top of page

కన్యాదానం

Kanyadanam Written By Kamala Parijatha

రచన : కమల పారిజాత


"నిన్నడిగి కన్నామా.‌....?నిన్నడిగి పెంచామా...!? అన్నీ నిన్నడిగే చేయటానికి.? ఏది ఎప్పుడు చెయ్యాలో మాకు తెలియదా...? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట, నా కడుపున పుట్టి నాకే పాఠాలు చెప్పేంత దానివయ్యావా..!? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఏ విధంగా జరగాలో అదే విధంగా జరగాలి. కొత్త పోకడలతో కొంప ముంచుకోవద్దు. డిగ్రీలు మేమూ చదివాం కానీ నీలా ఎప్పుడు మాట్లాడలేదు" అన్నది స్వరూప కాస్త కోపంగా. "అమ్మా నేనేం కొంపలు మునిగే ఆలోచనలు చెయ్యటం లేదు. ముక్కూ మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోను అన్నాను అంతే" అన్నది శ్రీపద.

"అందుకే కదా శ్రీ, ఈ పెళ్లి చూపులు. అబ్బాయి కూడా మంచివాడట. ఇంత మంచి సంబంధం పోతే మళ్లీ దొరుకుతుందో లేదోనని తల్లిగా నేను పడుతున్న ఆరాటం నీకెలా తెలుస్తుందే..? రేపు నీ పెళ్లయ్యాక ఓ బిడ్డ పుడితే అర్థమవుతుంది."

" ఈ....ట అని నీకెలా తెలుసమ్మా..? నాకు తెలిసిన వాళ్లు చెప్పారే..! రెండు చేతులా సంపాదిస్తాడట, మందు, అమ్మాయిలు అంటూ తిరగడట, మంచి సంప్రదాయబద్దమైన కుటుంబమట... ఇంకేం కావాలి అతనిని పెళ్లి చేసుకోవటానికి..!? వ్యసనాలలో మందు సరసన మగువను చేర్చిన ఘనత ఉన్న సమాజం మంచితనానికి నిర్వచనం ఇంతకన్నా ఏమిస్తుందిలే అమ్మా...!"అన్నది శ్రీపద వ్యంగ్యం ఉట్టిపడేలా...

"ఒకసారి చూస్తే తెలుస్తుంది కదే..! ఎందుకిలా మొండిగా వాదిస్తావ్, ఈ రోజు అబ్బాయి వాళ్లు వస్తామని చెప్పారు. నువ్ ఆఫీసుకి సెలవు పెట్టు అంతే" అన్నది స్వరూప కచ్చితంగా. "అమ్మా...నీతో వాదించాలని నాకేమైనా సరదానా? పెళ్లి చూపులు, పెళ్లిళ్లనే తతంగాలు నాకు నచ్చవని నీకు తెలుసు కదా..! నాకు ఊహ తెలిసినప్పటి నుండి పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు వెళ్లగా చూసావా? నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను" అన్నది అంతే కచ్చితంగా శ్రీపద.

" శ్రీ...అలా మాట్లాడకమ్మా...! నువ్ కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల అని తెలిసి మీ నానమ్మ, తాతయ్యలు అబార్షన్ చేయించుకోమని చెవిలో జోరిగళ్లా పోరు పెట్టారు. ఎంత హింసను అనుభవించానో ఆ భగవంతుడికే తెలియాలి. ఆడపిల్ల లేకుంటే తల్లి, చెల్లి, భార్య ఎలా ఉంటారని ఎంతగానో ఆలోచించాను. మీ నాన్న కు కూడా అబార్షన్ చేయించటం ఇష్టం లేదు. ఆడపిల్ల లేని ఇల్లు శ్మశానం లాంటిదని, ఇంటికి మహాలక్ష్మి లా ఆడపిల్ల ఉండాలని, ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఆ ఆనందమే వేరని ఇంకా కన్యాదానం అనే పుణ్యకార్యం చెయ్యాలంటే ఆడపిల్ల ఉండాల్సిందేనని నిన్ను కనడానికి నానమ్మ తాతయ్యలను ఒప్పించారు. నిన్ను కన్న తర్వాత కూడా అల్లారుముద్దుగా, అరచేతిలో అరటిపండు లా అపురూపంగా చూసుకున్నాం. ఆడపిల్లంటే ఎలా ఉండాలి...!? ‌ఇంటి పని, వంటపని నేర్చుకోవాలి. పెద్దయ్యాక మంచి ఇల్లాలిగా ఉండాలనే కదా చిన్నప్పుడు వంటపాత్రల బొమ్మలు కొనిపెడ్తాము. రేపు అత్తగారింటికి పోతే తల్లి ఏం నేర్పలేదని నిన్ను బాగా తిడతారు అని అందరు నన్ను అనేవారు. అదేం బ్రహ్మవిద్యా..! అవసరమొచ్చినప్పుడు నేర్చుకుంటుందిలే, చదువుకునే వయసులో ఆ పనులెందుకు? పెద్దయ్యాక ఎలాగూ తప్పదని అనేదాన్ని. నువ్ ఆడపిల్లవైనా మగాడిలా పెంచాం. నీ కాళ్లపై నువ్ నిలబడేలా చేసాం. ఆడపిల్లే వద్దనుకునే సమాజంలో నిన్ను అందలం ఎక్కించాం. ఇన్ని చేస్తే నువ్విలా మాట్లాడటం న్యాయంగా ఉందా" అన్నది స్వరూప బాధగా.

" ఆడపిల్లకు పుట్టే హక్కుంది, స్వేచ్చగా పెరిగే హక్కుంది. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఉండటానికే పుట్టాల్సిన అవసరం లేదు. అవే తన ఆశయాలు కావు. తనకంటూ ఒక ఆశయం ఉంటుంది. ఇక మగాడిలా పెంచాను అనటంలోనే మగాడు గొప్ప అని, ఆడది అలా ఉండకూడదనే లింగ వివక్ష దాగి ఉంది. మొత్తానికి పుట్టాల్సిన అర్హత లేకున్నా మీ దయ వలన పుట్టానంటావ్, స్వేచ్చగా ఆడుకోవటం, చదువుకోవటం, ఉద్యోగం మీరు పెట్టిన బిక్ష అంటవ్ అంతేనా అమ్మా" అన్నది శ్రీపద ఆవేశంగా.

" అలా ఎందుకంటానే.‌.? నేను కూడా ఆడదాన్నే...! ఆడ,మగ సమానం అని చట్టం లో ఎప్పుడో ఉంది. కానీ కొందరు ఒప్పుకోరు. నాకెప్పుడు అసమానత్వ భావన లేదు. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా స్వేచ్చగా నే పుడుతారు. ఒకరు స్వేచ్చగా పెరుగుతూ, ఒకరు కట్టుబాట్లలో మగ్గిపోవాలనే వ్యవస్థ నాక్కూడా నచ్చదు. ఎవరినైనా కనేది ఆడదే...ఆడది లేకుండా మగాడు పుట్టనపుడు ఎక్కువతక్కువల చర్చే వ్యర్థం. నీకు ఏనాడు కట్టుబాట్లు పెట్టలేదు. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలనే ఆంక్షలు విధించలేదు. కానీ ఒక్కటే కోరుతున్నాం. మా చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలని, మేము కన్యాదాతలమవ్వాలని. కన్యాదానం చేస్తే ఎంతటి ఘోర పాపాలైనా పోతాయట. నూరు చెరువులు-బావులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంతకన్నా రెట్టింపు పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని ఉపనయనం ఖర్చు పెట్టుకుంటే వస్తుందట. దాని కన్నా ఎన్నో రెట్ల పుణ్యం కన్యాదానానికి వస్తుందట. కన్యాదాత వెనుక ఏడు తరాలు ముందు మూడు తరాలు తరించిపోతాయట. మాకు ఆ పుణ్యం దక్కనిస్తావా" అని కూతురి రెండు చేతులు పట్టుకుని అర్థించింది స్వరూప.

తల్లి చేతుల్లో ఉన్న తన చేతుల్ని సున్నితంగా వదిలించుకుంటూ, "ఆ పురాణ గాథలు నాకు తెలుసులే అమ్మా...కన్యను దానము చేయకుండా అమ్ముకున్న సువీరునికి అతని పితృదేవతలకు "అసిపత్రవనమ"నే నరకం సంభవించిందట. ఉత్తి కన్యను కాదు సాలంకృత కన్యను దానం చెయ్యాలట. మరి వర విక్రయం చేసే వారికి ఎటువంటి నరకం లేదంటే ఆ రాతలెటువంటివో ఆలోచించాలి. సమానత్వాన్ని ఒప్పుకుంటా అని చెప్పిన నువ్వే నన్ను మార్కెట్లో ఒక వస్తువులా మగ పెళ్లి వారికి ప్రదర్శించి నా ఫీచర్సన్నీ ఏకరువు పెట్టి, వాళ్లను మెప్పించి, ఒప్పించి అన్ని విధాలా గౌరవించి, నీ బిడ్డ వయసున్న వాడిని శ్రీ మహావిష్ణువు గా తలచి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోని ధనంతో పాటు నన్ను దానం చెయ్యాలనుకుంటున్నావ్. పైగా అది గొప్ప కార్యం అంటున్నావ్. శ్రీ మహాలక్మినని వాళ్లు నా కాళ్లు కడగటం లేదే....!? ఇందులో సమానత్వం ఎక్కడుంది? నెత్తిమీద లక్షలు పెడితే గానీ నాకు విలువ రాదా? నేనేమైనా వస్తువునా దానం చెయ్యటానికి ? కేవలం జీవించడమే కాదు ఆత్మగౌరవంతో జీవించటం ప్రతొక్కరి ప్రాథమిక హక్కు. స్త్రీ హుందాతనమును తగ్గించే ఆచారాలను మానుకోవాలని మన రాజ్యాంగం కూడా చెబుతుంది. ఎప్పుడో కాలం చెల్లాల్సిన ఆచారాలను ఇంకా పట్టుకుని వేలాడటం ఎందుకు...? సంప్రదాయాలు మామిడి పండులాంటివి. మొదట్లో ఒగరుగా ఉన్నా కొంతకాలానికి పులుపుగా మరికొంత కాలానికి తీపిగా ఆ తర్వాత కుళ్లిపోయి కొత్త ఆచారాలకు తెర లేపుతాయని " సుభద్ర పెళ్లి సందర్భం లో శ్రీ కృష్ణుల వారే సెలవిచ్చారు కదమ్మా అన్నది శ్రీపద.

" అయితే ఇప్పుడేమంటావ్? పెళ్లే చేసుకోనంటావా? ఆడపిల్లలు పెళ్లి లేకుండా ఎలా ఉంటారు" అన్నది స్వరూప నీరసంగా.

" సరే ఒక మంచి అమ్మాయిని చూసి చేసుకుంటాలే అన్నది శ్రీపద నవ్వాపుకుంటూ...

" ఏంటే నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా..? ఆడపిల్ల, ఆడపిల్ల ను చేసుకోవటం ఏంది" అన్నది స్వరూప కోపంగా.

" ఎవర్నో ఎవరో చేసుకుంటే మనకేంటిలే అమ్మా, భార్య చనిపోయిన వారానికే పెళ్లి చేసుకునే మగవానికి పెళ్లే అవసరం లేదు అన్నదాని కన్నా నేను అన్నదే జోక్ గా ఉందా" అన్నది శ్రీపద. "శ్రీ...నేను నీకంటే ముందు పుట్టానే, చిన్న వయసులోనే భర్త పోయి.‌..పిల్లలను పెంచుతూ ఒంటరిగా రాణించే ఆడవాళ్లను ఎందరినో చూస్తూనే పెరిగాను" అన్నది స్వరూప.

"నీకన్నీ తెలుసమ్మా...! అయినా ఒక పరిధిని దాటి ఆలోచించలేకపోతున్నావ్. సమాజంలో ఇంకి ఉన్న భావాలు తెలియకుండానే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంకా నువ్ ఆలోచించాల్సింది చాలా ఉందమ్మా..." అన్నది శ్రీపద.

"ఎంత ఆలోచించినా నువ్ పెళ్లి లేకుండా ఎలా ఉంటావో అర్థం కావటం లేదు" అన్నది స్వరూప. "ఎందుకుండరాదు‌..? కచ్చితంగా ఉండొచ్చు‌. ఎంతోమంది ఉన్నారు కూడా...! అయినా నేను సంప్రదాయ పెళ్లి వద్దంటున్నాను కానీ తోడును కాదు" అన్నది శ్రీపద.

"అంటే ఎలాంటి వాడే, నువ్ కోరేవాడు నరమానవులలో ఉంటాడా" అన్నది స్వరూప.

"నా ఆలోచనలను, భావాలను అర్థం చేసుకునే వాడు; ఒక్క మాటలో చెప్పాలంటే నాకు భర్త(భరించేవాడు) గా కాకుండా భాగస్వామి గా ఉండేవాడు, మొగుడు గా కాకుండా సహచరుడిగా ఉండేవాడు కావాలి. అలాంటి వాడు దొరికినప్పుడు, స్వాభిమాన పద్దతిలో వివాహం చేసుకుంటాను" అని బ్యాగ్ అందుకొని ఆఫీస్ కు వెళ్లిపోయింది శ్రీపద.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత్రి పరిచయం నా పేరు కమల పారిజాత. నాకు కథలు చదవటం ఆసక్తి. సమాజాన్ని చదవటం మరింత ఆసక్తి. ఆ ఆసక్తే కథలు రాయటానికి ప్రేరణ కలిగించింది. సమాజ ప్రగతికి రచయిత/రచయిత్రి పాత్ర చాలా ముఖ్యం. అందుకే నేను రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రీయత, సమానత్వం, ప్రగతిని పెంపొందించడం నా రచనల ఉద్దేశం.


345 views5 comments
bottom of page