top of page
Writer's pictureAduri Hymavathi

కర్తవ్యం యోగ ఉచ్యతే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


'Karthavyam Yoga Uchyathe' New Telugu Story

Written By Aduri Hymavathi


రచన: ఆదూరి హైమావతి




కారు పార్క్ చేసి తలపైకెత్తి చూశాను. నాకళ్ళు మెరిశాయి. నేను ప్లాన్ చేసి కట్టించిన భవనం. 'హృదయాలయ' ఆభవనం హృదయం ఆకారంలో ఉంటుంది. డాక్టర్. హృదయ్ కోరికమేరకు ఆభవనం నా అధ్వర్యంలో నిర్మించబడింది. హృదయంలో ధమనులు, సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగుతున్నట్లు, కొత్త టెక్నాలజీ ఉపయోగించి లైట్స్ ద్వారా రంగుల వెలుగులు ప్రవహించే లాగా చేసాము.


గేట్ నెంబర్ 1 వైద్యంకోసం రోగులు వచ్చేందుకు, రెండో గేటు నయమైన వారు ఆనందంగా వెళ్ళడంకోసం. మూడో గేటు ఎమర్జెన్సీ రోగులతో వారి బంధువులు ఏడుస్తూ లోనికి పరుగులు తీసేది. నాలుగో గేటు ప్రపంచం లోనే ఉత్తమ వైద్యుడైన హృదయ్ చేతిలో విఫలమై, ఇక ఆయుస్సు తీరిన వారి భౌతిక కాయాలు తరలించేగేటు.


ఎంత చిత్రం, ఆనందం, ఆందోళన, సుఖం, కష్టం సంతోషం, దుఃఖం, వైరాగ్యం, అన్నీ ఒకే భవనంలో వేర్వేరు ద్వారాలలో, మానవ జీవన సరళి ని, కళ్ళకు కట్టే దృశ్యాలు. అన్నీ గమనిస్తూ తలెత్తి పైకి చూసి ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయాను.


వి. ఐ. పీ. గేటు నుంచీ వెళ్లబోగా, వాచ్ మెన్ ఆపాడు. నేనూ, హృదయ్ కలసి ఉన్న ఫోటోతో ఉన్న విజిటింగ్ కార్డ్ చూపాక వెళ్ళనిచ్చాడు, నేరుగా లిఫ్ట్ లో మూడో అంతస్తులోని హృదయ్ గది వద్ద ఆగి, విజిటింగ్ కార్డిచ్చి పంపాను.

ఒక్క నిముషంలో తలుపు తెరుచుకుని వచ్చినతను, నన్ను లోపలికి వెళ్ళమని సైగచేశాడు. లోనికి అడుగు పెట్టగానే హృదయ్ వచ్చి చేతులు పట్టుకుని ఊపీ ఊపీ మన సారా ఆనందం వ్యక్తపరుస్తూ, ఆశ్చర్యంగా చూశాడు. నా ఒళ్ళు పులకరించి పోయింది.


నన్ను చేయిపట్టుకుని తనప్రైవేట్ గదిలోకి నడిపించాడు."ఎలా ఉన్నావ్! ఎన్నాళ్ళైంది నిన్నుచూసి! ఈ సర్ ప్రైజ్ తట్టుకోలేకపోతున్నాను." అన్నాడు. మాస్నేహం అలాంటిది.

" ఔను! ఈ పదేళ్ళుగా లోకమంతా తిరిగాను. అన్ని దేశాల్లోని భవన కట్ట డాలను పరిశీలిస్తూ అక్కడ కొత్త డిజైన్స్ లో ఆధునాతన భవనాలు కట్టిస్తూ మంచిగుర్తింపు పొందాను. ఎందుకో ఒకమారు నిన్నూ, నా మాతృ దేశాన్నీ చూడాలనిపించి వచ్చేశాను. ఎలాసాగుతున్నది జీవితం?ఏదో చాలా మార్పు కనిపిస్తున్నది!" అన్నాను.


" ఔను! నీతో చాలా విషయాలు చెప్పాలి. నాలో మార్పు తెచ్చిన సంఘటన ముందు చెప్తాను. ఇక్కడ కాదు టెర్రేస్ మీదకెళదాం"అంటూ బెల్ నొక్కాక, ఒక నర్స్ వచ్చింది."నేను టెర్రేస్ మీద ఉంటాను. అర్జెంట్ కేసైతేనే నన్ను పిలువు. లేకపోతే ‘డు నాట్ డిస్ట్రబ్ మీ"అంటూ అతని గదిలోని ప్రైవేట్ లిఫ్ట్ లోనన్ను టెర్రేస్ మీదకు తీసుకెళ్ళాడు హృదయ్.


అక్కడి వాతావరణం హృదయంగమంగా ఉంది. టెర్రేస్ గార్డెన్. మంచి అందమైన పూలూ, వాటి సువాసనా, అక్కడి చెట్ల పండ్లూ, కాయలూ అన్నీ కళ్ళకూ, మనస్సుకూ అద్భుతమైన ఆనందాన్నిస్తుండగా నడుస్తూ మాట్లాడు కోసాగాం.


హృదయ్ చెప్పసాగాడు." ఈభవన నిర్మాణమయ్యాక నాకు వచ్చిన గొప్ప పేరుతో పాటుగా, సంపాదనపెరుగుతుంటే, రోజులో నాకోసం వెచ్చించుకునే కాలం తరిగిపోసాగింది. తిననూ, త్రాగనూ, నిద్రపోనూ కూడా సమయం లేకుండా బిజీ ఐ పోయాను. అలాంటి ఒకరోజున బాగా విసుగనిపించి మధ్యాహ్నం 12 గం. లకు, విశ్రాంతిగా ఉండాలని లేవబోయాను. ఒక జంట తమ ఆరేడేళ్ళ పాపతో వచ్చారు.


ఒక్కచూపులోనే ఆపాప రూపం నామనస్సును కట్టేసింది.

ఆభార్యా, భర్తా నాకు నమస్కరించి నిల్చున్నారు. కూర్చోమని సైగచేసి ఆ పాపవైపు చూస్తూనే వారిచ్చిన ఫైల్ అందుకుని చూశాను. నా జూనియర్, సీనియర్ డాక్టర్లంతా రెండు రోజులుగా పరీక్షలు చేసి, వ్రాసిన రోగనిర్ధారక ఫైల్ అది. ఆపాప ఫోటో ఉండటాన ఆఫైల్ ఆపాపదని తెలుసుకున్నాను.

ఫైల్ అంతా చూసి తలెత్తి ఆపాపవైపు చూశాను.


" నర్స్! ఈపాపను పక్కగదిలోకి తీసుకెళ్ళి ఆ టాయ్స్ అన్నీ చూపు" అన్నాను.


పాప నావైపుచూస్తూ"నమస్కారం డాక్టర్! 'మీపాప కొద్దిరోజులే బ్రతుకు తుంది. చాలా తీవ్రమైన గుండెజబ్బు. ఆపరేషన్ చేసినా, చేయకున్నా అంతే. 'అనే కదా మీరు చెప్పబోయేది, మా అమ్మా నాన్నలకు! . ఉదయం నుండీ డాక్టర్లంతా ఇదే చెప్తున్నారు. మీరూ ఇప్పుడు అదే చెప్తారు. చెప్పండి డాక్టర్, నేను మరో గదిలోకి వెళ్ళక్కరలేదు. నాకేమీ భయంలేదు."అంది.


ఆశ్చర్యపోయాను. తల్లితండ్రులముఖాలు చాలా విచారంగా ఉన్నాయి. వారి కళ్ళు ఏడ్చిఏడ్చి ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. పాపమాత్రం నవ్వు ముఖం తోనే ఉంది.


"మీపాప చాలా తెలివైంది. ధైర్యం కలది. ఇంత చిన్న వయస్సులో ఎంత స్థిత ప్రజ్ఞత! సరే చెప్తాను. అవును మీరు చాలా ఆలస్యంగా విషయం తెలుసు కున్నారు. మా స్టాఫ్ చెప్పినట్లు, ఈ రిపోర్ట్స్ బట్టీ నాకు తెలిసిందే మంటే మూడు మాసాలు ఎక్కువ. ఆపరేషన్ చేస్తే 70% బతికే అవకాశం తక్కువ. 30% అవకాశం ఉంటుందని చెప్పగలను. ఒక్కోమారు ఇలాంటి కేసుకు ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదే ఆపరేషన్ ప్రారంభంలోనే ప్చ్ --- చెప్పలేం, మీరే ఛాన్స్ తీసుకుంటారో ఆలోచించుకుని చెప్పండి" అని ఆగాను.


వారిరువురూ ఒకరిముఖాలొకరు చూసుకుని, సైగచేసుకుని తలలు ఊచు కుని"ఆపరేషన్ చేసేయండి, ఆపైన దేవునిదయ"అన్నారు.


"మీరంతా దేవుడు దేవుడని అన్నీ దాటవేసుకుని ప్రమాదాలు ఇలా తెచ్చు కుంటారు. సరే వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తిచేసి, మీరు ఆపరేషన్ సక్సెస్ గురించీ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. జాయిన్ చేయండి, సరిగ్గా వచ్చేవారం మధ్యాహ్నం 12 గం. ఆపరేషన్ ఉంటుంది. ఈరోజు గురువారం కదా! వచ్చే గురువారం అన్నమాట. నేనేచేస్తాను. ఈలోగా మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది."అంటూ నేను నా టేబుల్ ట్యాప్ లో చూసి ఖాళీ గా ఉన్న 9వ నెంబర్ గది వారికి అలాట్ చేయమని సూచించాను.


పాప నావైపు చూసి" థాంక్స్ డాక్టర్! మా అమ్మా నాన్నలకు మరో మూడు నెలలు నాగురించీ దిగులుతో భోజనం, నిద్రా దూరం చేయకుండా వారం లోకి తెచ్చినందుకు" అంటూ నవ్వుతూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపింది. ఆపాప విజ్ఞానానికీ, విజ్ఞతకూ అమితాశ్చర్యపోయాను.


"వాళ్ళ బామ్మ వద్ద సంగీతమూ, పురాణగాధలూ, వేదమూ కూడా నేర్చు కుంటుంది పాప."అని చెప్పింది ఆపాప అమ్మ.


రోజూ ఆపాపకు చేయాల్సిన మరికొన్ని పరీక్షలయ్యాక, నేనే గదికి వెళ్ళి రిపోర్ట్స్ చూసి పాపను పలుకరించి వచ్చేవాడిని.


పాప రోజూ నుదుట విభూదితో కనిపించేది." మా అమ్మ నాగుండెకూ విభూది వ్రాస్తున్నది డాక్టర్, పిచ్చిది. నేనంటే అమిత ఇష్టం. నాన్న నన్ను చూడలేక బయటే ఏడిస్తూ ఉన్నాడు. అమ్మమాత్రం నాదగ్గరే ఉంటూ స్తోత్రాలన్నీ చదువుతున్నది. మార్కండేయుని శివుడు కాపాడినట్లు నన్ను కాపాడమని అమ్మ శివుని ప్రార్థిస్తున్నది." అనేది పాప నాతో.


"డాక్టర్! మా అమ్మా నేనూ రోజూ ‘త్రయంబకం’ మృత్యంజయ మంత్రం ‘ చదువుతున్నాం. నాకేమీ భయంలేదు. ఇదో మా అమ్మేభయపడుతున్నది." అంటూకిలకిలా నవ్వుతూ, అరిందా కబుర్లు చెప్పేది.


వారమైంది. ఆపరేషన్ గదిలో టబుల్ మీద పాపను తెచ్చి పడుకోబెట్టారు.

మత్తు మందు ఇవ్వబోతూ"పాపా భయంగా ఉందా!" అన్నాను. .

"లేదు డాక్టర్! నాకేం భయం.! నాదో కోర్కె. తీరుస్తారా!" అంది.

"చెప్పుపాపా!" అన్నాను. .


"హంతకులకు మరణ శిక్ష విధించేముందు, వారి చివరికోరిక తీరుస్తారుటగా, మాబామ్మ కధలో చెప్పింది లెండి. నాకూ ఒక చివరికోరిక ఉంది, మత్తు మందు ఇచ్చేలోగా మీతో చెప్పాలి" అంది.


ఎందుకో నామనస్సు చివుక్కుమంది. అప్పటికి కొన్ని వేలవేలఆపరేషన్స్, ఎంతో క్రిటికల్ ఐనవీ చేసిననేను ఎప్పుడూ చలించలేదు.

"చెప్పు పాపా!" అన్నాను. ఆమెమాటలతో నేను మరణశిక్షవిధించే వ్యక్తిలా ఉన్నందుకు బాధేసింది.


"ఏమీలేదు డాక్టర్! అందరి గుండెలో దేవుడుంటాడుట కదా! నాగుండె మీరు కోస్తారుకదా! ఔనా! 'ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండె కోయటమేగా!" అంది.

"ఔను ఐతే దానిని సరిచేయనే కోస్తాను" అన్నాను.


"దేనికైనా సరే. మీరు కోసినపుడు నా గుండెలోని దేవుని మీరు చూసి, వీలుంటే ఫోటో తీసి, నేను బతికి ఉంటే తర్వాత నాకు చూపించండి. లేదా ఎలా ఉన్నాడో, మీతో ఏమైనా మాట్లాడి ఉంటే, అదికూడా నాకు చెప్పండి. నేను మీరంతా అన్నట్లు చనిపోతే- దేవుడెలాఉన్నాడో, ఏమన్నాడో మా అమ్మా నాన్నలకు చెప్పండి. ఇదే నాచివరికోరిక"అంది ఆపాపం. నాగుండె కోసినట్లైంది.


"అలాగే పాపా! అసలు దేవుడెక్కడున్నాడు! లేడుకదా! ఒకవేళనీవు చెప్పి నట్లు దేవుడు ఉంటే అక్కడ ఉంటాడను కోను. ఐనా నీవు చెప్పినట్లే చేస్తాను" అని మాటిచ్చి మత్తుముందు ఎక్కించాము.


కాసేపటికి కళ్ళు మూసుకుని త్రయంబకం యజామహే ’ అనే మృత్యంజయ మంత్రం చదువుతూ, మత్తులోకి జారుకుంది. నేను త్వరగా గుండె ఆపరేషన్ మొదలుపెట్టాను. నాచుట్టూ పదిమంది వైద్యులు, అన్నీ అందించను నేర్పరు లైన నర్సులూ ఉన్నారు.

గుండెకోత మొదలుపెట్టాను. చిత్రం ఒక్క బొట్టు రక్తం ఏమాత్రం బయటికి రాలేదు. నేను ఆశ్చర్యంలో మునిగి పోయాను. గుండె కోస్తే రక్తం రాకుండా ఎందుకు ఉంటుంది? ఎలాఉంటుంది? కొన్ని వేల ఆపరేషన్స్ చేసిన నా అనుభవం నన్ను వెక్కిరిస్తున్నది. పాప పల్స్ రేటు పడిపోతున్నది.


పాప నన్ను అడిగిన చివరి కోరిక" నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారుటకదా! అంటే నాగుండె కోస్తారుట కదామీరు! అప్పుడు నాగుండెలో ఉండే దేవుని చూసి, వీలుంటే ఫోటోతీసి నేను బ్రతికితే నాకు చూపండి. . ." నా కళ్ళమ్మట వచ్చిన నీటితో నా కళ్లజోడు తడిసి పోయి ఏమీ కనపడటం లేదు. నాచుట్టూ ఉన్న డాక్టర్లంతా నేను ఏమి చెప్తానా అని చూస్తున్నారు.

నేను వచ్చే దుఃఖం ఆపుకుని, గొంతు సవరించుకుని"మిషన్లన్నీ ఆపేయండి. ఈ బాలిక జీవంతో లేదు. శ్వాస ఆగిపోయింది. ఆపరేషన్ అక్కరలేదు." అని చెప్పాను. అంతా ఆ మిషన్లన్నీ ఆపేశారు.


"నేను లేదనుకుంటున్న, ఆపాప ఉన్నాడంటున్న దేవుని మహిమా ఇది? శరీరశాస్త్రంలోకానీ, వైద్యశాస్త్రంలోకానీ గుండెకోస్తే రక్తం రాకపోడం లేదే! ఏమిటిది! ' అనే ఆలోచనలో ఉన్నాను.


ఐదో, పదో క్షణాలై ఉంటుంది. ఉన్నట్లుండి నా పక్క జూనియర్ డాక్టర్"సార్! గుండెనుండీ రక్తం వస్తున్న ది" అనికేకేశాడు.


వెంటనే" మిషన్లన్నీ ఆన్ చేయండి, నర్స్ నాకళ్లజోడు తడిసిపోయి ఏమీ కనిపించడం లేదు. తీసి తుడిచి పెట్టు"అని అరిచాను. నర్స్ కళ్లజోడు తుడిచి కళ్ళకు పెట్టింది.

గుండెను పనిచేయించను పెట్టిన మిషన్ ఆడుతున్నది. గుండెనుండీ రక్తం రావడం చూసి, ఆపరేషన్ మొదలు పెట్టాను."ఏమిటీ అద్భుతశక్తి! , ఇది నిజం గానే దేవుని మహిమా! లేక ఆపాప విశ్వాసమా!"అనుకున్నాను.


సుమారుగా ఐదు గంటలు ఆపరేషన్ జరిగింది. అక్కడే టేబుల్ మీదే ఆ పాపను మరికొంతసేపు ఉంచి ఐ. సి. యుకు తరలించారు.


నేను డ్రెస్ మార్చుకుని, బయటికి రాగానే ఆపాప తల్లితండ్రులు నా వద్దకు వచ్చారు."మీపాప ఆపరేషన్ సక్సెస్ ఐంది, పాప ఇక 60 సంవత్సరాలు గ్యారం టీగా బతుకుతుంది." అనిచెప్పగానే వారిద్దరూ నా రెండు పాదాల మీదా తలలు ఉంచి, కన్నీటితో నాకు పాదాభిషేకం చేసారు.

అయ్యా! మీపాపను ఎవరైతే కాపాడారో ఆదేవునికి అభిషేకం చేయండి. ఇది నా తెలివి, విజ్ఞానం వల్ల జరగ లేదు, కేవలం పాప విశ్వాసం, ఆదేవుని మహిమ వలన జరిగింది." అనిచెప్పాను.


రెండో రోజు పాపను చూడను విజిట్కెళ్ళాను. కళ్ళుతెరిచి నన్ను చూసి, " డాక్టర్ దేవుని చూసిన మీతో ఆయన గురించీ తెలుసుకోను నన్ను ఆయన బ్రతికించాడు. చెప్పండి డాక్టర్ దేవుడెలా ఉన్నాడు? మీతో మాట్లాడాడా! ఏమన్నాడూ?"అని అడిగింది.


" పాపా! భగవంతుని మన కళ్లతో చూట్టంకాదు, చూడలేము అనుభూతి చెందాలి. నేను ఆ అనుభూతి చెందాను పాపా అదీ నీవల్ల, ఆయన అద్భుత శక్తిని చూశాను. థాంక్స్ పాపా"అని చెప్పగానే పొంగిపోయింది.


ఇంతకాలం నేను చాలా తెలివైన వైద్యుడినని అహంకరించినందుకు చాలా సిగ్గేసింది. దైవాన్ని నమ్మినవారిని హేళనచేస్తూ, కేవలం తెలివి తక్కువ వారే దైవాన్ని నమ్ము తారనీ, విజ్ఞానం ముందు దైవమేమీ చేయ లేడనీ, ఏదేదో మాట్లా డిన నా మొండితనం నన్నువెక్కిరించ సాగింది. దైవశక్తి ముందు ఏశక్తీ ఎక్కువకాదనే విషయం తెలిసొచ్చింది. నాలో సంస్కారం రెక్కలువిప్పుకుంది. భారతీయ సంస్కృతి మహిమతో భావోద్వేగానికి లోనయ్యాను. నాలో ఆపాప వెలిగించిన దైవ విజ్ఞానజ్యోతి కాంతికి తట్టుకోలేకపోయాను.


అందుకే నీవు కట్టించిన గుండె ఆకారపు హాస్పెటల్ మధ్యలో దేవుని చిత్రం అమర్చాను. ఆపరేషన్ ధియేటర్లో కూడా దేవుని ఫోటో ఉంచుకుని ప్రతి ఆపరేషన్ చేసే ముందు, 'నేను నిమిత్త మాత్రుడిని, నీవే నాచేత ఆపరేషన్ సరిగా చేయించు దేవా! నా శక్తీ, తెలివీ ఏమీ లేవు, అంతా నీమహిమ మాత్రమే' అని ప్రార్థించుకుంటాను." అని సుదీర్ఘంగా తన అనుభవం నాకు వివరించాడు హృదయ్.


' ఈ పాప మరో పదేళ్ళ ముందు ఆపరేషన్ కోసం నావద్దకు వచ్చి ఉంటే నిన్ను మిస్ అయ్యే వాడిని కాదు. ఇలా అన్నీ ఉండీ ఏకాకి జీవితం గడిపే వాడిని కాదు. కేవలం నీకున్న దైవవిశ్వాసాన్ని అంగీకరించలేక, నీ అభిప్రాయం తో ఏకీభవిం చలేక నిన్ను దూరం చేసుకున్న నా అదృష్టాన్ని ఎవ్వ రూ తిరిగి ఇవ్వలేరు ప్రశాంతీ! ." అంటూ కళ్ళుతుడుచు కుంటున్న, హృదయ్ ని, ఆలింగనం చేసుకుని"నేను ఇవ్వగలను"అన్నాను.

***శుభం***


ఆదూరి హైమావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



పరిచయ వాక్యాలు .

శ్రీయుతులు మన తెలుగు కథలు సంపాదకుల వారికి , హృదయపూర్వక నమస్కారాలతో,

ఆర్యా! సాయిరాం!

నేను విశ్రాంత ఉపాధ్యాయినిని. పిల్లలతో 40 సం.కాలం మెలిగినందున ఎక్కువగా పిలల్లకోసం కథలు వ్రాయడం అభ్యసనమైంది .నాలుగు కథల పుస్తకాలు భగవంతునిదయతో అచ్చయ్యాయి. ఈ 2020 లో 108 మానవతావిలువలకు ఉపవిలువల తో ఒక శత కధా సుమమాల అనేపేర పుస్తకం అచ్చైంది.

కేవలం బాలలను దృష్టిలో ఉంచుకుని భగవంతుడు చేయించినది ఇది. సుమారుగా 10,12 పుస్తకాలు, జంతువులు, పక్షులు, పుషాలు,వృక్షాలగురించీ కథల పుస్తకాలూ ఇ బుక్స్ గా కినిగెలో ఉంచడం జరిగింది. అమెరికానుండీ వెలువడే వెబ్ మ్యాగజైన్లో గత కొంత కాలంగా వస్తున్న సామెతలతో చక్కని కథలు అనే పేర ప్రచురించబడిన కథలను ఇ బుక్ గ్రా క్రితం మాసంలో రూపొందింది. సమాజంలో విషయాలు చూస్తూ వింటూ కొన్ని కథలను రూపొందించడం జరుగుతున్నది.అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి, కొన్నింటికి బహుమతులుకూడా వచ్చాయి.

మొన్న కెనడా డే సందర్భంగా వారు నిర్వహించిన కథలపోటీలో ' క్షుత్తు ' అనేకథకు బహుమతి వచ్చింది

భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ బాలవికాస్ గురువుగా గత 40 సం.రాలుగా మానవతా విలువలను సమాజంలో బాల బాలికలకు ఉచితంగా నేర్పించే గురువులకు ట్రైనింగ్ ఇచ్చేకార్యక్రమంలో రాష్ట్రమంతా గత 35 సం. సంచరించడం స్వామివారి కృపే.

పుట్టపర్తి ఆశ్రమసేవలో సేవ చేసుకుంటూ అక్కడే ఉంటుండగా కరోనాకారణాన ఆశ్రమం మూసేయటాన ,ప్రస్తుతం బెంగుళూరులో అమ్మాయి ఇంట్లో మకాం.

ధన్యవాదాలతో,

ఆదూరి.హైమావతి



52 views
bottom of page