top of page

కమ్మని కల


'Kammani Kala' written by Lakshminageswara rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

అది 'హైదరాబాద్ ' మహా నగరం. తెల్లవారగానే మొదలవుతుంది జీవితంలో క్షణం తీరిక లేని ప్రజల హడావిడి. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, పనుల కోసం పరిగెడుతున్న శ్రామికులు, ఒక్క నిమిషం తేడా అయితే బస్సులు దొరకక, మెట్రో ట్రైన్ అందక ఆటోలు, టాక్సీలు సమయానికి రాక ఆరోజు ఏమౌతుందో? అన్న బెంగ తో, భయంతో ఎవరి పని మీద వాళ్ళు టెన్షన్ పడుతుంటారు.

అలాంటి వారిలో ఒకరు రాజశేఖర్ ఆయన భార్య ప్రమీలా గారు. రాజశేఖర్ ఒక 'కంప్యూటర్ మెకానిక్ ' ప్రమీల ఒక ప్రైవేట్ కంపెనీలో ' రిసెప్షనిస్ట్ ' గా పని చేస్తున్నారు. వీరికి ఒక కొడుకు శేఖర్. వయసు 9ఏళ్లు. చిన్నప్పట్నుంచి 'క్రీె చ్ ' లోనేఉంటూ చదువుకుంటూ, పెరిగి పెద్ద అయినా కూడా ఇంట్లో తను ఒక్కడే ఉంటు సమయానికి స్కూల్కి వెళ్లి వస్తూ ఎక్కువ టైం ఒంటరిగానే గడుపుతూ ఉంటాడు.

రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మ వన్డి పెట్టిన టిఫిన్ తిని ఏం చేయాలో తోచక, స్నేహితులు లేక, బోర్ అయిపోతూ తల్లి తండ్రుల కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేవాడు శేఖర్. ఒకవేళ ముందు తల్లి వచ్చినా ‘ఏం చేస్తున్నావురా? హోంవర్క్ చేసావా?’ అంటూ ప్రశ్నలు అడిగేది మాత్రమే. రాత్రికి వంట చేసి తను తిని, శేఖర్ కు పెట్టి ఎంతో అలసట తో మంచం మీద పడుకొని నిద్ర పోవడం, అలాగే రాత్రి ఏ 11గంటల కో తండ్రి రాజశేఖర్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనం తిని తను కూడా క్షణం ఆలస్యం చేయకుండా మంచం మీద పడుకొని నిద్ర పోవడo! ఇలా రోజు జరుగుతున్న తతంగాన్ని చూస్తూ ఎంతో నిరాశగా కనీసం ఒక్కరు కూడా ప్రేమగా మాట్లాడక ఎవరి మటుకు వారు అలసిన శరీరాలతో నిద్రపోవడం పరిపాటి అయిపోయింది శేఖర్ కు.

రోజు కలలో శేఖర్ ని వాళ్ళ అమ్మానాన్న ఎంతో ప్రేమగా దగ్గరగా తీసుకుని వారంలో ఒకసారి బయటకు తీసుకు వెళ్లి ఐస్ క్రీములు తినిపిస్తూ సరదాగా గడపడం పాపం శేఖర్ కి కలగానే మిగిలిపోయాయి. ఆరోజు జన్మలో ఎప్పటికైనా వస్తుందా! అని ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేని చిన్న పిల్లవాడు శేఖర్.

ఆరోజు ఆదివారం. అందరూ కొంచం లేట్ గానే లేచి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అమ్మేమో ఇల్లంతా శుభ్రంగా తుడిచి అరమరలు అన్నీ సర్దుతూ ఒకపక్క కిచెన్ లో వంట చేస్తూ రోజులాగే క్షణం తీరిక లేకుండా సమయానికి శేఖర్ కి, రాజశేఖర్ కి అన్నీ అందిస్తూ తన పనిలో నిమగ్నం అయిపోయింది అమ్మ. నాన్నగారు కూడా వాలు కుర్చీలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుతూ అప్పుడప్పుడు కొడుకుని పిలిచి ఎలా చదువుతున్నావ్? అని అడిగాడు తప్ప మరో విషయం లేదు. శేఖర్ కి అదే మంచి సమయం అనుకుని “నాన్నగారూ! మిమ్మల్ని ఒకటి అడగాలి” అన్నాడు శేఖర్. “ఏంట్రా! అడుగు. తొందరగా నసగకా” అంటూ చిరాకు పడుతున్న నాన్నగారిని కొంచెం భయంగా చూస్తూ " మీరు రోజూ చాలా గంటలు పనిచేస్తారుకదా! ఒక గంటకు ఎంత డబ్బులు వస్తాయి?” అని అడిగేసరికి రాజశేఖర్ కి కోపం నషాళానికి వచ్చి “వెధవా! నీ కెందుకు రా? పో! “ అంటూ గట్టిగా అనేసరికి ఏడుపు వచ్చింది శేఖర్ కి. మెల్లిగా తన రూం లోకి వెళ్ళిపోయాడు.

కొంతసేపు పోయిన తర్వాత రాజశేఖర్ తనలో తనే ‘అయ్యో! అనవసరంగా శేఖర్ ని తిట్టాను. వాడు అడిగింది ఏమైనా లెక్కల సబ్జెక్ట్ లోని ప్రశ్నలేమో. పోనీలే . అని అనుకుని "ఒరేయ్ ! ఇందాక నువ్వు అడిగింది. రోజుకి ఒక గంటలో నేను సంపాదించేది 200 మాత్రమే! అని చెప్పి కొడుకు తల మీద రాస్తు చెప్పేసరికి ' ఓ! అలాగా నాన్నా! నాకు ఒక వంద రూపాయలు కావాలి. ఇస్తారా?’ అని మళ్ళీ కొడుకు అడిగేసరికి చిర్రున కోపం వచ్చి "ఎందుకురా నీకు డబ్బులు? అన్నీ కొన్నాము కదా! స్కూల్లో అడ్డమైనవన్నీ కొని తినడానికి అడుగుతున్నావా? చంపేస్తాను” అని మళ్లీ కోపంగా అరుస్తూ వెళ్ళిపోయాడు తండ్రి.

ఆ మర్నాడు కొడుకుని స్కూల్ దగ్గర దింపుతూ ‘పోనీలే ఎందుకు అడిగాడో’ అని తనలో తానే అనుకుంటూ 100 రూపాయలు తీసి శేఖర్ కి ఇస్తూ 'అనవసరంగా ఖర్చు చేయకు ' అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ మరుసటి ఆదివారం రాజశేఖర్ కొడుకు గదిలోకి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యపోయాడు. కోపంతో "ఏరా! అంత మెల్లిగా డబ్బులు లెక్కపెడు తున్నావు? అన్ని డబ్బులు ఉంచుకొని కూడా నన్నెందుకు అడిగావు?. అసలు ఎం చేస్తున్నావు? అని కోపం తో చాచి లెంపకాయ కొట్టేసరికి 'అమ్మా!' అని శేఖర్ గట్టిగా అరిచేసరికి తల్లి ప్రమీల కూడా పరిగెత్తుకొని వచ్చి కొడుకుని దగ్గరగా తీసుకొని "ఏంటండీ. అంత గట్టిగా కొట్టారు !” అంటూ ఏడుస్తూ అడిగేసరికి, “చూడు నీ ముద్దుల కొడుకు నిర్వాకం. వాడి దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో. అయినా మొన్న నన్ను 100 రూపాయలు కావాలని తీసుకొన్నాడు. వీడు ఇప్పటినుంచే పాడు అలవాట్లు చేసు కొంటున్నాడు. నీ గారాబం ఎక్కువయి పోయింది” అంటూ ప్యాంటుకున్న బెల్ట్ కూడా తీసి కొట్టబోయేసరికి, శేఖర్ ఏడుస్తూనే "నాన్నగారు! నేను మిమ్మల్ని అడిగిన 100 రూపాయిలు కూడా కలిపితేనే నా దగ్గర 200 రూపాయిలు కూడాయి. ఆ డబ్బు తో మీ ఒక్క గంట సమయాన్ని' కొని ' మీరు, అమ్మ కలిసి స్పోర్ట్స్ లో నేను సాధించిన గోల్డ్ మెడల్ ఫంక్షన్ కి స్కూల్ కి రావాలి. సరిగ్గా ఒక్క గంట లో అయిపోతుంది. అందుకే నేను మిమ్మల్ని రోజులో ఒక్కగంటకు ఎంత సంపాయిస్తారని అని అడిగాను. మీరు కోపంతో నా మీద అరిచారు. మళ్లీ మీరే ఆ వంద రూపాయలు ఇచ్చారు. అప్పుడు మొత్తం 200 రూపాయలు జమ చేర్చి మీ ఒక్క గంట సమయాన్ని వృధా కానివ్వకుండా నేను 200 మీకు ఇస్తున్నాను. ఇదే నేను చేసిన తప్పయితే నన్ను క్షమించండి ' అంటూ తండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తూ చెప్పేసరికి తల్లిదండ్రులైన రాజశేఖర్ ప్రమీల కు నోట మాట రాక, కొడుకుని లేవదీసి ముద్దులు పెట్టుకుంటూ "నిజమేరా శేఖర్! నిన్ను ఒంటరిగా వదిలేసి ధనార్జన కోసం రేయింబవళ్ళు పని చేస్తున్నాను. కొంచెం కుటుంబం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలని ఎంతో తెలివిగా మాకు తెలియజేశావు. చాలా సంతోషం. ఇకనుంచి ప్రతి వారం మొత్తం రోజంతా నీతోనే గడుపుతాము. నిన్ను ఒంటరిగా వదిలేయము” అంటూ ఆనందంతో శేఖర్ తల్లిదండ్రులు ప్రతి వారం కొడుకుని బయటకు తీసుకు వెళ్లి ఆ రోజంతా సరదాగా గడిపేవారు.

శేఖర్ కన్న ' కమ్మని కల ' నిజమయ్యింది!!!!!!!!!!!.

44 views0 comments

Comentarios


bottom of page