'Kelikunchika' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'కేలికుంచిక' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఉడ్వీశ్ చక్కటి సంప్రదాయము గలిగిన వారింట బుట్టిన ఏకైక సంతానం. తండ్రి రత్నాకర్, తల్లి యామిని.. పుట్టినదాది ఏలోటు ఎరుగడు. ఒక్కడే సంతానము అగుటచే ఆప్యాయతకు కూడా లోటు లేదు. తలిదండ్రుల శ్రద్ధతో చదువులో రాణింపేగాని వెనుకంజ లేదు.
యుక్తవయసు వచ్చే సరికి చదువంతా పూర్తి చేసి భవిష్యత్ బాట వెతుకుతున్న తరుణం లో రోహిణి అనే చక్కటి సౌందర్య రాశితో వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత ఏర్పడ్డ అన్యోన్య దాంపత్యము వారిది.
ఉడ్వీశ్ కు తోబుట్టువులు లేకున్నా ఒక ‘కేలికుంచిక’ మాత్రము ఉండి అతన్ని తరచు ఆట పట్టిస్తుంది. ‘శ్యాలకులు’ మాత్రం లేరు. ఆమె పేరు యవనిక. పెళ్ళీడు రాలేదు కనుక, అక్కతో పాటు వచ్చి అక్కకు తోడుగా ఉంటుంది. ఉడ్వీశ్ కు కాలక్షేపము.
చదువయింది. పెళ్ళీ జరిగింది ఇంకా తలిదండ్రుల మీద ఆధారపడటం ఇఛ్చగించక తన చదువుకు తగిన ఉద్యోగం చూసుకుంటాడు ఉడ్వీశ్. పట్ణవాసంలోనే ఉద్యోగం దొరుకుటచే పరవూరు పోవడము తప్పింది ఉడ్వీశ్ కు. తలిదండ్రులకు కూడ తోడు ఉండడము చే
కుటుంబమంతా ఒకచోట ఉండి ఏలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది సంసారం.
ఇంటిపనులలో అక్కకు తోడు కొత్తదనం పోయే వరకు ఉండాలని నిశ్చయించుకున్నది యవనిక.
కార్యాలయపు పనులు ముగించుకొని ఇంటికి వస్తూనే ‘కేలికుంచికా’ అని పిలుస్తాడు యవనికను.
“నాకు ఒక పేరు ఉన్నది బావా, యవనిక అని పిలువ వచ్చుగదా” అంటుంది.
“అమ్మో! పేరు పెట్టి యవనికా అని పిలిస్తే దీపాలు వెలిగె పరదాలు తొలిగె” అనబోతుంటెనే,
“ చాలు చాలు. నీ ప్రియురాలు వంటింట్లో ఉన్నది, చాయ చేస్తున్నది. అక్కడికి పోయి పాడుకో” అంటుంది యవనిక.
“ఏమో.. నిన్ను చూస్తె నాకెందుకో హుషారు వస్తుంది. వర్ణించ లేనంత అందమాయె.. నడ్డి ముక్కు, మిట్ట నొసలు, చీమకండ్లు, బింగి చెవులు..” ఇంకా ఏమో అనబోతుంటె యవనిక “అవును బావా! పేరుకు తగ్గ అందము నీదాయె..” ఇంకా ఏమో అనాలె అనుకునే లోపల నీళ్ళు, చాయ తీసుకొని వస్తుంది రోహిణి.
“బావా మరదళ్ళ సరసాలు చాలుగాని ముందు చాయ త్రాగండి” అంటుంది.
ఉడ్వీశ్ చాయ అందుకుంటూ “మీ చెల్లె అందము వర్ణాతీతము” అంటాడు.
“నాకూ రెండు చెవులున్నాయి. వంటిల్లు మైళ్ళ దూరం లో లేదు. దానికి కోపము వస్తే రేపే వాళ్ళింటికి పోతనంటది. ఇక సరసాలు కట్టిపెట్టి కాళ్ళూ చేతులు కడుక్కొండి. ఫలహారం చేద్దురు గాని” అని అంటుంది రోహిణి..
‘అమ్మా.. అంతపని చేయకు’ అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి స్నానాల గదిలోకి పోతాడు ఉడ్వీశ్.
“అక్కా.. ఐనా నేను నీతో వచ్చి మూడు నెలలయింది. నా చదువు చూసుకోవాలిగదా. ఇంకొకటి.. అక్కడ మన అమ్మా నాన్నలు ఇద్దరే కదా. వాళ్ళకు మాత్రం పొద్దెట్లా గడుస్తుంది. నేను తోడుగా ఉంటె వాళ్ళకూ కొంత ఊరట” అంటుంది యవనిక.
“అదీ నిజమే కానీ..” అని అంటుంటే “కానీ లేదు, అణా లేదు. నేను మాత్రం నిర్ణయించుకున్న.. రేపు సెలవే గద. నువ్వు, బావ నా వెంట వచ్చి రెండు రోజులు ఉండి పొదురుగాని” అంటుంది యవనిక.
స్నానాల గదినుండి ఉడ్వీశ్ బయటకు వస్తూ “ఆహా! అనుకున్నంత పని చేస్తున్నారు అక్క చెల్లెళ్ళు. అసలు నీకు ముకుతాడు వేస్తేనే తోవకు వస్తవు నా కేలికుంచికా” అంటూ ఫలహారం పెట్టమంటాడు ఉడ్వీశ్.
రోహిణి ఫలహారం తేవడానికి వంటింట్లోకి పోతుంది.
‘కాదు బావా’ అని ఏదో చెప్ప బోతుంటె ‘నాకు అన్నీ తెలుసమ్మా! నాకూ ఒక సడ్డకుడంటూ ఉండాలి గద.. ఆ ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. అది నా బాధ్యతే గద” అంటూ భార్య తెచ్చిన ఫలహారం అందుకొని బల్ల పైన పెట్టుకుంటాడు.
కొంచెం నెమ్మదిగా తింటూ “అమ్మా నాన్నలు కనబడడము లేదు” అనగానే వాళ్ళు గుడికి పోయారండీ అంటుంది రోహిణి.
‘భలే మంచి సమయము.. మించినన్ దొరకదు’ అని ఏదో చలన చిత్ర పాట పాడుతూ చిటిక లేస్తుంటాడు ఉడ్వీశ్.
“దొరగారు ఈ రోజు ఎందుకో హుషారుగా ఉన్నారు. పదోన్నతి వచ్చిందా ఏమిటి?” అంటుంది రోహిణి.
“పదోన్నతి ఏమి రాలేదు కాని మన ఇంట్లో నేను చిన్నా కాదు పెద్దాకాదు. మీ వాళ్ళ ఇంటికి వస్తేనన్న ఆ కోరిక తీరే అవకాశానికి ఎదిరి చూస్తున్న” అని నర్మగర్భంగా అంటాడు ఉడ్వీశ్.
అక్కా చెల్లెళ్ళిద్దరికి త్వరగా అర్థం కాక ఉడ్వీశ్ వైపు చూస్తుంటారు.
“మా కేలికుంచికకు ఇప్పుడు ఎన్ని యేండ్లు?” అని రోహిణి దిక్కు చూసుకుంటూ అడుగుతాడు ఉడ్వీశ్.
“ఇప్పుడు దాని వయసు మీకెందుకు? ఐనా పోయిన నెల దాని పుట్టిన రోజు మన ఇంట్లోనే జరిపితిమికద.. దానికి అది పద్దెనిమిదవ పుట్టిన రోజు” అంటుంది రోహిణి.
“ఆహా.. అయితే ఆమె గారికి పెళ్ళీడు దాటి నెలరోజులైందన్న మాట. అంటే త్వరలో ఇక నాకు పెద్ద పేరు వస్తదన్న మాట” అంటూ ముసిముసిగ నవ్వుతాడు ఉడ్వీశ్.
“రోహిణీ! పద, రేపు ఉదయమే మీవాళ్ళింటికి పోదాము. అన్ని సిద్ధం చేసుకొండి. నా బట్టలు కూడ మూడు రోజులకు సరిపోను సర్ది పెట్టు” అంటుంటే యవనిక ఎగిరి చప్పట్లు కొడుతుంది సంతోషము పట్టలేక. కాని మనసు తొలిచేస్తుండి బావ ఆంతర్య మేమిటని.
ఉండబట్టలేక చెబుతాడు రోహిణికి. “మా కార్యాలయములో నాకంటే వయసున చిన్న, అందగాడు, గుణవంతుడు నాతో పని చేస్తున్నాడు. మన యవనికకు అతికినట్టుంటాడు. నేనంటే గౌరవము అతనికి. కాని అతనితో కుల ప్రసక్తి తేలేదు. ఇద్దరన్న దమ్ములు ఇద్దరక్క చెల్లెండ్లు. పెద్దోడి పెళ్ళయింది. ఆడపిల్లల పెళ్ళిళ్ళయి ఇద్దరూ పరదేశములో ఉంటున్నారు. ఆస్తిపరులు. తల్లి దండ్రి కూడ సాత్వికులు..”
“కానీయండి.. మానాన్నగారి కోరిక నెరవేరుతది. ఆయనకు కుల పట్టింపులు, వరదక్షిణ లాంటి సంప్రదాయాలు నచ్చవు” అని చెల్లెవైపు చూస్తూ “అర్థమైందా యవనిక.. నీ ఆలోచన ఇంకేమైనా ఉన్నదా” అంటుంటె కొంత మందాక్ష మోముతో “పెద్దల మాట సద్దిమూట. నేను ఇంకేమి చెప్పను” అంటుంది యవనిక.
ఇంత తొందరగా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని అనుకోని ఉడ్వేశ్ చాలా సంతోష పడుతాడు. ఇక అత్త మామలకు తెలియ జేయడమే తరువాయి అనుకుంటాడు మనసులో ఉడ్వీశ్. ఎలాగు రేపు ఉదయమే మీవాళ్ళింటికి పోతున్నము గద, ఈరోజు చలన చిత్రము చూసిపోదాము. నేను కొంచెము పనిమీద బజారుకు పోయి వస్తాను. మీరు త్వరగా తయారయి ఉండండి” అని చెప్పె వెంటనే బజారుకు పోతాడు ఉడ్వీశ్.
ఉడ్వీశ్ నేరుగా ఇంటిను0డి తాను పని చేసే కార్యాలయములోనే పనిచేసే తరణి ఇంటికి పోతాడు. ఇదివరకే మరదలు గురించి వివరంగా చెప్పినాడు కనుక వాళ్ళ తలిదండ్రులతొ, తరణి అన్నతో కాసేపు ముచ్చటించి అనుకూల వాతావరణము గ్రహించి, తరణిని తనవెంట ఇంటికి తీసుక వస్తాడు ఉడ్వీశ్. చలనచిత్ర వీక్షణకు సిద్ధమైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళిద్దరిని చూసి విస్తుపోతారు. ఈ రోజు చలనచిత్రము సమయము ఉంటే పోదాము లేదా రెండవ ఆటకు పోదాము. రోహిణీ! ఇతని పేరు తరణి. నేను చెప్పితిగద.. మా కార్యాలయములో పని చేసున్నాడని” అంటుంటూనె రోహిణి వంటింట్లోకి పోయి త్వరత్వరగా చాయ సిద్ధము చేసుకొని తీసుక వస్తుంది..
అక్కా చెల్లెళ్ళకు పూర్తిగా అర్థమయిపోతుంది. చలన చిత్రం చూడాలన్న ఆసక్తి తగ్గి పోతుంది ఇద్దరికి. చెల్లెలు యవనికను లోనికి తీసుకపోయి ‘తరణి గురించి నీ అభిప్రాయమేమిటి’ అని అడుగుతుంది రోహిణి.
“మీకు నచ్చిండు గద.. కాని నాది ఒకటే బాధ అక్కా! ఉన్న మనిద్దరము వెళ్ళిపోతె అమ్మా నాన్నలకు తోడు ఎవరు” అనికొంత వ్యాకుల చిత్తంతో చెబుతుంది యవనిక.
“చెల్లీ! ఈ సంప్రదాయము యుగయుగాలనుండి వసున్నదే. మనొక్కరికేకాదు. ఐనా అబ్బాయి వాండ్లు మన ఇంటికి సమీపములోనే ఉంటారట. ఇక దిగులెందుకు” అంటుంది రోహిణి.
“సరె అక్క” అని క్లుప్తంగా ముగిస్తది ఇంక ఏమీ అనకుండ యవనిక. అక్క చెల్లెండ్రు ఇద్దరు బయటికొచ్చి కాసేపు నిలుచుచుంటారు. ఉడ్వీశ్ తరణి మాట్లాడుకుంటుంటె.
రోహిణి మధ్యలో కల్పించుకొని “వంట అయింది. అబ్బాయిని కూడా భోంచేసి పొమ్మనండి” అంటుంది రోహిణి.
తరణి వెంటనే “అమ్మా, లేదండి.. మళ్ళీ వచ్చినప్పుడు భోంచేస్తాను. ఇంట్లో చెప్పి రాలేదు. అమ్మ అప్పటికే వంట సిద్ధము చేసింది” అంటూ “ఉడ్వీశ్! నేను వెళ్ళివస్తాను. మళ్ళీ కలుద్దాము” అంటాడు తరణి.
“సరేనమ్మా! ఏమీ అనుకోకండి” అని పోబోతుంటె “సరె.. మీ ఇంటిదగ్గర దించివస్తాను” అంటూ ఉడ్వీశ్ కూడా వెంట నడుస్తాడు.
తరణిని ఇంటిదగ్గర దింపివచ్చిన ఉడ్వీశ్ “ఇక మీరు ఏమీ అనుకోకండి. చలన చిత్రము చూసి వచ్చెంత ఓపిక నాకు లేదు. మళ్ళీ ఎప్పుడైన చూద్దాము. ముందు భోజనము వడ్డించు రోహిణీ” అంటూ “అమ్మా నాన్నలు తిన్నారా” అని అడుగుతాడు.
“ఇప్పుడే వాళ్ళ భోజనమయిందండి. మన ముగ్గురమే తినేది. అందరము ఒకేసారి భొంచేతాము” అని వడ్డనకు పూనుకుంటుంది రోహిణి.
“యవనిక మన వెంట వచ్చేనాడు మీ అమ్మా నాన్నకు నేను చెప్పింది జ్ఞాపకమున్నదా” అని భార్యవైపు చూస్తూ అడుగుతాడు అన్నం తింటూనే ఉడ్విశ్.
“ఏమోనండి! నాకు జ్ఞాపకము లేదు” అంటుంది రోహిణి.
“అదే.. ‘యవనికను పూలల్లొ బెట్టి అప్పజెబుతాను. కొంతకాలము మావద్ద ఉండనీయండి’అని అంటినిగద” అంటాడు ఉడ్వీశ్.
“అయితె?” ప్రశ్నార్థకంగా చూస్తుంది రోహిణి భర్తవైపు.
“నాకు అలనాడు విశ్వామిత్రుడు దశరథునితో అన్న మాట గుర్తొస్తున్నది” అని ఉడ్వీశ్ అనగానే “ఏమిటది” అంటుంది రోహిణి.
“అదే.. మాయజ్ఞము కాపాడిన పిదప రాముణ్ణి పూలలో బెట్టి అప్పగిస్తాను అంటాడు విశ్వామిత్రుడు. అన్న మాట నిలబెట్టుకొని సీతతో వివాహము జరిగిన పిదప దశరథునికి రాముని అప్పగిస్తాడు విశ్వామిత్రుడు”
“అయితె ఇప్పుడు ఎందుకు జ్ఞాపకము వచ్చిందో” అంటుంది రోహిణి.
“అటువంటి తరుణము నాకూ ఆసన్నమైంది. మనము రేపు మీవాళ్ళ ఇంటికి పోతున్నము కద. తరణి విషయము మీ అమ్మా నాన్నలకు చెబితె వాళ్ళకు సంతోషమేకద.. కూతురు శుభవార్తతో ఇంటికి వచ్చిందని”
“అమ్మా! మీ మనసులో ఇంత కథ నడుస్తున్నదా” అని భోజనము పూర్తిచేసి వంటిల్లు సదుర పూనుకుంటుంది రోహిణి.
తల్లిదండ్రికి అన్ని విషయాలు దాపరికము లేకుండా తెలియ జేస్తాడు ఉడ్వీశ్. దానికి వాళ్ళు కూడా “సంతోషము నాయనా.. నువ్వు మంచిపని చేస్తానంటె మాకూ ఆనందమే. క్షేమంగపోయి సఫలీకృతులై రండి. ఏదీ.. యవనికనును పిలువు” అంటాడు తండ్రి రత్నాకర్.
అక్కడే తలుపుచాటున నిలబడి వింటున్న యవనిక “ఏమిటి మామయ్యా” అని ఎదురుగా వస్తుంది.
“అమ్మ.. పొద్దున్నే శుభవార్త విన్నాము. మీ బావ చూయించిన సంబంధము మాకూ నచ్చింది. ఇక పెళ్ళి భోజనము మీ నాన్న ఎప్పుడు పెడుతడో అని ఖాళీ కడుపుతో ఎదిరి చూస్తున్నమని చెప్పు.”
“అట్లనే మామయ్యా” అంటూ సిగ్గుతో తలవంచుకొని అత్తయ్యకు మామయ్యకు దండం పెట్టి పోయివస్తామని చెబుతుంది యవనిక.
“ఈసారి ఇద్దరు రండి. సంతోషం” అని యవనిక తల నిమురుతాడు రత్నాకర్.
ఇంట్లో చాయ మాత్రము త్రాగి ముగ్గురూ బయలుదేరుతారు.
ఉదయము ఫలహారము వేళకు ఇల్లు జేరుతారు.
వీళ్ళ అకస్మాత్ రాకడ చూసి రత్నాకర్, యామిని ఆశ్చర్యపోతారు. యోగక్షేమాలు తెలుసుకొని ముందు ఫలహారము చేయ పూనుకుంటుంది యామిని.
“అదేమిటమ్మా! మేము చుట్టాలమా.. నువ్వు కూర్చో మేము చేస్తాము” అంటారిద్దరక్క చెల్లెళ్ళు.
వచ్చిన పని మామగారికి సవివరంగా తెలియ జేస్తాడు ఉడ్వీశ్. మామగారు కూడ “సంతోషం నాయనా! నీకు తెలియందేముంది, శుభస్య శీఘ్రం” అంటాడు. తల్లికి రోహిణి తె,లియ జేస్తుంది.
“కేలి కుంచికా!” యవనికను పిలుస్తాడు ఉడ్వీశ్.
“మళ్ళీ అదేమాట బావా” అంటుంటె “కేలికుంచిక అంటే మరదలు అని అర్థం. సరె.. ఇకముంది పిలువను. మా తరణికి కూడ ఇష్టము ఉండక పోవచ్చు” అంటుంటె ‘పోబావా’ అని ‘అమ్మ పిలుస్తుంది’ అంటు రివ్వున లోనికి పోతుంది యవనిక.
రేండు రోజులుండి అందరు ఉడ్వీశ్ ఇంటికి వస్తారు.
అదే రోజు తరణి వాళ్ళ తలిదండ్రితొ మాట్లాడి అమ్మాయిని చూడ రమ్మంటారు.
“మా అబ్బాయికి నచ్చిందట ఇంక మేమెందుకు? పెళ్ళి కూడా ఆర్భాటము లేకుండా ప్రభుత్వ కార్యాలయములో నమోదు చేయిస్తె సరి” అంటడు తరణి తండి.
దానికి అందరూ సమ్మతిస్తారు. వారము లోపే పెళ్ళయి యవనిక, తరణి ఒకటవుతారు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments