top of page

కన్నవారి ప్రేమ


Kannavari Prema New Telugu Story


Written By Bejjarapu Kalyanacharyulu


రచన : బెజ్దారపు కళ్యాణాచార్యులు


కోరుట్ల వాసియైన పార్వతమ్మ, సాంబయ్య ల ముద్దుల గారాల పట్టి రేణుకమ్మ

పెండ్లి ఈడుకు వచ్చింది.


ఆ తలిదండ్రులు రేణుకమ్మ కోసం సంబంధాలను చూస్తున్నారు.

అలా చూడగా అయిలాపుర వాసుడు సత్యయ్య,

వారలకు అన్ని విధములుగా నచ్చెను.

సత్యయ్య లోకం పోకడ తెలియని మనిషి.

అందునా నోటిలో నాలుక ఉన్నదా లేదా అని ఉండే రకము.


ఉన్నతమనస్కుడు, వ్యవసాయ కుటుంబం(రైతు) కాకపోయినా వ్యవసాయాధారిత కుటుంబమే.

అంతో ఇంతో వ్యవసాయ భూమి కూడా ఉంది.

సత్యయ్య అనే పేరుకు తగ్గట్టుగానే సత్తెకాలపు మనిషి లాగే ఉంటుంది అతని నడక.

రేణుకమ్మకు కూడ వరుడు నచ్చెను. చూపులు కలిసెను.


ఓ శుభమూహుర్తాన వివాహం జరిగెను.

ఎంతోహాయిగా వారి వివాహబంధం ఏ ఆటంకము లేకుండా సాగిపోతుంది.


ఇలా సాగుతుండగా,


వారి జీవితాల్లో తొలకరి జల్లుకు ధరణి పులకరించినట్లుగ రేణుకమ్మ కడుపులో ఓ పిందె పాదుకునె.

సత్యయ్య సంబరాలకు పట్టరాని సంతోషమాయె.


రేణుకమ్మకు అమ్మ అయ్యే యోగపు వేళ రానేవచ్చే. చూడ ముచ్చటైన కొడుకుకు జన్మనిచ్చెను.

అందరిలోకూడా ఆనందాలు విరిసెను.

ఆ పాపడికి ఆనందం అని నామకరణం చేసిరి.

ఆ పిల్లవాడు అలా అలా ఎదుగుతూ

పాఠశాలకు చేరే వయసు కు వచ్చెను.


నాన్న గారి సుద్దులు, అమ్మ గారి బుద్ధి మాటలు వింటూ నే బాలుడు యుక్త వయసుకు వచ్చెను. అప్పుడు పట్టణపు చదువుల కై మారాం చేసెను.. తోటివిద్యార్థులతో చదువుకుంటానని

ఒకటే గోల చేయగా చేసేదేమిలేక అంగీకరించక తప్పలేదు ఆ తలిదండ్రులకు.

సరేనని వారు ఎప్పటిలాగే వారి పనులలో నిమగ్నమయ్యారు.


ఇలా నాలుగైదు సంవత్సరాలు గడిచేసరికి,

అతని లో మార్పు ను చూస్తూ, 'గమనిస్తున్నావా అయ్యా! మనపిల్లాడిలో మార్పు. ఏమంట పట్టణపు సదువులంటు మెదలు పెట్టిండో, మన సేతు ల లేకుండ ఐపోతాడమోనని దిగులుగానుందయ్య' అని అంటుంది రేణుకమ్మ.

‘అలా కాదే, మనకా- సదువు, సందె లేక పాయెగా

పట్టణం సదువుల గురించి మనకేమెరుకనే?ఇప్పటి పొల్ల గాండ్లు మన కంటే తెలివిమంతులే. మనం అట్ల అనుకోవద్దే రేణుకమ్మా! కాలం మారుతుంది, ఆళ్లు మారుతున్నారు. ఆళ్లతోపాటే మనం కూడ కొంచెం కొంచెం మారాలనే ‘అంటాడు సత్యయ్య


అపుడు రేణుకమ్మ ‘అదేందయ్యా! గిట్లయితే మన పిల్లోడు కరాబు గాడా! మరి మనం అదుపు, ఆజ్ఞల ఉంచకపోతే ఎట్ల ? జర భయం సెప్పయ్యా! ‘అంటుంది.

‘ఒక్కగానొక్క కొడుకు. ఆడంటే మనకు పంచపాణాలు. ఆన్ని తిట్టి, తిమ్మి మనం సాధించేదేముందే తల్లి! మంచిమాటతో సర్ది చెప్పితే సరి’ అంటూ

‘వాడెంతైనా మనకొడుకే. మనంసెప్పినట్ల కాకపోతే ఇంకెవలు సెప్పినట్లు ఇంటడే? నువ్వేం బుగులు వట్టకు, వానిగురించి నాకెరుకేనే రేణుక.’ అంటాడు.

అపుడు తల్లి ‘ఏమోనయ్యా! కొడుకును ఒక్కమాట అననియ్యవ్ నీఇట్టం నీ కొడికిట్టం...


సరేసరే పోదాం పద, తోటలో కలుపు తీయాలే. కైకిలోళ్లు అత్తాన్రుకదా! నువు నడువు నేను సద్దివెట్టుకుని వస్తానం’ది రేణుకమ్మ.

సత్యయ్య, రేణుకమ్మ వ్యవసాయములో నిమగ్నమై పోతారు.

ఇలా కొన్నిరోజులు గడిచేసరికి ఆనందములో చాలా మార్పులు వస్తాయి.

అమ్మనాన్నలపై అరవడము, కోప్పడడము మొదలైనవి చేస్తుంటాడు.మెలమెల్లగ తలిదండ్రులకు తెలియకుండ చెడు అలవాటు చేసుకుంటాడు.

తలిదండ్రులకు తెలిసి మందలిస్తే వినకుండా తిిరుగుజవాబులతో కోప్పడేవాడు.

ఇలా కొంతకాలం గడిచాక, తలిదండ్రులు అతిచింతితులై వీడిని ఇలాగే వదిలితే చేజారిపోతాడని, వీడికి వివాహం చేద్దామని యోచిస్తారు. సంబంధం చూసి ఘనంగ వివాహం చేస్తారు. ఆనందం కాపురం సజావుగానే సాగుతుంది. ఓ ఐదారు వత్సరాలకు ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు.

కానీ ఆనందము తనకు తాను బతుకుతూ, మంచి సంపాదనతో తలిదండ్రులను మరిచిపోయే స్థితికి చేరుకుంటాడు. ఇలా కొన్నేళ్లు గడువగా ఆనందం జీవితంలో అనుకోని ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. రెండు మూత్రపిండాలు చెడి పోతాయి. సమస్య తీవ్రమౌతుంది. బతికే అవకాశమే లేకుండవుతుంది. కనీసం ఒక మూత్రపిండమైనా దొరికినా బతికియ్యవచ్చని వైద్యులు సూచిస్తారు. ఈ విషయం తెలిసిన ఆనందం తలిదండ్రులు దుఃఖితులవుతారు...కొడుకు వేరు కాపురం పెట్టినా వాళ్ల ప్రాణాలన్నీ కొడుకు పైనే...వాడికంటే మనకు ఎక్కవేముందయ్యా అనుకుని వారిద్దరు విచారం చేసుకుని ఎవరిదైతే సరిపోతే వారిదిద్దామని అనుకుని ఆసుపత్రికెళ్లి డాక్టరుని కలిసి విషయం తెలుపుతారు. అపుడు డాక్టర్ గారు పరిశీలించి తల్లిది సరిపోతుందని చెబుతాడు.

అపుడు సత్యయ్య సిన్నపాణం సిటుక్కుమని పోతుంది, కట్టుకున్నదాని ఆరోగ్యమేమన్న ఐతదేమోనని తనకు దిగులు .'వద్దే రేణుక 'అంటాడు.

కాని తల్లి మనసు ఊరుకోదు కదా! కొడుకు ఎన్నికష్టాలను పెట్టినా ఎంత కర్కశుడైనా తనల దగ్గరకు తీయకున్నా, కొడుక్కి ఆపదొచ్చెనంటే భర్తను కూడ లెక్కెట్టక కదిలిపోతుంది. తనభర్తను ఒప్పించి తుదకు మూత్రపిండమిస్తుంది తల్లి...


ఆనందం ఆరోగ్యం కుదుటపడి ఎప్పటిలాగే వేరు కాపురాన జీవిస్తుంటారు. మాయ మాటలకు లోబడి తలిదండ్రులను చూడడానికి కూడ వచ్చేవాడు కాదు. ఉన్న ఊరు ని విడిచి పట్టణానికి మకాం మార్చుతాడు.. ఇక్కడ రేణుకమ్మ ఆరోగ్యం రోజురోజుకు దిగజారిపోయి అనుకోకుండా మరణిస్తుంది. అపుడు ఈ సత్యయ్య ఒంటరివాడై పోతాడు. కొడుకు కనీసం తల్లిని చూడడానికి కూడ వీలు కాకుండా డబ్బుమైకంలో పడి పోతాడు.

పాపం సత్యయ్య జీవితం ఒంటి కాలు నడకయ్యింది. అపుడనుకుంటాడు నా భార్య నాకు ఆరోగ్యంగా ఉంటే నేనున్నన్నాళ్లు నా తోడు నీడ లా ఉండేది. నాకు తూరపుదిక్కై నిలిచేది. పిచ్చిది! నా గురించి ఇసుమంతన్నా ఆలోసించక కన్నపేగుకోసం వాడి జీవితం కోసం ఆరాటపడింది. కానీ నా కోసం ఒకడున్నాడు ,నన్ను కట్టున్నవాడని ఆలోచించనేలేదు. నన్ను ఒంటరిని చేసి తనదారిన తను ఎల్లిపోయింది రేణుకమ్మ...


‘పిల్లలను కనేది గిందుకేనా గాల్లను పెంచి పెద్దజేసి ఈ నరకం సూడడానికేనా... ఎవని ఖర్మ ఎట్లనో అనుకోక మరో ఆలోచన లేకుండ అవసరమైతే నీ గుండెకాయను కూడ కోసివ్వడానికి సిద్ధమైనవ్ నువ్వు తల్లివేనే రేణుకమ్మా, నువు తల్లివే.

కానీ నేనొకన్ని ఇక్కడున్నానని మర్సిపోయినవే ‘అని అంటూ సత్యయ్య బోరున విలపిస్తూ ఉంటే బండ లాంటి గుండెలైనా కరగక మానవు. ఎందరి ఓదార్పులు, తనగుండెలో ఐన గాయాన్ని మాన్పగలవు...

ఈ నిర్జీవపు కట్టె మదిలో అపుడనిపిస్తుంది

కనికరము లేని సంతతి ని కని సమసిపోవుట కూడా ఈ బంధాలకు తాను కబంధీ యై పోవడమేనేమో.... రేణుకమ్మా.....!!




56 views0 comments

Comments


bottom of page