'Kakathi Rudrama Episode 26' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
మహాదేవుడు ఓటమిని అంగీకరించి, రుద్రమదేవిని శరణు కోరుతాడు. రుద్రమ దేవి నిండు సభలో గన్నారెడ్డిని అభినందిస్తుంది. రాజద్రోహం చేసిన లకుమయా రెడ్డి, జన్నిగ దేవులు క్షమాబిక్ష పొంది రాజ్యం వదిలి వెళ్ళిపోతారు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 26(చివరి ఎపిసోడ్) చదవండి..
రుద్రమదేవి అలసటతో అంతఃపురము లోకి చేరింది.
ఆమె తల్పమున శయనించినది. ఆమెకు గతము జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
మహాదేవరాజు ఓటమి --- తన విజయము.
గన్నారెడ్డి చాణుక్య రణము- వీరభద్రుల వీరపరాక్రమములు.
ఆనాడు తాను ఒక్కతే, అన్ని లక్షలమంది సమూహమున సింహాసన మధిష్టించినది. ఆమెకు తరతరాల నుండి కాకతీయవంశ ప్రాభవాలు దీవింపజేసిన, ముత్తా
తల - తండ్రిగారల నిలువెత్తు పఠములు చేతులెత్తి దీవిస్తున్నట్టు, ఆమె చెవిలో విజయధ్వానాలు వినిపించుచుండెను. ఆమెకు దుఃఖం వచ్చుచుండెను. ఐననూ అదిమి పెట్టుకుంది.
వీరభద్రప్రభువు చిరునవ్వుతో, గంభీరంగా మెరిసెడి కళ్ళతో తనవైపునకే చూచుచుండెను. ఆమె లేచి నిలబడి-
"ప్రభూ! మీరునూ, నా ప్రక్కన సింహాసనంపై కూర్చొనుడు. నేను ఒంటరిగా ఇంతపెద్ద సామ్రజ్యపు బాధ్యత తీసుకోలేను" అని అందామనిపించింది. చక్రవర్తిణి ఐనా ఆమె స్త్రీ కదా! బేలతనం స్త్రీల హక్కు కదా!
ఆమె అలంకరించుకుంది. దాసదాసీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివదేవయ్యామాత్యులు, వీరభద్రప్రభువు లతో మంతనాలు చేస్తున్నారు. భవిష్యత్తు విషయంలో సుధీర్ఘ చర్చలు సాగుతున్నవి.
సూర్యకాంతి చల్లగా వుంది. శ్రావణమాసపు మబ్బులు ఆకసమున చెమ్మచెక్కలాడుచున్నవి. వీరభద్రుల పినతండ్రి కుమారులు, మహాదేవరాజు కూడా చర్చలలో పాల్గొన్నారు. ( యాదవ మహాదేవులు, చాళుక్యమహాదేవులు వేరు వేరు)
రుద్రమ పరిచారికలను పిలిచింది.
"చక్రవర్తిణీ.. ఆజ్ఞ"
"ముమ్ముడాంబికాదేవి ని తొందరగా అలంకరించి తీసుకుని రావలెను".
ఈ చర్య ముమ్ముడమ్మకుగానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఏమీ అర్దము కాలేదు.
ఆమెను క్షణాలలో అలంకరించి తీసుకొని వచ్చినారు.
"అక్కా" అన్నది.
రుద్రమదేవి ముమ్ముడాంబ ను ప్రేమతో దగ్గరకు తీసుకుని చెంపపై ముద్దిడి యింత నల్లని చుక్కను తన కుడి చూపుడు వేలితో అందంగా దిద్ది-
-"నాకు నిన్ను పెళ్ళికూతురు వలె చూడవలెననిపించింది. "
"పో అక్కా. "
"నీకు ఏమి బహుమానము కావలెను".
"నాకు అన్నీ వున్నవి. ఏమియూ అక్కరలేదు. "
"పిచ్చిపిల్లా.. అలా అనరాదు... నీకు ఏమి కావలెనో నాకు తెలియును. స్త్రీలకు --- లతలకూ ఆలంబన వుండవలెను. "
" నాకు ఏమియూ అర్థము కాలేదు".
"నీవు నాతో రావలెను. శివదేవయ్య బాబాయిగారు మనకోసం ఎదురు చూస్తున్నారు. "
ఆమె అంతకన్నా ఏమి చెప్పలేదు. ఈమే అడగలేదు.
ఇద్దరూ అంతఃపురం వదలి సభాస్థలికి వచ్చారు.
అక్కడ యింకనూ చాలామంది రాజప్రముఖులు వున్నారు. వీరందరూ కాకతీ ప్రభువులకూ శ్రేయోభిలాషులైన విశ్వాసపాత్రులు-
చక్రవర్తిణి ని చూసి అందరూ గౌరవముగా లేచి నిలబడినారు.
శివదేవయ్యామాత్యులు స్వచ్ఛంగా నవ్వినారు.
రుద్రమదేవి సిగ్గులునిండి, మెరిసెడి ముఖంతో తన మెడలోని హారమును తీసి, వణికే చేతులతో వీరభద్రప్రభువు మెడలో వేసి-
" నేను మీ జీవితంలో సగభాగము కాదలచుకున్నాను. నన్ను గ్రహించగలరు. " అన్నది.
సభికులు సంభ్రమము నుండి తేరుకుని హర్షాతిరేకముతో తప్పెట్లు కొట్టినారు.
మహాదేవరాజు నిలబడి అన్నగారి వంక చూచినాడు.
ముమ్ముడాంబిక సిగ్గుతో శివదేవయ్యల చాటుకు నక్కింది.
" బంగారు తల్లీ" అన్నాడాయన ప్రేమతో తల నిమురుతూ.
" చాళుక్యవీరభద్రలకు మరొక విన్నపము. మరొక్క వివాహము మన సమక్షమున జరగవలెనని కాకతీదేవి యాజ్ఞ. ఈ పుత్తడిబొమ్మ; ఈ సౌందర్యసీమ, ముమ్ముడాంబను, మీ సోదరుడు మహాదేవరాజులు స్వీకరించెదరు గాక. "
ఆమె చిరునవ్వుతో తలఎత్తి - ఒక్క క్షణము మహాదేవరాజు ముఖంలోకి చూసింది.
ఆమె తన సుకుమార హస్తములతో హారమును మహాదేవరాజు కంఠసీమను అలంకరించింది.
మరొక్కసారి వీచిన ఆనందవీచికలు.
-----------------------------
"అమ్మా". !
ఈ గొంతు విని కోటారెడ్డి ప్రభువు వెనుతిరిగి చూశాడు.
తల్లి తన తల్పము నుండి లేచినది.
ఆమె తన కుమార్తె. తన సర్వస్వం. తన గుండెలమీద వేసుకుని పెంచిన చిన్నారి తల్లి.
ఆమె ఆపుకోలేని దుఃఖంతో కుమార్తెను కౌగలించుకుంది.
" తల్లీ! నీవు వచ్చావా?"
అంత గంభీరుడైన కోటారెడ్డి ప్రభువుకూడా, కన్నీటిని అదుపు చేసుకొనలేక పోయాడు. దగ్గరగా వచ్చి తలను గుండెలపై లాక్కొని-
"తల్లీ! నా తప్పులు క్షమించు. నీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. గోన గన్నారెడ్డి లాంటి వజ్రాన్ని అల్లుడిగా పొందుట దుర్లభం. అతడు కారణజన్ముడు. నీవు కూడా అతని కోసమే జన్మించినదానవు.
తల్లీ- తండ్రీ - ఆమె...... మమత ముందు పాదాక్రాంతం కానిదేముంది? కన్నీటితో కరిగి స్వచ్ఛంకాని హృదయ మెక్కడ?
---------//---------------------//-/--
ఆదవోని ప్రభువులకు వచ్చిన వార్త -కోటారెడ్డి ప్రభృతులను సంభ్రమ, ఆనందడోలికలలో వూగులాడించెను. ఆయన చాల సేపటి వరకు తేరుకోలేదు.
ఆ వార్త తెచ్చినవారు రాజప్రముఖులు.
"ఆ వార్త యిది".
"రుద్రమదేవి చక్రవర్తిణి - తమ భర్తగారైన వీరభద్రుల వారితో ఆదవోని రాజ్యము సందర్శించుటకు వచ్చుచున్నారట-"
ఆ వార్త నిమిషాలలో నగరమంతా పాకింది-
చక్రవర్తుల రథం కోట సింహద్వారం కడకు వచ్చింది. కోటారెడ్డి ప్రభువు, మంత్రులు, సేనాపతులు, రాజప్రముఖులు ఎదురేగి వినమ్రతతో ఆహ్వానించినారు. వేయివేల రాగములతో సన్నాయి గీతములు ఆహ్వానాలు పలుకుతున్నాయి. ఆకాశం సైతం చిల్లులు పడు మంగళవాద్యములు మోగుచున్నవి.
వందలాది సైనికులకు, జనాన్ని కట్టడి చేయుట దుర్లభమైనది.
అది తమ చక్రవర్తిణిమీద ప్రజలకు ఉన్న విశ్వాసం. ప్రతిఒక్కరి ముఖం లోనూ ఆనందమే............ చిరునవ్వులే.
సామాన్యుని నుంచి రాజప్రముఖుని వరకూ ప్రస్ఫుటమౌతున్న కృతజ్ఞతలే.
చాళుక్యవీరభద్రులు మొదట రథం దిగారు. సుకుమార రాకుమారిని - చక్రవర్తిణిని, తన అర్ధాంగిని చేయిపట్టుకుని రథంనుంచి దింపినారు.
ఈ కుసుమకోమలి యేనట వీరాధివీరులనూ సైతం నిర్జించినది. ఈ ముద్దుగుమ్మ యేనట దేవగిరి యాదవరాజు చక్రవర్తుల రత్నకిరీటాన్ని తమ పాదాలపై పెట్టుకుని, అంతటి మేరునగధీరుని సైతమూ పాదాక్రాంతం చేసుకుని, కాకతీదేవి చిహ్నాలుగల విజయస్థూపాలు నాటి, అతనిని సామంతునిగా చేసుకొన్నది.
ఆమె రథం దిగింది. కోటారెడ్డిప్రభువు వినయంగా నిలబడినాడు.
ఆమె ప్రభువుల చేతిని ప్రేమతో పట్టుకుని-
" చిననాయనగారూ- క్షేమమా!" అన్నది.
కోటారెడ్డి ప్రభువులు కంగుతిన్నారు.
వీరభద్రులు ముసిముసి నగవులు నవ్వినారు.
కోటారెడ్డి ప్రభువులు అట్లా చూస్తూ నిలబడిపోయినారు.
"మీ పెద్దకుమార్తె మీ ఇంటికి వచ్చింది. చిన్నాయనగారూ. " అన్నది.
"రా! తల్లీ!" అన్నారాయన. గొంతు గాద్గదికమైంది.
"మీ పినతండ్రి సామాన్యమైన సామంతుడమ్మా. నీకు అన్ని మర్యాదలు జరక్కపోవచ్చును. ముందుగనే క్షమాపణ
కోరుచున్నాను".
"తండ్రులు బీదవారు కావచ్చును. కానీ ప్రేమకు బీదతనం లేదు గదా బాబయ్యగారూ!"
"అమ్మా !......... నిలబెట్టి మాట్లాడుతున్నాను.......... "
"వీరు మీ పెద్దల్లుడు గారు; చాళుక్యవీరభద్రులు".
"మంచిది అమ్మా! రండి నాయనా" అన్నాడు.
అతడు కోటారెడ్డి కాదు. సామంతుడైన రాజు కాడు ఇప్పుడు. ఆమె కాకతీసామ్రాజ్య చక్రవర్తిణీ కాదు. అతను తండ్రి. ఆమె కొమరిత.
తండ్రియింట రెణ్ణాళ్ళుండుటకు -భర్తతో వచ్చింది.
"పిన్నమ్మగారూ క్షేమమా?"
"క్షేమమే తల్లీ"
"నా మీద కోపముగా నున్నదా?"
"లేదమ్మా.. లేదు".
వీరభద్రులు కలగజేసుకుని--
"దేవీ!..... ఇహ పద.... మీరందరూ ఒక్కటై, నేను ఒంటరి నౌతున్నాను-" అని నవ్వుతూ అన్నారు. క్షణం ఆగి-" నేను విశ్రాంతి మందిరము కెళ్తున్నాను" అన్నారు.
ఆమె తల వూపినది.
సగౌరవంగా విడిది యింటికి తీసుకెళ్ళారు.
రుద్రమదేవి అంతఃపురమునకు వచ్చింది. సోమాంబిక, అన్నమాంబిక మాతృమూర్తి ఎదురువచ్చారు. ఆమె ముఖమున అపూర్వ తేజస్సు కలదు. ఆమెని చూసిన
చనిపోయిన తమ తల్లిగారు గుర్తుకు వచ్చి, ఆమెకు కంటనీరు తిరిగినది. ఆమె ముఖాన గుండ్రటి పెద్దబొట్టు వున్నది.
" అమ్మా! " అన్నది.
"తల్లీ!"---
ఆమెకు పాదాభివందనం చేసింది. చేసి-
" ఈ కూతురు తప్పు చేస్తే క్షమించమ్మా" అన్నది.
ఇద్దరికీ దుఃఖం వచ్చింది. కన్నీరు జలజల కారింది.
" నా బంగారు తల్లీ.... నీవు.... నీవు.... ఈ అమ్మను చూడాలని వచ్చావు. అది నాకు చాలునమ్మా. నా జన్మ ధన్యమైంది.
"కాదమ్మా... మా అమ్మగారు నా చిన్నతనమందే పరమపందించారు. మిమ్ములను చూసిన పిదప మా అమ్మగారు గుర్తుకు వచ్చారు. నన్ను మీ కూతురుగానే స్వీకరించవలెను. చక్రవర్తిగానీ, మరెవరైనా కానీ, తల్లిలేని వారు శాపగ్రస్థులు".
"నేను నీ అమ్మనే అమ్మా".
"ఇహ నాకు దుఃఖం లేదు".
"చెల్లి ఎక్కడ?"
"దాగుకొన్నది"
"ఏమట"?
"నీ ఎదుట పడదట".
"ఆమె ఎక్కడవున్నది?
సోమాంబిక రుద్రమదేవి చెయ్యి పట్టుకుని - నెమ్మదిగ
"ఈ గదిలో" అన్నది. అని వెళ్ళిపోయింది.
గదిలో. ఎక్కువ చీకటి. తక్కువ వెలుతురు.
అన్నమాంబిక, పాదముల చప్పుడువిని తలతిప్పి రుద్రమ్మను చూసినది. - ఆమెఅటులనే నిలబడింది.
" చెల్లీ! అని గాఢంగా కౌగలించుకుంది.
" నాతో పలకవా!"
" వుహూ.... "
" నా అపరాధమేమి?"
"నన్ను ఇక్కడకు పంపి, నేను లేకుండా వివాహం చేసుకొంటివి".
"నేరమే....... తప్పే "
"అటులే..... ముమ్ముడాంబికకు కూడా చేసితివి".
"నిజమే" అని-- "అన్నమ్మా....... నీవు నా బహిఃప్రాణానివంటివి. ఇదేనా ధర్మము. మీ బావగారు యిక్కడే వున్నారు. చెప్పి శిక్షింపజేయుము".
" వూ".
" అదీ నవ్వవలెను. అబ్బ నీ నవ్వుచూసి ఎన్నాళ్ళయ్యింది?"
" అన్నీ మాయమాటలూ... "
" కాదమ్మా.... నీ మీద ఒట్టు. నేను అందరికీ చక్రవర్తిణి ని కానీ - నీకు అక్కను. "
రుద్రమదేవి వక్షమున ఆమె తలనిడి గువ్వవలె వొరిగిపోయింది. ---
-------------------------------------------
" గన్నారెడ్డీ మహాశయా!"
" చెప్పండి వీరభద్రప్రభూ!"
" కాకతీ చక్రవర్తిణి తమకు ఒక కబురు మనవి చెయ్యమన్నారు".
" ఆజ్ఞగా స్వీకరిస్తాను".
" శుభం. వార్త ఏమనగా - ఆదవోని ప్రభువుల కుమార్తె అందము కు చందమామ, చదువుల సరస్వతి, గుణమున జానకీదేవియైన తమ చెల్లెలు అన్నమాంబికను
తమకు ఇచ్చి వివాహము చేయవలెనని అనుకొనుచున్నారు. ఇహ, తమ అభిప్రాయము తెలుపగలరు. "
అదీగాక, ఓరుగల్లునుంచి శ్రీశివదేవయ్యామాత్యులునూ, ఈ వార్తయే తమ మాటగా ఆమెను గ్రహించవలసిందిగా చెప్పి పంపినారు-".
గన్నారెడ్డి చిరునవ్వు నవ్వినాడు.
" మీ, ఈ -నిశ్శబ్ధం అంగీకారమా?"
" అన్న కాదందురా, మహాప్రభూ!"
ఆ గది హాసనములతో భాసించినది.
------------------------------------------
పరిమళించిన వెన్నెల. పువ్వుల వాన. నక్షత్రాల మెరుపు. ఏటిలో మేట వేసిన వెన్నెల.
గాలి తెచ్చే చల్లటి తెంపుల గాలి తుంపులు.
వీరభద్రప్రభువు ఒడిలో తలపెట్టుకుని రుద్రమదేవి---
" ప్రభూ!"
" చిత్తము, చక్రవర్తీ!"
ఆమె చిరుకోపంతో
" మీరు నన్ను అట్లా పిలుస్తే పలుకను. "
" సరే.... దేవీ... కోపంలో మీ ముఖంలోని సౌందర్యమును వెన్నెలలో తిలకించవలెనని ఆకాంక్ష"
ఆమె తన మృధువైన చేతులతో అతని కంఠమును కౌగలించుకుంది.
" మీరే నా జీవము, జీవితము.... సర్వకాలములకూ మీరే నా ప్రభువు".
అతను ఆమె కురులను నిమురుతున్నాడు.
ప్రకృతి- కాలము- పరస్పరమూ సంగమించుచున్నవి.
-------------------------------------
రుద్రమదేవి, చాళుక్యవీరభద్రులు సమక్షమున శివదేవయ్యామాత్యుల ఆధ్వర్యమున
కుప్పసానమ్మ, గుండయ్య నాయకులు వుండగా, గణపాంబాదేవి- బేతరాజులు చూస్తుండగా,
ముమ్ముడమ్మ- మహాదేవరాజులు ఆనందపడుతుండగా కోటారెడ్డి సోమాంబిక ల కుమార్తె చి।।ల।।సౌ!! అన్నమాంబికాదేవిని చి!! గన్నారెడ్డి ప్రభువు
లకు యిచ్చి ఆకసము నుంచి విరిజల్లులు కురియుచుండగా అతి ఘనముగా, వైభవోపేతముగా వివాహము జరిగినది.
--------------------------------
కొండలు గుండెలు అదిరినవి.
లోయలు గాలికి వూయలు లూగినవి.
చెట్ల చివుళ్ళు ఆనందంతో దిక్కుల మొదళ్ళవరకూ వార్తలు చెప్పినవి.
పువ్వు పువ్వూ కబుర్లాడినవి. రెమ్మ రెమ్మా వూసులాడినవి. పిట్టపిట్టా కువకువలాడినవి.
పచ్చని పసరిక పట్టు తివాచీ వలె పరుచుకున్నది.
పువ్వులు విరగబూసినవి. కాయలు లెక్కలేనన్ని కాసినవి.
తమ ప్రభువు వీరభద్రులు--తమ ప్రియ దేవేరి రుద్రమదేవి తో కలిసి - గత ప్రాభవ వైభవములకు నిదర్శనమైన శాతవాహనుల కోటలో పదినాళ్ళు గడుపుదురట.
ఆ పిదప మళ్ళీ రాజకీయ, రణతంత్ర ఎత్తులు- పరిపాలనా భారము.
గుర్రము వేగముగా పరుగెత్తుచున్నది.
రుద్రమను అతను పొదివి పట్టుకున్నాడు.
చల్లని సూర్యకాంతి -- ఈ ప్రపంచమే ఆమెదన్న భ్రాంతి.
ఇద్దరూ ఒక్కటై- ఒక్కరిగా యిద్దరై-
నాదమై-వేదమై-గీతమై-సంగీతమై-
ప్రేమకు బడియై-వలపుల గుడియై- నవ్వుల
జడియై-
కరిలో వొకరు వొరుగు ఘడియై.
-------------------------------------శుభంభూయాత్--------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------
కాకతి రుద్రమ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మా తరఫున, రచయిత శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము.
-----------------------------------------------------------------------------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comentários