top of page

కోల్పోయిన హక్కు

Kolpoina Hakku Written By koyilada Ram Mohan Rao

రచన : కొయిలాడ రామ్మోహన్ రావు


“ తప్పు చేసావు రాధమ్మా, పెద్ద తప్పు చేసావు” అన్నాను ఆమెకు హితవు చెప్పే

ధోరణిలో. ఆమాటకు ఆమెకు కోపం వచ్చింది, నేను ఊహించినట్లే. “ ఏం తప్పు చేసాను?

విడమర్చి చెప్పు. ఉపోద్ఘాతం లేకుండా అర్ధం చేసుకోవడానికి నీ అంత

తెలివయినదాన్ని కాదుగా?” అంటూ వెటకారంగా మాట్లాడింది. కాస్సేపు

తటపటాయించాను,చెప్పాలా వద్దా? అనే మీమాంసలో.

రాధమ్మ నా చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. రాజమండ్రి లో మా ఇంటికి

దగ్గ్గర్లోనే, కూతురు శ్రావ్య ఇంట్లో పదిహేనేళ్ళుగా ఉంటుంది. కొడుకు నరేష్ హైదరాబాద్

లో బిజినెస్ చేస్తూ బాగా సెటిల్ అయ్యాడు. అంత స్థితిమంతుడి ఇంట్లో ఉండడం

ఆమెకు ఇష్టముండదు. అక్కడ ఆమె ఇమడలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

కూతురు ఇంట్లో ఉన్న స్వాతంత్రం అక్కడ ఉండక పోవడం మొదటి కారణం. అక్కడికి

వెళితే, చుట్టంలా హాల్లో కూర్చుని టివి చూడడం తప్ప మరో వ్యాపకం ఉండదు. వంటలో

సాయం చేద్దామంటే కోడలు సుగుణ ఆ అవకాశం ఇవ్వదు. “మీకెందుకు అత్తమ్మా ...ఆ

శ్రమ ?...నేనున్నానుగా?” అంటూ లౌక్యంగా వారిస్తుంది.

దాని వెనుక కారణం గ్రహించలేని తెలివితక్కువదేమీ కాదు రాధమ్మ. ఆమెది భారీ చెయ్యి. ఏ రోజు వంట చేసినా ఆ వంటకాలన్నీ భారీగానే ఉంటాయి. నూనెలు, మషాలాలు, జీడిపప్పు విరివిగా వాడితేనే ఆమెకు తృప్తి. సుగుణకది దుబారా ఖర్చనిపిస్తుంది. అందుకే ఆమెను వంటింట్లోకి రానివ్వదు. పచ్చళ్ళు పెట్టడం, అందరికీ పంచడం రాధమ్మకు గొప్ప సరదా. సుగుణ ఆ ముచ్చట కూడా తీరనివ్వదు. చీటికి మాటికి బాత్రూం లోనో, పూజ గదిలోనో, లైట్ ఆఫ్ చెయ్యలేదనో, హాల్ల్లో ఫ్యాన్ ఆఫ్ చెయ్యకుండా వెళ్ళిపోయిందనో సుగుణ నసుగుతూ ఉండడం ఆమెకు నచ్చేది కాదు. కూతురు, అల్లుడు ఉద్యోగాలకు బయటకు వెళ్ళిపోవడం వల్ల రాజమండ్రిలో ఇన్ని సమస్యలుండేవి కాదు. తలుపులు బార్లా తెరుచుకొని కూర్చోవడం ఆమెకు అలవాటు. అపార్ట్మెంట్ లో అది ఇబ్బంది అని సుగుణ అలా తెరిచి ఉంచడానికి ఒప్పుకునేది కాదు . దాంతో తననొక బందీలా చేసారని బాధపడిపోయేది ఆమె. తన బాధలు, ఇబ్బందులు కొడుక్కి చెప్పుకు౦దామంటే, అతను చాలా బిజీ. ఇలా రాధమ్మకి అసంతృప్తి కలిగించే విషయాలెన్నో ఉన్నాయక్కడ.

అందుకే అక్కడ వారం రోజులకు మించి ఉండలేకపోయేది. “ శ్రావ్యకు మాత్రం ఎవరున్నారు? వాళ్లకు సాయంగాను, పెద్ద దిక్కు గానూ ఉంటున్నానుగా ?” అంటూ సమర్ధించుకొనేది. కూతురి ఇల్లు ఆమెకు హెడ్ క్వార్టర్స్ అయినా, అక్కడ కూడా కుదురుగా ఉండేది కాదు. పెళ్ళిళ్ళకో, ఫoక్షన్ లకో, తీర్ధయాత్రలకో తరచూ వెళ్లి వస్తూ ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే శ్రావ్య కు ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి.

ట్రయినింగ్, ఇన్స్పెక్షన్ లాంటి ప్రోగ్రాం ల వల్ల స్కూల్ నుంచి ఇంటికి రావడం చాలా ఆలస్యమయ్యేది. ఆమె వచ్చేవరకు చిన్న పిల్లలను ఎవరు చూస్తారు? మా ఇంటికో లేదా మరో స్నేహితుల ఇంటికో పిల్లలు, స్కూలు నుంచి రిక్షాలో వచ్చే ఏర్పాటు చేసేది. ఆలస్యంగా తిరిగివచ్చి, పిల్లలను తీసుకెళ్ళే శ్రావ్యను చూస్తే చాలా జాలేసిది. ఆ సమయంలో ఆమె అన్న మాటలు నాకింకా గుర్తే. “ మా టీచర్లకు బోల్డు సెలవలని చాలా మంది అంటూ ఉంటారు. అయితే అన్ని పనులూ ఆ సెలవల్లోనే ఎలా చేసుకోగలంఆంటీ? క్రితం ఏడాది, సెలవలు అయిపోయిన తర్వాత స్కూల్ తెరిచిన నాలుగు రోజులకు వచ్చింది,మా మరిది పెళ్ళి. అప్పుడు వారం రోజులు సెలవు శాంక్షన్ చేయించుకోవడానికి నానా యాతన పడ్డాను. అమ్మ విషయంలోనూ అంతే.’ నీకేo ఇబ్బంది ? ఇంట్లో మీ అమ్మగారున్నారు, అన్నీ చూసుకోవడానికి’అంటూ మా కొలీగ్స్ కూడా అంటుంటారు. ఇలాంటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది” అనేది ఆ అమ్మాయి ఏడవలేక నవ్వుతూ.

ఈ మధ్య రాధమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మోకాళ్ళ నెప్పితో నడవలేక పోతుంది. అందువల్ల కూతురికి సాయం చేయలేకపోగా ఆమెకు భారంగా ఉన్నానని తెగ బాధపడిపోతుంది. కొడుకు దగ్గరకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవాలని కోరుకుంటూ, ఎన్ని కబుర్లు పెట్టినా అటునుంచి స్పందన లేకపోవడం, కొడుకు వచ్చి తీసుకువెళ్ళక పోవడంతో, ఆమె ఎంతో బాధతో కుంగిపోయింది. ఇప్పుడు కొడుకు దగ్గరకు వెళ్ళినా, తిరిగి రాకుండా ఉండాలన్నా, పరిస్థితులతో రాజీ పడాలన్నా, ఆమె చేసిన తప్పేమిటో చెప్పాలనిపించింది. గొంతు సవరించుకుంటూ మొదలు పెట్టాను.

“ చెప్తాను విను నీ తప్పేమిటో. ఎప్పటికైనా నీ కొడుకు దగ్గర స్థిరపడడం తల్లిగా నీ హక్కు. అసలు ఆ హక్కు మా అందరికన్నా నీకే ఎక్కువ. నలభై ఏళ్ళు నిండకుండానే మీ వారు అర్ధాంతరంగా కాలం చేస్తే, ధైర్యంగా నిలదొక్కుకొని, అన్ని సమస్యలకు ఎదురీది, నీ కొడుకును ప్రయోజకుడిని చేసావు. అందుకోసమైనా వాడు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసేవాడు. వాడికా అవకాశం ఇవ్వకుండా, దేనికి రాజీ పడకుండా, నీ కూతురింటికి వచ్చేసేదానివి. అప్పట్లో నీ ఆరోగ్యం బాగుండేది కాబట్టి, భవిష్యత్ గురించి ఆలోచనే ఉండేది కాదు. నీ హక్కును కోల్పోతున్నావని ఎప్పుడూ ఆలోచించలేదు. నా లాంటి వాళ్ళు సలహా ఇచ్చినా పట్టించుకోనేదానివి కాదు. మీ అల్లుడికి అమ్మా,నాన్న లేకపోవడం వల్ల నువ్విలా యధేచ్చగా రాగలిగావుగానీ, వాళ్ళు ఉండి ఉంటే ఇన్నేళ్ళు ఇక్కడుoడగలవా? నువ్వే చెప్పు?” అంటుంటే, ఆమె కన్నీళ్ళ పర్యంతమై మాటా పలుకు లేక దిగాలుగుగా ఉండిపోయింది. నేను ఆమె మూడ్ మార్చడానికి ప్రయత్నిస్తుండగా శ్రావ్య స్కూల్ నుంచి వచ్చింది.

ఇంట్లోకి అడుగు పెడుతూనే, “ అమ్మా నీకో గుడ్ న్యూస్ ...త్వరలో నీ కొడుకు వచ్చి, నిన్ను తీసుకెళ్తాడట.. ఇప్పుడు హ్యాపీ యేనా ?” అంటూ శుభవార్త వినిపించింది. ఆ వార్త ఆమెలో ఆశ్చర్యం కలిగించినట్టు లేదు. “ అనుకున్నాను.. ఈ కబురు వస్తుందని” అని నెమ్మదిగా అంది. “ నీకెలా తెలుసు? అన్నయ్య ఫోన్ చేసాడా?” ఆశ్చర్యంగా అడిగింది.

“ లేదు ఊహించాను. ఒక పెళ్ళిలో మీ మామయ్య, వాణ్ని కలిసి నానా చివాట్లు పెట్టాడట.

నీకు తెలుసుగా ? మావయ్య మాటలు ఎంత పదునుగా ఉంటాయో? దాంతో మనవాడు

దారికొచ్చినట్లున్నాడు” అంటూ చిన్నగా నవ్వింది. రాధమ్మ దిగులు తగ్గుతుందని

సంతోషపడ్డాను. ఇప్పుడు నా మనసు తేలికయిoది.

*****

తర్వాత మూడు నెలల పాటూ, బెంగుళూరు లో ఉన్న మా అబ్బాయి దగ్గరకు

వెళ్ళడం వల్ల , రాధమ్మ విషయాలేవీ తెలియలేదు. ‘కొడుకు దగ్గర సుఖంగానే ఉండి

ఉంటుందిలే’ అని ధీమాగా ఉన్నాను. ఊరి నుంచి వచ్చాక నేను ఊహించనవి వినాల్సి

వచ్చింది శ్రావ్య ద్వారా.

“ హైదరాబాద్ వెళ్లిన పది రోజులకే, ఆమెను సిటీ కి దూరంగా ఉన్న ఓల్డ్ ఏజ్

హోం లో చేర్చాడు అన్నయ్య. అక్కడ సరైన సదుపాయాలు లేవు. మానసిక ఆరోగ్యం

లేని వారు కూడా అక్కడున్నారు. ఆ వాతావరణంలో అమ్మ ఇమడ లేకపోయింది. నెలకో

రెండు సార్లు అన్నయ్య వచ్చి చూడడం గగనమైపోయిందని తెలిసింది. తనను ఒక

అనాధలా నిర్లక్ష్యం చేసారన్న అభిప్రాయం అమ్మలో నాటుకు పోయింది. ఆ బెంగ

అమ్మను తినేసింది. అమ్మను చూడ్డానికి వెళ్లినప్పుడల్లా దుఖంతో తిరిగి వచ్చేదాన్ని.

తన ఇంటి దగ్గరలోనే చాలా మంచి ఓల్డ్ ఏజ్ హోం లు ఉన్నాయి. మరి అంత డబ్బున్న అన్నయ్య ఎందుకలా చేసాడో నాకు అర్ధం అయ్యేది కాదు. అమ్మనలా చూడలేక క్రితం వారం తీసుకొచ్చేసాను” అని చెపుతుంటే నా గుండె నీరయి పోయింది.

వెంటనే రాధమ్మను చూడ్డానికి బయల్దేరాను. నేను ఊహించిన దానికన్నా బాగా పాడయిపోయింది. మునుపటి హుషారు లేదు. ఆరోగ్యం బాగా క్షీణి0చుకు పోయింది. ఆమెనలా చూస్తుంటే గుండె తరుక్కుపోయింది.

శ్రావ్య స్కూల్ కి సెలవు పెట్టి, తల్లికి మంచి వైద్యం చేయించి, కంటికి రెప్పలా

చూసుకోవడం వల్ల, ఆమెలో కొంత మార్పు వచ్చింది. నెల రోజుల వరకూ బాగానే ఉంది

గానీ, ఆ తర్వాత ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మందులు పనిచెయ్యక పోయేసరికి, ఏదో

మానసిక వ్యధ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అదేమిటో మాకెవ్వరికి

అర్ధం కాలేదు. కొన్ని రోజుల తర్వాత చూచాయగా అర్ధమయ్యింది, అది కొడుకు మీద

బెంగ అని. ఎంతో ప్రేమగా చూసే కూతుర్ని వదిలేసి, నిరాదరించే కొడుకు కోసం

కలవరించడం చూసి ఏమనాలో నాకు అర్ధం కాలేదు. నిరంతరం కొడుకు కోసం

కలవరిస్తుంటే, పాపం శ్రావ్య ఎన్ని సార్లో అన్నకు ఫోన్ చేసినా, అదిగో ఇదిగో

అనేవాడేగాని, రావడం కనబడేది కాదు. అయినా ఆమె విసుగు చెందక, కొడుకు కోసం

కలవరిస్తూనే ఉండేది రాధమ్మ. “ చివరి దశకు వచ్చేసినట్లుంది. కొడుకును చూడాలని

తెగ ఆత్రపడుతుంది” అని ఆమెను చూడ్డానికొచ్చిన అన్న ,సూర్యం అంటుంటే నా

గుండెనెవరో పిండినంత బాధ కలిగింది.

సూర్య౦ ఫోన్ చేసి చివాట్లు పెట్టాడు కాబోలు, రెండ్రోజుల తర్వాత వచ్చాడు.

మూడు రోజులున్నాడు గాని, తల్లి దగ్గర రోజుకొక గంట కూడా గడపక, పనుందంటూ

బయటకు పోయేవాడు. అర్ధరాత్రి దాటాక గాని తిరిగివచ్చేవాడు కాదు. “నువ్వు నాకోసం

వచ్చావా? నీ పనులు చూసుకోవడానికి వచ్చావా?” నిలదీసింది రాధమ్మ కోపం ఆపుకోలేక.

అతనికీ కోపం వచ్చింది. “ఎవరికోసం అంత దూరంనుంచి వచ్చాను? ఎంతసేపు నిన్ను

అంటిపెట్టుకొని ఉండమంటావు ?” అని కేకలేసి, మరో అరగంట అదనంగా

కూర్చున్నాడేగాని, ఆ కాసేపు కూడా తల్లితో ప్రేమగా మాట్లాడలేదు. రాధమ్మ దుఖం

ఆపుకోలేక, వెక్కి వెక్కి ఏడుస్తుంటే, “ఎందుకు ఆ ఏడుపు? ఇప్పుడేంజరిగింది?” అని

కేకలేసి, విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. నేను, శ్రావ్య బొమ్మల్లా నిలబడి పోయాం.

ఆ రాత్రే నరేష్ తిరిగి వెళ్ళిపోయాడు.

అప్పటినుంచి రాధమ్మలో చాలా మార్పు వచ్చేసింది. తిండి తినడం

మానేసింది. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను మామూలు మనిషిని

చేద్దామని నేను, శ్రావ్య చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఐదు రోజుల

తర్వాత,పరిస్థితి బాగా విషమించిందని తెలియగానే, పరిగెత్తుకెళ్ళాను. ఆమెను

చూడగానే అర్ధమైపోయింది. ఆమె మాకిక దక్కదని తెలిసిపోయింది. రాత్రంతా “ బాబూ

...బాబూ” అని అరుస్తూనే ఉంది. నరేష్ కి ఫోన్ చేసి విషయం తెలియజేసాం. వెంటనే

బయల్దేరుతున్నామని చెప్పాడు. ఈ సారి మాట తప్పకుండా వచ్చాడు గాని, అప్పటికే

రాధమ్మ ప్రాణాలు వదిలింది. తల్లి గుండెలమీద పడి ఏడుస్తున్న నరేష్ ని చూసి,

‘నిజంగా ఏడుస్తున్నాడా? లేక నటిస్తున్నాడా?’ అన్న సందేహం నాకే కాదు,

చాలామందికి కలిగి ఉంటుంది అనిపించింది. కార్యక్రమాలన్నీ అయిపోయాక, నాకు ఎదురైతే, అసహ్యంగా చూసి, మొహం

తిప్పుకున్నాను. అయినా ‘ఆంటీ ...ఆంటీ’ అంటూ నా వెంటబడ్డాడు. ఏమిటన్నట్లు

చిరాగ్గా చూసాను. అటూ ఇటూ చూసి,దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక, “

మీతో మాట్లాడాలి. దయచేసి సాయంత్రం ఆరుగంటలకు శివాలయం దగ్గరకు

రాగలరా?” అని అభ్యర్ధించాడు. “ఇంకేముంది మాట్లాడడానికి? ఉన్న ఒక్క బంధమూ

తెగిపోయి౦దిగా?” అన్నాను కోపంగా.

“ నాకు తెలుసు ఆ౦టీ... మీరిలాగే రియాక్ట్ అవుతారని. కానీ నేను చెప్పేది మీరు వినాలి.

ప్లీజ్ కాదనకండి” అంటూ బతిమాలుతుంటే కాదనలేకపోయాను. అతను కోరినట్లే

సాయంత్రం అతన్ని కలిసి, పక్కనే కూర్చున్నాను. కృతజ్ఞతాపూర్వక౦గా నా వైపు చూసి

చెప్పడం మొదలుపెట్టాడు.

“అమ్మ విషయంలో నేను క్షమించరాని నేరం ఎందుకు చేసానో చెప్పుకోవలసింది

కేవలం ముగ్గురికే. అందులో మొదటి వారు మీరు. ఆ తర్వాత మా చెల్లి, బావగారు.

మిగలిన వాళ్ళు ఎలా అనుకున్నా, నేను లెక్క చేయను. నా మనసులో మా అమ్మ

తర్వాత, అంత స్థానం ఉన్నది మీకే. అందుకే మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను”

అంటున్న అతని మాటల్లో నిజాయితీ చూసి నా వైఖరి మార్చుకున్నాను.

‘ఈ కుర్రాడి మనసులో నాకంత గొప్ప స్థానముందా ?’ అనుకొని నివ్వెర పోయాను.

తీవ్రమయిన బాధ అతని మనసుని కలచి వేస్తుందని నాకు అర్ధమైంది.

“రెండేళ్ళ క్రితం వరకూ, మీరందరూ అనుకుంటున్నట్లు నేను స్థితిపరుడినే. కానీ

రెండేళ్ళ క్రితం నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. నా జీవితంలో చెలరేగిన

సునామీ నన్ను , నా కుటుంబాన్ని కకావికలం చేసేసింది. సుగుణ పెద్దమ్మ కొడుకు శేఖర్

మీకు తెలుసుగా? కొన్ని కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్లు ఉన్నాయతనికి. ఒక పెద్ద ప్రైవేటు కంపెనీలో అప్పు తీసుకుంటున్న అతనికి మూడో ష్యూరిటి గా సంతకం చెయ్యమని మా ఇంటికొచ్చాడు. నేనెప్పుడూ ఇలాంటి ష్యూరిటిలు ఇవ్వనందున జంకుతుంటే, మా ఆవిడ బలవంతపెట్టింది. శేఖర్ ఆస్తి, హోదా ఆమెకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చాయి. సహాయం కోసం శేఖర్ వంటి కోటీశ్వరుడు మా గడప తొక్కడం మేము ఏనాడో చేసుకున్న అదృష్టం అనుకు౦టు౦దామె. “ఎందుకంత ఆలోచిస్తారు? మీరు పెట్టేది మూడో సంతకమేగా ?” అనేసరికి బాగుండదని పేపర్లు కూడా చూడకుండా సంతకాలు పెట్టేసాను. ఏడాది తిరగకుండానే నేను మోసపోయానని తెలుసుకున్నాను.

శేఖర్ అప్పు ఎగ్గొట్టేసి కనిపించకుండా మాయమైపోయాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు

నన్ను పట్టుకున్నారు. “నేను ష్యూరిటి ఇచ్చిన వాళ్ళలో మూడో వాడిని కదా? మొదటి

ఇద్దరి దగ్గరకు వెళ్ళండి” అని తప్పించుకోజూసాను. ఆ ప్రయారిటీ వాళ్ళకేమీ ఉండదని,

ఎవరు దొరికితే వాళ్ళను పట్టుకుంటామని తేల్చి చెప్పేశారు. మొదటి ఇద్దరూ ఎలా

మేనేజ్ చేసి తప్పించుకున్నారో గానీ, నేను మాత్రం దొరికి పోయాను. ఆ దెబ్బకు నా

ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇంకా బాకీ ఉన్నాను. ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది.

వాళ్లకు దొరక్కుండా తప్పించుకు తిరిగే దురవస్థ పట్టింది. ఇటువంటి పరిస్థితిలో, అమ్మ

నా దగ్గరకు వస్తానని గొడవ చేయడం మొదలు పెట్టింది. ఒక వైపు బాగా దెబ్బతిన్న నా

ఆర్ధిక పరిస్థితి, మరో పక్క ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీద దాడి చెయ్యడం అమ్మకు తెలిస్తే,

ఆమె గుండాగి చచ్చిపోతుందేమోనన్న భయం. ఈ రెండిటివల్ల అమ్మను తీసుకెళ్ళడానికి

రాలేకపోయాను. అయినా తప్పలేదు. అప్పుల వాళ్ళు ఇంటిపై దాడి చెయ్యకుండా

ఆపలేకపోయాను. నా పరిస్థితి తెలిస్తే అమ్మ తట్టుకోలేదని, తప్పని పరిస్థితిలో నాకు

ఆర్ధికంగా అందుబాటులో ఉన్న ఓల్డ్ ఏజ్ హోం లో చేర్చాను. ఆ తర్వాత ఏమి

జరిగిందో మీకు తెలిసినదే. ఇక్కడికి వచ్చిన విషయాన్ని కూడా ఫైనాన్స్ వాళ్ళు

పసిగట్టేసరికి, అమ్మ దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయేవాణ్ణి. మనశ్శాంతి కరువై, అమ్మ

మీద విరుచుకు పడేవాణ్ణి. అందుకు బాధ పడినా,దానివల్ల అమ్మకు నామీద ద్వేషం

కలిగి , నా గురించి బెంగపడడం మానేస్తుందని సమాధానపడేవాణ్ణి. ఇదంతా ఎవరికీ

చెప్పుకోలేని దుస్థితి నాది. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చిందనిపించింది” అంటూ

గుండెలు పగిలేలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న నరేష్ ని చూసి చలించిపోయాను. అతని

తల నిమురుతూ “ఇంత బడబాగ్నిని నీ గుండెల్లో దిగమింగుకొని, ఎంతగా నలిగి

పోయావురా కన్నా !” అన్నాను కన్నీరు కారుస్తూ.

సమాప్తం


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత పరిచయం : పేరు.. కొయిలాడ రామ్మోహన్ రావు, Retd. HOD Chemistry, A.M.A.L. College, Anakapalle.

వయస్సు..67

రచనలు చేయడం : 2015 నుంచి

బహుమతులు, అవార్డులు:

స్వాతి కథల పోటీలో 10000 రూ.

సుకథ కథల పోటీలో మొదటి బహుమతి 15000 రూ.

రమ్యభారతి చిన్న కథల పోటీలో ప్రధమ బహుమతి

6 తృతీయ, ప్రోత్సాహక బహుమతులు

ఇప్పటివరకూ పబ్లిష్ అయినవి, 38 కథలు, ఒక నవల. 8 పర్యాటక వ్యాసాలు.

ఈనాడు ఆదివారం అనుబంధo లో ప్రచురించిన పనికిరాని వాడు, గొప్పవాడు కథలు పెద్దల ప్రశంసలకు నోచుకున్నాయి. ఈ రోజు కథ ఏజీ ఆఫీస్ హైదరాబాద్ వారు నిర్వహించిన రంజనీ బహుమతిని పొందింది.

హాబీలు: డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, ట్రావెలింగ్ etc.


56 views0 comments
bottom of page