'Kathalo Katha' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'కథలో కథ' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అంబరాంబర్ తాతలాస్తి తగలేస్తు కాలం గడుపుచూ సోమరికి మారు పేరుగా నిలుస్తాడు. భార్య త్రిపుర సుందరికి ఇది నచ్చదు- కూర్చొని తింటే గుట్టలైనా మిగలవనే సత్యం తెలిసిన ఇల్లాలు. రోజూ భర్తతో పోరు పెడుతూ ఉంటుంది త్రిపుర సుందరి ఏదైనా కష్టము చేసి డబ్బు సంపాదించమని- లేదా ఏదేని వ్యాపారము చేయమంటుంది.
అంబరాంబర్ మాత్రము సరే నంటాడు కాని కదలడు మెదలడు- డబ్బు అవసరమున్నప్పుడల్ల ఏదో ఒక ఆస్తి అమ్మడము, అవసరాలు తీర్చుకోవడమూ చేస్తుంటాడు.
ఆ దంపతులకు సంతానము ఇద్దరు- ఒక కొడుకు విశ్వంభర్, కూతురు మానస.
పెద్దవాళ్ళెవరూ లేరు. పారంపర్యంగా వచ్చిన ఆస్తి లో ఇప్పటికే ముప్పావు భాగం ఉపక్షయము చేస్తాడు అంబరాంబర్- ఉన్న నలుగురు కుటుంబ సభ్యుల పోషణ కొరకని. అతనికున్న మంచి లక్షణ మొకటే- తాగుడు, తిండి, జూదము, పొగ త్రాగుట ఇతర ఏ దురలవాటులు లేక పోవడము.
రోజు రోజుకు ధరలు పెరగడము, ప్రతి సంవత్సరము పిల్లల చదువుకయ్యె రుసుము అధిక మవడము మిగిలిన ఆస్తి కి ఎసరే కాని చిల్లి గవ్వ సంపాదన ఎరుగడు అంబరాంబర్.
త్రిపుర సుందరికి మాత్రము భయమేస్తుంది ఈ మిగిలిన ఆస్తి కూడా కైంకర్యము పట్టిస్తె నలుగురు బతికేదెట్ల, పిల్లల చదువు కుంటు పడుతుంది, జనములో ఇంకా మిగిలిఉన్న ఆ కాస్త మర్యాద మంట్లో కలిసి పోతుంది- ఎందుకీ దౌర్భాగ్యము భగవంతుడా అని చింతిస్తుంది.
ఒక ఉపాయము మాత్రము చేస్తుంది త్రిపుర సుందరి- భర్త విచ్చలవిడిగా వ్యయము చేస్తుంటె తనకూ కొంత సొమ్ము అవసరమని అడిగి తీసుకొని ఎవరికీ తెలియకుండా కూడబెడుతుంది. ఆ సొమ్ముతో కొంత పొలము కొని పెడుతుంది భర్తకు తెలియకుండ.
ఏనుగు పోయి తోకలా మిగిలిన ఆస్తి గూడ ధ్వంసము పట్టించ కుండ భర్తకు ఒక కథ చెబుతుంది త్రిపుర సుందరి.
'పూర్వము ఒక సింహ బలుడనే రాజు ఉండెడి వాడు- ప్రజలు అతనిని బాగా మెచ్చుకునేవారు- ఎవ్వరికి ఆపద వచ్చినా ఆదుకొని ఖజానాలో సొమ్ము ఉన్నది లేనిది కూడా గ్రహించక పోయేవాడు- అప్పుడప్పుడు దివాను నచ్చ జెప్ప బూనినా వినకుండెడివాడు- పండ్రెండు సంవత్సరాలు వరుసగా వర్షాలు బాగా కురిసి కరువు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండెడివారు- దానితో సకాలములో ప్రజలు పన్ను కట్టడము చే రాజుగారి ఖజానా కూడా నిండుతుండెడిది. అప్పుడు ఎవరికి ఏ లోటు అనిపించలేదు.
తరువాతి కాలంలో వరుసగా వర్షాలు కురువక పోవడము చే ప్రజలు పంట లేనిది పన్ను కట్ట లేమని మొర పెట్టుకునేవారు. అడివి జంతువులు కూడా ఊళ్ళలోనికి రావడము, పక్షులు ఆహారము దొరకక అంతరించి పోవడము ఇత్యాది కష్టాలతొ దేశము అల్ల కల్లోలమైతుoటె రాజు గారికి ఏమి తోచని పరిస్థితి.
అప్పుడు రాజు గారి వైభవము మసకబారి అటు పన్నులు రాక ఇటు ప్రజల బాగోగులు పరిశీలించి ఆదుకొన లేక సతమతమయ్యేవాడు.
ఇటు ప్రజల ముందర పరువు బోవడము అటు సైన్యాన్ని కూడా పోషించ లేక పోవడము- పరదేశ రాజులు ఈ బలహీనత కనిపెట్టి ఎక్కడ దండయాత్ర చేస్తరో అని దిగులు చెందెడివాడు. వనరులన్ని అడుగంటగా చివరకు ఉరిపెట్టుకుంటాడు రాజు'.
ఈ కథ వింటూ “ఇక చెప్పకు సుందరీ {భార్యను ముద్దుగా పిలుచుకొనే పేరు}.. కథలోని అంతరార్థం, నీ ఆంతర్యం బోధ పడింది- ఇక నేను ఏదో ఒక వ్యాపారము చేస్తాను- ఉద్యోగము నాకు ఎవరూ ఈయరు, వయసుకూడా దాటి పోయింది” అంటాడు అంబరాంబర్.
చిట్ట చివరగా మిగిలిన పొలముతో సేద్యము చేయాలనుకుంటడు అంబరాంబర్. కాని పెట్టుబడికి డబ్బులు లేక బాధ పడుతుంటాడు. సాధ్వీమణి యైన త్రిపుర సుందరి భర్త అంగలార్చుట చూసి తను దాచుకున్న సొమ్ము అని చెప్పక తన స్నేహితురాలి దగ్గర అప్పు తెచ్చినాను అని వ్యయసాయ పెట్టుబడికి సరిపోను డబ్బు భర్త చేతికిస్తుంది.
తన సోమరితనానికి, పెద్దలు సమకూర్చిన ఆస్తి వ్యయ పరిచిన విధానానికి, భార్య చేత అప్పు దెప్పించిన పరిస్థితికి సిగ్గు పడుతాడు అంబరాంబర్-
“ఇకనైనా ఆలోచన వచ్చింది ఇక్కడికి ఇదే సంతోషం. ఇంకొక మాట చెబుత వినండి. విష్ణువును, శివుడిని పోల్చి చూద్దాం. విష్ణువుకు ఇద్దరు భార్యలు- ఒకామె పంటవలతి, ఇంకొకామె పైడినెలత- అయినా తన పెండ్లికి ఆర్భాటానికి పోయి కుబేరుని చెంత అప్పు దెచ్చి ఇంతవరకు తీర్చడాయె- అదే పరమ శివునికి కూడ ఇద్దరు భార్యలు- ఆయన లోక రక్షకుడైనా ఏ ఆర్భాటానికి పోక ఇద్దరు భార్యల పోషించుచున్నా చర్మధారియై భవనాసి పట్టుక తిరుగుతూ ఉంటాడు లోక రక్షణకై.”
“ఇక నాకు బుద్ధి వచ్చింది సుందరీ.. నన్నేమి అనబోకు సుందరీ” అంటాడు అంబరాంబర్.
పరివర్తన కలిగిన పతిని జూసి సంబర పడిపోతుంది త్రిపుర సుందరి.
తను దూరదృష్టితో కూడబెట్టిన సొమ్ము గురించి, దానితో కొన్న పొలము గూర్చి, స్నేహితురాలి చెంత అప్పుగా చెప్పిన అబద్ధము గూర్చి దాపరికము లేకుండా భర్తకు చెబుతుంది త్రిపుర సుందరి.
అంబరాంబర్ ఎంతో సంతోష పడుతూ ఒక పద్యము చదివి వినిపిస్తాడు భార్యకు.
బరువు బాధ్య తింట భార్యకె అధికము
ఉండి లేమి డనగ ఉచిత రీతి
సదన మందు తానె సరిపుచ్చు చుండును
ధర్మ భాగి నుండ ధర్మ మింట---
ఇక నిత్య కళ్యాణం- పచ్చ తోరణం అనకుoడ
పోకడనక పఠించు పొదుపు మంత్రంబు-
అనుచు సుఖ సంసార మార్గ మెంచుకుంటాడు అంబరాంబర్-
త్రిపురసుందరి తన కృషి ఫలించిందని సంతోషపడుతుంది..
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments