top of page
Original.png

కాశీనగర క్షేత్రపాలిక వారాహి దర్శనం


కాశీ క్షేత్రపాలిక శ్రీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద ఉదయపు దర్శనం కోసం నిలుచున్న భక్తులు.

Kasinagara Kshetrapalika Varahi Darsanam - Telugu Devotional Article | Sudhavishwam Akondi

కాశీనగర క్షేత్రపాలిక వారాహి దర్శనం తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 06/08/2026


కాశీ విశ్వనాథ క్షేత్రంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో క్షేత్రపాలిక శ్రీ వారాహి అమ్మవారు ఒకరు. లలితా పరమేశ్వరి సర్వసైన్యాధ్యక్షురాలిగా, కాశీ నగరాన్ని రక్షించే దివ్యశక్తిగా భక్తులు ఆమెను ఆరాధిస్తారు. ఉదయపు ప్రత్యేక దర్శనం, గర్భగుడిలోని అపూర్వమైన శక్తి, రంధ్రాల గుండా జరిగే అరుదైన దర్శనం, కాశీ వీధుల్లో భక్తి నింపే అనుభూతులు—ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక యాత్రను మరపురానిదిగా మారుస్తాయి. సుధావిశ్వం గారి అనుభవాలతో కూడిన ఈ యాత్రా కథనం ప్రతి శివభక్తుడికి, శక్తి ఉపాసకుడికి ఒక దివ్యానుభూతిని అందిస్తుంది.


వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదా! ఓసారి కాశీనగరంలో క్షేత్రపాలికగా కొలువైన వారాహి మాత దర్శనం చేసుకుందామా! ఇదివరలో వ్రాసిన పోస్ట్ నే.. !


కాశీ క్షేత్రంలో లెక్కలేనన్ని మందిరాలున్నాయి. ప్రళయకాలంలో కూడా వుండే క్షేత్రం కాశీ. విశ్వనాథునికి ప్రియమైనది. అటువంటి కాశిని ఎంత వర్ణించినా తక్కువే. మేము దర్శించిన కొన్నింటిని మాత్రం వివరించాను కాశీ దర్శనంలో!


 కాశీ క్షేత్రపాలిక వారాహి అమ్మవారిని స్మరించుకుందాం!


వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. ఇక కాశీ నగర క్షేత్ర పాలిక. వారాహి అమ్మ రాత్రంతా కాశీ క్షేత్రం అంతా తిరుగుతుంది. ఉదయం తన మందిరానికి వస్తుంది. అప్పుడు పూజాదికాలు చేసి మూసివేస్తారు మందిరాన్ని. ఇక అమ్మవారు రోజంతా విశ్రమిస్తుంది. అమ్మ మహాశక్తి స్వరూపం. అందుకే ఇక్కడ 5. 30 నుంచి 7. 30 వరకే ఆలయం తెరిచి ఉంచుతారు. ఈమధ్య కాస్త టైం పెంచారు! భక్తుల తాకిడి పెరగడం వల్లనేమో!


5. 30 కి తెరిచి అర్చకులు చేసే పూజలు చేసి దర్శనానికి అనుమతిస్తారు. కానీ అర్చకులు తప్ప మూర్తి వద్దకు ఎవ్వరూ వెళ్లకూడదు. ఎందుకంటే అక్కడి అమ్మవారి శక్తిని సామాన్యులైన మనం తట్టుకోలేము అని ఆ నియమం పెట్టారు. 


ఇక అర్చకులు ప్రత్యేక నియమ నిష్టలతో అమ్మ వద్దకు వెళ్లి, పూజాదికాలు త్వరగా చేసుకుని వచ్చేస్తారు ఎక్కువసేపు ఉండకుండా. అమ్మవారు గర్భగృహంలో ఉంటుంది. పైన రెండు చోట్ల కన్నాలుంటాయి. అక్కడ్నుంచి దర్శనం చేసుకోవాలి. 


 ఇక వెళదాము... 


విశాలాక్షి అమ్మ దర్శనం అవ్వగానే అక్కడ్నుంచి ఎడమవైపు, కుడివైపు మలుపులు తిరుగుతుంటే వారాహి మందిరం అని చిన్న బోర్డ్ కన్పిస్తే ఆ సందులో ముందుకు నేరుగా వెళితాము. 


ఆ సందుల్లో వెళుతుంటే చాలా ఆవులు ఏమి అనకుండా తిరుగుతూ కన్పిస్తే, వాటికి ఒక నమస్కారం చేసుకుని ఇంకా ముందుకు వెళుతూ ఉంటాం!


ఆ సందులోనుంచి చూస్తే గంగానది కన్పిస్తుంది. మనం ఎత్తైన ప్రదేశంలో ఉంటాం కనుక. అక్కడ పూలు, గాజులు అమ్మేవాళ్ళు, కుడివైపు తిరిగి నాలుగు అడుగులు వేయగానే కుడి వైపున సింహద్వారం, మెట్లు కన్పిస్తే, మెట్లెక్కి పైకి వెళ్ళగానే కుడి వైపు వారాహి మందిరం. 


అమ్మకు పూజ జరుగుతోంది, దర్శనానికి వేచివుండండి అంటే, అక్కడే కూర్చుని చుట్టూ చూస్తే అంతా గుట్టలు. అక్కడే పైన రావిచెట్టు, దాని కింద శివలింగం, చిన్ని వినాయకుని మూర్తి పెట్టి ఉంటే నమస్కారం చేసి, చుట్టూ చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపై పక్షుల రూపంలో తపస్సు చేసుకుంటున్న భక్తులు కనిపిస్తారు. 



ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ మైమర్చిపోతుంటే దర్శనం మొదలైంది అని చెప్పగానే, ఒకావిడ మందిరం అరుగు పైన కూర్చుండి, ఉంటుంది, ఎదురు అరుగు పైన ఒక అర్చకుడు కూర్చుని కుంకుమ తీసుకొమ్మంటే, తీసుకుని నొసట ధరించి, ప్రసాదం పెడితే పొట్లం కట్టుకుని రెండు అడుగులు వేయగానే పక్కన ఉన్న శివలింగానికి నమస్కరించుకుంటాం!


వెంటనే కుడివైపు తిరిగితే మందిర ద్వారం గుండా లోపలికి అడుగుపెడుతూనే ఏదో గొప్ప అద్భుతమైన శక్తి తరంగాలు మన శరీరాన్ని తాకుతుంటే, ఆనందోద్వేగంతో లోపలికి వెళ్లి, అక్కడ ఉన్న రంధ్రం గుండా కళ్ళు పెట్టి మోకాళ్లపై వంగి అమ్మను చూస్తే అద్భుతమైన అమ్మ ముఖం, పెద్ద కళ్ళు, మందహసంతో కూడిన పెదవులు, తేజస్సుతో కూడిన ముఖం చూసి అద్భుతమైన అనుభూతి కలిగితే లేవండి అని అర్చకులు అంటూ ఉంటారు!



లేచి మళ్ళీ రెండు అడుగుల దూరంలో ఉన్న ఇంకో రంధ్రం గుండా మళ్ళీ దర్శిస్తే పెద్దగా ఉన్న అమ్మ పాదాలు, వేళ్లకున్న ఆభరణాలు ఇదంతా చూసి తన్మయత్వంలో అమ్మా! అని పిలవకుండా ఉండలేక గట్టిగా అమ్మా అని పిలిస్తే, అమ్మ అభయహస్తం చూపిస్తే అదే తన్మయత్వంతో అమ్మను విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి బయటకు వస్తాం. 


అలా దర్శనం చేసుకుని బయటకు వస్తే ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటే, మళ్ళీ అడుగుతూ బయటకు వస్తాం. 



విశ్వనాథుని ఏకాంత సేవ:


రాత్రికి ఏకాంతసేవ టికెట్ తీసుకుని మళ్ళీ డుంఠి గణపతిని పలుకరించి మొదటి గేటులో చెకింగ్ చేయించుకుని లోపలికి వెళ్ళి లక్ష్మినారాయణులను దర్శించి, అమ్మను, శివలింగ స్వరూపాలను దర్శించి, కాశీ విశ్వేశ్వరుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటే ఆయనకు నమస్కరించి వెళితే


అందరిని నాలుగువైపుల ద్వారాల ఎదురుగా కూర్చోబెడితే, అక్కడ కూర్చున్న జనాలు కనిపిస్తారు. వెంట తీసుకెళ్లిన పంచెలచాపు అర్చకులకు ఇస్తే వాళ్ళు స్వామి కట్టుకుంటారని తీసుకుంటే, కన్పించేట్టుగా చోటు దొరికింది హమ్మయ్య అని కూర్చుని చూస్తుంటే, ఇంతలో పక్కన ఉన్న తెలుగువాళ్లు మీరు చాలా అదృష్టవంతులు, స్వామి మీరు ఇచ్చిన పంచె కట్టుకుంటున్నారు అంటుంటే.. 

ఇంతలో చుట్టూ అందరూ మాయమయిపోయి ఆ మందిరంలోకి అమ్మ వచ్చి "ఇదిగోండి చూడండి నా చీర బావుందా నాకు ఎరుపు ఇష్టమని, ఈ పట్టుచీర తెచ్చింది మన చిట్టితల్లి" అంటే

" చాలా బావుంది" అని స్వామి ప్రశంసిస్తూ.. 

 " చూడు నా పంచె, నాకు సౌకర్యంగా ఉంటుందని, మెత్తగా వుండే ఈ పంచ తెచ్చింది చిట్టితల్లి" అనగానే అమ్మ చిరుమందహసం చేసింది


నిజంగానే నా కళ్లలో నీళ్లు.. ఆనంద భాష్ప ధారలు... 


 "అమ్మా! నేను తేవడం ఏంటి? నా ద్వారా మీరు, మీరు సృష్టించినవే తెప్పించుకుని నాకీ అదృష్టం కలుగజేశారు" అంటూ ఆ ఆనంద తన్మయత్వంలో వుండగానే.. 


పూజాదికాలు అయిపోయి, పవళింపు సేవ చేసేశారు. మీరందరూ కూడా పడుకోండి అని అమ్మానాన్న ఏకాంతసేవకు వెళ్ళగానే నెమ్మదిగా బయటకు వచ్చి సత్రం వైపు నడిచాము. 


ఈ విషయం మీకు తప్పకుండా చెప్పాలని అనిపించి ఈ పోస్ట్ లో పెడుతున్నాను. మొన్నామధ్య కాశీ వెళ్ళినప్పుడు దశాశ్వమేధ్ ఘాట్ రోడ్ లో గంగానది నుంచి వస్తుంటే, ఒక వ్యక్తి శరీరం అంతా తెల్లగా విభూది పూసుకుని, ముతక బట్టలు వేసుకుని వున్నాడు. ఒక పిచ్చివాడిలా వున్నాడు చూడడానికి. అతని చేతిలో విస్తరాకు పట్టుకుని వున్నాడు. అందులో అన్నం, సాంబారు అనుకుంటా కలిపి చేత్తో ఒక ముద్ద ఆవు నోటికి అందిస్తున్నాడు. అది ఆబగా తింటోంది. మరో ముద్ద తను నోట్లో పెట్టుకుంటున్నాడు. అతడు ఈ లోకంతో సంబంధం లేనివాడిలా అలా అవుకు పెట్టి, తను తింటూ ఆనందిస్తున్నాడు. ఈ విచిత్రమైన దృశ్యం మా కంట్లో పడింది. ఎవరో మహాత్ముడేమో అనుకున్నాం. 


సర్వం శ్రీ విశ్వేశ్వరార్పణమస్తు.. 


🙏🙏🙏🙏🙏

సుధావిశ్వం 


సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page