top of page

కలియుగ జీవితం

Kaliyuga Jeevitham Written By Pitta Govinda Rao

రచన : పిట్ట గోపి


విశాఖపట్నం సమీపంలో, గోపాలపట్నంకు చెందిన విజయ్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నెలకి నలభై వేలు జీతం. ఉద్యోగం కష్టమైనదో లేదో తెలుసుకోకుండా....పదిమంది పెద్ద కంపెనీలో ఉద్యోగం సాదించావని అనటంతో, వారి మాటలతో ఆ ఉద్యోగం లోనే కొనసాగుతున్నాడు. పిల్లలను తల్లిదండ్రుల వద్ద ఉంచి చదివిస్తున్నాడు. విజయ్ తెల్లవారు ఝామున వెళితే, ఏ రాత్రికి ఇంటికొస్తాడో....ఎంత చిరాకుతో వస్తాడో..వర్ణించలేనిది. జీతం బాగానే వస్తున్నా....ఆఫీసు పనులతో..దగ్గర ఉన్న భార్యను కూడా పట్టించుకోలేనంతగా ఉండేవాడు. ఇంక తల్లిదండ్రులు, పిల్లల ఊసేలేదు. విజయ్ తన ప్రయాణం బుల్లెట్ ట్రైన్ లో చేస్తూ...ఒక రోజు ఎప్పటిలాగే ట్రైన్ లో కూర్చుని ఉండగా, ఎదురుగా చేతిలో పెద్ద బకెట్, అడుగున నూనె తో తడిచిన పేపర్ చూసి, సమోసాలు అమ్మే వ్యక్తి అని అర్థం అయ్యి, ఊరికే ఉంటే ఏం వస్తుందని, “అన్నా...సమోసాలన్నీ అమ్మేసావా…”అన్నాడు .

అవతలి వ్యక్తి రాము అన్నీ అమ్మేశానని చెప్పాడు.

“ఒక్కోటి ఎంతకమ్ముతున్నావ”న్నాడు.

రూపాయికని చెప్పాడు రాము.

“ఒకరోజు లో ఎన్ని అమ్ముతుంటావ్” అన్నాడు విజయ్

“ నా యొక్క ఉత్సాహం బట్టి రెండునుండి మూడువేల సమోసాలు అమ్ముతుంటాను ” అన్నాడు రాము.

“ అంటే నెలకు అరవై నుండి తొంభై వేల వరకు సంపాదిస్తున్నాడు.ఎంతో పెద్ద ఉద్యోగం అని, పెద్ద ఉద్యోగస్తుడినని పదిమంది తెగ పొగిడితే..సంబరపడ్డాను. ఒత్తిడి మయమైన ఈ ఉద్యోగం కంటే ఈ సమోసాల వ్యాపారిలా ఆలోచిస్తే...మనశ్శాంతి గా ఉండేదని అనుకుని ఎంత వరకు అమ్ముతుంటావన్నాడు. ఏదో ఒక్కపూట అమ్ముతుంటానని, ఆ పూటలో నేను తెచ్చినవన్నీ అయిపోతాయి. అనిచెప్పాడు రాము. ఒక్కపూట లో అయిపోయినా...ఇంటి వద్ద తయారుచేయటానికి నీకు సమయం పడుతుంది కదా..రోజంతా నువ్వు కష్టపడ్డట్లేగా అన్నాడు విజయ్.

“అన్నా...మాది తరతరాల వ్యాపారం. మా నాన్న పెద్ద చదువులు చదివాడు. ప్రతిభ ఉన్నా, మా నాన్న కి ఉద్యోగం రాక, ఇలా మా తాత చేసే ఈ వ్యాపారం లోకి వచ్చి, మంచి ఆలోచనతో తన సంపాదన పెంచుకున్నాడు. నన్ను ఇంటర్ చదివించాడు. ఇంకా చదవటం వల్ల ఉద్యోగం వస్తుందో..లేదో..ఈ వ్యాపారం లో మెలుకువలు అబ్బుతాయని, చదువు వద్దన్నాడు. కష్టమనేది అందరం పంచుకుంటే ఎవరికీ కష్టం ఉండదు. నేను నాభార్య , నా పిల్లలు, నా తల్లిదండ్రులు, వృద్ధులైన వారి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉంటాం. నాపిల్లల యోగక్షమాలు నా తల్లి, నానమ్మలు చూసుకోగా..నేను అమ్మేందుకు కావాల్సిన పదార్థాలు, నాభార్య, నా తండ్రి తయారు చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్నా..అనుభవజ్ఞులైన మా తాతగారి సలహాలు మాకు ఎంతో ఉపయోగం. అలా మా సంపాదన తరతరాలుగా సాగుతుందని తాతగారు చెప్తుంటార”న్నాడు. “ఎల్లప్పుడూ వారు ఉండిపోరు కదా....”అన్నాడు విజయ్. “నిజమే అన్నా..అలానే నా పిల్లలు, వారి భార్యలు వస్తారు కదా, మరి....మేమంతా కలసి ఉన్నంత వరకు ఆనందంగా ఉంటాం” అన్నాడు.

“మరి విడిపోవాల్సి వస్తే?”ఎదురు ప్రశ్నించాను. “అన్నా...మన ఆనందమయమైన జీవితం, కలిసి ఉండటంలో ఉందని గ్రహిస్తే చాలు. ఎన్ని మనస్పర్థలు వచ్చినా...మనల్ని విడదీయలేవు. పదార్థాల తయారీకి, నా ఖర్చులు అన్నీ పోను, ప్రతి నెల యాభై నుండి డెబ్బై వేల వరకు నేను సంపాదిస్తున్నా....అంటే అందులో అందరి శ్రమ ఉండటంతో, నా అనంతమైన కష్టం కేవలం కొన్ని గంటలకే పరిమితం అయింది. కుటుంబం తో గడపాలనే ఆత్రుత కూడా...నాకు హుషారుగా తిరిగి అమ్మేందుకు సహకరిస్తుంది’ అన్నాడు.

ఇంతలో విజయ్ స్టేషన్ రావటంతో దిగిపోయాడు. రాము చెప్పినవి అతనిలో బాగా ఇమిడిపోయాయి. తాను అంతపెద్ద చదువులు చదివి ఇలాంటి ఆలోచనలు రాలేదు. కుటుంబం లో ఒక్కొక్కరు ఒక్కో "బాధ్యత" తీసుకుంటే ఎవరికీ కష్టం ఉండదు.పెద్ద కంపెనీలో ఉద్యోగం అంటే ఆలోచించకుండా చేరాను. కానీ ఇందులో ఉన్న కష్టసుఖాలు ఆలోచించలేదు. పైగా నాకు శ్రమ, ఒత్తిడి, తల్లిదండ్రులు, పిల్లలు దూరం. సరికదా...దగ్గర ఉన్న భార్యతో కూడా సరదాగా మాట్లాడిన దాఖలాలు లేవు. ‘మాసిపోయిన దుస్తులు ధరించే రాము తృప్తి అయిన జీవితంఅనుభవిస్తుంటే....ఇస్త్రీ చొక్కాల తో, ఏసి రూం లో ఉండే మేము, మాకు తెలియకుండానే దుర్భర జీవితం అనుభవిస్తూ, మాతో గడపాలని ఉన్న నా తల్లిదండ్రులు, పిల్లల, జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాము’ అని బాధపడసాగాడు. అంతేనా....కష్టమైనా ఎలాగూ ఉద్యోగానికి వెళ్ళాల్సిందే. అయినా కుటుంబాన్ని తన వద్దే ఉంచుకుని వారితో గడిపేందుకు కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్ చదివి ఇన్ని ఆలోచనలతో...గొప్ప జీవితం గడుపుతున్న రాము ని, ఎప్పటికీ మనసులో ఉంచుకోగలనని, తాను నాకు గొప్ప జీవిత పాఠం నేర్పాడని అనుకున్నాడు. నిజానికి ఓ పని ఎంత కష్టమైనా... అది కుటుంబం తో గడిపినపుడు వచ్చే ఆనందం దాన్ని చెరిపేస్తుంది. కష్టం అని అనకుండా..భాద్యతగా భావిస్తే...ఏదీ కష్టం కాదని తెలుసుకున్నాడు. రాము లాంటి జీవితానందం కోసం ఇప్పుడిప్పుడే మొదలెడుతున్నాడు విజయ్.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అబిలాశ.ఎనిమిదో తరగతి లో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా..సామాన్యుడిగా..ఉండటానికే ప్రాధాన్యతనిస్తా.ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసమూ...ఆలోచిస్తే...ఈ సమాజం అబివృద్ది పధంలో నడువటం ఖాయం

62 views0 comments

Comments


bottom of page