top of page

కలిసి పోరాడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/GzNBto4awWs

'Kalisi Poradu' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari

రచన: పెండేకంటి లావణ్య కుమారి


అవగాహన లేక అన్యాయాల పాలయ్యే బడుగు వర్గాల వారు కలిసి పోరాడటం వల్ల జరిగిన న్యాయం గురించి తెలిపే కథ. *****

గౌరిని చూస్తే ఎవ్వరికైనా నల్ల కలువే గుర్తొస్తుంది. మరి పొద్దుటి నుండి మాపటి వరకు సూర్యుడి క్రింద పని చేసేవారు నల్లగా కాక ఎలా వుంటారు. వారంతా సూర్యుడి ముద్దు బిడ్డలు. గౌరి లంగా, ఓణీ వేస్కుని తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా వుంటుంది. గౌరీ వాళ్ళది బడుగు వర్గానికి చెందిన దినసరి కూలీ కుటుంబం. గౌరి ఒక్కతే కూతురు, గౌరిని కంటూనే సరైన వైద్యమందక తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేస్కోకుండా, తన తల్లి సాయంతో గౌరీని పెంచాడు. గౌరీకి పన్నెండేళ్ళప్పుడు, ముసల్ది చనిపోయింది. ఇప్పుడు గౌరీకి పదహారేళ్ళుంటాయి, ఈ మధ్యే వాళ్ళ నాన్నకు పక్షవాతమొచ్చి మంచం పట్టాడు. అప్పటి నుండి గౌరీనే, వాళ్ళ నాయనకు అన్నీ చేసి పెడ్తోంది. ఊరి బయట వాళ్ళ వర్గమంతా పాకలేస్కుని వుంటున్నారు. ఎలక్షన్ల ముందు పక్కా ఇళ్ళు ఇస్తామన్నారు గానీ ఎప్పుడిస్తారో, ఎదురు చూస్తూనే వున్నారు. వాళ్ళకొరకు అక్కడే ఒక ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది, దాంట్లోనే వాళ్ళ నాయనకు బాగున్నన్ని రోజులు చదువుకుంది గౌరి. చదవడమంటే, పర్వాలేదు ఏదో బాగానే చదివేది. ఇంకొక్క ఏడాది అయ్యుంటే పది పాసయ్యేది, కానీ అంతలోనే వాళ్ళ నాయన మంచం పట్టాడు. అప్పటి నుండి బడి మానేసి పొలం పనికి పోతోంది గౌరి. ఆ దినం నుండి గౌరిని చూచి వాళ్ళ నాయన ఏడ్వని రోజు లేదు. ఇంకా గౌరీనే ఆయనకు ధైర్యం చెప్తూ, "ఏమీ కాదులేయ్యా, ఊర్కో," అనేది. అదేంటో కాయకష్టం చేసేవారు గట్టిగా, బలంగా వుంటారంటారు కానీ, వాళ్ళు ఏబై, ఏబై అయిదు ఏళ్ళకు మించి బ్రతకరనిపిస్తుంది. నలబైపడిలో కొచ్చేసరికే ముసలితనం మీద పడినట్టు కనబడుతుంటారు. తిండి సరిగ్గా లేక, పోషణ కరువై, ఎండలో పని చేయటం వల్ల అలా అవుతుంటారేమో. అందుకే తొందరగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. పది పూర్తి కాగానే పెళ్ళి చేద్దామనుకుంటే ఇలా అయ్యిందని తెగ బాధపడి పోతుంటాడు గౌరి నాయన. ఆ రోజు కూడా రోజూలాగే పొద్దున్నే తండ్రికి ఒక గ్లాసెడు పాలలో డాక్టర్లు ఇచ్చిన పొడి కలిపి ఇచ్చి, మందులు వేసి, మద్యాహ్నానికి రాగి జావ కాచి పెట్టి, కుండలో మజ్జిగ పెట్టింది. తర్వాత తాను సద్దికట్టుకోని, ఎప్పట్లా పక్కింట్లోని అవ్వకు కొంచెం చూస్కోమని చెప్పి పొలం పనికి అందరితో పాటూ పోయి సాయంకాలానికి తిరిగి వచ్చి చూస్తే, జావ త్రాగకుండా అట్లాగే వుంది. "ఏమైందియ్యా?, జావ కూడా తాగలేదేందీ" అంటూ తండ్రిని చూసింది, ఆయన మంచం మీద వణుకుతున్నట్లు కనపడ్డాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే, ఒళ్ళు వేడిగా కాలిపోతోందని గమనించి పక్కింటి అవ్వనడిగింది. ఆమె, "మద్దాన్నంగా జొరమొచ్చినట్టుండాదే, కట్టం మీద మజ్జిగొక్కటి తాగిండు" అంది. వెంటనే గౌరి జ్వరం టాబ్లెట్లు వున్నాయేమోనని చూసింది, అవి అయిపోయాయని అర్థమయ్యింది. అప్పటికి ఆరుకావస్తోంది, ఎండాకాలం కావున, ఇంకా బయట బాగా తెల్లటి వెలుగుంది. "బేగి మందులంగటికి పోయి ఒక్క గంటలో మందులట్టు కొస్తానే" అని నాయనకూ, అవ్వకూ గట్టిగా చెప్పి ఊర్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది గౌరి. ఊరికీ, వీళ్ళుండే పాకలకూ మధ్య కొన్ని పొలాలున్నాయి. మామూలుగా గంటలోపలే తిరిగి రావచ్చు. గౌరి ఊర్లోకెళ్ళే సరికి దగ్గరున్న మందుల షాపతను అప్పుడే అంగడి మూసి భార్యను తీస్కోని గుడికి వెళ్ళాడు. గంటకు పైనవుతుందేమో వచ్చేసరికి అని అక్కడున్న వారు చెప్పారు. ఇంక చేసేది లేక పాపం గౌరి, ఇంకో చివర వున్న మరో మందులంగడికి పోయి కొనుక్కొచ్చే సరికి చీకటి పడిపోయింది. అయ్యో! చీకటి పడిపోయిందే అనుకుంటూ పొలాలెంబడి, ఆ మసక వెలుగులోనే గబ, గబా నడుస్తున్న గౌరిని ఎవరో వెనుక నుంచి వచ్చి, అరవకుండా మూతి మూసి లాక్కుని పోయి, నోటికి బట్టకట్టి, కాళ్ళూ, చేతులూ కట్టేసి వ్యాన్లో పడేసారు. గౌరి ఎంత పెనుగులాడినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. గౌరికి తన నోరు మూసిన వాడి దగ్గర నుండి త్రాగిన వాసన గుప్పున కొట్టసాగింది. గౌరికి అర్థమయ్యింది ఎవరో తాగుబోతులు తనను లాక్కుపోతున్నారని. చూసాక తెలిసింది అక్కడ నలుగురున్నారని, వాళ్ళలో ఒకరు ఆ ఊరి సర్పంచ్ గారబ్బాయని. మిగిలిన ముగ్గురెవరో గౌరీకి తెలీలేదు. వాళ్ళు నలుగురూ తాగిన మత్తులో ఊగుతున్నారు. వాళ్ళంతా పట్నంలో చదువుకుంటున్న పెద్దింటి పిల్లలు, సర్పంచ్ గారబ్బాయికి స్నేహితులు. ఆ రోజు పొలంలో పార్టీ చేస్కోటానికి వచ్చారు. తాగి వున్న వాళ్ళకు గౌరి ఒంటరిగా పోతూ కంటబడింది. అంతే ఏ ఆలోచనా లేకుండా ఎత్తుకొచ్చేసారు. అన్నీ మరిచి నలుగురూ మృగాలలా తమ కోరిక తీర్చుకోటం కొరకు గౌరి జీవితం నాశనం చేసారు. ఇంతలో బస్తీలోని అవ్వ, గౌరి ఊర్లోకి వెళ్ళి చాలా సేపయ్యింది, ఇంకా రాలేదు చూసిరమ్మని చుట్టు పక్కల వారికి చెప్పింది. చూసొస్తామని నలుగురు ఆడవాళ్ళతో పాటూ ఒక యువకుడు టార్చీలైటు తీస్కోని బయల్దేరి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళే సరికి ఒక పొలం మధ్యలో మంటలేస్కుని ముగ్గురు త్రాగుతూ కనబడ్డారు వారికి, ప్రక్కనే ఒక వ్యాన్లో లైటు వెలుగుతూ కనిపించింది. వారికేదో అనుమానం వచ్చి యువకుడిని బస్తీలోని అందరినీ పిలుచుకు రమ్మని చెప్పి, ఆడవాళ్ళు తాము కప్పుకున్న తువాళ్ళ చివరన చిన్న, చిన్న రాళ్ళు పెట్టి ముడివేసి భుజాన వేస్కొని వ్యాన్లో ఎవరున్నారో చూద్దామని దగ్గరకు వెళ్ళేసరికి ఒకడు వ్యాను తెరుచుకుని బయటకొస్తూ కనిపించాడు. వీళ్ళకు వ్యాన్లోపల గౌరి చిరిగి, చిందర, వందరగా వున్న బట్టలతో స్పృహ తప్పి కనబడింది. వెంటనే ఆడవాళ్ళకు జరిగిన అకృత్యం అర్థమై ఆ నలుగురిపై రాళ్ళ మూటలతో దాడి చేయటం మొదలెట్టారు.

ఆడవారే కదా, నాలుగు తన్ని వ్యానెక్కి వెళ్ళి పోవాలనుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు వారిని రాళ్ళ మూటలతో కొడుతూ వ్యాన్ ఎక్కే అవకాశం కలగనివ్వలేదు. అంతలో ఆ నలుగురూ దూరంగా వచ్చే జనాలను చూసి వ్యాను అక్కడే వదిలి పారిపోయారు. ఆడవారు పారిపోతున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేసారు కానీ తప్పించుకుని పారిపోయారు. నిజానికి ఆ త్రాగుబోతులు గౌరీని చంపి ఆచూకీ లేకుండా చేసి వెళ్ళి పోవాలనుకున్నారు, కానీ ఇంతలోనే బస్తీవాళ్ళు వీళ్ళను చూడటం జరిగి పోయి ఇరుకున పడ్డారు. ఇలాంటివి అలాంటి చిన్న, చిన్న ఊర్లలో జరగటం మామూలే. చేతిలో చిల్లిగవ్వ లేని బడుగు జీవులు మమ్మల్ని ఏం చేస్తారులే అనే ధీమా. కానీ ఈ సారి బస్తీ వాళ్ళంతా ఒక్కటయ్యి అక్కడికి చేరారు, కాబట్టి కథ అడ్డం తిరిగింది. తర్వాత ఆ బస్తీవాళ్ళు గౌరి నాడి పట్టుకుని చూసి, బ్రతికే వుందని నిర్దారించుకున్నాక, ఇద్దరు ఆడవారూ, ఇంకో ముగ్గురు యువకులూ, కలిసి అదే వ్యాన్లో గౌరీని తీస్కుని పట్నంకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇచ్చి, పెద్దాసుపత్రికి తీసుకుపోయి చేర్పించారు. అలా చేర్పించి ఇలా కూర్చున్నారో, లేదో, వారి ఊరి పోలీసులు అక్కడికి వచ్చి వ్యాన్ ఎత్తుకొచ్చారని కంప్లైంట్ వచ్చింది, పదండి పోలీస్ స్టేషన్కని బస్తీవాళ్ళకు బేడీలు వేయబోయారు. బస్తీవాళ్ళు పోలీసులకు వ్యతిరేకంగా గొడవ చేస్తూ జరిగిన విషయం చెప్పసాగారు. కానీ పోలీసులు వినకుండా ఏది చెప్పాలన్నా కోర్టులో చెప్పమని లాక్కు పోబోయారు.


ఆ అరుపులకు అక్కడే అతని భార్య ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వున్న ఈశ్వరనే ప్రభుత్వ ఉద్యోగి, అక్కడికి వచ్చి వారిని చూసి తమ ఊరి వారే అని గ్రహించి వారిని పలకరించాడు. వారు ఆయనకు విషయం చెప్పారు. ఆయన చదువుకున్న వ్యక్తి కావటంతో పోలీసులను అలా మీరు తీస్కెళ్ళటానికి లేదు, వీళ్ళు ఇప్పుడే మీకు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసిన ఎఫ్.ఐ.ఆర్. కాపీ పోస్టు చేస్తారు, అలాగే వీళ్ళ తరఫున లాయర్ కూడా ఇప్పుడే వచ్చి మిమ్మల్ని కలిసి మీకు కావాల్సిన వివరాలన్నీ ఇస్తారని గట్టిగా, కాన్ఫిడెంట్గా మాట్లాడే సరికి, పోలీసులు తమ మోసం ఎక్కడ బయటపడుతుందోనని, కొంచెం తగ్గి, పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పంపబడిన ఎఫ్.ఐ.ఆర్. కాపీ చూసాకనే తగ్గామన్నట్టుగా నటించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బస్తీవాళ్ళు ఈశ్వర్తో, "మీరు మాట్లాడారు కాబట్టి మమ్మల్ని వదిలి వెళ్ళి పోయారు, లేదంటే మా మీదే తిరిగి కేసు వేసేవారు" అన్నారు. అప్పుడు ఈశ్వర్ వారితో, "అందుకే అందర్నీ చదువుకోమని చెప్పేది" అన్నాడు.


అప్పుడు "ఏందోలే ఈశ్వర్! మాకు చదువు వచ్చేదే కాదులే" అన్న వారితో, "అదేమీ కాదు. మీరే చదువును నిర్లక్ష్యం చేసారు" అన్నాడు ఈశ్వర్.

"అవుననుకో.." అని సిగ్గు పడి, "ఏంటి మీరిక్కడున్నారు?" అని అడిగారు వాళ్ళు. దానికి ఈశ్వర్, "పది రోజుల క్రిందట కైనటిక్ హోండాలో వెళ్తున్న నా భార్యను ఒక లారీ డ్రైవర్, లారీకి బ్రేకులు పడక ఢీ కొట్టి పరారయ్యాడు(హిట్ అండ్ రన్ కేసు). నా భార్య తలకు తగలరాని చోట దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళింది. డాక్టర్లు నమ్మకం లేదంటున్నారు. పోలీసులు డ్రైవర్ను పట్టుకునే విధిలో వున్నారు. అయినా అది జరిగింది పగతో కాదు, వాడ్ని పట్టుకునే కంటే, ఆ లారీకి క్వాలిటీ చెక్లో క్లీన్ చిట్ ఇచ్చిన ఆఫీసర్లను పట్టుకుంటే ఉపయోగం వుంటుంది. కానీ అది జరగదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఈ డ్రైవర్ల లాంటి వారు బలైపోతుంటారు" అన్నాడు ఈశ్వర్. "అలాగే మనం గౌరీకి జరిగిన అన్యాయాన్ని తేలికగా తీస్కోటానికి వీలులేదు. నేనొక ఎన్.జీ.ఓ. అనగా నాన్ గెయినబుల్ ఆర్గనైజేషన్ లేక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే లాభాన్ని ఆశించకుండా పని చేసే ప్రైవేట్ సంస్థలో మెంబర్ని. అక్కడి వారు నాకు బాగా పరిచయం. ఆ సంస్థ వారు ఏ ఆసరా లేని గౌరిలాంటి వారికి సహాయం చేస్తుంటారు. కావున కచ్చితంగా గౌరీకి కూడా సహాయం చేస్తారు. అలాగే వాళ్ళు గౌరి కోసం తమ లాయర్ను కూడా పెడ్తారనీ, వాళ్ళు 24 గంటలూ సేవ చేస్తూ, సిద్ధంగా వుంటారు. నేను ఇంతకుముందే వారికి విషయం వివరిస్తూ ఫోన్ చేసాను" అన్నాడు ఈశ్వర్. ఇలా మాట్లాడ్తుండగానే ఎన్.జీ.ఓ. వాళ్ళు పంపిన లాయర్ వచ్చి, కేసుకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని, "ఇది దిశా చట్టం క్రిందికి వస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పట్లో చాలా సీరియస్గా తీస్కొంటోంది. దీనికి ఏడు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. మరియు పద్నాలుగు రోజుల్లో ట్రయల్ కంప్లీట్ చేయాలని స్ట్రిక్ట్ రూల్సు పెట్టింది ప్రభుత్వం. అంతేకాక మనకు అన్ని రకాల సాక్ష్యాలు కూడా వున్నాయి కాబట్టి కేసు మనమే గెలుస్తాము. మీరు ఏ మాత్రం భయపడకండి.

మీకు ఇక్కడ మా సంస్థే ఈ కేసు అయిపోయేంత వరకు రక్షణ కూడా ఇస్తుంది. అలాగే దొరికిన సాక్ష్యాల పరిశీలన ఇరు వర్గాలకు సంబంధించిన లాయర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి తప్పూ జరగకుండా ప్రభుత్వము పటిష్టంగా ఈ కేసుల పరిశీలన జరిగేలా చూస్తుంది" అని చెప్పి వారిలోని భయాన్ని తగ్గించి నమ్మకాన్ని కలిగిస్తూనే, "ఈ కేసులకు ఎలాంటి పెద్దమనుషుల నుండి సపోర్టు కూడా లభించే అవకాశం లేదు. మీరు ధైర్యంగా వుండొచ్చు" అని చెప్పాడు.


తర్వాత అన్ని రకాలుగా కేసును దర్యాప్తు చేయడానికి పూనుకుని దొరికిన సాక్ష్యాలన్నింటిని తన పర్యవేక్షణలోనే ఫైల్ చేయించటమే కాక, దానికి సంబంధించిన టెస్టుల రిజల్టుల కాపీలను, తర్వాత డబ్బుతో తారుమారు చేయకుండా వుండటం కోసం తన వద్ద కూడా భద్రపరుచుకున్నాడా లాయరు. ఆ లాయర్ చెప్పినట్టుగానే అన్నీ సవ్యంగా జరిగి ఆ నలుగురికీ జీవిత ఖైదు పడింది. వాళ్ళు చేసిన పనికి గౌరి ఎలా జీవితాంతం బాధపడ్తుందో అలాగే వాళ్ళూ బాధపడాలని చట్టం వారికా శిక్ష విధించింది. ఆ తీర్పు బస్తీ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వారు గౌరికి ఎవ్వరి అండా లేనందుకు అందరి బిడ్డా అనుకుని న్యాయం జరగాలని మనసారా కోరుకున్నారు. అందుకే ఆ తీర్పుతో వారు ఎంతో ఆనందపడినా, లోలోపల గౌరిపడే మనోవేదన గురించి బాధపడ్తూనే వున్నారు. తమ లాంటి బడుగు వర్గపు జీవితాలలో పెద్ద వారితో తలపడి గెలిచిన మొదటి గెలుపు ఇది. దీనికంతటికీ కారణం తమ బస్తీ వాడైన ఈశ్వరేననీ వారి నమ్మకం. తమ వాడు బాగా చదువుకున్నందుకు తమ వారిలో ఒకరికి న్యాయం జరిగేలా చేసాడు. అందుకే అందరూ తమ పిల్లలను కూడా బాగా చదివించాలని అప్పుడే స్థిరంగా నిర్ణయించుకున్నారు. కాకపోతే ఒక విషాదమేమంటే, ఈశ్వర్ భార్య కోమాలోనే కన్ను మూసింది. ఈశ్వర్కు ఇద్దరు చంటి బిడ్డలు, అదొక్కటే అందరినీ బాగా కలిచి వేసిన విషయం. తర్వాత బస్తీలో ఈశ్వర్కు చిన్న సన్మానం చేసారు బస్తీవాళ్ళు. ఈశ్వర్ ఆ సన్మాన సభలో మాట్లాడ్తూ, "ఈ రోజటి విజయానికి అసలు కారణం నేను కాదు. ఆ విజయానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ప్రభుత్వం తెచ్చిన దిశా చట్టంలో చెప్పినట్టుగానే ప్రభుత్వపు అండదండలు అందటం, ఇంకొకటి మీరందరూ కలిసి పోరాడటమే", అని చెప్పాడు.

"నేను చదువుకున్నందుకు మీకు సలహాలు మాత్రమే ఇవ్వగలిగా"నన్నాడు.

"అందుకే అందరూ చదువుకోవాలంటాను నేను. చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు, న్యాయాన్యాయాలు తెలుసుకుని మోసపోకుండా వుండటానికి కూడా", అని చెప్పాడు. "అలా ప్రభుత్వం అత్యాచార బాధితులైన మహిళలకు సత్వర న్యాయం జరగటానికై ప్రవేశ పెట్టిన 'దిశా చట్టం' ప్రకారం అధికారులు అన్నిటికంటే ముందుగా ఈ కేసుకు ప్రాధాన్యతనిచ్చి పదహైదు రోజుల్లో ఇన్వెస్టిగేషన్, ట్రయల్ పూర్తి చేయటం. అలాగే అన్ని సాక్ష్యాధారాలతో పాటు బాధితురాలు బ్రతికుండి నేరస్తులను గుర్తు పట్టటమే కాక, తీసుకున్న టెస్ట్ రిపోర్టులను తారుమారు చేయకుండా ప్రభుత్వ లాయర్ మరియు బాధితురాలి లాయర్ల ముందే అధికారులు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయటం కూడా ఒక కారణం. అలాగే ఇందుకు గౌరికి ఎంతో ఆసరాగా వున్న మా ఎన్.జీ.వో. వాళ్ళు చేసిన సహాయం కూడా మరవలేనిది" అని చెప్పాడు ఈశ్వర్. "నాకు ఇదంతా చూసాక మీకొక ఉదాహరణ చెప్పాలన్పించి చెప్తున్నాను" అంటూ, చెప్పటం కొనసాగించాడు ఈశ్వర్. "మనం జంతువుల డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాము కదా, కొన్ని వందల అడవి దున్నలు వెళ్తుంటే, ఒంటరిగా వచ్చిన పులి వాటిలో ఒక దాని మీద దాడి చేసి చంపుతుంది. అలా చూస్తునప్పుడు నేననుకునే వాడ్ని, అక్కడ వందల అడవి దున్నలున్నా, అవి అన్నీ కలిసి ఎదిరించని కారణంగా వాటిల్లో ఒకటి పులికి బలైపోయింది కదా అని. అలాగే అవి ఎప్పుడూ అలా బలవుతూనే వుంటాయి కూడా. నిజానికి అడవిదున్న పులి కంటే పెద్దగా, బలంగా పొడుగాటి కొమ్ములతో వుంటుంది. పులి వచ్చి మీద పడుతుంటే ఆ ఒక్కటే పోరాడుతుంది తప్ప వేరే ఏ దున్నలూ సహాయానికి రావు. మొదటగా అవి పులిని చూస్తూనే భయపడి తామేమీ చేయలేమని అనుకునేస్తాయి. అందుకే వాటిలో ఒక దాని మీద దాడి చేసినా, ఏమీ చేయలేమన్నట్టు మిగిలినవి వాటి పాటికవి వెళ్ళి పోతుంటాయి.


అదే పులి ఒక దున్న మీద దాడి చేయగానే, మిగిలిన వాటిలో ఒక నాలుగు దున్నలు ఆ పులిని తమ కొమ్ములతో ఎదిరిస్తే చాలు, పులి ఒక్క నిముషంలో తోక ముడుచుకు పోవలసిందే. ఆ విషయం వాటికి చెప్పటానికి నాలాంటి సలహాదారు ఎవరూ లేరు. నా సలహా విని మీరు ముందుకు అడుగువేసినందుకు విజయం మీ వశమయ్యిందనీ, అందుకే కలిసి పోరాడితే మనలాంటి బడుగు వర్గాలకు జరిగే ఎన్నో అన్యాయాలను ఎదిరించవచ్చ"నీ చెప్పాడు ఈశ్వర్. "అలాగే మీకింకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను భార్య చనిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. గౌరికి ఏ ఇబ్బందీ లేకపోతే నేను ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెకు జీవితాంతం అండగా వుండాలనుకుంటున్నాను. అలాగే తాను, తనకు ఇష్టమైతేనే నాకు భార్యగా వుండొచ్చు లేకపోతే నా పిల్లలను పెంచటానికి నాకు తోడుగా వున్నా చాలు. తను చదువుకోవాలంటే కూడా చదివించటానికి నాకే అభ్యంతరం లేదు. చివరగా నిర్ణయం గౌరికే వదిలేస్తున్నా"నని చెప్పి, "ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను" అని సెలవు తీస్కున్నాడు ఈశ్వర్. తర్వాత అందరూ గౌరితో సావధానంగా మాట్లాడి ఈశ్వర్తో పెళ్ళికి గౌరిని ఒప్పించి, కొన్ని రోజులలో పెళ్ళి చేసేసారు. ఇప్పటికైతే వారు మంచి స్నేహితులు. వారు ఏ నాటికైనా మంచి భార్యాభర్తలు అవుతారని ఆశిద్దాం. పెళ్ళయ్యాక గౌరి తండ్రిని కూడా తన దగ్గరే వుంచుకుని చూస్కోసాగాడు ఈశ్వర్. బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తోంది. దాన్ని సద్వినియోగం చేస్కుంటే, బాగా చదివి తమ వర్గం వారందరినీ కాకపోయినా కనీసం తమ కుటుంబాన్నైనా చక్కగా, సంతోషంగా చూస్కునే అవకాశముంటుంది. ఒక వర్గంలో ఒక మంచి వ్యక్తి చదివితేనే ఆ వర్గమంతా బాగుపడినప్పుడు, ఇక ఇంట్లోని ప్రతి వ్యక్తీ చదువుకుంటే ఆ వర్గమింకెంత ముందంజ వేస్తుందో ఆలోచించండి. ఇది నా అభిప్రాయం, ఇదే మీ అభిప్రాయం కూడా కావాలను కోరుకుంటూ ఈ కథనింతటితో ముగిస్తున్నాను. రచయిత్రిగా నా మాట ఇంతకు ముందు ఎక్కడో చిన్న, చిన్న ఊర్లలో ఇలా బడుగు వర్గాల ఆడవారిపై అత్యాచారాలు జరిగేవి. కానీ ఈ మధ్య కాలంలో ఒంటరిగా ఆడవారు కనపడితే చాలు జరుగుతున్నాయి, వారు ఏ వయసు వారని కూడా చూడటం లేదు. ఇవి రూపుమాపాలంటే అందరూ ఎవరికి వారు సంస్కారవంతులై వుంటేనే సాధ్యం. పిల్లలుగా ఎదుగుతున్నప్పటి నుంచే వారికి, మహిళలు కూడా మనుషులేననీ, వారితో ఎలా సంస్కారవంతంగా ప్రవర్తించాలో నేర్పిస్తూ పెంచాలి. పెరుగుతున్న పిల్లలను చెడు వైపుకు మరలిస్తున్న కొన్ని వెబ్సైట్ల పై పూర్తి నిషేధాన్ని అమలు పరచాలి. అలా చేస్తే కానీ ఇవి ఆగవు, ఎందుకంటే చెడు ఆకర్షించినంత సులభంగా మంచి ఆకర్షించ లేదు కాబట్టి. ఈ కథ వ్రాసిన నాటి వరకూ, దిశాచట్టం క్రింద ఏ అత్యాచార కేసూ పరిశీలించబడలేదు. కానీ నిజంగా 'దిశాచట్టం' ప్రకారం అత్యాచార కేసులను పరిశీలిస్తే బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే అవకాశముంది. ముందులా ఏండ్లకు ఏండ్లు కేసు కొరకు కోర్టుల చుట్టూ తిరగకుండా, దిశాచట్టం ప్రకారం నిజంగా పదిహైదు రోజుల్లో కేసు పూర్తవుతుంటే, మహిళా బాధితులకదో రక్షణ కవచమే అవుతుంది. అంటే ఈ చట్టాన్ని చూసైనా తప్పులు చేయటానికి భయపడతారని నా అభిప్రాయం. --- సమాప్తం ---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

అనంతమైన నవ్వులు

అరణ్య రోదన

అందమైన కిటికీ

అండదండలు

అమ్మంటే అమ్మే

లలితా సందేశం

మదన్ మథనం తీరిన వేళ

పచ్చని ప్రేమ

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


15 views0 comments
bottom of page