top of page

కల

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Kala' New Telugu Story Written By BVD Prasada Rao

'కల' తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


నిద్ర పోతున్న ప్రతి ఒక్కరికి కలలు రావు..

కలలు కన్న ప్రతి ఒక్కరికి అవి వాస్తవం కావు.

కానీ..

నిద్రలో కల కన్న.. సరళకు.. అది వాస్తవం ఐంది.


***


రోహిత్ సరళంగా లేడు.


అతడి తల్లిదండ్రులు ఆందోళన అవుతున్నారు. తాము చెప్పేది ఆలకించడం లేదు రోహిత్.


రోహిత్ చకచకా వాగేస్తున్నాడు.


"తొలుత నుండి వీడు ఇంతే. ఎదుటి వారిని మాట్లాడనీయడు." విసుక్కుంటుంది రోహిత్ తల్లి అన్నపూర్ణ.


"మరే. ఆలకించే గుణం వీడికి అస్సలు లేదు." అప్పుడే అన్నాడు అన్నపూర్ణ భర్త కామేశ్వరం.


"మరే మరే." నీళ్లు నములుతుంది అన్నపూర్ణ.


రోహిత్ మాత్రం తన సొదన తాను మాట్లాడుతూ పోతున్నాడు.


"ఛుఫ్. నోర్మూయ్." అరిచేశాడు కామేశ్వరం.

రోహిత్ ఆ అరుపుకు జంకాడు. తగ్గాడు. తన తండ్రిని చూస్తున్నాడు.


"ఆపరా." అంది అన్నపూర్ణ.


అంతలోనే చెప్పింది.. "కుదురుగా చెప్పవలసింది చెప్పరా." అని.

రోహిత్ తల తిప్పాడు. తల్లిని చూస్తున్నాడు.


"ఎందుకు అంత ఆవేశం. ఏం జరిగింది. ఏమైందని ఎకాఎకీన అమ్మాయిని అలా తన పుట్టింటికి తోలేశావు." అడిగాడు కామేశ్వరం.


"నీళ్లు తాగు." చేతిలోని నీళ్ల గ్లాసును రోహిత్ కు అందించబోతుంది అన్నపూర్ణ.


అతడు దానిని అందుకోక.. "ఆమె చాలా కానిది." అన్నాడు.


"మళ్లీ ఏమైంది." అడిగింది అన్నపూర్ణ.


వీళ్ల గోలకు మెలుకువ వచ్చి.. పక్కింటినే ఉంటున్న కామేశ్వరం అన్న సోమేశ్వరం.. తన ఇంటి వీధి గుమ్మం తలుపు గడియ పెట్టి.. పక్కింటి వీధి గుమ్మం తలుపు తోసుకుంటూ.. ఆ ఇంటి హాలులోకి వచ్చాడు. అతడి కుటుంబం ఊరెళ్లి ఉంది.


"ఏమైంది. ఏమిటి గోల." అడిగాడు.


కామేశ్వరం సర్ది చెప్పబోయాడు.

"ఏముంది బావగారు. వీడు మళ్లీ భార్యను తోలేసి.. ఇలా గోల చేస్తున్నాడు." ఉసూరుమంటుంది అన్నపూర్ణ.


గోడ గడియారం వైపు చూశాడు సోమేశ్వరం. సాయంకాలం నాలుగవుతుంది.


అక్కడి సోఫా కుర్చీలో కూలబడి ఉన్న రోహిత్ అస్తవ్యస్తంగా కదులు తున్నాడు.


కామేశ్వరం లాంగ్ సోఫాలో కూర్చుని ఉన్నాడు.


అన్నపూర్ణ నీళ్ల గ్లాసు పట్టుకొని వారికి దరిన నిలబడి ఉంది.


సోమేశ్వరం వెళ్లి కామేశ్వరం పక్కన కూర్చున్నాడు.


అప్పటికి అక్కడి మాటలు ఆగాయి.


తిరిగి కామేశ్వరం మాట్లాడుతూ.. "బయటికి అంటూ భార్యతో వెళ్లి.. ఆమెను తన పుట్టింటి ఊరు బస్సు ఎక్కించే.. వీడు వచ్చేశాడు. అది మొదలు మిడిసిపాటు చేపట్టాడు." చెప్పాడు.


"ఏమిటిరా.. ప్రతి మారు ఈ సొద." అన్నాడు సోమేశ్వరం.


"మరి ఆమె అంతగా నన్ను వేగిస్తుంది." చెప్పాడు రోహిత్.


"అరె. ఆ అమ్మాయి మంచిదిరా. నువ్వే అల్లకల్లోలం చేస్తున్నావు." అనేశాడు సోమేశ్వరం.


"అవునవును. మీరు మా గదిన.. మా మధ్యన లేకుండా.. ఇలా సర్టిఫికేట్ ఇవ్వడం సరి కాదు. మా మధ్యన ఉండి ఇవ్వండి. ఎవరిది తప్పో తెలుస్తుంది." రుసరుసలాడేడు రోహిత్.


అక్కడి పెద్దలు ముగ్గురూ మొహాలు చూసుకుంటున్నారు.


రోహిత్ తిరిగి మాట్లాడడం మొదలెట్టాడు.


"ఆఁ. ఆఁ. సరి సరే. కాస్తా తగ్గు. మేము మీతో ఉండక్కర లేదు. మీ తీరులు గమనిస్తున్నాం. ఎవరిది తప్పో తెలుస్తుంది." చెప్పాడు కామేశ్వరం.


"అంతంతే." అన్నాడు సోమేశ్వరం.


రోహిత్ తగ్గుతున్నాడు.


"మన వాడిదే తప్పు." నసిగాడు కామేశ్వరం.


"మరే." అంది అన్నపూర్ణ.


"నాదా తప్పు అని తేల్చారు." రివ్వున అరిచాడు రోహిత్.


"అదే. ఆ అరుపులే తగ్గించు." సర్రున అంది అన్నపూర్ణ.


రోహిత్ తగ్గడం లేదు.


"చెప్పింది వినిపించుకోరా." కలగచేసుకున్నాడు కామేశ్వరం.


రోహిత్ ససేమిరా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.

సోమేశ్వరం కలగ చేసుకున్నాడు.


"హేయ్. చెప్పేది ఆలకించవా. అమ్మా నాన్నలు చెప్పేది వినకనే నువ్వు ఇంత హైరానాకు గురవుతున్నావు. కాస్తా చెప్పేది వింటావా లేదా." గట్టిగానే అన్నాడు.


రోహిత్ ఆగాడు. తన పెదనాన్ననే చూస్తున్నాడు.


"రోహిత్.. తప్పు నీదేరా. చెప్పి చూస్తున్నాను. కానీ నా మాటలు పెడ చెవిన పెడుతున్నావు. అందుకే మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంది." చెప్పుతున్నాడు సోమేశ్వరం.


"పెదనాన్న.. మీరు ఆమె తప్పును వదిలేస్తున్నారు." గమ్మున అనేశాడు రోహిత్.


"అలా ఎలా అనేస్తున్నావు." అడిగాడు సోమేశ్వరం.


"మరే. ఆమె కొత్తగా ఇంటికి వచ్చింది.. తను మనల్ని అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది అంటూనే.. ఆమెనే వెనుకేసుకు వస్తున్నారు." అన్నాడు రోహిత్.


"అయ్యో. అది నీ ఆలోచనరా. ఆమెది తప్పు అనిపిస్తే.. నిలదీయనా. ముమ్మాటికి తప్పు మన వైపునే దొర్లుతుందిరా." చెప్పాడు సోమేశ్వరం.


రోహిత్ ఏదో అనబోతుండగా..


"పెదనాన్న మాట్లాడుతున్నారుగా. మాట్లాడనీ. వినుకో." కలగచేసుకొని చెప్పింది అన్నపూర్ణ.


"అవునురా." అనేశాడు కామేశ్వరం.

రోహిత్ తగ్గిపోయాడు. సోమేశ్వరంనే చూస్తున్నాడు.


"రోహిత్.. చెప్పేది వినుకో. సానుకూలంగా ఆలోచించు. నీకే విషయం అర్ధమైపోతుంది." చెప్పుతున్నాడు సోమేశ్వరం.


రోహిత్ అస్తవ్యస్తంగానే ఆలకిస్తున్నాడు.


"భార్యాభర్తల నడుమ భేదాభిప్రాయం రావడం సామాన్యం. అందులో తొలి రోజుల్లో.. ఒకరికి ఒకరు కొత్త. ఇద్దరూ అలవాటు పడాలి. అవగాహనకు రావాలి. అప్పటి వరకు వాదులాటకు పోకుండా చర్చించుకొనే ధోరణిని ఇద్దరూ చేపట్టడమే మేలు." చెప్పుతున్నాడు సోమేశ్వరం.


రోహిత్ తో పాటు అతడి తల్లిదండ్రులు వింటున్నారు.


"ముఖ్యంగా.. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు మాట్లాడక పోవడమే మంచిది. చెప్పే వారి అభిప్రాయాన్ని సానుకూలంగా వినే సహనం.. వినే వారికి ఉండాలి. అప్పుడే ఎదుటి వారి తత్వం బోధ పడుతుంది. అలానే వినే వారిలో.. ప్రతికూల అభిప్రాయం ఉంటే.. అది మాఫీ కావచ్చు. అప్పుడు తగాదా తీవ్రత పల్చనవుతుంది. కోపం చల్లారుతుంది. సఖ్యత కుదురుతుంది." చెప్పుతున్నాడు సోమేశ్వరం.


అక్కడి ముగ్గురూ శ్రోతలయ్యారు. కానీ రోహిత్ స్తిమిత పడడం లేదు.


"వినడంలో గొప్పతనం మెండుగా ఉంటుందిరా. అది భార్యాభర్తల సాన్నిహిత్యంకు దారి వేస్తుంది." చెప్పుతున్నాడు సోమేశ్వరం.

అడ్డై.. "చెప్పడం ఈజీ. అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది బాగోతం. నాకు కాదు ఆమెకి ఇవన్నీ చెప్పండి. ఆవిడేమిటో తెలుస్తుంది." అనేశాడు రోహిత్.


"పిచ్చివాడా.. మీ పెదనాన్న నీకు చెప్పేకంటే ముందే ఇవన్నీ ఆమెకి చెప్పి ఉన్నారు." చెప్పేసింది అన్నపూర్ణ.


"ఆ అమ్మాయి మంచిది కనుక.. మా అన్న చెప్పింది వినుకుంది. కనుకనే.. నీ కస్సుబుస్సులు మౌనంగా భరిస్తుంది. ఆఁ." గడగడా చెప్పేశాడు కామేశ్వరం.


రోహిత్ చకచకా చూపులు మారుస్తూ.. తన తల్లిదండ్రులను మార్చి మార్చి చూస్తున్నాడు.


"రోహిత్.. ఒక్క మాట చెప్పు. మీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు.. మొదటిలో లాగ కాక.. తర్వాత్తర్వాత.. ఆ అమ్మాయి.. నువ్వు గోల గోలగా మాట్లాడుతుంటే.. ఏమైనా అంటుందా. అదే.. ఇక్కడే.. ఆమెలోని మంచితనంను నేను.. మేము గుర్తించాం. అది తెలుసుకో." చెప్పుతున్నాడు సోమేశ్వరం.


రోహిత్ అయోమయం విడిచి ఆలోచనలో పడుతున్నాడు.


"నీలాగే ఆమె కూడా అరిస్తే.. గోల చేస్తే.. నీ స్థితి.. మన పరిస్థితి ఎలా మారి ఉంటుందో ఆలోచన చెయ్యి రోహిత్." చెప్పడం ఆపాడు సోమేశ్వరం.


రోహిత్ ప్రస్తుతం పూర్తి ఆలోచనలో పడ్డాడు.


అక్కడి ముగ్గురూ ఏమీ అనక.. వేచి ఉన్నారు. ముందుగా రోహితే తేరుకున్నాడు. లేచాడు.

"ఈ మారు.. మీరు కాదు.. నేను.. నేను వెళ్లి.. ఆమెను తన ఇంటి నుండి మన ఇంటికి తీసుకు వస్తాను." చెప్పాడు.


"సంతోషం." అన్నారు అక్కడి పెద్దలు కోరస్ గా.


***


సరళ ఉలిక్కి పడి నిద్ర నుండి లేచింది. చుట్టూ చూసింది. తన గది నిండా ఇంకా చీకటి ఉంది.


తను కన్న కల చెదిరి పోవడంతో.. సరళకి నిస్సత్తులా తోచింది.


రోహిత్ తనకై వచ్చినట్టు.. తన తప్పును ఒప్పుకున్నట్టు.. అలానే క్షమాపణ కోరి.. తనను ఘనంగా.. తనతో.. అత్తవారింటికి తోడ్చుకు పోయినట్టు.. తను కల కన్నది. నిద్ర లోనే.. ఆ కలతో.. హాయి ఐంది.. సరదా పడింది.


నిద్ర తేలిపోవడంతో.. ఆ కల కూడా కలగానే అనిపిస్తుంది సరళకు. దాంతో తను చాలా డీలా పడింది.


మంచం దిగింది. కిటికీ తలుపులు తెరిచింది. బయట.. సన్నని వెలుగు.. తెల్లవారుతుంది.


వచ్చి.. తిరిగి మంచం మీద పడుకుంది. చిన్నగా కునుకు పడుతుండగా..


బయటి డోర్ బెల్ మోగింది. ఐనా లేవ లేదు. అది మళ్లీ మోగింది.


'అరె. ఇంకా అమ్మా నాన్నా లేచినట్టులేరే.' అనుకుంటూనే మంచం దిగి.. వీధి గుమ్మం చేరింది. తలుపు తీసింది.


తుళ్లి పడినట్టు ఆశ్చర్యపోయింది. తికమక ఐంది.


వీధి గుమ్మం బయట...


చిన్నగా నవ్వుతూ.. రోహిత్ నిల్చుని ఉన్నాడు..


***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








140 views0 comments

Comments


bottom of page