లలు అని ముచ్చటపడ్డాను, కానీ! ఇప్పుడు తెలుస్తుంది భ్రమలుపెట్టుకోవద్దని, అందుకే నోరెత్తలేకపోతున్నాను. అనలేకకాదు అర్థమైందా?,” ఎదురుప్రశ్న వేశాడు. ఏమి అనలేక నోరుమూసుకుంది అంతరాత్మ .


వారం రోజులు గడిచిపోయాయి మూడోకొడుకు ఇంట్లోకి వచ్చి. ఇంట్లో ఉన్నాడన్న మాటేకానీ, కావలసినవాడిలా ఎవరుచూడడంలేదు. తమ వంతు కాబట్టి, తీసుకరాలేదన్న మాటవస్తుందని తీసుకవచ్చారు తప్పా! ఎవరికి ఆ మనిషి ఉన్నాడన్న ధ్సాసేలేదు. అన్నిపనులు తనే చేసుకుంటున్నాడు తిన్నావా పన్నావా అని అడిగే నాధుడేలేడు. పోనీలే ఎలాగోలా కాలంగడిచిపోతుంది చాలు అనుకున్నాడు.


నాలుగో కొడుకింటికి బయలుదేరాడు. ఆతనికి రావడం కుదరదని ఆటో పంపించాడు.

పాపం కామాక్షిని చూసి మూడునెలలవుతుంది. ఎలా ఉందో ఏమిటో ? లోకంపోకడ తెలియని అమాయకురాలు. ఎంతగా ఆడిపోసుకుంటున్నారో తనను. కనీసం ఫోన్ చేసి ఒక్కసారన్నా అమ్మతో మాట్లాడుతావా అని అడిగిన పాపానపోరు. పోనీలే ఇంకెంత ఈ నెలరోజులు గడిచాయంటే, నెలరోజులెందుకు ఈసారి గనుక నాలుగోవాడింటిలో ఏమైనా ఇబ్బంది కనిపించని, ఇక ఊరుకునేది లేదు తాడోపేడో తేల్చేసుకుంటా. కలోగంజో తాగి అయినా మా బ్రతుకులు మేము బ్రతుకుతాము. అనుకుంటూ చిన్నకొడుకింటిలోకి అడుగుపెట్టాడు.


బెల్లు కొట్టగానే బనియన్ లుంగిమీద ఉన్నాడు చిన్నకొడుకు. వచ్చి తలుపుతీసి షరా మాములే అన్నట్టుగా పలకరించాడు. ఆ పలకరింపులో ఆప్యాయతలేదు ఆదరణ అంతకంటే లేదు.

కోడలైతే పక్కింటివాళ్ళను పలకరించినట్టు పలకరించింది . పిల్లలకైతే చెప్పనే చెప్పరు మీ తాతయ్య అని. ఏం పని వెలగబెడుతున్నాడో కానీ, కన్నతండ్రిని తీసుకరావడానకి వీలులేదనిచెప్పాడు.


“ ఏమండి … మీ నాన్నను ఆ రూంలోనే ఉండమనండి. తనకు అన్నీ అందులోకే పంపిస్తామని చెప్పండి,” అంది ముఖమంతా అసహ్యంగా పెడుతూ.


“ అలాగేలేవే,” అంటూ నాన్నా మీ బ్యాగు అవి తీసుకరండి ఈ రూంలో పెట్టుకుందురుగానీ,” చెపుతూ ముందుకు వెళ్ళాడు కానీ, తండ్రి బ్యాగు తీసుకవెళ్ళాలన్నా మర్యాదకూడా లేని మరమనిషి.


సమయానికి పళ్ళెం తెచ్చుకుంటే ఇంత కూడు పడేస్తుంది కోడలు. టీ టిఫిన్లు అనే మాటనేలేదు. అవసరమైతే తప్పా రూంలో నుండి బయటకు రావడానికి లేకుండా కట్టడి చేసింది ముందే. పిల్లలను ఎప్పుడైనా దగ్గరకు తీసుకుందామని చూస్తే, రోగిష్టివాడిని చూసినట్టుచూసి వాళ్ళకు తలారా స్నానం చేయిస్తుంది. మనసంతా బాధతో విలవిలలాడుతుంది ఆచార్యులకు .ఇవన్నీ ఒకఎత్తైయితే నిన్న కళ్ళారా చూసిన దాన్నీ తట్టుకోలేకపోతున్నాడు. మగతగా కాస్త నిద్దరపట్టినట్టుంది. వర్షం పడుతుందేమో గమనించలేదు. రోజు పనిమనిషి ఉతికి ఆరేసినా బట్టలు తెచ్చుకుని తనే మడతపెట్టుకుని లోపలపెట్టుకునే వాడు.


పెరటిలోనుండి గట్టి గట్టిగా అరుస్తున్న కోడలు పద్మ అరుపులకు ఒక్కసారిగా ఉలికిపడిలేచాడు. ఏమైందోఏమోనని అనుకుంటూ వచ్చాడు పెరటిలోకి వర్షం పడుతుంది. మామగారి బట్టలు దూరంగా నిలబడి పొడవాటి కర్రతీసుకుని ముక్కుకు బట్టకట్టుకుని తీస్తుంది.


“తినడం పడుకోవడం తెలుసు. తనపని కూడా వేరే వాళ్ళు చేసిపెట్టాలి. వర్షం పడుతుంది బట్టలు తడిచిపోతాయనే ధ్సాస కూడా లేదు మనిషికి. అవున్లే ఎందుకు తెలుస్తాయి కమ్మగపుల్లగా తిని నిద్దరపోతే సరిపోతుంది. ఛీ , ఛీ కంపువాసన బట్టలు పాపం పనిమనిషి ఎలా ఉతుకుందో ఏమో, ఉండవు మరి ముక్కుపొడుం లేందే ముద్ద లోపలికి దిగదు. వ్యసనాలకేం తక్కువలేదు, మనిషికి ఏళ్ళు వచ్చాయిగాని బుద్దులు మాత్రం మారవు, ఇంకా ఎన్నాళ్ళో ఈ తలనొప్పి,” అంటూ నోటికి వచ్చినట్టల్లా అంటూనే ఉంది.


అన్నీ వింటున్న ఆచార్యులకు తనమీద తనకే అసహ్యం వేసింది. “ఛీ,ఛీ … ఏం బ్రతుకు ఇంత బ్రతుకు బ్రతికింది చివరకు కోడలు చేత నానామాటల పడడానికా! చీము నెత్తురు ఉన్నవాళ్ళయితే ఈపాటికి గుండెపగిలి చచ్చేవాళ్ళేమో, నేనింకా విని కూడా బ్రతుకుతున్నానంటే ఎందుకోసం, ఆ.. నాకర్ధమైంది. నా కామక్షికోసమేమో, అవును నా కాముడికోసం నేను బ్రతకాలి. నేనెలాగైనా ఇక్కడినుండి బయటపడి నా భార్యను నేను కలుసుకొని, మా బ్రతుకు మేం బ్రతకాలి, అవును బ్రతకాలి,” పిచ్చి పిచ్చిగా తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళాడు. చేతికి వచ్చిన బట్టలు గబగబా పెట్టెలో సర్దుకున్నాడు. దాచుకున్న డబ్బులు తీసుకుని పెట్టే చేతిలో పట్టుకుని. అంత వర్షంను లెక్కచెయ్యకుండా వడివడిగా అడుగులేసుకుంటూ బయలుదేరాడు గమ్యంవైపు. ఎదురుగా వస్తున్న రిక్షా అతను చూసి రిక్షా ఆపాడు.


“బాబయ్యా ఇంత వాన పడుతుండాది, ఏదైనా బిరానా పొయ్యే పని ఉందా?

రా బాబయ్య నా రిక్షాలో కూసో నేదిగబెడతాను,” అంటూ ఆపుకుని అడిగాడు. పెద్దమనిషి వర్షంలో తడుస్తూ వెళుతుంటే చూడలేక.


రిక్షా అతన్ని ఎగాదిగా చూసి రిక్షా ఎక్కి మూడో కొడుకింటి అడ్రసు చెప్పాడు.


“ బాబయ్యా … నువ్వేమి అనుకోకపోతే ఓమాట అడుగుతా! ఇంత వానలో ఎందుకు వచ్చినావో నాకు సమజయతలేదు?,”అన్నాడు.


“ తప్పదు కదా బాబు… అవసరం అనుకున్నప్పుడు వర్షమైనా, ఎండైనా రాకతప్పదు,

మా ఆమె కోసం వస్తున్నాను, అనుకోకుండా వర్షం మొదలైంది ఇది నా మంచికేలే,”అన్నాడు.


“ మీ ఆమె ఎక్కడుంది?,”


“ఆమె , ఆమె… వాళ్ళ కొడుకు దగ్గర ఉంది, ఆమెను నాతో తీసుకపోవాలని వెళుతున్నాను,”


రిక్షా అతనికి ఏమి అర్ధం కానట్టు బుర్రగోక్కున్నాడు.” ఏందో నువ్వు ఏదేదో సెపుతుంటే

నా మట్టి బుర్రకు ఏమి తలకెక్కుతలేదు,” అన్నాడు.


“ రిక్షా బాబు … నీకు పిల్లలున్నారా ! మగపిల్లలున్నారా?,” అడిగాడు.


నా పేరు ఓబులేసు బాబయ్య, ఆ దేవుడు నాకు పిల్లలను ఇయ్యలేదు, మా ఇంటిదానికి అదే రంధిపెట్టుకుని చాలా దినాలు మంచంపట్టింది, మా అమ్మ …నాయన… దాన్ని చిన్నపిల్లతరిక చూసుకుంటరు, ఇప్పుడు దానికి సమంజసమయింది, పిల్లలు లేకుంటేమానయే అత్తా మామనే పిల్లలు అనుకుని ఆళ్ళనే కన్నబిడ్డలుగా చూసుకుంటాది, ఇంక మాకెందుకు బాబయ్య పిల్లలు ఆళ్ళు బతికున్నంతకాలం కంటిలోపాపల చూసినామనుకో, అళ్ళు స్థిమితంగా పొతరు మేము ఆళ్ళను మంచిగా చూసుకున్నము అనుకుంటము,”అంతే కదా సారు అడిగాడు అతను.


ఆచార్యులకు కళ్ళనిండా కన్నీళ్లు నిండగా , “ ఒక్కనిమిషం రిక్షా ఆపుతావా!,” అడిగాడు.


“ ఏటయింది… ,”అంటూ రిక్షా ఆపి క్రిందకు దిగి వచ్చి ఆచార్యుల దగ్గరకు వచ్చాడు. ఆపాటికే క్రిందకు దిగిన ఆచార్యులు. రిక్షా అతని చేతులుపట్టుకుని కళ్ళకద్దుకుంటూ. “నువ్వు నిజంగా మనసున్న మనిషివి, నీలాంటి కొడుకులు అందరికి ఉంటే , ఆ తల్లితండ్రులు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో కదా! ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం నీలాంటివాడికి,” అంటూ తనమెడలో ఉన్న బంగారుగొలుసు తీసి అతనిమెడలో వేసాడు.


“ బాబయ్యా … ఏంది? గిది నాకెందుకిస్తున్నరు, నిన్ను పున్నానికేం తొలుకపోతులేను,

నాకొద్దు నువ్వే ఉంచుకో,” అంటూ తీయ్యబోయాడు.


“అదికాదు ఓబులేసు… కన్నవాళ్ళను అంతబాగా అర్ధంచేసుకున్న నీ మంచితనానికి ఇస్తున్నా. కాదనకు తీసుకో , నాకు ఉన్నారు నలుగురు కొడుకులు,” అంటూ వాళ్ళకు తనకు మధ్య జరిగిన విషయాలన్నీ చెప్పాడు బాధపడుతూ.


“ నాకిప్పుడు సమజయంది నువ్వేందుకు ఈ వానలో వచ్చినావో, నీ కొడుకులకు బుద్ది చెప్పి రాకుండా వచ్చినావు కదా సారు, ఆళ్ళకు ఎట్టా తెలుసుద్ది నీబాధ , చూడు సారు… మాకు కూటికి గతిలేకున్న ఇట్టాంటి పాపం పని చెయ్యం, సరే మరి ఇప్పుడేడి కెలుదామనుకున్నావు? యాడ వుందామనుకున్నావు సారు,” అడిగాడు రిక్షా తోలుతూ.


“ చూడు ఓబులేసు … నాకోసం ఒకపని చేస్తావా? ఈ రోజుకు మేము ఎక్కడన్నా తలదాచుకుని, రేపు ఉదయమే మేము రైలులో కాశీకి వెళ్ళిపోతాము, అందుకని నువ్వు మాకు టికెట్లు తెచ్చిపెడతావా డబ్బులిస్తాను,” అడిగాడు .


“ అట్టాగే తెస్తానుగాని, ఈ చీకటిపొద్దు ఏడతొంగుంటరు, నువ్వేమనుకోకపోతే మా ఇంటికి రా సారు, పిడికెడు బువ్వతిని పడుకుని లేస్తూనే పొండి ఏమంటావు సారు,”అడిగాడు బిడియపడుతూ గొప్పోళ్ళు కదా ఏమనుకుంటాడోనని.


“ ఓబులేసు … నీ అంతటి మంచి మనిషి పిలిస్తే రాకుండా ఉంటానా చెప్పు? మనిషికి కావాలసింది మంచితనమే కానీ డబ్బు హోదా కాదు, అవి ఉన్నా మానవత్వంలేని మనిషి ఉంటే ఎంత లేకుంటే ఎంత,”అంటూ “ ఆ ఆ అదిగో అదే ఇల్లు , నువ్వు ఇక్కడే ఉండు నా భార్యను తీసుకుని వస్తాను,” అంటూ పెద్ద పెద్ద అంగలువేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు.


ఆచార్యులు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరులేరు ఒక కామాక్షమ్మ తప్పా, దగ్గరగా వేసి ఉన్న తలుపులుతీసుకొని లోపలకువెళ్ళాడు.


“ కాముడు … కాముడు,” పిలిచాడు.


భర్త గొంతువిన్న కామాక్షమ్మ ఒక్క అంగలో బయటకు వచ్చింది నాగస్వరం విన్న నాగినిలా.


“ ఏమయ్యా …,” అంటూ ఒక్కసారిగా వచ్చి అతన్ని అల్లుకుపోయింది. ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు ఆచార్యులు.


“ కాముడు… పద మనం త్వరగా వెళ్ళిపోవాలి, బయట రిక్షా ఆపి వచ్చాను నీ బ్యాగుతీసుకొనిరా,” తొందరచేసాడు భార్యను.


“ ఏమైందయ్యా … ఇలా వర్షంలో తడుస్తూవచ్చావు, జ్వరంగాని పట్టుకుంటే ఎలా?,” అంది తనచీర కొంగుతో తలతుడుస్తూ.


“ అబ్బా … ఇప్పుడవన్నీ చెప్పే సమయంలేదు పద తొందరగా వెళ్ళాలి, దారిలో అన్ని చెబుతాను,” అన్నాడు. కామాక్షమ్మ వెళ్ళి బ్యాగుతీసుకుని వచ్చింది. గబగబా బయటకు వచ్చి రిక్షా ఎక్కాకగాని స్థిమితపడలేదు ఆచార్యుల మనసు.


“ ఏమైందయ్యా … ఆదరాబాదరాగా తీసుకవచ్చావు, కొడుకు కోడలు వచ్చాక చెప్పివెళ్ళిపోతే బాగుండేది కదా! ఏమనుకుంటారు మనం ఇలా చెప్పాపెట్టకుండాపోతే, అయినా ఇన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి, ఒక్కసారైనా నేను గుర్తుకురాలేదా ? కొడుకింట్లో కమ్మగపుల్లగా తింటుంటే నేనెందుకు గుర్తుకుంటాను,” అంది నిష్టూరంగా.


ఒక్కసారి భార్యను ఎగాదిగా చూసాడు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది. తనను చూస్తేనే అర్ధమయిపోతుంది. అడిగి బాధపెట్టడం కంటే ఊరుకోవడమే మంచిది.తనకు జరిగిన విషయాలు కూడా చెప్పి తనను బాధపెట్టడం ఇష్టంలేదు అనుకున్నాడు మనసులో.


“ కామాక్షి… ఇప్పడవన్నీ ఎందుకుగానీ , మనమిప్పుడు కాశికి వెళ్ళి అక్కడే ఉంటున్నాము, పిల్లలకు తెలిస్తే మనను వెళ్ళనివ్వరని తొందరపెడుతున్నాను,” అన్నాడు.


“ పోనిలెండి మంచి ఆలోచనచేసారు , మనకీవయసులో ప్రశాంతజీవనంకు మించిన మందులేదు,ఈ పని ఎప్పుడో చెయ్యాలి, మన జీవితనౌకలో ఒడిదుడుకుల ప్రవాహం సాఫీగా చివరివరకు సాగిపోతే అంతే చాలు,‘‘అంది. మనసంతా బాధతో నిండిపోయింది కామాక్షమ్మకు.


ఎవరికెవరు తాము పడిన ఇబ్బందిల గురించి మాట్లాడుకోలేదు. మళ్ళి ఆ విషయాలు తవ్వుకుని బాధపడేకంటే మరచిపోవడమే మేలనుకున్నారు ఎవరికివారే. దారిలో తనకు రిక్షా అతనికి జరిగిన విషయాలు చెబుతుండగానే.


“ బాబాయ్యా … ఇదే మాఇల్లు, అమ్మా నీ కాలు మా గడపలెట్టి పున్నెం కట్టుకోండి,” అంటూ

“ఏయ్ మంగా … ఏడున్నావే, సారు, దొరసాని వచ్చినారు సూడు,” కేకవేశాడు లోపలకు వెళుతూనే.


“ ఏంది మామ గట్లా గట్టిగా అరుస్తుండావు? ఎవరొచ్చినారేటి,” అడుగుతూ వంటగదిలోనుండి బయటకు వచ్చింది.


“ మంగా … ఈ సారువాళ్ళు ఈ పొద్దు మనింటికాడనే తిని, రాతిరికి ఈడనే తొంగోనీ పొద్దున ఎల్లిపోతారు, ఆళ్ళకు పసందైన తిండిపెట్టాలా మనం, పెద్దోళ్ళు మనింటికి ఎందుకొస్తారే, నేను సంతకెల్లి కూరలుపట్టుకొత్తానే ఈలోగా నువ్వు ఆళ్ళకు ఏమికావాలో అడుగు, అంటూ సంచితీసుకొని వెళ్ళిపోయాడు. చూడటానికి ఇల్లు చిన్నదే అయినా చూడముచ్చటగా ఉంది. పొందికగా సామానంతా సర్దుకుంది మంగా. ఓబులేసు తల్లి తండ్రిని పలకరించి భోజానాలు ముగించుకుని తృప్తిగా నిద్రపోయారు కామాక్షమ్మ ఆచార్యులు.


ఉదయం కోడికూత కంటే ముందుగానే లేచి. ఆచార్యులను తొందరపెట్టాడు ఓబులేసు. తొందరగా తయారై తమ బ్యాగులు తీసుకుంటూ మనస్పూర్తిగా అక్కునచేర్చుకుంది మంగను కామాక్షమ్మ. కులానికి తక్కువైనా గుణంలో ఉన్నతంగా ప్రవర్తించినతీరు, డబ్బులేకున్నా కన్నవాళ్ళను ఆదరించే తీరు, ఆ దంపతుల కళ్ళల్లో కన్నీరు తెప్పించింది. అందరి దగ్గర సెలవుతీసుకుంటూ వెళ్ళిపోయారు. ఓబులేసు వాళ్ళను జాగ్రత్తగా రైలు ఎక్కించి,


“ సారు … మీకు ఎన్నడన్న కష్టం గనుక వచ్చినట్టయితే ఈ ఓబులేసు ఉన్నాడని గురుతుంచుకో సారు,” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.


“ ఓబులేసు… ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలయ్యా? నాకు ఎప్పుడు రావాలనిపించిన

కల్మషంలేని కల్లాకపటం లేని నీ దగ్గరకే వస్తాను సరేనా,” అన్నాడు అతని కళ్ళు తుడుస్తూ.

॥॥ శుభం ॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్
































































57 views4 comments
bottom of page