top of page

కలగా కల్పనగా


Kalagaa Kalpanagaa Written By Ravella Vidyapathi Rao

రచన : రావెళ్ల విద్యాపతి రావు


"ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు.. అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్లు.. అయ్యో పాపం... ఇదేం శాపం" వందేళ్ల నాటి పాటను కూని రాగాలు తీసుకుంటూ, పాడుతున్న కస్తూరిని వెనకనుండి వచ్చి కౌగలించుకున్నాడు సుధాకర్.


"ఏంటోయ్ మంచి హుషారుగా ఉన్నట్టున్నావ్. ఏవో పాటలు పాడుతున్నావ్.. కొంచెం గట్టిగా పాడవోయ్ మేము కూడా విని తరిస్తాం." ఆమె మెడ మీద తలవాల్చి వెచ్చని శ్వాస వదులుతూ గోముగా అడిగాడు. అతని చేతులు కొంటె చేష్టలు చేస్తూ ఎక్కడెక్కడో తాకుతుంటే, చిరాగ్గా వదిలించుకుంది.


"వీటికి ఏం తక్కువ లేదు" మూతి విరుస్తూ,పరుషంగా చెప్పింది. వాలుజడను విసురుగా అతని మొహాన కొడుతూ, క్రీగంట అతన్ని కోపంగా చూస్తూ చంటాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది వాడికి బువ్వ తినిపించడానికి.


ఆరుబయట చిక్కటి వెన్నెలలో, పిల్లాడికి గోరుముద్దలు తినిపిస్తూ వయ్యారంగా నుంచున్న సతీమణి చెంతకు చేరి,"ఇప్పుడు ఏమైంది బంగారం" అంటూ ఆమె వాలుజడను చేతిలో వీణలా చేసుకొని ప్రేమగా అడిగాడు. ఆ జడంటే అంటే అతనికి ఎంతిష్టమో. తెల్లని కస్తూరి మేనికి నల్లని తాచు పాములాగా జఘనమున నాట్యం చేస్తున్న, ఆ జడను కాపాడుకోవడం ఆమెకు కష్టమైన పనే అయినా, తన భర్త కోసం అంత పొడుగు జడకై కత్తెరకు పని చెప్పలేదు.


"ఇంకేం కావాలి? నా బతుక్కి ఓ అచ్చటా? ముచ్చటా? గంగిరెద్దులాగా మీరు చెప్పే వాటన్నిటికీ తల ఊపుకుంటూ గొడ్డు చాకిరీ చేయాలి." ముక్కు చీదుకుంది కస్తూరి. "దానికి తోడు వీడి గోల ఒకటి. పొద్దస్తమానం ఏడుస్తూనే ఉంటాడు. మీరేం చక్కగా ఆఫీస్ కి వెళ్లి పోతారు. ఇంట్లో పనులన్నీ చేసుకోవాల్సింది నేనేగా. ఆపై వారం వారం వచ్చిపోయే మీ చుట్టాలు, పట్టాలు వారికి నేను చేసే సేవలు. పట్నం వెళ్లిపోయి ఒంటరిగా బతుకుదామంటే మీరు ఒప్పుకోరాయే.. ఏం చేస్తాం నా కర్మ." చిరాగ్గా చెప్పింది.


వారం రోజుల నుంచి కస్తూరి ఇదే పోరు పెడుతోంది.

పచ్చని పైరు నుండి వీచే చల్లటి పైరుగాలి, ఆమెకు మట్టి వాసన కొడుతోంది. సాయంకాలపు సూర్యుడుకి వీడ్కోలు చెబుతూ కబుర్లతో కాలక్షేపం చేసే పల్లె వాసులు ఆమెకు పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తున్నారు.

ఇంట్లో పని చేయడానికి పని మనిషి ఉంది. అయినా ఆమెకు ఏదో లోటు.


"పట్నంలో అయితే జనాలు ఎంత పద్దతిగా మాట్లాడతారో!! ఎంత మోడరన్ గా ఉంటారు. పెద్దపెద్ద కార్లలో జుయ్ మంటూ హాయిగా షికార్లకి వెళ్ళవచ్చు. అంతెత్తున ఆకాశాన్ని తాకే భవనాల్లో దర్జాగా బతకొచ్చు. అక్కడ ఇల్లు ఊడవడానికి, పిల్లల్ని ఆడించడానికి, వంట చెయ్యడానికి, మనతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడానికి రోబోలు ఉంటాయి. మనం తీరిక వేళల్లో పార్టీలు చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే, సమయం ఇట్టే గడిచిపోతుంది అనుకో." కస్తూరి తన స్నేహితురాళ్లతో ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.


"ప్రకృతిలో మమేకమవుతూ ఈ పల్లె ఒడిలో సేద తీరాలి అంటే పెట్టి పుట్టాలి తెలుసా !! కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పట్నం వాసులు పల్లెకు పోదాం చలో చలో అంటూ బార్లు తీస్తుంటే, నువ్వేంటి పట్నం పోదాం అంటూ గోల పెడుతున్నావ్?" కిసుక్కున నవ్వారు స్నేహితురాళ్ళు.


దూరపు కొండలు నునుపు అన్నట్టు, ఎంతో డబ్బు వెచ్చిస్తే గాని దొరకని పల్లె జీవితాన్ని కస్తూరి చీదరించుకుంటుంటే, ఇటువంటి లైఫ్ స్టయిల్ కోసం ఆరాటపడి చేజిక్కించుకున్న ఆమె స్నేహితురాళ్ళు ఆమె అమాయకత్వం చూసి నవ్వుకున్నారు.


"బావిలో కప్పలు మీకేం తెలుసు?? మీరు ఉన్నదే ప్రపంచం అనుకుంటున్నారు. బయట లోకం పోకడలు ఎరిగిన దానిని, కాస్తో కూస్తో చదువుకున్న దాన్ని కాబట్టి అన్నీ తెలుసుకుంటూ ఉంటాను. ఉస్సూరుమంటూ పల్లెటూర్లో బతకడం నా వల్ల కాదు తల్లి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత చింతకాయ పచ్చడి పేర్లు పెట్టారు. కనీసం మన బతుకేనా మోడ్రన్ గా ఉండనీ. 2095 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లి చేసేదేం ఉంది?" కస్తూరి నీరసంగా వాపోయింది.


మోడల్ పల్లెలు పేరుతో, సిటీ లైఫ్ కి దూరంగా, ప్రశాంతమైన జీవనం సాగించడానికి, ఆధునికతను త్యజించి, కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే సాంకేతికతను వినియోగిస్తూ, ప్రశాంతంగా గడపడానికి ఏర్పాటుచేసిన ఈ మోడల్ విలేజ్ లో కస్తూరి కుటుంబం చాలా ఏళ్ల కిందటే వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవడంతో, ఆమె చిన్నప్పటి నుండి ఆ పల్లెలో పెరిగింది.


ఆ పల్లెలో చుట్టూ ఏర్పాటు చేసిన జామర్ల వల్ల హాని చేసే రేడియో తరంగాలు, సెల్ ఫోన్ టవర్లు లేకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ, హాయిగా సేద తీరుతూ, ఒక వినూత్న ప్రపంచంలో విహరిస్తారు ఆ పల్లె వాసులు. ప్రభుత్వానికి భారీ మొత్తం చెల్లించి, ఇక్కడ ఆవాసం చేసుకోవచ్చు. వందేళ్ల నాడు పల్లెలు ఎలా విలసిల్లాయో, అచ్చంగా అలానే పాడి పంటలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఎప్పుడో మర్చిపోయిన వినసొంపైన భాషలను నేర్పిస్తూ, చక్కటి పల్లె జీవితాన్ని, వాతావరణాన్ని కల్పిస్తారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇటువంటి స్వర్గాన్ని వదలి పట్నం పోవాలని ఆశ పడుతోంది కస్తూరి.


చిన్న వయసు నుండి ఇదే పల్లెలో పెరగడంతో, పల్లెకు కొత్తగా వచ్చే పట్నం వాసుల కబుర్ల మాయలో పడి నగర జీవితం మీద వ్యామోహం పెంచుకుంది. ఆ నోటా ఈ నోటా విన్న పట్నం కబుర్లు తలకెక్కించుని, పట్నం పోయి మోడ్రన్ గా బతకాలని ఆరాటపడుతోంది. అందుకే ఈ దంపతుల మధ్య ఈ కీచులాట. చివరికి కస్తూరి పంతం నెగ్గింది. సుధాకర్ పట్నం పోవడానికి ఒప్పుకున్నాడు.


ఇంటిపోరు భరించడం ఈశ్వరుడి తరం కూడా కాదు అన్నట్టు, ప్రమోషన్ మీద పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయిన సుధాకర్ మళ్లీ పట్నం హోరును భరించడానికి వెనక్కి వస్తున్నాడని తెలిసి అతని సహోద్యోగులు ముక్కున వేలేసుకున్నారు.

ఆధునికత వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనం ఈ e- పట్టణాలు. మొత్తం ఎలక్ట్రానిక్ మయం. కృత్రిమ మేధస్సుతో, ఏ చిన్న పని చేయడానికైనా రోబోలు ఉంటాయి. పట్నం వాసులకి అత్యంత ముఖ్యమైనది- సమయం. అందుకే వంట పనులు, ఇంటి పనులు, పిల్లల పెంపకం ఇలాంటి పనులన్నింటికీ రోబోలు ఏర్పాటు చేసుకున్నారు.

****

ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు. మచ్చుకు కానరాని పచ్చదనం, కాలుష్య కోరలకు భయపడి, మొహానికి ముసుగు వేసుకుని యాంత్రికంగా కదులుతున్న మనుషులను, మనుషుల్లో రోబోలను వెతుక్కుంటూ, విస్తుబోయి చూస్తోంది. "వెల్కమ్ టు e- సిటీ" రోబో పలకరింపుతో, సిటీని ఆశ్చర్యంగా చూస్తున్న కస్తూరి ఈ లోకంలోకి వచ్చి పడింది. ఆ రోబో పేరు సోఫీ. కంపెనీ వాళ్లు తమ ఉద్యోగులకు అన్ని పనుల్లో సహకారం అందించడానికి, ఉద్యోగులు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి రోబోను సహాయకారిగా ఇస్తారు. ఈ రోబోలు వారికి కావలసిన అన్ని పనులు చేసి పెడుతుంది. వారి భాషలో మాట్లాడుతూ అన్ని రకాల సేవలు అందిస్తుంది.

"ఏంటండీ ఈ రోబో అన్ని పనులు చేసి పెడుతుందా?" కళ్ళింత చేసుకుని తన భర్తను అడిగింది కస్తూరి.

"ఆ అన్ని పనులు... ' ఆ ' పని కూడా" సుధాకర్ చిలిపిగా నవ్వుతూ చెప్పాడు. అతడి కాళ్ళు గట్టిగా తొక్కింది కస్తూరి. చూస్తూ చూస్తూ ఉండగానే వారాలు, నెలలు దొర్లి పోయాయి. సుధాకర్ తో పాటు కస్తూరి కూడా ఉద్యోగం చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి. దాంతో బాబుని, ఇంటి పనులను సోఫికి అప్పగించేసింది కస్తూరి. భార్య భర్తలు కలిసి మాట్లాడుకునేందుకు కూడా సమయం చిక్కట్లేదు. ఓ ముద్దు ముచ్చటా లేదు. సరససల్లాపాలు అసలే లేవు. సోఫీతో పాటు తామూ రోబోల్లా అది వండింది ఇంత తినడం, కొద్దిసేపు పడుకోవడం, బాబుని ఆడించడం, మళ్లీ ఉద్యోగానికి వెళ్లిపోవడం, ఇలా యాంత్రిక జీవనంలో చూస్తూ చూస్తూ ఉండగానే భాగస్వామి అయిపోయింది కస్తూరి. సోఫీ చేస్తున్న రుచీపచీ లేని వంటలు తినీ తిని మొహమొత్తినా, బాబుని పెంచే పని మాత్రం తీరిందని తెగ ముచ్చట పడిపోయింది కస్తూరి. వీళ్ళు వచ్చేసరికి బాబు హాయిగా నిద్ర పోతూ ఉంటున్నాడు. రాత్రులు ఒకవేళ వాడు ఏడ్చినా సోఫీ వాడిని ఎత్తుకొని లాలిస్తుంది. దాంతో వాడి ఏడుపు తప్పింది అని కస్తూరి ఆనందపడినా, ఏదో మూల బాబును మిస్ అవుతున్నానని ఆమె తల్లి హృదయం మథన పడింది.

అవును వాడితో గడిపేందుకు సమయమే చిక్కట్లేదామేకు. ఇప్పుడు ఆమె కోరుకున్న జీవితం ఆమె సొంతం ఆకాశాన్ని తాకే భవనంలో 201వ అంతస్తులో, ఎటువంటి బాదరాబందీ లేకుండా ఉంది. గతంలో లాగా ఆప్యాయంగా వచ్చి పలకరించే చుట్టాలు లేరు. కష్టసుఖాలను పంచుకునే స్నేహితులు లేరు. అందరూ వారి వారి బిజీ లైఫ్ లో మునిగిపోయి ఉన్నారు. ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే విర్చ్యువల్ స్క్రీన్స్ ఉన్నాయి. బటన్ నొక్కిన వెంటనే మనం మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు క్షణాల్లో 3D రూపంలో ప్రత్యక్షమవుతారు. అయినా ఏదో వెలితి. ప్రత్యక్షంగా కలిసి ఆలింగనం చేసుకుని వారిని అనుభూతి చెందడానికి, స్క్రీన్ మీద కృత్రిమంగా చూడడానికి తేడా ఉంటుంది కదా. చీమల్లాగా ఏదో సాధించాలని ఆరాటపడుతూ, ఉరుకుల పరుగుల జీవనంలో తనామునకలైపోయారు. కస్తూరికి ఆమె కోరుకున్న జీవనమే దొరికినా, ఏదో తెలియని లోటు. ఇదీ అని చెప్పలేని ఫీలింగ్ తో సిటీకి వచ్చి తప్పు చెయ్యలేదు కదా అని ఆలోచిస్తూ స్నానం చేస్తున్న కస్తూరి,.

"మేడం...మీ వీపు భాగంలో సబ్బు నురుగ ఉండిపోయింది." అన్న సోఫీ మాటలతో ఉలిక్కి పడి, ఆలోచనల నుండి బయటకు వచ్చింది. గోడల వెలుపల నుండి కూడా చూడగల శక్తి ఉన్న సోఫిని తలుచుకుని, స్నానం ముగించి వచ్చింది. ప్రతీది దీనికి తెలిసిపోతుంది. అసలు ఈ రోబోకే కాదు ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో ఎవరైనా ఎక్కడైనా చూడొచ్చు. అందరికీ జియో ట్యాగ్ లు ఉంటాయి. వాళ్ళ కదలికలు ప్రతి నిత్యం కెమెరా కళ్ళు గమనిస్తూనే ఉంటాయి. అస్సలు ప్రైవసీ లేదు. స్నానం చేస్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా, కాలకృత్యాలు తీర్చుకుంటున్నా, ఆఖరికి తన భర్తతో ఏకాంతంలో ఉన్నా, ఎవరో చూస్తున్నారు అనే ఆలోచన ఆమెను వెంటాడుతోంది. ఆమెను నిలకడగా ఉండనివ్వట్లేదు. ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన సుధాకర్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇన్నాళ్లు తన చుట్టూ అల్లుకుపోయిన సుధాకర్ ఇప్పుడు ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడు. అనుమానం వచ్చి అతని లాప్టాప్ , అతని జియో ట్యాగ్ ను హ్యక్ చేసిన ఆమెకు చేదు నిజాలు బయట పడ్డాయి. మనుషుల కన్న రోబోలే మేలు అనుకున్నాడా? ఇందులో తన తప్పేమయినా ఉందా? అవును నిరంతరం ఎవరో చూస్తున్నారనే భయంతో గడుపుతున్న ఆమె పట్ల విసుగు రావడం సహజమే కదా. ఇప్పుడు మరో బిడ్డ కోసం కలిసే పని కూడా లేదు. ఎందుకంటే ఎవ్వరిని చూసినా కృత్రిమ గర్భధారణ చేసేస్తున్నారు. ఇక మాతృత్వంతో పనేం ఉంది? పోని తానిప్పుడు ఆకర్షణీయంగా కూడా ఉండట్లేదు. పని ఒత్తిడి వల్ల, అతడికి ఇష్టమైన వాలు జడ కాస్తా మొక్కజొన్న పీచులా అయ్యింది. తిని కూర్చోడం వల్ల బాపు బొమ్మ కాస్తా బొద్దు గుమ్మ అయ్యింది. రోజంతా ఏసీ గదుల్లో కూర్చోడం వల్ల బయటకు చెప్పుకోలేని రోగాలు. అసలు ఆఫీసులో నలిగి పోతూ వచ్చిన ప్రాణాలకు ఇక ఆ ముచ్చట కూడానా?! అంటే ఇప్పుడు తాము కేవలం బతకడం కోసం జీవించాలా? ఆలోచనలో పడింది కస్తూరి.

****

" "కస్తూరీ ఎక్కడున్నావ్?" సుధాకర్ కంగారుగా అడిగాడు.

"ఇంటికి వెళుతున్నా అండి" డ్రైవర్ లేని కారులో పోతున్న కస్తూరి అతనికి జవాబు ఇచ్చింది. "తొందరగా ఇంటికి వెళ్ళు...మన సోఫీని ఎవరో హ్యాక్ చేశారు. దాని కోడింగ్ మార్చేశారు. మన బాబు దాని దగ్గరే ఉంది. తొందరగా వెళ్లి దాని పవర్ ఆఫ్ చెయ్యి... కస్తూరి తొందరగా వెళ్ళు...బాబును కాపాడు" అతడి స్వరంలో ఏడుపు చోటు చేసుకుంది. కస్తూరి పై ప్రాణాలు పైనే పోయాయి. తల్లి హృదయం కంపించిపోయింది. బాబు...నా బాబు..అంటూ కారు వేగం పెంచే ప్రయత్నం చేసింది.

"క్షమించండి... డిఫాల్ట్ సెట్టింగ్ మార్చలేము. మీరు కంట్రోల్ రూం నుండి పర్మిషన్ తీసుకోవాలి" అని వాయిస్ మెసేజ్ రావడంతో కస్తూరికి మచ్చేమటలు పోశాయి. గుండె వేగంగా కొట్టుకొంటోంది..మెల్లగా వెన్నులో వణుకు మొదలైంది. "బాబు ఎలా ఉన్నాడో!!?" అని ఇంట్లో అమర్చిన కెమెరాతో చూసింది. సోఫీ వాడిని చాలా వేగంగా గాల్లో ఎగరేస్తూ, ఊపుతూ ఉంది. వాళ్ళున్నది 201 వ అంతస్తు. ఎక్కడ ఆ గాజు బంగ్లా నుండి బాబును బయటకు విసిరేస్తుందో అని, గుండెలు అరచేతిలో పెట్టుకొని పోలీసులకు , ఆ బిల్డింగ్ సెక్యూరిటీకి సమాచారం అందించింది. వాళ్ళు బాబును చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇంతలో బాబుకు ఏమైనా జరిగితే?? అన్న ఊహే ఆ తల్లి హృదయాన్ని భయకంపితం చేసింది. టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందినా, చావును మాత్రం తప్పించలేదు. చనిపోయిన వారినీ బతికించలేదు. అందుకేనేమో ఆ కాస్త మాతృత్వమేనా బతికుంది. సోఫీ కెమెరా చెంతకు చేరింది. బాబును పట్టుకుని గట్టిగా అరుస్తూ, తీక్షణంగా కస్తూరిని చూస్తూ, వాడిని గాల్లో మళ్లీ ఎగరేసింది. వాడు గుక్క పెట్టీ ఏడుస్తున్నాడు. ఈసారి గాల్లో లేచిన బాబు మళ్లీ సోఫీ చేతిలోకి రాలేదు. వాడి ఏడుపు కూడా వినిపించట్లేదు. కస్తూరి గుండె ఆగినట్లైంది. బాబు..బాబు...అంటూ ఏడుస్తోంది. సోఫీ క్రూరంగా నవ్వుతూ కెమెరా ఆఫ్ చేసింది. "బాబూ...." కెవ్వుమని అరిచింది కస్తూరి.

*****

"ఏమైంది కస్తూరి...ఏదైనా పీడకల వచ్చిందా? ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు.."అంటూ వాటర్ బాటిల్ చేతికందించాడు సుధాకర్. "అవునండి పీడకలే..నా...భ్రమ వదిలించిన పీడకల" అతని ఎద మీద వాలుతూ ఏడుస్తూ చెప్పింది. "మనం ఎక్కడికీ వెళ్లొద్దు...ఇక్కడే ఈ స్వర్గంలో ఉండిపోదాం. ఇలా హాయిగా మీ గుండెల మీద, ఈ ఆప్యాయ హృదయాల మధ్య, నా బాబుతో ఇక్కడే..ఇలాగే.." ఇంకా ఏదో చెప్పాలనుకున్న ఆమె గొంతు, విచలితమైన హృదయంతో మూగబోయింది.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


43 views0 comments

Comentários


bottom of page