top of page

కరోనా కష్టాలు


Karona Kashtalu written by Vinnakota Sridevi

రచన : విన్నకోట శ్రీదేవి

గీత వార్డ్ వాలంటీర్, సీరియస్గా తన ఏరియాలో ఇల్లు పట్టాలు ఇవ్వడానికి పేపర్స్ రెడీ చేస్తోంది తన మేడమ్ సహాయంతో.

ఇంతలో ఇంటి నుంచి ఫోను తండ్రి చేశాడు. ఒకసారి అర్జెంటుగా ఇంటికి రామ్మా తమ్ముడు చాలా గొడవ చేస్తూ అమ్మని నన్ను తిడుతున్నాడు అంటూ.

గీత కి ఒక్క క్షణం తల కొట్టుకోవాలి అనిపించింది.

తన కాపురం కూడా ఊర్లోనే కావడంతో అప్పుడప్పుడు తండ్రి తమ్ముడు మధ్య గొడవలు జరగడం తాను ఆదరాబాదరాగా వెళ్లి వాళ్లకిసర్ది చెప్పడం పరిపాటే.

ఏమైందో ఏంటో అని అనుకుంటూ ఒక్క గంటలో వచ్చేస్తాను మేడం అని చెప్పి పర్మిషన్ తీసుకుని కంగారుగా పుట్టింటికి కి పరుగెట్టింది.

ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. తండ్రి బయట కుర్చీ లో కూర్చుని ఉన్నాడు.

.తల్లి వనజ బయట మడత మంచంలో పడుకుని దగ్గుతూ దగ్గు బాగా ఎక్కువ కావడంతోభరించలేక ఆపసోపాలు పడుతూ ఉంది.

గీత త్వర త్వరగా వచ్చి తల్లికి మంచినీళ్లు తాగిస్తూ ఏమైంది అమ్మ నీకు ఒంట్లో బాలేదా. గొడవ ఎందుకు ఇప్పుడు నాన్న అని అడిగింది తండ్రిని.

మీ అమ్మకి పది రోజుల నుంచి దగ్గు జ్వరం తగులుతున్నాయి తల్లి. మనకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ కి చూపిస్తే ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు రాసి ఇచ్చి తగ్గకపోతే కరోనా టెస్ట్ చేయించమన్నారు.

మీ తమ్ముడు ఏమో మీ అమ్మకి వచ్చింది కరోనాయే అని ఎక్కడైనా ఉండి తగ్గక ఇంటికి రమ్మంటున్నాడు. లేదా ఇలా బయట ఉండమని అంటున్నాడు.

బయట చూస్తే విపరీతమైన చలి గాలి మంచు కురుస్తున్నాయి. చూసిన వాళ్లు ఏమైనా అనుకుంటారని భయం కూడా లేదు నీ తమ్ముడికి.

మీ అమ్మ ఒంట్లో బాగోలేనీ మనిషి ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అమ్మ. ఇలా బాగోలేని పరిస్థితుల్లో అది ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తుంది.

ఈలా బయట పడుకొని ఉంటే దాని ప్రాణం పోతుంది. తండ్రి కళ్ళ నీళ్ళు పెట్టుకోలేదు కానీ అతనికి గుండెల్లో తల్లి పట్ల ఉన్న ప్రేమ తనకి అర్థం అవుతుంది. పని తమ్ముడికి ఎందుకు అర్థం కావట్లేదొ అనుకుంటూ,

గీత తమ్ముడు వైపు తిరిగి ఏంటి బాలు ఇది నువ్వు ఇలా చేయడం తప్పు కదా. ఇప్పటికిప్పుడు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తారు.

తమ్ముడు కొంచమైనా అర్థం చేసుకోరా అనడంతో నాకేం చెప్పొద్దు అక్క నాకు చాలా భయం వేస్తుంది అమ్మకి వచ్చింది కరోనా అని.

ఇప్పటికే ఈ వీధిలో అరడజనుమంది పోయారు ఆ జబ్బుతో అంటూ గీత చెప్పే ఏ మాటలు వినడానికి సిద్ధపడలేదు అతను.

కావాలంటే అమ్మ ని తీసుకెళ్లి నువ్వు కొన్ని రోజులు

మీ ఇంట్లో ఉంచుకుని తగ్గాక పంపించు అనడంతో

ఇక చేసేది ఏమీ లేక మరదలు దివ్య వంక చూసింది.

ఆమె తనని కాదు తనకు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా అంతా మీ తమ్ముడు ఇష్టం మీ ఇష్టం నాదేముంది అన్నట్టుగా ఎటువైపో చూస్తోంది.

గీత వాళ్ళ పై వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ

సరే అమ్మని నాన్నని మా ఇంటికి తీసుకెళ్తాను కొన్ని రోజులు పోయాక వస్తారు.

అమ్మ ఒంట్లో బాగా తగ్గి కోలుకున్నాక పంపిస్తాను అంటూ లోపలికి వెళ్లి తల్లిదండ్రుల బట్టలు వారికి కావలసిన వస్తువులు బ్యాగ్ లో సర్దసాగింది.

నాన్నని తీసుకెళ్లడం ఎందుకులే అక్క నాన్నని ఇక్కడే ఉంచు. మళ్లీ నేను పనిలోకి వెళ్ళిపోతే దివ్య చంటి పిల్లాడు తో ఒక్కతే ఉంటుంది. అసలే ఈ ఏరియా అంత మంచిది కాదు.

ఏమైనా కావాలంటే తీసుకురావడానికి దివ్యకి తోడుగా ఉండడానికి ఇక్కడ ఎవరో ఒకరు అవసరం కదా. అది కాక నాకు నైట్ డ్యూటీలు. అక్క నాన్నని ఉండనివ్వు అన్నాడు బాలు.

గీత చూసిన చూపుకి శక్తి ఉంటే అతను భస్మమై పోయి ఉండేవాడు. అంత కోపంగా చూసింది. ఊరెయ్ నేను ఊరుకుంటున్నాను కదా అని మరి పశువులాగా మాట్లాడకు. అమ్మ నాన్న పెళ్లి అయ్యి 40 ఏళ్ల పైనే అవుతుంది. మనకి ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళిద్దరూ విడివిడిగా రెండు మూడు రోజులకు మించి ఉండడం చూసామా,

నాన్న ఒంట్లో బాగా లేని అమ్మ దగ్గర ఉండడమే ఇప్పుడు చాలా అవసరం,నేను ఇద్దర్ని తీసుకెళ్తాను అంటూ ఆటో పిలిచి తల్లిని జాగ్రత్తగా ఎక్కించి రండి నాన్న అంటూ తండ్రిని కూడా పిలిచింది.

పరవాలేదు అమ్మా. అమ్మని తీసుకువెళ్ళునేను ఈక్కడ ఉంటాను. ముందు మీ అమ్మని మంచి హాస్పిటల్ తీసుకెళ్ళమ్మ నాకు భయమేస్తుంది దాన్ని చూస్తుంటే అంటున్న తండ్రితో, అమ్మకి ఏమీ కాదు నాన్న ముందు లో బాగా భయపడే వారు కానీ ఈ జబ్బుకి ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి హాని జరగదు.

అయినా చలికాలం కదా, దగ్గు జలుబు ఇలాంటివన్నీ ఈ కాలంలో మామూలే అమ్మకు ఏమీ కాదు మీరు బెంగ పెట్టుకోకండి నాన్నా, అయినా అమ్మ మీరు తనతో పాటు ఉంటేనే హ్యాపీ గా ఉంటుంది.

మీరు కూడా పదండి మన ఇంటికి, కొన్ని రోజులు పోయాక అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక అమ్మతో పాటు మళ్ళీ తిరిగి వద్దురు గాని అంటున్న గీతతో అల్లుడు ఏమంటాడో తల్లి సందిగ్ధం గా అంటున్న తండ్రితో అందరూ మీ కొడుకు ల్లాగా ఉండరు పదండి నాన్న అంటూ దారిలో వచ్చేటప్పుడే ఒక హాస్పిటల్ దగ్గర ఆపి తల్లిని చూపించింది డాక్టర్కి.

అతను మామూలు దగ్గు జలుబు జ్వరమే అంటూ

ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు రాసిచ్చారు. బాగా ఆవిరి పట్టమని తినేది తాగేది ఏదైనా వేడిగా తినమని

మాస్క్ కంపల్సరీ అని కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించేశారు. గీత తల్లిదండ్రులను తీసుకుని ఇంటికి వచ్చింది.

గీత భర్త రాజేష్ మంచి మనిషి అత్తమామల్ని కూడా తన అమ్మ నాన్న లాగే చూసుకున్నాడు. పది రోజుల్లో తల్లి బాగా కోలుకుంది. తల్లి ఆరోగ్యం బాగు అయ్యాక తండ్రి మొహంలో వెలుగు వచ్చింది. చక్కగా మనవళ్లతో ఆడుకుంటూ ఆనందంగా ఉన్న తల్లిదండ్రులను చూస్తే గీతకి కడుపునిండినట్లుగా ఉంది

ఇంతలో ఒక రోజు పొద్దున్నే మరదలు దివ్య నుంచి ఫోను. నన్ను క్షమించండి వదిన అంటూ, ఏమైంది అంటూ అడిగింది గీత. మా నాన్నగారికి కరోనా వచ్చిందంట. మా అన్నయ్య కూడా మీ తమ్ముడు

లాగే మాట్లాడుతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.

నేను మీలా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అత్తయ్య విషయంలో నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది బుద్ధొచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంది దిగులుగా దివ్య

గీతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదివరకు గవర్నమెంట్ వాళ్లే కరోనా వచ్చిన వాళ్ళని క్వారంటైన్ కు తరలించేవారు. అప్పుడు సమస్య ఉండేది కాదు.కానీ కేసులు బాగా పెరిగి పోయిన తర్వాత హాస్పిటల్స్ సరిపోక ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఉండమంటున్నారు.

మళ్లీ ఇప్పుడు కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. పరవాలేదు అనుకునేటప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పెద్ద ఇల్లు ఉండి ఒక్కొక్కరికి ఒక గది ఉన్న వాళ్లకు అయితే పెద్ద ఇబ్బందేం కాదు గాని తమలాంటి మధ్యతరగతి జీవుల కి చిన్న అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళకి కష్టమే అనిపిస్తుంది ఈ పరిస్థితి.

ఏది ఏమైనా తనదాకా వస్తే కానీ ఏది తెలియదు అంటారు మనుషులకి. ఇప్పుడు తన మరదలు విషయంలో కూడా అదే జరిగింది. అంతే మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. మనం ఎవరికీ ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది.

కష్టాన్ని ఇస్తే కష్టం సంతోషాన్ని ఇస్తే సంతోషం, ఎలాంటి విషయాలుకైనా మనుషుల మనస్తత్వాలే అసలైన కారణం కనీసం తమ్ముడు ఇప్పటికైనా మారి మంచిగా ఆలోచిస్తే బాగున్ను అని ఆలోచిస్తూ ఉండి పోయింది గీత.


రచయిత్రి పరిచయం : విన్నకోట శ్రీదేవి


నాకు రాయడం చదవడం అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సర కాలం నుంచి రాయడం మొదలు పెట్టాను. నేను పెద్దగా చదువుకోలేదు కానీ చుట్టుపక్కల జరిగే నిజమైన విషయాలను రాయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను. నావి రెండు కథలు సాక్షి ఫన్ డే లో కూడా ప్రచురితం అయ్యాయి. ఇంకా మంచి కథలు రాస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఇంకా ప్రతిలిపి. మామ్స్ప్రెసో. ఫేస్బుక్ ల్లో రచనలు చేస్తూ ఉంటాను.


235 views0 comments

Comments


bottom of page